అర్ధ శతాబ్దం క్రితం, తన వలన ఉనికిలోకి వచ్చిన కొల్హాపూర్‌లోని ఈ కాంపాక్ట్ డ్యామ్ పైన ఉన్న ఒక చిన్న వంతెన పై, మాడిపోయే వేడిలో సైతం అతను ప్రశాంతంగా కూర్చున్నాడు. భోజనం సమయంలో మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికతో సమాధానాలిస్తూ ఉన్నాడు. 1959లో ఈ బ్యారేజీ ఎలా ప్రాణం పోసుకున్నదో వివరిస్తూ అతను కూడా మాతో పాటు వంతెన పొడుగునా చలాకీగా నడిచాడు .
ఇప్పటికీ, అంటే ఆరు దశాబ్దాల తరవాత కూడా, గణపతి ఈశ్వర పాటిల్‌కు నీటిపారుదలపై పట్టు ఉంది. అతను రైతులను, వ్యవసాయాన్ని అర్థం చేసుకున్నాడు. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర అతనికి తెలుసు - ఆయన అందులో భాగం కూడా. ఆయన వయసు 101 సంవత్సరాలు - భారతదేశపు జీవించి ఉన్న చివరి స్వాతంత్య్ర సమరయోధులలో ఒకడు.
"నేను కేవలం ఒక దూతని," అని 1930ల తరవాత అతని జీవితం గురించి వినయం, వినమ్రతతో ఆయన చెప్పాడు. "భూగర్భ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలకు నేను ఒక కొరియర్ ను." అందులో కమ్యూనిస్ట్ విప్లవ సంఘాల, సోషలిస్టుల - కాంగ్రెస్ పార్టీ (1942 లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో)ల నిషేధిత నెట్‌వర్క్‌లు ఉన్నాయి. అతని పనితనం మంచిదై ఉండి ఉండాలి- ఎందుకంటే అతను ఎప్పుడూ పట్టుబడలేదు. "నేను జైలుకు వెళ్లలేదు," అని అతను దాదాపు తప్పుచేసినట్లు చెప్పాడు. 1972 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన తామ్రపత్ర (లిఖిత శాసనం) లేదా పెన్షన్ కూడా అతను అంగీకరించలేదని వేరేవారి ద్వారానే మాకు తెలిసింది.

అజిత్ పాటిల్ తో గణపతి పాటిల్ , తన పాత సహోద్యోగి కీ . శే . సంత్ రామ్ పాటిల్ ( లాల్ నిషాన్ పార్టీ సహవ్యవస్థాపకుడు ) యొక్క కుమారుడు
"నేను జైలుకు వెళ్లలేదు," అని అతను దాదాపు తప్పుచేసినట్లు చెప్పాడు. 1972 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన తామ్రపత్ర (లిఖిత శాసనం) లేదా పెన్షన్ కూడా అతను అంగీకరించలేదని వేరేవారి ద్వారానే మాకు తెలిసింది
"నేను అలా ఎలా చేయగలను?" కొల్హాపూర్ జిల్లా కాగల్ తాలూకాలోని సిద్దనేర్లి గ్రామంలోని తన కుమారుడి ఇంట్లో మేము అతని గురించి అడిగినప్పుడు తిరిగి అడిగాడు. “మాకు తిండి పెట్టడానికి ఇప్పటికే భూమి ఉండగా ఏదైనా ఎందుకు అడగాలి?" ఆ సమయంలో అతనికి 18 ఎకరాలు ఉన్నాయి. "కాబట్టి, నేను అడగలేదు, నేను దరఖాస్తు చేయలేదు." వామపక్షాలలో ఉండే అనేక ఇతర స్వాతంత్య్ర సమరయోధులు ఏం చెప్తారో అతను అదే చెబుతాడు: "మేము ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాము, పెన్షన్లు పొందడం కోసం కాదు." అంతేగాక అతను తనది చాలా చిన్న పాత్ర అని నొక్కి చెప్తుంటాడు - అయితే రాడికల్ అండర్ గ్రౌండ్ లో కొరియర్ పని ప్రమాదకరమైనది, పైగా అప్పటి యుద్ధ సమయంలో వలసరాజ్యాల అధికారం మామూలు కంటే వేగంగా కార్యకర్తలను ఉరితీస్తోంది.
