నడుము కింది భాగం పట్టేసి, నొప్పి భరించలేనంతగా ఉండటంతో తనూజ హోమియో వైద్యుని వద్దకు వెళ్ళారు. "నాకు కాల్షియం, ఐరన్ సమస్య (లోపం) ఉందనీ, నేనింకెప్పుడూ నేలపై కూర్చోకూడదనీ ఆయన నాకు చెప్పాడు."
పశ్చిమబెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన బీడీ కార్మికురాలైన తనూజ, రోజుకు 8 గంటలపాటు నేలపై కూర్చొని బీడీల ను చుడుతుంటారు. "నాకు జ్వరం వచ్చినట్టుగానూ, బలహీనంగానూ అనిపిస్తోంది. విపరీతమైన వెన్ను నొప్పి," అంటారు దాదాపు ఏభయ్యేళ్ళ వయసున్నఈ కార్మికురాలు. "నాకోసం ఒక కుర్చీ, బల్లా కొనగలిగే స్థోమతే ఉంటేనా..."
అవి నవంబర్ నెల చివరిరోజులు. హరేక్‌నగర్ మొహల్లా లో ఉన్న ఆమె ఇంటి గట్టి సిమెంటు గచ్చు మీద వెచ్చని సూర్యకిరణాలు వాలుతున్నాయి. ఒక తాటాకుల మాదూర్ (ౘాప)పై కూర్చొని ఉన్న తనూజ ఒక బీడీ వెనుక మరొకటి చుడుతూవున్నారు. కెందూ (తునికి) ఆకును మెలితిప్పినపుడు, ఆమె వేళ్ళు నేర్పుగా కదిలి, మోచేతులు ఒక దగ్గరకు వచ్చి, భుజాలు పైకి లేచి, తల ఒకవైపుకు వాలుతోంది. "నా వేళ్ళు ఎంతగా మొద్దుబారిపోయాయంటే, ఒకోసారి నా చేతికసలు వేళ్ళున్నాయా అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది," అన్నారామె ఏదో హాస్యానికన్నట్టు.
ఆమె చుట్టూ బీడీలు తయారుచేయడానికి అవసరమైన ముడిపదార్థాలు పడివున్నాయి : కెందూ ఆకులు, పొగాకు పొడి, దారపుండలు. పదునైన చిన్న చాకు, జత కత్తెరలు ఆమె వ్యాపారానికి సాధనాలు
ఇంట్లోకి అవసరమైన సరుకులను కొనడం కోసం మాత్రమే బయటకు వెళ్ళే తనూజ, వంట చేస్తారు, నీళ్ళు మోసుకొస్తారు, ఇంటి లోపల, బయటి ఆవరణనంతా శుభ్రం చేసి, మిగిలిన ఇంటి పనులన్నీ పూర్తిచేస్తారు. కానీ ఇవన్నీ చేసేటప్పుడు కూడా రోజుకు 500-700 బీడిలు చుట్టకపోతే, తనకు వచ్చే మూడువేల రూపాయల నెలసరి ఆదాయం తగ్గిపోతుందనే తెలివిడితోనే ఉంటారామె.
అలా ఆమె సూర్యోదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఇదే పనిలో ఉంటారు. "మొదటి అజాన్ పిలుపు వినిపించినపుడు నేను నిద్ర లేస్తాను . ఫజర్ నమాజు చేసిన తర్వాత నా పనిని మొదలుపెడతాను," తాను చుడుతున్న బీడీల వైపు నుంచి చూపు తిప్పకుండా చెప్పారు తనూజ. వాస్తవానికి ఆమెకు సమయాన్ని చూడటం తెలియదు కాబట్టి నమాజ్ పిలుపుతోనే ఆమె రోజును కొలుస్తారు. " మఘ్రిబ్ (సాయకాలం వినిపించే నాలుగవ ప్రార్థన) కూ, ఇషా (రాత్రి వినిపించే ఐదవదీ చివరిదీ అయిన ప్రార్థన) కూ మధ్య ఆమె రాత్రి భోజనాన్ని సిద్ధంచేస్తారు. ఇక అర్ధరాత్రి నిద్రపోవడానికి ముందు కనీసం మరో రెండు గంటల పాటు బీడీల ను చుట్టడమో లేదా ఆకులను కత్తిరించటమో చేస్తూ గడుపుతారు.
వెన్నువిరిచే ఈ పని నుంచి నాకు కొంచమైనా విముక్తి దక్కేది నమాజ్ చేసుకునే సమయంలో మాత్రమే. ఆ సమయంలో నేను కొంత విశ్రాంతినీ, శాంతినీ పొందుతాను." అన్నారు తనూజ. " బీడీలు తాగితే అనారోగ్యం పాలవుతారని అందరూ అంటారు. బీడీలు చుట్టేవారికి ఏమవుతుందో వాళ్ళకేమైనా తెలుసా?" అని అడుగుతారామె.
చివరికెలాగైతేనేం 2020 మొదట్లో జిల్లా ఆసుపత్రిలో ఉండే వైద్యుడ్ని కలవాలని తనూజ నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడే లాక్‌డౌన్ వచ్చిపడి, కోవిడ్ సోకుతుందేమోననే భయం ఆమెను వెళ్ళనివ్వకుండా ఆపేసింది. బదులుగా ఆమె ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బేల్‌డాంగా -1 బ్లాక్‌లో నివసించే తక్కువ ఆదాయం వచ్చే బీడీ కార్మికుల కుటుంబాలవారు తమ ఆరోగ్య అవసరాల కోసం ఎటువంటి గుర్తింపు పట్టాలు లేకుండా చికిత్స అందించే వైద్యులతో పాటు ఈ హోమియోపతి వైద్యం చేసేవాళ్ళనే మొదటగా ఆశ్రయిస్తుంటారు. గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2020-21 ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 578 మంది వైద్యుల కొరత ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొరత 58 శాతంగా ఉంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఆసుపత్రుల్లో చికిత్స తక్కువ ధరకే లభించినా పరీక్షలు, స్కానింగ్‌లు తదితర ప్రక్రియల కోసం అంతులేని క్యూలలో చాలా సమయం నిలబడాల్సి వస్తుంది. తద్వారా రోజువారీ వేతనాలలో నష్టం జరుగుతుంది. తనూజ మాటల్లో చెప్పాలంటే, "మా దగ్గర అటువంటి సమయం లేదు."
హోమియోపతి మందుల వలన ఉపయోగం లేకపోవటంతో తనూజ తన భర్త దగ్గర నుండి తీసుకున్న మూడు వందల రూపాయలకు, తన సంపాదన నుంచి మరో మూడు వందలు కలిపి, స్థానికంగా ఉన్న అలోపతి వైద్యున్ని కలిశారు. "ఆయన నాకు కొన్ని మాత్రలు ఇచ్చి, నా ఛాతీని ఎక్స్‌రే తీయించమనీ, స్కాన్ చేయించమనీ చెప్పారు. నేను వాటిని చేయించుకోలేదు," అటువంటి పరీక్షలు చేయించుకునేందుకు తనకు స్థోమత లేదని స్పష్టం చేస్తూ చెప్పారు తనూజ.
పశ్చిమ బెంగాల్‌లో ఉన్న 20 లక్షల మంది బీడీ కార్మికులలో 70 శాతం మంది తనూజ వంటి మహిళా కార్మికులే ఉన్నారు. సరైన పద్ధతిలో కూర్చొని పనిచేసేందుకు కూడా వీలుకాని పని పరిస్థితులు- శరీరం పట్టివేయడం, తిమ్మిరెక్కడం, కండరాల, నరాల నొప్పి, శ్వాసకోశ సమస్యలతో పాటు క్షయవ్యాధి వంటి సమస్యలకు కూడా కారణమవుతున్నాయి. వారు తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల నుంచి వచ్చినవారు కావడంతో పోషకాహార లోపం కూడా ఈ పని సంబంధిత అనారోగ్యాలకు తోడై, మొత్తంగా వారి సాధారణ ఆరోగ్యంతోపాటు పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం వేస్తున్నాయి.
ముర్షిదాబాద్‌లో 15-49 సంవత్సరాల వయసున్న మహిళలలో రక్తహీనత శాతం 77.6 ఉంది. నాలుగేళ్ళ క్రితం ఉన్న 58 శాతం కంటే ఇది చాలా ఎక్కువ. రక్తహీనత ఉన్న తల్లులకు పుట్టిన పిల్లల్లో కూడా రక్తహీనత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వాస్తవానికి, ఇటీవలి దేశీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( ఎన్ఎఫ్ఎచ్ఎస్ -5 ) జిల్లాలోని మొత్తమ్మంది మహిళలూ పిల్లలలో రక్తహీనత స్థాయిలు పెరుగుతున్నట్టుగా చూపిస్తోంది. అలాగే, ఈ జిల్లాలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 40 శాతం మంది ఎదుగుదల లేక గిడసబారిపోతున్నారు. ఆందోళనకరమైన విషయమేమిటంటే, నాలుగు సంవత్సరాల క్రితం 2015-2016లో చేసిన ఎన్ఎఫ్ఎచ్ఎస్ నుండి ఈ సంఖ్యలో నిజమైన మార్పు లేకపోవడం.
మాఠ్‌పారా మొహల్లా కు చెందిన అహసాన్ అలీ ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయనిక్కడ ఒక చిన్న మందుల దుకాణాన్ని నడుపుతారు. ఎటువంటి వైద్యపరమైన అర్హతలు లేనప్పటికీ, బీడీలు చుట్టే కుటుంబంలో నుంచి వచ్చినవారు కావడంతో, ఆరోగ్యపరమైన విషయాల గురించి ఈ సముదాయంలో ఈయనొక నమ్మకస్థుడైన సలహాదారుగా ఉన్నారు. నొప్పిని తగ్గించే మాత్రలు, పూతమందుల కోసం బీడీ కార్మికులు తనదగ్గరకు వస్తుంటారని ఈ ముప్పయ్యేళ్ళ యువకుడు చెప్పారు. "వారికి 25-26 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒళ్ళు పట్టేయటం, కండరాల బలహీనత, నరాలకు సంబంధించిన నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి అనేక ఆరోగ్యసమస్యల బారిన పడతారు," అని అలీ చెప్పారు.
చిన్ననాటి నుంచే బాలికలు తమ ఇళ్లల్లో పొగాకు ధూళికి గురికావడం, తమ తల్లుల రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సహాయం చేస్తుండటం వల్ల చాలా ప్రమాదంలో పడుతున్నారు. మాఝాపారా మొహల్లా లో పదేళ్ళ చిన్నపిల్లగా ఉండగానే తనూజ ఈ పనిచేయడం మొదలుపెట్టారు. “నేను మా అమ్మకి బీడీల చివర్లు మడతపెట్టడంలోనూ, బీడీలను దారంతో కట్టడంలోనూ సహాయం చేసేదాన్ని,” అని చెబుతూ ఆమె, “మా సముదాయంలో 'బీడీలు చుట్టడం తెలియని అమ్మాయిలకు భర్తలు దొరకరు' అంటుంటారు," అని చెప్పారు.
పన్నేండేళ్ళ వయసులో తనూజకు రఫీకుల్ ఇస్లామ్‌తో పెళ్ళయింది. ఆ తర్వాత ఆమెకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. ఎన్ఎఫ్ఎచ్ఎస్-5 ప్రకారం జిల్లాలో 55 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చిన్నవయసులోనే పెళ్ళయి, పిల్లలు పుట్టడంతో పాటు పోషకాహార లోపం కూడా తోడవ్వటంతో తర్వాతి తరాల పిల్లలపై ప్రభావం చూపుతుందని యూనిసెఫ్ పేర్కొంది.
"మహిళల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం అనేది స్త్రీల సాధారణ శారీరక, మానసిక ఆరోగ్యంతో అంతర్గతంగా ముడిపడి ఉంది. దీనిని ఒకదాని నుండి మరొకదానిని వేరు చేయడానికి లేదు,” అని ఆరోగ్య పర్యవేక్షకురాలు హసి ఛటర్జీ హెచ్చరిస్తున్నారు. బేల్‌డాంగా-1 బ్లాక్‌లోని మీర్జాపూర్ పంచాయతీ కి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమె, వివిధ ఆరోగ్య పథకాలు అవసరమైన ప్రజలకు చేరేలా చూస్తుంటారు.
తనూజ తల్లి దాదాపు తన జీవితకాలమంతా బీడీలు చుడుతూనే ఉన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగా పాడైపోయిందనీ, ఆమె ఇంకెంతమాత్రం సరిగ్గా నడవలేరనీ, ప్రస్తుతం 70లకు చేరువవుతున్న తన తల్లి గురించి తనూజ చెప్పారు. "ఆమె వెన్నుభాగం దెబ్బతింది, మంచంపట్టింది," అని చెప్పిన తనూజ, "రేపు నా గతి కూడా అదే అవుతుంది" అని నిస్సహాయతతో అన్నారు.
ఈ మహిళలు బీడీలు చుట్టే పని చేయకపోతే, వారూ వారి కుటుంబాలూ ఆకలితో అలమటించాల్సి వస్తుంది. తనూజ భర్త బాగా జబ్బుపడి, పనిలోని వెళ్ళలేని పరిస్థితులలో, ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబానికి అన్నం పెట్టింది ఆమెకున్న బీడీలు తయారుచేసే నైపుణ్యమే. ఆమె తన నవజాత శిశువును - నాల్గవ కుమార్తె - కాంతా కుట్టుపని చేసివున్న ఒక మెత్తని బొంతలో చుట్టి ఒడిలో పెట్టుని బీడీలు చుట్టారు. ఆ కుటుంబానికున్న భయంకరమైన కష్టాలు శిశువును పొగాకు దుమ్ములో పెంచేలా చేశాయి.
"ఒకప్పుడు నేను రోజుకు 1000-1200 బీడీలు తయారుచేసేదాన్ని," అన్నారు తనూజ. ఇప్పుడున్న బలహీన పరిస్థితులలో ఆమె రోజుకు 500-700 బీడీలు మాత్రమే చుట్టగలుగుతున్నారు. అలా చేస్తేనే ఆమెకు నెలకు దాదాపు 3000 రూపాయల ఆదాయం వస్తుంది. అందుకోసం ఆమె తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అంతకు తగ్గకుండా బీడీలు చేస్తూనే ఉండాలి.
ముర్షిదా ఖాతూన్ దేవ్‌కుండా ఎస్ఎఆర్ఎమ్ బాలికల ఉన్నత మదర్సా ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తన మదర్సా లో చదివే బాలికలలో 80 శాతం కంటే ఎక్కువమంది బేల్‌డాంగా -1 బ్లాక్‌లోని బీడీలు చుట్టే కుటుంబాలనుంచే వచ్చినవారని, వారంతా తమ తల్లులకు ఈ బీడీలు చుట్టే పనిలో సహాయం చేసి వస్తారని ఆమె చెప్పారు. "చాలా తరచుగా బడిలో ఇచ్చే మధ్యాహ్న భోజనం - అన్నం, పప్పు, కూరగాయలు - ఈ పిల్లలకు ఆ రోజులో మొదటి భోజనం అవుతుంది. మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఉదయంపూట ఏమీ వండకపోవటం వారి ఇళ్ళల్లో మామూలు విషయం," అని ఆమె ఎత్తిచూపారు.
పన్నేండేళ్ళ వయసులో తనూజకు రఫీకుల్ ఇస్లామ్‌తో పెళ్ళయింది. ఆ తర్వాత ఆమెకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. ఎన్ఎఫ్ఎచ్ఎస్-5 ప్రకారం జిల్లాలో 55 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చిన్నవయసులోనే పెళ్ళయి, పిల్లలు పుట్టడంతో పాటు పోషకాహార లోపం కూడా తోడవ్వటంతో తర్వాతి తరాల పిల్లలపై ప్రభావం చూపుతుందని యూనిసెఫ్ పేర్కొంది.
*****
ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా, షాహినూర్ బీబీ మాట్లాడుతూనే ఉల్లిగడ్డలు, మిరపకాయలు తరుగుతూ, ఘూఘ్నీ కోసం మసాలా సిద్ధం చేస్తున్నారు.బేల్‌డాంగా–1లోని హరేక్‌నగర్ ప్రాంతానికి చెందిన ఈ మాజీ బీడీ కార్మికురాలు, అదనపు ఆదాయం కోసం పసుపు బఠాణీలతో తయారుచేసే అమిత ప్రజాదరణవున్న ఘూఘ్నీ ని ఇంట్లోనే తయారుచేసి, సాయంత్రంవేళల్లో అమ్ముతుంటారు.
"అనారోగ్యం పాలవడమే బీడీలు చుట్టేవారి తలరాత," అంటారు ఈ 45 ఏళ్ళ వయసున్న మహిళ. కొన్ని నెలల క్రితం శరీరం వంగకపోవడం, శ్వాస పీల్చుకోవడానికి సంబంధించిన సమస్యలతో ఆమె పరీక్ష చేయించుకోవడానికి బేల్‌డాంగా గ్రామీణ ఆసుపత్రికి వెళ్ళారు. తర్వాత ఒక ప్రైవేట్ క్లినిక్‌లో ఛాతీ ఎక్స్–రే కూడా తీయించుకున్నారు. కానీ ఇప్పుడామె భర్తకు బాగుండకపోవడంతో ఆమె తిరిగి ఆసుపత్రికి వెళ్లలేకపోయారు. "నా ఇద్దరు కోడళ్లు నన్ను చుట్టనివ్వరు( బీడీలు ). పూర్తిగా వాళ్లే ఆ పని చేస్తున్నారు, కానీ దాని(సంపాదన) మీదే మేమందరం బతకడం కష్టం," అంటారామె, ఘూఘ్నీ ఎందుకు అమ్మవలసి వస్తుందో వివరిస్తూ.
తాను పనిచేస్తున్న బ్లాక్ ఆసుపత్రికి ప్రతి నెలా 20–25 నిర్ధారిత క్షయ రోగులు తరచూ రావడాన్ని డాక్టర్ సాల్మన్ మండల్ గమనిస్తున్నారు. "నిరంతరం విషపూరితమైన దుమ్ములో మసలడం వల్ల బీడీ చుట్టేవాళ్లకు క్షయవ్యాధి సోకే ప్రమాదం చాలా ఎక్కువ. దీనివల్ల చాలా తరచుగా జలుబు చేయడం, ఊపిరితిత్తులు క్రమంగా బలహీనపడటం జరుగుతుంది," అంటారు బేల్‌డాంగా–1 బ్లాక్ వైద్యాధికారి (బిఎంఒ) అయిన మండల్.
ఆ తోవన ఇంకొంచెం కిందికి వస్తే, దర్జీపారా మొహల్లా లోని సైరా బేవా ఎడతెరిపిలేని దగ్గూ జలుబులతో సతమతమవుతున్నారు. ఇవి కాక, గత పదిహేనేళ్లుగా మధుమేహం, బ్లడ్ ప్రెషర్ సంబంధిత సమస్యలతో ఈ అరవై ఏళ్ళ కార్మికురాలు బాధపడుతున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా బీడీలు చుట్టడం వల్ల, ఆమె చేతుల మీదా గోళ్ల మీదా పొగాకు పొడి మరకలైనాయి.
" మసాలా (మెత్తగా దంచిన పొగాకు) సాధారణ అలెర్జీ కారకం. బీడీలు చుడుతున్నప్పుడు ఇందులోని సూక్ష్మ రేణువులను, అలాగే పొగాకు పొగను కూడా లోపలికి పీల్చుకుంటారు," అని చెబుతారు డాక్టర్ సాల్మన్ మండల్. పశ్చిమ బెంగాల్లో, ఉబ్బసం ఉన్న మహిళల సంఖ్య పురుషుల కంటే రెట్టింపు ఉంది. ప్రతి 1,00,000 మందికి 4,386 మంది మహిళలున్నారు(ఎన్ఎఫ్ఎచ్ఎస్–5).
బ్లాక్ వైద్యాధికారి ఇంకోటి కూడా ఎత్తిచూపుతారు. "పొగాకు ధూళిలో మసలడానికీ, క్షయవ్యాధికీ బలమైన సహసంబంధం ఉన్నప్పటికీ, మన దగ్గర క్షయ వ్యాధికి సంబంధించిన వృత్తి పరీక్షలు లేదా స్క్రీనింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు లేవు." బీడీ కార్మికులు అత్యధికంగా పోగుపడిన జిల్లా అయినందున ప్రత్యేకించి ఈ అంతరం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. సైరా దగ్గుతున్నపుడు రక్తం పడుతోంది– ఇది క్షయవ్యాధి రాబోయే ముందరి సంకేతం. "నేను బేల్‌డాంగా గ్రామీణ ఆసుపత్రికి వెళ్లాను. వాళ్లు కొన్ని పరీక్షలు చేసి మాత్రలు ఇచ్చారు," అని చెప్పారామె. వాళ్లు ఆమెను కఫం పరీక్ష చేయించుకొమ్మని చెప్పి, పొగాకు ధూళికి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. కానీ రక్షణ ఉపకరణాలు మాత్రం ఏమీ ఇవ్వలేదు.
నిజం చెప్పాలంటే, జిల్లాలో ‘PARI’ కలిసిన ఏ బీడీ కార్మికురాలి దగ్గర కూడా మాస్కులు లేదా చేతి తొడుగులు ఉన్నట్టుగానీ, వాడినట్టుగానీ కనిపించలేదు. వాళ్ల దగ్గర ఉపాధి సంబంధిత పత్రాలు లేవు. ఎటువంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు, సంక్షేమం, ఆరోగ్యసంబంధమైన సౌకర్యాలు కూడా లేవు. ప్రామాణీకరించిన వేతనాలు అసలే లేవు. బీడీ కంపెనీలు పనిని మహాజన్ (మధ్యవర్తులు)లకు అప్పగించేసి, తమ బాధ్యతల విషయంలో చేతులు కడిగేసుకుంటాయి. బదులుగా మహాజన్ లు బీడీలు కొంటారుగానీ, మిగిలిన విషయాల గురించి పట్టించుకోరు.
ముర్షిదాబాద్ జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల మంది ముస్లిమ్‌లు, దాదాపు బీడీ కార్మికులంతా ముస్లిమ్ మహిళలే. రఫీకుల్ హసన్ బీడీ కార్మికులతో కలిసి మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నారు. " బీడీ పరిశ్రమ ఎప్పుడూ కూడా ఆదివాసీలు, ముస్లిమ్ బాలికలు, మహిళలతో కూడిన అతిచవగ్గా దొరికే కార్మిక శక్తిని దోపిడీ చేసే అభివృద్ధి చెందింది," అంటారు ఇక్కడి బేల్‌డాంగాలోని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సిఐటియు) బ్లాక్ కార్యదర్శి.
అసంఘటిత రంగంలో అత్యంత దుర్బల కార్మికులు బీడీ కార్మికులేనని పశ్చిమ బెంగాల్ కార్మిక శాఖ అధికారికంగా అంగీకరిస్తుంది. కార్మిక శాఖ నిర్దేశించిన కనీస కూలీ రూ.267.44 కూడా బీడీ కార్మికులకు అందడం లేదు. వారు 1,000 బీడీల కు రూ.150 మాత్రమే సంపాదిస్తున్నారు. అది వేతన నియమావళి , 2019 నిర్దేశించిన జాతీయ సగటు కూలీ అయిన రూ.178 కంటే కూడా తక్కువ.
"ఒకే పనికి మగవాళ్ల కంటే ఆడవాళ్లకు తక్కువ వేతనం ఇస్తారని అందరికీ తెలుసు," అని ఎత్తిచూపుతారు సిఐటియు అనుబంధ ముర్షీదాబాద్ జిల్లా బీడీ మజ్దూర్ మరియు ప్యాకర్స్ యూనియన్‌తో పనిచేసే సైదా బేవా. " మహాజన్ లు (మధ్యవర్తులు) తమకు నాణ్యతలేని ముడిసరుకును కూడా సరఫరా చేస్తారని, చివరి తనిఖీల సమయంలో కొన్ని ఉత్పత్తులను తిరస్కరిస్తారని బేవా చెప్పారు. " మహాజన్ లు తాము తిరస్కరించిన బీడీల ను తమతోనే ఉంచుకుంటారు కానీ వాటికి డబ్బు చెల్లించరు," అని ఆమె ఆ అన్యాయాన్నిఎత్తి చూపారు. "‘నీకు నచ్చకపోతే, మాతో పనిచేయకు’ అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తారు." అన్నారు, బీడీ కార్మికుల కోసం రాష్ట్రానికి నిర్దిష్ట పథకాలు ఉండాలని కోరుతున్న ఈ 55 ఏళ్ల మహిళ..
బొటాబొటీ కూలీ, ఏ భద్రతా వలయం లేని తనూజ లాంటి రోజుకూలీ కార్మికులు ఆర్థికంగా ఏ భద్రతా లేని జీవితాన్ని గడుపుతారు. ఈ దంపతులు తమ మూడో కుమార్తె వివాహానికి చేసిన రూ.35,000 అప్పును ఇంకా చెల్లించాల్సే ఉంది. "అప్పు తీసుకోవడం, దాన్ని చెల్లించడం అనే చక్రంలో మా జీవితాలు చిక్కుకున్నాయి," అంటారామె, ప్రతి వివాహానికీ తీసుకోవాల్సి వచ్చిన అనేక అప్పుల గురించీ, తర్వాత వాటిని తీర్చడానికి పనిచేయాల్సి రావడాన్నీ ఉద్దేశిస్తూ
యువ దంపతులుగా ఉండగా తనూజ, రఫీకుల్‌లు అతడి తల్లిదండ్రులతో కలిసి జీవించేవారు. కానీ పిల్లలు ఎదిగిన తర్వాత, ఈ దంపతులు అప్పుచేసి, స్థలం కొనుక్కుని, గడ్డితో కప్పిన ఒంటిగది ఇంటిని నిర్మించుకున్నారు. "అప్పుడు మేమిద్దరమూ యౌవనంలో ఉన్నాం. మా కఠిన శ్రమతో ఆ అప్పును తీర్చగలమని అనుకున్నాం. కానీ అది ఎప్పుడూ జరగలేదు. ఒకదాని తర్వాత మరోదానికి అప్పు చేస్తూనే ఉన్నాం, ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాం. ఇప్పటికీ ఈ ఇంటిని పూర్తిచేయలేకపోతున్నాం." ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వారు ఒక గృహానికి అర్హులైనప్పటికీ, ఈ భూమిలేని దంపతులు ఇంకా దాన్ని అందుకోవాల్సే ఉంది.
రఫీకుల్ ఇప్పుడు డెంగ్యూ నిర్మూలనా కార్యక్రమం కోసం గ్రామ పంచాయితీతో ఒప్పందంపై పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. అతడి నెలవారీ సంపాదన రూ.5,000 ఎప్పుడూ సమయానికి రావు. "ఇలా సక్రమంగా రాకపోవడం నన్ను ఎంతో ఒత్తిడి పెడుతుంది. ఆరు నెలల పాటు ఒక్క పైసా కూడా అతను అందుకోని సమయం కూడా ఉండింది," అంటారామె. దాంతో స్థానిక దుకాణంలో వారి కుటుంబం 15,000 దాకా అప్పు పెట్టాల్సి వచ్చింది.
బీడీ కార్మికులు ప్రసూతి, అనారోగ్య సెలవులు తీసుకోరు; గర్భం, పిల్లల పుట్టుక రెండూ కూడా బీడీలు చుడుతూనే కొనసాగిస్తారు. జననీ సురక్షా యోజన, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్(ఐసీడీఎస్) లాంటి కార్యక్రమాలు, ఉచిత మధ్యాహ్న భోజనాలు యువ మహిళలకు సాయం చేశాయి. "కానీ వృద్ధులైన మహిళా కార్మికుల ఆరోగ్యం ఎంతగా దెబ్బతిందో లెక్కించలేదు," అని ఉషా(యుఎస్ఎచ్ఎ) వర్కర్ సబీనా యాస్మిన్ ఎత్తిచూపుతారు. "రుతుక్రమం ఆగిపోయే దశకు చేరుకున్న తర్వాత వాళ్ల ఆరోగ్యం విషమిస్తుంది. మహిళలకు అత్యవసరమైన కాల్షియం, ఐరన్‌ల కొరత ఏర్పడుతుంది. ఎముకల పటుత్వం తగ్గిపోయి, రక్తహీనత వస్తుంది," అన్నారామె.బేల్‌డాంగా పట్టణ మునిసిపాలిటీలోని 14 వార్డుల్లోని ఒక వార్డుకు ఇన్–ఛార్జ్ అయిన యాస్మిన్, తన పాత్ర, బాధ్యతలు ప్రసూతి, శిశు సంరక్షణకే అత్యధికంగా పరిమితం అయినందున తాను ఏమీ చేయలేకపోతున్నానని బాధపడతారు.
పరిశ్రమ, ప్రభుత్వం రెండూ వదిలివేసిన మహిళా బీడీ కార్మికులు పెద్దగా ఎదురుచూడటానికి ఏమీలేదు. నిజం చెప్పాలంటే, పనిచేయడం వలన వచ్చే ప్రయోజనాల గురించి అడిగినప్పుడు తనూజ కోపోద్రిక్తురాలయ్యారు. "మా గురించి విచారించడానికి ఏ బాబూ (కాంట్రాక్టర్) ఎప్పుడూ రాడు." అన్నారామె.
"బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయం (బిడిఒ) మమ్మల్ని పరీక్షించడానికి వైద్యులు వస్తారని చెప్పింది. వాళ్లు మాకు పనికిమాలిన పెద్ద మాత్రలేవో ఇచ్చారు, అవేం పనిచేయలేదు," అని ఆమె గుర్తుచేసుకున్నారు. మహిళలను పరీక్షించడానికి మళ్లీ ఎవరూ రాలేదు. వారిచ్చిన మాత్రలు మనుషులకోసమేనా అని ఆవిడ అనుమానపడ్డారు. "అవి ఆవుల కోసమై ఉంటాయి.".
గ్రామీణ
భారతదేశంలో, కౌమారదశలో
ఉన్న
బాలికలు
,
యువతులు మొదలైన
అట్టడుగు సమూహాల
జీవన
పరిస్థితులను, అనుభవాలను
వారి గొంతులతోనే
పదిల
పరచాలని
,
పాపులేషన్
ఫౌండేషన్
ఆఫ్
ఇండియా
సహకారంతో,
PARI
మరియు
కౌంటర్
మీడియా
ట్రస్ట్
లు ఈ దేశవ్యాప్త
రిపోర్టింగ్
ప్రాజెక్టును
చేపట్టాయి
.
ఈ కథనాన్ని
ప్రచురించాలనుకుంటున్నారా?
అయితే
zahra@ruralindiaonline.org
కి ఈమెయిల్ చేసి,
namita@ruralindiaonline.org
కి కాపీ పెట్టండి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి