సగం తయారయిన గుర్రం బొమ్మని దిండుగా పెట్టుకుని రోడ్డుపక్క పడుకున్న జుఆరా రాం దగ్గరలో కారు ఆగడంతో మేలుకున్నారు. ఈ 60 ఏళ్ళ కళాకారుడు కారులో కూర్చున్న వ్యక్తి దగ్గరకి పరుగున వెళ్ళి, తన బొమ్మ గుర్రం ఎంత గట్టిదో చూపించటానికి దాని మీద కూర్చున్నారు. అది 300 రూపాయిలు. తప్పనిసరిగా రావలసిన బేరం. ఆ కొనుగోలుదారు 200 రూపాయిల కంటే ఎక్కువ ఇవ్వనన్నాడు. అలా జురారాంకి ఆ రోజుకి మొదటి అమ్మకం సాయంత్రం 4 గంటలకి అయింది - ఆ రోజుకు బహుశా అదే చివరిదేమో.
జురారాం విశ్రాంతి తీసుకుంటున్న చోటుకి దగ్గరగా వెదురు కర్రల మీద టార్పాలిన్, ప్లాస్టిక్ పట్టాలతో కప్పిన గుడిసె ఉంది. అందులోనే ఆయన భార్య బుగ్లీ బాయి, వారి ఇద్దరు కొడుకులు, వారి భార్యలు పిల్లలతో నివాసం ఉంటున్నారు. వారి గుడిసె, అలాగనే ఉన్న 40-50 గుడిసెల సమూహంలో వంతెనకు దగ్గరగా, అమానిషాహ్ కాలవ మీద, అంబారీ దర్గా దగ్గర పడమటి జైపూర్ లో ఉంది. ఇక్కడ నివసించే ఈ కుటుంబాలు భట్(రాజస్థాన్ లో ఒ.బి.సి క్రిందకి వస్తారు) కులానికి చెందిన వారు. వీరు ఎండు గడ్డితో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వంటి అలంకరణ వస్తువులు తయారు చేస్తారు.
"ఏ సంవత్సరమో నాకు గుర్తు లేదు, కానీ మా నాన్నగారు నాగ్పూర్ జిల్లాలోని దిద్వాన పట్టణం నుండి జైపూర్ కి వచ్చారు." అని జురారామ్ చెప్పారు. బొమ్మల తయారీ క్రమంలో గడ్డి నమూనా చేయటం ముఖ్యమైన పని. నమూనా చేస్తున్నప్పుడు ఆకారానికి ఆసరాగా సన్నని వెదురు పుల్లలు అక్కడక్కడ దూర్చి ఉంచి, ఆ ఎండు గడ్డి నమూనాని వైరుతోను, తాడుతోను కట్టి రూపం తీసుకువస్తారు. అప్పుడు దాన్ని బుగ్లిబాయి కి ఇస్తే, ఆవిడ ఎరుపు ముఖమల్ గుడ్డతో బొమ్మ మొత్తం కుట్టి, బంగారు రంగు లేసుతో అలంకరిస్తారు. ఈ విధంగా ఒక బొమ్మ చేయటానికి వారికి రెండు నుండి మూడు గంటలు పడుతుంది.
ఏ గుడిసె ముందైతే వాళ్ళు కూర్చుని బొమ్మలు తయారు చేస్తున్నారో అదే వారి ఇల్లు, అదే వారు పనిచేసే చోటు, అదే వారి 'గోదాము' కూడా. ఈ తాత్కాలిక ఇంటిని ఇప్పటికి నాలుగు సార్లు పైనే కదప వలసి వచ్చింది, ప్రతీసారి పోలీసులు, జైపూర్ పట్టణ అధికారులు ఈ తాత్కాలికమైన ఆవాసాలని అక్రమ కట్టడాలు అని నేలమట్టం చేసిన తరువాత మళ్ళీ ఇంటిని కట్టుకోవలసి వస్తుంది. వీళ్ళు ప్రస్తుతం ఉన్న చోట నీళ్లు లేవు, నీటి కోసం టాంకర్ల మీద చుట్టు పక్కల దుకాణాల మీద ఆధారపడుతున్నారు. మరుగు దొడ్లు లేవు. వాటి కోసం పబ్లిక్ మరుగు దొడ్లు, అమనిషాహ్ కాలువ దగ్గర స్థలాలు వాడుతున్నారు. కరెంటు కోసం చాలా కుటుంబాలు బ్యాటరీతో ఛార్జ్ చేసిన ఎల్ఈడీ దీపాలు వాడతారు.
జుఆరారాం కుటుంబానికి కూడా అక్కడ వంతెన దగ్గరగా ఉంటున్న అందరి లాగా, స్వంతంగా కొద్దిపాటి పొలమంటూ ఎప్పుడూ లేదు. వీరిలో చాలా మంది రాజస్థాన్ లోని జోధపూర్, నాగపూర్ జిల్లాలలోని పల్లెల నుండి వచ్చారు. వీరి వంశ పారంపర్యక వృత్తి చెక్క బొమ్మలు చేసి, ప్రదర్శనలు ఇవ్వటం అని ఆయన చెప్పారు, కానీ ప్రస్తుతం వీరు ప్రధానంగా ఎండు గడ్డి, ముఖమల్ గుడ్డతో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు.


పూజా భట్ తన చిన్నతనం నుండి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తయారు చేస్తున్నారు. "ఈ లాక్ డౌన్ మమ్మల్ని అడుక్కునేలా కూడా చేసింది" అని అన్నారు
"ఇప్పుడు జనాలకి వినోదం కోసం టీవీలు, సెల్ ఫోన్లు ఉన్నాయి. వారికి మా కీలుబొమ్మలాట ప్రదర్శనలు ఇక అవసరం లేదు," అని అన్నారు జుఆరారామ్. ఈ కీలుబొమ్మల తయారు చేయటం ఆయన తన చిన్నతనంలో తన తండ్రి, తాతల దగ్గర నుండి నేర్చుకున్నారు. సాధారణంగా ముగ్గురు ఒక జట్టుగా ప్రదర్శన చేస్తే, వాళ్ళు సంపాదించేది, "పది నుండి ఇరవై రూపాయలు. ఒక్కొక్కసారి కొద్దిగా పిండి." కానీ గత రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రేక్షకులకి ఈ ప్రదర్శనల మీద ఆసక్తి తగ్గిపోతోంది.
చాలా కాలం వారి ప్రేక్షకులు ప్రధానంగా జైపూర్, ఆ చుట్టు పక్కల ఉన్న ఖరీదైన హోటల్స్ లోని విదేశీ యాత్రికులే. వారి కోసం ఒక ముగ్గురు మనుషుల జట్టు ఒక గంట నిడివి ఉన్న ప్రదర్శన ఇచ్చేది. అందులో ఒకరు కీలుబొమ్మలు ఆడిస్తే, మిగిలిన ఇద్దరిలో ఒకరు హార్మోనియం, మరొకరు డోలక్ వాయిస్తారు. సాధారణంగా ఈ ప్రదర్శనలు జానపదాలు, కధలు నుండి తీసుకుంటారు. ఆ కట్టు పెద్ద 73 సంవత్సారాల జోధపూర్ కు చెందిన ప్రేమ్ రామ్ రాథోడ్ బాగా ప్రాచుర్యం పొందినకధల గురించి చెపుతూ ఇలా చెప్పారు. 17 వ శతాబ్దంలో షాజహాన్ చక్రవర్తి పాలిస్తున్న సమయంలో మర్వార్ రాజ వంశానికి చెందిన అమర్ సింగ్ రాథోడ్ కధలు ఎక్కువగా ప్రదర్శిస్తారు. అందులో నాగ్ పూర్ సింహాసనం కొరకు రాజ్ పుత్ సోదరుల గొడవలు, ఎత్తుకు పై ఎత్తులు, శిరశ్చేధాలు మొదలైనవి ఉంటాయి.
ఈ ప్రదర్శనల వల్ల ఒక్కొక్కరికి 300 నుండి 500 రూపాయిలు వచ్చేవి. ఇలాంటి ప్రదర్శనలు నెలకు ఇంచు మించు 3 నుండి 4 సార్లు వచ్చేవి. కానీ ఈ లాక్ డౌన్ వల్ల పర్యాటక రంగం పూర్తిగా కుదేలవటంతో ఈ ప్రదర్శనలకు తెర పడిపోయింది.
భట్ కులస్తులు ఎప్పటినుండో చెక్క కీలుబొమ్మలు చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు, కానీ గడ్డి-ముఖ్మల్ బొమ్మల తయారీ అనేది ఈ మధ్యనే మొదలైంది అని ప్రేమ్ రామ్ చెప్పారు. తమ కట్టులో ఈ చిన్నగుర్రాలు చేయటం 1960లలో మొదలైంది. అది కూడా ఇతర దేశాలలో, ముఖ్యంగా పశ్చిమ యూరప్ లో చేతితో చేసిన జంతువుల బొమ్మలకు గిరాకీ పెరిగినప్పుడు అని ఆయన గుర్తు తెచ్చుకున్నారు. దీనికి తోడు చెక్క వస్తువుల తయారీ బాగా ఖరీదు అవటం, సమయం ఎక్కువ తీసుకోటం వల్ల ప్రస్తుతం భట్ కులస్తులు అప్పుడప్పుడు ప్రత్యేక ఆర్డర్ మీద మాత్రమే చెక్క బొమ్మలు తయారు చేస్తున్నారు.


"ఇప్పుడు జనాలకి వినోదం కోసం టీవీలు, సెల్ ఫోన్లు ఉన్నాయి. వారికి మా కీలుబొమ్మలాట ప్రదర్శనలు ఇక అవసరం లేదు," అని అన్నారు జురారామ్
“గుడ్డతో కుట్టిన ఈ గడ్డి గుర్రాలు రామ దేవర గుళ్ళలో కానుకగా సమర్పించటం అనేది రాజస్థాన్ అంతటా బాగా ప్రాచుర్యంలో ఉంది”, అని ప్రేమ్ రామ్ భట్ తెలిపారు. 17వ శతాబ్దంలో, ఒకసారి ఈ గ్రామ దేవుడు, చెక్క గుర్రానికి ప్రాణం పోసి తాను స్వారీ చేయటానికి ఉపయోగించాడని ప్రతీతి అని చెప్పారు. అందుకనే ఇప్పటికీ జైసల్మేర్ జిల్లాలోని రామ్ దేవర పట్టణంలో ప్రతీ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ లలో ఎనిమిది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ఈ చేతితో చేసిన గుర్రాలను కానుకలుగా సమర్పిస్తారు.
“నా తల్లితండ్రులు, ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు తయారు చేయటం చూసి నేను నేర్చుకున్నాను. నేను నా చిన్నతనం నుండి ఎండు గడ్డితో చేసిన గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు తయారు చేస్తున్నారు." అని జురా రామ్ గుడిసెకి ఎదురుగా పేవ్మెంట్ మీద కూర్చున్న 18 ఏళ్ళ పూజా భట్ చెప్పారు. రాజస్థానీ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించిన ఆమె గడ్డి బొమ్మలకు ఎరుపు ముఖమల్ గుడ్డ కుడుతున్నారు.
ఈ మహారోగం ఆమె ఆదాయాన్ని కూడా ప్రభావితం చేసింది. “ఇంతకుముందు ఈ బొమ్మలు అమ్మటం ద్వారా కనీసం రెండు పూటలా అయినా తినగలిగే వాళ్ళం. కానీ ఈ లాక్ డౌన్ మమ్మల్ని అడుక్కునేలా కూడా చేసింది" అని పూజ అన్నారు. ఒక్కొక్కప్పుడు వారు రోజుకు పది బొమ్మలు అమ్మిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు కనీసం ఒకటి,రెండు అమ్మితే మంచి రోజే. “ఇంతకు ముందు రోజు ముగిసేసరికి ఖర్చులన్నీ పోను 400 నుండి 500 రూపాయిలు వచ్చేవి, కానీ ఇప్పుడు 100-150 రూపాయిలు రావటమే కష్టంగా ఉంది. వినియోగదారులు ఈ గడ్డి బొమ్మలు కొనాలను కోటం లేదు. ఒకవేళ అనుకుంటే చాలా పేచీకోరు బేరమాడతారు. మా ఖర్చులు కూడా గిట్టుబాటు కాని ధరకి అమ్మవలసి వస్తుంది”.
ఆమె కుటుంబానికి, అలానే ఆ వంతెనకు దగ్గరగా నివసిస్తున్న ఎవరికీ కూడా ఏ రకమైన గుర్తింపు కార్డు కానీ పత్రాలు కానీ లేవు. వీరికి ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయం అందటం లేదు. " మేం ఎప్పుడు ఏ కార్డ్ ఇవ్వమని అడిగినా, అధికారులు మమ్మల్ని పొమ్మంటారు,” అని పూజ అక్క, 25 సంవత్సరాల మంజు చెప్పారు. “ఏ ప్రభుత్వ పధకాలు మమ్మల్ని కలుపుకోవు. లాక్ డౌన్ సమయంలో కొందరు దాతలు ఇక్కడికి వచ్చి మాకు తిండి పెట్టారు, అందువల్ల బతకగలిగాము. ఆ సమయంలో మూడు రోజుల నాటి పాచిపోయిన పూరీలు, తిన్నాము.”
అలానే రాజు భట్ కూడా. ఈయన పూజ ఉండే గుడిసె పక్కనే ఉంటారు. అతనికి మార్చ్ 2020 నుండి పోరాడుతూనే ఉన్నాడు. ఈ లాక్ డౌన్ వల్ల ఖాతా దారులు దాదాపుగా మాయం అయిపోయారు, కానీ ఈ బొమ్మల ముడిసరుకు ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయాయి అని తన ఐదవ ఏట నుండి గడ్డితో ఈ వస్తువులు చేస్తున్న 38 ఏళ్ళ రాజు చెప్పారు.


