"కొన్నిసార్లు, కండోమ్ ప్యాకెట్ కోసం ఎవరో ఒక మహిళ నాకు కాల్ చేయటమో లేదా రాత్రివేళ ఎవరైనా మగ బంధువును నా ఇంటికి పంపటమో చేస్తుంది," అని కళావతి సోని చెప్పారు. మహిళలకు అవసరమైన వస్తువులను సరఫరా చేసే టిక్రీ గ్రామానికి చెందిన ఈ 54 ఏళ్ల ‘ డిపో దీదీ ’ ని ఈ వేళ కాని వేళలో పిలిచే పిలుపులు ఏమాత్రం ఇబ్బంది పెట్టవు. "రాత్రిపూట కూడా నేను తెరిచే ఉంటాను" అని ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోఉండే ఈ గ్రామంలోని తన చిన్న ఇంటి వరండాలో చార్‌పాయ్(మంచం)పై కూర్చొని ఉన్న ఆమె సరదాగా చెప్పారు. " ఇత్నీ కోయి బడి బాత్ నహీ హై (ఇదేమంత పెద్ద విషయం కాదు)," అంటారు కళావతి తన పని గురించి చెప్తూ.
ఆ గ్రామంలో పనిచేస్తున్న ఒక ఎన్‌జిఒ(ప్రభుత్వేతర సంస్థ) ద్వారా ఈ'డిపో దీదీ ' గురించి విన్న మేము కేవలం కుతూహలంతో ఆమె ఇంటికి చేరుకున్నాం. "ఏయ్, వెళ్ళి ఆ సంచి తీసుకురా," అని కళావతి తన మనవడిని పిలిచారు. కొన్ని క్షణాల్లోనే, ఆ రెండంతస్తుల పక్కా ఇంటి లోపల నుండి ఒక నిండుగా ఉన్న ప్లాస్టిక్ సంచీని పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు ఆ చిన్నోడు. కండోమ్‌లు, శానిటరీ నాప్‌కిన్‌లు, గర్భనిరోధక మాత్రలు, ఓరల్ రీహైడ్రేషన్ ప్యాకెట్లు- ఇవన్నీ ఆ సంచిలోనుండి కిందికి దొర్లాయి. ఆమె వాటిని ప్రదర్శనలో ఉంచుతున్నట్లుగా, ఆ మంచంపై వరుసగా పేరుస్తున్నారు.
" ఇత్నీ కోయి బడి బాత్ నహీ హై (ఇందులో పెద్ద విషయమేమీ లేదు)," అదేం పెద్ద విషయం కాదన్నట్టుగా ఆమె చెప్పారు. “మొదట నేను చిన్నగా ఇంటి విషయాల గురించి మాట్లాడేదాన్ని. మేం వాళ్ళ ఇంటి పరిస్థితిని గురించీ, అత్తగార్ల గురించి వచ్చే ఫిర్యాదుల గురించీ, పిల్లల గురించీ కాస్త చర్చించుకునేవాళ్ళం. నేను ఓపికగా వినేదాన్ని. ఈ సంభాషణల ద్వారా - మీరు చూస్తూనే వున్నారుకదా, నేను చాలా వాగుడుకాయని - మహిళలందరూ ఒకే రకం సమస్యలను ఎదుర్కొంటున్నారని నేను నెమ్మదిగా గ్రహించడం ప్రారంభించాను. అలాంటప్పుడు ఒకరికొకరు ఎందుకు సహాయం చేసుకోకూడదు? ఇంకంతే,” అంటూ, తాను టిక్రీ ‘డిపో దీదీ ’ పాత్రను ఎలా పోషించవలసివచ్చిందో వివరించారామె.
అందరూ ఆమెను పిలిచే డిపో దీదీ అనే పేరు 'డిపో హోల్డర్' నుండి వచ్చింది. ఇది సమాజంలోని మహిళలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తూ, మంచి ఆరోగ్య పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించే ఆరోగ్య రంగానికి సంబంధించిన పదం. కానీ కళావతి గ్రామాల్లో అధికారికంగా డిపో హోల్డర్‌లుగా పనిచేస్తున్న అంగన్ వాడీ వర్కర్, లేదా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) కానీ కాదు. ఆమెఝోలా చాప్ (లైసెన్స్ లేకుండా వైద్యం చేసేవారు) కూడా కాదు. ప్రాథమిక పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం మహిళలకు అవసరమయ్యే దాదాపు ప్రతిదానినీ ఆమె నిల్వ చేస్తారు; వారి లైంగిక, పునరుత్పత్తికి సంబంధించిన ఆందోళనల గురించి కూడా ఆమె వారితో మాట్లాడతారు.
“ఈ 15 సంవత్సరాలలో (ఈ పని చేస్తుండిన) ఆశాలు (ASHA) కష్టపడి పని చేయడాన్ని, అలసిపోవడాన్ని నేను చూశాను. ఒకసారి, ఆశా వర్కర్ ఒకరు కొన్ని ఐరన్ మాత్రలు ఇవ్వడానికి ఒక గర్భవతిని కలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ మాత్రలను నాకివ్వమని అడిగాను. ఆ మాత్రలు వేసుకునే మోతాదు గురించి ఆ గర్భవతి తప్పకుండా అర్థం చేసుకునేలా చేస్తానని నేనామెకు చెప్పాను. ఇదిగో, ఇదంతా అలానే ప్రారంభమైంది,” అన్నారు కళావతి. గ్రామంలోని మహిళలకు సహాయం చేయడం ప్రారంభించిన ఆ తేదీ గురించి ఆమెకు సరిగ్గా గుర్తులేదు.
కుటుంబాలలోని యువ వధువులతోనూ, పెద్దలతో కూడా కలిసి పనిచేస్తూ, వారి ఆదరాభిమానాలను పొందుతూ ఉన్నఆమె, ఆ కుటుంబాలలో తనకొక ముఖ్యమైన సన్నిహిత స్థానాన్ని నిలుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నా మనస్సులో అనేక ప్రశ్నల పరంపర తలెత్తుతోంది: స్త్రీలు తమ కోరికల గురించీ, అవి నెరవేరడం గురించీ; తమ జీవిత భాగస్వాములతో, ఇతర కుటుంబ సభ్యులతో తమ సంబంధాల గురించీ; గర్భాల గురించీ, గర్భనిరోధకాల గురించీ ఎలా మాట్లాడతారు? వారు బిడియపడుతూ, సంకోచిస్తూ ఉంటారా, లేదా ఎలాంటి జంకూ లేకుండా ముందుకొస్తూ ఉంటారా? ఈ సంభాషణలు ఎక్కడ జరుగుతాయి? ఈ స్త్రీలు స్నేహాన్నీ ఓదార్పునూ, తమ స్వంత శరీరాల గురించిన సమాచారాన్నీ తెలుసుకోగలిగే వెసులుబాటును కళావతి ఎలా వారికి కలిగిస్తారు?
"పదేళ్ల క్రితం, ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు చాలా సమయం, కృషి అవసరమయ్యేది. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు - స్త్రీలూ, పురుషులూ కూడా - బిడ్డల పుట్టుకల మధ్య ఉండాల్సిన అంతరం గురించీ, జనన నియంత్రణ గురించీ, మనవ సంతానం గురించిన సంభాషణలను ప్రోత్సహించేవారు కాదు. వాళ్ళు ' బిగాడ్నే ఆ గయీ హుమారీ బహు కో ' (ఈమె మా కోడలిని చెడగొట్టడానికే వచ్చింది)' అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. యువ వధువులు మరింత అవగాహనతో, ఆసక్తితో ఉన్నారు. కండోమ్ అవసరమైతే వాళ్ళే అడుగుతున్నారు,” అని కళావతి చెప్పారు. సాయిలా పాయిలాగా ఆమె మాట్లాడే తీరు పునరుత్పత్తి హక్కుల గురించిన సందేశాన్ని సజీవంగా ఉంచుతుంది. యువ వధువులతో కలిసి ఒక కప్పు టీ తాగుతూ, స్నేహపూర్వకమైన పరిహాస ధోరణిలో మాట్లాడుతూనే కళావతి అవసరమైన సమాచారాన్ని చిన్న చిన్న మాటలలో వారికి తెలియజేస్తారు. "ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే, బిడ్డకూ బిడ్డకూ మధ్య మూడు సంవత్సరాల ఎడం ఉండేలా చూసుకోవాలని నేను వాళ్ళకు చెప్తుంటాను," అని ఆమె అన్నారు.
ఫిబ్రవరి 2020లో కన్నుమూసిన తన అత్తగారిని గుర్తు చేసుకుంటూ, “అత్తగార్లు కూడా మెరుగయ్యారు,” అంటూ కళావతి నవ్వారు. ఈ వస్తువులను ఇంట్లో భద్రపరచడం ప్రారంభించిన మొదట్లో ఆమె కండోమ్‌లనూ, మాత్రలనూ దాచిపెడుతుండేవారు. ఆమె చేస్తున్న ఈ పనిని ఆమె అత్తగారు ఖండించేవారు; ఇతరుల పడక గదుల గురించీ, వారి భవిష్యత్తు ప్రణాళికల గురించీ జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని ఆవిడ భావించేవారు. అయితే ఆమె తన చివరి సంవత్సరాలలో కళావతికి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
“ఇది అనవసరమనీ, ఒక విధంగా మంచి పని కాదనీ ఆమె భావించింది. నాకు పెళ్లైన కొత్తలోనే వెంటవెంటనే పిల్లలు పుట్టారు- మొదట కవల అబ్బాయిలు, ఆపైన ఒక అమ్మాయి. త్వరలోనే మూడోసారి గర్భవతిని అయ్యాను. రోజుల తరబడి రకరకాల ఇబ్బందులు, నొప్పీ ఉండేవి. నేనేం చేయొచ్చో ఎవరైనా చిన్న సలహా ఇస్తేనో లేదా మార్గదర్శకంగా ఉంటేనో బాగుండునని కోరుకునేదాన్ని. చాలా నిస్సహాయంగా అనిపించేది. నా మూడవ బిడ్డను కోల్పోయాను; అది నాకు చాలా కోపం తెప్పించింది,” అన్నారామె తన స్వంత అనుభవాలను వివరిస్తూ. ప్రాథమికంగా ఏ విధమైన పారితోషికం కూడా లేకుండా తానెందుకు సేవలను అందించిందో ఆమె స్పష్టం చేశారు. "నేనెందుకు ఈ విధంగా చేస్తానంటే, ఒక సహేలీ (నేస్తం) నుంచి ఇటువంటి సలహాలు మనందరికీ అవసరమని నేను భావిస్తున్నాను" అని ఆమె చెప్పారు. ఒక ఆశా కార్యకర్తకు ఉండేలాంటి ఒత్తిడి, సాధించవలసిన లక్ష్యాలు అనేవి లేకుండా తాను దీన్ని చేయగలనని ఆమె మాకు గుర్తుచేశారు.
ఎక్కువగా పునరుత్పత్తి హక్కుల సమస్యలపై పూర్తి వైద్యసంబంధ విధానంలో పనిచేసే ప్రజారోగ్య కార్యకర్తలతోనూ, ఎన్‌జిఒ ఉద్యోగులతోనూ పోలిస్తే ఆమె పనివిధానం చాలా సాధారణంగా ఉంటుంది. కానీ కళావతికి తన కోసం తాను రూపొందించుకున్న పాత్ర పరిమితులు బాగా తెలుసు. "ఒక స్త్రీ బాగా నొప్పితో బాధపడుతున్నప్పుడు, లేదా అది అత్యవసర పరిస్థితి అయినప్పుడు, వాళ్ళు నన్ను పిలవరు," అని ఆమె చెప్పారు. అలాంటి సమయాల్లో వారు ఆశా కార్యకర్త వద్దకో, లేదా ప్రజారోగ్య కేంద్రానికో వెళతారు.
కండోమ్‌లు, మాత్రలు, ఇతర అవసరమైన వస్తువుల పంపిణీలో సహాయం చేస్తూ, నేటికీ ఆమె ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తూనే ఉన్నరు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి, ఆమె తన ఇంటి నుండి 25 నిమిషాల నడక దూరంలో ఉన్న బేటువా బ్లాక్‌లోని ఆరోగ్య కేంద్రం నుండి గర్భనిరోధక మందులను సేకరించి, అవసరమైన వారికి ఇవ్వటం కోసం తన ఇంట్లో నిల్వ చేస్తారు. గ్రామంలోని మహిళలు ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందిపడినప్పుడు వారికిచ్చేందుకు అవి ఉపయోగపడుతున్నాయి. కండోమ్‌లు, సహేలీ గోలీ (గర్భనిరోధక మాత్ర) కోసం ప్రజలు ఆమె వద్దకు వస్తారు. “నా ఇంట్లో అవి ఎప్పుడూ ఉంటాయి. అయితే అవసరమైనప్పుడు ఏదో ఒక బహనా (సాకు)తో నేనే వెళ్ళి వాళ్ళకు ఇచ్చేసివస్తుంటాను,” అని కళావతి చెప్పారు.
ఆరోగ్య కేంద్రం నుంచి ఆమెకు మాత్రలు ఉచితంగా వస్తాయి. అయితే, పంపిణీ చేయటం కోసం ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక ఎన్‌జి్ఒ నుండి ఆమెకు కండోమ్‌లు, శానిటరీ న్యాప్‌కిన్‌లు వస్తాయి. లేదంటే స్థానిక ఫార్మసీ నుండి తన స్వంత డబ్బుతో ఆమె వాటిని కొనుగోలు చేస్తారు.
2020లోని లాక్‌డౌన్ నెలలు ఆమెకు పెద్ద సవాలుగా నిలిచాయి. ఇళ్ళనుండి బయటికి వెళ్లడంపై ఆంక్షలు విధించడం వలన, కేవలం గర్భనిరోధక సాధనాల కోసమే మహిళల నుంచి కళావతికి రోజుకు ఐదేసి కాల్స్‌కు పైగా వచ్చేవి. “పనులు లేకపోవడం వలన పురుషులు ఎందుకోసం కూడా ఇంట్లోంచి బయటకు వెళ్లేవాళ్ళు కాదు. దాంతో మహిళలు గర్భవతి అవుతామేమోనని భయపడేవారు. చాలామంది అలాగే అయ్యారు కూడా. నేను వారిని రహస్యంగా బయట పొలాల్లో కలుసుకుని, నా దగ్గర నిల్వ ఉన్నంత వరకు వారికి కండోమ్‌లు, సహేలీ గోలీలు ఇచ్చేదాన్ని” అని కళావతి చెప్పారు. మహిళలకు కూడా కోరికలుంటాయి. "కోరిక ఎప్పుడు కలుగుతుందనేదానికి ఒక స్థిరమైన టైమ్‌టేబుల్ ఉండదు కదా," అని ఆమె అంటారు.
“నేను పరిమితులు పెట్టాల్సి వచ్చింది. గిరాకీ పెరిగిపోతోంది కానీ అవి నాకు దొరకటం లేదు. నేనేం చేయాలి? నాకు తెలిసి, గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు లాక్‌డౌన్ సమయంలో గర్భం రాకూడదనుకున్నారు, కానీ వచ్చింది. ఏం చేయగలం?" అని ఆమె అడుగుతారు. దేశాన్ని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నప్పుడు, అధికారులు మహిళల గురించి ఆలోచించలేదని ఆమె భావిస్తారు. " కౌన్ సోచ్తా హై ఇన్ సబ్ చీజోఁ కే బారే మే , కి యే భీ జరూరీ హై (ఈ విషయాల గురించి ఎవరాలోచిస్తారు, అవి కూడా చాలా ముఖ్యమైన విషయాలని?)" అంటారు కళావతి.
కొన్ని సంవత్సరాలుగా, అన్ని వయస్సులకు చెందిన స్త్రీలు తమ జీవితాలు, లక్ష్యాలు, సవాళ్ల గురించి కళావతి ముందర వెల్లడిచేశారు. వారు ఆమెపై నమ్మకం పెంచుకున్నారు. "నేను కూడా బోలెడన్ని కథల, రహస్యాల డిపో హోల్డర్‌ని" నవ్వుతూ అన్నారామె.
గ్రామీణ భారతదేశంలోని కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులపై PARI, కౌంటర్‌మీడియా ట్రస్టుల ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్- పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో కీలకమైన, ఇంకా అట్టడుగున ఉన్న సమూహాల పరిస్థితిని- సాధారణ ప్రజల గొంతుల ద్వారా, జీవన అనుభవం ద్వారా అన్వేషించడంలో ఒక భాగం.
ఈ కథనాన్ని తిరిగి ప్రచురించాలనుకుంటున్నారా? అయితే, ఈ ఇ-మెయిల్ చిరునామాను సంప్రదించండి: zahra@ruralindiaonline.org అలాగే, namita@ruralindiaonline.orgకు కాపీ పంపండి:
అనువాదం: సుధామయి సత్తెనపల్లి