ఐదు నెలల గర్భిణి అయిన పల్లవి గావిట్ మూడు గంటలకు పైగా ఖాట్ (చార్‌పాయ్) మీద నొప్పితో మెలికలు తిరుగుతోంది. పల్లవి గర్భాశయం ఆమె యోని నుండి జారిపోయినప్పుడు ఆమె వదిన, 45 ఏళ్ళ సప్నా గారెల్, ఆమెతో ఉంది. ఐదు నెలల మగ పిండం పల్లవి గర్భాశయం లోపల నిర్జీవంగా ఉంది. రక్తంతో పాటు, శరీరం నుండి స్రావాలు నేలపై కారుతుండగా, భరించలేని నొప్పితో, పల్లవి స్పృహతప్పి పడిపోయింది.
అది జూలై 25, 2019 తెల్లవారుజామున 3 గంటలు. సత్పుడా కొండల్లోని 55 భిల్ కుటుంబాల కుగ్రామమైన హెంగ్లపానిలో పల్లవి పూరిగుడిసె పై వర్షం కురుస్తోంది. వాయువ్య మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని ఈ దుర్గమ ప్రాంతంలో, పక్కా రోడ్లు లేవు, మొబైల్ నెట్‌వర్క్‌లు లేవు. “అత్యవసర పరిస్థితులు మనకు చెప్పి రావు. అవి ఎప్పుడైనా సంభవించవచ్చు," అని పల్లవి భర్త గిరీష్ (ఈ కథనంలో అన్ని పేర్లు మార్చబడ్డాయి) అన్నాడు. "నెట్‌వర్క్ కవరేజీ లేకుండా అంబులెన్స్ లేదా డాక్టర్‌ని ఎలా పిలవగలము?"
"నేను భయపడ్డాను," 30 ఏళ్ల గిరీష్ చెబుతున్నాడు. "ఆమె చనిపోకూడదనుకున్నాను." తెల్లవారుజామున 4 గంటలకు, చీకటిలో, వర్షం కురుస్తుండగా, గిరీష్, అతని పొరుగింటి మనిషి, ఇద్దరూ పల్లవిని వెదురు, దుప్పటి కలిపి చేసిన తాత్కాలిక స్ట్రెచర్‌పై 105 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ధడ్‌గావ్ వైపు వెళ్ళడానికి, బురదగా ఉన్న దారిలో సత్పుడా కొండలపైకి తీసుకెళ్లారు.
హెంగ్లపాని కుగ్రామం అక్రాని తాలూకా లోని తోరన్మల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. తోరన్మల్ గ్రామీణ ఆసుపత్రి దగ్గరగానే ఉంది కానీ ఆ రాత్రి అక్కడికి వెళ్లే రహదారి సురక్షితంగా లేదు. చెప్పులు లేకుండా (బురదలో చెప్పులు వేసుకుని వేగంగా నడవడం కష్టం), గిరీష్, అతని పొరుగింటి మనిషి ఆ బురద మార్గాలలో జారకుండా నడవడానికి చాలా కష్టపడ్డారు. ప్లాస్టిక్ షీట్ కప్పుకున్న పల్లవి నొప్పితో మూలుగుతూ ఉంది.
తోరన్మల్ ఘాట్ రోడ్డుకు చేరుకునే వరకు, అంటే దాదాపు మూడు గంటలపాటు వారు పైకి ఎక్కారు. "ఇది దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉంది" అని గిరీష్ చెప్పాడు. అక్కడి నుంచి రూ. 1,000 కు జీప్‌ని అద్దెకు తీసుకుని ధడ్‌గావ్ గ్రామం వైపు వెళ్లారు. రోడ్డు మీద ఐదు గంటలు ప్రయాణించాక తర్వాత, పల్లవిని ధడ్‌గావ్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చేర్చారు - అక్కడికి గ్రామీణ ఆసుపత్రి మరో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. “నేను చూసిన మొట్టమొదటి దవాఖానా [ఆరోగ్య కేంద్రం]కి ఆమెను తీసుకెళ్లాను. ఇది చాలా ఖరీదైనది, కానీ కనీసం వారు నా పల్లవిని కాపాడారు, ” అని అతను చెప్పాడు. డాక్టరు రూ. 3,000 ఫీజు వేసి, మరుసటి రోజు ఆమెను డిశ్చార్జ్ చేశారు. "భారీ రక్తస్రావం కారణంగా ఆమె చనిపోయి ఉండేదని ఆయన చెప్పారు," అని గిరీష్ గుర్తుచేసుకున్నాడు.
ఇది జరిగి నెలలు గడిచాక కూడా, ఇప్పటికీ పల్లవి ప్రతిరోజూ నొప్పిని, అసౌకర్యాన్ని అనుభవిస్తుంది. "నేను బరువైన పాత్రను ఎత్తినప్పుడు లేదా క్రిందికి వంగినప్పుడు నా ఖాత్ [గర్భాశయం] నా యోని నుండి బయటకు వస్తూ ఉంటుంది" అని ఆమె చెప్పింది. పల్లవికి 23 ఏళ్లు, ఆమెకు ఖుషి అనే ఏడాది వయసున్న కూతురు ఉంది. హెంగ్లాపాని కుగ్రామానికి చెందిన గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) సహాయంతో ఆమె సురక్షితంగా ఇంట్లోనే జన్మించింది. కానీ ఆమె చికిత్స ఇంకా చేయని జారిపోయే గర్భాశయం ఉన్న పల్లవికి పాపను చూసుకోవడం చాలా కష్టమవుతోంది.
"నేను ఖుషీకి స్నానం చేయించాలి, తినిపించాలి, రోజులో చాలాసార్లు ఎత్తుకోవాలి, ఆమెతో ఆడుకోవాలి" అని పల్లవి నాతో చెప్పింది. "బాగా పనిచేసినప్పుడు, కొన్నిసార్లు నా కడుపులో మంట, ఛాతీలో నొప్పి వస్తాయి. కూర్చోవడం, లేవడం కూడా కష్టమే."
ప్రతిరోజూ గిరీష్ వారి రెండు ఆవులను మేపడానికి తీసుకువెళుతాడు, పల్లవి కూడా కొండ దిగువన ఉన్న ప్రవాహం నుండి నీరు తీసుకురావాలి. "ఇది రెండు కిలోమీటర్ల కింద ఉంది. అక్కడ మాత్రమే మాకు నీరు దొరుకుంది,” అని ఆమె చెప్పింది. ఏప్రిల్-మే నాటికి అది కూడా ఎండిపోతుంది, పల్లవి, ఇంకా ఆ కుగ్రామంలోని ఇతర మహిళలు నీటి వెతుకులాటలో మరింత కిందికి దిగవలసి వస్తుంది.
ఆమె, గిరీష్ కలిసి వానాకాలంలో రెండెకరాల్లో మొక్కజొన్న, జొన్న సాగు చేస్తారు. ఈ ఏటవాలు భూమిలో దిగుబడి తక్కువగా ఉంటుంది, అని గిరీష్ చెప్పారు. “మాకు నాలుగు లేదా ఐదు క్వింటాళ్లు [400-500 కిలోలు] లభిస్తాయి, అందులో నేను 1-2 క్వింటాళ్లను తోరన్మాల్‌లోని కిరాణా దుకాణాలకు రూ.15 కి కిలో చొప్పున అమ్ముతాను." వార్షిక పంట పూర్తయిపోయాక, గిరీష్ చెరకు పొలాల్లో పని కోసం పొరుగున ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని నవ్‌సారి జిల్లాకు వలస వెళ్తాడు. అక్కడ అతనికి రోజుకు రూ. 250 కూలి వస్తుంది. ఇలా సంవత్సరానికి దాదాపు 150 రోజులు పని చేస్తాడు.
