ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.
ఆ షెడ్డు పైకప్పు గుణ్వంత్ పై పడలేదు కానీ, అతనిని పొలమంతా పరిగెత్తేలా చేసింది. "మా పొలంలో ఉన్న షెడ్డుపై అమర్చిన రేకులు (టిన్ రూఫ్) ఉధృతంగా వీస్తున్న గాలికి ఎగిరి, నా వైపు దూసుకు వచ్చాయి. నేను ఎండుగడ్డి కుప్ప కింద దాక్కోవడంతో, ఎలాంటి గాయాలు తగలకుండా బ్రతికి బయటపడ్డాను," అని అతను గుర్తు చేసుకున్నారు. ఇది గుణ్వంత్ ఎప్పటికీ మరిచిపోలేని ఒక సంఘటన!
పైకప్పు వెంబడించే దృశ్యం మనకి ప్రతిరోజూ కనబడదు! ఈ ఏప్రిల్‌లో వడగళ్ల వానతో పాటు వీచిన విస్తృతమైన గాలుల కారణంగా, అంబుల్గా గ్రామ వాస్తవ్యుడైన గుణ్వంత్ హడ్సర్కర్ తన పొలంలో అలా పరిగెత్తాల్సి వచ్చింది.
కొంత సమయం తరువాత, ఎండుగడ్డి కుప్ప నుండి బయటకు వచ్చిన 36 ఏళ్ల గుణ్వంత్, నిలంగా తాలూకా లో ఉన్న తన సొంత పొలాన్ని తానే గుర్తుపట్టలేకపోయారు. "సాధారణంగా, వడగండ్ల వాన 18-20 నిమిషాలు పడుతుంది. కానీ, అప్పటికే ఇక్కడ చెట్లన్నీ కూలిపోయాయి; చనిపోయిన పక్షులు నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి; మా పశువులు తీవ్రంగా గాయపడ్డాయి," అని ఆ వడగళ్ల వాన మిగిల్చిన తీరని నష్టాన్ని, ఆ తాలూకు గుర్తులని చూపిస్తూ అతను వివరించారు.
"ప్రతి 16-18 నెలలకోసారి మా దగ్గర వడగళ్ల వాన / అకాల వర్షం పడుతోంది," అని అంబుల్గాలో, రాయి-మోర్టార్లతో నిర్మించబడిన తన రెండు గదుల ఇంటి బైటున్న మెట్లపై కూర్చున్న గుణ్వంత్ తల్లి ధోండాబాయ్ చెప్పారు. 2001లో, పప్పుధాన్యాల (కందులు, పెసలు) సాగు మానేసి, ఆమె కుటుంబం తమ 11 ఎకరాల భూమిలో మామిడి, జామ తోటల పెంపకం చేపట్టారు. “సంవత్సరం పొడవునా మేము చెట్లను జాగ్రత్తగా చూసుకున్నా, కొన్ని నిమిషాల వ్యవధిలో చోటుచేసుకునే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు మా మొత్తం పెట్టుబడిని నాశనం చేస్తాయ”ని 60 ఏళ్ల ధోండాబాయి అన్నారు.
ఇది, ఈ సంవత్సరం మాత్రమే సంభవించిన ఒక అసాధారణమైన విషయం కాదు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఉన్నఈ ప్రాంతంలో, ఒక దశాబ్దానికి పైగా, కుండపోతగా కురుస్తున్న వర్షం, వడగండ్ల వాన లాంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2014 లో కురిసిన వడగళ్ల వాన, అంబుల్గాలో ఉద్ధవ్ బిరాదర్ ఎకరం మామిడి తోట మొత్తాన్ని ధ్వంసం చేసింది. "నా తోటలో 10-15 మామిడి చెట్లు ఉండేవి. ఆ తుఫానులో అవి చనిపోయాయి. వాటిని బ్రతికించడానికి నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు," అని ఆయన తెలిపారు.
