“వాళ్ళు బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పారు. మేము చచ్చేంత భయపడ్డాము. ఆ తరవాత మమ్మల్ని మరెక్కడికైనా వెళ్లమన్నారు. అందుకే నేను నా కోడలిని పట్టణంలో ఉన్న ప్రైవేట్ డాక్టర్ దగ్గరకి తీసుకెళదామనుకున్నాను.” అన్నది సుఖియా దేవి, ఆమె కోడలు కుసుమ్ తో వైశాలి జిల్లా హెడ్ క్వార్టర్ల లో PHC కివెళ్ళినప్పుడు అక్కడి సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందొ గుర్తుచేసుకుంటూ.
అరవై రెండేళ్ల ఈ వ్యవసాయ కూలి ఇప్పుడు ఉదయం 10 గంటలకు PHC వద్ద, ఒకరోజు వయసున్న తన మనవరాలిని ఎత్తుకుని, ఆ పిల్లకి టీకా వేయించడానికి ఎదురుచూస్తూ నుంచుంది.
తన 28 ఏళ్ళ కోడలికి పురిటి నొప్పులు మొదలవగానే , సుఖియా ఆమెని వైశాలి PHC కి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న అటెండెంట్, కడుపులో బిడ్డ చనిపోయింది అని చెప్పింది. నిర్ఘాంతపోయిన సుఖియా తన కోడలు కుసుమ్ ను తీసుకుని ఆటోలో 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న తమ ఊరుకు(పేరు చెప్పొద్దని అభ్యర్ధించారు) వెళ్ళింది. “మేము మా ఇంటికి వెళ్ళిపోయాము.” అన్నది సుఖియా. “ఒక బొలెరో కి కిరాయికి మాట్లాడుకుని మహిళా డాక్టర్(గైనకాలజిస్ట్) వద్దకు వెళదాం అనుకున్నాను. ఆ కంగారులో బొలెరో ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకోవాలని కూడా నాకు తోచలేదు. కాన్పు గురించి మాత్రమే కంగారు పడ్డాను. మా చుట్టుపక్కల వారి సహాయం తో నా కోడలిని బండి ఎక్కించి క్లినిక్ కి బయలుదేరాను.“
డాక్టర్ దగ్గరికి బయలుదేరాక గాని కడుపులో ‘బిడ్డ చనిపోయింద’న్న ఆలోచన గుర్తుకు రాలేదు వాళ్ళకి.
పాప బండిలోనే పుట్టింది అని చెప్పింది సుఖియా. చాలా తేలిగ్గా ప్రసవం అయిందని చెప్పింది. వాళ్ళ దగ్గర ఉన్న చీరని దుప్పటిలా వాడారు. వారితోనే ఉన్న ఆ ఊరి మెడికల్ షాప్ ఓనర్ నీళ్లు తెచ్చిపెట్టారు. “కానీ అదంతా చాలా టైం పట్టింది.”అన్నది సుఖియా.
పైగా డబ్బులు కూడా బాగా ఖర్చయ్యాయి. ప్రయాణించింది ఎక్కువ దూరం కాకపోయినా ఆ కార్ ఓనర్ మూడువేలు తీసుకున్నాడు. ఆ బండి శుభ్రం చేయించడానికి ఇంకో వేయి రూపాయిలు అదనంగా తీసుకున్నారు.
కానీ PHC లో ఏం జరిగినట్లు? మేము వెళ్లి చూసాం కాబట్టి అక్కడ అల్ట్రా సౌండ్ మెషిన్ గాని మరేదైనా మెషిన్ కానీ అసలు పనిచేయట్లేదు.ఆ లెక్కన వాళ్ళు దేని ఆధారంగా పాప కడుపులోనే చనిపోయిందని చెప్పారు? ఇదంతా ఏ ఆధారమూ లేని మాటలాగా అనిపిస్తుంది.
“మేము ఆసుపత్రికి(PHC) వచ్చేప్పటికి చాలా రాత్రయింది . వాళ్ళు ఆమెను ప్రసవాల గది(లేబర్ రూమ్) కి తీసుకెళ్లారు. ఇంతలో వారిలో ఒకామె వచ్చి ఇది చాలా కష్టమైన కేసు కాబట్టి మేము తనని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళితే మంచిది అని చెప్పారు. వారిలో దాయి(బర్త్ అటెండెంట్) అనుకుంటా, వచ్చి లోపల పాప చనిపోయింది అని చెప్పింది. మేము మా ఆశావర్కర్ తో రాలేదు.ఎందుకంటే అప్పటికే 11 గంటలు దాటి పోయింది. అందుకే నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మా చుట్టుపక్కల వారి సాయంతో ఒక బొలెరో బండిని అద్దెకి తీసుకున్నాను. ఆ బండి మా ఊరిలోనే ఒకరిది కాబట్టి మాకు ఒక పావుగంటలో దొరికింది. అలా జరగక పోయుంటే ఏమయ్యేదో ఆ దేవుడికే తెలియాలి.” అన్నది సుఖియా.
సుఖియా నాలుగు వేలు అద్దెబండి ఖర్చు పెట్టవలసి వస్తుందని అసలు ఊహించలేదు. “ఒక్కసారి బండి దొరికాక, మా ఊరిలో ఉండే ఒక మందుల షాప్ ఓనర్ ని కూడా ఎక్కించుకుని డాక్టర్ దగ్గరికి బయలుదేరాము. మందుల షాప్ అతను కుసుమ్ కి ఒక బాటిల్(ఒక ఇంజెక్షన్, డ్రిప్) ఎక్కించాడు. మా కోడలు అప్పటికప్పుడే బండి లోనే ప్రసవించింది. ఆ తర్వాత అందరం ఇంటికి వచ్చేసాము.” అప్పటికి అర్ధరాత్రి అయిపోయింది.
నేను సుఖియాని ఆసుపత్రి దగ్గర ఆ తర్వాతి రోజే కలిసాను.ఆమె అక్కడ తన మనవరాలికి టీకా వేయించడానికి, జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి వచ్చింది. “వీళ్ళు డబ్బులు ఇవ్వక పోతే కాగితాలు తయారు చేయమంటున్నారు.” అన్నది.
ఒక్క మాటలో చెప్పాలంటే PHC లో గత రాత్రి బిడ్డ గర్భం లోనే చనిపోయింది అని చెప్పిన సిబ్బంది, తర్వాత రోజు ఆ బిడ్డ పుట్టిన సర్టిఫికెట్ ఇవ్వడానికి డబ్బులు అడుగుతున్నారు.
‘ఆమెని ప్రసవాల గదికి తీసుకెళ్లిన ఐదు నిమిషాల్లోనే తిరిగి వచ్చి, ఇది చాలా కష్టమైన కేసు, కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళమన్నారు’. అన్నదామె.
“అందరూ డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళ మనసులో ఎంత అనిపిస్తే అంత అడిగేస్తున్నారు. నెను ఒకరికి వంద రూపాయలు ఇచ్చాను. తరవాత ఇంకొకరికి 300 పుట్టిన సర్టిఫికెట్ కోసం ఇచ్చాను.మళ్లీ ఇంకొకామెకి 350 ఇచ్చాను.”అన్నది. “అంతకు ముందు ఎర్రచీర కట్టుకున్నఈ సిస్టర్,” అని ఆమె ANM ని చూపించింది,”ఆమెకి 500 రూపాయిలు కావాలని గట్టిగా అడిగింది. లేకపోతె నాకు కాగితం ఇవ్వనంది.” సుఖియా ఇక తప్పక డబ్బులు ఇచ్చింది.
“చూడండి మరి. నాకు ఈ కాగితాల గురించి ఎక్కువగా తెలీదు. నాకు ముగ్గురు పిల్లలున్నారు, ఎవరికోసం ఇలాంటి కాగితాలు తయారు చేయించింది లేదు. కానీ ఈ రోజుల్లో ఇవి చాలా ముఖ్యం అంటున్నారు.” అంది సుఖియా
“నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇప్పుడు పుట్టిన పిల్ల, నా పెద్ద కొడుకు కూతురే. నా చిన్న కొడుకు పెళ్లి ఖాయమైంది. మా అమ్మాయి అందరికన్నా చిన్నది. తనకింకా పెళ్లి కాలేదు. నాతోనే ఉంటుంది. వాళ్ళ నాన్న (వ్యవసాయ కూలి) వీళ్లు చిన్న పిల్లలు గా ఉన్నప్పుడే చనిపోయాడు.” సుఖియా కాస్త వంగి తన మోకాలు వరకు చేతులు దించి పిల్లలు అప్పటికి ఎంత చిన్నవాళ్లో చూపించింది.