ఇంటి పనులు, పొలం పనులతో అలిసిపోయి పల్లవి, 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాపి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) వెళ్లాలంటే కొండను ఎక్కాలి. ఆమెకు అంత దూరం కొండను ఎక్కే శక్తి లేదు, ఇది మాత్రమే ఆమెకు అత్యంత సమీపంలో ఉన్న PHC. ఆమెకు తరచుగా జ్వరం వస్తుంది, తల తిరగుతుంది, కొన్నిసార్లు స్పృహతప్పి పడిపోయింది కూడా. ఆశా వర్కర్, ఆమెకు కొన్ని మందులు ఇస్తుందని పల్లవి చెప్పింది. "నేను డాక్టర్ వద్దకు వెళ్లాలనుకుంటున్నాను, కానీ ఎలా? నేను చాలా బలహీనంగా ఉన్నాను," అని ఆమె చెబుతుంది. కొండల గుండా అంత దూరం నడవడం ఆమెకు దాదాపు అసాధ్యం.
తోరన్మల్ గ్రామ పంచాయితీ జనాభా 20,000 (గ్రామ పంచాయితీ సభ్యుడు అంచనా ప్రకారం). ఇది 14 గ్రామాలు, 60 కుగ్రామాలలో విస్తరించి ఉంది. వీరికి - జాపిలోని ఒక పిహెచ్‌సి, ఆరు ఉప-కేంద్రాలు, తోరన్మల్ జూన్ (పాత) గ్రామంలోని ఒక 30 పడకల గ్రామీణ ఆసుపత్రి, వీటి ద్వారా ఆరోగ్య సేవలు అందుతాయి. తోరణమాల్ జూన్ ఆసుపత్రి ద్వారా కండోమ్‌లు, ఓరల్ పిల్స్ మాత్రలు, స్టెరిలైజేషన్ ప్రక్రియలు, గర్భాశయంలో ఐయుడిలు పెట్టడం వంటి గర్భనిరోధక సంరక్షణను అందిస్తారు, దీనితో పాటే గర్భిణీ స్త్రీలకు సేవలు, ప్రసవానంతర సేవలు కూడా ఉంటాయి. కానీ ఈ కుగ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నందున, చాలా మంది మహిళలు ఇళ్లలోనే ప్రసవిస్తారు.
"తొరన్మల్‌లో ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇక్కడి గిరిజనులు కొండల పైన నివసిస్తున్నారు. గర్భధారణ సమయంలో కూడా నీటి కోసం రోజుకు చాలాసార్లు క్రిందికి పైకి దిగి ఎక్కుతున్నారు. దీనివల్ల చాలా సమస్యలు రావడమే కాక, నెలలు నిండకుండానే ప్రసవం జరుగుతుంది,’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని జాపీ పీహెచ్‌సీ డాక్టరు చెప్పారు. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు, ఒక వార్డు అసిస్టెంట్‌తో కూడిన ఈ పీహెచ్‌సీని ఇటీవలే 2016లో ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు నలుగురైదుగురు రోగులు మాత్రమే వస్తుంటారు. "పరిస్థితి నిజంగా తీవ్రమైతేనో లేదా భగత్ (నాటువైద్యుడు) చికిత్స పనిచేయనప్పుడో ఇక్కడికి వస్తారు.” అన్నారు.
ఏప్రిల్ 2019 నుండి మార్చి 2020 మధ్య, డాక్టర్ ఐదు గర్భాశయ ప్రోలాప్స్(జారిపోవడం) కేసులను చూశారు. “వారందరికీ 100 శాతం శస్త్రచికిత్స అవసరం. దీంతో వారిని నందుర్‌బార్ సివిల్ ఆస్పత్రికి తరలించాం. అటువంటి దీర్ఘకాలిక ప్రసూతి కేసులకు చికిత్స చేసే సౌకర్యం ఇక్కడ లేదు, ”అని ఆయన చెప్పారు.
