`పీపుల్స్ ఆర్కీవ్ ఆఫ్ రూర‌ల్ ఇండియా`(PARI) ఇవ్వాళ్టికి ఏడేళ్లు పూర్తిచేసుకుంది. క‌రోనా, లాక్‌డౌన్ వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా మేము మా బాధ్య‌త‌ను ఆప‌కుండా నిర్వ‌ర్తించాం.

పోయినేడాది లాక్‌డౌన్ ప్రారంభ‌మైన తొలి రోజే, భార‌త ప్ర‌భుత్వం ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాల‌ను ఒక ముఖ్య‌మైన సేవ‌కు సాయం కావాల‌ని కోరింది. ప్ర‌భుత్వం నుంచి ఇలాంటి విజ్ఞ‌ప్తి రావ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే. భార‌తీయులు పాత్రికేయుల‌ను, పాత్రికేయ‌త‌నూ ఎప్పుడూ ఒక అవ‌స‌రంగా భావించ‌లేదు. జ‌ర్న‌లిస్టుల జీవితాలు జ‌న‌జీవితంతో ఎలా పెనవేసుకుపోయాయి; వారి జీవనోపాథి గురించి చెప్పాలంటే బోలెడు క‌థ‌లున్నాయి. దేశ‌వ్యాప్తంగా పెద్ద మీడియా సంస్థ‌లు రెండు నుంచి రెండున్న‌ర వేల‌మంది జ‌ర్న‌లిస్టులు, ప‌దివేల‌కు పైగా జ‌ర్న‌లిజంతో ముడిప‌డిలేని మీడియా సంస్థ‌ల ఉద్యోగులను వివిధ కార‌ణాలు చెప్తూ తమ సంస్థల నుండి బ‌య‌టికి పంపాయి. మ‌రి ఈ ప్ర‌శ్న‌కు ఆ సంస్థ‌లు ఏం జ‌వాబు చెప్ప‌గ‌ల‌వు?

మ‌రి మీడియా సంస్థ‌లు ఇలా ముఖ్యమైన క‌థ‌ల్ని ఎలా ప్ర‌సారం చేయ‌గ‌లవు?  వారికున్న `బెస్ట్ జ‌ర్న‌లిస్టు`ల‌ను  ఉద్యోగాలనుండి తొలగించాయెందుకని?  ఒకవేళ తొలిగించక పొతే వారి వేత‌నాల్లో 40 నుంచి 60 శాతం ఎందుకు కోత విదించాయి? జ‌ర్న‌లిస్టుల ప్ర‌యాణాల‌పై కూడా చాలా సంస్థ‌లు నిషేధాలు విధించాయి. ఇందుకు కార‌ణం వారి ఆరోగ్యాల‌ను కాపాడ‌డం కోసం కాదు, కేవ‌లం సంస్థ‌లు త‌మ ఖ‌ర్చుల్ని త‌గ్గించుకోవ‌డమే.

PARI ఏప్రిల్‌, 2020 నుంచి త‌న ఉద్యోగుల్లో ఏ ఒక్క‌రినీ తొల‌గించ‌లేదు. పైగా మ‌రో ప‌ద‌కొండు మంది ఉద్యోగుల‌ను అద‌నంగా చేర్చుకుంది. ఆగ‌స్ట్ 2020లో దాదాపు త‌న ఉద్యోగులంద‌రికీ ప్ర‌మోష‌న్లు, ఇంక్రిమెంట్ల‌ను అందించింది కూడా.

PARI అద్భుతమైన నివేదికలు అందిస్తూనే, కోవిడ్ విప‌త్క‌ర ప‌రిస్థితుల స‌మ‌యంలో 270కి పైగా (వీటిలో ఎక్కువ భాగం మ‌ల్టీమీడియావి) క‌థ‌నాల్ని , ముఖ్యమైన డాక్యూమెంట్లని ప్ర‌చురించింది. ఇవ‌న్నీ లాక్‌డౌన్ స‌మ‌యాల్లో గ్రామీణుల జీవ‌న చిత్రాల్ని ప్ర‌తిబింబిస్తూ ప్ర‌చురించిన‌వే. ఈ క‌థ‌నాల‌న్నీ 23 రాష్ట్రాలు, దేశంలోని అన్ని ప్ర‌ధాన గ్రామాలు, ప‌ట్ట‌ణాల నుంచి ఎన్నో క‌ష్టాల‌కోర్చి, వంద‌ల కిలోమీట‌ర్లు న‌డుస్తూ వ‌ల‌స‌పోతున్న పేద ప్ర‌జ‌ల్ని దృష్టిలో పెట్టుకుని రాసిన‌వే. ఈ క‌థ‌నాల‌న్నీ 65 మందికిపైగా విలేక‌రుల పేర్ల‌తో స‌హా ప్ర‌చురించిన‌వని మీరు గుర్తించ‌వ‌చ్చు. PARI  క‌రోనా కాలానికి చాలా ఏళ్లకు పూర్వం నుంచే ప్ర‌ధానంగా వ‌ల‌స కార్మికుల జీవ‌నోపాథి పై నివేదిస్తోంది. అంతేగాని మార్చి 25, 2020 త‌ర్వాత హఠాత్తుగా వీరిని కనిపెట్టి క‌థ‌నాల‌ను రాయడం మొదలుపెట్టలేదు.

ఇదంతా మా పాఠ‌కుల‌కు తెలుసు; తెలియ‌నివారి కోసమే ఇదంతా  విశ‌దీక‌రిస్తున్నాం.  జ‌ర్న‌లిజాన్ని, జీవ‌నోపాధినీ కేంద్రంగా చేసుకుని గ్రామీణ భార‌త‌దేశ‌పు ముఖచిత్రాన్ని ప‌లు క‌థ‌నాలు, నివేదిక‌లు, ఫొటోలు, వీడియోలతో చూపించిన‌ అతిపెద్ద ఆన్‌లైన్ స‌మాచార నిక్షేపం PARI. 83.3 కోట్ల‌మంది గ్రామీణుల జీవితాల‌ను వారి గొంతులు, వారి అనుభ‌వాల‌ నుంచే వినిపించ‌డం ద్వారా  ప్ర‌తిరోజూ ప్ర‌జ‌ల రోజువారీ జీవితాల్ని, వారి దైనందిన అనుభ‌వాల‌ను నిక్షిప్తం చేయ‌డ‌మే PARI ముఖ్యోద్దేశం.

PHOTO • Zishaan A Latif
PHOTO • Shraddha Agarwal

మహారోగ - లాక్‌డౌన్‌ల సమయంలో మేము PARIలో అత్యుత్తమ పనిచేయగలిగాము, ఇందులో మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం (ఎడమ)పై అవార్డు గెలుచుకున్న సిరీస్, ఇటీవలే రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనల (కుడి) వివరణాత్మక కవరేజీ ఉన్నాయి

PARI త‌న తొలి 84 నెల‌ల కాలం లోనే 42 అవార్డుల‌ను గెలుచుకుంది. అంటే స‌గ‌టున ప్ర‌తి 59 రోజుల‌కూ ఒక అవార్డు. వీటిలో 12 అంత‌ర్జాతీయ అవార్డులు కావ‌డం గుర్తించాల్సిన విష‌యం. అంతేకాదు; లాక్‌డౌన్ స‌మ‌యాల్లో కూడా PARI ప్ర‌చురించిన క‌థ‌నాల్లో 16 అవార్డులు ల‌భించాయి. `యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్` PARI క‌థ‌నాల్ని త‌మ అంత‌ర్జాతీయ వెబ్ ఆర్కీవ్స్‌లో చేర్చేందుకు అంగీక‌రించింది. ఏప్రిల్‌, 2020న ఈ విష‌యాల్ని ప్ర‌స్తావిస్తూ మాకు పంపిన లేఖ‌లో `ముఖ్య‌మైన స‌మాచార సేక‌ర‌ణ‌లో మీ వెబ్‌సైట్‌ ఒక చారిత్ర‌క రికార్డును నెల‌కొల్పింది` అని ఆ సంస్థ పేర్కొంది.

దేశంలోని 12 రాష్ట్రాల్లో, ` స్త్రీ పునరుత్పత్తి ఆరోగ్యం ` అంశం మీద PARI ప్ర‌చురించిన వ్యాసాల ప‌రంప‌రకు కూడా అవార్డులు ల‌భించాయి. ఈ వ్యాసాల‌న్నీ ప్ర‌ధానంగా మ‌హిళా హ‌క్కుల‌సాధ‌న అంశంలో దేశం మ‌రీ పేల‌వంగా వున్న విష‌యాన్ని ప‌ట్టి చూపిన‌వి. ఈ సిరీస్‌లో భాగంగా PARI ప్ర‌చురించిన 37 క‌థ‌నాల్లో 33 క‌రోనా భ‌యావ‌హ ప‌రిస్థితులు, లాక్‌డౌన్‌ల కాలంలోనే ప్ర‌చురిత‌మ‌య్యాయి. మ‌హిళ‌ల‌కు ఆరోగ్య‌హ‌క్కు అంశంపై గ్రామీణ మ‌హిళ‌లు త‌మ సొంత‌గొంతుల‌తో చెప్పిన అనేక విష‌యాల్ని పొందుప‌రుస్తూ తొట్ట‌తొలి జాతీయ‌స్థాయి జర్న‌లిస్టిక్ స‌ర్వే చేసింది PARI మాత్రమే.

అత్యంత క్లిష్ట‌మైన స‌మ‌యాల్లో మేము ప్ర‌చురించిన క‌థ‌నాలను చక్టివే పాఠకుల సంఖ్య 150 శాతం పెరిగింది. అలాగే, ఇన్‌స్టాగ్రామ్ త‌దిత‌ర‌ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫారాల‌పై 200 శాతం పెరిగింది. మ‌రీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మా క‌థ‌నాలు చ‌దివిన‌వారు ప‌దుల ల‌క్ష‌ల రూపాయ‌ల్ని నేరుగా స‌మ‌స్య‌ల ప్ర‌భావిత వ్య‌క్తుల‌కు అంద‌జేశారు. ఇది మేము సాధించిన గొప్ప విజ‌యంగా భావిస్తాం.

వీటితోపాటు మ‌రోవైపు, ప్ర‌భుత్వం తాజాగా ర‌ద్దు చేసిన కొన్ని వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తూ రైతులు చేస్తున్న పోరాటాల‌ పై 25 మంది రిపోర్ట‌ర్లు, 10 మంది ఫొటోగ్రాఫ‌ర్ల‌తో కూడిన‌ మా బృందం PARI వెబ్‌సైట్లో 65 స‌మ‌గ్ర క‌థ‌నాల‌ను ప్ర‌చురించింది. ఇవేవీ మీకు ‘ప్ర‌ధాన‌స్ర‌వంతి’ వార్తా మాధ్య‌మాల‌లో క‌నిపించ‌వు. కేవ‌లం ఢిల్లీ లోనే కాదు, అరడజను ఇత‌ర రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాలలోనూ ఇదే ప‌రిస్థితి.

ఈ చరిత్రాత్మక ఉద్యమంలో పాల్గొన్న రైతులెవ‌రు, వారంతా ఎక్క‌డెక్క‌డినుంచి వ‌చ్చారు; వారి రాష్ట్రాల్లో వ్య‌వ‌సాయ ప‌రిస్థితులెలా వున్నాయి; వారి ప్ర‌స్తుత‌ డిమాండ్లేమిటి; కుటుంబాల‌తో స‌హా, లేక కుటుంబాల్ని వ‌దిలిపెట్టి వారంతా ఢిల్లీ దాకా వ‌చ్చి ఏడాదిపాటు ఇక్క‌డే ఎందుకుండవలసి వ‌చ్చింది; ఎటువంటి ప‌రిస్థితులు వారిని ఇందుకు ప్రేరేపించాయి? వంటి అనేక‌ అంశాల‌పై PARI నివేదించింది. ఈ రైతులెవ‌రూ లాబీయిస్టులు కాదు, కాబ‌ట్టి వీరి గొంతుల‌కు ఎక్క‌డా అంతగా స్పంద‌న‌ క‌నిపించ‌దు. ఇక్క‌డే PARI త‌న విభిన్న‌త‌ను, రైతుల త‌ర‌పున త‌న నిబ‌ద్ధ‌త‌ను చాటుకుంది. ఇటువంటి అతిపెద్ద‌, ప్ర‌శాంత‌, ప్ర‌జాస్వామిక ఆందోళ‌న‌ను ప్ర‌పంచం గ‌తంలో ఎప్పుడూ చూసివుండ‌దు. అది కూడా కోవిడ్ వంటి పెనువిప‌త్తుల‌కు మ‌ధ్య‌కాలంలో ప్రారంభమైన ఉద్య‌మం కావ‌డం మ‌రింత ఉత్కంఠ‌ను రేపింది.

