"దయచేసి వాటికి మరీ దగ్గరగా వెళ్ళకండి. అవి బెదిరిపోయి పరుగెట్టిపోగలవు. అప్పుడు వాటిని ఆపటమే కాక, ఇంత విస్తారమైన ప్రాంతంలో వాటి జాడ కనుక్కోవడం కూడా నాకు చాలా కష్టమవుతుంది," అన్నారు జెఠాభాయ్ రబారీ.
'వాటిని', 'అవి' అని ఆ సంచార పశుపోషకుడు మాట్లాడుతున్నది అతి విలువైన తన ఒంటెల గురించి. అవి అక్కడంతా ఈతకొడుతూ ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి.
ఒంటెలు? ఈత కొడుతున్నాయా? నిజంగానే?
అవును నిజమే. 'విస్తారమైన ప్రాంతం' అని జెఠాభాయ్ చెప్తున్నది కచ్ అఖాతానికి దక్షిణ తీరం పొడవునా విస్తరించి ఉన్న మరైన్ నేషనల్ పార్క్ మరియు అభయారణ్యం (ఎమ్ఎన్‌పి & ఎస్) గురించి. ఇక్కడ సంచార సముదాయాలకు చెందిన పశుపోషకుల బృందాలు పెంచుకునే ఒంటెల మందలు వాటి ఆహారమైన మడ చెట్ల (అవిసెనియా మరైనా) కోసం వెతుకుతూ ఒక ద్వీపం నుండి మరో ద్వీపానికి ఈదుతుంటాయి .
"ఈ జాతి ఒంటెలు దీర్ఘకాలం పాటు మడ చెట్లను తినకపోతే జబ్బుపడతాయి, బలహీనపడి చివరికి చనిపోతాయి కూడా" అంటారు కరు మేరు జాట్. "అందుకని మా ఒంటెల మందలు మడ చెట్ల కోసం వెతుక్కుంటూ మరైన్ పార్క్ అంతటా తిరుగుతుంటాయి."

దేవభూమి ద్వారక జిల్లా , ఖంభాలియా తాలూకాలోని మరైన్ నేషనల్ పార్క్ వద్ద తన ఒంటెల మందల కోసం వెదుకుతోన్న జెఠాభాయ్ రబారి
ఎమ్ఎన్ పి & ఎస్ విస్తరించి ఉన్న 42 దీవులలో 37 దీవులు మరైన్ నేషనల్ పార్క్ కిందికి, మిగిలిన 5 దీవులు అభయారణ్యం ప్రాంతం కిందికి వస్తాయి. ఈ మొత్తం ప్రదేశమంతా గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్‌నగర్, దేవభూమి ద్వారక (జామ్‌నగర్ నుంచి 2013లో విడిపోయింది), మోర్బీ జిల్లాలలో విస్తరించి ఉంది.
"మేమంతా తరతరాలుగా ఇక్కడే నివాసముంటున్నాం," అంటారు మూసా జాట్. కరు మేరు లానే ఈయన కూడా మరైన్ పార్క్‌లో నివసించే ఫకిరాని జాట్ వంశానికి చెందినవారే. ఇదే పార్క్‌లో వీరితోపాటు భోపా రబారి (రెబారి అని కూడా పలకవచ్చు) అనే వంశానికి చెందిన సమూహం కూడా నివసిస్తోంది. జెఠాభాయ్ ఈ గోత్రానికి చెందినవారే. ఈ రెండు సమూహాలు సంప్రదాయక పశుపోషకులు. వీరినిక్కడ ' మాల్ ధారి 'లని పిలుస్తారు. గుజరాతీ భాషలో ' మాల్ ' అంటే జంతువులు, ' ధారి ' అంటే పోషకులు, లేదా వాటిని కలిగివున్నవారు. గుజరాత్ మొత్తంగా ఈ మాల్ ధారీలు ఆవులను, గేదెలను, ఒంటెలను, గుర్రాలను, గొర్రెలను పెంచుతుంటారు.
సుమారు 1200 మంది ప్రజలకు ఆవాసంగా ఉన్న మెరైన్ పార్క్ అంచున ఉన్న గ్రామాలలో నివసించే ఈ రెండు సమూహాల సభ్యులను నేను కలుస్తున్నాను.
"మేమీ భూమిని చాలా గౌరవిస్తాం," అంటారు మూసా జాట్. "కొన్ని తరాల క్రితం జామ్‌నగర్ రాజు ఇక్కడ నివాసముండాల్సిందిగా మమ్మల్ని ఆహ్వానించారు. 1982లో ఈ ప్రదేశాన్ని నేషనల్ పార్క్‌గా ప్రకటించడానికి చాలా ముందే!"

కచ్ అఖాతపు పాయలలోకి మేపు కోసం తన మందలను తోలుకుపోతున్న జెఠాభాయ్ రబారీ
భుజ్‌లో పశుపోషణ కేంద్రాన్ని నడుపుతోన్న ఎన్‌జిఒ సహజీవన్‌కి చెందిన ఋతుజా మిత్రా కూడా ఈ వాదనను బలపరుస్తున్నారు. "ఈ ప్రాంతానికి చెందిన ఒక యువరాజు తన కొత్తగా ఏర్పడిన నవనగర్ రాజ్యానికి- తరువాతి రోజుల్లో దీనినే 'జామ్‌నగర్' అని పిలిచారు -ఈ రెండు వంశాలకు చెందిన సమూహాలను తీసుకెళ్లాడని చెబుతుంటారు. ఇక అప్పటి నుంచి ఆ పశుపోషకుల వారసులు ఈ భూముల్లో నివాసం ఉంటున్నారు."
"ఇక్కడి కొన్ని గ్రామాల పేర్లు కూడా వీళ్ళిక్కడే చాలా కాలంగా ఉంటున్న విషయాన్ని సూచిస్తున్నాయి," అంటారు సహజీవన్‌లో అటవీ హక్కుల చట్టం రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేస్తోన్న ఋతుజ. అలాంటి ఒక గ్రామమే ఊంట్‌బేట్ శామ్‌పూర్. 'ఒంటెల దీవి' అని దీని అర్థం.
అదీగాక, ఒంటెలు ఈతకొట్టే ఒంటెలుగా మారాలంటే చాలా కాలం నుంచే అవిక్కడ ఉండివుండాలి. సస్సెక్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ పరిశోధకురాలు లైలా మెహతా చెప్తున్నట్లుగా : "ఒంటెలు సంప్రదాయకంగా మడ అడవులతో సహజీవనం చేయకపోయినట్లయితే అవి ఎలా ఈత కొట్టగలవు?"
ఎమ్ఎన్‌పి&ఎస్‌లో దాదాపు 1, 184 ఒంటెలు మేస్తుంటాయని ఋజుత మాతో చెప్పారు. ఈ ఒంటెలన్నీ 74 మాల్ ధారి కుటుంబాలకు చెందినవి.
ఒకప్పటి రాచరికపు రాజ్యమైన నవనగర్‌కు రాజధానిగా సా.శ. 1540లో జామ్‌నగర్ ఏర్పడింది. 17వ శతాబ్దంలో మొదటిసారిగా ఇక్కడకు వచ్చిన మాల్ ధారీలు అప్పటినుంచీ ఇక్కడే స్థిరపడ్డారు.