“వడగళ్ల వానలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 2014 తుఫాను తర్వాత చెట్లను చూసి నేను తట్టుకోలేకపోయాను.” అంత కష్టపడి పెంచి, సంరక్షించిన చెట్లన్నీ నిమిషాల్లో నేలకొరిగడం చూసి, మళ్ళీ అదే పరిస్థితి వస్తే తట్టుకొని నిలబడే ధైర్యాన్ని అప్పుడే కోల్పోయానని 37 ఏళ్ల బిరాదర్ చెప్పారు.
వడగండ్ల వాన? అదీ, మరాఠ్వాడా ప్రాంతంలోని లాతూర్ జిల్లాలో? ఇక్కడ, ఏడాదిలో సగం కాలానికి పైగా, 32 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో, 41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో, లాతూర్‌లో జోరుగా వడగళ్ల వాన పడింది.
లాతూర్‌లో దాదాపు ప్రతి రైతూ ఉద్రేకంతో చెప్పేది ఒక్కటే: ఇక్కడి తాప్మాన్ , హవామాన్, వాతావరణ్ (ఉష్ణోగ్రత, గాలి, వాతావరణ)ల తీరుతెన్నులను ఇంతకుముందులా గుర్తించలేకపోతున్నాం.
ఏటా వర్షపు రోజుల సంఖ్య తగ్గగా, వేసవి రోజుల సంఖ్య పెరిగిందని వారికి అర్ధమైంది. 1960, అంటే ధోండాబాయ్ జన్మించిన సంవత్సరంలో, లాతూర్‌లో సంవత్సరంలో కనీసం 147 రోజుల పాటు 32 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవని వాతావరణ మార్పులు, భూగోళ/ప్రపంచ కవోష్ణతలను (గ్లోబల్ వార్మింగ్) గమనించే ఒక యాప్ సేకరించిన సమాచారాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఈ సంవత్సరం ఆ సంఖ్య 188 రోజులకు చేరింది. ఇక ధోండాబాయ్కి 80 ఏళ్లు వచ్చేసరికి, 211 రోజులకు పెరగవచ్చని ఒక అంచనా.
గత నెలలో, అంబుల్గాలోని తన 15 ఎకరాల పొలాన్ని నేను సందర్శించినప్పుడు, "ఇది జూలై నెలాఖరు అంటే నమ్మడం కష్టం కదా! పొలం బంజరుగా కనిపిస్తోంది; నేల గోధుమ రంగులోకి మారిపోయింది; ఆకుపచ్చని మొలకలు అసలు కనబడడం లేదు. సాధారణంగా నేను జూన్ మధ్య నాటికి సోయాబీన్ విత్తనాలను నాటుతాను. ఈసారి ఖరీఫ్ సీజన్‌లో మాత్రం ఏ పంటా వేయకపోవచ్చు," అని 63 ఏళ్ల సుభాష్ షిండే, తన తెల్లటి కుర్తా నుండి రుమాలు తీసి, నుదిటిపై ఉన్న చెమటను తుడుచుకుంటూ అన్నారు.
దక్షిణ లాతూర్ నుండి తెలంగాణలోని హైదరాబాద్ వరకు, ఇంచుమించు 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే గ్రామాల్లో, షిండే లాంటి రైతులు ప్రధానంగా సోయాబీన్‌ను సాగు చేస్తారు. దాదాపు 1998 వరకు, ఇక్కడ ఖరీఫ్ పంట కాలంలో జొన్నలు, మినుములు, పెసలు సాగు చేసేవారు. కానీ వాటికి స్థిరమైన వర్షపాతం అవసరం. సకాలంలో ఋతుపవనాలు వస్తేనే మంచి దిగుబడి వస్తుందని షిండే చెప్పారు.
