ఇంటి బయట మంచం మీద కూర్చుని, 40 ఏళ్ళ మలన్ తన అమ్మ కోసం ఎదురుచూస్తోంది. ఆమె తనకు ఇష్టమైన పువ్వుల బ్లౌజు, మడమల దాకా ఉన్న పావడా వేసుకుంది. నన్ను చూసి ఆమె మొహం వెలిగింది. క్రితం సారి వారింటికి నేను వచ్చానని గుర్తుపట్టింది. “ ఆయీ నహి ఘర్ (అమ్మ ఇంట్లో లేదు)”, అన్నదామె. నేను వారి రెండు గదుల ఇటుక, రాయి, మట్టితో కట్టిన ఇంటి గుమ్మం ముందు కూర్చున్నాను.
మలన్ మోర్ వాడి గ్రామంలో తన అమ్మ 63 ఏళ్ళ రహిబాయి, 83 ఏళ్ళ తండ్రి నానా(వారి పేర్లు, ఊరి పేర్లు మార్చబడ్డాయి)తో కలిసి ఉంటుంది. ఈ గ్రామం పూణే జిల్లా, ములాషి తాలూకాలో ఉంది. ఇక్కడ వారి కుటుంబం వారికున్న మూడు ఎకరాలలో వరి, గోధుమ, కూరగాయలు పండిస్తారు.
మలన్ కు 18 ఏళ్లప్పుడు ఆమెకు బోర్డర్ లైన్ మెంటల్ రిటార్డేషన్ ఉందని ససూన్ జనరల్ హాస్పిటల్ ద్వారా తెలిసింది.
దానికి 12 ఏళ్ల క్రితం ఆమె స్థానిక ప్రాధమిక పాఠశాలలో చదువుకున్నది. “ఆమె క్లాస్ లో ఆమెతో చదివేవారంతా నాలుగవ తరగతి పాసయ్యి పై తరగతిలోకి వెళితే ఆమె నేల మీద గీతాలు గీయడం తప్ప మరేమి చేయలేదు,” అని చెప్పింది రహిబాయి. చివరికి ఆ క్లాస్ టీచర్ ఆమెని స్కూల్ నుండి తీసేమని చెప్పింది. మలన్ కు అప్పుడు 15 ఏళ్ళు ఉండేవి.
అప్పటినుండి మలన్ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ అమ్మతో ఉంటుంది. ఈ పనులు చేయడం కూడా ఆమెకు ఇష్టముంటేనే. ఆమె చాలా తక్కువ మాట్లాడుతుంది. అది కూడా తన అమ్మతో కాక ఇంకొందరితోనే. కానీ ఆమె అర్ధం చేసుకోగలదు, అర్ధవంతంగా మాట్లాడగలదు. నేను ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె తల ఊపి, నవ్వి, తేలిగ్గా మాట్లాడింది.
మలన్ కి తన మొదటి రుతుస్రావం ఆమెకు 12 ఏళ్లు ఉన్నప్పుడు వచ్చింది. “అక్కడ రక్తం ఉంది”, రహిబాయికి తనకు ఋతుస్రావమవుతుందని చెప్పడానికి మలన్ చేసిన ప్రయత్నమది. ఆమె తల్లి బట్టతో పాడ్లు ఎలా వాడాలో నేర్పించింది. “కానీ నా కొడుకుకు పెళ్లవుతోంది. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. కాబట్టి నాలాగానే ఆమె కూడా ‘బయట’ కూర్చోవడం మొదలు పెట్టింది(పీరియడ్స్ సమయంలో),” అన్నది రహిబాయి, ఇంటిలో వంటగదికి వెళ్ళకపోవడం వంటి కట్టుబట్టలతో పాటు, గదిలో ఒక మూల కూర్చోవడాన్ని గురించి చెబుతూ. మలన్ కు ఈ సమాచారం అంత తన తల్లి నుండే వస్తుంది. ఆమె తన తల్లి చెప్పినట్లే విన్నది.
కొంతకాలానికి రహిబాయికి తన కూతురికి హిస్టరెక్టమి చేయించమని సలహాలు అందాయి. “కొన్ని సార్లు మలన్ కి ఐదారు నెలల పాటు నెలసరి వచ్చేది కాదు, అప్పుడు నాకు చాలా ఆందోళనగా ఉండేది(గర్భం దాల్చినదేమోనని). ఆమె ఎక్కువ మాట్లాడదు. ఏదన్నా జరిగిందేమో నాకు ఎలా తెలుస్తుంది?” రహిబాయి వివరించింది. “నేను ఆమెని పూణే(వాడి గ్రామం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది)లోని ఫామిలీ ప్లానింగ్(ఫామిలీ ప్లానింగ్ అసోసియేషన్ అఫ్ ఇండియా)కి రెండు సార్లు తీసుకెళ్లి పరీక్ష చేయించాను. రెండవసారి 2018 లో పరీక్ష చేయించాను.” మందుల షాపులో ప్రెగ్నన్సీ కిట్ తేలిగ్గా దొరికేది కాని రహిబాయికి మలన్ కోసం తెప్పించడం కష్టం.
మానసిక వైకల్యం ఉన్న ఆడపిల్లల్లో హిస్టరెక్టమి లేదా పునరుత్పత్తి అవయవాలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం అనేది సామాజిక పరంగా ఆమోదించబడిన ఆలోచన, ఋతుస్రావం అనేది ఒక కట్కట్ ( తలకాయ నొప్పి లేదా ఒక ఇబ్బంది) అనే భావన నుండి ఉద్భవించింది. అంతేగాక మానసిక వైకల్యం ఉన్న అమ్మాయిలకు, మహిళలకు లైంగికత పై సరైన శిక్షకులు లేకపోవడం, లేదా సంస్థాగతమైన ఆలంబన లేకపోవడం వలన కూడా ఇలా ఆలోచించడం జరుగుతుంది.
1994లో, పూణేలో ససూన్ జనరల్ ఆసుపత్రిలో 18-35 ఏళ్ళ మధ్యలో ఉన్న మానసిక వైకల్యం ఉన్న మహిళలపై హిస్టరెక్టమీలు జరిపినప్పుడు ఇటువంటి పద్దతి గురించి వార్తలలో ముఖ్యమైన అంశంగా వచ్చింది. వీరిని ,పూణే జిల్లాలోని శిరీర్ తాలూకాలో మానసిక లోపం ఉన్న బాలికల కోసం నివాస వసతి ఉన్న ప్రభుత్వ సర్టిఫైడ్ పాఠశాల నుండి తీసుకువచ్చారు. ఈ మహిళల పై లైంగిక హింసల పర్యవసానాన్ని తట్టుకునేందుకు ఇదే సరైన మార్గమని అక్కడి అధికారులు వాదించారు.
‘పూణే క్లినిక్ లో డాక్టర్లు మలన్ గర్భసంచిని తీయించేయమని సలహా ఇచ్చారు, 'అన్నది రహిబాయి నాతొ. “కాని నేను వారిని గర్భ సంచి తీయించే బదులు, నస్బంది (ట్యూబెక్టమీ) చేయించడానికి వీలవుతుందేమో అని అడిగాను'
పూణేలో ఉండే ఆరోగ్య కార్యకర్త డా. ఆనంద్ ఫాడ్కే మరికొందరు కలిసి బొంబాయి హై కోర్ట్ లో ఒక రిట్ పిటీషన్ వేశారు. ఈ ఆడవారిని అడగకుండానే, పదేళ్ల వయసున్న అమ్మాయిలకు కూడా ఈ శస్త్రచికిత్స చేయిస్తున్నారని చెప్పారు. ఈ పిటీషనర్లు వివిధ ప్రదేశాలలో మానసిక లోపం ఉన్న మహిళల పై తరచూ జరిగే లైంగిక హింస, తిరస్కారం, బలవంతపు గర్భాలు, గర్భస్రావాలు గురించి గట్టిగా చెప్పారు. ఈ పిటీషన్ వేశాక ప్రజల నుండి వచ్చిన ప్రతికూల స్పందన, ఈ ఆపరేషన్లను ఆపింది. కాని అప్పటికే కనీసం 11 ఆపరేషన్లు జరిగాయి. పోయిన ఏడాది ఈ పిటీషన్ వేసిన 25 ఏళ్లకు అక్టోబర్ 17, 2019, బొంబాయి హై కోర్ట్ జారీ చేసిన ఆర్డర్ లో ఈ కేసు పై వాదోపవాదాలు ముగిశాయి, తీర్పు మాత్రమే ఇవ్వవలసి ఉందని చెప్పింది.
“పూణే క్లినిక్ లో డాక్టర్లు మలన్ గర్భసంచిని తీయించేయమని సలహా ఇచ్చారు,” అన్నది రహిబాయి నాతో. “కాని నేను వారిని గర్భ సంచి తీయించే బదులు, నస్బంది (ట్యూబెక్టమీ) చేయించడానికి వీలవుతుందేమో అని అడిగాను.”
ఐతే ఈ మానసిక వైకల్యం ఉన్న ఆడవారి తాత్కాలిక, శాశ్వత గర్భనిరోధక చర్యల గురించి మాట్లాడుకుంటుండగా, దూరంగా వాడి గ్రామంలో రహిబాయికి తన కూతురి అవసరాల గురించి సరైన అవగాహన ఉంది. మలన్ చెల్లెలు(పెళ్లయిపోయింది, పూణే లో ఉంటుంది), ఆమె పెద్దమ్మ కూతుర్లు చాలా అండగా నిలిచారు. “ఆమె కౌమార దశలో ఉన్నప్పుడు ఏమి అవలేదు. ఇప్పుడు ఆమెను బాధపెట్టడం దేనికి? అలానే ఉండనీ”, అన్నారు వారు. కాబట్టి మలన్ ట్యూబెక్టమీ కాని హిస్టరెక్టమీ కాని చేయించుకోలేదు.
కాని ఎందరో తలిదండ్రులు మానసిక వైకల్యం ఉన్నవారి పిల్లలకు ఈ ఆపరేషన్ చేయించాలనే భావిస్తారు. భారత దేశంలో రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్న ప్రతి సంస్థ, హిస్టరెక్టమి చేయిస్తేనే ఆడపిల్లలను చేర్చుకునే నిబంధన విధిస్తారు. ఎలానూ ఈ ఆడవారు పెళ్లి చేసుకోరు, పిల్లలు ఉండరు, కాబట్టి ఆమె శరీరంలోని గర్భ సంచితో ఏమి పని ఉండదు. ఈ పధ్ధతి వలన అమ్మాయిలు వారి నెలసరిలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించే అవసరం ఉండదు. సాధారణంగా వీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి, లైంగిక దాడి, తద్వారా వచ్చే గర్భాల భయమే కారణం.
ఇందులో కొన్ని ఆందోళనలకు సరైన అర్ధం లేదనిపిస్తుంది. “బోర్డర్ లైన్ వైకల్యం ఉన్నవారు రజస్వల అయిన తరవాత ఏమవుతుందో తెలుసుకుని, నెలసరిని బాగానే సంబాళించుకోగలుగుతారు,” అంటారు అచ్యుత్ బోర్గావ్కర్. ఈయన పుణెలోని తథాపి ట్రస్ట్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కౌన్సెలర్లు, సంరక్షకులలో వైకల్యం-లైంగికతపై అవగాహన-శిక్షణా సెషన్‌లకు సమన్వయకర్తగా పనిచేసేవారు. "కానీ మనకు ప్రజారోగ్యంలోను, విద్యా వ్యవస్థలోనూ ఈ కార్యక్రమం [వికలాంగులకు జీవన నైపుణ్యాలు, లైంగికత విద్యపై] లేదు."
బలమైన ప్రజారోగ్య సంరక్షణ, సంక్షేమ వ్యవస్థ, కుటుంబం సంఘం నుండి స్థిరమైన మద్దతు లేనప్పుడు, వైకల్యాలున్న వ్యక్తుల లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని, హక్కులను రక్షించడం చాలా కష్టమని మేధా టెంగ్షే చెప్పారు.
"మేము కూడా నిస్సహాయులమే," అని వాడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్వాన్ లోయలో 1994లో (రిజిస్టర్డ్ సొసైటీగా) మేధోపరమైన వికలాంగుల కోసం స్థాపించబడిన సాధనా విలేజ్ వ్యవస్థాపక సభ్యులు, తెంగ్షే చెప్పారు. (రహీబాయి సాధన గ్రామంలో గత 20 సంవత్సరాలుగా కమ్యూనిటీ వర్కర్ గా చిన్న గౌరవ వేతనం పొందుతున్నారు). “సుమారు 15 సంవత్సరాల క్రితం, మేము మా మహిళా నివాసితులను వారి పీరియడ్స్ సమయంలో చూసుకునే, వారికి అవసరమైన సహాయాన్నిఇచ్చే మహిళా సంరక్షకులను నియమించగలిగేవారం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మేము ఇక్కడ నివసించే మహిళలకు తమని తాము స్వయంగా చూసుకోగలిగే మౌలిక శిక్షణనివ్వడానికి ప్రయత్నిస్తాము, కానీ కొన్నిసార్లు మాకు కూడా కష్టమవుతుంది. అప్పుడు మేము శస్త్రచికిత్సను సూచించవలసి వస్తుంది.”
సమీపంలోని కొల్వాన్ గ్రామంలో, వాడికి దగ్గరగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రంలో, పటిష్టమైన ప్రజారోగ్య సహాయ వ్యవస్థ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు మగ ఆరోగ్య కార్యకర్తలు, ఒక మగ మెడికల్ ఆఫీసర్, ఇద్దరు మహిళా ఆరోగ్య కార్యకర్తలు- వీరిని మేధోపరమైన వైకల్యం ఉన్న మహిళల పునరుత్పత్తి ఆరోగ్య అవసరాల గురించి అడిగినప్పుడు ఇంకెటువైపో చూస్తున్నారు. "మేము యుక్తవయస్సులోని బాలికలకు, మహిళలకు శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేస్తాము" అని ఒక సహాయక నర్సు మంత్రసాని చెప్పింది. మీరు ఇంకా ఏమి చేస్తారు, అని నేను అడిగాను. వారు ఒకరిమొహాలొకరు చూసుకున్నారు.
కులే గ్రామంలో, వాడికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (సుమారు 11 కిలోమీటర్ల దూరంలో), దాదాపు అదే పరిస్థితి. సువర్ణ సోనార్ అనే ASHA (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), కులేలో 'నెమ్మదిగా నేర్చుకునే' అమ్మాయిలు ఇద్దరున్నారని, కోల్వాన్‌లో నలుగురు లేదా ఐదుగురు ఉన్నారని చెప్పారు. కానీ వారికి ప్రత్యేక ఆరోగ్య సేవలు అంటూ ఏవీ లేవు, “యుక్తవయస్సు రాగానే వారి ప్రవర్తన మారుతుంది. వారికి ఎలా చెప్పాలో, ఏమి చెప్పాలో మాకు తెలియదు.’ అని ఆమె అన్నది.
మే 3, 2008 నుండి అమల్లోకి వచ్చిన వికలాంగుల హక్కులపై UN కన్వెన్షన్ యొక్క ఆర్టికల్ 25 (a) 'రాష్ట్ర పార్టీలు వికలాంగులకు అదే పరిధి, నాణ్యత మరియు ప్రమాణాలతో ఉచిత లేదా సరసమైన ఆరోగ్యాన్ని అందించాలి' అని ఆదేశిస్తుంది. లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, ఇంకా జనాభా ఆధారిత ప్రజారోగ్య కార్యక్రమాలతో సహా ఇతర వ్యక్తులకు అందించబడిన సంరక్షణ కార్యక్రమాలు కూడా ఇందులో జాబితా చేయబడ్డాయి.
భారతదేశం ఈ ఒప్పందాన్ని ఆమోదించింది, అయితే 2016లో మాత్రమే వికలాంగుల హక్కుల చట్టం భారతదేశంలో వికలాంగుల అనుమతి తీసుకోకుండా జరిగే స్టెరిలైజేషన్‌ను నిషేధించింది. రాష్ట్రం తప్పనిసరిగా 'లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణను ప్రత్యేకించి వికలాంగ మహిళలకు', అలానే 'వికలాంగులకు, పునరుత్పత్తి ఆరోగ్యం మరియు కుటుంబ నియంత్రణకు సంబంధించి తగిన సమాచారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి' అని చట్టం ఆదేశిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో 6 లక్షలకు పైగా ఉన్న 'మెంటల్ రిటార్డేషన్' లేదా గ్రామీణ ప్రాంతాలలోని 4 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్న 'మెంటల్ రిటార్డేషన్' ఉన్న మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కుల గురించి ఈ చట్టంలో కూడా నిర్దిష్ట నిబంధనలు లేవు.
