ఉదయం 6 గంటల సమయం. శరణ్య బలరామన్ అప్పటికే గుమ్మిడిపూండిలోని తన ఇంటి నుండి బయలుదేరుతున్నారు. చెన్నైకి సమీపంలో ఉండే తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఈ చిన్న పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో, ఆమె తన ముగ్గురు పిల్లలతో లోకల్ రైలు ఎక్కుతారు. దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తల్లి, పిల్లలు మరో లోకల్ రైలులో 10 నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటారు.
సాయంత్రం 4 గంటలకు, ఇదే ప్రయాణం వ్యతిరేక దిశలో సాగుతుంది. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి సమయం 7 గంటలవుతుంది.
ఇంటి నుండి పాఠశాలకు, తిరిగి ఇంటికి రోజుకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం. ఇలా వారానికి ఐదుసార్లు జరుగుతుంది. శరణ్యకు ఇది ఒక సాహసకార్యమే. “అంతకుముందు (ఆమెకు పెళ్లి కాకముందు), నాకు బస్సు గానీ రైలు గానీ ఎక్కడ ఎక్కాలో తెలిసేదికాదు. అలాగే ఎక్కడ దిగాలో కూడా,” అని ఆమె వివరించారు.

చెన్నై సమీపంలోని గుమ్మిడిపూండి రైల్వే స్టేషన్‌లో తన కుమార్తె ఎం లెబనాతో కలిసి లోకల్ రైలు కోసం వేచి ఉన్న శరణ్య బలరామన్. వారుండే ప్రాంతంలో దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం పాఠశాలలు లేకపోవడంతో, వారు ప్రతిరోజూ ఇంటికీ పాఠశాలకూ మధ్య దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయణిస్తారు
శరణ్య ప్రయాణాలన్నీ దృష్టి లోపంతో పుట్టిన తన ముగ్గురు పిల్లల కోసమే. మొదటిసారి వారు బడికి బయలుదేరినప్పుడు, ఒక మామి (వృద్ధురాలు) దారి చూపించడానికి తమ వెంట వచ్చిందని శరణ్య చెప్పారు. “మరుసటి రోజు, నేనామెను నాతో రమ్మని అడిగినప్పుడు, ఆమె తనకు పని ఉందని చెప్పింది. నేను ఏడ్చాను. ప్రయాణించడానికి చాలా కష్టపడ్డాను,” అంటూ ఆమె తన పిల్లలతో మొదట్లో చేసిన ప్రయాణాలను గుర్తుచేసుకున్నారు.
తన ముగ్గురు పిల్లలు ఒక క్రమబద్ధమైన విద్యను పొందాలని ఆమె నిశ్చయించుకున్నారు. అయితే వారి ఇంటికి సమీపంలో దృష్టిలోపం ఉన్నవారి కోసం పాఠశాలలు లేవు. “మా ఇంటి దగ్గర ఒక పెద్ద బడి (ప్రైవేట్) ఉంది. నేను అక్కడకు వెళ్లి నా పిల్లలను చేర్చుకుంటారా అనడిగాను. 'మీ పిల్లలను చేర్చుకుంటే, ఇతర పిల్లలు పెన్సిల్‌తోనో లేదా ఏదైనా పదునైన వస్తువుతోనో వారి కళ్లను పొడిచే అవకాశం ఉందనీ, దానికి తాము బాధ్యత వహించలేమనీ' వాళ్ళు నాతో చెప్పారు,” అని ఆమె గుర్తుచేసుకున్నారు.
శరణ్య ఆ టీచర్ల సలహా తీసుకుని, దృష్టిలోపం ఉన్నవారి కోసం నడిపే పాఠశాలల కోసం వెతుకుతూ వెళ్ళారు. చెన్నైలో దృష్టిలోపం ఉన్న పిల్లల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒకే ఒక్క పాఠశాల ఉంది. అది ఆమె ఇంటికి 40 కిలోమీటర్ల దూరంలో, పూనమల్లి (పూనమల్లె అని కూడా పిలుస్తారు)లో ఉంది. పిల్లలను నగరంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించమని ఆమె పొరుగువారు సూచించారు; ఆమె వారిని వెళ్ళి కలవాలని నిర్ణయించుకున్నారు.

తన ముగ్గురు పిల్లలైన ఎమ్ మెషక్, ఎమ్ లెబనా, ఎమ్ మనసేలతో (ఎడమ నుండి కుడికి) తమిళనాడులోని గుమ్మిడిపూండిలో తన ఇంటివద్ద శరణ్య
"ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు," ఆ రోజులను గుర్తుచేసుకుంటూ చెప్పారామె. 'పెళ్లి కావడానికి ముందు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపిన' ఆ యువతి ఇప్పుడు పాఠశాలల వేటకు బయలుదేరింది. "పెళ్లయిన తర్వాత కూడా, ఒంటరిగా ప్రయాణించడమెలాగో నాకు తెలియదు," అని ఆమె జతచేశారు.
దక్షిణ చెన్నైలోని అడయార్‌లో శరణ్యకు చెవిటివారు, అంధులైన పిల్లల కోసం నడిపించే సెయింట్ లూయిస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెఫ్ అండ్ ది బ్లైండ్ పాఠశాల కనిపించింది; ఆమె తన కొడుకులిద్దరినీ ఇక్కడ చేర్చారు. తరువాత, తన కుమార్తెను సమీపంలోని జి.ఎన్. చెట్టి రోడ్డులోని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు పెద్దబ్బాయి ఎమ్. మేషక్ 8వ తరగతి, రెండవ సంతానం ఎమ్. మనసే 6వ తరగతి, చిన్నదైన ఎమ్. లెబనా 3వ తరగతి చదువుతున్నారు.
కానీ వారిని బడిలో చేర్చడమంటేనే అలసిపోయే, ఒత్తిడితో కూడిన, తరచూ బాధాకరమైన రైలు ప్రయాణాలు ఉంటాయి. పెద్దబ్బాయి మూర్ఛలతో బాధపడుతున్నాడు. చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వేళ్ళే దారిలోనే చాలాసార్లు మూర్ఛలు వచ్చేవి. "అతనికేమవుతుందో నాకు తెలియదు... మూర్ఛలు రావడం మొదలవుతుంది. ఎవరూ గమనించకుండా ఉండటానికి నేను తనని నా ఒడిలో పడుకోబెట్టుకుంటాను. కొంతసేపయ్యాక బడికి తీసుకుపోతాను,” అని ఆమె చెప్పారు.
ఆమె పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించే వీలు లేదు. ఆమె పెద్ద కొడుకును దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. "అతనికి రోజుకు మూడు నుండి నాలుగుసార్లు మూర్ఛలు వస్తాయి," అని ఆమె చెప్పారు. మరో విషయం, "నేను లేకపోతే నా రెండవ బిడ్డ అన్నం తినడు".

తన తండ్రి ఆర్. బలరామన్ (ఎడమ) సహాయంతో పిల్లలకు తినిపించే ప్రయత్నం చేస్తోన్న శరణ్య. కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదిస్తున్నవారు
*****
శరణ్యకు 17 ఏళ్ళు రాకముందే ఆమె మేనమామ ముత్తుతో పెళ్ళయింది. తమిళనాడులో వెనుకబడిన తరగతి (బిసి) జాబితాకు చెందిన రెడ్డి వర్గంలో రక్తసంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు సర్వసాధారణం. "నా తండ్రి కుటుంబ సంబంధాన్ని తెంచేయాలనుకోలేదు. ఆందుకని ఆయన నాకు మా మామ (మేనమామ)తో పెళ్ళిచేశాడు" అని ఆమె చెప్పారు. “మాది ఉమ్మడి కుటుంబం. నాకు నలుగురు తాయి మామన్ (మేనమామలు) ఉన్నారు, నా భర్త అందరిలోకీ చిన్నవాడు."
శరణ్యకు 25 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా దృష్టి లోపంతో పుట్టిన ముగ్గురు పిల్లలకు తల్లయింది. "నా మొదటి పిల్లాడు పుట్టేవరకూ పిల్లలు ఆ విధంగా (కంటి చూపు లేకుండా) పుడతారని నాకు తెలియదు. వాడు పుట్టినప్పుడు నాకు 17 ఏళ్లు. వాడి కళ్ళు బొమ్మ కళ్ళలా కనిపించాయి. నేను అలాంటి కళ్ళను ముసలివాళ్ళలో మాత్రమే చూశాను." అన్నారు శరణ్య.
రెండవ కొడుకు పుట్టేటప్పటికి ఆమెకు 21 సంవత్సరాలు. "కనీసం రెండో బిడ్డ అయినా మామూలుగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ ఐదు నెలల్లోనే ఈ బిడ్డకు కూడా కంటి చూపు లేదని నాకు అర్థమయింది," అని శరణ్య చెప్పారు. రెండవ బిడ్డకు రెండేళ్ల వయసున్నప్పుడు, శరణ్య భర్త ప్రమాదానికి గురై కోమాలోకి జారుకున్నారు. అతను కోలుకున్న తర్వాత, శరణ్య తండ్రి అతనికి ట్రక్కులకు మరమ్మత్తులు చేసే ఒక చిన్న మెకానిక్ దుకాణాన్ని ఏర్పాటు చేయడంలో సహాయం చేశారు.
ప్రమాదం జరిగిన రెండేళ్ళ తర్వాత శరణ్యకు కూతురు పుట్టింది. "ఆమె ఆరోగ్యంగా ఉంటుందని మేం అనుకున్నాం… ముగ్గురు పిల్లలు ఈ విధంగా పుట్టడానికి కారణం నేను నా రక్త సంబంధీకుడిని పెళ్ళి చేసుకున్నందుకేనని నాకు తెలిసింది. ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే బాగుండేది,” అని ఆమె వాపోయారు.


శరణ్య, ముత్తుల పెళ్ళి ఆల్బమ్‌లోని ఫోటోలు. సంతోషాల నవ్వులతో వధువు శరణ్య (కుడి)

అందరూ కలిసి గుమ్మిడిపూండిలోని వారి ఇంట్లో ఉదయపువేళల్ని గడుపుతోన్న శరణ్య కుటుంబ సభ్యులు
పెద్ద కొడుకుకి నరాల సమస్య ఉండడంతో అతని వైద్య ఖర్చులకు నెలకు రూ.1,500 ఖర్చుపెడతారు. ఆపైన వార్షిక పాఠశాల రుసుము అబ్బాయిలిద్దరికీ కలిపి రూ. 8,000; ఆమె కూతురు చదివే బడిలో రుసుము కట్టనవసరంలేదు. "నా భర్త మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు," అని ఆమె చెప్పారు. "అతను రోజుకు 500-600 రూపాయలు సంపాదించేవాడు."
2021లో తన భర్త గుండెపోటుతో మరణించడంతో శరణ్య అదే ప్రాంతంలో నివసించే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళారు. "ఇప్పుడు నా తల్లిదండ్రులు మాత్రమే నాకు అండగా ఉన్నారు," అని ఆమె చెప్పారు. “నేను దీన్ని (పిల్లల్ని సాకటాన్ని) ఒంటరిగా చేయాలి. నేనసలు నవ్వడమే మర్చిపోయాను."
శరణ్య తండ్రి మరమగ్గాల కర్మాగారంలో పనిచేస్తుంటారు. ఆయన నెలంతా పని చేయగలిగితే నెలకు రూ.15,000 సంపాదిస్తారు. ఆమె తల్లికి శారీరకంగా వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే పింఛను, వెయ్యి రూపాయలు వస్తుంది. “మా నాన్నకి వయసు మీద పడుతోంది. ఆయన నెలలో 30 రోజులు పనికి వెళ్ళలేడు. అందువలన ఆయనకొచ్చే జీతంతో మా ఇల్లు గడవదు,” అని ఆమె చెప్పారు. "నేనెప్పుడూ పిల్లలతోనే ఉండాల్సివస్తుంది. నాకు ఉద్యోగం కూడా రావటంలేదు," అన్నారు శరణ్య. స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం ఆమెకు సహాయకారిగా ఉంటుంది. అందుకోసం ఆమె ఎన్నో వినతిపత్రాలు సమర్పించినా, ఏమీ జరగలేదు.
శరణ్య తన సమస్యలను ఎదుర్కోవటానికి ప్రతిరోజూ పోరాడుతున్నట్టే ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలతోనూ పోరాడుతున్నారు. "నన్ను బ్రతికించింది నా కూతురే" అని ఆమె చెప్పారు. "ఆమె నాకు చెప్తుంది, 'మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. కనీసం మనం కొన్నాళ్లయినా బతికిన తర్వాతే వెళ్లిపోవాలి' అని."

మనవరాలిని బడికి వెళ్ళేందుకు తయారుచేస్తున్న బలరామన్ . శరణ్యకు అండగా నిలిచేది ఆమె తల్లిదండ్రులు మాత్రమే

వంటచేసి , పిల్లల్ని బడికి తీసుకువెళ్ళడానికి సిద్ధంచేయటం కోసం శరణ్య రోజూ తెల్లవారుఝాము 4 గంటలకే నిద్రలేస్తారు
![Saranya with her son Manase on her lap. 'My second son [Manase] won't eat if I am not there'](/media/images/08-PAL_6545-PK-Saranyas_search_for_a_silve.max-1400x1120.jpg)
ఒడిలో పడుకున్న చిన్న కొడుకు ఎమ్ . మనసేను లాలిస్తోన్న శరణ్య . ' నా కొడుకు నేను దగ్గర లేకపోతే తిండి తినడు’

సూర్యకాంతి మీద పడుతుండగా గుమ్మిడిపూండిలోని తన ఇంట్లో నేలమీద నిద్రపోతున్న మనసే

తన అన్నల కంటే లెబనా చాలా స్వతంత్రంగా ఉండే పాప . చాలా పద్ధతిగా ఉండే ఆమె , తన పనులు తాను చేసుకోవడం నేర్చుకుంది

తన తల్లి ఫోన్ ద్వారా యుట్యూబ్ లో తమిళ పాటలను వింటున్న లెబనా . పాటలు విననప్పుడు ఆమె వాటిని కూనిరాగాలు తీస్తుంది

చెక్కతో చేసిన తన కారు బొమ్మంటే మనసేకు చాలా ఇష్టం . ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం దానితో ఆడుతూ గడుపుతాడు

మనవడు మనసేతో ఆడుకుంటోన్న తంగం ఆర్ . శారీరక వికలాంగురాలిగా ఆమెకు వచ్చే పింఛను వెయ్యి రూపాయలను ఆమె తన మనవసంతానానికే ఖర్చుపెడతారు

అమ్మమ్మను ఓదారుస్తున్న లెబనా . చాలా దయగల పాప అయిన లెబనా ఇతరుల భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉంటుంది , ఎదుటివారి స్వరం ద్వారా వాటిని గ్రహించి ప్రతిస్పందిస్తుంది

బలరామన్ ఎంతో ప్రేమతో తన ముగ్గురు మనవసంతానాన్ని చూసుకుంటారు . ఒక మరమగ్గాల కర్మాగారంలో పనిచేసే ఆయన , ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటిపనుల్లో సాయం చేస్తుంటారు

తన పెద్ద మనవడు మెషక్ ( మధ్యలో ) ను ప్రతిరోజూ సాయంత్రం నడక కోసం మిద్దెమీదకు తీసుకువెళ్తుంటారు బలరామన్ ( ఎడమ ). వారి సాయంత్రపు నడకను మరింత ఆనందదాయకంగా చేస్తూ కొన్నిసార్లు లెబనా కూడా వారితో కలిసి నడుస్తుంది

తమ మిద్దెమీద ఆడుకోవడమంటే లెబనాకు చాలా ఇష్టం . తనతో ఆడుకోవడానికి మిద్దెపైకి తన స్నేహితులను కూడా తోడుతెచ్చుకుంటుంది లెబనా

గుమ్మిడిపూండిలోని ఇంటి మిద్దెమీద ఆడుకుంటూ తనను ఎత్తుకోమని అమ్మతో గోముచేస్తున్న లెబనా

దృష్టి లోపంతో బాధపడుతున్న తన ముగ్గురు పిల్లలను చూసుకోవడంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ , ఇంట్లో వారితో గడపటంలోనే శరణ్యకు ప్రశాంతత దొరుకుతుంది

తన పిల్లలను బడికివెళ్ళేందుకు సిద్ధంచేసిన తర్వాత , అల్పాహారం తినడానికి మెట్లమీద కూర్చున్న శరణ్య . ఆమెకు ఒంటరిగా కూర్చొని తినడం ఇష్టం . ఆమె తన సొంతానికి పొందే ఏకైక సమయం అదే

గుమ్మిడిపూండిలోని తమ ఇంటి బయట కూతురితో కలిసి బుడగలు ఊదుతోన్న శరణ్య . ' నన్ను జీవించివుండేలా చేసింది నా కూతురే '

'నేను నిత్యం పిల్లలతోనే ఉండాలి. నేను ఉద్యోగం పొందలేకపోతున్నాను'
తమిళంలో చెప్పిన ఈ కథనాన్ని ఎస్. సెందళిర్ ఆంగ్లంలోకి అనువాదం చేశారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి