“మమ్మల్నిక్కడికి తీసుకువచ్చిన వాళ్ళకి నేను వంటచేసి పెడుతున్నాను. నా భర్త ఇటుకలు చేయడంలో వాళ్ళకి సహాయం చేస్తున్నార”ని హైదరాబాద్ ఇటుక బట్టీల్లో మాకు కంటబడిన ఊర్వశి అన్నారు.

బట్టీల దగ్గర 61 ఏళ్ళ దేగు ధరువా, 58 ఏళ్ళ ఊర్వశి ధరువాలను చూసి మేం ఆశ్చర్యపోయాం. ఈ భార్యాభర్తలిద్దరూ పశ్చిమ ఒడిశా, బొలాంగీర్ జిల్లాలోని బేల్‌పారా గ్రామ పంచాయతీకి చెందిన పండరిజోర్ అనే పల్లెటూరు నుంచి వచ్చారు. దేశంలో ఉన్న నిరుపేద ప్రాంతాలలో ఇది ఒకటి.

నేను రెండు దశాబ్దాలకుపైగా విస్తృతంగా వార్తలు అందిస్తున్న పశ్చిమ ఒడిశా ప్రాంతానికి చెందిన ప్రజలు కనీసం 50 ఏళ్ళుగా వలసపోతున్నారు. పేదరికం వల్ల, ప్రభుత్వ విధానాల ఫలితంగానూ కరవు, ఆకలిచావులు, నిస్సహాయ స్థితిలో పిల్లలను అమ్మటం వంటి వాటికి ఈ ప్రాంతం పెట్టింది పేరు.

1966-67లో తలెత్తిన కరవు పరిస్థితుల వల్ల ఇక్కడి ప్రజలు వలసవెళ్ళడం మొదలుపెట్టారు. తరువాత మళ్ళీ 90లలో కాలాహండి, నువాపాడా, బొలాంగీర్, ఇంకా ఇతర జిల్లాల్లో వచ్చిన తీవ్రమైన కరవు కారణంగా వలసపోయేవారి సంఖ్య పెరిగింది. శారీరక శ్రమ చేయగలిగినవాళ్ళు మాత్రమే పనికోసం ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళడం, ముసలివాళ్ళు పల్లెటూర్లలోనే ఉండిపోవడాన్ని ఆ సమయంలో మేం గమనించాం.

PHOTO • Purusottam Thakur

బట్టీలో పని చేసే చాలా మటుకు వలసదారులు (ఎడమ) దేగు ధరువా, అతని భార్య ఊర్వశి ధరువా కన్నా వయసులో చాలా చిన్నవాళ్లు

“వాళ్ళు పల్లెల్లోనే ఉండిపోడానికి చాలా కారణాలున్నాయి. పల్లె వదిలి వెళ్ళినవాళ్ళు కష్టపడి పని చేయాల్సి వచ్చేది. ఇటుక బట్టీల్లో (చాలామంది వలసదారులకు పని దొరికేది ఇక్కడే) రాత్రింబవళ్ళు పనుంటుంది. ముసలివాళ్ళు ఇంత శ్రమ తట్టుకోలేర”ని న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అయిన బిష్ణు శర్మ అన్నారు. ఒడిశా వలసదారులను కొన్ని దశాబ్దాల పాటు దగ్గరగా పరిశీలిస్తూ వస్తున్న శర్మ, బొలాంగీర్ జిల్లా కాంటాబాంజీ నుంచి పనిచేస్తారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని ఇటుక బట్టీలతో సహా పని కోసం అనేక ఊర్లకి వలసవెళ్ళే వాళ్ళందరూ ఇక్కడి ప్రధాన రైల్వే స్టేషన్ అయిన కాంటాబాంజీలోనే రైళ్ళు ఎక్కుతారు. ఏ (బట్టీ) యజమాని కూడా (పెద్దవయసు పనివాళ్ళకు) బయానా ఇవ్వరు. అదీగాక ఇల్లు చూసుకోడానికి, ఇంట్లో ఉండిపోయిన పిల్లల్ని చూసుకోడానికి, రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి, వీళ్ళు పల్లెటూర్లలోనే ఉండిపోతారు. ఇంక ఎవరూ లేని ముసలివాళ్ళయితే ఎన్నో బాధలు పడతారు.” అన్నారు శర్మ.

కాని 1966-2000 నాటి దారుణ పరిస్థితులు, గత కొన్ని దశాబ్దాలుగా కొంతవరకు మెరుగుపడ్డాయి. దీనికి ముఖ్య కారణాలు వృద్ధులకు, వితంతువులకు పింఛను ఇవ్వడం వంటి సామాజిక భద్రతా పథకాలు. కనీసం ఒక దశాబ్దకాలంగా, ఈ ప్రదేశం నుంచి ఆకలిచావుల వార్తలు లేవు. ఆగస్టు 2008 నుంచి ఒడిశాలో అమలుపరచిన సబ్సిడీ బియ్యం పథకమే దీనికి ప్రధాన కారణం. ఈ పథకం ప్రకారం దారిద్ర్యరేఖకి దిగువున ఉన్నవారికి కిలో బియ్యం రెండు రూపాయలకే లభించేది. 2013 నుంచి ఈ ధరని తగ్గించి, కిలో బియ్యం ఒక్క రూపాయి చొప్పున కుటుంబానికి నెలకి 25 కిలోల బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారు.

అన్ని అగచాట్లతో నిండిన ఆ దశాబ్దాల్లోనే కఠినమైన కూలి పనుల కోసం ముసలివాళ్ళు వలసవెళ్ళలేదు. అలాంటిది, మరి వయసులో అంత పెద్దవారైన ఊర్వశి, దేగు ధరువాలు బట్టీల్లో పని వెతుక్కుంటూ హైదరాబాద్‌కి ఎందుకు వలస వచ్చారు?

PHOTO • Purusottam Thakur

అనారోగ్యం, బట్టీ పనిలోని కఠిన శ్రమల వలన- ఒడిశాలోని బొలాంగీర్ జిల్లా నుంచి పనికోసం ఇక్కడికి రావాలని తాము తీసుకున్న నిర్ణయం గురించి ధరువా కుటుంబం ఇప్పుడు విచారపడుతోంది

“మాకు ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. ఇప్పుడు మేం ఒంటరివాళ్ళమయ్యాం. మేం వరి, పత్తి పండించే సన్నకారు రైతులం. కాని ఈ ఏడాది పంట బాగా పండలేదు. పైగా మమ్మల్ని చూసుకోడానికి ఎవ్వరూ లేరు…” అన్నారు ఊర్వశి.

“చాలాకాలం క్రితం, మా కుర్రతనంలో, ఈ ఇటుక బట్టీ పనికి రెండుసార్లు వచ్చాం. ఇప్పుడు పరిస్థితుల వల్ల మళ్ళీ ఇక్కడికి రావలసివచ్చింది,” అన్నారు దేగు. “ఇంతకుముందు నేను పని కోసం బట్టీకి వచ్చినపుడు, రూ. 500-1000ల బయానా మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు మనిషికి రూ. 20,000, అంతకన్నా ఎక్కువ కూడా ఇస్తున్నారు.” కాని, వాళ్ళని ఆ బట్టీకి తీసుకువచ్చిన బంధువులు, యజమాని నుంచి రూ. 20,000 తీసుకుని, తమకు రూ. 10,000 మాత్రమే ఇచ్చారని దేగు చెప్పుకొచ్చారు.

మామూలుగా అయితే ఆ బయానా ఐదు నుంచి ఆరు నెలల పనికోసం ఇస్తారు. కోతలకాలం (జనవరి-ఫిబ్రవరి నెలల్లో) ముగిశాక పల్లె జనం బట్టీల దగ్గరకి వచ్చి, జూన్ నెల దరిదాపుల్లో వానాకాలం మొదలవ్వగానే తిరిగి వెళ్ళిపోతారు..

“ఇక్కడికి వచ్చాక నా వృద్ధాప్యం, అనారోగ్యాల వల్ల, నేను మనసు మార్చుకున్నాను,” అన్నారు దేగు. “ఇక్కడ పని చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను బయానా డబ్బును లేబర్ కాంట్రాక్టర్‌కు తిరిగి ఇచ్చేసి మా పల్లెకి వెళ్ళిపోదామనుకున్నాను. కాని బట్టీ యజమాని నా ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. అదీగాక, నాకు బదులుగా ఇంకొక మనిషిని తీసుకురమ్మని చెప్తున్నారు. ఇంకొక మనిషిని నేనెక్కడనుంచి తీసుకురాను? అందుకే మేమింకా ఇక్కడే ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.”

PHOTO • Purusottam Thakur

కార్మికులు నివాసముండే తాత్కాలిక నివాసాలు. చాలా మంది ఏడాదిలో ఆరు నెలల పనికోసం ఇచ్చే బయానా డబ్బు తీసుకోడంవల్ల ఇక్కడే ఇరుక్కుపోతారు

మాట్లాడుతూనే, తన ఊరి నుంచి వచ్చిన యువ కార్మికులకు ఇటుకలను ఎండబెట్టడంలో సహాయం చేస్తున్నారు దేగు. బట్టీ వద్ద కట్టుకున్న తాత్కాలిక ఇళ్ళల్లో అందరికోసం కట్టెల పొయ్యి మీద మధ్యాహ్న భోజనం -అన్నం, కూరగాయతో ఒక కూర- వండుతున్నారు ఊర్వశి. చాలా సేపు సంభాషణ జరిగిన తరువాత మాత్రమే ఈ ధరువా జంట మాతో వాళ్ళ సమస్యల గురించి చెప్పారు.

దీని తరువాత తెలంగాణలో ఇంకొన్ని ఇటుక బట్టీలకు వెళ్ళాం కాని, ఎక్కడా మాకు వృద్ధ జంటలు కనిపించలేదు. “వాళ్ళు చూడడానికి ఎంత బలహీనంగా ఉన్నారో,” అన్నారు ధరువాల గురించి మాట్లాడుతూ, శర్మ. “పైగా ఇప్పుడు ఈ చిక్కులో(బయానా తీసుకోవటం) పడ్డారు. ఇది చాలా దారుణం. ఇదే వలసదారుల వాస్తవం.”

అనువాదం: అఖిల పింగళి

Purusottam Thakur
purusottam25@gmail.com

Purusottam Thakur is a 2015 PARI Fellow. He is a journalist and documentary filmmaker. At present, he is working with the Azim Premji Foundation and writing stories for social change.

Other stories by Purusottam Thakur
Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Akhila Pingali

Akhila Pingali is a freelance translator and writer from Visakhapatnam.

Other stories by Akhila Pingali