పెల్విక్ ఫ్లోర్ కండరాలు లిగమెంట్లు సాగిపోవడం లేదా బలహీనపడటం వలన అవి గర్భాశయానికి సరైన పట్టుని ఇవ్వలేనప్పుడు గర్భాశయ భ్రంశం సంభవిస్తుంది. "గర్భాశయం అనేది వివిధ కండరాలు, కణజాలం, స్నాయువుల(లిగ్మెంట్ల)తో పెల్విస్ లోపల ఉంచబడిన కండర నిర్మాణం," అని డాక్టర్ కోమల్ చవాన్, ముంబైకి చెందిన ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ వివరించారు. “గర్భధారణ, ఎక్కువ మందిని ప్రసవించడం, ప్రసవానికి ఎక్కువ సమయం పట్టడం లేదా ప్రసవాన్ని తప్పుగా నిర్వహించడం వల్ల, కొంతమంది స్త్రీలలో ఈ కండరాలు బలహీనపడి, గర్భాశయం జారుతుంది.” తీవ్రమైన పరిస్థితులలో, బలహీనమైన పెల్విక్ ఫ్లోర్ కణజాలాలను సరిచేయడానికి పునర్నిర్మాణ శస్త్రచికిత్స అవసరమవుతుంది లేదా స్త్రీ వయస్సు లేదా సమస్య యొక్క తీవ్రతను బట్టి గర్భాశయ తొలగింపు (స్త్రీ పునరుత్పత్తి అవయవాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం) అవసరం కావచ్చు.
2015లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురించిన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని గ్రామీణ మహిళల్లో దీర్ఘకాలిక ప్రసూతి వ్యాధుల (Chronic Obstetric Morbidities - COM)పై 2006-07 అధ్యయనంలో, 136 మంది మహిళల్లో COMను నివేదించగా, వీరిలో జననేంద్రియ భ్రంశం అత్యంత ప్రబలంగా ఉంది (62 శాతం). పెరుగుతున్న వయస్సు, ఊబకాయంతో పాటు, " సాంప్రదాయిక బర్త్ అటెండెంట్‌లు(మంత్రసానులు లేదా దాయి లు) నిర్వహించే ప్రసవాల వలన ప్రోలాప్స్ ఎక్కువగా సంభవిస్తుందని తెలుస్తుంది," అని నివేదిక పేర్కొంది.
నందుర్బార్ సివిల్ హాస్పిటల్లో, పల్లవి తన జారిన గర్భాశయానికి ఉచిత శస్త్రచికిత్సను పొందగలదు. ఈ సివిల్ ఆసుపత్రి, ఆమె కుగ్రామమైన హెంగ్లాపాని నుండి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడం అంటే మూడు గంటలు కొండ పైకి ఎక్కాలి, ఆ తరవాత నాలుగు గంటల బస్సులో ప్రయాణించాలి. "కూర్చున్నప్పుడు నేను దేని మీదో కూర్చున్నట్లు అనిపిస్తుంది. పైగా చాలా నొప్పి వస్తుంది. నేను ఎక్కువసేపు ఒకే చోట కూర్చోలేను." అని పల్లవి చెప్పింది. ఈ మార్గంలో తోరన్మల్ నుండి రాష్ట్ర రవాణా బస్సు మధ్యాహ్నం 1 గంటకు ఒకే ట్రిప్ వేస్తుంది. "డాక్టర్లు ఇక్కడికి రాలేరా?" అని పల్లవి అడుగుతుంది.
రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో, మారుమూల ప్రాంతాల్లోని ఇంటి వద్దే ఆరోగ్య సంరక్షణను అందించే మొబైల్ మెడికల్ యూనిట్లకు కూడా తోరన్మల్‌లోని రోగులకు ప్రవేశం లేదని డాక్టర్ పేర్కొన్నారు. అక్రాని బ్లాక్‌లో, 31 గ్రామాలు, అనేక ఇతర కుగ్రామాలకు రోడ్డు మార్గం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం నవసంజీవని యోజన ద్వారా ఒక వైద్య అధికారి, ఒక శిక్షణ పొందిన నర్సుతో వైద్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్లను నడుపుతుంది. మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి ప్రకారం, అక్రానీ తాలూకాలో అలాంటి రెండు యూనిట్లు పనిచేస్తున్నాయని వారి 2018-19 వార్షిక గిరిజన కాంపోనెంట్ పథకాల నివేదికలో ఉంది. కాని అవి పల్లవి వంటి కుగ్రామాలకు చేరుకోలేవు.
జాపి పీహెచ్‌సీలోనే, “కరెంటు లేదు, నీళ్లు లేవు, సిబ్బందికి వసతి లేదు’’ అని అక్కడి డాక్టరు చెబుతున్నారు.‘‘ఈ విషయమై ఆరోగ్యశాఖకు పలుమార్లు లేఖలు రాసినా ఎలాంటి మార్పు లేదు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజూ నందుర్‌బార్ నుండి జాపికి వెళ్లడం అసాధ్యం. "కాబట్టి మేము సోమవారం నుండి శుక్రవారం వరకు ఇక్కడ పని చేస్తాము, రాత్రి ఆశా కార్యకర్త ఇంట్లో ఉంటాము. మేము వారాంతంలో నందుర్‌బార్‌లోని మా ఇళ్లకు తిరిగి వెళతాము," అని డాక్టర్ చెప్పారు.
ఈ పరిస్థితి వలన, ఆ ప్రాంతంలోని ఆశా వర్కర్ల పాత్ర మరింత కీలకమైనదైంది. కానీ వారు కూడా మందులు, కిట్‌ల పరిమిత నిల్వలతో ఇబ్బందులు పడుతున్నారు. " గర్భిణీ స్త్రీలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు లేదా మాస్క్, గ్లోవ్స్, కత్తెరతో డిస్పోజబుల్ డెలివరీ కిట్‌లను క్రమం తప్పకుండా సరఫరా చేయడం సాధ్యపడడం లేదు," అని 10 మంది ఆశాల పనిని పర్యవేక్షిస్తున్న హెంగ్లాపాణికి చెందిన ఆశా ఫెసిలిటేటర్ విద్యా నాయక్ (పేరు మార్చబడింది) చెప్పారు. ఈమె 10 కుగ్రామాలలో పనిచేస్తున్న 10 మంది ఆశాల పనిని పర్యవేక్షిస్తారు.
కొంతమంది ఆశా వర్కర్లు డెలివరీలు నిర్వహించడానికి శిక్షణ పొందినా, క్లిష్టమైన ప్రసవాలు చేయలేరు. సురక్షితంకాని ఇంటి వద్ద జరిగే ప్రసవాల ఫలితంగా ప్రతి నెలా రెండు నుండి మూడు శిశు మరణాలు, ఒకటి లేదా రెండు ప్రసూతి మరణాలు నమోదవుతాయని విద్య చెప్పింది. "మాకు ఇంకేమీ అవసరం లేదు - సురక్షితమైన డెలివరీల కోసం మేము ప్రయాణించడానికి మాకు సురక్షితమైన రహదారిని అందించండి" అని ఆమె చెప్పింది.
"పిల్లల ఎదుగుదలను అర్థం చేసుకోవడానికి యాంటెనటల్ కేర్‌తో పాటు, మారుమూల ప్రాంతాలలో అర్హత కలిగిన గైనకాలజిస్ట్‌లు పనిచేయడం చాలా అవసరం, ఇక్కడ ఉండే మహిళల రోజువారీ విధులు చాలా కష్టంగా ఉంటాయి" అని డాక్టర్ చవాన్ అన్నారు.
ఏది ఏమైనప్పటికీ, భారత ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య గణాంకాల ప్రకారం, 2018-19లో, మహారాష్ట్రలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో ప్రతి కేంద్రంలో నలుగురు, సర్జన్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్ మరియు పీడియాట్రిషియన్‌తో సహా 1,456 మంది నిపుణులు అవసరం. మార్చి 31, 2019 నాటికి కేవలం 485 మంది మాత్రమే ఆ స్థానంలో ఉన్నారు, దీనివలన 971 మంది లేదా 67 శాతం కొరత ఉంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ( NFHS-4 , 2015-16) ప్రకారం, గ్రామీణ నందుర్‌బార్‌లో 26.5 శాతం మంది తల్లులు మాత్రమే పూర్తి ప్రసవానంతర సంరక్షణను పొందుతున్నారని, 52.5 శాతం మంది మాత్రమే సంస్థాగత ప్రసవాలు పొందారని, ఇంట్లో జరిగిన ప్రసవాలలో 10.4 శాతం ప్రసవాలకు మాత్రమే నిపుణులైన ఆరోగ్య సిబ్బంది సహాయం చేశారని పేర్కొంది.
