దీప ఆసుపత్రిని వదిలే సమయానికి, ఆమె గర్భాశయంలో కాపర్-టి ని పెట్టారని ఆమెకు తెలియదు.
ఆమె తన రెండవ పిల్లాడిని ప్రసవించింది. ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందామనుకుంది. కానీ ఆమె ప్రసవం సి-సెక్షన్ ఆపరేషన్ ద్వారా అయింది. “డాక్టరు రెండు ఆపరేషన్లు( సి సెక్షన్, ట్యూబల్ లైగేషన్ లేదా కుటుంబ నియంత్రణ) ఒకేసారి చేయకూడదని చెప్పారు,” అన్నది దీప.
ఆ డాక్టరు దానికి బదులు కాపర్-టి వాడమని చెప్పారు. దీప, ఆమె భర్త నవీన్(అసలు పేర్లు కావు) అది సలహా మాత్రమే అనుకున్నారు.
మే 20188 లో ఆమె ప్రసవించిన నాలుగు రోజులకు, 21 ఏళ్ళ దీపను ఢిల్లీ లోని ప్రభుత్వం నడిపే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ చేశారు. “డాక్టరు ఆమె గర్భాశయంలో కాపర్- టి పెట్టారని మాకు తెలియదు,” అన్నాడు నవీన్.
ఆ తరవాత వారానికి, వారి ప్రాంతపు ఆశ వర్కర్ డిశ్చార్జ్ రిపోర్ట్ చదివాక- అప్పటిదాకా నవీన్, దీప ఆ రిపోర్ట్ ని చదవలేదు, వాళ్లకు ఏం జరిగిందో తెలిసింది.
కాపర్-టి అనేది గర్భాశయ గర్భనిరోధక పరికరం (IUD). దీనిని గర్భాశయ ముఖద్వారం వద్దకు తోసి గర్భధారణని నిరోధిస్తారు. “ఇది శరీరంలో అలవాటు కావడానికి మూడు నెలలు పడుతుంది. కొందరిలో ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. అందుకే మేము మా పేషెంట్లను ఆరునెలలకు ఒకసారి చెక్ అప్ కు రమ్మని చెబుతాము,” అన్నారు 36 ఏళ్ళ సుశీల దేవి. ఈమె దీప ఉంటున్న ప్రాంతం లో ఆశ(Accredited Social Health Activist- ASHA) వర్కర్ గా పనిచేస్తుంది
కానీ దీపకు మొదటి మూడు నెలలు కూడా ఏ ఇబ్బంది కాలేదు. పైగా ఆమె తన పెద్ద కొడుకు అనారోగ్యం పాలవడంతో అతనిని చూసుకుంటూ ఉంది. అందుకే ఆమె చెక్ అప్ కు వెళ్ళలేదు. కాపర్-టి వాడుతూ ఉందామని నిశ్చయించుకుంది.
సరిగ్గా రెండేళ్ల తరవాత, మే 2020 లో, దీపకు తన బహిష్టు వచ్చింది. దానితో పాటే ఆమెకు భరించలేని నొప్పి వచ్చింది. ఇక ఆమె ఇబ్బందులు కూడా మొదలయ్యాయి.
ఆ నొప్పి ఇంకా కొద్దికాలం భరించాక, ఆమె తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ లోని బక్కర్వాల ప్రాంతంలోని ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్(AAMC)కి వెళ్ళింది. “అక్కడి డాక్టర్ నొప్పి నుండి ఉపశమనం కోసం కొన్ని మందులు రాసి ఇచ్చారు,” అన్నది దీప. ఆమె అతనిని ఒక నెల పాటు సంప్రదించింది. “నా పరిస్థితి ఇంకా మెరుగు పడకపోవడంతో, ఆయన నన్ను AAMC లోని ఇంకొక లేడీ డాక్టర్ వద్దకు పంపించాడు.” అన్నది దీప.
మొదటిసారి దీప బక్కర్వాల AAMCకి వెళ్ళినప్పుడు అక్కడి మెడికల్ ఆఫీసర్ ఇంచార్జి అయిన డా. అశోక్ హన్స్, దీప కేసు గురించి నేను ఆయనతో మాట్లాడినప్పుడు గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు. ఆయన రోజుకు 200 మంది పేషెంట్లను చూస్తారు. “అటువంటి కేసు మా వద్దకు వచ్చినప్పుడు మేము చికిత్స చేస్తాము,” అని ఆయన నాతో అన్నారు. “మేము రుతుక్రమం సరిగ్గా లేకపోతే దానిని నియంత్రించడానికి మందులు ఇస్తాము. లేదంటే అల్ట్రా సౌండ్ చేయించుకోమని వేరే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపేస్తాము.” ఈ క్లినిక్ లో దీపకు కూడా అల్ట్రా సౌండ్ చేయించుకోమని చెప్పారు.
“ఆమె ఇక్కడకి వచ్చినప్పుడు, తన రుతుక్రమం సరిగ్గా రావడం లేదు అని మాత్రమే చెప్పింది. దానిని బట్టి నేను ఆమె మొదటిసారి వచ్చినప్పుడు ఐరన్, కాల్షియమ్ మందులు ఇచ్చాను,” అన్నారు అమృత నాడార్. బక్కర్వాల ల్లో ఉన్న ఇంకొక చిన్న AAMC లో పనిచేస్తుందీవిడ. “ఆమె కాపర్-టి గురించి ఏమి చెప్పలేదు. ఆమె చెప్పి ఉంటే మేము అల్ట్రా సౌండ్ ద్వారా అది ఎక్కడ ఉండిపోయిందో కనుక్కోగలిగేవాళ్లం. ఆమె దానికి ముందు అల్ట్రా సౌండ్ రిపోర్ట్ తీసుకు వచ్చింది, అందులో అంతా బాగానే ఉంది.” కానీ దీప తన కాపర్ టి గురించి డాక్టర్ కి చెప్పానని చెబుతుంది.
మే 2020లో బాధాకరంగా మొదలైన మొదటి రుతుస్రావం తరవాత, ఆమె కష్టాలు ఇంకా పెరిగాయి. “ఆ నెలసరి ఐదు రోజుల్లో ముగిసింది. అది మామూలే నాకు.” అన్నదామె. “కానీ ఆ తరవాత నెల నాకు చాలా అధిక రక్తస్రావమైంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. జూన్ లో ఇంచుమించుగా పది రోజులు బహిష్టు సమయం సాగింది. ఆ తరవాత నెల 15 రోజులు, ఇక ఆగష్టు 12 నుంచి నెల రోజుల పాటు రక్తస్రావం జరిగింది.”
పశ్చిమ ఢిల్లీ లో, నాన్ గ్లోయ్ - నజాఫ్ గడ్ రోడ్ లో ఉన్న ఆమె రెండు గదుల ఇంట్లో చెక్క మంచం మీద కూర్చుని దీప చెప్పింది. “ఆ రోజుల్లో నాకు లేచి తిరగడానికి కూడా ఓపిక లేదు. నడవడం కూడా చాలా కష్టం అయ్యేది. నాకు కళ్ళు తిరుగుతూ ఉండేవి. అలా పడుకునే ఉండేదాన్ని. ఏ పని చేయలేకపోయేదాన్ని. నా పొత్తికడుపులో పొడుస్తున్నంతగా విపరీతమైన నొప్పి వచ్చేది. చాలాసార్లు, నా బట్టలు రోజుకు నాలుగు సార్లు మార్చవలసి వచ్చేది ఎందుకంటే అవి రక్తం తో తడిసిపోయేవి. పక్క బట్టలు కూడా పాడయిపోయేవి.”
జులై ఆగష్టు 2020 లలో, దీప రెండుసార్లు చిన్న బక్కర్వాల క్లినిక్ కి వెళ్ళింది. రెండుసార్లూ అక్కడి డాక్టర్ మందులు రాశారు. “మేము రుతుక్రమం సరిగ్గా రాని మా పేషెంట్లను, మందులు వాడాక నెలసరిని ఒక నెల పాటు జాగ్రత్తగా గమనించమని చెబుతాము. మేము ఇక్కడ ప్రాధమిక చికిత్స మాత్రమే ఇవ్వగలం. దీని పై సంప్రదించాలంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజి విభాగానికి వెళ్ళవలసి ఉంటుంది.” అని డా. అమృత నాతో చెప్పారు.
దీప బస్సు ఎక్కి అక్కడికి దగ్గరగా, రఘుబిర్ నగర్ లో ఉన్న గురు గోబింద్ సింగ్ హాస్పిటల్(తన ఇంటికి 12 కిలోమీటర్లు)కు ఆగష్టు 2020 మధ్యలో వెళ్ళింది. అక్కడున్న డాక్టర్ డయాగ్నసిస్ లో మెనొరగియ(Menorrhagia) - అన్ని చెప్పారు. అంటే నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, లేక ఎక్కువ కాలం రక్తస్రావం జరుగుతుంది.
“రెండు సార్లు ఈ ఆసుపత్రికి వెళ్లాను,” అన్నది దీప. “ప్రతిసారి వాళ్ళు రెండు వారాలకు మందులు రాశారు. కానీ నొప్పి తగ్గలేదు.”
దీపకు ఇప్పుడు 24 ఏళ్ళు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ లో రాజకీయ శాస్త్రం లో బి ఏ చేసింది. ఆమెకు మూడేళ్లు కూడా నిండకముందే ఆమె తల్లిదండ్రులు ఆమెను తీసుకుని ముజాఫర్ నగర్ నుంచి వలస వచ్చేశారు. ఆమె తండ్రి ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు, ఇప్పుడు ఒక చిన్న స్టేషనరీ షాప్ నడుపుతున్నారు. ఆమె భర్త, ఇరవైతొమ్మిదేళ్ళ నవీన్, రాజస్థాన్ లోని దౌసా జిల్లాకు చెందినవాడు. అతను రెండో తరగతి వరకు చదువుకున్నాడు. ఢిల్లీ లో లాక్డౌన్ ప్రకటించేవరకు స్కూల్ బస్సు అటెండెంట్ గా పని చేసేవాడు.
ఆ జంటకు అక్టోబర్ 2015 లో పెళ్లయింది, ఆ తరవాత, దీప మొదటిసారి గర్భం దాల్చి, కొడుకుని ప్రసవించింది. వారి ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఆమెకు ఒక కొడుకు చాలు అనుకుంది. కానీ ఆమె కొడుకుకు రెండో నెల నుంచే ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి.
“అతనికి ఎప్పుడూ డబల్ నిమోనియా ఉండేది. డాక్టర్ అడిగాడని మేము వేలకువేలు బాబు చికిత్స కోసం ఖర్చుపెట్టిన రోజులున్నాయి.” అన్నది. “ఒకసారి ఒక ఆసుపత్రిలో డాక్టర్, బాబు ఉన్న పరిస్థితి లో ఎక్కువ కాలం బతకడం కష్టం అని చెప్పారు. అప్పుడు మా కుటుంబం అంతా ఇంకో పిల్లాడిని కనమని ఒత్తిడి చేశారు.”
పెళ్ళికి ముందు కొన్ని నెలల పాటు, దీప టీచర్ గా ఒక ప్రైవేట్ ప్రైమరీ స్కూల్ లో పనిచేసి, నెలకు 5000 రూపాయిలు సంపాదించేది. కానీ ఆమె కొడుకు అనారోగ్యం వలన ఆమె టీచర్ గా కొనసాగడం కుదరలేదు.
ఇప్పుడు ఆ బాబుకు ఐదేళ్లు. సెంట్రల్ ఢిల్లీ లోని రామ్ మనోహర్ లోహియా(RML) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె బస్సు లో ప్రతి మూడు నెలలకు ఒకసారి చెక్ అప్ లకు తీసుకు వెళ్తుంది. కొన్నిసార్లు ఆమె అన్న తన మోటార్ సైకిల్ మీద వారిని దిగబెడతాడు.
సెప్టెంబర్ 3, 2020 లో, RML కు వెళ్లిన అటువంటి ఒక సంప్రదింపు సమయంలో, ఆమె ఆ ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగానికి వెళ్లాలని నిశ్చయించుకుంది. అంతకు ముందు ఎన్నో ఆసుపత్రులకు వెళ్లినా తగ్గని నొప్పిని తగ్గించుకుందామని.
“నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి ఒక అల్ట్రా సౌండ్ చేశారు కాని ఏమీ తెలుసుకోలేకపోయారు. డాక్టర్ కూడా కాపర్-టి కోసం చూసారు కానీ, దాని దారం ఎక్కడా కనపడలేదు. ఆ డాక్టర్ కూడా మందులు ఇచ్చి ఇంకో మూడు నెలల తరవాత కనపడమని చెప్పారు.” అన్నది దీప.
అయినా తీవ్ర రక్త స్రావానికి ఖచ్చితమైన కారణం దొరకక సెప్టెంబర్ 4న దీప తన ఇంటి దగ్గర ఉన్న చిన్న ప్రైవేట్ క్లినిక్ కి వెళ్ళింది . “ఆ డాక్టర్ ఇంత స్రావాన్ని భరిస్తూ ఎలా ఉన్నావని అడిగింది. ఆమె కూడా కాపర్-టి ని కనిపెట్టడానికి ప్రయత్నించింది కానీ కనిపెట్టలేకపోయింది.” దీప 250 రూపాయిలు ఈ చెక్ అప్ కి ఖర్చుపెట్టింది. అదే రోజు ఒక కుటుంబ సభ్యుని సలహాతో 300 రూపాయిలు ఖర్చుపెట్టి పెల్విక్ ఎక్స్-రే చేయించుకుంది.
ఆ రిపోర్ట్ లో “కాపర్ టి హెమిపెల్విస్ వద్ద కనిపిస్తుంది” అని ఉంది.
“సి సెక్షన్ అయ్యాక, లేక ప్రసవం అయిన వెంటనే కాపర్-టి పెడితే అది వంగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి”, అన్నారు వెస్ట్ ఢిల్లీ లోని గైనకాలజిస్ట్ జ్యోత్స్నా గుప్త. “ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ గర్భాశయ కుహరం విస్తరిస్తుంది, సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ఇటువంటి సమయంలో కాపర్-టి పెడితే అది దాని ఆక్షాన్నిమార్చుకుంటుంది. ఒకవేళ ఆ మహిళా నెలసరి లో విపరీతమైన నొప్పి(Cramps) వస్తే అది స్థానభ్రంశం చెందవచ్చు లేదా పక్కకి వంగిపోవచ్చు.”
ఇటువంటి ఫిర్యాదులు మామూలే, అన్నది ఆశ వరకర్ సుశీల దేవి. “చాలా మంది ఆడవాళ్లు కాపర్-టి గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు”. అన్నది ఆమె. “చాలాసార్లు అది వారి ‘కడుపులోకి వచ్చేసింద’ని దానిని తీయించుకోవాలని చెబుతారు”
1. 5 శాతం మహిళలు మాత్రమే IUD ని గర్భనిరోధక సాధనంగా చూస్తారు, అని నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే -4 (2015-16) నివేదిక చెబుతుంది. అయితే 15-36 ఏళ్ళ లోపల వయసులో ఉన్న మహిళల్లో 36శాతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు.
“కాపర్-టి అందరికి సరిపడదు, దీని వలన చాలా సమస్యలు రావచ్చు, అని నేను చాలా సార్లు విన్నాను”,అన్నది దీప. “కానీ నాకు రెండేళ్ల పాటు ఏ ఇబ్బందులు రాలేదు.”
నెలల తరబడి నొప్పి, విపరీతమైన రక్తస్రావం భరించలేక, పోయిన ఏడాది సెప్టెంబర్ లో దీప ఢిల్లీలోని పీఠంపురలో ప్రభుత్వం నడిపే భగవాన్ మహావీర్ హాస్పిటల్ కు వెళ్ళింది. అక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆమె బంధువు, ఆ ఆసుపత్రిలో డాక్టర్ ని కలవమని చెప్పాడు. కానీ దానికి ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. కాబట్టి ఆమె సెప్టెంబర్ 7, 2020న, ఇంటి దగ్గర డిస్పెన్సరీ లో పరీక్ష చేయించుకుంది.
పరీక్ష లో ఆమెకు పాజిటివ్ వచ్చి మళ్లీ రెండు వారాల పాటు ఇంటిలో క్వారంటైన్ అయింది. ఆమెకు నెగటివ్ రిపోర్ట్ వచ్చేవరకు ఆమె ఏ ఆసుపత్రికి వెళ్లి కాపర్-టి తీయించుకోలేదు.
మార్చ్ 2020లో భారతదేశంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. స్కూళ్లు కూడా మూతబడ్డాయి కాబట్టి అప్పటిదాకా కండక్టర్(అటెండెంట్)గా పని చేసిన, ఆమె భర్త నవీన్, 7000 రూపాయిలు వచ్చే ఉద్యోగాన్ని కోల్పోయాడు. అతనికి ఆ తరవాత ఐదు నెలల వరకు ఉద్యోగం దొరకలేదు. అప్పుడప్పుడు స్థానిక క్యాటరర్లు పిలిస్తే వారి వద్ద పని చేసి రోజుకు 500 రూపాయిలు సంపాదించేవాడు. (చివరికి, పోయిన నెల, ఆగష్టు 2021 లో, అతనికి బొమ్మలను తయారు చేసే ఫ్యాక్టరీ లో నెలకు 5,000 రూపాయిల జీతం మీద పని దొరికింది.)
సెప్టెంబర్ 25న, దీపకు కోవిడ్ పరీక్ష లో నెగటివ్ వచ్చాక, ఆమె భగవాన్ మహావీర్ హాస్పిటల్ నుంచి కబురు వస్తుందేమో అని ఎదురు చూసింది. ఆమె బంధువు, దీప ఎక్స్ రే రిపోర్ట్ ని అక్కడి డాక్టరుకి చూపించడానికి తీసుకెళ్లారు. డాక్టర్ కూడా కాపర్-టి ని ఆసుపత్రిలోనే తొలిగించవచ్చునని చెప్పారు. కానీ దీనికోసం ఆమెను దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి(DDU) కి వెళ్ళమని చెప్పారు. అక్కడే ఆమెకు IUD పెట్టింది.
దీప అక్టోబర్ మొదటి వారం DDU ఆసుపత్రిలో గైనకాలజి విభాగం లో అవుట్ పేషెంట్ క్లినిక్ వద్దే గడిపింది. “నేను డాక్టర్ ని కాపర్ టి తీసివేసి, దానికి బదులు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయమన్నాను. కానీ కోవిడ్ వలన ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదని చెప్పారు”, అని గుర్తుకు తెచ్చుకుంది.
ఆమె కాపర్-టి ని ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నప్పుడే తీసివేస్తాము, కానీ దానికి సేవలు పునఃప్రారంభం కావలసి ఉంది, అని చెప్పారు.
మరిన్ని మందులు రాశారు. “మరింకేదైనా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటాము, ఇది మందులతో తగ్గిపోవాలి, అని డాక్టర్ చెప్పారు,” అని నాతో, పోయిన ఏడాది అక్టోబర్ లో అన్నది దీప.
(ఈ విలేఖరి DDU ఆసుపత్రిలోని గైనకాలజి OPD ని నవంబర్ 2020 లో దీప కేసు గురించి మాట్లాడదామని వెళ్లారు. కాని ఆ రోజు డాక్టర్ డ్యూటీ లో లేరు. మరో డాక్టర్ నన్నుముందు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ వద్ద అనుమతి తీసుకుని రమ్మని సలహా ఇచ్చారు. నేను చాలా సార్లు ఆ డైరెక్టర్ ని ఫోన్ లో సంప్రదించుదామని ప్రయత్నించాను కాని, సమాధానం లేదు.)
ఆమె ఏమైనా పనిముట్లు వాడిందో(కాపర్-టి తీయడానికి) లేదో నాకు తెలీదు… ‘ఇంకో రెండు నెలలు ఆగి ఉంటే నా ప్రాణాల మీదికి వచ్చేది అని ఆ నర్స్ చెప్పింది’
“మహారోగాన్ని నియంత్రించేందుకు ఆరోగ్య యంత్రాంగ సేవలను మళ్లించినప్పుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఇబ్బంది పడ్డాయి. దీని వలన నగరంలో ఆరోగ్యసేవలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.” అన్నారు ఢిల్లీలో డైరెక్టరేట్ అఫ్ ఫామిలీ వెల్ఫేర్ లోని సీనియర్ అధికారి. “కొన్ని ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా మారాయి. దీనివలన కుటుంబ నియంత్రణ వంటి సేవలు ఆగిపోయాయి. శాశ్వత పద్ధతులైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయి చాలా ఇబ్బంది అయింది. కానీ అదే సమయానికి తాత్కాలిక పరిష్కారాలు పెరిగాయి. మేము కుదిరినంత వరకు ఈ సేవలును నడపడానికి ప్రయత్నించాం - ఎంత కుదిరితే అంత.”
“పోయిన ఏడాది కుటుంబ నియంత్రణ సేవలు అర్ధాంతరంగా నిలిపివేశారు, ఆ సమయంలో సేవల కోసం వచ్చిన ఎందరో అవి అందుకోకుండానే వెనుదిరగవలసి వచ్చింది.” అన్నారు రష్మీ అర్దే, డైరెక్టర్, క్లినికల్ సర్వీస్ ఫౌండేషన్ అఫ్ రీప్రొడక్టివ్ హెల్త్ సర్వీసెస్ అఫ్ ఇండియా. “కానీ ఇప్పుడు ప్రభుత్వం అందించిన సూచికలతో, సేవలు అందుకునే పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. కానీ మహారోగం రాక ముందు అందుకోగలిగినన్ని సేవలు ఇప్పుడు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీని వలన మహిళల ఆరోగ్యం పై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది.”
ఇంకా దీపకు ఏం చెయ్యాలో తెలియక, అక్టోబర్ 10న ఆమె ఇంటి పరిసరాల్లో ఉండే నర్స్ ని కలిసింది. ఆమె ద్వారా కాపర్-టి తీయించుకోవడానికి, ఆమెకు 300 రూపాయిలు ఇచ్చింది.
“ఆమె ఏమైనా పనిముట్లు(కాపర్ టి తీయడానికి) వాడిందో లేదో నాకు తెలీదు. డాక్టరు చదివే కూతురి సహాయం తీసుకుంది. అది తీయడానికి వాళ్ళకి 45 నిముషాలు పట్టింది. ఇంకో రెండు నెలలు ఆగి ఉంటే నా ప్రాణాల మీదికి వచ్చేది అని ఆ నర్స్ నాకు చెప్పింది.”
కాపర్-టి తొలగించగానే దీప అధిక రక్త స్రావం, నొప్పి వెంటనే తగ్గిపోయాయి.
సెప్టెంబర్ 2020 లో, ఆమె మంచం మీద, ఆమె తిరిగిన వివిధ ఆసుపత్రులలోని ప్రిస్క్రిపిషన్లు, రసీదులు, రిపోర్టులు పరచి, నాకు చెప్పింది. “ఈ ఐదు నెలలలో నేను ఏడు ఆసుపత్రులు తిరిగాను,” దీపకు, నవీన్ కు పని దొరకక ఉన్న కొద్ధి డబ్బూ ఈ పనికే ఖర్చుపెట్టారు.
దీప, తనకి ఇక పిల్లలు వద్దని ఖచ్చితంగా చెబుతుంది. ఆమె ట్యూబల్ లైగేషన్ ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటుంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష కూడా రాద్దామనుకుంటోంది. “నేను అప్లికేషన్ ఫారం తెచ్చుకున్నా”, అని చెప్పింది. ఆమె కుటుంబాన్ని గట్టున చేర్చడానికి, ఉద్యోగం సంపాదించాలనే ఆశతో ఉన్న దీప, ఈ మహారోగం, కాపర్ టి వలెనే తన ఆశయాలకు అడ్డంకి వచ్చింది అని చెప్పింది.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని మళ్లీ ప్రచురించాలనుకుంటున్నారా? అయితే zahra@ruralindiaonline.org కి మెయిల్ చేసి అందులోనే namita@ruralindiaonline.org కు కాపీ పెట్టండి.
అనువాదం: అపర్ణ తోట