'మా కట్టులో ఎవరూ తమ పిల్లలు ఈ పనిని చేయాలని కోరుకోరు' అని రాజు భట్ తన భార్య సంజు, కుమారులు రోహిత్ (ఎడమ), దీపక్ (కుడి)తో చెప్పారు
“ఇంతకుముందు కూరగాయలు, పళ్ళ ప్యాకింగ్ కు వాడే గడ్డి చాంద్ పోల్ మార్కెట్ నుండి లేదా ముహనా మార్కెట్ (ఈ మార్కెట్లు, వీళ్ళ గుడిసెల నుండి 8, 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి) నుండి క్వింటాల్ కి 100-150 రూపాయలకి మాకు దొరికేది. ఆ గడ్డితో ఇంచుమించు 50 బొమ్మలు అయ్యేవి, కానీ ఇప్పుడు మేము క్వింటాల్ కి 1500 రూపాయిలు ఇస్తున్నాము. ఇంకా ముఖమల్ గుడ్డ మీటర్ 70 రూపాయిలు, అలంకరణ కు వాడేవి కిలో 500రూపాయిలు, దారాలు కిలో 200రూపాయిలు. ఇవిగాక, ఆకారం తెచ్చేందుకు వాడే ఈ చిన్న చిన్న వెదురు ముక్కలు, బొమ్మలు కట్టడానికి వాడే వైర్ కూడా కొనాలి,” అని రాజు చెప్పారు.
మార్చ్ 2020 లాక్ డౌన్ తో వచ్చి పడ్డ మారిన పరిస్థితులకు ముందు రాజుకు 18 అంగుళాల గడ్డి-ముఖమల్ వస్తువు తయారీ ఖరీదు ఇంచుమిచు 65-60 రూపాయిల మధ్య ఉండేది, కానీ అది ఇప్పుడు 90 రూపాయిలు, లేక అంతకంటే ఎక్కువగా ఉంది. “వాటి సైజు ని బట్టి మేము 100-120 రూపాయలకి అమ్ముతాము (అప్పుడప్పుడు 200రూ.).” అని రాజు చెప్పారు. ఆయన కుటుంబం రోజుకు 4 బొమ్మలు తయారు చేస్తుంది. కానీ 2 లేక 3 మాత్రమే అమ్మగలుగుతారు, అది కూడా అదృష్టం ఉంటే. “జనాలు ఇంకా 150 రూపాయలకే ఇవ్వమని మాతో బేరాలాడతారు, అదే మాల్ లో అయితే ఒక బొమ్మ కారు 500 రూపాయిలు చెప్పినా బేరమాడకుండా తీసుకుంటారు,” అన్నారు రాజు.
ఈ వస్తువులు అమ్మిన సంపాదన తో ఆరుగురు ఉన్న ఆయన కుటుంబం మొత్తం- రాజు, ఆయన భార్య సంజు (32), నలుగురు పిల్లలు- దీపక్ (17), అనిల్ (15), గుడ్డి (12), రోహిత్ (10) నడవాలి. ఇప్పుడు ఏ ఒక్కరు స్కూల్ కి వెళ్ళటం లేదు. ఇంట్లో బొమ్మల తయారీలో సహాయం చేసేందుకు దీపక్, అనిల్ రెండు సంవత్సరాల క్రితమే స్కూల్ మానేశారు. గుడ్డి, రోహిత్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో చదువుకుంటున్నారు, కానీ వారి దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోటం వల్ల, ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు.
“ప్రభుత్వం స్కూళ్ళు తెరిచినప్పుడు గుడ్డిని, రోహిత్ ని తిరిగి స్కూల్ కి పంపిస్తాను,. మావాళ్ళ లో ఎవరూ మా పిల్లలు ఈ పనిలో కొనసాగాలని అనుకోటం లేదు. ఒక తండ్రి గా నాకు అవే కలలు ఉన్నాయి. వాళ్ళకి ఉద్యోగాలు దొరకాలి అనుకుంటున్నాను. వాళ్ళ జీవనోపాధికి ఈ గడ్డి బొమ్మలు చేయాలి అని అనుకోటం లేదు. ఎవరో ఒకరు, ఏదో సమయంలో ఇంట్లోకి జొరబడి వాళ్ళ ఇళ్ళు కూడా నాశనం చేసే పరిస్థితి వాళ్ళకి రాకూడదు, ”అని రాజు అన్నారు.
రాజుకి భవిష్యత్తు లోకి చూసినప్పుడు, చెక్క కీలుబొమ్మల తయారీ తమ కట్టులో నెమ్మదిగా ఎలా అంతరించిపోయిందో, అలానే ఎండు గడ్డితో బొమ్మలు చేయటం కూడా ఒకరోజున నిలిచిపోతుంది అని తోస్తుంది. “ఈ పని కేవలం మా తరం వరకే ఉంటుంది” అని ఆయన అన్నారు.
అనువాదం: కె. పుష్ప వల్లి