నందుర్బార్ జిల్లా, అధిక ఆదివాసీ జనాభాతో - వీరిలో ప్రధానంగా భిల్, పావ్రా వారాగాల వారున్నారు - మహారాష్ట్ర మానవ అభివృద్ధి సూచిక 2012లో అత్యల్ప ర్యాంక్‌లో ఉంది, పోషకాహార లోపం, మాతా, శిశువుల ఆరోగ్యం సూచికలు చాలా తక్కువగా ఉన్నాయి.
పల్లవి ఇంటికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో తోరన్మల్ అడవిలోని మరో కొండపైన లేగపాని కుగ్రామం ఉంది. అక్కడ, తన చీకటి పూరిగుడిసెలో, సారిక వాసవే (ఆమె అసలు పేరు కాదు) నీటిలో పలాష్ ( బుటియా మోనోస్పెర్మా ) పువ్వులు ఉడకబెట్టింది. “నా కూతురికి జ్వరం. దీంతో ఆమెకు స్నానం చేయిస్తాను. కాస్త తేలిక పడుతుంది,” అని భిల్ వర్గానికి చెందిన 30 ఏళ్ల సారిక చెప్పింది. ఆమె ఆరు నెలల గర్భవతి, అందువలన రాతి చుల్హా (పొయ్యి) ముందు ఎక్కువసేపు కూర్చోవడం కష్టం. “నా కళ్ళు మండుతున్నాయి. ఇక్కడ నొప్పి పుడుతుంది(యోని భాగం చూపిస్తూ), నా వెన్ను కూడా నొప్పిగా ఉంది.” అన్నది.
అలసిపోయి, బలహీనంగా ఉన్న సారిక గర్భాశయం కూడా జారింది. కానీ ఆమె రోజువారీ పనులను కొనసాగించవలసి వస్తుంది. ఆమె మూత్ర విసర్జన చేసినప్పుడు లేదా మలవిసర్జన సమయంలో కొంచెం గట్టిగా నెట్టినప్పుడు, ఆమె గర్భాశయం క్రిందికి దిగి, ఆమె యోని నుండి పొడుచుకు వస్తుంది. “నేను దానిని నా చీర యొక్క మూలతో వెనక్కి నెట్టేస్తాను; అది బాధిస్తుంది,” అని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తన ముఖం మీద చెమటను తుడుచుకుంది. చుల్హా నుండి పొగలు రావడంతో ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది.
ఆమె మూడేళ్లుగా తన గర్భాశయం జారిపోవడంతో బాధపడుతోంది. 2015లో, ఆమె ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమెకు అర్ధరాత్రి 1 గంటలకు అకస్మాత్తుగా ప్రసూతి నొప్పులు వచ్చాయి, ఆమె అత్తగారు ఆమెకు కానుపు చేశారు. ఆరు గంటల తర్వాత, సారిక గర్భాశయం ఆమె యోని నుండి జారిపోయింది. "ఎవరో నాలో కొంత భాగాన్ని బయటకు లాగినట్లు నాకు అనిపించింది" అని ఆమె గుర్తుచేసుకుంది.
"చికిత్స చేయని గర్భాశయ భ్రంశం యూరినరీ ఇన్ఫెక్షన్, రాపిడి వలన రక్తస్రావం అవడం, ఇన్ఫెక్షన్లు, నొప్పి వంటి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది - ఇవన్నీ రోజువారీ కదలికలలో అసౌకర్యానికి దారితీస్తాయి" అని డాక్టర్ చవాన్ చెప్పారు. వయస్సు పెరిగే కొద్దీ పరిస్థితి మరింత దిగజారుతుంది, అని ఆమె చెప్పారు.
జారిపోయిన గర్భాశయం ఏ స్థాయిలో ఉన్నా స్త్రీలను అధిక బరువులు ఎత్తకుండా ఉండవలసిందని, మలబద్ధకాన్ని నివారించడానికి పుష్కలంగా నీరు తాగాలని, ఫైబర్ ఎక్కువగా ఉన్న పోషకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. కానీ సారిక రోజుకు ఒక పూట భోజనానికి, ఒక కుండ నీరు పొందడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. గర్భిణి అయినా, కాకపోయినా, నీటిని సేకరించేందుకు ప్రతిరోజూ ఎనిమిది కిలోమీటర్ల దిగువన నడిచి చేతిపంపు వద్దకు వెళ్లాలి. నిటారుగా ఉన్నఆ కొండ పైకి తిరిగి వెళ్లడం మరింత కష్టం. “నా తొడల మధ్య జారిన ఖాత్ రాపిడి వలన బాగా మంట పుడుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది,” అని ఆమె నాకు చెప్పింది.
శారీరక బాధలతో పాటు, ఈ పరిస్థితికి సామాజిక, ఆర్థిక పరిణామాలు ఉన్నాయి. జారిపోయిన గర్భాశయం ఆమె వైవాహిక సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. సారికకు జరిగినట్లుగా, ఆమె భర్త ఆమెను వదిలేయడం లేదా తిరస్కరించడం జరుగుతుంది.
సారిక భర్త సంజయ్ (పేరు మార్చబడింది) ఆమె గర్భాశయం జారిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సంజయ్ ధడ్‌గావ్‌లోని హోటళ్లలో నెలకు నాలుగైదు రోజుల పని చేసి, పనిచేసిన రోజుకు రూ.300 తీసుకుంటాడు . "అతను తన రెండవ భార్య, కొడుకు కోసం తన ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు," అని సారిక చెప్పింది. అతను అసలు పెద్దగా పొలాల్లో పని చేయడు. కాబట్టి సారిక స్వయంగా 2019 వర్షాకాలంలో వారి రెండు ఎకరాల పొలంలో ఒక క్వింటాల్ మొక్కజొన్నను సాగు చేసింది. "నా భర్త 50 కిలోగ్రాములు తనకు, అతని రెండవ భార్య, బిడ్డ కోసం తీసుకున్నాడు. మిగిలినవి నేను భక్రి కోసం దంచాను.”
ఎటువంటి ఆదాయ వనరులు లేకపోవడంతో, సారిక ఆమెకు బియ్యం, పప్పు కోసం తరచుగా ఆశా కార్యకర్త లేదా కొంతమంది గ్రామస్తులపై ఆధారపడుతుంది. కొన్నిసార్లు, ఆమె డబ్బు అప్పుగా తీసుకుంటుంది. "రేషన్‌లు, విత్తనాలు కొనడానికి జూన్ [2019]లో ఒక గ్రామస్థుడు నాకు అప్పుగా ఇచ్చిన 800 రూపాయలను నేను ఇంకా తిరిగి ఇవ్వాలి" అని ఆమె చెప్పింది.
కొన్నిసార్లు ఆమె భర్త ఆమెను కొడతాడు, సెక్స్ చేయమని బలవంతం చేస్తాడు. “అతనికి నా పరిస్థితి [గర్భాశయం ప్రోలాప్స్] ఇష్టం లేదు. అందుకే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కాని అతను తాగినప్పుడు వస్తాడు. నేను నొప్పితో ఏడుస్తాను [సంభోగం సమయంలో], కానీ అతను నన్ను కొడతాడు, ”ఆమె చెప్పింది.
నేను ఆమెను కలిసే రోజు, చుల్హా పక్కన ఒక కుండలో వండిన అన్నం ఉంది . తనకూ, తన ఐదేళ్ల కూతురు కరుణకూ రోజు భోజనం ఇదే. "ఇంట్లో కేవలం ఒక కిలో బియ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి," అని ఆమె చెప్పింది. ఆమె బిపిఎల్ రేషన్ కార్డులో మూడు కిలోల బియ్యం, ఎనిమిది కిలోల గోధుమలు మిగిలాయి. ఆమె మూడు మేకలు మాత్రమే పోషకాహారానికి అదనపు వనరు. "నాకు ప్రతిరోజూ ఒక మేక నుండి ఒక గ్లాసు పాలు వస్తాయి ," ఆమె చెప్పింది. ఆ పాలను కూడా ఆమె తన కుమార్తె, ఆమె సవతి కొడుకుకు మధ్య పంచుతుంది.
తోరన్మల్‌లోని గ్రామీణ ఆసుపత్రి సారిక గుడిసె నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఉప ఆరోగ్య కేంద్రం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎక్కడానికి చాలా నిటారుగా ఉంటుంది. షేర్డ్ జీప్ సర్వీస్ చాలా అరుదు, ఆమె దూరం నడవాల్సి వస్తుంది. “నేను ఎక్కువగా నడవలేను. నాకు చాలా త్వరగా ఆయాసం వస్తుంది,” ఆమె చెప్పింది. ఆమె ప్రసవానికి ముందు ఉప కేంద్రానికి వెళ్ళినప్పుడు, ఆమెకు సికిల్ సెల్ వ్యాధి ఉందని బయటపడింది, ఇది హిమోగ్లోబిన్‌ను ప్రభావితం చేసే, రక్తహీనతకు కారణమయ్యే వారసత్వ రక్త రుగ్మత.
2016లో నిర్మించిన తోరన్మల్ గ్రామీణ ఆసుపత్రిలో 30 పడకలు ఉన్నాయి. రోజూ ఔట్ పేషెంట్ విభాగంలో 30 నుంచి 50 మంది రోగులు వస్తున్నారని వైద్యాధికారి డాక్టర్ సుహాస్ పాటిల్ తెలిపారు. వారు జ్వరం, జలుబు లేదా శారీరక గాయం వంటి చిన్న అనారోగ్యాలతో వస్తారు. చుట్టుపక్కల 25 గ్రామాల నుంచి ప్రతినెలా ఒకరిద్దరు మాత్రమే ప్రసవాల కోసం వస్తుంటారు. ఆసుపత్రిలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ఏడుగురు నర్సులు, ఒక లాబొరేటరీ (కానీ టెక్నీషియన్ లేరు), ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నారు. ప్రసూతి వైద్యులకు, స్త్రీ జననేంద్రియ నిపుణులకు, సారిక వంటి తీవ్రమైన కేసులకు అవసరపడే ఏ విధమైన స్పెషలిస్టులకు అక్కడ స్థానం లేదు.
“మాకు గర్భాశయం ప్రోలాప్స్ అయ్యే కేసులు రావు. వచ్చిన కేసులలో చాలావరకు పెల్విక్ బ్లీడింగ్, సికిల్ సెల్ అనీమియా ఉంటాయి. మాకు అలాంటి కేసులు వచ్చినా, వారికి చికిత్స చేసే సౌకర్యం కాని, నైపుణ్యం కాని లేవు,” అని 2016 నుండి ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పాటిల్ చెప్పారు, వీరు ఆసుపత్రి సిబ్బంది క్వార్టర్స్‌లో ఉంటున్నారు.
ఒకవేళ వారికి సదుపాయం, నైపుణ్యం ఉన్నప్పటికీ, సారిక తన గర్భాశయం జారిపోయిన విషయం డాక్టరుకి చెప్పకపోవచ్చు. “అతను బాబ్యా [పురుష] డాక్టర్. నా ఖాత్ పడిపోతోందని నేను అతనికి ఎలా చెప్పగలను?” అని ఆమె అడుగుతుంది.
ఛాయాచిత్రాలు: జిషాన్ ఎ. లతీఫ్ ముంబైలోని స్వతంత్ర ఫోటోగ్రాఫర్, చిత్రనిర్మాత. అతని ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేకరణలలో, ప్రదర్శనలలో, ప్రచురణలలో ప్రదర్శించబడ్డాయి: https://zishaanalatif.com/
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే zahra@ruralindiaonline.orgకి ఈమెయిల్ చేసి అందులో namita@ruralindiaonline.orgకి కాపీ చేయండి.
అనువాదం: అపర్ణ తోట