'మా దళం రెండు బృందాలుగా విడివడి రైలు మీద దాడి చేసింది. ఒక బృందానికి జీడీ బాపూ లాడ్ నాయకత్వం వహిస్తే, రెండో బృందాన్ని నేను నడిపాను. ఇదిగో! ఇక్కడే! మీరు నిలుచున్న చోటే రైలును ఆపడానికి పట్టాల మీద బండరాళ్లు వేశాం. అది వెనక్కు తిరిగి వెళ్లకుండా అడ్డగించడానికి వెనుక కొంచెం దూరంలో కూడా రాళ్లు పేర్చాం. మా దగ్గర కొడవళ్లు, లాఠీలు, ఎప్పుడు పేలతాయో తెలియని నాటు బాంబులు తప్ప తుపాకులూ గట్రా ఏమీ  లేవు. రైలులో ప్రధాన గార్డు చేతిలో తుపాకీ ఉన్నా మమ్మల్ని చూసి బెదిరిపోయాడు. అతణ్ణి తేలిగ్గా లొంగదీశాం. రైలు పెట్టెలోని జీతం సొమ్ముల పెట్టెను తీసుకుని ఉడాయించాం.'

ఇది జరిగి 73 సంవత్సరాలైంది. కానీ, 'కెప్టెన్ భావూ లాడ్' నోట వింటుంటే అదేదో నిన్ననే జరిగిన ఘటనలా అనిపించింది. ఇప్పుడాయన వయసు 94 ఏళ్లు. కెప్టెన్ అసలు పేరు రామచంద్ర శ్రీపతి లాడ్. జనం ఆయన్ను భావూ (మరాఠీలో పెద్దన్న అని అర్థం) పిలుస్తారు. బ్రిటిష్ వలస ప్రభుత్వ అధికారుల జీతభత్యాలను తీసుకొస్తున్న పుణే-మిరాజ్ రైలుపై తాము జరిపిన దాడి గురించి ఆయన ఇప్పటికీ పూసగుచ్చినట్లు వివరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 'ఆయన ఇంత వివరంగా మాట్లాడి చాలా కాలమైంది' అని ఆ కురువృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడి అనుచరుడైన బాలాసాహెబ్ గణపతి షిండే నా చెవిలో గుసగుసలాడారు. కెప్టెన్ భావూను స్థానికులు కెప్టెన్ పెద్దన్న అని పిలుస్తారు. తానూ, బాపూ లాడ్ కలసి 1943 జూన్ 7వ తేదీన జీతాల రైలు మీద దాడి జరిపిన ప్రదేశాన్ని నాకు చూపించారాయన. ఈ దాడిలో పాల్గొన్న దళమే తూఫాన్ సేన. సతారా జిల్లాలోని షెనోలీ గ్రామం వద్ద  రైలును సరిగ్గా ఎక్కడ నిలవేసినదీ చూపించారాయన. ఇన్నేళ్ల తర్వాత ఆయన తిరిగి ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి. కెప్టెన్ పెద్దన్న కాస్సేపు ఆనాటి జ్ఞాపకాల్లోకి జారిపోయారు. నాడు రైలు మీద దాడిలో తనతో కలసి పాల్గొన్నవారి పేర్లు గుర్తుచేసుకున్నారు. 'మేము దోచుకున్న డబ్బు మా జేబుల్లోకి వెళ్లలేదు. సతారా జిల్లాలో ప్రతి సర్కార్ (పోటీ ప్రభుత్వాన్ని) నడపడానికి ఆ డబ్బు వెచ్చించాం. పేదలకు పంచాం' అని స్పష్టం చేశారు.



'మేము రైలును లూటీ చేశామనడం సరికాదు. భారతీయుల నుంచి బ్రిటిష్ వాళ్లు దోచుకున్న సొమ్మునే వెనక్కుతెచ్చి ప్రజలకు ఇచ్చాం' అని తీవ్ర స్వరంతో చెప్పారు. 2010లో జీడీ బాపు కూడా నాతో ఇదే మాట అన్నారు. ఆయన కన్నుమూయడానికి ఏడాది ముందు నాతో మాట్లాడారు.