“నేను ఎన్నో ఏళ్ళు చాలా మంది పొలాల్లో పని చేసి పిల్లలకి తిండి పెట్టుకుని పెంచాను.” అంది సుఖియా . ఇప్పుడు ఆమె కొడుకులు డబ్బులు పంపుతారు, ఆమె తన ఇద్దరు మనవలని (కొత్తగా పుట్టిన బిడ్డతో కలిపి), కోడలు కుసుమ్ ని, తన కూతురిని చూసుకుంటుంది.
“నా ఇద్దరు కొడుకులు ‘కంపెనీ’లో ప్రైవేట్ కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తారు.చిన్నవాడు ముంబై లో ఎలక్ట్రిసిటీ బోర్డులు తయారుచేస్తాడు. ఇప్పుడు పుట్టిన పాప వాళ్ళ నాన్న(34 ఏళ్ళు) పంజాబ్ లో ఇళ్ల లోపల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పని చేస్తాడు. ఈ లాక్డౌన్ వలన ఇద్దరిలో ఏ ఒకరూ ఇంటికి రాలేకపోయారు.” అని భారంగా చెప్పింది సుఖియా. ఆమె కాసేపు ఏమి మాట్లాడలేకపోయింది.
“నేను నా పెద్ద కొడుకుకి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసాను.ఇది వారి రెండో సంతానం. నా మనుమడికి మూడున్నరేళ్లు.’ అని అదే PHC లో పుట్టిన కుసుమ్ కొడుకు ప్రభాత్ ని చూపించింది. సుఖియా PHC పరిసరాల్లో నుంచుని ఉండగా, కుసుమ్ ప్రసవానంతర గదిలో ఉంది. .కుసుమ్ కి ఎడమ పక్క ఉన్న తెల్లటి గోడ ఏళ్ళ తరబడి పాన్ ఉమ్ములు ఊసినందువలన సగం వరకు ఎర్రగా అయిపోయి ఉంది. వార్డులో ఫోటోలు తీయడం నిషేధం. కుసుమ్ కుడిచేతి వైపు అల్ట్రా సౌండ్ మెషిన్ ఉంది- అందులో చాలా సాల్లేళ్లు కాపురం ఉంటున్నాయి. “ఇది పోయిన వారం నుంచి పనిచేయడం లేదు, ఊడ్చే ఆమె కనీసం దీనిని తుడవడం లేదు”, అని డ్యూటీలో ఉన్న ANM చెప్పింది.
ఆమె కడుపుతో ఉన్నఆఖరి నెలలో కుసుమ్ PHC వాళ్ళు చెప్పారు అల్ట్రాసౌండ్ చెక్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళింది. “కానీ ఇక్కడికి కాన్పు కోసం రాగానే మమ్మల్ని పంపేశారు.చాలా ఇబ్బంది అయింది”, అన్నది సుఖియా. మేము అసలు కుసుమ్ తో సంభాషించడానికి వీలు పడలేదు. కుసుమ్ సగం మత్తులో ఉండి, సగం ముందు రోజు రాత్రి జరిగిన హడావిడికి భయపడిపోయి, అసలు మాట్లాడే పరిస్థితి లో లేదు.
సుఖియాకి బోదకాలు ఉంది(ఒక కాలు వాచి పోయి రెండో కాలికి రెండింతలు ఉంది). “ఇది ఇలాగే ఉంటుంది ఎప్పుడూ. ఎక్కువ సేపు ఇలా నుంచోవడం కష్టం నాకు.నేను ఎక్కువగా నడవలేను. మందులు వాడితే తప్ప నాకు ఈ నొప్పి తగ్గదు. కానీ అన్ని పనులు ఈ కాళ్ళ మీద నిలబడే చెయ్యాలి మరి.ఇప్పుడిక్కడ కి వచ్చాను కదా, కొన్ని మందులు కూడా కొనుక్కోవాలి. నా దగ్గర ఉన్నవి అయిపోయాయి.” అన్నది.
తన మనవడిని ఎత్తుకుని ఆమె నెమ్మదిగా దావా వితరణ కేంద్ర (మందుల కేంద్రం) వైపు కుంటుతూ నడిచింది.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే zahra@ruralindiaonline.org కు మెయిల్ చేసి namita@ruralindiaonline.org కు కాపీ పెట్టండి.
ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై జిగ్యసా మిశ్రా నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
అనువాదం: అపర్ణ తోట