2000 సంవత్సరంలో, చాలా మంది రైతులు సోయాబీన్ సాగు చేయడం మొదలుపెట్టారు. "ఎందుకంటే, ఇది సౌకర్యవంతమైన పంట. వాతావరణంలో ఏ కొంచెం మార్పు వచ్చినా అది తట్టుకొని నిలబడుతుంది. పైగా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ ఉంది. పంట దాంతో సీజన్ ముగిసే సరికి, మేము కొంత డబ్బును ఆదా చేయగలిగాం. అదనంగా, కోతల తర్వాత మిగిలిన వ్యర్థాలను జంతువులకు మేతగా వేస్తున్నాం. కానీ, గత 10-15 సంవత్సరాలుగా, సోయాబీన్ కూడా అస్థిరమైన ఋతుపవనాలను ఎదుర్కోలేకపోతోంది," అని షిండే వివరించారు.
"ఈ సంవత్సరం పంటలు వేసిన వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, మొదటి జల్లుల తరువాత ఇప్పటి వరకూ వర్షాలు కురవలేదు," అని లాతూర్ జిల్లా కలెక్టర్ జి. శ్రీకాంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 64 శాతం, నిలంగా తాలూకా లో 66 శాతం మాత్రమే నాట్ల పనులు (అన్ని రకాల పంటలు) పూర్తయ్యాయి. జిల్లాలోని మొత్తం సాగు విస్తీర్ణంలో, 50 శాతానికి పైగా సోయాబీన్ పంటకు భారీ నష్టం వాటిల్లింది.
లాతూర్ జిల్లా, మరాఠ్వాడాలోని వ్యవసాయ ప్రాంతంలో ఉంది. ఇక్కడి సాధారణ వార్షిక సగటు వర్షపాతం 700 మి.మీ. అయితే, ఈ ఏడాది జూన్ 25 న ఋతుపవనాలు ప్రవేశించినా, అక్కడక్కడా జల్లులు మాత్రమే కురిశాయి. దాంతో జులై నెలాఖరుకి, ఆ కాలంలో ఉండే సాధారణ వర్షపాతం కంటే 47 శాతం తక్కువ నమోదైందని శ్రీకాంత్ చెప్పారు.
2000వ దశకం ప్రారంభంలో, ఒక ఎకరా సోయాబీన్ సాగుకి సుమారు రూ. 4,000 పెట్టుబడి పెడితే, 10-12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత, సోయాబీన్ ధర క్వింటాల్‌కు రూ. 1,500 నుండి రూ. 3,000 కు రెట్టింపయ్యింది. కానీ సాగు ఖర్చులు మూడు రెట్లు పెరిగితే, ఎకరా ఉత్పత్తి మాత్రం సగానికి పడిపోయిందని షిండే వివరించారు.
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు వద్ద ఉన్న సమాచారం కూడా షిండే పరిశీలనలను బలపరుస్తోంది. 2010-11 లో, 1.94 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సోయాబీన్ సాగు చేయగా, 4.31 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందని మార్కెటింగ్ బోర్డు తన వెబ్‌సైట్లో పేర్కొంది. 2016 లో, 3.67 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగు చేయగా, కేవలం 3.08 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. అంటే, సాగు విస్తీర్ణం 89 శాతానికి పెరిగినా, ఉత్పత్తి మాత్రం 28.5 శాతానికి పడిపోయింది.
ఈ దశాబ్ద కాలంలో, వ్యవసాయంలో ప్రాచుర్యంలోకి వచ్చిన మరో ధోరణిని ధోండాబాయ్ భర్త 63 ఏళ్ళ మధుకర్ హడ్సర్కర్, ఎత్తి చూపారు: "2012 నుండి పురుగు మందుల వాడకం బాగా పెరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే, మేము 5-7 సార్లు పిచికారీ చేశాం."
మారుతున్న స్థలాకృతిపై (లాండ్స్కేప్) తన అభిప్రాయాలను పంచుకుంటూ, "మేము ఇంతకు ముందు క్రమం తప్పకుండా గద్దలను, రాబందులను, పిచ్చుకలను చూసేవాళ్ళం. కానీ గత 10 సంవత్సరాలుగా, అవి చాలా అరుదైపోయాయి," అని ధోండాబాయ్ చెప్పారు.
