భానుబెన్ భర్వాడ్ బనాస్‌కాంఠా జిల్లాలోని తన 2.5 ఎకరాల వ్యవసాయ భూమిని చూసి ఏడాది కావొస్తోంది. ఇంతకుముందు ఆమె, ఆమె భర్త తమకు ఏడాదికి సరిపోయేలా తిండిగింజలుగా పండించుకొనే బాజ్రా (సజ్జలు), మూంగ్ (పెసర), జొవర్ (జొన్నలు)లను చూసేందుకు ప్రతిరోజూ ఆ పొలానికి వెళ్ళిన రోజులున్నాయి. 2017లో గుజరాత్‌లో వచ్చిన వరద విపత్తు ఈ పంట భూమిని నాశనం చేసేంతవరకూ ఈ పొలమే వారికి ప్రధాన జీవనాధారం. "ఆ తర్వాత మేం తినే ఆహారం మారిపోయింది," అని 35 ఏళ్ల భానుబెన్ చెప్పారు. "మేం ఇంతకుముందు మా పొలంలో పండించిన పంటలనే బయట కొనుక్కోవలసి వచ్చింది."

ఆమె వ్యవసాయ భూమిలో అర ఎకరం పొలం నాలుగు క్వింటాళ్ల (400 కిలోలు) సజ్జల దిగుబడిని ఇస్తుంది. ఇప్పుడామె అదే పరిమాణంలో సజ్జలను మండీ లో కొనాలంటే, ఆమెకయ్యే ఖర్చు దాదాపు రూ. 10,000. "ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, అర ఎకరం బజ్రా ను పండించడానికి మాకయ్యే (ఉత్పాదక) ఖర్చు మార్కెట్ రేటులో సగం ఉంటుంది" అన్నారామె. " ఇతర పంటలకు కూడా ఇదే వర్తిస్తుంది. మేం ఏ ధాన్యం పండించినా మాకు ఎంత ఖర్చయ్యేదో, మార్కెట్‌ ధర దానికి దాదాపు రెట్టింపు ఉంటోంది.”

భానుబెన్, ఆమె భర్త భోజాభాయ్ (38), వారి ముగ్గురు పిల్లలు బనాస్‌కాంఠాలోని కాంకరేజ్ తాలూకా లోని తోతానా గ్రామంలో నివసిస్తున్నారు. వారు తమ స్వంత భూమిని సాగుచేస్తున్నప్పుడు కూడా, అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి భోజాభాయ్ వ్యవసాయ కూలీగా కూడా పని చేసేవారు. కానీ 2017 నుండి ఆయన సమీపంలోని పొలాలలోనూ, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటన్‌లోని నిర్మాణ ప్రదేశాలలో కూడా పూర్తి సమయం కూలీగా పనిచేయాల్సి వవస్తోంది. "అతను ఇప్పుడు కూడా పని కోసం వెతుకుతున్నాడు. పని దొరికితే రోజుకు దాదాపు 200 రూపాయలు సంపాదిస్తాడు” అని భానుబెన్ చెప్పారు.

భానుబెన్, భోజాభాయ్‌ల చిన్న బిడ్డ సుహానా, అదే సంవత్సరం వినాశకరమైన వరదల సమయంలోనే పుట్టింది. ఇప్పటికే ఐదేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నానని తన బిడ్డ తల నిమురుతూ, భానుబెన్ అన్నారు.

బనాస్‌కాంఠా, పాటన్, సురేంద్రనగర్, ఆరావళి, మోర్బీతో సహా గుజరాత్‌లోని అనేక జిల్లాలలో జూలై 2017లో అత్యంత భారీ వర్షపాతం నమోదయింది. అదే సమయంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల వల్ల ఈ వరద వచ్చింది. ఇది ఒక అరుదైన ఉత్పాతం. దేశీయ విపత్తు నిర్వహణా అధికార సంస్థ నివేదిక ప్రకారం, 112 ఏళ్లలో ఈ ప్రాంతంలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఎడమ: బనాస్‌కాంఠా జిల్లా , తోతానా గ్రామంలోని తన ఇంటి బయట నాలుగేళ్ళ కూతురు సుహానాతో భానుబెన్ భర్వాడ్. కుడి: బంగాళాదుంపలను తరుగుతూనే , 2017 వరదలలో తమ పంటపొలం నీటిలో మునిగిపోయిన వైనాన్ని వివరిస్తోన్న భానుబెన్

బనాస్‌కాంఠా వార్షిక సగటు వర్షపాతంలో దాదాపు 163 శాతం వర్షం - జూలై నెల మొత్తంలో సాధారణంగా కురిసే 30 శాతం వర్షానికి బదులుగా - ఆ సంవత్సరం జూలై 24 నుండి 27 వరకు కురిసింది. దీంతో నీరు నిలిచిపోయి, ఆనకట్టలు పొంగిపొర్లి, ఆకస్మిక వరదలు వచ్చాయి. కాంకరేజ్ తాలూకా లోని తోతానాకు ఆనుకుని ఉన్న ఖరియా గ్రామం సమీపంలోని నర్మదా కాలువ తెగిపోవడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

ఈ వరదల కారణంగా రాష్ట్రంలో 213 మంది చనిపోయారు. దాదాపు 11 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి, 17,000 హెక్టార్ల ఉద్యానవన ప్రాంతం దెబ్బతిన్నాయి.

"మా వ్యవసాయ భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది," తన ఇంటి బయట కూర్చొని బంగాళాదుంపలు తరుగుతూ చెప్పారు భానుబెన్. "వరద నీరు తనతోపాటు పెద్దమొత్తంలో ఇసుకను తీసుకొచ్చింది. కొద్దిరోజుల తర్వాత వరదనీరు తీసినప్పటికీ, ఇసుక మాత్రం భూమిపై మేటలువేసింది."

భూమిపై మేటలువేసివున్న ఇసుకను తొలగించడం అసాధ్యమైన పని. "వరదలు మా భూమిని నిస్సారంగా మార్చేశాయి," అని ఆమె అన్నారు.

కూలీ పని చేస్తే మాత్రమే ఆహారం లభించే పరిస్థితుల్లో ఇకపై పిండిపదార్థాలు, మాంసకృత్తులు,  కూరగాయలతో కూడిన సమతుల ఆహారాన్ని సమకూర్చుకోవడం భానుబెన్ కుటుంబానికి తలకుమించిన పని. చిన్నారి సుహానాకు పుట్టినప్పటి నుంచి అటువంటి సమతుల ఆహారం ఒక్కసారి కూడా లభించలేదు. "ఇంతకుముందు మాకు ధాన్యం ఉండేది కాబట్టి కూరగాయలు లేదా పండ్లు, పాలు మాత్రమే కొనుగోలు చేసేవాళ్ళం. ఇప్పుడవన్నీ మేం తగ్గించుకోవాల్సివచ్చింది," అని ఆమె వివరించారు.

"ఒక ఆపిల్ పండును చివరగా ఎప్పుడు కొన్నామో నాకు గుర్తేలేదు," అన్నారు భానుబెన్. “ఈ రోజు ఒక పండును కొనుగోలు చేయగలిగినప్పటికీ, రేపు మాకు పని దొరుకుతుందో లేదో ఎప్పుడూ తెలియదు కాబట్టి మేం అదనంగా ఉండే డబ్బును ఆదా చేస్తాం. మా భోజనంలో ఎక్కువగా పప్పు, అన్నం, రోటీ ఉంటాయి. ఇంతకుముందు, మేం కిచిడీ చేస్తే ప్రతి కిలో బియ్యానికి 500 గ్రాముల పప్పు (తగుపాళ్ళలో) కలిపేవాళ్ళం. ఈ రోజుల్లో, కేవలం 200 గ్రాములు లేదా అంతకంటే కొంచం ఎక్కువ కలుపుతున్నాం. ఎలాగైనా కడుపు నింపుకోవాలి కదా!" అన్నారామె.

అయితే, ఆహార అసమతుల్యత వల్ల పోషకాహార లోపం వంటి అవాంఛనీయ పరిణామాలు కలుగుతాయి. ఇది మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.

సుహానా తరచుగా అలసిపోతుంటుందనీ, ఆమెలో రోగనిరోధక శక్తి గొప్పగా యేంలేదనీ సుహానా తల్లి చెప్పారు. “ఆమె తన చుట్టూ ఉండే ఇతర పిల్లల్లా ఆడుకోదు, వారి కంటే త్వరగా అలసిపోతుంది. తరచుగా అనారోగ్యానికి గురవుతుంటుంది."

PHOTO • Parth M.N.

తన స్నేహితురాలు మెహదీ ఖాన్(మధ్యలో)తో ముచ్చట్లాడుతున్న సుహానా (ఎడమ). 2021 లో వీరి గ్రామంలో జరిగిన ఒక సర్వేలో పోషకాహార లోపం ఉందని తేలిన 37 మంది ఐదేళ్ళలోపు పిల్లల్లో వీరిద్దరూ కూడా ఉన్నారు

జూన్ 2021లో తోతానాలోని పిల్లలపై నిర్వహించిన ఒక ఆరోగ్య సర్వేలో సుహానా పోషకాహార లోపంతో ఉన్నట్లు తేలింది. గ్రామంలో సర్వే చేసిన 320 మంది ఐదేళ్లలోపు వయస్సున్న పిల్లలలో పోషకాహార లోపంతో బాధపడుతున్న 37 మందిలో ఈమె కూడా ఉంది. "పిల్లల ఎత్తు, బరువు, వయస్సు గురించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించిన సర్వే ఇది," అని బనాస్‌కాంఠా జిల్లా అంతటా అధ్యయనం చేసిన గుజరాత్‌లోని మానవ హక్కుల సంస్థ అయిన నవసర్జన్ ట్రస్ట్ కార్యకర్త మోహన్ పర్మార్ చెప్పారు.

గుజరాత్ పోషకాహార నమూనాపై పోషణ్(POSHAN) అభియాన్ రూపొందించిన డేటా నోట్ ప్రకారం 2019-20లో దాదాపు ప్రతి ప్రజారోగ్య సూచికలో అహ్మదాబాద్, వడోదర, సూరత్, ఇంకా ఇతర జిల్లాలతో పాటు బనాస్‌కాంఠా మొదటి ఐదు ‘అత్యధిక భారం కలిగిన జిల్లాల’ జాబితాలో ఉంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ( NFHS- 5 ) ఆధారంగా సేకరించిన ఈ డేటా నోట్, గుజరాత్‌లో బరువు తక్కువగా ఉన్న 23 లక్షల (2.3 మిలియన్లు) మంది ఐదేళ్లలోపు పిల్లలలో 17 లక్షల మంది బనాస్‌కాంఠాలో ఉన్నారని చూపిస్తోంది. ఈ జిల్లాలో 15 లక్షల మంది వారి వయస్సుకు తగ్గ ఎత్తు పెరగని పిల్లలు, దాదాపు లక్ష మంది వారి ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తంమంది పిల్లల్లో ఈ పిల్లలు వరుసగా 6.5 శాతం, 6.6 శాతంగా ఉన్నారు.

పోషకాహారం లోపం వల్ల కలిగే రక్తహీనత, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే గుజరాత్‌లో అత్యధికంగా 80 శాతం ఉంది. బనాస్‌కాంఠాలో దాదాపు 2.8 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు

సరిపడినంత ఆహారం లభించకపోవడంతో, సుహానా వంటి పిల్లల, వారి కుటుంబాల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. వాతావరణ మార్పులు రేకెత్తించిన విపరీత సంఘటనలు అసలే తీవ్రమైన పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి.

ఉష్ణోగ్రత, వర్షపాతం, సముద్ర మట్టం పెరుగుదలలను "ప్రధాన వాతావరణ మార్పు ప్రమాదాలు"గా ' వాతావరణ మార్పులపై గుజరాత్ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక ’ గుర్తిస్తుంది. గత దశాబ్దంలో, పెరుగుతున్న అస్థిర వర్షపాత నమూనాలు, ఆకస్మిక వరదలు స్థానిక ప్రజలకు కొత్త సవాళ్లను సృష్టించాయని భారతదేశంలో కరవులను, వరదలను అధ్యయనం చేస్తున్న ANTICIPATE పరిశోధన ప్రాజెక్ట్ పేర్కొంది. బనాస్‌కాంఠాలోని రైతులతోపాటు ఇతరులు కూడా "తరచుగా సంభవిస్తున్న కరవుల, వరదల విరుద్ధమైన ప్రభావాలను ఎదుర్కోవడంలో ఇప్పుడు కష్టపడుతున్నారు" అని ఈ ప్రాజెక్ట్ పరిశోధకులు అంటున్నారు.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఎడమ: సుద్రోసన్ గ్రామంలోని ఇంటివద్ద మూడేళ్ళ మనవడు యువరాజ్‌తో అలాభాయి పర్మార్. కుడి: తోతానాలోని ఒక పొలంలో మట్టితో కలిసిపోయిన ఇసుక

అలాభాయి పర్మార్ (60) ఈ ఏడాది వానాకాలంలో నాలుగు పంటలను నష్టపోయారు. "నేను విత్తనాలను నాటగానే వచ్చిపడిన భారీ వర్షాలకు ఆ విత్తనాలు కొట్టుకుపోయాయి," అని బనాస్‌కాంఠా జిల్లాలోని సుద్రోసన్ గ్రామంలో తన ఇంట్లో కూర్చొనివున్న అలాభాయి చెప్పారు. "మేం గోధుమ, బాజ్రా , జొవార్‌ లను నాటాం. నేను 50 వేల రూపాయలకు పైగా ఉత్పాదక ఖర్చులను నష్టపోయాను."

"ఈ రోజుల్లో మీరు వాతావరణాన్ని అంచనా వేయలేరు," అని అలాభాయ్ అన్నారు. రైతులు ఉత్పత్తిలో తగ్గుదలని ఎదుర్కొంటున్నారనీ, వ్యవసాయ కూలీలుగా పనిచేసేలా ఇది వారిని బలవంతపెడుతోందనీ ఆయన చెప్పారు. "మాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ, నా కొడుకు వేరొకరి పొలంలోనో లేదా నిర్మాణ స్థలాలలో కూలీగానో పనిచేయవలసి వస్తోంది."

పదిహేను ఇరవయ్యేళ్ళ క్రితం వ్యవసాయం ఇంత ఒత్తిడి పెంచేదిగా లేదని అలాభాయి గుర్తుచేసుకున్నారు. "మాకు సమస్యలున్నాయి. అయితే అధిక వర్షపాతమనేది అంత మామూలు విషయమేమీ కాదు; ఇకపై తేలికపాటి వర్షం అనే మాటే ఉండదు. ఈ పరిస్థితుల్లో మీరు సరైన పంటను ఎలా పొందగలరు?” అని ఆయన అన్నారు.

గుజరాత్‌లో ఆహారధాన్యాల (తృణధాన్యాలు , పప్పుధాన్యాలు) మొత్తం పంట విస్తీర్ణం 2010-11 నుండి 2020-21 దశాబ్దంలో 4.9 మిలియన్ల నుండి 4.6 మిలియన్ (49 లక్షల నుండి 46 లక్షలు) హెక్టార్లకు తగ్గింది. వరి సాగు విస్తీర్ణం దాదాపు 100,000 హెక్టార్లు పెరిగినప్పటికీ, గోధుమ, బాజ్రా , జొవార్ వంటి తృణధాన్యాలు ఈ కాలంలో తమ ఉనికిని కోల్పోయాయి. బనాస్‌కాంఠా జిల్లాలో అత్యధికంగా పండే తృణధాన్యమైన బాజ్రా పంట విస్తీర్ణం, దాదాపు 30,000 హెక్టార్లు తగ్గింది.

గుజరాత్‌లో మొత్తం తృణధాన్యాల ఉత్పత్తి - ప్రధానంగా చిరుధాన్యాలు, గోధుమలు - ఈ దశాబ్దకాలంలో 11 శాతం పడిపోయాయి, పప్పుధాన్యాలు 173 శాతం పెరిగాయి.

అలాభాయి, భానుబెన్‌ల భోజనంలో ఎక్కువగా పప్పు, అన్నం మాత్రమే ఎందుకుంటాయో ఇది వివరిస్తోంది

ఆహార హక్కుపై పనిచేస్తున్న అహ్మదాబాద్‌లోని ఆర్టీఐ కార్యకర్త పంక్తి జోగ్ మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటల (పొగాకు, చెరకు) వైపుకు మళ్ళుతున్నారని చెప్పారు. "ఇది కుటుంబం ఆహారం తీసుకోవడాన్నీ, ఆహార భద్రతనూ ప్రభావితం చేస్తుంది," అని ఆమె చెప్పారు.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఎడమ: తక్కువ బరువు , వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న తన మనవడు యువరాజ్ గురించి అలాభాయి ఆదుర్దాపడుతుంటారు. కుడి: ఇంటివద్ద తండ్రితో యువరాజ్

అధిక ద్రవ్యోల్బణం అలాభాయిని తృణధాన్యాలను, కూరగాయలను కొననీయకుండా చేస్తోంది. "వ్యవసాయం సరైన క్రమంలో జరిగినప్పుడు, పశువులకు కూడా మేత లభిస్తుంది" అని ఆయన చెప్పారు. "పంట విఫలమైతే మేం దాణా నష్టపోతాం. మేమప్పుడు ఆహారంతో పాటు దానిని కూడా మార్కెట్లో కొనుగోలు చేయాలి. కాబట్టి మేం కొనగలవాటినే కొనుగోలు చేస్తాం.”

అలాభాయి మూడేళ్ల మనవడు యువరాజ్ తక్కువ బరువుతో ఉన్నాడు. "నేను వాడి గురించి ఆందోళన చెందుతున్నాను, ఎందుకంటే వాడి రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంది," అని ఆయన అన్నారు. “సమీప ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడి నుండి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉంది. వాడికి అత్యవసర చికిత్స అవసరమైతే మేమేం చేయాలి?”

జోగ్ మాట్లాడుతూ, "పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది," అన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నందున ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారని ఆమె చెప్పారు. "కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం పెరుగుతోంది" అని ఆమె అన్నారు. “(బనాస్‌కాంఠా వంటి) ఆదివాసీ ప్రాంతాలలో తనఖాల (అంటే అప్పు) వెనుక ఉన్న ప్రధాన కారణాలలో ఇది ఒకటి."

రాష్ట్రంలో అమలవుతున్న ఆహార పథకాలు స్థానిక ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని జోగ్ చెప్పారు. “అందరికీ సమానంగా సరిపోయే ఏకైక ప్రణాళిక ఉండదు. ప్రజల ఆహార ప్రాధాన్యాలు ప్రాంతాల నుండి ప్రాంతానికి, సమాజం నుండి సమాజానికి భిన్నంగా ఉంటాయి" అని ఆమె చెప్పారు. “మాంసాహారాన్ని వదులుకోవాలని గుజరాత్‌లో ప్రత్యేక ప్రచారం కూడా జరుగుతోంది. నిత్యం మాంసాహారం, కోడిగుడ్లు తినే ప్రాంతాల్లోకూడా ఈ ప్రచారం జోరందుకుంది. అక్కడ కూడా ప్రజలు వాటిని అపవిత్రంగా పరిగణించడం మొదలుపెట్టారు."

సమగ్ర జాతీయ పోషకాహార సర్వే 2016-18 ప్రకారం, గుజరాత్‌లో 69.1 శాతం మంది తల్లులు/సంరక్షకులు శాకాహారాన్ని తీసుకున్నారు. వారి జాతీయ సగటు 43.8 శాతంగా ఉంది. 2-4 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో, 7.5 శాతం మందికి మాత్రమే మాంసకృత్తులతో నిండిన పోషకాహారమైన గుడ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 5-9 ఏళ్లలోపు పిల్లల్లో 17 శాతం మంది గుడ్లు తింటున్నప్పటికీ, ఆ సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది.

సుహానా తన జీవితంలోని మొదటి రెండేళ్లలో మంచి పోషకాహారాన్ని కోల్పోయిందని భానుబెన్‌కు తెలుసు. "ఆమెకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని అందరూ మాకు చెబుతూనే ఉన్నారు," అని ఆమె చెప్పారు. “మాకది చాలా ఖర్చుతో కూడుకున్నది అయినప్పుడు ఏం చేయాలి? ఒకప్పుడు ఆరోగ్యకరమైన భోజనం చేయగలిగే స్తోమత ఉండేది మాకు. సుహానాకు ఇద్దరు అన్నలు. కానీ వాళ్ళిద్దరూ మా పొలం బీడుగా మారకముందే పుట్టినవాళ్ళు. వారికి పోషకాహార లోపం లేదు.” అన్నారామె.

పార్థ్ ఎమ్.ఎన్. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ మంజూరు ద్వారా ప్రజారోగ్యం, పౌర హక్కులపై నివేదిస్తారు. ఈ నివేదికలోని విషయాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఎలాంటి సంపాదకీయ నియంత్రణను పాటించలేదు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Vinutha Mallya

Vinutha Mallya is Consulting Editor at People’s Archive of Rural India. She was formerly Editorial Chief and Senior Editor at PARI.

Other stories by Vinutha Mallya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli