“ఆమె, మన గెస్ట్ హౌస్ గురించి తెలుసుకోడానికి వచ్చింది,” రాణి అన్నది తన ‘రూమ్మేట్’ లావణ్య తో. మేము ఎందుకు వచ్చామో తెలుసుకున్నాక వారు కాస్త తెరిపిన పడ్డారనిపించింది.
మేము మొదటిసారి జనవరిలో ఈ అతిథి గృహం గురించి వివరాలు అడుగుతున్నామని కూవలాపురంలో ఆందోళన మొదలైంది. మగవాళ్లు గుసగుసగా మమ్మల్ని ఇద్దరు ఆడవారు ఉన్నవైపు చూపించారు- ఆ మధ్యకాలంలోనే బిడ్డల తల్లులైన ఇద్దరు యువతులు, దూరంగా ఒక ఇంటి వాకిలిలో కూర్చుని ఉన్నారు.
“ఇది వేరే వైపు ఉంది. పద వెళదాం”, ఊరికి ఒక కిలోమీటర్ అవతలకు తీసుకెళుతూ అన్నారు ఆడవారు. రెండు ఒంటరి గదులు, దీనినే వారు ‘అతిథి గృహం’, అని పిలుస్తారు, మేము అక్కడికి చేరుకునే సరికి ఎవరూ అక్కడ లేరు. ఈ రెండు గదుల మధ్య ఉన్న ఒక వేపచెట్టు కొమ్మలకు కొన్ని సంచులను వేలాడదీసి ఉంచారు.
అయితే, నెలసరిలో ఉన్న ఆడవారే, ఈ అతిథి గృహంలో ‘అతిథులు’. వారిని ఇక్కడికి ఆహ్వానించడమో లేక వారంతట వారు రావడమో కాదు. మధురై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో, 3,000 జనాభా ఉన్న ఈ ఊరిలోవారు, వారి కులపు ఆచారంలో భాగంగా, ఆడవారిని నెలసరి సమయంలో ఇక్కడ ఉండమని బలవంతంగా పంపుతారు. మేము ఆ అతిథి గృహంలో ఇద్దరు ఆడవారు- రాణి, లావణ్య(అసలు పేర్లు కావు)ని కలిశాము. వారు ఇక్కడే ఇంకో ఐదు రోజులు ఉండాలి. ఒకవేళ మొదటిసారి రజస్వల అయిన అమ్మాయి అయితే, ఒక నెల మొత్తం ఇక్కడే ఉండాలి. అలాగే అప్పుడే ప్రసవించిన బాలింతలు కూడా వారి బిడ్డలతో ఇక్కడే ఉండాలి.
“మేము మా సంచులను ఈ గదిలో ఉంచుకుంటాము,” వివరించింది రాణి. ఈ సంచులలో నెలసరిలో ఉండే ఆడవారు వాడవలసిన భోజన పాత్రలు వారికోసం విడిగా ఉంటాయి. ఇక్కడ వంట చెయ్యరు. ఇంటి నుండే భోజనం పంపడమో, లేక చాలా సార్లు, ఇంటి చుట్టుపక్కల వారు వండి ఈ గిన్నెలలో పెట్టి పంపడమో చేస్తారు. ఈ పాత్రలను తాకకుండా ఉండడానికి వీటిని సంచులలో పెట్టి వేపచెట్టుకు వేలాడదీస్తారు. ఒకే కుటుంబ సభ్యులైనాగాని, ఒక్కో అతిథికి విడిగా పాత్రలు ఉంటాయి. కానీ ఇక్కడ గదులు మాత్రం రెండే ఉన్నాయి. అవి ఇక్కడికి వచ్చిన వారందరూ వాడుకుంటారు.
కూవలాపురంలో ఆడవారందరి పరిస్థితి రాణి, లావణ్యల వంటిదే. ఇందులో ఒక్క గదిని రెండు దశాబ్దాల క్రితం గ్రామస్తులంతా చందాలు వేసుకుని కట్టారు. ఈ ఇద్దరు ఆడవారికి 23 ఏళ్ళకు పెళ్లి అయింది. లావణ్య కి ఇద్దరు పిల్లలు, రాణికి ఒక్కరే. వీరిద్దరి భర్తలు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు.
