PHOTO • P. Sainath

ఆ నడక, సర్కస్‌లో తీగ మీద బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా ఉంది కానీ, దాని కంటే ఇది మరింత క్లిష్టమైనది, ప్రమాదకరమైనది. సేఫ్టీ నెట్ కానీ ఇతర రక్షణా సామాగ్రి కానీ ఏవీ లేవు. ఆమె అడుగుపెడుతోన్న బావికి గోడలు కూడా లేవు. దాని మీద బరువైన చెక్క దిమ్మెలను చేర్చారు. మిట్ట మధ్యాహ్నం 44 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో వేడి గాలి వల్ల మట్టి, చెత్త ఎగిరి పడకుండా అవి కొద్దో గొప్పో కప్పి ఉంచుతాయి. వాటి నడి మధ్యలో ఉన్న రంధ్రం కూడా ఆ దిమ్మెలను ఒక యాంగిల్‌లో పెట్టడం వల్ల ఏర్పాటు చేసిందే.

ఆ దిమ్మెల అంచుల మీద నిలబడి ఆమె నీటిని తోడాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల రెండు రకాలుగా ప్రమాదం ఉంది : అదుపు తప్పి ఆమె కింద పడవచ్చు, లేదా ఆమె బరువుకు దిమ్మెలు విరిగిపోవచ్చు. ఈ రెండింటిలో ఏది జరిగినా, దాని వల్ల కనీసం 20 అడుగుల ఎత్తు నుండి ఆమె కింద పడుతుంది. ఆమెతో పాటు కొన్ని దిమ్మెలు కూడా ఆమెపై పడితే మరింత ప్రమాదం పొంచి ఉంది. ఒక పక్కకు జారి పడిపోతే పాదం నలిగిపోవచ్చు కూడా.

అయితే, ఆ రోజు అలాంటిదేదీ జరగలేదు. ఆ మహిళ ఒక గ్రామంలోని ఫాలియా లేదా ఒక వాడ (ఇవి వర్గం వారీగా ఉండవచ్చు) నుండి వచ్చిన భిలాలా ఆదివాసీ. ఆ దిమ్మెల మీద ఆమె అలవోకగా నడిచింది. తాడుకు కట్టిన ఒక బకెట్‌ను బావిలోకి దింపి, అది నీటితో పూర్తిగా నిండిన తర్వాత పైకి లాగింది. దానిలోని నీటిని ఒక బిందెలోకి పోసింది. తిరిగి, ఆ బకెట్‌ను నింపింది. ఇది చేస్తున్నప్పుడల్లా ఆమె కానీ, ఆ దిమ్మెలు కానీ ఏ మాత్రమూ తొణకలేదు. ఆ తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్లడానికి నడవడం మొదలుపెట్టింది. ఆమె ఇల్లు, మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లాలో వాక్నర్ గ్రామంలో ఉంది. బరువైన బిందెను తల మీద కుడి చేత్తో బ్యాలెన్స్ చేస్తూ, ఊగులాడే చిన్న బకెట్‌ను ఎడమ చేత పట్టుకుని, రెండింటినీ మోస్తూ నడుస్తూ వెళ్లింది.

తన ఫాలియా నుండి ఈ బావి దాకా చేరడానికి ఆమెతో కలిసి నేను కూడా ఎంతో దూరం నడిచి వచ్చాను. రోజుకు ఇలా రెండు సార్లు (లేదా అంతకంటే ఎక్కువ సార్లు) ఆమె నడుస్తోంది అంటే ఈ ఒక్క పనికే కనీసం ఆరు కిలోమీటర్లు నడుస్తోందని అంచనా వేశాను. ఆమె వెళ్లిపోయిన తర్వాత నేను కొంత సేపు ఆ బావి దగ్గరే ఉన్నాను. ఆమె లాగానే ఇతర మహిళలు, కొందరు చిన్న అమ్మాయిలు కూడా అలవోకగా నీటిని తోడగలిగారు. వాళ్లందరూ చాలా సులువుగా చేయడం చూసి, నేను కూడా ప్రయత్నిద్దామని ఆ అమ్మాయిలలో ఒకరిని అడిగి, తాడు కట్టిన ఒక బకెట్‌ను తీసుకున్నాను. నేను దిమ్మెల మీద అడుగు పెట్టిన ప్రతిసారీ, అవి కదలసాగాయి, కొద్దిగా దొర్లుతున్నాయి కూడా. ప్రతి ఒక్క సారి, మధ్యలోని రంధ్రం వద్దకు వెళ్లే కొద్దీ, ఆ దిమ్మెల అంచులు అదిరి వంగిపోతున్నాయి. అవి విరిగిపోతాయేమో అని నాకు భయం కలిగింది. ప్రతి సారి నేను భయపడి తిరిగి నేల మీదకు వచ్చేశాను.

ఇది ఇలా ఉండగా అక్కడికి నీరు తోడుకోవడానికి వచ్చిన మహిళలు, అమ్మాయిలు గుమి గూడి నేను బావిలోకి పడిపోతానేమో అని ఆసక్తిగా చూడసాగారు. నా ప్రయత్నాలన్నీ ఆ మధ్యాహ్నపు వేళ వారికి ఒక వినోదంగా మారాయి. అప్పటి దాకా నా ప్రయత్నాలను చూసి నవ్వుతూ ఉన్న మహిళలు కొద్ది సేపటి తర్వాత కొద్దిగా ఆందోళన చెందడం మొదలవడంతో నా ప్రయత్నాలను ఆపేశాను. వాళ్లు పూర్తి చేయవలసిన అతి ముఖ్యమైన పని - వాళ్ల కుటుంబ సభ్యులకు నీటిని తీసుకెళ్లడం - నేను ఆలస్యం చేస్తున్నాను. ఇదంతా 1994లో జరిగింది కాబట్టి, నీటిని తోడటానికి ఎన్నిసార్లు ప్రయత్నించానో సరిగ్గా గుర్తులేదు. చివరికి అర్ధ బకెట్ నీటిని మాత్రమే తోడగలిగినా దానికి నా చుట్టూ ఉన్న అమ్మాయిలు సంతోషంతో చప్పట్లు కొట్టారు.

ఈ వార్తా కథనం సంక్షిప్త రూపంలో ది హిందూ బిజినెస్ లైన్ పత్రికలో 1996 జులై 12న ప్రచురితమైంది.

అనువాదం : శ్రీ రఘునాథ్ జోషి

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at raghunathtelugu@protonmail.com

Other stories by Sri Raghunath Joshi