పోటువల్ల నీటి ప్రమాణం పెరగడంతో , మడ చెట్లవద్దకు ఈదుతున్న ఖారాయీ ఒంటెలు
వారు "ఈ భూమికి ఎందుకు విలువ ఇస్తున్నారు" అనేది అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు- ప్రత్యేకించి మీరు ఇక్కడి ఆశ్చర్యపరిచే సముద్ర వైవిధ్యాన్ని అర్థం చేసుకుని జీవించే సంచార పశుపోషకులైనప్పుడు. ఈ పార్కులో పగడపు దిబ్బలు, మడ అడవులు, ఇసుక బీచ్‌లు, చదునైన బురదభూములు, అఖాతపు పాయలు, రాళ్ళతో నిండిన తీరప్రాంతం, సముద్రపు గడ్డిదుబ్బులు, ఇంకా మరెన్నో ఉన్నాయి.
ఇండో-జర్మన్ బయోడైవర్సిటీ ప్రోగ్రామ్, జిఐజెడ్ ప్రచురించిన 2016 పరిశోధనా పత్రం లో ఈ పర్యావరణ ప్రాంతపు ప్రత్యేకతను చక్కగా నమోదు చేశారు. ఈ ప్రాంతంలో 200 రకాల చేపలు, 27 రకాల రొయ్యలు, 30 రకాల పీతలు, నాలుగు రకాల సముద్రపు గడ్డి కాకుండా, 100 రకాల ఆల్గే జాతులు, 70 రకాల స్పంజ్‌లు, 70 రకాల గట్టివీ, మృదువైనవీ అయిన పగడాలు కూడా ఉన్నాయి.
అలాగే ఈ జాబితా ఇంతటితో ముగిసేది కాదు. పత్రాలలో నమోదు చేసిన ప్రకారం: మీకు ఇక్కడ ఒక్కోటీ మూడేసి రకాల సముద్రపు తాబేళ్ళు, సముద్ర క్షీరదాలు, 200 కంటే ఎక్కువ రకాల నత్తలు, ఆక్టోపస్‌ల వంటివి, 90 రకాల ఆల్చిప్పలవంటి రెండు కవాటాల లోపల నివసించేవి, 55 రకాల పొట్టతో పాకే చిన్న జీవులు, 78 రకాల పక్షులు కూడా కనిపిస్తాయి.
ఇక్కడ ఫకిరానీ జాట్లు, రబారీలు తరతరాలుగా ఖారాయి ఒంటెలను పెంచిపోషిస్తున్నారు. ‘ ఖారాయి ’ అంటే గుజరాతీలో ‘ఉప్పనివి’ అని అర్థం. ఖారాయి ఒంటెలది మనం సాధారణంగా చూసే ఒంటెలు అలవాటైన దానికంటే చాలా భిన్నమైన పర్యావరణ ప్రాంతాన్ని విజయవంతంగా అలవాటు చేసుకున్న ఒక ప్రత్యేక జాతి. వాటి ఆహారంలో వివిధ మొక్కలు, పొదలు, ప్రత్యేకించి కరు మేరు జాట్ చెబుతున్న మడ చెట్లు చాలా ముఖ్యమైనవి.
ఈ జంతువులు - ఈత కొట్టడం తెలిసిన ఏకైక డ్రొమెడరీలు(ఒంటి మూపురం ఒంటెలు) - ఒక నిర్దిష్ట మాల్ ధారీ బృందంతోనో లేదా ఆ వంశానికి చెందిన పశుపోషకుల బృందంతోనో కలిసి ఉంటాయి. సాధారణంగా ఒంటెలతో పాటు ఈత కొట్టే ఇద్దరు మాల్ ధారీ పురుషులుంటారు. కొన్నిసార్లు వారిలో ఒకరు ఆహారం, తాగునీరు తీసుకురావడానికీ, గ్రామానికి వెళ్ళడానికీ ఒక చిన్న పడవను ఉపయోగిస్తారు. రెండో పశువుల కాపరి ఒంటెతో పాటే ద్వీపంలో ఉంటూ, తన తేలికపాటి భోజనాన్ని ఒంటె పాలతో ముగిస్తారు. ఒంటె పాలు వారి సముదాయపు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం.

ఖంభాలియాలో తమ ఒంటెలను మేపుకు తీసుకువెళ్ళి తిరిగివచ్చాక టీ తయారుచేసుకుంటోన్న జెఠాభాయ్ రబారి ( ఎడమవైపు ), దుదాభాయ్ రబారి
మాల్ ధారీలకు పరిస్థితులు చాలా వేగంగా కష్టతరంగా మారుతున్నాయి. "మమ్మల్నీ మా వృత్తినీ బతికించుకోవడం రాన్రానూ చాలా కష్టమైపోతోంది," అంటారు జెఠాభాయ్ రబారి. "అటవీ విభాగం ఆధిపత్యం క్రిందికి తీసుకువచ్చిన తర్వాత, మా పశువులు మేతమేసే ప్రాంతం నానాటికీ కుంచించుకుపోతోంది. ఇంతకుముందు మేం స్వేచ్ఛగా మడ చెట్లలోకి ప్రవేశించగలిగేవారం. 1995 నుండి మేపును నిషేధించారు. మరోవైపు ఉప్పుచిప్పలు మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాయి. ఇంకోవైపు వలసపోయే దారిలేదు. అన్నిటికీ మించి- అతిగా మేపుతున్నామనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాం. అసలది ఎలా సాధ్యం?"
ఈ పశుపోషకులు చెప్తున్న దాన్ని ఈ ప్రాంతంలోని ఎఫ్ఆర్ఎలో దీర్ఘకాలం పనిచేసిన ఋతుజ మిత్ర బలపరుస్తున్నారు. “ఒంటెలు మేసే(లేదా తిరుగుతూ మేసే) విధానాన్ని పరిశీలిస్తే, అవి మొక్కల జాతులను పై నుండి తింటూరావడానికి మొగ్గు చూపుతాయి. ఇది వాస్తవానికి తిరిగి చిగుళ్ళు రావడానికి సహాయపడుతుంది! మరైన్ నేషనల్ పార్క్ బేటలు (ద్వీపాలు) అంతరించిపోతున్న ఖారాయి జాతి ఒంటెలకు ఎల్లప్పుడూ అమిత ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నాయి. అవి మడ చెట్లనూ, వాటి అనుబంధ జాతి మొక్కలనూ తింటాయి."
అయితే అటవీ శాఖ మరోవిధంగా భావిస్తోంది. ఈ శాఖ రచించిన కొన్ని పత్రాలు, కొంతమంది విద్యావేత్తలు కూడా ఒంటెలు మేసే విధానం 'అతిగా మేపడానికి' దారితీస్తుందని నిరూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
2016లోని ఒక పరిశోధనా పత్రం ఎత్తి చూపినట్లుగా, మడ అడవులు నాశనం కావడానికి అనేక కారణాలున్నాయి. ఇది పారిశ్రామికీకరణ పతనం కావడం, మరిన్ని ఇతర కారణాలతో ముడిపడివుంది. ఆ అడవుల కోతకు కారణంగా మాల్ ధారీ లను గానీ, ఒంటెలను గానీ ఈ పరిశోధన పత్రం ఎక్కడా నిందించలేదు.
ఆ అనేక కారణాలు చాలా ప్రత్యేకమైనవి
ఈత తెలిసిన ఒంటి మూపురం ఒంటెలైన ఖారాయి ఒంటెలు వాటి యజమానులైన ఒక నిర్దిష్టమైన మాల్‌ధారి సముదాయానికి చెందిన పశుపోషకుల బృందంతో కలిసి ఉంటాయి
జామ్‌నగర్, దాని పరిసర ప్రాంతాలు 1980ల నుండి కొంత పారిశ్రామికీకరణను చవిచూశాయి. "ఈ ప్రాంతాల్లో ఉప్పు పరిశ్రమల, చమురు జెట్టీల, ఇంకా ఇతర పారిశ్రామికీకరణ ప్రభావం ఉంది" అని ఋతుజ అభిప్రాయపడ్డారు. “భూమిని తమ ఉపయోగం కోసం మళ్లించడంలో వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు - అది వారి వ్యాపార సౌలభ్యం కోసం! కానీ పశుపోషకుల జీవనాధారమైన వృత్తి విషయానికి వస్తే ఈ విభాగం పరిరక్షణవాదంగా మారుతుంది. ఇది యాదృచ్ఛికంగా, 'ఏదైనా వృత్తిని అభ్యసించే లేదా ఏదైనా వృత్తి, వాణిజ్యం లేదా వ్యాపారాన్ని కొనసాగించే' హక్కుకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(జి)కి విరుద్ధంగా నడుస్తుంది.
మెరైన్ నేషనల్ పార్క్ లోపల పశువుల మేపును నిషేధించడంతో, ఒంటెల కాపరులు తరచుగా అటవీ శాఖ నుండి వేధింపులను ఎదుర్కొంటారు. అలా బాధపడిన మాల్ ధారీ లలో ఆదమ్ జాట్ కూడా ఉన్నారు. "రెండు సంవత్సరాల క్రితం, ఇక్కడ ఒంటెలను మేపుతున్నందుకు అటవీ అధికారులు నన్ను అదుపులోకి తీసుకున్నారు. నేను రూ. 20,000 జరిమానాగా చెల్లించాను.” అన్నారతను. ఇక్కడ ఉన్న ఇతర పశుపోషకులు కూడా ఇలాంటి అనుభవాల గురించే చెబుతారు.
"2006 నాటి కేంద్ర ప్రభుత్వ చట్టం ఇప్పటికీ ఎటువంటి సహాయం చేయటంలేదు" అని ఋతుజా మిత్రా చెప్పారు. అటవీ హక్కుల చట్టం 2006, సెక్షన్ 3(1)(డి) ప్రకారం, పశువుల మేతకు (స్థిరపడిన లేదా అస్థిరమైనవాటికి కూడా), సంచార, పశుపోషక తెగలకు సంప్రదాయ కాలానుగుణ అటవీ వినియోగ హక్కులను మంజూరు చేశారు.
“ఏదేమైనప్పటికీ, ఒంటెలను మేపినందుకు ఫారెస్ట్ గార్డులు ఈ మాల్ ధారీల కు జరిమానా విధిస్తుంటారు. పట్టుబడినప్పుడు తరచుగా రూ. 20,000 నుండి రూ. 60,000 వరకూ వీరు జరిమానాలు కడతారు” అని ఋతుజ చెప్పారు. అటవీ హక్కుల చట్టం కింద ఏర్పాటు చేసిన వివిధ రక్షణలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆమె అన్నారు.
తరతరాలుగా ఇక్కడ నివసిస్తున్న, ఈ సంక్లిష్టమైన ప్రాంతాన్ని అందరికంటే బాగా తెలిసిన పశుపోషకులను చేర్చకుండా మడ అడవులను విస్తరించడానికి చేసే ప్రయత్నం ఫలితం లేనిదిగా అనిపిస్తుంది. "మేము ఈ భూమిని అర్థం చేసుకున్నాం, జీవావరణ శాస్త్రం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నాం. జంతుజాలాన్నీ, మడ అడవులనూ రక్షించడానికి చేసే ప్రభుత్వ విధానాలకు కూడా మేం వ్యతిరేకం కాదు" అని జగభాయ్ రబారి చెప్పారు. “మేము అడిగేది ఒక్కటే: దయచేసి ఏవైనా విధానాలు రూపొందించే ముందు మా మాట వినండి. లేదంటే ఈ ప్రాంతంలో నివసిస్తోన్న దాదాపు 1,200 మంది జీవితాలతో పాటు అన్ని ఒంటెల జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయి..."

వాయువ్య సౌరాష్ట్ర ప్రాంతంలోని మెరైన్ నేషనల్ పార్క్ మరియు అభయారణ్యంలోని చిక్కటి మడ అడవులు

మేస్తున్న ఒంటెలతో పాటు ఈదుకుంటూ వెళ్ళే భిఖాభాయ్ రబారి

థర్మోకోల్ తో తయారుచేసుకున్న ఈత పరికరంతో జామ్ నగర్ జిల్లా , జోడియా తాలూకాకు చెందిన ఆదమ్ జాట్ . తన ఒంటెలతో పాటు ఈత కొట్టడానికి ఈ పరికరం అతనికి సహాయపడుతుంది

సమీపంలోని ద్వీపాన్ని ఈదుకుంటూ చేరుకోవడానికి నీటిలోకి దూసుకుపోతోన్న అద్భుతమైన ఖారాయి ఒంటెలు

ఖారాయి ఒంటెలు ఈత కొట్టడం తెలిసిన ఏకైక ఒంటి మూపురం ఒంటె జాతి . ఇవి ఒక్క రోజులో 3 నుండి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు

సముద్ర వృక్షజాలం కోసం ఒంటెలు మెరైన్ నేషనల్ పార్క్ ద్వీపాలలో ఈత కొడతాయి

ఒంటెలకు దగ్గరగా ఈత కొడుతున్న జెఠాభాయ్ రబారీ కొడుకు హరి . ' నాకు ఒంటెలతో పాటు ఈత కొట్టడమంటే చాలా ఇష్టం . చాలా సరదాగా ఉంటుంది !'