PHOTO • Vandana Bansal

PARI యొక్క విస్తృతమైన అనువాదాలతో, విభిన్న నేపథ్యాల విద్యార్థులు కూడా పాఠకులుగా మారి మా కథనాలను బహుళ భాషల్లో (ఎడమవైపు) చదవగలరు. ఒక సంవత్సర కాలంలోనే, PARI ఎడ్యుకేషన్ 63 ప్రదేశాల నుండి విద్యార్థులచే 135 కథనాలను (కుడివైపు) ప్రచురించింది

డిసెంబ‌ర్‌, 2014లో ఇంగ్లీష్‌లో ప్రారంభ‌మైన PARI వెబ్‌సైట్ ఇప్పుడు ఏక‌కాలంలో 13 భాష‌ల్లో ప్ర‌చురిత‌మ‌వుతోంది. మ‌రికొన్ని భాష‌లు కూడా త్వ‌ర‌లోనే ఈ జాబితాలో చేరుతాయి. మేము సమానత్వాన్ని విశ్వసిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మేము ప్ర‌చురించే ప్ర‌తి క‌థ‌నం అన్ని 13 భాష‌ల్లో అందుబాటులో వుండాల‌ని కోరుకుంటున్నాం. అన్ని భార‌తీయ భాష‌లూ గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు సుల‌భంగా అర్థ‌మ‌వుతాయి. అన్ని భారతీయ భాషలు మన భాషలే . ఇప్పుడు మేము ఎక్క‌డైనా, ఏ వెబ్‌సైట్‌కైనా ఉప‌యోగ‌ప‌డే అతిపెద్ద అనువాద ప్రోగ్రామ్‌ను రూపొందించుకున్నాం. మా అనువాదకుల్లో వైద్యులు, భౌతిక శాస్త్రవేత్తలు, భాషావేత్తలు, కవులు, గృహిణులు, ఉపాధ్యాయులు, కళాకారులు, పాత్రికేయులు, రచయితలు, ఇంజనీర్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా వున్నారు. ఈ బృందంలో 22 నుంచి 84 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న‌వారున్నారు. వీరిలో కొందరు విదేశాల నుంచి కూడా ప‌నిచేస్తున్నారు. మ‌రికొంద‌రు దేశంలోని వివిధ గ్రామీణ‌, కుగ్రామీణ ప్రాంతాల్లో కూడా వున్నారు. వీరిలో కొంద‌రికైతే ఇంట‌ర్‌నెట్ స‌దుపాయం కూడా స‌రిగ్గా అంద‌దు.

PARI వెబ్‌సైట్‌ను ఉచితంగానే సంద‌ర్శించ‌వ‌చ్చు. చందా రుసుములంటూ ఏమీ వుండ‌వు. చెల్లింపు వార్త‌లు, వండివార్చిన‌ క‌థ‌నాలేవీ వుండ‌వు. అలాగే, వెబ్‌సైట్‌లో ఎక్క‌డా ఒక్క ప్ర‌క‌ట‌న కూడా వుండ‌దు. ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు, అనుచిత‌, కృత్రిమ అవ‌స‌రాల కోసం న‌డుస్తున్న వెబ్‌సైట్లు బోలెడున్నాయి. ఇవ‌న్నీ యువ‌త‌ను ఆక‌ర్షించ‌డం కోస‌మే ప‌నిచేస్తున్నాయి. మళ్లీ ఇంకొకటి తీసుకురావడమెందుకు? ద‌రిదాపు 60 శాతం మంది మా పాఠ‌కులు 34 కంటే త‌క్కువ వ‌య‌సున్న‌వారు. 60 శాతం మంది 18-24 ఏళ్ల మ‌ధ్య‌వ‌య‌సున్న‌వారు. వీరి కోస‌మే మేము ఇంత‌మంది రిపోర్ట‌ర్లు, ఫొటోగ్రాఫ‌ర్ల‌ను క‌లుపుకుంటూ ముందుకు సాగుతున్నాం.

మా విభాగాల్లో అతి చిన్న‌దీ, కేవ‌లం ఏడాది వ‌య‌సున్న ` PARI ఎడ్యుకేష‌న్‌ ` అతివేగంగా విస్త‌రించి, మా ప‌నితీరుకు మ‌రింత వ‌న్నెతెచ్చింది. భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ఉప‌యోగ‌ప‌డే పాఠ్య‌పుస్త‌కాల‌ను రూపొందించ‌డం దీని ప్ర‌ధాన బాధ్య‌త‌. ఇందుకోసం 36 మందికి పైగా వృత్తి నిపుణులు ప‌నిచేస్తున్నారు. గ్రామీణ భార‌త్ గురించి తెలుసుకోవ‌డానికి ప‌నికొచ్చే ఒక `పారి` పాఠ్య‌పుప్త‌కాన్ని ఇప్ప‌టికే 95 విద్యాసంస్థ‌లు, 17 సంస్థ‌లు వినియోగిస్తున్నాయి. వీటిలో 36 సంస్థ‌లు PARI రూపొందించిన క‌రికులంను అల్పాదాయ, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌ ప్ర‌జ‌ల‌కు నేరుగా చేర‌వేస్తున్నాయి.  `PARI ఎడ్యుకేష‌న్‌` ఇప్ప‌టికే 63 ప్రాంతాల నుంచి 135 మంది విద్యార్థుల రిపోర్టుల‌ను ప్ర‌చురించింది. ఇవ‌న్నీ వ్య‌వ‌సాయం, జీవ‌నోపాధి క‌నుమ‌రుగవుతుండ‌డం, లింగ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, మ‌రికొన్ని ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై రూపొందించిన‌వి. ఇక, జ‌న‌వ‌రి 21 నుంచి ఈ విభాగం 120కి పైగా ఆన్‌లైన్ చ‌ర్చ‌ల్ని, వ‌ర్క్‌షాపుల‌ను ... భార‌త్ లోని ఉన్న‌త స్థాయి విశ్వ‌విద్యాల‌యాలు మొద‌లుకుని కుగ్రామాల ప‌రిధి లోని పాఠ‌శాల‌ల వ‌ర‌కూ చేర్చింది.

`PARI ` దృష్టిలో `గ్రామీణ` అంటే భార‌త‌దేశ‌పు దేశ‌వాళీ కాల్ప‌నిక‌తో; లేదా, ఆక‌ర్ష‌ణ‌ల‌తో నిండిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలో;  లేదా, పాత జ్ఞాప‌కాలు, అనుభ‌వాల్ని నెమ‌రేసుకోవ‌డమో కాదు. PARI ప్ర‌యాణ‌మంతా భిన్న వైరుధ్యాలు,  అనేక మిన‌హాయింపుల‌ మీద నిర్మించ‌బ‌డ్డ గ్రామీణ భార‌త‌దేశాన్ని ఆవిష్క‌రించ‌డం కోస‌మే. అందమైన‌, తెలివైన‌; క‌్రూర‌మైన, అనాగ‌రిక‌మైన స‌మాజాన్ని క‌ళ్ల‌కు క‌ట్ట‌డం కోస‌మే! PARI త‌న‌తో క‌లిసి పనిచేసేవారితో నిరంత‌రాయంగా న‌డిచే విద్యావ్య‌వ‌స్థ‌. అందువ‌ల్లే మా క‌థ‌నాల‌ను వారి గొంతుకల‌తో వారి క‌ఠోర అనుభ‌వాల్ని ఆధారం చేసుకుని రాసిన‌వై వుంటాయి. ఈ కారణంతోనే మా కథనాలన్నీ వారి సజీవ అనుభవాలను వారి స్వంత స్వరాలతో ప్రస్తుత జీవన పరిస్థితుల గురించి చెబుతున్నాము.

PHOTO • Rahul M.
PHOTO • P. Sainath

అవార్డు గెలుచుకున్న వాతావరణ మార్పు సిరీస్ (ఎడమ) రోజువారీ వ్యక్తుల గొంతుకలతో వారి ప్రత్యక్ష అనుభవాలాను నివేదిస్తుంది. అంతేగాక భారతదేశంలోని చివరి సజీవ స్వాతంత్య్ర సమరయోధులపై (కుడి) మా ప్రత్యేక విభాగాన్ని కొనసాగిస్తున్నాము

వాతావ‌ర‌ణ మార్పుల‌పై మేము ప్ర‌చురించిన వ్యాసాల పరంప‌ర త్వ‌ర‌లోనే యుఎన్‌డిపి ద్వారా విడుద‌ల కాబోతోంది. ఈ సిరీస్‌లోని క‌థ‌నాలు కూడా ప‌లు అవార్డుల‌నందుకున్న‌వే. ఇవ‌న్నీ రైతులు, కార్మికులు, జాల‌రులు, గిరిజ‌నులు, సముద్రపు కలుపును తీసేవారు, సంచార తెగ‌ల‌కు చెందిన ప‌శువుల కాప‌ర్లు, తేనె సేక‌రించేవారు; కీట‌కాలు, పురుగుల్ని ప‌ట్టుకునేవారు- ఇలాంటి భిన్న నేప‌థ్యాల నుంచి వ‌చ్చిన‌వారి జీవ‌నక‌థ‌లే. ఇంకా, పెళుసుగా వుండే కొండ చ‌రియ‌ల వాతావ‌ర‌ణాల్లో, అడ‌వులు, స‌ముద్రాలు, తీర‌ప్రాంతాలు, న‌దీ ప్రాంతాలు, ప‌గ‌డ‌పు కొండ‌ ద్వీపాలు, ఎడారులు; శుష్క‌, పాక్షిక శుష్క వాతావ‌ర‌ణాల‌లో నివ‌సించేవారి గాథ‌లే.

నైరూప్యంగా వ్య‌వ‌హ‌రించే సంప్ర‌దాయ మీడియా సంస్థ‌లు పాఠ‌కుల్ని వాస్త‌వాల‌కు దూరం చేస్తాయి. వాతావ‌ర‌ణ మార్పుల‌కు కార‌ణం - అంటార్కిటికా భూమిప‌ల‌క‌లు క‌దిలిపోవ‌డ‌మ‌ని, అమెజాన్ అడ‌వులు నాశ‌నం అవుతుండ‌డ‌మ‌ని, ఆస్ట్రేలియాలో పొద‌మంట‌ల‌నీ ఇలా ప‌లు కార‌ణాలు చెప్తుంటారు. ప్ర‌భుత్వ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో జ‌రిపే సంప్ర‌దింపుల్లో భాగంగా వారిచ్చే ఐపీసీసీ నివేదిక‌లు చాలా ముఖ్య‌మైన‌వే; కానీ ఇవి ఎవ‌రికీ అర్థం కావు. PARI రిపోర్ట‌ర్లు ప్రేక్ష‌కుల‌కు పాఠ‌కుల‌కు ఈ విష‌యాల్ని క‌థ‌ల రూపంలో చెప్తారు. ప‌ర్యావ‌ర‌ణంతో వారు ఎలా అనుసంధానమ‌య్యారు; వాతావ‌ర‌ణ మార్పులు వారి సొంత జీవితాల మీద ఎలాంటి దుష్ప్ర‌భావాల్ని చూపిస్తున్నాయో  వారిక‌ర్థ‌మ‌య్యే భాష‌లో తెలియ‌జేస్తారు.

భార‌తదేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవ‌త్స‌రాలైంది. స్వ‌ర్ణోత్స‌వాలు జ‌రుపుకున్నాం. ఈ సంద‌ర్భంగా PARI జ‌ర్న‌లిస్టులు ఇంకా జీవించివున్న కొంద‌రు స్వ‌తంత్ర‌యోధులతో ప్ర‌త్యేక ఇంట‌ర్‌వ్యూలు జ‌రిపారు. ఇవ‌న్నీ PARI వెబ్‌సైట్‌లో టెక్ట్స్‌, ఆడియో, వీడియోల రూపంలో అందుబాటులో వున్నాయి. కొంచెం అటూఇటూగా 5 నుంచి 7 సంవ‌త్స‌రాల త‌రువాత వ‌చ్చే పిల్ల‌ల త‌రానికి ఈ దేశ స్వాతంత్య్రం కోసం నిజాయితీగా ప‌నిచేసిన ఇలాంటి యోధుల గురించి ఏమాత్రం తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ, PARI ద్వారా రేపటి పౌరులు ఇప్పుడు వారిని చూడ‌గ‌ల‌రు; విన‌గ‌ల‌రు; ఇంకా స్వ‌తంత్ర పోరాటం గురించి వారి సొంత మాటలలో స్వాతంత్య్ర సారాంశాన్ని వివ‌రించ‌గ‌లుగుతారు కూడా.

మాది చాలా చిన్న‌మీడియా వ్య‌వ‌స్థే కావ‌చ్చు; ప‌రిమిత‌మైన వ‌నరుల‌తో న‌డుస్తున్న‌దే కావ‌చ్చు. కానీ, భార‌తీయ‌ జ‌ర్న‌లిజంలోనే అతిపెద్ద ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హిస్తున్న‌ది మేమే. ఈ ఫెలోషిప్‌లు పొందిన‌వారు 95 (స‌హ‌జ‌మైన‌వి, భౌతికంగా, చరిత్రాత్మ‌కంగా అభివృద్ధి చెందిన) వారి ప్రాంతాల గురించి - మరీముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి క‌థ‌నాలు అందించాల‌నేదే మా ల‌క్ష్యం. మా ఫెలోషిప్‌లు అందుకున్న‌వారిలో 30 మంది మ‌హిళ‌లున్నారు. ప‌లువురు మైనారిటీలూ;  సంప్ర‌దాయ‌ మీడియా ఆద‌ర‌ణ‌కు నోచుకోని త‌ర‌గ‌తుల‌కు చెందిన‌వారూ వున్నారు.

గ‌త ఏడేళ్ల‌లో మేము 240 మంది ఇంట‌ర్న్‌ల‌కు శిక్ష‌ణ‌నిచ్చాం. వీరిలో 80 మంది `PARI ఎడ్యుకేష‌న్‌` కోసం ప‌నిచేస్తున్నారు. PARI లో 2 నుంచి 3 నెల‌ల వ్య‌వ‌ధి వుండే ఈ శిక్ష‌ణ‌లో ప‌లు త‌ర‌హాల జ‌ర్న‌లిజం విభాగాల గురించి నిపుణులు వివ‌రిస్తారు.

PHOTO • Supriti Singha

ప్రపంచంలోని ఏ భాషలోనైనా పేద మహిళలు స్వరపరిచిన, పాడిన పాటల అతిపెద్ద సేకరణను PARI హోస్ట్ చేస్తుంది, గ్రైండ్‌మిల్ సాంగ్స్ ప్రాజెక్ట్ (ఎడమ), మా FACES ప్రాజెక్ట్‌లు ఈ దేశంలోని ముఖ వైవిధ్యాన్ని నివేదించడానికి ప్రయత్నిస్తాయి (కుడి)

అత్యంత వైవిధ్యమైన, భిన్న‌మైన‌ సంస్కృతులు, భాషలు, కళారూపాలు త‌దిత‌ర అనేక అంశాల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు ఉప‌యోగ‌ప‌డే  భాండాగారాల్ని కూడా సిద్ధం చేసుకున్నాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ భాష‌లోనైనా గ్రామీణులు స్వ‌ర‌ప‌ర‌చి, పాడిన పాట‌ల్ని మేము ఇందులో నిక్షిప్తం చేస్తున్నాం. `గ్రిండ్‌మిల్ సాంగ్స్ ప్రాజెక్ట్` పేరుతో మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో; క‌ర్నాట‌క లోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు పాడిన 1,10,000 పాట‌ల్ని ఇప్ప‌టికే భ‌ద్ర‌ప‌రిచాం. అంకిత‌భావం క‌లిగిన మా బృందం ఇప్ప‌టికే 69,000కి పైగా ఈ పాట‌ల్ని ఇంగ్లీష్ లోకి త‌ర్జుమా చేసింది.

మా క‌వ‌రేజ్ ప్ర‌ధానంగా జాన‌ప‌ద క‌ళ‌లు, సంగీతం, క‌ళాకారులు, సృజ‌నాత్మ‌క ర‌చ‌న‌లు, క‌విత్వం (దేశం లోని భిన్న ప్రాంతాల ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన అతిపెద్ద క‌థ‌లు, వీడియోల భాండాగారం) త‌దిత‌ర అంశాల‌పై న‌డుస్తుంది. అలాగే మా ఆర్కీవ్స్‌లో గ‌త రెండు మూడు ద‌శాబ్దాలుగా దేశ‌వ్యాప్తంగా సేక‌రించిన 10,000కి పైగా అరుదైన బ్లాక్ & వైట్ ఫొటోల‌ను కూడా భ‌ద్ర‌ప‌రిచాం. వీటిలో ఎక్కువ భాగం ఫొటోలు భిన్న ప్రాంతాల్లో గ్రామీణులు ప‌నిలో నిమగ్నమై ఉన్నవి; కొన్ని సంద‌ర్భాల్లో కులాసాగా కూర్చున్న‌వి కూడా వున్నాయి.

ఇక ` ఫేసెస్‌ ` ప్రాజెక్టు మాకెంతో గ‌ర్వ‌కార‌ణం. దేశ‌వ్యాప్తంగా భిన్న‌ప్రాంతాల్లో ప్ర‌జ‌ల ముఖాకృతులు, వాటి మ‌ధ్య వైరుధ్యాలను  ఫేసెస్ ప‌ట్టిచూపిస్తుంది. అలాగ‌ని  `ఫేసెస్‌` నాయ‌కులు, సెల‌బ్రిటీల ఫొటోల‌ను సేక‌రించ‌దు. మా ల‌క్ష్యం - దేశంలోని ప్రతి జిల్లా / బ్లాక్‌ల‌ నుండి విభిన్న త‌ర‌హా ముఖాల ఫొటోల‌ను సేక‌రించ‌డం. ఇప్ప‌టిదాకా దేశంలోని 220 జిల్లాలు, 629 బ్లాకుల నుంచి 2,756 ముఖాల ఫొటోలు తీశాం. ఇవ‌న్నీ 164 మంది ఫొటోగ్రాఫ‌ర్లు తీసిన‌వి. వీరిలో అనేక‌మంది అండ‌ర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా వున్నారు. మొత్త‌మ్మీద PARI గ‌త ఏడేళ్ల‌లో 576 మంది ఫొటోగ్రాఫ‌ర్ల శ్ర‌మ‌ను భ‌ద్ర‌ప‌రిచింది.

PARI మ‌రో యునిక్ ప్రాజెక్టు ` లైబ్ర‌రీ `. ఇది మీకు పుస్త‌కాల‌ను అద్దెకివ్వ‌దు. ఉచితంగా అందిస్తుంది. ప్రాధాన్య‌త క‌లిగిన నివేదిక‌లు, ప‌త్రాలు, చ‌ట్టాలు; వీటితోపాటు కొన్ని అముద్రిత పుస్త‌కాల‌ను కూడా PARI లైబ్ర‌రీ మీకందిస్తుంది. వీట‌న్నిటినీ మీరు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు, ప్రింట్లు తీసుకోవ‌చ్చు, ఉచితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ర‌చ‌యిత‌ల వ‌ద్ద మేము అనుమతులు తీసుకుంటాం. మేము క్రియేటివ్ కామ‌న్స్ 4.0ను ఉప‌యోగించుకుంటాం. క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యం తొలినాళ్ల‌లోనే మేము ప్రారంభించిన ` PARI హెల్త్ ఆర్కీవ్‌ ` లో 140కి పైగా ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక‌లు, డాక్యుమెంట్ల‌ను నిక్షిప్తం చేశాం. వీటిలొ కొన్ని ద‌శాబ్దాల కాలం నుంచీ నేటి ఎల‌క్ట్రానిక్ ఫార్మాట్ దాకా అనేకం వున్నాయి.

PARI ఎటువంటి ప్ర‌భుత్వ / కార్పోరేట్ కంపెనీల యాజ‌మాన్యంలో కానీ, నియంత్ర‌ణ‌లో కానీ లేదు. మా వెబ్‌సైట్‌లో ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌నూ ప్ర‌చురించం. ఒక స్వ‌తంత్ర మీడియా వ్య‌వ‌స్థ‌గా నిల‌బ‌డేందుకు మా విలువైన పాఠ‌కులు, హితుల‌ విరాళాల మీద మాత్ర‌మే ఆధార‌ప‌డ‌తాం.   ఒకరకంగా చెప్పాలంటే, మీరు సాయం చేయకపోతే మేము ఇబ్బందులలో పడతాము. PARIకి విరాళాలివ్వండి , మా స్వతంత్రానికి అండగా నిలబడండి, నిజ‌మైన జ‌ర్న‌లిజానికి ఆస‌రా అవండి.

అనువాదం: సురేష్ వెలుగురి

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Suresh Veluguri

Suresh Veluguri is one of the first generation Technical Writers in India. A senior journalist by profession. He runs VMRG international, an organisation that offers language services.

Other stories by Suresh Veluguri