చాలా సందర్భాలలో, మేధోపరమైన వికలాంగులను అలైంగికంగా లేదా ఎక్కువ లైంగిక కోరుకలున్న వ్యక్తులుగా చూస్తారు. వారి పునరుత్పత్తి ఆరోగ్య అవసరాలను 'నిర్వహించాలనే' తపనతో, వారి ప్రేమ, సాంగత్యం, సెక్స్ ఇంకా సాన్నిహిత్యం కోసం వారి అవసరం మాతృత్వంపై వారి హక్కుతో పాటే విస్మరించబడుతుంది, అని వైకల్యం మరియు లైంగికత పై 2017 లో ప్రచురితమైన ఒక పేపర్ పేర్కొంది.
మీరు ఎప్పుడైనా మలన్‌కి పెళ్లి గురించి ఆలోచించారా, నేను రహీబాయిని అడిగాను. "కొందరు దీనిని సూచించారు, ప్రతిపాదనలు కూడా తీసుకువచ్చారు, కానీ మేము ఆమె వివాహం చేయకూడదని నిర్ణయించుకున్నాము" అని ఆమె చెప్పింది. “ఆమె చీర కూడా కట్టుకోలేదు, ఇక తన సొంత కుటుంబాన్ని ఎలా నిర్వహించుకుంటుంది? ఆమె [ఇద్దరు] సోదరులు కూడా, ‘ఆమె ఇక్కడే తన ఇంట్లోనే చనిపోవాలి’ అన్నారు.” మలన్ వంటి చాలా మంది స్త్రీలు తమ భర్త ఇంటిలో తమ కొత్త జీవితాన్ని సర్దుబాటు చేసుకోలేక చివరికి వారి తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తారని రహీబాయికి తెలుసు.
అయితే, పూణేకు చెందిన విద్యావేత్త, కౌన్సెలర్ మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తి యొక్క తల్లి డాక్టర్ సునీతా కులకర్ణి చెప్పారు, ప్రత్యేక అవసరాలు ఉన్న స్త్రీ, పురుషులు కూడా లైంగిక హక్కులు కలిగి ఉంటారని గుర్తించడం చాలా ముఖ్యం. "సెక్స్ అంటే సంభోగం మాత్రమే కాదు," ఆమె చెప్పింది. “లైంగికతలో చాలా అంశాలు ఉన్నాయి. స్నేహం, సాన్నిహిత్యం, సరసంగా మాట్లాడుకోవడం లేదా ఒక కప్పు కాఫీ పంచుకోవడం ఉన్నాయి. కానీ అటువంటి పనులను కూడా నిషేధిస్తారు.”
బదులుగా, మేధో వైకల్యం ఉండి కౌమారదశలో ఉన్న అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమ లైంగిక భావాలను వ్యక్తం చేసినప్పుడు, చాలా కుటుంబాలు, సంరక్షకులు వారిని వ్యతిరేకిస్తారు, చాలామంది సెక్స్ హార్మోన్లను నియంత్రించడానికి మందులను ఉపయోగిస్తారు, మరికొందరు లైంగిక ప్రవర్తనను కఠినంగా శిక్షిస్తారు. "ఇలా తిరస్కరించడం ద్వారా మనం ఏమి పొందుతాము?" అని ముల్షి తాలూకాలోని పాడు గ్రామంలో 15 ఏళ్లుగా ప్రత్యేక అవసరాలు గల వారితో పనిచేస్తున్న డాక్టర్ సచిన్ నాగర్కర్ ప్రశ్నించారు. "లైంగిక కోరిక అనేది సహజమైన, ఆరోగ్యకరమైన వ్యక్తీకరణ. మీరు దానిని ఆపలేరు, అణచివేయలేరు లేదా తిరస్కరించలేరు.”
