“మీరు ఇక్కడకి మరి త్వరగా వచ్చేసారు. ఆదివారాల్లో సాయంత్రం 4 దాటితే గాని ఎవరూ రారు. నేను కూడా హార్మోనియం నేర్చుకోవడానికని వచ్చాను.” అన్నది బ్యూటీ.
‘ఇక్కడ’ అంటే చతుర్భుజ్ స్థాన్- బీహార్ లో ముజాఫర్ బ్లాక్ లో ముసాహ్రి బ్లాక్ లోని ఒక పాత బ్రోతల్. ‘ఈ టైం’ అంటే 10 గంటల తరవాత అని- అప్పుడే నేను, ఆమె కలిసాము. ‘వారు’ అంటే ఆమె కలవడానికి వచ్చే క్లయింట్లు. ‘బ్యూటీ’ అనేది వృత్తిరిత్యా ఆమె ఎంచుకున్న పేరు- 19 ఏళ్ళ ఈ సెక్సవర్కర్,అప్పటికే ఐదేళ్లుగా ఈ పని లో ఉంది. పైగా ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భం తో ఉంది.
అయినా ఆమె పని మానలేదు. ఆమె హార్మోనియం ఎందుకు నేర్చుకుంటుందంటే, “అమ్మి(ఆమె తల్లి) సంగీతం నా బిడ్డ పైన మంచి ప్రభావం చూపిస్తుంది, అని చెప్పింది.” అంది.
ఆమె మాట్లాడుతూ ఉండగానే హార్మోనియం పైన ఆమె వేళ్ళు కదులుతున్నాయి. “ఇది నా రెండో కాన్పు. నాకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు.” అంది.
మేము మాట్లాడుకుంటున్న గది, ఆమె పని స్థలం కూడా. ఆ గదిలో సగంవరకు ఒక పరుపు పరిచి ఉంది. ఆ పరుపు వెనుక గోడకు అడ్డంగా ఆరు బై పది వైశాల్యం గల ఒక అద్దం అమర్చి ఉంది. ఆ గది బహుశా 15 బై 25 అడుగులు ఉండొచ్చు. ముజ్రా ని చూస్తున్నవారు ఆరాముగా వెనక్కి చేరగిలపడి చూసేందుకు వీలుగా ఆ పరుపు చుట్టూ దిండ్లు, కుషన్లు అలంకరించబడి ఉన్నాయి. ముజ్రా ఒక నాట్య ప్రక్రియ, బ్రిటిష్ వారు రాక ముందు నుంచి ఉంది. చతుర్భుజ్ స్థాన్ మొఘలుల కాలం ముందు నుంచి ఉందని చెబుతారు. బ్రోతల్ లో ఉన్న ఆడపిల్లలు, మహిళలు ముజ్రాని కచ్చితంగా నేర్చుకుని, ప్రదర్శించగలిగి ఉండాలి. బ్యూటీకి కూడా ముజ్రా చేయడం వచ్చు, ప్రదర్శనలు కూడా ఇస్తుంది.
ఇక్కడికి రావడానికి ముజాఫర్పూర్ మెయిన్ మార్కెట్ ద్వారా రావడమే మార్గం. షాప్ కీపర్లు, రిక్షావాళ్లు దారి కనుక్కోవడానికి సాయం చేస్తారు. అందరికి బ్రోతల్ ఎక్కడుందో తెలుసు. చతుర్భుజ్ స్థాన్ కాంప్లెక్స్ లో ఒకేలాంటి 2-3 అంతస్తులున్నఇళ్లు, వీధికి రెండువైపులా ఉంటాయి. రకరకాల వయస్సున్న ఆడవాళ్లు ఇళ్ల బయట నించుని, కూర్చుని క్లయింట్ల కోసం ఎదురుచూస్తుంటారు. చమ్కీలు ఉన్న బిగుతు బట్టలు వేసుకుని, కొట్టొచ్చే మేకప్ తో, తెచ్చిపెట్టుకున్న ఆత్మవిశ్వాసంతో, వచ్చే పోయే వారిని తీక్షణంగా చూస్తున్నారు.
