ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ‌ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.

జీవితకాలం నడుంవంచడం

విజయనగరం. మండుతున్న మధ్యాహ్నపు ఎండవైపు ఆమె విసుగ్గా చూసి, చేస్తున్న పనిని ఆపింది. కానీ ఆమె అలా వంగిపోయే ఉండిపోయింది. కొన్ని క్షణాల్లోనే తాను మళ్ళీ పనిలోకి వంగాలని ఆమెకు బాగా తెలుసు.

ఆమె పనిచేస్తున్న జీడిమామిడి పొలాల్లోనే ఆమె గ్రామానికి చెందిన మరో రెండు సమూహాల మహిళలు పనిచేస్తున్నారు. ఒక సమూహం ఈ పొలానికి రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న పొలానికి మధ్యాహ్న భోజనం, నీరు తీసుకుని వెళ్లింది. మరో సమూహం వీరికి వ్యతిరేక దిశలో పని చేస్తోంది. అందరూ వీపులు వంచే పనిచేస్తున్నారు.

ఒడిశాలోని రాయగడలో మగవాళ్ళు కూడా పొలాల్లో కనిపించారు. కెమెరా లెన్స్ లోంచి చూస్తోంటే ఆ దృశ్యం మరింత అద్భుతంగా ఉంది! మగవాళ్ళంతా నిలబడి ఉన్నారు. ఆడవాళ్ళంతా నడుం వంచి పనిచేస్తున్నారు. ఒడిశాలోని నువాపడాలో కురుస్తోన్న వాన ఆ మహిళను కలుపు తీయకుండా ఆపలేదు. ఆమె ఒక గొడుగు నీడలో నడుము వంచి పనిచేసుకుంటూపోయింది.

వీడియో చూడండి : ' పనిచేస్తున్న ఆడవారిని చూడగానే నాకు మొదటగా కొట్టొచ్చినట్టు కనబడిన విషయం - వారు ఎప్పుడూ వంగి ఉండటం !' అని పి . సాయినాథ్ చెప్పారు

‘చేతులతో’ నాటడం, విత్తడం, కలుపు తీయడం వంటివి చాలా కష్టతరమైన పనులు. వారు చాలా సమయంపాటు తమ శరీరాన్ని అమిత బాధాకరమైన భంగిమలలో, వంచి పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం భారతీయ మహిళా కార్మికులలో 81 శాతం మంది సాగుదారులు, కూలీలు, అటవీ ఉత్పత్తులను, చిన్నమొత్తంలో పశువుల దాణాను సేకరించేవారు. వ్యవసాయ సంబంధిత పనులలో ఒక బలమైన లింగ విభజన కనిపిస్తుంది. మహిళలు పొలం దున్నడం నిషేధించబడింది. కానీ నాట్లు వేయడం, కలుపు తీయడం, పంట కోయడం, నూర్పిడి చేయడం వంటి పనులను మొత్తంగా వారే చేస్తారు; పంట కోత పూర్తయిన తర్వాతి పనులను కూడా చేస్తారు.

ఒక విశ్లేషణ ప్రకారం:

సాగు కోసం భూమిని సిద్ధంచేసే పనిలో 32 శాతం మంది;
విత్తనాలు విత్తేవారిలో 76 శాతం మంది;
మొక్కలు నాటటంలో 90 శాతం మంది;
పంటను పొలం నుండి ఇంటికి రవాణా చేస్తున్నవారిలో 82 శాతం మంది;
ఆహారాన్ని ప్రాసెస్ చేసే కార్మికులలో 100 శాతం మంది;
డెయిరీ పరిశ్రమలో ఉన్నవారిలో 69 శాతం మంది
మహిళలే ఉన్నారు.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ఈ పనులలో చాలా వరకు నడుము వంచీ, ముంగాళ్ళమీద కూర్చొనీ చేసేవి ఉంటాయి. అంతేకాకుండా, ఈ పనులలో ఉపయోగించే అనేక ఉపకరణాలు, పనిముట్లు మహిళలకు సౌకర్యంగా ఉండేటట్టు రూపొందించినవి కావు.

పొలాల్లో మహిళలు చేసే పనులు ముఖ్యంగా వారు నడుం వంచి, లేదా ముంగాళ్ళ మీద కూర్చొని ముందుకు సాగేలా ఉంటాయి. అందువల్ల వీపు వెనుకభాగంలో, కాళ్ళలో తీవ్రమైన నొప్పి మహిళల్లో సర్వ సాధారణం. నాట్లు వేసే సమయంలో ఎక్కువగా పిక్కల కిందివరకూ ఉండే  నీటిలో నిలబడటం వలన వారు చర్మ వ్యాధులకు కూడా గురవుతారు.

పురుషులకు అనువుగా ఉండేలా తయారుచేయబడిన పనిముట్ల వలన కలిగే గాయాలుంటాయి. ఆ పనిముట్లను మహిళలకు అనుకూలంగా ఉండేలా చేయడం జరగటంలేదు. కొడవళ్ళు, కత్తుల వలన కలిగే గాయాలు సర్వసాధారణం. మంచి వైద్య సదుపాయం దొరకడం కూడా చాలా అరుదు. ధనుర్వాతం నిరంతరంగా ఉండే ముప్పు.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

వ్యవసాయంలో ఉండే అటువంటి పనుల వలన ఎదురయ్యే పెద్ద సమస్య, అధిక సంఖ్యలో శిశు మరణాలు.  ఉదాహరణకు, నాట్లు వేసే సమయంలో మహిళలు రోజులో అధికభాగం వంగొని లేదా ముంగాళ్ళపై కూర్చొని పనిచేస్తారు. అత్యధిక గర్భస్రావాలు, శిశు మరణాలు సంభవించే కాలం ఇదేనని మహారాష్ట్రలో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలం ముంగాళ్ళపై కూర్చొని ఉండటం వలన కలిగే శ్రమా, ఒత్తిడీ నెలలు నిండకుండానే పిల్లలు పుట్టేలా చేస్తాయి.

అలాగే మహిళా కార్మికులకు సరిపడా ఆహారం అందడం లేదు. సాధారణంగా వారిలో ఉండే పేదరికమే అందుకు కారణం. కుటుంబానికి మొదట వడ్డించి, చివరికి తాము తినడం అనే ఆచారం ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. గర్భిణీ స్త్రీలు తినాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వారికి మెరుగైన ఆహారం లభించదు. తల్లులకే పౌష్టికాహారం తక్కువైనందున, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు మరి జీవించలేనంత అతి తక్కువ బరువును కలిగి ఉంటారు.

ఈవిధంగా మహిళా వ్యవసాయ కార్మికులు మళ్ళీ మళ్ళీ గర్భందాల్చటం, అధిక శిశు మరణాల చక్రబంధంలో చిక్కుకుంటారు. ఇది వారి ఆరోగ్యాన్ని మరింత నాశనం చేస్తుంది. దాంతో గర్భవతులుగా ఉన్నప్పుడూ, ప్రసవ సమయంలోనూ ఎక్కువమంది మరణిస్తుంటారు.

PHOTO • P. Sainath

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli