రోజు సాయంత్రం సుమారు ఐదింటికి పని ముగించుకొని వచ్చాక డా.షబ్నం యాస్మిన్ నేరుగా తన లేతగోధుమరంగు ఇంటి డాబా మీదకి వెళ్ళిపోతుంది. అక్కడ తను స్నానం చేసి, తనతో పాటు పని ప్రదేశానికి తీసుకెళ్లిన పెన్నులు, డైరీలతో సహా మిగతా వస్తువుల్నిచాలా జాగ్రత్తగా శుభ్ర పరిచి, తన బట్టలు ఉతుక్కొని (డాబా మీద వీటన్నిటికీ ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి), ఆపై తన కుటుంబంతో ఉండడానికి కిందకి వెళుతుంది. గత సంవత్సరం నుండి ఇదంతా నిత్యకృత్యంగా మారింది. .
“ప్రైవేట్ ఆస్పత్రులతో సహా అన్నీ మూతబడి ఉన్నప్పుడు కూడా నేను మాహారోగం (లాక్డౌన్) ఉన్నన్ని రోజులు పూర్తిగా పని చేసాను. నాకు ఎప్పుడూ టెస్టులో పాజిటివ్ రాలేదు, నా సహోద్యోగులు కొందరికి వచ్చింది. నిజానికి మేము ఆస్పత్రిలో రెండు కోవిడ్19 పాజిటివ్ గర్భవతులకు మంచి చికిత్సను అందించాం. ” అంటారు 45ఏళ్ల డా.యాస్మిన్. ఈశాన్య బీహార్ లోని కిషన్ గంజ్ అనే పట్టణంలో ఆమె ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న సదర్ హాస్పిటల్ లో ఆవిడ గైనకాలజిస్టు మరియు శస్త్రవైద్యురాలు.
షబ్నమ్ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ. తను కరోనావైరస్ వాహకంగా మారే అవకాశం ఏ మాత్రం తీసుకోలేదు. ఇంట్లో తన తల్లి; 18, 12 వయసు గల ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంతేగాక, మూత్రపిండాల సమస్యల నుంచి కోలుకుంటున్న 53 సంవత్సరాల తన భర్త ఇర్తజా హసన్ కూడా ఉన్నాడు కాబట్టి రెండింతలు జాగ్రత్తలు తీస్కోవాలి. “మా అమ్మ అజరా సుల్తానా వల్లే నేను (పోయిన ఒక సంవత్సరం) ఉద్యోగం చేయగలిగాను. తను బాధ్యత మొత్తం తీసుకుంది, లేకుంటే నేను అన్ని పాత్రలు కలిపి నేనొక్కడాన్నే పోషిస్తుంటాను- డాక్టర్, గృహిణి, టీచర్, ట్యూటర్” ,అని యాస్మిన్ అన్నారు.
2007 లో వైద్య విద్య పూర్తి చేసినప్పటి నుంచి తన జీవితంలో అది నిరంతరం కొనసాగుతూ ఉంది. “ఎంబీబీస్ చివరి సంవత్సరంలో నేను గర్భవతిని. పెళ్ళైన తర్వాత దాదాపు ఆరేళ్ళు నేను నా కుటుంబంతో ఎప్పుడు ఉండలేదు. నా భర్త లాయర్ గా పని చేసేవారు, పట్నాలో ప్రాక్టీస్ ఉండేది. నన్ను ఎక్కడికి పంపితే నేను అక్కడే ప్రాక్టీస్ చేసేదాన్ని” అన్నారు యాస్మిన్.
సదర్ హాస్పిటల్ లో నియామకానికి ముందు, డా.షబ్నమ్ 2011 లో తన ఇంటికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఠాకూర్ గంజ్ బ్లాక్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నియమితమై ఉంది. 2003 లో రాంచీ లోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఎంబీబీస్, 2007 లో పాట్నా మెడికల్ కాలేజ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ప్రైవేట్ గా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక తనకి ఈ ప్రభుత్వోద్యోగం వచ్చింది. ఠాకూర్ గంజ్ లోని పీహెచ్సీ కి వెళ్ళడానికి పసిబిడ్డయిన తన రెండో కొడుకుని తల్లి వద్ద వదిలేసి స్థానిక బస్ లో వెళ్ళొచ్చేది. ఇదంతా చాలా కష్టం, శ్రమతో కూడుకున్నది కావడంతో తొమ్మిది నెలల తర్వాత తన తల్లీపిల్లలతో ఠాకూర్ గంజ్ కి మారిపోయింది. తన భర్త ఇర్తజా పట్నాలొనే ఉంటూ ప్రతి నెల వాళ్ళని కలవడానికి వెళ్ళేవాడు.
“నా భర్త సహకారం ఉన్నప్పటికీ రోజూ ప్రయాణం చేయడం బాగా కఠినంగా ఉండేది, ఆ రకమైన జీవితం కూడా చాలా కష్టంగా ఉండింది. అధ్వాన్నం ఏంటంటే నేనసలు ఏం చేయలేకపోయేదాన్ని. నేను సర్జన్ ని, కానీ ఆపరేషన్లు చేయలేకపోయేదాన్ని. అక్కడ (పీహెచ్సీ)సౌకర్యాల పరంగా ఏమీ లేవు, బ్లడ్ బ్యాంక్, మత్తు మందులు కూడా లేవు. కాన్పుల్లో కొన్ని సంక్లిష్టతలు వచ్చినా వేరే చోటికి వెళ్ళమని సలహా ఇవ్వడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. ఒక సిజేరియన్ కూడా చేయడం కుదిరేది కాదు. నా జోక్యం ఏం లేదు, బస్సెక్కి (దగ్గర్లోని హాస్పిటల్ కి) వెళ్ళమని (వాళ్ళకి) చెప్పేదాన్ని.” అని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ యాస్మిన్ అన్నారు.
కిషన్ గంజ్ జిల్లాలోని సదర్ ఆస్పత్రిలోని తన కన్సల్టింగ్ గది బయట దాదాపు 30 మంది మహిళలు తనని కలవడానికి వేచి ఉన్నారు. వాళ్లలో చాలా మంది కేవలం మహిళా వైద్యురాలే తమని పరీక్షించాలని మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆ ఆస్పత్రిలో ఇద్దరున్నారు, డా.షబ్నమ్ యాస్మిన్ మరియు డా.పూనమ్ (తను తన మొదటి పేరు మాత్రమే వాడుతుంది), ఆ ఇద్దరూ ప్రసూతి మరియు గైనకాలజీకి చెందిన వారు. ఆ డాక్టర్లు ఇద్దరూ రోజుకి 40-45 కేసులు చూస్తారు, అయినప్పటికీ రద్దీగా ఉండే ఆ వెయిటింగ్ హాల్ వల్ల కొందరు మహిళలు డాక్టర్ ని కలవకుండానే ఇంటికి తిరిగి వెళ్ళవలసి వస్తుంది.
ఆ వైద్యురాళ్లు ఇద్దరూపో వారానికి 48 గంటల పని చేస్తారు, కానీ చాలా వరకు అది కేవలం ఒక సంఖ్యగా మిగిలిపోతుంది. “సర్జన్లు అవసరం కంటే తక్కువగా ఉన్నారు, అందుకే మేము ఆపరేషన్లు చేస్తున్న రోజున నాకు ఒక లెక్క అనేది ఉండదు. లైంగిక దాడులు, రేప్ కేసులు ఉన్న రోజున నేను కోర్టుకి కూడా వెళ్ళాలి. రోజంతా దానికే పోతుంది. పాత రిపోర్టులు దాఖలు చేయాలి, అంతేగాక సర్జన్లుగా మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం,” అంటారు యాస్మిన్. కిషన్ గంజ్ జిల్లాలో 6-7 మహిళా డాక్టర్లు ఉన్నారని జిల్లాలో ఉన్న ఏడు పీహెచ్సీలు, ఒక నివేదన కేంద్రం, మరియు సదర్ ఆస్పత్రి అన్నిట్లో నేను మాట్లాడిన డాక్టర్లు అంచనా వేశారు. అందులో దాదాపు సగం మంది (యాస్మిన్ కాదు) కాంట్రాక్ట్ కింద చేస్తున్నారు.
వాళ్ళ పేషెంట్లు – అందులో చాలా మంది కిషన్ గంజ్ నుంచి, కొందరు పక్కనే ఉన్న ఆరారియా జిల్లా నుంచి, మరి కొందరు పశ్చిమ బెంగాల్ నుంచి కూడా- ముఖ్యంగా వచ్చేది సాధారణ గర్భానికి సంబంధించిన పరీక్షలు, ప్రసూతికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే కడుపు నొప్పి, కటి సమస్యలు, బాధాకరమైన ఋతుస్రావం, వంధ్యత్వం వంటి ఫిర్యాదులతో వస్తారు. “నేను చూసే మహిళల్లో చాలా మందికి, వాళ్ళు దేని గురించి వచ్చినా, రక్తహీనత ఉంటుంది. ఇనుము మాత్రలు ఉచితంగా లభిస్తాయి (పీహెచ్సీలలో ఆస్పత్రుల్లో), అయినా తమ ఆరోగ్యం పట్ల పూర్తిగా అవగాహన కానీ శ్రద్ధ కానీ వాళ్ళకి లేదు,” అని యాస్మిన్ చెప్తారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ( NFHS-4, 2015-16) డా.యాస్మిన్ పరిశీలనకు మద్దతు ఇచ్చే డేటాని ఇస్తుంది: కిషన్ గంజ్ జిల్లాలో 15 నుంచి 49 సంవత్సరాలు వయసు ఉన్న మహిళల్లో 67.6 శాతం మందికి రక్తహీనత సమస్య ఉంది. గర్భిణీ మహిళల్లో ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి 62 శాతానికి చేరింది. కేవలం 15.4 శాతం మంది గర్భవతులు 100 రోజుల పాటు ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు తీస్కున్నారు.
“ఒక మహిళ ఆరోగ్యం అంత ప్రధాన్యమైన విషయం కాదు. వాళ్ళు పోషకాహారం తినరు, త్వరగా పెళ్లిళ్లు జరిగిపోతాయి , వీరు మొదటి బిడ్డకి సంవత్సరం నిండక ముందే రెండోసారి గర్భం ధరిస్తారు. రెండో సంతానం సమయానికి తల్లి సరిగ్గా నడవలేనంత బలహీనంగా అవుతుంది. ఇలా ఒక కారణం తరవాత ఇంకోటి పెరిగి వాళ్ళందరికీ రక్తహీనత ఏర్పడుతుంది,” అని చెప్పారు 38 ఏళ్ల డా.అసియాన్ నూరి. సదర్ ఆస్పత్రికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేల్వా పీహెచ్సీ లో ఆవిడ నియమితులయ్యారు. కొన్నిసార్లు రెండో బిడ్డ ప్రసవం కోసం తల్లిని తీసుకొచ్చేటప్పటికే ఆలస్యమైపోయి, ఆమెను కాపాడలేకపోతారు.
“ఇప్పటికే మహిళా వైద్యుల కొరత ఉంది. ఒకవేళ మేము పేషెంట్లని హాజరు కాలేకపోయినా, లేదా ఒక పేషెంట్ చనిపోయినా, గొడవ అవుతుంది.” కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో పని చేసే నాటు వైద్యులు, అర్హత లేకుండా వైద్యం అందించే నిపుణుల సిండికేట్ కూడా తమని బెదిరిస్తారని చెప్పారు యాస్మిన్. “ ఆప్నే ఇన్హే చువా తో దేఖో క్యా హువా (మీరు పేషెంట్ ని ముట్టారు, దాంతో ఏం జరిగిందో చూడండి),” ప్రసవ సమయంలో మరణించిన ఒక గర్భవతి కుటుంబసభ్యులు యాస్మిన్ ని అన్నారు.
కిషన్ గంజ్ జిల్లాలో 33.6 శాతం ప్రసవాలు మాత్రమే సంస్థాగతంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుతున్నవని NFHS-4 పేర్కొంది. చాలా మటుకు పురుషులు పని కోసం నగరాల్లో నివసించడమే దీనికి పెద్ద కారణమని డా.నూరి అంటారు. “ ఇలాంటి సందర్భాల్లో, మహిళకి ప్రసవం కోసం కదిలి రావడం సాధ్యం కాదు, దాని వల్ల ఇంట్లోనే పిల్లల్ని ప్రసవిస్తుంది. ఆవిడ ఇంకా ఇతర వైద్యుల అంచనా ప్రకారం కిషన్ గంజ్ జిల్లాలోని మూడు బ్లాకుల్లో అత్యధిక ప్రసవాలు ఇళ్లలోనే జరుగుతాయి – పోతియా, డిఘల్బన్క్ మరియు తెరహగచ్ (వీటన్నింటిలో పీహెచ్సీలు ఉన్నాయి). ఈ బ్లాకుల నుంచి సద ర్ ఆస్పత్రికి గానీ ప్రైవేట్ క్లినిక్లకి గానీ త్వరగా చేరుకోవడానికి రవాణా కొరత, మరియు దారిలో చిన్న వాగులు మహిళలకు, వాళ్ళ కుటుంబాలకి ఆస్పత్రి చేరుకోవడానికి కష్టతరంగా అయ్యేలా చేస్తాయి.
2020 లో, మహమ్మారికి సంబంధిత లాక్డౌన్ మరియు దాని తదనంతర పర్యవసానాల వల్ల కిషన్ గంజ్ జిల్లాలో సంస్థాగత ప్రసవాలు మరింతగా తగ్గాయి. వాహనాల కదలికలపై ఆంక్షలు, ఆస్పత్రిలో వైరస్ సోకుతుందనే భయాలతో మహిళలు దూరంగా ఉండిపోయారు.
“తల్లిదండ్రులకి గర్భనిరోధకాల గురించి మేము వివరించడం (కుటుంబంలో ఉండే) పెద్దవారైన మహిళలకు నచ్చదు. నేను మాట్లాడటం మొదలు పెట్టగానే నా మీద అరుస్తారు, ఇంకా తల్లిని లేదా జంటని వెళ్లిపోమని చెప్తారు. అదంతా వినడం బాగా అనిపించదు...”
“కానీ ఇప్పుడు అది మెరుగు పడింది” అంటారు 36 ఏళ్ల డా.మంతసా. ఆమె కిషన్ గంజ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతియా బ్లాక్ లోని చతర్ గచ్ నివేదిక కేంద్రం/ ప్రసూతి మరియు శిశు సంక్షేమ కేంద్రంలో పని చేస్తున్నారు. తన కెరీర్ లో ప్రారంభ సంవత్సరాల్లో డా.యాస్మిన్ ఎదుర్కొన్న సవాళ్లే ఇప్పుడు తను కూడా ఎదుర్కొంటుంది – కుటుంబానికి దూరంగా ఉంటూ కఠినమైన ప్రయాణం చేయడం వంటివి కొన్ని. ఆమె భర్త భగల్పూర్ లో పని చేస్తూ నివసిస్తున్నారు, మరియు ఆమె ఒక్కగానొక్క కొడుకు కతిహర్ జిల్లాలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు.
“నా రోజులో ఎక్కువ భాగం మహిళలతో కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక పద్ధతులు, కాన్పుల మధ్య ఉండాల్సిన అంతరాలు ఇంకా ఆహారం గురించి మాట్లాడడానికి అయిపోతుంది” అంటారు డా.మంతసా (తను ఇంటి పేరుని మాత్రమే వాడుతుంది). గర్భనిరోధకాల గురించి సంభాషణ మొదలు పెట్టడం ఎంతో కష్టమైనది- కిషన్ గంజ్ లో ప్రస్తుతం ఉన్న వివాహిత మహిళల్లో 12.2 శాతం మాత్రమే ఏదైనా గర్భనిరోధక సాధనం వాడారని, ఎలాంటి సాధనాలు వాడని మహిళలతో కేవలం 8.6 శాతం మందితో మాత్రమే ఆరోగ్య కార్యకర్త కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడారని NFHS-4 పేర్కొంది.
“తల్లిదండ్రులకి గర్భనిరోధకాల గురించి మేము వివరించడం (కుటుంబంలో ఉండే) పెద్ద వారైన మహిళలకు నచ్చదు. నేను మాట్లాడటం మొదలు పెట్టగానే నా మీద అరుస్తారు, ఇంకా తల్లిని లేదా జంటని వెళ్లిపోమని చెప్తారు (క్లినిక్ కి వాళ్ళతో పాటు వచ్చే పెద్దవయస్కులైన మహిళలు). కొన్నిసార్లు నేను గ్రామాల్లో ఉన్నప్పుడు నన్ను కూడా వెళ్ళిపొమ్మని అంటారు. అదంతా వినడం బాగా అనిపించదు, కానీ మేము చేయాల్సిన పని అయితే మేము చేయాలి,” అంటారు డా.మంతసా. ఆమె కూడా డా.యాస్మిన్ లాగే కుటుంబంలో మొదటి డాక్టర్.
“నా దివంగత తండ్రి, సయ్యద్ కుతుబద్దీన్ అహ్మద్, ముజఫ్ఫర్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పారామెడికల్ సిబ్బందిలో పని చేసేవారు. మహిళా డాక్టర్లు ఉంటే ఆడవాళ్లు వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి వస్తారని ఆయన అనేవారు. అందుకే నేను డాక్టర్ని అయ్యాను,” డా.యాస్మిన్ అన్నారు, “ఇంకా చాలామంది మాకు ఇక్కడ అవసరం.”
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే zahra@ruralindiaonline.org కు మెయిల్ చేసి namita@ruralindiaonline.org కు కాపీ పెట్టండి.
అనువాదం: దీప్తి సిర్ల