“ఈ రోజు కనిపించే ఆడవాళ్లు మామూలుగా బ్రోతల్ లో ఉండే ఆడవాళ్ళలో 5 శాతం మందే”, అని చెప్పింది బ్యూటీ. “చూడండి, అందరిలానే మేము కూడా వారం లో ఒక రోజు సెలవు తీసుకుంటాం. కానీ మాకు సగం రోజే. మేము సాయంత్రం 4-5 గంటలకి ఇక్కడికి వచ్చి రాత్రి 9 గంటల వరకు ఉంటాము. మిగిలిన రోజుల్లో పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు ఉంటాము.”
*****
అధికారిక సంఖ్యలు లేవు కానీ, ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న చతుర్భుజ్ స్థాన్ లో మొత్తం సెక్స్ వర్కర్లు అంతా కలిపి 2500 మంది కన్నా ఎక్కువే ఉంటారు. బ్యూటీ, ఆమె స్నేహితులు మేమున్న వీధిలోనే 200 మంది వరకు ఈ వ్యాపారం లో ఉన్నారని చెప్పారు. దగ్గరగా 50 మంది ఆడవాళ్లు బయట నుంచి వస్తున్నారు. బ్యూటీ బయట ఏరియా నుంచి వస్తుంది. ఆమె ముజఫర్పూర్ నగరంలో వేరే చోట ఉంటుంది.
చతుర్భుజ్ స్థాన్లో ఉన్న ఇళ్లు అక్కడ మూడు తరాలకు పైగానే సెక్స్ వర్క్ చేస్తున్న ఆడవారివి అని బ్యూటీ, ఇంకా ఇతరులు చెప్పారు. అమీరా వాళ్ళ అమ్మ, అత్తా, అమ్మమ్మ ఆమెకి వ్యాపారాన్ని వారసత్వంగా అందించారు. “ఇక్కడ ఇలానే నడుస్తుంది. మిగిలినవారు పాతవారి దగ్గర ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని, పని కోసం మాత్రమే వస్తారు. బయట ఆడవారు మురికివాడల నుంచి లేదా రిక్షా వాళ్ల ఇళ్ల నుండి వస్తారు. అంతేగాక ఇళ్లలో పనిచేసేవాళ్లు కూడా వస్తారు. కొంతమందిని బలవంతంగా పట్టుకొచ్చి వ్యాపారం చేయిస్తారు.” అని చెప్పింది.
అపహరణ కాబడడం, పేదరికం లేదా పడుపు వృత్తి జరుపుకునే ఇళ్లలో పుట్టడం వలన ఆడవారు ఈ వ్యాపారం లోకి వస్తారు, అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లోని పరిశోధన పత్రం చెప్తుంది. అంతేగాక మగవారి కన్నా ఆడవారు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉండడమే ఈ వృత్తికి ముఖ్యమైన కారణాలు అని ఈ పరిశోధన చెప్తుంది.
బ్యూటీ తల్లిదండ్రులకు ఆమె చేసే పని తెలుసా?
“ఆ, అందరికి తెలుసు. నేను గర్భంతో ఉండి కూడా ఈ పని చేయడానికి కారణం మా అమ్మే. నేను ఆమెని నా కడుపు తీయించమని అడిగాను. ఉన్న ఒక పిల్లాడినే తండ్రి లేకుండా పెంచడం కష్టం, మళ్ళీ ఇంకొకరు అంటే ఇంకా కష్టం. కానీ కడుపు తీయించుకోడం మా మతంలో పాపం అని ఆమె చెప్పింది”, అన్నది.
ఇక్కడ ఇంకా చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. బ్యూటీ కన్నా చిన్నవారేగాని అప్పటికే వారికి పిల్లలున్నారు.
కుమారావస్థ లో సంభవించే గర్భాలను అరికట్టడం, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ గోల్స్ లోని లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య లక్ష్యాలలో ముఖ్యమైనది అని చాలామంది పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా SDG 3, 5 - ఇవి మంచి ఆరోగ్యాన్నీ శ్రేయస్సునీ పొందడానికి ముఖ్యం, లింగ సమానత్వానికి అవసరం. ఇవన్నీ 2025 కల్లా అంటే ఇంకో 40 నెలల్లో సాధిస్తామని ఆశ. కానీ క్షత్ర స్థాయిలో ఎదురయ్యే నిజాలు భయపెడుతున్నాయి.
2016 లో హెచ్‌ఐవి / ఎయిడ్స్‌పై ఐక్యరాజ్యసమితి ప్రోగ్రాం ద్వారా, ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య జనాభా అట్లాస్ లో భారతదేశంలో వ్యభిచారంలో 657,800 మంది మహిళలు ఉన్నారని అంచనా వేశారు. ఏదేమైనా, నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ (NNSW) ఆగస్టు 2020 లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఈ మధ్య సమర్పించిన అంచనా ప్రకారం దేశంలో మహిళా సెక్స్ వర్కర్లు సుమారు 1.2 మిలియన్ల మంది ఉన్నారు. వీరిలో, 6.8 లక్షల (UNAIDS చెప్పిన సంఖ్య) నమోదిత మహిళా సెక్స్ వర్కర్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ నుండి సేవలను పొందుతున్నారు. 1997 లో మొదలుపెట్టిన NNSW, సెక్స్ వర్కర్ల జాతీయ నెట్వర్క్ సంస్థ. ఈ సంస్థ సెక్సవర్కర్లైన ఆడవారు, మగవారు, ట్రాన్స్ వ్యక్తుల హక్కుల కోసం పని చేస్తుంది.
ఇంతలో బ్యూటీ వయసు ఉన్న ఒక అబ్బాయి ఆ గదిలోకి వచ్చాడు. మేము మాట్లాడే మాటలు విని, “నా పేరు రాహుల్, ఇక్కడ చిన్నప్పటి నుంచి పని చేస్తున్నా. నేను బ్యూటీ కి ఇంకా వేరే అమ్మాయిలకు క్లయింట్లను తెస్తుంటాను”, అన్నాడు. ఆ తర్వాత ఇంక మాట్లాడలేదు. తన గురించి కూడా ఏమి చెప్పలేదు. నన్నూ బ్యూటీని మాట్లాడుకోనిచ్చాడు.
“నేను నా కొడుకు, అమ్మ, ఇద్దరు అన్నలు, నాన్నతో ఉంటున్నాను. నేను ఐదో తరగతి వరకు చదువుకుని ఆ తరవాత ఆపేసాను. నాకు స్కూల్ ఎప్పుడూ నచ్చలేదు. మా నాన్నకి ఒక చిన్న డబ్బా(సిగేరెట్లు, అగ్గిపెట్టెలు, టీ, పాన్ వేరే చిన్నసామాన్లు దొరికే చిన్న కొట్టు) సిటీలో ఉంది. అంతే. నాకు పెళ్లి కాలేదు.” అంది బ్యూటీ.