వారు నడిపిన పోటీ ప్రభుత్వ సాయుధ దళమే తూఫాన్ సేన. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వీరిది ఓ సంభ్రమాశ్చర్యకర ఘట్టం. అప్పట్లో సతారా జిల్లా చాలా పెద్దదిగా ఉండేది. 1942నాటి క్విట్ ఇండియా ఉద్యమం ఇక్కడ సాయుధ రూపం ధరించింది. విప్లవకారులు సతారా జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు. స్థానిక ప్రజలు దాని పాలనను శిరసావహించారు. 150 నుంచి 600 గ్రామాల్లో బ్రిటిష్ పాలన అంతమైంది. మీరు అజ్ఞాత ప్రభుత్వాన్ని నడిపారా అని ప్రశ్నిస్తే, కెప్టెన్ భావూకు కోపం వచ్చింది. 'అజ్ఞాత ప్రభుత్వమేం ఖర్మ! ఇక్కడ పూర్తిగా మా ప్రభుత్వమే నడిచింది. బ్రిటిష్ వాళ్లు ఇక్కడ కాలుమోపడానికి కూడా సాహసించలేదు. తూఫాన్ సేన పేరు వింటే చాలు, పోలీసులు జడుసుకునేవారు' అని ఆయన గర్జించారు.


02-PS-‘Captain Elder Brother’  and the whirlwind army.jpg

కెప్టెన్ భావూ 1942నాటి చిత్రం, 74 ఏళ్ల తర్వాత (కుడి)


ఆయన చెప్పినది ముమ్మాటికీ నిజం. క్రాంతి సింహ్ నానా పాటిల్ నాయకత్వంలో నడచిన పోటీ ప్రభుత్వం తన అదుపులోని గ్రామాల్లో జనరంజక పాలన అందించింది. ఆహార ధాన్యాల సరఫరా-పంపిణీ, సమర్థ మార్కెట్ యంత్రాంగం, న్యాయవ్యవస్థలను నడిపింది. వడ్డీ వ్యాపారులు, తాకట్టు వ్యాపారుల మీద, బ్రిటిష్ వాళ్లతో మిలాఖత్ అయిన భూస్వాముల మీద జరిమానా విధించింది. 'శాంతిభద్రతల నిర్వహణ పూర్తిగా మా చేతుల్లోనే ఉండేది. మాకు ప్రజల అండదండలు పుష్కలంగా లభించేవి' అని కెప్టెన్ భావూ గుర్తుచేసుకున్నారు. తూఫాన్ సేన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆయుధాగారాలు, రైళ్లు, కోశాగారాలు, తపాలా కార్యాలయాల మీద దాడులు నిర్వహించేది. కడగండ్లను ఎదుర్కొంటున్న రైతులు, కూలీలను ఆదుకునేది.

కెప్టెన్ కొన్నిసార్లు జైలుపాలయ్యారు. కానీ రోజురోజుకీ ఆయన పట్ల ప్రజాదరణ పెరగడం చూసి జైలు గార్డులు ఆయన పట్ల ఎంతో గౌరవంగా మసలుకునేవారు. 'నన్ను మూడోసారి ఔండ్ జైలులో పెట్టినప్పుడు అసలు అది జైలు జీవితంలానే ఉండేది కాదు. రాజుగారి ఆహ్వానం మీద రాజభవనంలో బస చేసినట్లు అనిపించేది' అని ఆయన నవ్వుతూ చెప్పారు. 1943 నుంచి 1946 వరకు సతారాలో పోటీ ప్రభుత్వం, దాని తూఫాన్ సేనలదే రాజ్యం. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం ఖాయమని తేలగానే తూఫాన్ సేన రద్దయింది.

మీరు తూఫాన్ సేనలో ఎప్పుడు చేరారని నేను ప్రశ్నించినప్పుడు ఆయకు రోషం వచ్చింది. 'చేరడమేమిటి? అసలు దాన్ని స్థాపించినది నేనే! ' అన్నారాయన. పోటీ ప్రభుత్వానికి నానా పాటిల్ సారథి కాగా, ఆయన కుడి భుజమైన జీడీ బాపు లాడ్ తూఫాన్ సేన సేనాని (ఫీల్డ్ మార్షల్)గా, కెప్టెన్ భావూ ఆ సేన నిర్వాహకాధికారిగా వ్యవహరించేవారు. వీరి నాయకత్వంలో తూఫాన్ సేన బ్రిటిష్ పాలకులను గట్టి దెబ్బతీసింది. అన్నట్లు అప్పట్లో బెంగాల్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశాలలోనూ ఇలాంటి తిరుగుబాట్లే చెలరేగాయి. పరిస్థితి బ్రిటిష్ వారి చేయిదాటిపోసాగింది.


03-DSC00407(Crop)-PS-‘Captain Elder Brother’  and the whirlwind army.jpg

కుందల్ ప్రాంతంలో 1942 లేదా 1943లో తీసిన తూఫాన్ సేన ఫోటో


కెప్టెన్ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ నిండా ఆనాటి జ్ఞాపకాలే. మెమెంటోలూ దండిగా కనిపించాయి. ఆయన వాడుకునే గది మాత్రం చాలా నిరాడంబరంగా ఉంది. కెప్టెన్ భావూకన్నా పదేళ్లు చిన్నదైన ఆయన భార్య కల్పన తన భర్త గురించి నిర్మొగమాటంగా మాట్లాడింది. 'ఇన్నేళ్లయినా ఈ మనిషికి తన పొలం ఎక్కడుందో తెలియదు. ఆడదాన్ని అయిన నేను ఒంటిచేత్తో పిల్లలు, పొలం, కుటుంబాన్ని నడిపించుకొచ్చాను. అయిదుగురు పిల్లలు, 13 మంది మనవలు, 11మంది మునిమనవలు మనవరాళ్ల ఆలనాపాలనా చూసుకొంటూ వచ్చాను. ఆయన టాస్ గావ్, ఔండ్, యెరవాడ జైళ్లలోనూ కొంతకాలం ఉన్నారు. జైలు నుంచి బయటికొచ్చిన వెంటనే మాయమైపోయి ఊళ్లలో తిరిగేవాడు. ఎన్నో నెలలకు ఇంటికి తిరిగొచ్చేవాడు. కుటుంబాన్ని నడిపే భారం నా మీదే పడేది. ఇప్పటికీ అదే పరిస్థితి ' అని చెప్పారావిడ.


04-PS-‘Captain Elder Brother’  and the whirlwind army.jpg

సతారా, సాంగ్లిలకు చెందిన స్వాతంత్ర సమర యోధుల పేర్లు లిఖించి ఉన్న స్థూపం. కెప్టెన్ పేరు ఎడమ వరుసలో ఆరవది. ఆయన భార్య కల్పన


సతారా పోటీ ప్రభుత్వం, తూఫాన్ సేనలకు సారథ్యం వహించిన నానా పాటిల్, నాగ్ నాథ్ నాయక్వాడి, జీడీ బాపు లాడ్, కెప్టెన్ భావు తదితరులు మహారాష్ట్రలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులలో అగ్రగణ్యులు. కానీ, వీరిలో చాలామందికి స్వాతంత్ర్యానంతరం దక్కవలసినంత ప్రాముఖ్యం దక్కలేదు. పోటీ సర్కారు, సేనల నాయకులు రకరకాల రాజకీయ భావజాలాలకు చెందినవారు. వీరిలో చాలామంది ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. మరికొందరు కాలక్రమంలో పార్టీలో చేరారు. నానా పాటిల్ అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1957లో సీపీఐ అభ్యర్థిగా సతారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కెప్టెన్ భావూ, బాపూ లాడ్ లు పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీలో చేరారు. మాధవ్ రావ్ మానే వంటివారు కాంగ్రెస్ లో చేరారు. వీరంతా  హిట్లర్ నాజీ మూకలపై సోవియట్ యూనియన్ సాగించిన మహోగ్ర పోరాటం నుంచి స్ఫూర్తి పొందామన్నారు.

94 ఏళ్ల వయసులో కెప్టెన్ భావూలో సహజంగానే అలసట కనిపిస్తున్నా, ఆనాటి పోరాట స్మృతుల నుంచి ఇప్పటికీ ఉత్తేజం పొందుతున్నారు. 'మేమంతా సామాన్యుడికి స్వేచ్ఛ సాధించడం కోసం పోరాడాం. అదొక అందమైన స్వప్నం. చివరకు మనం స్వాతంత్ర్యం సాధించడం గర్వకారణమే కానీ, మా కల ఇప్పటికీ నెరవేరలేదు. ఇవాళ డబ్బున్నవాడిదే రాజ్యం. మన స్వేచ్ఛ చివరకు ఈ స్థితికి చేరుకుంది! ' అన్నారాయన.

కెప్టెన్ పెద్దన్న దృష్టిలో తూఫాన్ సేన స్ఫూర్తి ఇప్పటికీ సజీవంగా ఉంది. 'తూఫాన్ సేన ప్రజల కోసం పోరాడటానికి ఇప్పటికీ సిద్ధంగా ఉంది. అవసరం వచ్చినప్పుడు అది తప్పక రంగంలోకి దూకుతుంది ' అని ఢంకా బజాయించారు.


05-DSC00320-HorizontalSepia-PS-Captain Elder Brother and the whirlwind army.jpg

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath