ఇది కాస్త వింతగా తోచవచ్చు- కాని ఢిల్లీలోని జిటి కర్నాల్ బైపాస్ వద్ద అందరి కళ్ళ ముందే జరిగింది.
నిరసన స్థలాల నుండి కొన్ని ట్రాక్టర్లు ఢిల్లీ వైపుగా వెళ్తున్నప్పుడు- వాటికి ఢిల్లీ నుండి సింఘు వైపు వెనక్కి వస్తున్నమరికొన్ని ట్రాక్టర్లు ఎదురుపడ్డాయి. ఈ గందరగోళాన్ని అర్దం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్ధమైన విషయమిది- ఢిల్లీ నుండి తిరిగి వచ్చే బృందం పోలీసులు ఒప్పుకున్న దారిలో కాక, తమ నాయకులు వేరే దారిలో రాజధాని వెళ్లాలనుకున్నారని అపోహపడి ఉదయమే రాజధానిలోకి వెళ్లి, మళ్లీ వారి నాయకులు తిరిగి రమ్మన్నారని వెనక్కి వస్తోంది.
సెప్టెంబరులో పార్లమెంటులో ప్రవేశించిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు తమ సొంత పద్ధతిలో రిపబ్లిక్ డే పరేడ్‌ను నిర్వహించారు, ఢిల్లీ సరిహద్దుల్లో సింగు, తిక్రీ, ఘాజిపూర్, చిల్లా మరియు మేవాట్ వంటి వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీవైపుగా తరలివెళ్లారు. రాజస్థాన్-హర్యానా సరిహద్దులోని షాజహాన్‌పూర్ వద్ద కూడా ఒక మార్చ్ జరిగింది, ఇక్కడ భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాహనాలు దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అఖిల భారత కిసాన్ సభ చెప్పినట్లుగా, “ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మరియు పౌర వేడుక”, అనవచ్చు.
ఇది చాలా భారీగా శాంతియుతంగా క్రమశిక్షణతో జరిగిన అపూర్వమైన విన్యాసం , సాధారణ పౌరులు, రైతులు, కార్మికులు మరియు ఇతరులు మనది రిపబ్లిక్ దేశం అని మళ్లీ మళ్లీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అనేక వేల ట్రాక్టర్ల పైన లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అంతేగాక భారత యూనియన్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాలలో ఇటువంటి వేడుకలు చేసి అన్నింటిని సమన్వయపరిచారు.
కానీ ఇంత ఆశ్చర్యకరమైన స్థాయిలో సాగుతున్న ఈ అద్భుతమైన దృశ్యాన్నుంచి, వీటన్నితో సంబంధం లేని మరొక విషయం మీదకి మీడియా చూపులను ఒక చిన్న సమూహం మళ్లించగలిగింది. రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలకు నాయకత్వం వహిస్తున్న 32 వ్యవసాయ సంఘాలతో కూడిన సమ్యూక్తా కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఢిల్లీలోకి ప్రవేశించిన సమూహాల హింస మరియు విధ్వంసాలను, వారు నిర్దేశించిన మార్గం గుండా కాక వేరే మార్గాల ద్వారా ఢిల్లీ కి చేరడాన్ని తీవ్రంగా ఖండించింది. SKM వారి చర్యను "శాంతియుతంగా జరుగుతున్న రైతుల పోరాట బలాన్ని పడగొట్టడానికి వేయబడిన పెద్ద కుట్ర" అని మండిపడింది.


ఉదయం 7:45 గంటలకు సింఘు సరిహద్దు వద్ద, పరేడ్ మార్గంలో తమ ట్రాక్టర్లు బయల్దేరే ముందు ఒక రైతుల బృందం బారికేడ్లు మరియు వ్యాగన్లను విచ్ఛిన్నం చేస్తూ బయలుదేరింది. వేరే సమూహాలు తమ ‘ర్యాలీని’ ముందే ప్రారంభించాయి. ‘బారికేడ్లను విచ్ఛిన్నం చేయడం నాయకత్వపు కొత్త ప్రణాళికేమో’ అని చాలా మంది గందరగోళానికి గురైయ్యారు.
"ప్రధాన ర్యాలీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది." "కానీ 32 సభ్యులున్నSKM యూనియన్ కు చెందని దీప్ సిద్దూ మరియు లఖా సిదానా [మరియు ఇతరుల] నేతృత్వంలోని దురాక్రమణదారులు ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించారు. వారు ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని రింగ్ రోడ్ వైపు వెళ్ళే అడ్డంకులను తొలగించడం, మరికొందర్ని వారితో చేరాలని ప్రేరేపించడం ప్రారంభించారు. వీరే ఎర్ర కోటలోకి ప్రవేశించి అక్కడ తమ సొంత జెండాను ఎగురవేశారు. ” అని 32 ఎస్‌కెఎం సంఘాలలో ఒకటైన కీర్తి కిసాన్ యూనియన్‌కు చెందిన కరంజిత్ సింగ్ చెప్పారు.
ఢిల్లీ లో జరిగిన ఈ సంఘటనలలో తన పాత్రలను ధృవీకరిస్తూ దీప్ సిద్దూ రికార్డు సృష్టించారు. సిద్దూ పంజాబ్, గురుదాస్‌పూర్,బిజెపి లోక్‌సభ ఎంపి అయినా సన్నీ డియోల్ కి సన్నిహితుడు.
“మేము వారికి అస్సలు మద్దతు ఇవ్వము. వారు చేసినది తప్పు అని మాకు తెలుసు. 26 న ఏమి జరిగిందో పునరావృతం కాదు. మేము ఈ నిరసనను ఎప్పటిలాగే శాంతియుతంగా ఉంచుతాము. ఎర్రకోట వద్ద బారికేడ్లను బద్దలు కొట్టడం లేదా జెండాను ఎగురవేయడాన్ని మేము సమర్థించము. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూస్తాం "అని కరంజిత్ సింగ్ చెప్పారు.
విడిపోయిన సమూహాలు ఇంతకుముందు తమ ‘ర్యాలీని’ ప్రారంభించడం మరియు బారికేడ్లను విచ్ఛిన్నం చేయడం నాయకత్వపు కొత్త ప్రణాళిక అని భావించిన చాలా మంది గందరగోళపడ్డారు . కవాతు కోసం సింఘు నుండి ఢిల్లీ వెళ్లే మార్గాన్ని ముందుగానే నిర్ణయించి పోలీసుల ఆమోదాన్ని తీసుకున్నారు. కానీ ఈ బృందాలు ఢిల్లీ లోకి ప్రవేశించడానికి వేరే మార్గాన్ని ఎంచుకుని ఎర్ర కోటకు చేరాయి. వారు కోటలోకి ప్రవేశించగానే, నిరసనకారులకు
పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. కొందరు కోటలోకి ప్రవేశించి జాతీయ జెండా పక్కన మతపరమైన జెండాను కూడా ఉంచగలిగారు.

సుమారు 7 : 50 ఉదయం సింఘు సరిహద్దు వద్ద: రైతుల బృందం బారికేడ్లను విచ్ఛిన్నం చేస్తూనే ఉంది, పోలీసులు వాటిని చూస్తూనే ఉన్నారు. ట్రాక్టర్ పరేడ్ కోసం సింగు నుండి ఢిల్లీకి వెళ్లే మార్గాన్ని ముందుగా నిర్ణయించి పోలీసుల ఆమోదాన్ని పొందారు. కానీ ఈ సమూహాలు వేరే మార్గాన్ని ఎంచుకున్నాయి.
దీనికి వ్యతిరేకంగా, ఈ విద్వంసాలను సైతం మర్చిపోయేంత అతిపెద్ద ప్రధాన ర్యాలీలో, ట్రాక్టర్ తరువాత ట్రాక్టర్, సమూహం తరువాత సమూహం, జాతీయ జెండాను గర్వంగా ఎగరేస్తూ ముందుకు సాగాయి.
"మేము రైతులము. మీకు ఆహారాన్ని అందించే పంటలను పండించాము. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా లక్ష్యం. మా లక్ష్యం ఎర్ర కోటలోకి ప్రవేశించి జెండాను అక్కడ పాతడం కాదు. నిన్న జరిగినది తప్పు" అని పంజాబ్‌లోని మోగాలోని షెరా షెరా గ్రామానికి చెందిన 45 ఏళ్ల బల్జందర్ సింగ్ అనే రైతు, అన్నారు.
కానీ అసలు ఆ సమయంలో మీడియా చూపు పూర్తిగా విడిపోయి చిన్న సమూహాలకు, ఢిల్లీ లో వారు చేసిన తమాషాల వైపుకి తిరిగింది. దీని వలన పూర్తిగా శాంతియుత ర్యాలీని విస్మరించారు. 32 సహకార సంఘాలకు చెందిన రైతులు, పోలీసులు ఆమోదించిన మార్గాన్ని అనుసరించి, వారి ట్రాక్టర్లను ఆ నిర్దేశిత మార్గంలో తీసుకొచ్చారు. ట్రాక్టర్ల పక్కన బైక్‌ల పై వచ్చిన వారు, సైకిళ్లపై వచ్చిన వారు, అలానే నడిచినవారు చాలా మంది ఉన్నారు.
ఈ ర్యాలీ రైతులు ఢిల్లీ పరిధిలో ప్రవేశించినప్పుడు, ఘర్షణలు లేదా అల్లర్ల వంటి సంఘటనలు లేవు. వారు ప్రయాణించిన ఢిల్లీ మార్గంలో చాలా మంది నివాసితులు బయటకు వచ్చి పువ్వులు, పండ్లు, తాగేందుకు నీళ్లు ఇచ్చారు. వీరిలో రోహిణికి చెందిన బాబ్లి కౌర్ గిల్ (50), ట్రాక్టర్లలో ఉన్న రైతులకు నీటి ప్యాకెట్లను పంచారు."నేను వారి కోసం ఇక్కడకు వచ్చాను, వారు మనకు అవసరమైన ప్రతిదాన్ని అందిస్తారు. నేను ఉదయాన్నే నిద్రలేచి టీ తాగుతాను, అల్పాహారానికి రొట్టెలు తింటాను. ఇవన్నీ రైతులు సమకూర్చినవే . ఒకసారి ఈ రైతుల కష్టాన్ని, వారి నిరసనని చూడండి. ఒక ఆడపిల్ల 12 నెలల చంటిబిడ్డతో సింఘు వద్ద ఉంది. ఆమె ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? భూమి అంటూ లేకపోతె ఆమె ఆ చంటివాడిని ఎలా పెంచగలుగుతుంది? ప్రభుత్వం ఆ చట్టాలన్నిటినీ రద్దు చెయ్యాలి.
"ఇది ప్రభుత్వ సెలవుదినం. నేను హాయిగా నా ఇంట్లోనే నా కుటుంబంతో సంతోషంగా గడపగలను కానీ రైతులకు మద్దతుగా నేను ఇక్కడకు వచ్చాను" అని .ఢిల్లీలోని సదర్ బజార్‌కు చెందిన అష్ఫాక్ ఖురేషి (38) అన్నారు. ‘వెల్కమ్ టు ఢిల్లీ,” అని బోర్డు పట్టుకొని ర్యాలీకి ఖురేషి స్వాగతం పలికారు.
ట్రాక్టర్లు పై రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు మరియు పువ్వులతో అందంగా అలంకరించారు. వాటి పైన భారతీయ జెండాలు ఎగురుతున్నాయి. రైతులు దేశం గురించి గర్వంతో, సంఘీభావంతో పాటలు పాడారు. ఈ మూడు చట్టాల ముందు తాము తలవంచవద్దని వారు గట్టిగా అనుకున్నారు. "ప్రభుత్వం మా విజ్ఞప్తిని వినవలసి ఉంటుంది, అది మాకు అవసరం లేని చట్టాలను తెస్తోంది. అది ఇప్పటికే అంబానీ మరియు అదానీలకు అమ్ముడుపోయింది. కానీ మేము ఓడిపోము.. మా చివరి శ్వాస వరకు పోరాడుతాము.” అని పాటియాలాకు చెందిన మనీందర్ సింగ్, 48, పారా లో ట్రాక్టర్లతో కలిసి నడుస్తూ అన్నారు.

ఉదయం 8:40 గంటలకు, సింఘు సరిహద్దు నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో: ట్రాక్టర్లలో ఎక్కువ భాగం ప్రజలు జెండాలు మోసుకొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. 32 సహకార సంఘాలకు చెందిన రైతులు తమకు నిర్దేశించిన మార్గాల్లోనే వారి ట్రాక్టర్లను నడిపారు.

ఉదయం 9 గంటలకు, సింగు సరిహద్దు నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో: ఒక రైతు తన చేయి ఊపి మమ్మల్ని చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. అతను కూర్చున్న ట్రాక్టర్ రంగురంగు కాగితాలు, రిబ్బన్లతో అలంకరించబడి ఉంది.

ఉదయం 9:10 గంటలకు, సింఘు సరిహద్దు నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో: ట్రాక్టర్ల పక్కన పరేడ్ మార్గం వెంట ఉత్సాహంగా, శాంతియుతంగా నడుస్తున్న రైతులు.

ఉదయం 9:30 గంటలకు, సింఘు సరిహద్దు నుండి సుమారు 8 కిలోమీటర్లు: అన్ని వయసుల రైతులు ట్రాక్టర్ల పక్కన నడుస్తూ, నినాదాలు చేస్తూ, నియమించబడిన మార్గాన్ని అనుసరిస్తూ నడుస్తున్నారు.

ఉదయం 10 గంటలకు, సింగు సరిహద్దు నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో: నియమించబడిన పరేడ్ మార్గంలో ట్రాక్టర్లలో కదులుతుండగా డాఫ్లిని పాడి, ఆడుతున్న రైతుల బృందం.

ఉదయం 10:10 గంటలకు, సింఘు సరిహద్దు నుండి సుమారు 8 కిలోమీటర్లు. పరేడ్ మార్గంలో ట్రాక్టర్లో వెళ్తూ 'రైతులను రక్షించండి, దేశాన్ని రక్షించండి' అని చెప్పే ప్లకార్డులను పట్టుకొన్న ఒక వ్యవసాయ కుటుంబం.

ఉదయం 11 గంటలకు, సింఘు సరిహద్దు నుండి సుమారు 12-13 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీలోని జిటి కర్నాల్ బైపాస్ వద్ద.

జిటి కర్నాల్ బైపాస్ వద్ద ఉదయం 11:10 గంటలకు.

జిటి కర్నాల్ బైపాస్ వద్ద,ఢిల్లీలోని సదర్ బజార్‌కు చెందిన అష్ఫాక్ ఖురేషి (38) రైతులకు తన సహాయాన్ని అందించడానికి రోడ్డు పక్కన నిలబడి, తన స్నేహితుడితో కలిసి 'ఢిల్లీ మిమ్మల్ని స్వాగతిస్తోంది’ అన్న బ్యానర్ ని పట్టుకుని నిలబడ్డారు.

మధ్యాహ్నం 12:15 గంటలకు. ఢిల్లీ లోని జిటి కర్నాల్ బైపాస్ వద్ద. ట్రాక్టర్లు వెళుతుండగా ఢిల్లీకి చెందిన మహిళల బృందం రోడ్డు పక్కన నిలబడి, నినాదాలు చేస్తూ రైతులకు తమ మద్దతును తెలుపుతున్నారు.

జిటి కర్నాల్ బైపాస్ వద్ద మధ్యాహ్నం సమయంలో: విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందం రైతులకు మద్దతుగా, పాటలు పాడటం మరియు నినాదాలు చేయడం ద్వారా రోడ్డుపై రైతుల నిరసనకు మద్దతు వ్యక్తం చేశారు.

మధ్యాహ్నం 2:15 గంటలకు, ఢిల్లీలోని జిటి కర్నాల్ బైపాస్ వద్ద: ఒక పిల్లవాడు ప్రయాణిస్తున్న రైతులకు ఆహారాన్ని అందిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా రైతులని పలకరిస్తున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు, జిటి కర్నాల్ బైపాస్, ఢిల్లీ వద్ద: కవాతు మార్గంలో అలిసిపోయిన రైతులకు తాగడానికి నీటిని అందించి తన మద్దతును తెలపడానికి 50 యేళ్ల బాబ్లి కౌర్ గిల్, ఢిల్లీలోని రోహిణి ప్రాంతం నుండి వచ్చారు.

మరుసటి రోజు, జనవరి 27న , ఉదయం 11 గంటలకు సింఘు సరిహద్దు వద్ద: కీర్తి కిసాన్ యూనియన్‌కు చెందిన 28 ఏళ్ళ కరంజిత్ సింగ్, రిపబ్లిక్ డే రైతుల కవాతులో విడిపోయిన చిన్న సమూహాల వలన రైతుల ఉద్యమం ఎలా దెబ్బతిన్నదో చెప్పారు. రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలకు నాయకత్వం వహిస్తున్న 32 వ్యవసాయ సంఘాలతో కూడిన సమ్యూక్తా కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఢిల్లీ లోకి ప్రవేశించిన సమూహాల హింస మరియు విధ్వంసాలను, నిర్దేశించిన మార్గం నుండి విడివడడాన్ని, తీవ్రంగా ఖండించింది. SKM ను, వారి చర్యను "శాంతియుతంగా సాగే రైతుల పోరాట బలాన్ని పడగొట్టడానికి చేసిన ఘోరమైన కుట్ర" అని ఖండించింది. మొత్తం మీద, రైతులు జరిపిన ఈ వేడుక ఒక భారీ, శాంతియుత, క్రమశిక్షణ కలిగిన అపూర్వమైన విన్యాసంగా అద్భుతంగా సాగింది. మనది రిపబ్లిక్ దేశం అని ఉటంకించడం కోసమే ఈ రోజును ఇంత ఘనంగా జరిపామని పౌరులు, రైతులు, కార్మికులు ఇంకా ఇందులో పాల్గొన్న అనేక వేల ట్రాక్టర్లలో ఉన్న లక్షలాది ప్రజలు, మళ్ళీ మళ్లీ చెప్పారు. ఇంతేగాక భారత యూనియన్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కవాతుల ద్వారా ఈ రోజు యొక్క ఉద్దేశాన్ని దేశ స్థాయిలో సమన్వయపరచారు .
అనువాదం: అపర్ణ తోట