“నా మొదటి బిడ్డ నేను ప్రేమించిన అతనికి పుట్టాడు. అతనూ నన్ను ప్రేమిస్తున్నాడు. కనీసం అలా చెప్తాడు.” బ్యూటీ నవ్వింది. “అతను నాకు ఎప్పటినుంచో ఉన్న క్లయింట్.” చాలా మంది వీళ్ళని పర్మనెంట్ క్లయింట్లంటారు. అంటే ఎప్పటి నుంచో వీరి దగ్గరికి వస్తున్నవారు. కొన్నిసార్లు వారిని పార్టనర్ అని కూడా అంటారు. “చూడండి, నా మొదటి బిడ్డ సమయంలో నేను కావాలనుకునే గర్భం తెచ్చుకోలేదు. ఇప్పటిది కూడా అంతే. కానీ రెండుసార్లూ గర్భాన్ని మోసాను, ఎందుకంటే అతను అలా చెయ్యమని అడిగాడు. నా ఖర్చులన్నీ అతనే భరిస్తానని చెప్పాడు. నిజంగానే ఇచ్చాడు కూడా. ఈసారి కూడా అతనే ఇస్తున్నాడు.” అని ఆమె సంతృప్తికరమైన గొంతుతో చెప్పింది.
బ్యూటీ లాగా, ఇండియా లో , నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -4 నోట్స్ లో 15-19 వయసులో ఉన్న8 శాతం ఆడవారు పిల్లల్ని కంటున్నారు. అదే వయసులో ఉన్న ఐదు శాతం ఆడవారికి కనీసం ఒక కాన్పు అయినా అయింది, 3 శాతం మంది మొదటిసారి గర్భం దాల్చినవారు ఉన్నారు.
ఇక్కడున్నవారు ‘పర్మనెంట్’ క్లయింట్లతో చాలా మంది గర్భనిరోధక పద్ధతులు పాటించరు, అని రాహుల్ చెప్పాడు. ఒకవేళ గర్భం దాలిస్తే, అబార్షన్ చేయించుకుంటారు లేదా బ్యూటీ లాగా కంటారు. ఇదంతా వారితో ఉన్న మగవారిని సంతోషపెట్టడానికి, వారితో ఉన్న అనుబంధాన్ని చాలాకాలం కొనసాగించడానికే ఇలా చేస్తారు.
“చాలామంది ఇక్కడికి వచ్చే క్లయింట్లు కండోమ్లు తీసుకురారు”. అన్నాడు రాహుల్. అప్పుడు మేము(బ్రోకర్లు) షాపుకి పరిగెత్తి తీసుకురావాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ అమ్మాయిలు వాళ్ళ పార్ట్నర్లతో వాడొద్దని అనుకుంటారు. అప్పుడు మేము కల్పించుకోము.”
మన దేశంలో మగవారు గర్భ నిరోధ పద్ధతులు పాటించడం తక్కువ అని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారి నివేదిక తేలుపుతోంది. 2015-2016 లో మగవారు సంతానోత్పత్తిని నిరోధించడానికి చేసుకునే ఆపరేషన్లు, కండోమ్ ల వాడకం 6 శాతం మాత్రమే అని, ఆ తరవాత ఆ సంఖ్య అక్కడే నిలిచిపోయిందని నివేదిక చెప్తోంది. 2015-16 లో ఆడవారిలో గర్భనిరోధక చర్యలు పాటించేవారి సంఖ్య బీహార్ లో 23 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 70 శాతం అని ఆ నివేదిక లో ఉంది.
“మేము నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.” అన్నది బ్యూటీ తన పార్టనర్ గురించి చెబుతూ. “కానీ అతను ఈ మధ్య కుటుంబ ఒత్తిడి వలన పెళ్లి చేసుకున్నాడు. నా అనుమతి తోనే. నేనూ ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకోను? నేను పెళ్లిచేసుకోదగిన దాన్ని కాను, పైగా అతను ఎప్పుడు నన్ను పెళ్లిచేసుకుంటానని మాట ఇవ్వలేదు. నా పిల్లలకు మంచి జీవితం అందితే చాలు, నాకన్ని ఓకే.”
“కానీ నేను ప్రతి మూడు నెలలకు చెకప్ చేయించుకుంటాను. నేను గవర్నమెంటు హాస్పటల్ కు వెళ్ళను, ప్రైవేట్ క్లినిక్ కే వెళ్తాను. ఈ మధ్యే నేను గర్భం తో ఉన్నాను అని తెలిసాక అవసరమైన పరీక్షలు(HIV తో సహా) అన్నీ చేయించుకున్నాను. అంతా బాగానే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మమ్మల్ని సరిగ్గా చూడరు. చాలా అవమానిస్తారు.” అన్నది బ్యూటీ.
*****
రాహుల్ వెళ్లి ఒకతనితో మాట్లాడి వచ్చాడు. అతను ఆ ఇంటి ఓనర్. అద్దె తీసుకోవడానికి వచ్చాడు. “నేను ఆ ఇంటి యజమానిని ఇంకో వారం గడువు ఇమ్మని అడిగాను. మేము 15,000 రూపాయలకు ఈ స్థలాన్ని బాడుగకు తీసుకున్నాము.” చతుర్భుజ్ స్థాన్లోని ఇళ్లు, ముసలి లేదా మధ్యవయస్కులైన ఆడ సెక్స్ వర్కర్లవి అని అతను మళ్ళీ చెప్పాడు.
చాలామంది ఇప్పుడు వ్యాపారం మానేసి వారి ఇళ్లను బ్రోకర్లకు, పడుచు వయసు లో ఉన్న సెక్స్ వర్కర్లకు అద్దెకు ఇస్తున్నారు. కొన్నిసార్లు ఒకేసారి ఒక బృందానికి ఇస్తారు. ఇంటి యజమానులు గ్రౌండ్ ఫ్లోర్ అద్దె కు ఇచ్చి మొదటి లేదా రెండో అంతస్తులో ఉంటారు. కొంత మంది వ్యాపారాన్ని వారి తరవాతి తరానికి ఇచ్చేస్తారు- వారి కూతుర్లకో, మేనకోడళ్ళకో లేక మనవరాళ్లకో- అయినా ఇదే ఇంట్లో ఉంటారు.” అన్నాడు రాహుల్.
NNSW ప్రకారం సెక్స్ వర్కర్లలో చాలా భాగం (మగా, ఆడ, ట్రాన్స్) ఇంటి నుంచే పనిచేస్తారు. వారి క్లైంట్లతో మొబైల్ ఫోనుల్లో, లేదా ఏజెంట్ తో సంప్రదిస్తారు. చతుర్భుజ్ స్థాన్లో చాలా మంది ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాటగిరి లోకి వస్తారు.
అన్ని ఇళ్లూ ఒకేలా ఉంటాయి. ముఖ్యద్వారానికి ఐరన్ గ్రిల్స్, వాటిపైన చెక్క నేమ్ ప్లేట్లు ఉంటాయి. వీటి పైన ఓనర్ పేరు లేదా ఆ ఇంట్లో సెక్స్ వర్క్ చేసుకునే ఆమె పేరు ఉంటుంది. ఆ పేరు వెనుక వారి వారు చేసే పని అంటే వారు నర్తకి లేదా గాయిని అని రాసి ఉంటుంది. దాని కింద వారి ప్రదర్శన వేళలు కూడా రాసి ఉంటాయి. ఎక్కువగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అని ఉంటుంది. కొన్నింటి పైన ఉదయం 11గంటల నుంచి రాత్రి 11 వరకు అని ఉంటుంది. కొన్నింటి మీద రాత్రి 11 వరకు అని మాత్రమే రాసి ఉంటుంది.
చాలా వరకు ఇళ్లన్నీ ఒకేలా, ఒక్కో అంతస్తుకు 2-3 గదులతో ఉంటాయి. బ్యూటీ ఉంటున్న ఇంట్లో ఉన్నట్టుగానే అందరిళ్ళలోనూ హాల్ లో ఒక పెద్ద పరుపు పరిచి వెనుక ఒక పెద్ద అద్దం అమర్చి ఉంటుంది. మిగిలిన చిన్న స్థలం ముజ్రా ప్రదర్శించడానికి ఉంటుంది. ఈ గది ప్రత్యేకంగా గాన నృత్యాలను ప్రదర్శించడానికే ఉంటుంది. ఇక్కడ ఉన్న పడుచువారు పెద్దవారి నుండి నృత్యాన్ని, కొన్నిసార్లు ఊరికే చూసి లేదా కొన్నిసార్లు వారి నేర్పిస్తే నేర్చుకుంటారు. 10 బై 12 ఉన్న ఇంకో చిన్న గది బహుశా బెడ్ రూమ్ గా వాడతారు, ఇంకో చిన్న వంటగది కూడా ఉంటుంది.
“కొంతమంది పెద్దవయసులో ఉన్న క్లయింట్లు 80,000 రూపాయిలు వరకు ఒక ముజ్రా కి చెల్లిస్తారు.” అన్నాడు రాహుల్. ఆ డబ్బు ను ముగ్గురు ఉస్తాదులు (సంగీతకారులు)- తబలా, సారంగి, హార్మోనియం; నర్తకి, బ్రోకర్ వీళ్ళు ముగ్గురు పంచుకుంటారు. కానీ అటువంటి పెద్ద చెల్లింపులు ఇప్పటికైతే ఒక జ్ఞాపకం గానే మిగిలిపోయాయి.
ఇటువంటి కష్టకాలంలో బ్యూటీ సరిపడా సంపాదిస్తుందా? ‘అదృష్టం ఉన్న రోజుల్లో డబ్బులు వస్తాయి, కానీ చాలా రోజులు రావు. పైగా చాలా ఎప్పుడూ వచ్చే వారు కూడా ఈ కాలం లో రావట్లేదు. వచ్చినవారు కూడా చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు.
ఇలాంటి కష్టమైన సమయాలలో బ్యూటీ సరిపడా సంపాయిస్తుందా ?
“అదృష్టం ఉన్న రోజుల్లో వస్తాయి, కానీ చాలావరకు అటువంటి రోజులు రావట్లేదు. బాగా రెగ్యులర్ గా వచ్చే క్లయింట్లు కూడా రావడం లేదు. వచ్చేవారు మామూలు కన్నా చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. వచ్చిన డబ్బులు పుచ్చుకోవడం తప్ప మాకు ఇంకో దారి కూడా లేదు. పైగా కోవిడ్ వస్తుందన్న భయం కూడా ఉంది . ఇది అర్ధం చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఉన్నవారిలో ఒక్కరికి కోవిడ్ వచ్చినా, అందరి ప్రాణాలూ ప్రమాదంలో పడతాయి.”
బ్యూటీ కరోనా కి ముందు నెల కనీసం 25,000 నుంచి 30,000 వరకు సంపాదించేదాన్నని చెప్తుంది. ఇప్పుడు 5000 రావడం కూడా కష్టమే అంటున్నది. లాక్డౌన్ వలన ఆమెకు, ఆమె వంటి సెక్స్ వర్కర్లకు చాలా కష్టంగా గడుస్తోంది. పైగా వైరస్ అంటే భయం కూడా చాలా పెరిగిపోయింది.
*****
చతుర్భుజ్ స్థాన్లో ఉన్న ఆడవారు పోయిన ఏడాది మార్చ్ లో ప్రధాన మంత్రి ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన స్కీం ద్వారా పెద్దగా ఏమి లాభం పొందలేదు. ఆ పథకం ప్రకారం 200 మిలియన్ల ఆడవారికి మూడు నెలల పాటు 500 రూపాయిలు ఇస్తారు. కానీ వారు జన్ ధన్ అకౌంట్ హోల్డర్లు అయి ఉండాలి. ఇక్కడ ఉన్న ఆడవారిలో ఒకరికి కూడా ఆ జన ధన్ అకౌంట్ లేదు . అయినా గాని బ్యూటీ అడుగుతుంది, “500 తో ఏమి చేయగలము మేడం?”
ఓటర్, ఆధార్, రేషన్, కుల ధ్రువీకరణ వంటి గుర్తింపు పత్రాలకు పొందడానికి కూడా సెక్స్ వర్కర్లకు ఇబ్బందులు చాలా ఉంటాయని NNSW చెబుతుంది. చాలామంది ఒంటరి మహిళలు, వారి పిల్లలతో ఉంటారు. వారు నివాస ధ్రువీకరణని తెచ్చి ఇవ్వలేరు. కులధ్రువీకరణకు కూడా పత్రాలు చూపలేరు. చాలాసార్లు వారికి ఈ కారణాల వలన రేషన్ రిలీఫ్ ప్యాకేజీలు కూడా అందవు.
“ప్రభుత్వం నుంచి ఢిల్లీ లాంటి నగరాలలోని ఏ విధమైన సాయం వస్తుందో అర్ధం చేసుకుంటే ఇంకా పల్లెటూర్లలో వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రభుత్వ విధానాలు, ప్రయోజనాలు, ఐతే ఆలస్యంగా వెళ్తాయి లేక ఎప్పటికి చేరవు.” అన్నది కుసుమ్. ఈమె ఢిల్లీ లో ఉన్న ఆల్ ఇండియా నెట్వర్క్ అఫ్ సెక్స్ వర్కర్స్ అనే సంస్థ కి ప్రెసిడెంట్. “చాలా మంది సెక్స్ వర్కర్లు బ్రతకడానికి అప్పులు మీద అప్పులు తీసుకుంటున్నారు.”అన్నది.
హార్మోనియం మీద తన ప్రాక్టీస్ ని ముగిస్తోంది బ్యూటీ. “యువకులైన క్లయింట్లు ముజ్రా చూడడానికి ఇష్టపడరు. వారు సరాసరి బెడ్ రూమ్ లోకి వెళ్ళడానికే ఇష్టపడతారు. మేము కనీసం కొంచెం సమయం అయినా డాన్స్ ని చూడడం(అరగంట నుంచి గంట పాటు) తప్పనిసరి అని చెబుతాము. లేదంటే మేము మా దగ్గర పని చేసే వారి కి జీతాలు ఎలా ఇస్తాము, ఇంటి అద్దె ఎలా కడతాము? మేము అటువంటి అబ్బాయిల దగ్గర కనీసం 1000 రూపాయిలు తీసుకుంటాము. సెక్స్ కోసం అయ్యే చార్జీలు వేరే. అది గంట లెక్కన తీసుకుంటాము, ఒక్కో క్లయింట్ కి ఖరీదు మారుతుంది.” అని వివరించింది.
ఇప్పుడు ఉదయం 11.40 అయింది. బ్యూటీ హార్మోనియం పక్కకి పెట్టి ఆమె హాండ్ బాగ్ తెరిచి అందులో ఉన్న ఆలూ పరాఠా ప్యాకెట్ ని తీసింది. “నేను నా మందులు (మల్టీ విటమిన్స్, ఫోలిక్ ఆసిడ్) వేసుకోవాలి, అందుకే ఇప్పుడే తినేస్తే మంచిది,” అని ఆమె అంది. “నేను పనికి వచ్చినప్పుడల్లా మా అమ్మ వండి, పాక్ చేసి ఇస్తుంది.”
“ఈ రోజు నేను ఒక క్లయింట్ కోసం ఎదురు చూస్తున్నాను.” అన్నది మూడునెలల గర్భిణి అయిన బ్యూటీ. “ఆదివారం సాయంత్రాలు బాగా డబ్బున్న క్లయింట్ దొరకడం కష్టమేలే. చాలా పోటీ ఉంటుంది.” అంది బ్యూటీ.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే zahra@ruralindiaonline.orgకి మెయిల్ చేసి namita@ruralindiaonline.org కి కాపీ చేయండి.
జిగ్యసా మిశ్రా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
అనువాదం - అపర్ణ తోట