వారి స్వంత లైంగిక కోరికలు విస్మరించబడినప్పటికీ, వికలాంగులైన స్త్రీలు, బాలికలు తరచుగా లైంగిక వేధింపులు మరియు దాడికి గురి అవుతున్నారు. మలన్, ఆమె పెద్దమ్మ కూతురు రూపాలి, ఇద్దరూ తమ గ్రామంలోని అబ్బాయిల నుండి వేధింపులను ఎదుర్కొన్నారు
వారి స్వంత లైంగిక కోరికలు విస్మరించబడినప్పటికీ, వికలాంగులైన స్త్రీలు, బాలికలు తరచుగా లైంగిక వేధింపులకు, లైంగిక దాడికి గురి అవుతున్నారు. మలన్ పెద్దమ్మ కూతురు, 38 ఏళ్ల రూపాలి (పేరు మార్చబడింది)కి కూడా మేధోపరమైన వైకల్యం ఉంది, ఇద్దరూ తమ గ్రామంలోని అబ్బాయిల నుండి తమ యవ్వనంలో వేధింపులను ఎదుర్కొన్నారు. "కొందరు అబ్బాయిలు పిచ్చి అరుపులు అరుస్తారు, తాకడానికి ప్రయత్నిస్తారు లేదా ఎవరూ లేనప్పుడు ఇంటికి వస్తారు," అని రహీబాయి నాతో చెప్పింది. అలా జరిగితే దాని పర్యవసానాల గురించి ఆమె నిరంతరం భయంతో జీవించింది.
కానీ రహీబాయి తన చింతను తనలో ఉంచుకోలేదు. దాదాపు 940 మంది వాడి జనాభాలో, ఆరుగురికి మేధోపరమైన వైకల్యం ఉంది - మలన్‌తో సహా ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు. రహీబాయి సభ్యురాలుగా ఉన్న స్వయం సహాయక బృందంలోని మహిళలు కలిసి 2019 నవంబర్‌లో గ్రామంలోని అంగన్‌వాడీ గదిలో ఈ ప్రత్యేక స్నేహితుల కోసం దేవరాయ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ వారానికి రెండుసార్లు వాలంటీర్లు మయూరి గైక్వాడ్, సంగీత కలేకర్, వాడి నుండి షాలన్ కాంబ్లే, సాధనా గ్రామం తరఫున వచ్చి, వినోద కార్యకలాపాలు, శిక్షణ తరగతులు(స్వయం సంరక్షణ తో పాటు) నిర్వహిస్తారు. “ఈ ‘పిచ్చి’ పిల్లలకు నేర్పించడం వలన ఏమి ఉపయోగం లేదని కొందరు గ్రామస్తులు మమ్మల్ని చూసి నవ్వుతారు. కానీ మేం, నేర్పిస్తాము,” అని మయూరి చెప్పింది.
" మీ కేలీ [నేను దీన్ని తయారు చేసాను]," అని మలన్ చెప్పింది, ఈ కార్యకలాపాలలో భాగంగా ఆమె చేసిన ఆకుపచ్చ-తెలుపు పూసల హారాన్ని నాకు గర్వంగా చూపించింది.
వేరే రోజులలో, ఇంటికి వద్ద, తన ఉదయం ఇంటి పనులలో భాగంగా, మలాన్ కుటుంబ సభ్యుల కోసం కుళాయి నుండి నీటిని పట్టి, వాటిని డ్రమ్‌లో నింపి, స్నానం చేస్తుంది. ఆ తరవాత, ఎప్పటిలాగే, ఆమె మట్టి పొయ్యిపై కొంచెం టీ ఒలకబోస్తుంది, ఆ తరవాత, తల్లి నుండి తిట్లు తింటుంది.
అప్పుడు, ఆమె రంగురంగుల జాకెట్టు, మడమల దాకా ఉన్న తనకు ఇష్టమైన స్కర్ట్‌లో, తనను ప్రేమించే కుటుంబంతో ఉన్న మలన్ రోజును వెళ్ళమారుస్తుంది.
రచయిత తథాపి ట్రస్ట్‌లో ట్రస్టీగా ఉన్నారు, అక్కడ ఆమె 18 సంవత్సరాలు పనిచేశారు.
సాధనా విలేజ్ లోని మేధా తెంగ్షే, విజయ కులకర్ణి గార్లకు, పూణేలోని తాథాపి ట్రస్ట్‌లో అచ్యుత్ బోర్గావ్కర్‌కు ధన్యవాదాలు.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? ఐయితే zahra@ruralindiaonline.orgకి ఈమెయిల్ చేసి అందులో namita@ruralindiaonline.orgకి కాపీ చేయండి.
అనువాదం: అపర్ణ తోట