తన ఖారాయి ఒంటెలతో ఆదమ్ జాట్ . ఈ ప్రాంతంలో వాటి కదలికలు , అవి మొక్కలను తినే విధానం సముద్ర వృక్షాల పునరుత్పత్తికి సహాయపడతాయి

సముద్ర వృక్షసంపద కోసం వెతుకుతోన్న పూర్తిగా ఎదిగిన ఖారాయి ఒంటె

ఒంటెలు ఇతర పశుపోషకులతో పాటు ఒడ్డుకు చేరిన తర్వాత , జోడియా తాలూకాలోని తమ గ్రామానికి పడవలో తిరిగి వస్తున్న ఆదమ్ జాట్ ( ఎడమ ), అతని సముదాయానికే చెందిన మరో వ్యక్తి

జామ్ నగర్ జిల్లాలోని మెరైన్ నేషనల్ పార్క్ ప్రాంతంలో నివసించే ఫకిరాని జాట్ సముదాయానికి చెందిన ఆదమ్ జాట్ . ఈయనకు 70 ఖారాయి ఒంటెలున్నాయి

జోడియా తాలూకాలోని బాలంభా గ్రామంలో తన ఇంటి ముందు కూర్చునివున్న ఆదమ్ జాట్ . ' ఎన్నో తరాలుగా మేం ఇక్కడే జీవిస్తున్నాం . అయినా ఒంటెలను మేపుకోవడం కోసం మాకెందుకీ వేధింపులు ?'

జెఠాభాయ్ కుటుంబానికి ఒకప్పుడు 300 ఖారాయి ఒంటెలుండేవి . ‘ నా దగ్గర ఇప్పుడు 40 ఒంటెలు మాత్రమే మిగిలాయి ; చాలా ఒంటెలు చనిపోయాయి . ఈ వృత్తి ఇకపై నిలకడగా ఉండదు '

మాటల్లో మునిగివున్న దుదాభాయ్ రబారీ ( ఎడమ ), జెఠాభాయ్ రబారీ . ' మెరైన్ నేషనల్ పార్క్ విధించిన నిబంధనల వల్ల మేమిద్దరం చాలా ఇబ్బందులు పడుతున్నాం . కానీ వీటన్నింటి మధ్యలోనే బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం .' అంటున్నారు దుదాభాయ్ రబారీ

ఎగసిపడే అలలు సద్దుమణగటంతో , వెనక్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న జెఠాభాయ్

జగాభాయ్ రబారీ , అతని భార్య జివీబెన్ ఖంబాలాలకు 60 ఒంటెలు ఉన్నాయి . ' వాటిపైనే నా జీవనోపాధి ఆధారపడి ఉంది . అవి సంతోషంగా , ఆరోగ్యంగా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను .' అంటారు జగాభాయ్

ఫోటోలు తీయడానికి స్మార్ట్ ఫోన్ ని పట్టుకున్న మాల్ ధారీ బాలుడు ; ఫోన్ వెనుకభాగమంతా అతను గీసిన చిత్రాలతో అలంకరించి ఉంది

ఖంభాలియా తాలూకాలోని బేహ్ గ్రామంలో ఉన్న దేవి ఆలయం . ఒంటెలనూ , వాటి కాపరులనూ కాపాడుతుందని ఖోపా రబారీలు నమ్మే దేవిని పూజించే ప్రదేశం

మెరైన్ నేషనల్ పార్క్ మరియు అభయారణ్యాలలో దాదాపు 1,180 ఒంటెలు మేత మేస్తాయి
ఈ కథనాన్ని నివేదించే సమయంలో తన నిపుణతనీ, సహాయాన్నీ అందించిన సహజీవన్ వారి ఒంటెల కార్యక్రమం మాజీ సమన్వయకర్త మహేంద్ర భనానీకి రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
సెంటర్ ఫర్ పాస్టొరాలిజం మంజూరు చేసిన ఇండిపెండెంట్ ట్రావెల్ గ్రాంట్ ద్వారా రితాయన్ ముఖర్జీ పాస్టోరల్ మరియు సంచార కమ్యూనిటీల గురించి నివేదిస్తున్నారు. ఈ నివేదికలోని కంటెంట్‌పై ఈ కేంద్రం ఎటువంటి సంపాదకీయ నియంత్రణను పాటించలేదు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి