సుముకన్ వారసులు ఇంకా ఆరికోడ్‌లోనే నివసిస్తున్నారు

కల్లియస్సేరి గ్రామం నిరంతరం పోరాడుతూనే ఉంది. 1947 తర్వాత కూడా ఆపలేదు. కేరళలోని ఉత్తర మలాబార్ ప్రాంతంలోని ఈ గ్రామం అన్ని వైపులా పోరాటంలో మునిగిపోయింది. స్వాత్రంత సమరంలో భాగంగా బ్రిటీష్ వారిని ధిక్కరించింది. రైతు కూలీల పోరాటంలో జన్మీల(జమీందారుల)ను ఎదిరించింది. వామపక్ష రాజకీయాలలో భాగంగా కులాన్ని వ్యతిరేకించింది.

"స్వాత్రంత్ర పోరాటం 1947లోనే సంపూర్ణంగా ముగిసిపోయిందని అంటే ఎలా?" అని ఈ పోరాటాలన్నింటిలో ప్రముఖ పాత్ర పోషించిన కె. పి. ఆర్. రాయరప్పన్ ప్రశ్నిస్తున్నారు. "భూ సంస్కరణల కోసం ఇంకా పోరాడవలసి  ఉంది." 86 ఏళ్ల వయసు గల రాయరప్పన్ భవిష్యత్తులో ఇంకా చాలా పోరాటాలు జరగాలని నమ్ముతారు .  వాటిలో తానూ పాలు పంచుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. 83 ఏళ్ల వయసులో జాతీయ స్థాయిలో స్వావలంబనకు పిలుపునిచ్చే ఒక మార్చ్‌లో భాగంగా కాసర్‌గోడ్ నుండి తిరువనంతపురం వరకు దాదాపు 500 కిలోమీటర్లు నడిచారు.

కల్లియస్సేరిలో మార్పులకు నాంది పలికిన రెండు సంఘటనలను ఆయనకు ఎప్పటికీ గుర్తుండి పోయాయి.  ఒకటి 1920 దశాబ్దం ప్రారంభంలో మంగళూరును గాంధీ గారు సందర్శించడం. స్కూలు పిల్లలతో సహా ఎందరో ప్రజలు గాంధీ గారి ప్రసంగం వినాలనే కోరికతో చాలా దూరం ప్రయాణించి వచ్చారు. "అప్పట్లో మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్లం," అని రాయరప్పన్ చెప్పారు.

రెండవ సంఘటన "మా బోర్డ్ స్కూల్లో చదువుకోవాలని ఆశపడ్డ సుముకన్ అనే ఒక చిన్న దళిత కుర్రాడిపై జరిగిన భౌతిక దాడి. స్కూలుకు వచ్చే ధైర్యం చేసినందుకు ఆ అబ్బాయిని, అతడి అన్నయ్యను అగ్ర కుల వ్యక్తులు చితకబాదారు.

"అప్పట్లో కులవివక్షకు, ఆర్థిక వనరులపై ఆధిపత్యానికి దగ్గరి సంబంధం ఉండేది. ఆ వనరులలో భూమి ముఖ్యమైనది. మలబార్ జిల్లా చిరక్కల్ తాలూకాలో జాన్మి ఆకృత్యాలకు కల్లియస్సేరి కేంద్రంగా ఉండింది. 1928లో అగ్ర కుల నాయర్లు దాదాపు 72 శాతం భూమిని తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. వెనుకబడ్డ వర్గాలైన తియ్యాలు, ఇతర సామాజిక వర్గాలు జనాభాలో 60% ఉన్నా కేవలం 6.55% భూమికి మాత్రమే సొంతదారులుగా ఉండేవారు. అయినప్పటికీ 1960ల దాకా జరిగిన భూ సంస్కరణల పోరాటం ఫలించింది.

ఈ రోజు, తియ్యాలు, ఇతర వెనుకబడ్డ కులాలు, దళితులు 60% పైగా భూమికి సొంతదారులుగా ఉన్నారు.

"ఇంతకు ముందు మేము బానిసల్లా ఉండేవాళ్లం," అని 63 ఏళ్ల కె. కున్‌హంబు చెప్పారు. ఆయన తండ్రి తియ్యా కులానికి చెందిన ఒక రైతు. "అప్పట్లో మాకు షర్ట్ వేసుకునేందుకు కూడా అనుమతి లేదు, చంకల కింద ఒక టవల్ మాత్రమే ఉండాలి. చెప్పులు, బూట్లు ఏవీ కూడా వేసుకోకూడదు. కేవలం ఒక చిన్న స్నానపు టవల్ లాంటి సగం పంచ మాత్రమే కట్టుకోవాలి ." కొన్ని ప్రాంతాలలో వెనుకబడ్డ కులాల మహిళలకు బ్లౌజులు వేసుకునేందుకు కూడా అనుమతి లేకపోయేది. "కొన్ని రోడ్డుల గుండా మేము వెళ్లలేకపోయేవాళ్లం. కుల వ్యవస్థలో మాకున్న స్థాయిని బట్టి అగ్ర కుల పురుషులకు తగినంత దూరంలో ఉంటూ నడవాల్సి వచ్చేది."

వెనుకబడిన కులాలను స్కూల్లోకి అడుగు పెట్టకుండా ఆపడం అనేది, ఆ వివక్షలో ఒక భాగం మాత్రమే. ఆ వివక్ష ప్రధాన ఉద్దేశం ఆర్థిక వనరులను వారికి అందకుండా చేయడం. అందుకు తోడుగా వారికి ఏ విధమైన గౌరవ మర్యాదలూ దక్కకుండా చూసేవారు. పేదవారి మీద జాన్మి వర్గీయులు దాడులు చేయడం అప్పట్లో సర్వసాధారణంగా ఉండేది.

సుముకన్‌పై జరిగిన దాడి ఒక ప్రధాన ఘట్టంగా మారి సామాజిక రాజకీయ పరిస్థితులను కీలక మలుపు తిప్పింది.

"మలబార్‌కు చెందిన జాతీయవాద నాయకులంతా ఇక్కడికి వచ్చారు," అని రాయరప్పన్ చెప్పారు. "ప్రముఖ కాంగ్రెస్ నాయకుడైన కేళప్పన్ కొంత కాలం పాటు ఇక్కడ ఉన్నారు కూడా. అందరూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సి. ఎఫ్. ఆండ్రూస్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ సమస్యను బ్రిటీష్ పార్లమెంట్‌లో కూడా లేవనెత్తారు. ఆ తర్వాత కల్లియస్సేరి గ్రామం దళితులకు విద్యా కేంద్రంగా మారింది. "వేర్వేరు కులాలకు చెందిన ప్రజలు సహపంక్తి భోజనం చేసేలా ప్రజలు సామాజిక విందులను కూడా నిర్వహించారు.

అయితే అందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడికి దగ్గర్లోనే, అజానూర్‌లో 1930లలో, 1940లలో ఒకే స్కూలును మూడు సార్లు కూల్చివేశారు. మొదటి సారి జాన్మి వర్గం, మరుసటి సారి పోలీసులు, ఆ తర్వాతి సారి మళ్లీ జాన్మి వర్గం ఆ చర్యలకు పాల్పడ్డారు. ఆ స్కూల్ షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులను చేర్చుకునేది. అంతే కాక "జాతీయవాదులకు, కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పిస్తోందని" దానిని అనుమానించారు.

ఆ అనుమానాలు నిజమయ్యాయి. "ఈ ప్రాంతంలో లెఫ్ట్ పార్టీలు ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ వచ్చాయి" అని అగ్ని శర్మన్ నంబూద్రి అనే రిటైర్డ్ టీచర్ చెప్పారు. ప్రస్తుతం, సమీపంలోని కరివెల్లూరులో పూర్తి స్థాయి రాజకీయ కార్యకర్తగా పని చేస్తున్న నంబూద్రి "మేము ఏ గ్రామానికి వెళ్లినా, అక్కడ ఒక నైట్ స్కూల్, ఒక రీడింగ్ రూమ్, ఒక రైతు యూనియన్‌ను ప్రారంభించే వాళ్లం. అందువల్లే ఉత్తర మలబార్‌లో లెఫ్ట్ పార్టీలు వృద్ధి చెందాయి. అందువల్లే కల్లియస్సేరిలో మార్పు వచ్చి, అంతిమంగా విజయం సాధించగలిగింది" అని చెప్పారు.

1930ల దశాబ్దం మధ్యలో లెఫ్ట్ నాయకులు ఉత్తర మలబార్‌లోని కాంగ్రెస్ పార్టీని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 1939 నాటికి, రాయరప్పన్‌తో పాటు అతని స్నేహితులు అందులోంచి బయటకు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా మారారు. విద్య అందరికీ అందకూడదనే ప్రయత్నాలు జరిగిన ఆ ప్రాంతంలోనే, అప్పటి టీచర్స్ యూనియన్ రాజకీయాలలో ప్రధానమైన పాత్ర పోషించింది.

"అందువల్లే, నైట్ స్కూల్, రీడింగ్ రూమ్, రైతుల యూనియన్లను ఏర్పాటు చేసే పద్ధతి కొనసాగింది," అని పి. యశోద చెప్పారు. "ఏది ఏమైనా, మేమంతా చివరికి టీచర్లమే కదా." 60 ఏళ్ల క్రితం ఆ యూనియన్‌కు నాయకురాలిగా ఎదిగేలా చేసిన తనలోని విప్లవోత్సాహాం, 81 ఏళ్ల వయసు వచ్చినా ఆమెలో కనబడుతోంది. తనకు 15 ఏళ్ల వయసున్నప్పుడు తన తాలూకాలో మొట్ట మొదటి, ఏకైక మహిళా టీచర్‌గా, మలబార్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన టీచర్‌గా పని చేశారు. అంతకు మునుపు, తన స్కూల్లో మొట్ట మొదటి విద్యార్థినిగా అడుగుపెట్టారు.

"మా స్కూల్లో అత్యంత ప్రతిభావంతులైన ఇద్దరు విద్యార్థులను మా అందరి కళ్ల ముందే చితకబాదడం చూశాను. ఆ సంఘటనతోనే నా రాజకీయ జీవితం మొదలైందని నా నమ్మకం." వాళ్లు చేసిన నేరమేమిటో తెలుసా? "మహాత్మా గాంధీకి జై" అనే నినాదం చేయడం మాత్రమే. ఒక్కొక్కరికి కర్రతో 36 దెబ్బల శిక్ష విధించారు. చట్టపరంగా 12 దెబ్బల వరకు మాత్రమే శిక్ష విధించవచ్చు. అందుకని, చింతన్ కుట్టి, పద్మనాభయ్య వారియర్ అనే ఇద్దరు విద్యార్థులను రోజుకు తలా 12 దెబ్బల చొప్పున మూడు రోజుల పాటు కొట్టి శిక్ష విధించారు. అంతే కాక, ఒకసారి తమ సాగు భూమి నుండి ఒక కుటుంబాన్ని వెళ్లగొట్టడం చూశాను. వాళ్ల కష్టాలను నేను ఎన్నటికీ మరవలేను."

"గత 50 ఏళ్లలో ఎంతో పురోగతి సాధ్యమైంది," అని ఈ ప్రాంతంలో యశోదా టీచర్‌గా పిలవబడే ఆవిడ చెప్పారు. "స్వతంత్రం తనతో పాటు మార్పుల ఉప్పెనను తీసుకొచ్చింది."

ఒకప్పుడు కల్లియస్సేరి - అందరికీ  విద్య అందని ఒక పల్లెటూరు. అప్పటితో పోలిస్తే నేడు ఎంతో అభివృద్ధి సాధించింది. మగవాళ్లలో, ఆడవాళ్లలో కూడా అక్షరాస్యత దాదాపు 100% ఉంది. ప్రతి ఒక్క చిన్నారిని స్కూలుకు పంపుతారు.

"21 వేల జనాభా గల ఈ పంచాయితీలో 16 లైబ్రరీలు ఉన్నాయి" అని క్రిష్ణన్ పిళ్లై రీడింగ్ రూమ్ యొక్క లైబ్రేరియన్ గర్వంగా చెప్పారు. ఆ 16 లైబ్రరీ-కమ్-రీడింగ్ రూములూ ప్రతి రోజు సాయంత్రం ఎంతో రద్దీగా ఉంటాయి. అక్కడి పుస్తకాలు దాదాపు అన్నీ మలయాళంలోనే ఉంటాయి. కానీ కొన్ని ఇంగ్లీషులో కూడా ఉన్నాయి. హాన్ సుయిన్, చార్లెస్ డికెన్స్, టాల్‌స్టాయ్, లెనిన్, మర్లో వంటి ప్రసిద్ధ రచయితల పుస్తకాలు ఉన్నాయి. ఇంతటి వైవిధ్యం ఉన్న సాహిత్యం యొక్క ప్రభావం అనుకోని రూపాల్లో కనబడుతుంది. ఇది భారతదేశంలోని గ్రామమే అయినా, ఇక్కడ 'షాంగ్రీ లా' అనే పేరున్న ఇళ్లు కూడా తారసపడతాయి.

కల్లియస్సేరి ఎలాంటి ఊరంటే, అక్కడ 8వ తరగతి దగ్గరే చదువు ఆపేసిన వ్యక్తి కూడా పశ్చిమ ఆసియాలో అరాఫత్ ఎలాంటి వ్యూహాత్మక తప్పిదాలను ఎందుకు చేశాడనే దాని విషయంపై వాదించగలడు. ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్క విషయంపైనా ఏదో ఒక అభిప్రాయం ఉండనే ఉంటుంది, దానిని ఇతరులతో పంచుకోవడానికి సంకోచించరు కూడా.

"స్వాతంత్ర పోరాటం, విద్యతో పాటు భూ సంస్కరణల కోసం చేసిన సంఘటిత ఆందోళన అనూహ్యమైన మార్పులను తీసుకు వచ్చింది," అని రాయరప్పన్ చెప్పారు. ఆ ఆందోళన వల్ల లబ్ధి పొందిన తియ్య సామాజిక వర్గానికి చెందిన కె. కున్‌హంబు ఏకీభవిస్తున్నారు. "దాని వల్లే ఊహించనంత మార్పు వచ్చింది," అని ఆయన చెప్పారు. "భూ సంస్కరణలు ఇక్కడి కులాధిపత్యాన్ని దెబ్బ తీశాయి. మాకు సరికొత్త హోదాను ప్రసాదించింది. అంతకు ముందు, జన్మీల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి భూమిని సాగు చేసే వాళ్లం. దున్నే వాడికే భూమి అనే విధానం వచ్చి ఆ పరిస్థితి అంతటినీ మార్చి వేసింది. దాంతో ఆ ఆస్తి హక్కుదారులకు మాకు సమాన స్థాయి ఉందనే భావన కలిగింది." మరీ ముఖ్యంగా పేద వారికి ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి వసతులను పొందే అవకాశం బాగా మెరుగుపడింది.

"మేము భూ సంస్కరణల కోసం 1947 నుండి 57 వరకు, ఆ తర్వాత కూడా పోరాటం చేశాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్ర కులాల వారితో, జన్మీలతో కుమ్మక్కయ్యిందని మాకు తెలిసి వచ్చింది." అందు వల్ల, కల్లియస్సేరిలో "85% కంటే ఎక్కువ మంది ప్రజలు లెఫ్ట్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు."

"గత 50-60 ఏళ్లలో భారీ మార్పులు జరిగాయి" అని సుముకన్ భార్య పణ్ణయన్ జానకి చెప్పారు. "అప్పట్లో నా సొంత పిల్లలనే స్కూలుకు పంపడం చాలా కష్టంగా ఉండేది. స్వాతంత్రం వచ్చినందు వల్ల, ఆ తర్వాతి ఏళ్లలో చాలా ప్రభావం పడింది."

సుముకన్ 16 ఏళ్ల క్రితం కన్ను మూశారు. ఆయన కుటుంబం ఇప్పటికీ దగ్గర్లోని ఆరికోడ్‌లో నివసిస్తోంది. సుకుమన్ కుమార్తె టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. ఆయన అల్లుడు కున్‌హిరామన్ క్యాలికట్‌లో పోస్ట్ ఆఫీసుల సూపరింటెండెంట్‌గా రిటైర్ అయ్యారు. "ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో అయితే సామాజిక వివక్ష అంటూ ఏమీ లేదు. మా కుటుంబంలో ఇద్దరు ఎమ్. బి. బి. ఎస్., ఇద్దరు ఎల్. ఎల్. బి., మరొకరు బి. ఎస్. సి. పట్టాలను పొందారు..."

PHOTO • P. Sainath

సుముకన్ మనవళ్లు, మనవరాళ్లలో కొందరితో కె. పి. ఆర్. రాయరప్పన్ (కుడి చివరన) ఫోటోలో ఉన్నారు. ఆ కుటుంబంలో "ఇద్దరు ఎమ్. బి. బి. యస్., ఇద్దరు ఎల్. ఎల్. బి., ఒకరు బి. ఎస్. సి. పట్టాలను పొందారు"

వీళ్లంతా, అసలు స్కూలుకే వెళ్లలేకపోయిన సుముకన్ అనే ఒక అబ్బాయి మనవళ్లు, మనవరాళ్లు.

ఫోటోలు: పి. సాయినాథ్

ఈ వార్తా కథనం 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రికలో 1997 ఆగస్ట్ 28న మొదట ప్రచురితమైంది.

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు :

సాలిహాన్ రాజ్ మీద ఎదురుదాడి చేయగా
పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు -1
పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు - 2
లక్ష్మి పాండా ఆఖరి పోరాటం
తొమ్మిది దశాబ్దాల అహింస
గోదావరి: దాడి కై ఎదురుచూస్తున్న పోలీసులు
షేర్పూర్ : గొప్ప త్యాగం, గుర్తులేని జ్ఞాపకం
సోనాఖాన్ : వీర్ సింగ్ రెండు సార్లు మరణించాడు
కల్లియస్సేరి : యాభైల్లో కూడా వీడని పోరాటం

అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at raghunathtelugu@protonmail.com

Other stories by Sri Raghunath Joshi