బహుశా ఆ ప్రమాదాలు ఆమెకు స్పష్టంగా తెలియనందున, అతని కొరియర్‌గా పనిచేయడాన్ని అతని తల్లి అంగీకరించింది - అయితే అతను చేసే పనులు బహిరంగంగా కనిపించనంత వరకు మాత్రమే. కాగల్‌లోని సిద్ధనేర్లి గ్రామంలోని తన తండ్రి ఇంటికి మారిన వెంటనే అతని తల్లి తప్ప మిగిలిన కుటుంబం మొత్తం ప్లేగు మహమ్మారిలో తుడిచిపెట్టుకుపోయింది. ఆ సమయంలో, అదే తాలూకాలోని కర్నూరు గ్రామంలో తన అమ్మమ్మ ఇంటి వద్ద మే 27, 1918 న జన్మించిన గణపతికి కేవలం "నాలుగున్నర నెలల వయస్సు," అని ఆయన చెప్పారు.
అతను తమ కుటుంబానికి చెందిన భూమికి ఏకైక వారసుడు అయ్యాడు, అందుకే ఏ కారణం చేతనైనా తన ప్రాణాలను పణంగా పెట్టడానికి అనుమతించకూడదని అతని తల్లి ఆలోచించింది. "నేను బహిరంగంగా పాల్గొన్నప్పుడు లేదా [1945 దిశగా] కవాతులు నిర్వహించినప్పుడు మాత్రమే, ప్రజలు నా రాజకీయ ప్రమేయం గురించి తెలుసుకున్నారు." 1930ల చివరలో మరియు 1940ల ప్రారంభంలో కార్యకర్తల సమావేశాలను నిశ్శబ్దంగా నిర్వహించడానికి సిద్ధనేర్లిలోని తన పొలాన్ని ఉపయోగించాడు. "మా ఇంట్లో నేను నా తల్లి మాత్రమే మిగిలాము - మిగతావాళ్ళందరూ చనిపోయారు -అందుకే అందరికి మా మీద సానుభూతి ఉండేది , నా గురించి కూడా పట్టించుకునేవారు."


ఇదంతా , 12 సంవత్సరాల గణపతి పాటిల్ సిద్ధనెర్లి నుంచి నిపాణి వరకు 28 కిలోమీటర్లు నడిచి మోహన్ దాస్ కరంచంద్ గాంధీని వినడానికి వెళ్ళినప్పుడు మొదలయ్యింది
అతని కాలంలో లక్షలమంది లాగానే, 12 సంవత్సరాల వయస్సులో గణపతి పాటిల్ అప్పటికే తన కంటే ఐదు రెట్లు ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని అనుకోకుండా కలిసినప్పుడు ఇదంతా మొదలైంది. ప్రస్తుత కర్ణాటకలోని సిద్దనేర్లి నుండి నిపాణి వరకు పాటిల్ 28 కిలోమీటర్లు మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ ప్రసంగాన్ని వినడానికి నడిచారు. అది అతని జీవితాన్ని మార్చేసింది. కార్యక్రమం ముగిసే సమయానికి యువకుడైన గణపతి వేదిక పైకి చొచ్చుకుపోయాడు, అతను "కేవలం మహాత్ముని శరీరాన్ని తాకినందుకు సంతోషించాడు."
1941 లో మాత్రమే, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా, అతను కాంగ్రెస్ పార్టీ సభ్యుడయ్యాడు. అదే సమయంలో, ఇతర రాజకీయ శక్తులతో అతని సంబంధాలు కొనసాగాయి. 1930లో అతను నిపాణికి వెళ్లినప్పుడు, కాంగ్రెస్‌లో చేరేవరకు, అతని ప్రధానంగా ఆ పార్టీలోని సోషలిస్ట్ వర్గానికి సంబంధించినవారితో ఉండేవాడు. 1937 లో సోషలిస్టు నాయకులు ఎస్‌ఎం జోషి మరియు ఎన్.జి.గోరే బెల్గాంలోని అప్పచివాడిలో నిర్వహించిన శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. భవిష్యత్ సతారా ప్రతి సర్కార్ యొక్క నాగనాథ్ నాయక్వాడి కూడా పాల్గొన్న వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించారు. గణపతితో సహా వారందరూ కొంత ఆయుధ శిక్షణ కూడా పొందారు. ( Captain Elder Brother and the whirlwind army , The last hurrah of the prati sarkar చూడండి)
ఆయన ఇలా అంటాడు, 1942 లో “భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించబడిన నాయకులు సంత్ రామ్ పాటిల్, యశ్వంత్ చవాన్ [కాంగ్రెస్ నాయకుడు వై.బి.చవాన్ అనుకోని పొరబడకండి], ఎస్.కె.లిమాయె, డి.ఎస్. కులకర్ణి మరియు ఇతర కార్యకర్తలు కలిసి నవజీవన సంఘటన(new life union) ప్రారంభించారు.” గణపతి పాటిల్ వారితో చేరారు.