ఇప్పటికీ భారతదేశంలో పురుగులమందుల వాడకం హెక్టారుకు ఒక కిలోగ్రాము కంటే తక్కువగా ఉందని లాతూర్‌కు చెందిన పర్యావరణ జర్నలిస్టు అతుల్ దేవుల్గాన్వ్కర్ తెలిపారు. "అమెరికా, జపాన్ ఇంకా ఇతర అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలలో పురుగు మందుల వాడకం 8-10 రెట్లు అధికంగా ఉంటుంది. వారు ఆ పురుగు మందులను నియంత్రిస్తారు కానీ, మనం అలా చేయం. మనం వాడే పురుగులమందులలో క్యాన్సర్ కారకాలు చాలా ఉంటాయి. అవి పక్షులను కూడా ప్రభావితం చేస్తాయి. వాటి చావుకు కారణమవుతాయి."
పంటల ఉత్పాదకత పడిపోవడానికి వాతావరణంలో వచ్చిన కీలకమైన మార్పులే కారణమని షిండే ఆరోపించారు. "నాలుగు నెలలు కొనసాగే వర్షా కాలంలో (జూన్-సెప్టెంబర్), మాకు 70-75 రోజులు వానలు పడేవి; అది కూడా స్థిరంగా, సమయానుసారంగా. కానీ గడిచిన 15 ఏళ్లలో, వర్షాలు సగానికి సగం తగ్గిపోయాయి. ఒక్కోసారి విస్తృతంగా వానలు కురుస్తున్నాయి; దాని తరువాత 20 రోజుల వరకూ వర్షాభావ (డ్రై స్పెల్) పరిస్థితులు కొనసాగుతున్నాయి! ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వ్యవసాయం చేయడం అసాధ్యం," అని ఆయన తేల్చి చెప్పారు.
లాతూర్ జిల్లాలో, ఋతుపవనాలు కొనసాగే ఆ నాలుగు నెలల్లో, 2014 లో 430 మి.మీలు, 2015 లో 317 మి.మీలు, 2016 లో 1,010 మి.మీలు, 2017 లో 760 మి.మీల వర్షపాతం నమోదైంది. గతేడాది వర్షాకాలంలో 530 మి.మీలు నమోదు కాగా, జూన్ ఒక్క నెలలోనే 252 మి.మీల వర్షపాతం నమోదైంది. 'సాధారణ' వర్షపాతం నమోదయ్యే సంవత్సరాల్లో కూడా, ఋతుపవనాల ఆగమనం, విస్తరణ చాలా అసమానంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ కనుగొంది.
భూగర్భ జలాల సర్వేలు మరియు అభివృద్ధి ఏజెన్సీకి చెందిన సీనియర్ జియాలజిస్ట్ (భూమి గురించి అధ్యయనం చేసేవారు) చంద్రకాంత్ బోయార్ మాట్లాడుతూ, తక్కువ సమయంలో కుండపోత వర్షాలు పడితే నేల కోతకు గురవుతుంది. అదే స్థిరంగా చినుకులు పడితే, భూగర్భజలాల భర్తీ (రీఛార్జ్) జరుగుతుందని చెప్పారు.
ఉన్న నాలుగు బోరుబావులూ తరచుగా ఎండిపోతున్నందున, షిండే భూగర్భజలాలపై ఆధార పడలేకపోతున్నారు. "గతంలో 50 అడుగులు త్రవ్వితే నీళ్లు పడేవి; ఇప్పుడు 500 అడుగుల లోతున్న బోరుబావులు కూడా ఎండిపోయాయి!"
అది ఇతర సమస్యలకు దారి తీస్తోంది. "మనం తగినంతగా విత్తనాలు నాటకపోతే జంతువులకు మేత ఉండదు. అటు నీళ్లు, ఇటు తిండి లేకపోవడంతో, రైతులు తమ పశువులను పోషించుకోలేకపోతున్నారు. 2009 వరకు, నా దగ్గర 20 పశువులు ఉండేవి. ఇప్పుడు కేవలం తొమ్మిదే ఉన్నాయి."
"1905లో, లోకమాన్య తిలక్ ప్రవేశపెట్టినప్పటి నుండి, లాతూర్ పత్తికి కేంద్రంగా మారింది. ఆ కాలంలో సాగు చేయడానికి పుష్కలంగా వర్షాలు ఉండేవి. ఇప్పుడు పత్తి స్థానాన్ని సోయాబీన్ ఆక్రమించింది," అని 95 ఏళ్ల వయస్సులో కూడా చురుకుగా, చలాకీగా తిరుగుతున్న షిండే తల్లి కావేరీబాయ్ చెప్పారు. ఎటువంటి సహాయం లేకుండానే, ఆమె కాళ్ళు ముడుచుకుని నేలపై కూర్చోగలరు, లేవగలరు.
వడగండ్ల వానల పరంపర మొదలవక ముందే, దాదాపు రెండు దశాబ్దాల క్రితమే, తన తల్లి వ్యవసాయాన్ని వదిలేయడాన్ని షిండే హర్షిస్తున్నారు. "వడగళ్ల వర్షాలు కొన్ని నిమిషాల్లోనే వ్యవసాయ భూమిని నాశనం చేస్తాయి. వాటి వల్ల ఎక్కువగా నష్టపోయేది పండ్ల తోటలు కలిగిన రైతులే."
సాపేక్షంగా మెరుగైన వాతావరణం ఉండే సౌత్ బెల్ట్‌లో, ఈ వడగళ్ల వాన కారణంగా పండ్ల తోటల పెంపకందారులు బాగా దెబ్బతిన్నారు. "ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కురిసిన వడగండ్ల వాన కారణంగా నాకు రూ. 1.5 లక్షల నష్టం వాటిల్లింది. 2000 లో, నా పండ్ల తోటలో 90 చెట్లు ఉండేవి. ఇప్పుడు 40 మాత్రమే మిగిలాయి," అని తన తోటను చూపిస్తూ, మధుకర్ హడ్సర్కర్ బాధపడ్డారు. అక్కడ చెట్ల కాండాలపై పసుపు మచ్చలు కనిపించాయి. ఇప్పుడు వడగండ్ల వానలు అనివార్యం అవడంతో, అతను తన తోటను వదులుకునే ఆలోచనలో ఉన్నారు.
లాతూర్, గత శతాబ్ద కాలంలో, పంటల సాగు పద్ధతిలో అనేక మార్పులను చూసింది. ఒకప్పుడు ఇక్కడి రైతులు జొన్నలు, చిరుధాన్యాలు, కొంతవరకు మొక్కజొన్నలు ఎక్కువగా పండించేవారు. కానీ, 1905 నుండి, పత్తిని పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు.
1970 నుండి చెరుకు, అప్పుడప్పుడు పొద్దుతిరుగుడు పండించేవారు. కానీ 2000 నుండి సోయాబీన్ పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. లాతూర్‌లో చెరుకు, సోయాబీన్ ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. 2018-19 లో, (పూణేలోని వసంతదాదా షుగర్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన సమాచారం ప్రకారం) చెరుకు 67,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేశారు. 1982లో, ఇక్కడ ఒక చక్కెర కర్మాగారం ఉంటే, ఇప్పుడు 11 కర్మాగారాలు ఉన్నాయి. వాణిజ్య పంటల రాకతో బోరుబావులు ఎక్కువవడంతో – ఎన్ని త్రవ్వించబడ్డాయో లెక్కే లేదు – భూగర్భ జలాల దోపిడీ పెరిగింది. చారిత్రాత్మకంగా చిరుధాన్యాలకు అనువుగా ఉన్న మట్టిలో, గత శతాబ్ద కాలంగా వాణిజ్య పంటలు సాగు చేస్తుంటే, ఆ ప్రభావం ఇక్కడి నీరు, నేల, తేమ మరియు వృక్షసంపదపై తీవ్రంగా పడింది.
అలాగే లాతూర్‌లో అటవీ విస్తీర్ణం కేవలం 0.54 శాతం మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. ఇది మరాఠ్వాడా ప్రాంతం సగటు 0.9 శాతం కంటే చాలా తక్కువ!
ఈ సాగు ప్రక్రియలు-వాతావరణ మార్పుల మధ్య ఒక సమీకరణాన్ని గీయాలనుకోవడం తప్పని, గట్టి సాక్ష్యాధారాలతో అది నిరూపించాలనుకోవడం కష్టమని అతుల్ దేవుల్గాన్వ్కర్ అభిప్రాయ పడ్డారు. ఇటువంటి మార్పులు మనుషులు నిర్దేశించుకున్న చిన్న చిన్న ప్రదేశాల్లోనే కాదు, పెద్ద పెద్ద ప్రాంతాల్లో కూడా సర్వ సాధారణంగా చోటుచేసుకుంటాయి. మరాఠ్వాడాలో ఒక చిన్న భాగమైన లాతూర్ జిల్లా ఎదుర్కుంటున్న ఈ తీవ్ర సమస్యలు, పెరుగుతున్న వ్యవసాయ-పర్యావరణ అసమతుల్యతలతో ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు.
"కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ఇంచుమించు అన్ని ప్రదేశాల్లో, వ్యవసాయ రంగంలో సంభవించిన బహుళ ప్రక్రియల మధ్య కొంత సహసంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. పంట మార్పు, భూ వినియోగం, సాంకేతిక పరిజ్ఞానంలో భారీ మార్పులు వచ్చిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత, వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడం, వడగండ్ల వానలు పెరగడం గమనార్హం. ఇందుకు మానవ కార్యకలాపాలే కారణమన్న ఒక వాదనను ఖండించలేకపోయినా, ఖచ్ఛితంగా అవి పర్యావరణ అసమతుల్యతలకు గణనీయ స్థాయిలో దోహద పడుతున్నాయి."
ఈ విపరీతమైన వాతావరణ మార్పులు, ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి.
“ప్రతి పంట సీజన్ రైతులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వారి ఆత్మహత్యలకు ఇదొక కారణం.” నా పిల్లలు ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాలుగా పని చేయడం మంచిదైందని గుణ్వంత్ హడ్సర్కర్ అన్నారు. మారుతున్న వాతావరణంతో పాటు వ్యవసాయంపై అతనికున్న దృక్పథం కూడా మారిపోయింది!
"ఇప్పుడు వ్యవసాయం వల్ల సమయం, శక్తి, డబ్బు అన్నీ వృధా అవుతున్నాయి," అని సుభాష్ షిండే అభిప్రాయపడ్డారు. అతని తల్లి వ్యవసాయం చేసే రోజుల్లో ఇది భిన్నంగా ఉండేది మరి. "అప్పుడు వ్యవసాయం మా సహజ ఎంపికగా ఉండేది," అని కావేరీబాయ్ వంత పాడారు.
ఇక సెలవు తీసుకుంటానని కావేరీబాయికి నేను నమస్తే చెప్పినప్పుడు, ఆమె నాతో కరచాలనం చేశారు. " పోయినేడాది నా మనవడు డబ్బు ఆదా చేసి నన్ను విమానం ఎక్కించాడు. విమానంలో ఎవరో నన్ను ఇలాగే (కరచాలనంతో) పలకరించారు. వాతావరణం మారుతోంది; మనం కూడా ఎదుటివారిని పలకరించే విధానం మార్చుకోవాలని నాకు అనిపించింది," అని ఆమె గర్వంగా నవ్వుతూ నాకు వీడ్కోలు చెప్పారు.
ముఖచిత్రం (లాతూర్‌లో వడగళ్ల వాన తెచ్చిన నష్టం): నిశాంత్ భద్రేశ్వర్.
వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని, PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే zahra@ruralindiaonline.org కి ఈమెయిల్ చేసి అందులో namita@ruralindiaonline.org కి కాపీ చేయండి.
అనువాదం: వై క్రిష్ణ జ్యోతి