“ప్రస్తుతం ఇక్కడ ఇద్దరమే ఉన్నాము. కొన్నిసార్లు ఇక్కడ 8-9 మంది ఆడవారుంటారు. అప్పుడు ఈ గదులు నిండిపోతాయి,” అన్నది లావణ్య. అలా తరచుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఊరి పెద్దలు ఇంకో గది వేయిస్తామని మాట ఇచ్చాక, అక్కడి యువజన సంక్షేమ సంఘం చందాలు వేసుకుని అక్టోబర్ 2019లో మరో గదిని నిర్మించారు.
ఆ అతిథి గృహంలో ప్రస్తుతం వారిద్దరే ఉంటున్నా-రాణి, లావణ్య, ప్రస్తుతం ఆ రెండు గదులలో పెద్దగా ఉన్న కొత్త గదిలో ఉంటున్నారు. ఎందుకంటే ఆ గది విశాలమైనది. అందులో గాలీ వెలుతురూ బాగా వస్తోంది. బాధనిపించే విషయం ఏంటంటే ఇటువంటి పాత కాలపు పద్ధతిని పాటించే ఈ పరిస్థితిలో లావణ్య ఒక లాప్ టాప్ పట్టుకుని ఆ గదిలో కూర్చుంది. ఇది ఆమెకు స్కూల్ లో చదివేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ లాప్ టాప్ అందింది. “ఇక్కడ కూర్చుని ఇక మేము ఎలా సమయం గడపాలి? అందుకే మేము పాటలు వింటూ, సినిమాలు చూస్తూ గడుపుతాము. నేను ఇంటికి వెళ్లిపోయేటప్పుడు దీనిని నాతో తీసుకుపోతాను.” అన్నదామె.
‘అతిథి గృహం’ అని మర్యాదగా పిలిచినా దాని అసలు పేరు ముట్టుతురై (ముట్టుగది), మైలపడిన ఆడవారి గది. “మేము మా పిల్లల ముందు వాళ్లకు అర్థం కాకుడదని, దీనిని ‘అతిథి గృహం’, అని పిలుస్తాము.” అని చెప్పింది రాణి. “ ముట్టుతురై లో ఉండడం అంటే సిగ్గుపడే విషయం - ముఖ్యంగా గుడిలో పండగలు జరుగుతున్నప్పుడు లేదా ఊరి పండగలప్పుడు, మా బయట ఊరి చుట్టాలు వస్తారు, వారికి ఇక్కడి పధ్ధతి తెలీదు.” మధురై జిల్లాలో నెలసరికి వచ్చిన ఆడవారు బయట అతిథి గృహంలో ఉండే పద్ధతిని పాటించే ఐదు గ్రామాలలో, కూవలాపురం ఒకటి. ఇదిగాక పుదుపట్టి, గోవిందానల్లూర్, సాపూర్ అలగపూరి, చిన్నయ్యపురం - ఈ నాలుగు గ్రామాలు ఇదే పద్ధతిని పాటిస్తాయి.
ఇలా విడిగా ఉంచటం వలన వివక్ష ఏర్పడుతుంది. పెళ్లికాని యువతులు అనుకున్న సమయానికి అతిథి గృహానికి వెళ్లకపోతే ఊరిలోని వారి నాలుకలు ధ్వజమెత్తుతాయి. “వారికి నా ఋతుచక్రం ఎలా సాగుతుందో తెలీదు. కానీ నేను 30 రోజులకు ఒకసారి ముట్టుతురై కి వెళ్లకపోతే, నన్ను స్కూల్ మానిపించాలని చెబుతారు”, అన్నది 14 ఏళ్ళ భాను(అసలు పేరు కాదు). ఈమె తొమ్మిదో తరగతి చదువుతుంది.
“నాకేమి ఆశ్చర్యంగా లేదు,” నెలసరి చుట్టూ ఉండే ఇబ్బందిని అర్థం చేసుకుంటూ అన్నారు సాలై సెల్వం. ఈమె పుదుచ్చేరిలో ఉండే స్త్రీవాద రచయిత్రి. “ప్రపంచం ఆడవారిని ఎప్పుడూ తక్కువగా చూడాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆమెని రెండవ శ్రేణికి చెందిన పౌరురాలిగానే చూస్తుంది. ఇవన్నీ సంస్కృతి పేరుతొ సాగుతున్నవి, ఆమె మౌలిక హక్కులను హరించడానికి సాగుతున్నవి. స్త్రీవాది గ్లోరియా స్టెయినం తన ప్రసిద్ధమైన వ్యాసంలో అడిగినట్లుగా( ఇఫ్ మెన్ కుడ్ మెన్స్ట్రుయేట్ ), మగవారికి నెలసరి అయితే పరిస్థితులన్నీ భిన్నంగా ఉండేవి కావూ?”
కూవలాపురం, సప్తురు అలగపురిలో నేను కలిసిన చాలా మంది ఆడవారు, సెల్వం చెప్పిన విషయాన్ని నిజమనిపించారు. సంస్కృతి వివక్షను ఎంత పెంచుతుందో ఈ ఆడవారిని చూస్తే అర్థమవుతుంది. రాణి, లావణ్య ఇద్దరికి, వారు 12 వ తరగతి దాటగానే చదువునాపించి పెళ్ళిచేసేశారు. “నా ప్రసవం సమయంల్లో ఏవో సమస్యలు వచ్చి సిజేరియన్ చేయవలసి వచ్చింది. ప్రసవం తరవాత నా నెలసరి సరిగ్గా రావడం లేదు. కాని ఊరిలో వారు నేను ముట్టుతురై వెళ్లడం లేదని కనిపెట్టి మళ్లీ కడుపుతో ఉన్నానేమో అని అడుగుతారు. వారికి అసలు నా సమస్య అర్థం కాదు,” అన్నది రాణి.
అసలు కూవలాపురంలో ఈ పద్ధతి ఎప్పుడు మొదలైందో, రాణి, లావణ్యలకు తెలీదు. “మా అమ్మలనూ, అమ్మమ్మలను, ముత్తమ్మలను ఇలానే విడిగా ఉంచారు. కాబట్టి మేము ఏమి ప్రత్యేకం కాదు.” అన్నది లావణ్య,
చెన్నైలో ఉండే మెడికల్ ప్రాక్టీషనర్, ద్రవిడ సిద్ధాంతకర్త డా. ఏలియన్ నాగనాథన్ ఒక వింతైన, కొంత అర్థం చేసుకునే అవకాశం ఉన్న వాదనను వినిపించారు. “ఇది మనం వేటగాళ్లగా ఉన్నప్పుడు మొదలయింది,” అన్నారు ఆయన.
“తమిళ పదం వీటుక్కు తోరం (ఇంటికి దూరంగా - నెలసరిలో ఉన్న ఆడవారిని విడిగా ఉంచడానికి వాడే సభ్యత కలిగిన పదం) అసలైతే కాటుకు తోరం (అడవుల నుండి దూరంగా) నుండి వచ్చింది. ముట్టు అయిన ఆడవారిని భద్రమైన ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. ఎందుకంటే నెలసరిలో ఉన్నప్పుడు, ప్రసవానంతరం, లేక రజస్వల అయినప్పుడు రక్తస్రావం అయినప్పుడు వచ్చే వాసన వలన అడవి జంతువులు వచ్చి వారిని హానిపరిచేవి. కానీ ఇదే అలవాటు తరవాత ఆడవారిని అణచడానికి ఉపయోగించారు.”
కూవలాపురం గ్రామంలో హేతుబద్ధత తక్కువే. ఇది ఒక సిద్ధర్ (పవిత్ర వ్యక్తి) పట్ల భక్తితో చేసిన వాగ్దానమని, దీనికి చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు గ్రామాలు కూడా కట్టుబడి ఉన్నాయని నివాసితులు అంటున్నారు. "సిద్ధర్ మన మధ్య జీవించాడు, అతను దేవుడు, శక్తివంతమైనవాడు," అని ఎం. ముత్తు చెప్పారు. అరవయ్యేళ్ల ఎం. ముత్తు, సిద్ధర్ - తంగముడి సామికి అంకితం చేయబడిన కూవలాపురంలోని ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి. “మా గ్రామంతో పాటు పుదుపట్టి, గోవిందనల్లూర్, సప్తూరు అలగాపురి, చిన్నయ్యపురం- ఈ ఊర్లన్నీ సిద్ధుల భార్యలని మేము నమ్ముతున్నాము. మాట తప్పేందుకు ఎటువంటి ప్రయత్నం జరిగినా ఈ గ్రామాలు నాశనమవుతాయి.”
కానీ తన జీవితం అంతా కూవలపురం లోనే గడిపిన 70 ఏళ్ల రాసు, ఇది వివక్ష అని ఒప్పుకోరు. “ఇది దేవుడి మీద గౌరవంతో పాటించే పధ్ధతి. ఈ ఆడవారికి అన్ని రకాల సౌకర్యాలను ఇచ్చాము, ఒక మంచి జాగా, ఫ్యానులు, తల దాచుకోడానికో మంచి పైకప్పు..”
అతని అక్క 90ఏళ్ళ ముత్తురోళి ఆమె కాలంలో ఇవన్నీ‘అనుభవించలేని’ విషయాలన్నది. “మమ్మల్ని గుడిసెలలో ఉంచేవారు. కరెంటు ఉండేది కాదు. ఇప్పటి అమ్మాయిలు మా కన్నా బావున్నారు, అయినా వారు ఇంకా ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. పద్ధతులని పాటించాలి. లేదా మనమంతా నాశనమైపోతాము,” అని ఆమె ప్రకటించింది.,
ఊరిలో ఆడవారు ఈ అపోహను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. ఒక ఆడామె తన నెలసరిని దాచిపెట్టిన తరవాత ఆమెకు కలలో తరచుగా పాములు వచ్చేవి. తాను పధ్ధతి పాటించి ముట్టుతురై కి వెళ్లనందుకు దేవతలు తనపై కోపగించారని ఆమె నమ్మింది.
కానీ ఈ అతిథి గృహంలో ఉన్న ‘వసతుల’ జాబితాలో టాయిలెట్లు లేవు. “మేము పొలాలలోకి వెళ్లి మా కాలకృత్యాలు తీర్చుకుంటాము. మా నెలసరి గుడ్డలు, లేదా నాప్కిన్లు కూడా అక్కడే మార్చుకుంటాము” అని చెప్పింది భాను.(స్కూల్ కు వెళ్లే పిల్లలు సానిటరీ నాప్కిన్లు వాడడం మొదలు పెట్టారు. వీటిని వాడాక పాతిపెట్టడమో, కాల్చేయడమో, లేక ఊరవతల పారెయ్యడమో చేస్తారు). కాని పెద్ద వయసులో ఉన్న ఆడవారు ఇంకా ఉతికి ఆరేసే గుడ్డలనే వాడుతున్నారు.
ముట్టుతురై లో ఉన్నవారి కోసం ఒక నీళ్ల నల్ల ఉంది- దీనిని ఊరిలో వారెవరు ముట్టుకోరు. “మేము మాతో తీసుకెళ్లిన బట్టలు, దుప్పట్లు ఉతకకుండా మమ్మల్ని మళ్లీ ఊరిలోకి అడుగు పెట్టనివ్వరు.” వివరించింది రాణి.
ఎడమ: సప్తూరు అలగాపురిలోని చిన్న గుడిసె ( ముత్తుతురై) ఒక ఏకాంత ప్రదేశంలో ఉంది. మహిళలు బహిష్టు సమయంలో ఈ గుడిసెలో కాక, వారింటి ఎదురుగా, వీధుల్లో విడిగా ఉండడానికి ఇష్టపడతారు. కుడి: గ్రామ సందర్శనల సమయంలో మెట్ల క్రింద- కర్పగం బస చేసే స్థలం
సేదప్పటి బ్లాక్‌లోని దాదాపు 600 మంది జనాభా ఉన్న గ్రామమైన సప్తూరు అలగాపురిలో, మహిళలు ఈ పద్ధతిని ధిక్కరిస్తే వారి రుతుస్రావం ఆగిపోతుందని నమ్ముతారు. చెన్నైకి చెందిన, 32 రెండేళ్ల కర్పగం (అసలు పేరు కాదు), ఇలా ఒంటరిగా ఉండటం గురించి ఆలోచించింది. "కానీ ఇది సంస్కృతి అని నేను అర్థం చేసుకున్నాను. దీనిని నేను ధిక్కరించలేను. నా భర్త, నేను ఇప్పుడు తిర్పూర్‌లో పని చేస్తున్నాము. సెలవులలో మాత్రమే ఇక్కడికి వస్తాము.” ఆమె తన ఇంటిలో మెట్ల క్రింద ఉన్న చిన్న స్థలాన్ని చూపించింది, అదే ఋతుస్రావం సమయంలో తన 'స్థలం' అని చెప్పింది.
సప్తూరు అళగాపురిలోని ముత్తుతురై ఎవరూ లేని ప్రదేశంలో నిర్మించబడింది. కాబట్టి మహిళలు రుతుక్రమం ఉన్నప్పుడు వీధుల్లో తమ ఇళ్ల వెలుపల విడిది చేయడానికి ఇష్టపడతారు. “వర్షం పడితే తప్ప,” అన్నది 41 ఏళ్ల లత (ఆమె అసలు పేరు కాదు). వర్షం పడితే, వారు ముట్టుతురై లోకి వెళతారు.
చిత్రమేమిటంటే, కూవలాపురం, సప్తూరు అళగాపురి - ఈ రెండు ఊర్లలోనూ దాదాపు అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిని ఏడేళ్ల క్రితం రాష్ట్ర పథకాల కింద నిర్మించారు. స్త్రీలతో సహా పాత గ్రామస్థులు, పొలాలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నప్పటికీ, యువ నివాసితులు ఈ మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. కానీ రెండు గ్రామాల్లోని ముట్టుతురై కి మరుగుదొడ్లు లేవు.
"మాకు నెలసరి వచ్చిన తర్వాత మేము ఆ స్థలం వైపు నడుస్తున్నప్పటికీ, మేము ప్రధాన రహదారిని వెళ్లలేము. మేము ముట్టుతురై చేరుకోవడానికి, దాదాపు నిర్జన మార్గంలో వెళ్లాలి.” అని మైక్రోబయాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ అయిన 20 ఏళ్ల షాలిని (ఆమె అసలు పేరు కాదు) చెప్పింది. షాలిని మధురైలోని తన కళాశాలలో ఇతర విద్యార్థులతో ఋతుస్రావం గురించి ఎప్పుడూ చర్చించదు, ఆమె 'రహస్యాన్ని బయటపడుతుంది’, అనే భయంతో. "మీకు తెలుసా, ఇదేమి గర్వపడే విషయం కాదు,," ఆమె చెప్పింది.
సప్తూరు అలగాపురిలోని సేంద్రియ రైతు టి. సెల్వకని (43), ఈ నిషిద్ధం గురించి గ్రామస్తులతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. "మనం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం ప్రారంభించాము. కానీ 2020లో కూడా మన స్త్రీలు [రుతుస్రావం సమయంలో] ఇంకా బయట ఉన్నారా?" అని అడుగుతాడు. అయితే, కారణాలు అడగడం వలన ఏమీ మార్పు రాదు. "ఒక జిల్లా కలెక్టర్ అయినా కూడా ఇక్కడ ఈ నియమాన్ని పాటించి తీరాలి" అని లత గట్టిగా అన్నారు. "ఇక్కడ, క్లినిక్‌లు, ఆసుపత్రులలో పనిచేసే నర్సులు కూడా [ఇతర విద్యావంతులు, ఉద్యోగం చేసే మహిళలను కూడా కలిపి] బహిష్టు సమయంలో బయట ఉంటున్నారు," అని ఆమె చెప్పింది. “మీ భార్య కూడా అలానే ఉండాలి, ఇది విశ్వాసానికి సంబంధించినది,” అని సెల్వకనితో అన్నది ఆమె.
మహిళలు ఐదు రోజుల వరకు గెస్ట్‌హౌస్‌లోనే ఉండాలి. మొదటిసారి రజస్వల అయిన అమ్మాయిలు ఒక నెల మొత్తం ఈ గదికే పరిమితమై ఉంటారు, అలాగే ప్రసవం తర్వాత మహిళలు తమ నవజాత శిశువులతో పాటు ఇక్కడే ఉండాలి
“మీరు ఇటువంటి అతిథి గృహాలను మధురై, తేని జిల్లాలలో చూడవచ్చు. వారు వివిధ గుడుల పద్ధతులను, వివిధ కారణాల వలన పాటిస్తారు,” అన్నారు సాలై సెల్వం. “మాకు కుదిరినంతగా మేము ఇక్కడి వారితో మాట్లాడడానికి ప్రయత్నించాము. కానీ ఎవరూ వినరు, ఎందుకంటే ఇది వారి విశ్వాసానికి సంబంధించినది. ఇది రాజకీయ నాయకులు పూనుకుంటే తప్ప మారదు. కాని అధికారంలో ఉన్నవారు, ఓట్ల కోసం వచ్చినప్పుడు అతిథి గృహానికి ఇంకా సౌకర్యాలను పెంచుతామని మాట ఇస్తారు.”
అధికారంలో ఉన్నవారు పూనుకుంటే ఈ అతిథి గృహాలను నిర్మూలించవచ్చు, అని సెల్వం భావిస్తారు. “వారు అది కష్టం అంటారు, ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించినది. కానీ ఎంత కాలం ఇటువంటి అంటరానితనాన్ని సహించగలము? నిజమే, ప్రభుత్వం విపరీతమైన చర్య తీసుకుంటే తీవ్రమైన ప్రతిచర్య ఎదురుకావచ్చు, కానీ ఇది అంతమవ్వాలి, నన్ను నమ్మండి, మనుషులు కూడా నెమ్మదిగా మరిచిపోతారు.”
ఋతుస్రావం, ఆ సమయంలో సాగే వివక్ష గురించి నిషేధాలు తమిళనాడులో అసాధారణం కాదు. పట్టుక్కోట్టై బ్లాక్‌లోని అనైక్కడు గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల ఎస్. విజయ నవంబర్ 2018లో తంజావూరు జిల్లాలో గజ తుఫాను వలన తన ప్రాణాలు కోల్పోయింది. రజస్వల అయిన అమ్మాయిని ఇంటికి దగ్గరగా ఉన్న ఒక గుడిసెలో ఒంటరిగా ఉంచారు. (అసలు ఇంటిలోని ఆమె కుటుంబంవారు క్షేమంగా బయటపడ్డారు).
“తమిళనాడులో చాలా వరకు ఈ వివక్ష ఉంది, దీని స్థాయి మాత్రమే మారుతూ ఉంటుంది" అని డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గీతా ఇళంగోవన్ చెప్పారు, దీని 2012 డాక్యుమెంటరీ మాధవిదాయి (మెన్సెస్) రుతుక్రమం గురించిన నిషేధాలను గురించి ప్రస్తావిస్తుంది. కొన్ని పట్టణ ప్రాంతాలలో అందరికి తెలిసేలా బయట ఉండకపోవచ్చు కానీ ఇది వివిధ రూపాలలో ఇంకా ప్రబలంగా సాగుతూనే ఉంది. "ఒక బ్యూరోక్రాట్ భార్య ఆ మూడు రోజులలో తన కుమార్తెను వంటగదిలోకి అనుమతించదని, అది ఆమె 'విశ్రాంతి' కోసం ఉద్దేశించిన సమయం అని చెప్పడం నేను విన్నాను. మీరు దానిని వేర్వేరు పదాలలో వాడవచ్చు. కానీ అంతిమంగా ఈ పధ్ధతి వివక్షను మాత్రమే ఎత్తిచూపుతుంది.”
నెలసరి సమయంలో ఇలా వివక్ష చూపడం అన్ని మతాలలో, సామాజిక ఆర్ధిక నేపధ్యాలలో ఉంటుంది, కానీ అది వివిధ రకాలుగా ప్రస్ఫుటమవుతుంది, అన్నారు ఇళంగోవన్. “ నా డాక్యుమెంటరీ కోసం నేను అమెరికా నుండి నగరానికి వచ్చిన ఒకావిడతో మాట్లాడాను. ఇప్పటికీ ఆమె నెలసరి సమయంలో తన ఇంటిలో విడిగా ఉంటానని చెప్పింది. అది ఆమె వ్యక్తిగతమైన విషయం అని నాతో వాదించింది. ఇలా విడిగా ఉండడం పై కులాల వారికి, ఉన్నత ఆర్ధిక వర్గాల వారికి వ్యక్తిగతమైన విషయమైనా, కింది వర్గాలకు వచ్చేసరికి గొంతులేని బలహీన వవర్గాలవారికి, ఈ పితృస్వామ్య వ్యవస్థలో వారికి కావల్సినది ఎంచుకునేందుకు ఏ విధమైన అధికారం ఉండదు.”
“అందరం గుర్తుంచుకోవలసింది ఏంటంటే, ఈ పవిత్రం అన్న మాట పై కులాలకు చెందినది.” అని ఇళంగోవన్ అన్నారు. “అయినా ఇది సమాజంలో అందరినీ ప్రభావితం చేస్తుంది - కూవలాపురంలో ఎక్కువమంది దళితులున్నారు. “నేను తీసే సినిమాకు ప్రధాన ప్రేక్షకులు మగవారే. వారు సమస్యను అర్థం చేసుకోవాలనుకున్నాం. అంతేగాక పాలసీలు చేసేవారు కూడా ఎక్కువగా మగవారే. దీనిని గురించి మనం మాట్లాడకపోతే, దీనిని గురించి ఇళ్లలో చర్చించలేకపోతే, నాకు మరొక విధమైన ఆశ ఏదీ కనిపించడం లేదు.”
అంతేగాక, “ఆడవారిని అలా విడిగా ఉంచడం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.” అన్నారు చెన్నై లో ఉండే గైనకాలజిస్ట్ శారదా శక్తిరాజం. “తడిచిపోయిన సానిటరీ పాడ్లు గంటలు గంటలు ఉంచుకోవడం, పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో లేకపోవడం వలన ఆడవారి శరీరంలో మూత్ర, పునరుత్పత్తి వ్యవస్థకి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ అంటువ్యాధులు మహిళల భవిష్యత్తు సంతానోత్పత్తిని దెబ్బతీస్తాయి, అంతేగాక పెల్విక్ నొప్పి వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. పూర్తి పరిశుభ్రత లేని కారణంగా (పాత వస్త్రాన్ని తిరిగి ఉపయోగించడం) వచ్చే అంటువ్యాధులు గర్భాశయ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన ప్రమాద కారకాలు,” అని ఆమె చెప్పింది.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురించబడిన 2018 నివేదిక , తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో, మహిళలను ప్రభావితం చేసే రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అని పేర్కొంది.
ఇక కూవలాపురానికి వస్తే, భాను ప్రాధాన్యతను ఇవ్వవలసిన విషయాలు వేరేవి ఉన్నాయి. “మీరు ఎంత ప్రయత్నించినా ఈ అలవాటుని మార్చలేరు.” అన్నదామె రహస్యంగా. “కానీ మీరు మా కోసం ఏమైనా చెయ్యాలనుకుంటే ముట్టుతురై వద్ద టాయిలెట్లని నిర్మించండి. ఇవి మా బతుకులను తేలిక చేస్తాయి.”
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజంలో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే zahra@ruralindiaonline.org కి మెయిల్ చేసి namita@ruralindiaonline.org కి కాపీ పెట్టండి.
అనువాదం: అపర్ణ తోట