ఆమెకు చిన్నప్పటి నుండి తరచుగా సుదీర్ఘ వరుసలో వేచి ఉండటం అలవాటు- నీటి కుళాయిల వద్ద, పాఠశాలలో, దేవాలయాలలో, రేషన్ దుకాణాల వద్ద, బస్టాపుల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వెలుపల. తరచుగా, ఆమెను ముఖ్యమైన వరుసలో కాకుండా, మిగితా వరుసలో విడిగా నిలబెట్టేవారు. చివరకు ఆమె వంతు వచ్చినప్పుడు ఆమెకు ఎదురయ్యే నిరాశలకు కూడా ఆమె అలవాటు పడింది. కానీ నేడు శ్మశాన వాటిక వెలుపల కూడా అదే జరగడం ఆమె భరించలేకపోయింది. ఆమె అతని మృతదేహాన్ని తనతో పాటు ఉన్న నిజాంభాయ్ ఆటోలో వదిలి ఇంటికి తిరిగి పరుగెత్తాలనుకుంది.

కొన్ని రోజుల క్రితం భిఖు తన వృద్ధురాలైన తల్లి మృతదేహంతో ఆక్కడ ఉన్నప్పుడు, క్యూలు ఎంత సేపు ఉన్నాయో అని ఆమె బాధతో ఆశ్చర్యపోయింది. కానీ తన తల్లి మరణం మాత్రమే అతన్ని విచ్ఛిన్నం చేయలేదు; డబ్బు, ఆహారం, ఉద్యోగం లేకుండా అతని ప్రజలు కష్టాలు పడటం, ఇవ్వవలసిన వేతనాలు చెల్లించడానికి మాలిక్ నెలలు నెలలు ఇబ్బంది పెట్టడం, తగినంత జీతం దొరకకపోవడం, ఇలాంటి పలు సందర్బాలలో అతను కృంగిపోవడాన్ని ఆమె చూసింది. అనారోగ్యం పాలు కాక మునుపే అప్పులు అతనిని విచిన్నం చేసాయి. ఈ కనికరంలేని రోగం బహుశా వారికి ఒక వరం కావచ్చు, అని ఆమె అనుకునేది. అప్పటి వరకు…

ఆ ప్రత్యేక ఇంజక్షన్ అతడిని కాపాడగలిగేదా? వాళ్లు డబ్బు ఏర్పాటు చేస్తే, కాలనీకి సమీపంలో ఉన్న ప్రైవేట్ క్లినిక్ లోని డాక్టర్, అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె మరింత ప్రయత్నించి ఉండవచ్చని ఆమెకు తెలుసు. కాని మళ్లీ ఎప్పటిలానే లైన్లు చాలా పొడవుగా ఉండి, చివరికి అదృష్టం లేకపోతే? ఆసుపత్రిలో  కిట్లు అయిపోయాయి. మరుసటి రోజు ప్రయత్నించండి, అని వారు చెప్పారు. నిజంగా ప్రయత్నిస్తే దొరికేవా? "మీరు 50,000 రూపాయల నగదుతో ఇంజక్షన్ పొందగలిగే కొన్ని ప్రదేశాలు నాకు తెలుసు" అని నిజాంభాయ్ నిట్టూర్చి చెప్పారు. ఆ మొత్తంలో కొంత భాగాన్ని కూడా ఆమె ఎక్కడ సమకుర్చగలదు ? మేమ్ సాహిబ్‌లు ఆమె పనికి వెళ్లని రోజులకే జీతం ఇవ్వలేదు, మరి ఆమెకు అడ్వాన్సు ఎందుకు ఇస్తారు?

అతని శరీరం కొలిమిలా వేడిగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు, చివరికి ఆమె ఆ అర్థరాత్రి, అతన్ని నిజాంభాయ్ ఆటోలో ఎక్కించింది. ఆమె 108 కి ఫోన్ చేసినప్పుడు, వాళ్లు రావడానికి రెండు నుండి మూడు గంటలు సమయం పడుతుందని, ఏమైనప్పటికీ ఆసుపత్రిలో బెడ్స్ లేవని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి బయట క్యూ మరింత పొడవుగా ఉంది. ఆమె ప్రైవేట్ ఆటోలో ఉన్నందున వేచి ఉండాల్సిందే అని ఆమెకు చెప్పారు. అతను కనీసం కళ్ళు కూడా  తెరవ లేకపోతున్నాడు . ఆమె అతని చేతిని పట్టుకుని, అతని వీపునీ, ఛాతీని రుద్దుతూ, కొంచెం కొంచెం నీటిని త్రాగమని బలవంతం చేస్తూ ఉండిపోయింది. ఆ ముగ్గురూ - నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఎదురు చూశారు. తరవాత రోజు ఉదయానికి, మరో ఇద్దరు రోగులు తరవాత అతని వంతు వస్తుందనగా అతను పోరాటం ఆపేసాడు.

శ్మశానవాటిక వద్ద కూడా మరో క్యూ ఉంది...

సుధన్వ దేశ్‌పాండే కవిత పఠనం వినండి

మోక్ష

ఈ శ్వాసను అరువు తీసుకోని
నీ జీవిత వాంఛలో ముంచివేసెయ్
వెళ్ళు, ఆ లోయలలో తప్పిపో
నీ మూసిన కళ్ల వెనుక, చీకటిలో,
కాంతి కోసం పట్టుబట్టవద్దు.
వెక్కి వెక్కి ఏడ్చి
నీ గొంతులో ఇరుక్కుపోయిన
ఈ జీవన కాంక్షని
రాత్రి గాలిలో, విరామం లేని
కీచుమనే అంబులెన్స్‌ శబ్దంలా ప్రవహించు
పవిత్ర మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించుతూ
చుట్టూ ఉన్న ఆర్తనాదాలలో కరిగిపో

వీధులలో వ్యాపించే
ఈ భారీ, నిర్జనమైన,
కలచివేసే ఒంటరితనంతో
నీ చెవులను గట్టిగా మూసుకో
ఈ తులసిమొక్క ఎండిపోయినది.
నీ ప్రేమకి బదులుగా
నీ నాలుక కొస వద్ద
ఆ నారాయణి పేరును
ఆ మెరిసే జ్ఞాపకాల గంగాజలాన్ని
ఇక దిగమింగేసేయి.

కన్నీళ్లతో నీ శరీరాన్ని కడుగు
గంధపు కలలతో కప్పేసేయి
నీ ఛాతీపై ముడుచుకున్న ఆ అరచేతులను ఉంచి
నిన్ను నువ్వు పరచుకో
ఒక మందపాటి తెల్లని దుఃఖంలో
ప్రేమ యొక్క చిన్నచిన్న మిణుకులను
ఆ కళ్ళలో,ఉండనివ్వు
నువ్వు నిద్రపోతున్నప్పుడు
నీ చివరి మండే నిట్టూర్పుని విడిచిపెట్టు
ఈ బోలు శరీరం కింద జీవితాన్ని వెలగనివ్వు
అప్పుడు అన్నీ గడ్డివాము వలె కుప్పగా తేలుతాయి
ఒక నిప్పు రవ్వ కోసం ఎప్పటికీ వేచి చూస్తూ
రా, ఈ రాత్రి నీ చితిని వెలిగించి వేచి ఉండు
జ్వాలలు చిందులు వేస్తూ నిన్ను చుట్టుముట్టడానికి.

ఆడియో: సుధన్వ దేశ్ పాండే జన నాట్య మంచ్ లో నటి, దర్శకురాలు. ఆమె లెఫ్ట్ వర్డ్ బుక్స్ కు సంపాదకురాలు.

అనువాదం: జి. విష్ణు వర్ధన్

Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : G. Vishnu Vardhan

G. Vishnu Vardhan obtained a Post-graduation Diploma in Rural development and management from Hyderbad. Currently he works with ICRISAT in tribal agency area of Utnoor, Telangana.

Other stories by G. Vishnu Vardhan