ఆ సమయంలో, ఈ నాయకులు ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేయలేదు, కానీ వాళ్ళు సృష్టించిన సమూహం లాల్ నిషాన్(ఎర్ర జెండా)గా పిలువబడింది. (ఇది 1965లో రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. కానీ1990లలో మళ్లీ విడిపోయింది )
స్వాతంత్య్రానికి ముందు జరిగిన గందరగోళాలన్నింటి నడుమ , గణపతి పాటిల్, "మా వివిధ గ్రూపులు మరియు కామ్రేడ్‌లకు సందేశాలు, పత్రాలు మరియు సమాచారాన్ని చేరవేశాను" అని చెప్పాడు. అతను ఆ అసైన్‌మెంట్‌ల ప్రత్యేకతలను నిరాడంబరంగా తోసిపుచ్చుతూ, తనది ప్రధాన పాత్ర కాదని మరీమరీ అంటాడు. అయినప్పటికీ, తన పెద్ద కొడుకు ఇంట్లో మధ్యాహ్న భోజన సమావేశంలో, దూత లేదా కొరియర్ గా అతని సామర్థ్యాన్ని 12 సంవత్సరాల వయస్సులోనే నిపాణికి 56 కిలోమీటర్ల నిశ్శబ్దంగా నడిచినప్పుడు కనుగొన్నట్లు ఎవరో అన్నప్పుడు ఆ పెద్దమనిషి నవ్వాడు (కానీ సంతోషించాడు కూడా).
"స్వాతంత్య్రం తరువాత, లాల్ నిషాన్ - రైతులు మరియు కార్మికుల పార్టీ [PWP] తో కలిసి కంగార్ కిసాన్ పార్టీ [వర్కర్స్ అండ్ ఫార్మర్స్ పార్టీ] ని స్థాపించారు" అని గణపతి చెప్పారు. ఐతిహాసిక వ్యక్తి అయిన నానాపాటిల్ మరియు అతని సన్నిహిత సహచరులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) లో చేరడంతో ఈ పార్టీ చీలిపోయింది,. పిడబ్ల్యుపిని పునర్నిర్మించారు, లాల్ నిషాన్ మరోసారి సమూహంగా కలిసిపోయింది . 2018 లో ఏ పార్టీతో అయితే గణపతి సంబంధం కలిగి ఉన్న ఎల్ ఎం పి ఫ్యాక్షన్, సిపిఐలో విలీనమయ్యింది .
1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, కొల్హాపూర్‌లో భూసంస్కరణ కోసం పోరాటాల వంటి కొన్ని ఉద్యమాలలో పాటిల్ ప్రధానపాత్రను పోషించాడు .అతను ఒక భూ యజమాని అయినప్పటికీ, వ్యవసాయ కూలీల కోసం న్యాయమైన ఒప్పందం కోసం పోరాడడమే కాక ఇతర రైతుల కోసం వారికి కనీస వేతనాన్ని ఆమోదించేలా చేశాడు. నీటిపారుదల కోసం ‘కొల్హాపూర్ తరహా బ్యారేజీ’ని అభివృద్ధి చేయడానికి అతను కృషి చేసాడు-దాని మొదటి ఆనకట్ట (మేము దాని పైన కూర్చున్నాము) ఇప్పటికీ చుట్టూ ఉన్న ఒక డజను గ్రామాలకి ఉపయోగపడుతుంది, అంతేగాక అది స్థానిక రైతుల నియంత్రణలో ఉంది.
"మేము దాదాపు 20 గ్రామాల్లో రైతులను సమీకరించి సహకార ప్రాతిపదికన నిధులు సమకూర్చాము," అని గణపతి చెప్పారు. దూధ్ గంగ నదిపై ఉన్న రాతితో కట్టిన ఆనకట్ట 4,000 ఎకరాలకు పైగా సాగునీటిని అందిస్తుంది. కానీ ఇది ఎలాంటి స్థానభ్రంశం లేకుండా జరిగిందని అతను గర్వంగా చెబుతాడు. నేటి పరిస్థితుల్లో అయితే ఇది రాష్ట్ర-స్థాయి మధ్యతరహా నీటిపారుదల పథకంగా వర్గీకరించబడేది.


ఎడమ: “ఈ రకమైన బ్యారేజ్ తక్కువ వ్యయంతో నిర్మితమై, స్థానికంగా నిర్వహించచ్చు, ఇది జీవావరణానికి, పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించదు”, అని అజిత్ పాటిల్ చెప్పారు. కుడి: గణపతి పాటిల్ వాహనం ఒక ఆర్మీ సర్ప్లస్ జీప్, ఆయన మనవడు బహుమతిగా ఇచ్చాడు. కానీ దాని బంపర్ పైన బ్రిటిష్ జెండా పెయింట్ చేయబడి ఉంది
"ఈ రకమైన బ్యారేజీ నది ప్రవాహాన్నిబట్టి నిర్మించబడుతుంది" అని కొల్లాపూర్‌కు చెందిన ఇంజనీర్ మాత్రమే కాక గణపతి పాత సహోద్యోగి అయిన దివంగత సంత్రామ్ పాటిల్ (లాల్ నిషన్ పార్టీ సహ వ్యవస్థాపకుడు) కుమారుడు అజిత్ పాటిల్ చెప్పారు. "భూమి మునిగిపోవడం లేదు, నది ప్రవాహం అనవసరంగా పరిమితం కాలేదు. ఏడాది పొడవునా నీటి నిల్వ రెండు వైపులా భూగర్భజలాలను రీఛార్జ్ చేయడంలో సహాయపడడమే కాక ప్రత్యక్ష నీటిపారుదల జోన్ బయట ఉన్న బావుల నుండి కూడా నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని ధర తక్కువ, ఇది స్థానికంగా నిర్వహించబడుతోంది. జీవావరణానికి, పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించదు. "
మే నెలలో మండు వేసవిలో, చెప్పుకోదగిన స్థాయిలో నీటి ఆనకట్ట, ప్రవాహాన్ని నియంత్రించడానికి బ్యారేజీ యొక్క 'తలుపులు' తెరవడం మనం చూడచ్చు. డ్యామ్ బ్యాక్‌వాటర్స్‌లో చేపల పెంపకం కూడా బానే జరుగుతుంది.
"మేము దీనిని 1959లో సాధించాము" అని గణపతి పాటిల్ నిశ్చలమైన గర్వంతో చెప్పాడు. డ్యామ్ నుండి నేరుగా ప్రయోజనం పొందుతున్న కొన్ని ఎకరాల వ్యవసాయ భూమిని అతను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లు మేము అతనిని అడిగే వరకు అతను చెప్పలేదు. అతను తన లీజును రద్దు చేసి, భూమిని దాని యజమానికి తిరిగి ఇచ్చాడు. "నా వ్యక్తిగత లాభాల కోసం నేను ఇలా చేస్తున్నట్లు అనిపించకూడదు" అనేది అతనికి ముఖ్యం. ఆ పారదర్శకత, ఆత్మావలోకన వలన వివాదాలను తొలగి మరింత మంది రైతులను సహకార కృషిలో చేరడానికి ఒప్పించగలిగారు. వాళ్ళు బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకొని ఆనకట్టను నిర్మించారు. ₹75,000 లోపు నిర్మాణాన్ని పూర్తి చేశారు. మిగిలిన రూ. 25,000 వెంటనే తిరిగి ఇచ్చేశారు. బ్యాంకు రుణాన్ని వారు నిర్దేశించిన మూడేళ్లలోనే పూర్తిగా తిరిగి చెల్లించారు. (నేటి కాలంలో అదే పరిమాణంలో ఉన్న ప్రాజెక్ట్‌కు రూ. 3-4 కోట్లు అవసరం ఉంటుంది, పెరిగిన ఖర్చులతో ఎక్కువ నష్టం కలుగుతుంది, ఆ తరవాత తిరిగి చెల్లించని రుణాలతో ముగుస్తుంది).
మే నెలలో మిట్టమధ్యాహ్నం వేడిలో మేం ఒక వృద్ధ స్వాతంత్య్ర సమరయోధుడిని చురుగ్గా విరామం లేకుండా ఉండేలా చేశాము, కానీ అతను అలసిపోయినట్లు కనిపించడం లేదు. మా ఆసక్తిని గమనించి, అతను సంతోషంగా మమ్మల్ని చుట్టూ తిప్పాడు. చివరగా, మేము వంతెన అవతల మా వాహనాల వైపు అడుగులు వేశాము. అతనిది ఆర్మీ సర్ప్లస్ జీప్ -అతని మనవడో లేదా మనవడి వరస అతనో బహుమతిగా ఇచ్చాడు. హాస్యాస్పదమైన విషయమేమిటంటే ఆ జీప్ ముందు బంపర్‌పై బ్రిటిష్ జెండా పెయింట్ చేయబడింది, బోనెట్ ఇరువైపులా 'USA C 928635' అని ముద్రించబడింది. తరాల అంతరాలు ఇవేనేమో .
కానీ ఈ జీపు యొక్క ప్రధాన వినియోగదారుడు మాత్రం తన జీవితమంతా వేరే జెండాను అనుసరించాడు. ఇప్పటికీ అదే చేస్తున్నాడు.

కొల్హాపూర్ జిల్లా కాగల్ తాలూకాలోని సిద్ధనెర్లి గ్రామంలో, అతని కుమారుడి ఇంట్లో, కుటుంబంతో గణపతి పాటిల్
అనువాదం: దీప్తి సిర్ల