ఎ బగ్స్ లైఫ్ సినిమాకి వచ్చిన సీక్వెల్ లాగా ఉందది. ఈ హాలీవుడ్ సినిమాలో, ఫ్లిక్ అనే చీమ బలమైన సైనికులను తన సైన్యంలో చేర్చుకుని అక్కడ దుష్టులు - దాడిచేసే గొల్లభామల పై యుద్ధం సాగిస్తుంది.
భారత దేశంలోని ఈ నిజ జీవిత అంకంలో, కోట్లాను కోట్ల జాతులలో 1.3 బిలియన్ మాత్రమే మనుషుల జాతి ఉంది. దాడి చేసే చిన్న ముక్కు గొల్లభామలు లేదా మిడతలు, ఈ ఏడాది మేలో మిలియన్ల కొద్దీ ఈదుకుంటూ వచ్చాయి. ఇవి పంటకొచ్చిన పావు మిలియన్ ఎకరాల పొలాలని ధ్వంసం చేశాయి. ఈ పొలాలు బీహార్, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నాయని దేశ వ్యవసాయ కమీషనర్ చెప్పారు.
గాలిలో పుట్టే ఈ దాడికర్తలకు దేశ సరిహద్దుల గురించి మతింపు ఉండదు. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) ప్రకారం, మిడతలు 30 దేశాలలో, 16 మిలియాన్ చదరపు కిలోమీటర్ల పాటు పశ్చిమ ఆఫ్రికా నుండి ఇండియా వరకు వ్యాపించి ఉన్నాయి. ఒక చదరపు కిలోమీటరులో 40 మిల్లియన్ల ఉండే చిన్న మిడతల సమూహం - 35000 మంది మనుషులు, 20 ఒంటెలు, ఆరు ఏనుగుల ఒక్క రోజు ఆహారాన్ని తినెయ్యగలవు.
జాతీయ మిడతల హెచ్చరిక సంస్థ రక్షణ, దాని సభ్యులను- వ్యవసాయం, హోం వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌర విమానయానం, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖల నుండి చేర్చుకోవడంలో ఆశ్చర్యం లేదు.
అయితే, ఈ లక్షలాది కీటకాలు, సున్నితమైన సమతుల్యత ప్రమాదంలో పడటం వలన జరిగే పరిణామాలలో మిడతలు మాత్రమే విలన్‌లు కాదు. భారతదేశంలో, కీటక శాస్త్రవేత్తలు, ఆదివాసీలు, ఇతర రైతులు ఈ ‘దుష్టుల’ పేర్లను వరుసగా చెబుతున్నారు. ఇవి ఒకటి , రెండు కాదు, మనకు అసలు ఎన్నో తెలియని జాతులు కూడా ఇందులో ఉన్నాయి. ఆహార ఉత్పత్తికి అనుకూలమైన 'ప్రయోజనకరమైన తెగుళ్లు', అంటే ఇక్కడ ‘మంచివారు’- వాతావరణం మారుతున్నప్పుడు వారి నివాసాలలో ఇబ్బంది వచ్చి ‘దుష్టులు’ కూడా కావచ్చు.
ఒక డజను చీమల జాతులు ప్రమాదకర తెగుళ్లుగా మారిపోయాయి, గోల చేసే కీచురాళ్లు, కొత్త ప్రదేశాల పై దాడి చేస్తున్నాయి, దట్టమైన అడవుల నుండి పదునైన నోర్లుగల చెదలు వచ్చి ఆరోగ్యకరమైన చెక్కను పాడుచేస్తున్నాయి, తేనెటీగల సంఖ్య తగ్గిపోయింది, తూనీగలు కాలం కాని కాలంలో కనిపిస్తున్నాయి, అన్ని జీవులకూ ఆహార భద్రత కొరవడిపోతోంది. సున్నితమైన ఎరుపు-రొమ్ము జెజెబెల్ సీతాకోకచిలుకలు కూడా తూర్పు నుండి పశ్చిమ హిమాలయాల వరకు తేలుతూ అల్లాడుతున్నాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడున్న 'మంచి వారైన’ స్థానిక జాతుల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. భారతదేశమంతా - యుద్ధభూములు, పోరాట యోధులతో నిండిపోయింది.
మధ్య భారతదేశంలో స్థానిక కీటకాలు తగ్గిపోవడం వలన తేనె తీగలు కూడా తగ్గిపోతున్నాయి. “ఒకప్పుడు మేము వందల కొద్దీ కొండ ఉపరితలం పై తేనెతుట్టెలను చూసేవాళ్ళము. ఈ రోజుల్లో అవి కనిపించడమే కష్టంగా ఉంది,” అన్నారు మధ్య ప్రదేశ్లోని చించివాడ జిల్లాకు చెందిన భరియా ఆదివాసి బ్రీజ్ కిషన్ భారతి.
శ్రిజూఠీ గ్రామంలో అతనితో పాటు మరికొందరు దగ్గరలోని కొండల పైన తేనెపట్టు కోసం ఎక్కి, తేనెపట్టుని పడతారు. వీరంతా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందినవారు. వీరున్న చోటుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమియా బ్లాక్ హెడ్ క్వార్టర్ వద్ద జరిగే వారపు సంతలో పట్టిన తేనెని అమ్ముతారు. వీరు, ఏడాదిలో రెండు సార్లు ఈ వేటలో ఉంటారు(నవంబర్ - డిసెంబరు, మే - జూన్) ఆ సమయాలలో చాలా కాలం బయటే తిరుగుతారు.
తేనె ఖరీదు 60 రూపాయిల నుండి 400 రూపాయలకు పెరిగింది, కానీ “మాకు 25-30 క్వింటాల్ల తేనె దొరికేది కానీ ఇప్పుడు 10 కిలోలకన్నా ఎక్కువ దొరకడమే గగనమైపోయింది. అడవిలో ఉండే నేరేడు, బెహెర , మామిడి, సాల్ చెట్లు తగ్గిపోయాయి. తక్కువ చెట్లున్నాయి అంటే తక్కువ పూవులున్నాయి అని అర్థం, అంటే తేనెటీగలు, ఇతర కీటకాలకు ఆహారం సరిపడా లేదని అర్థం.” అంతేగాక, తేనెపట్టేవారికి తక్కువ ఆదాయం అని కూడా అర్థం.
పూవులు తగ్గిపోవడం మాత్రమే ఆందోళన చెందే విషయం కాదు. “మేము ఫెనెలొజికల్ ఎసిన్క్రోనీ(Phenological Asynchrony)ని చూస్తున్నాము. అంటే పూసే పూవులకు, పెరిగే కీటకాలలకు మధ్య అసమతుల్యతను చూస్తున్నాం,” అన్నారు బెంగుళూరు లోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ కు చెందిన డా. జయశ్రీ రత్నం. సమశీతోష్ణ మండలాలలో వసంతం, త్వరగా రావడం వలన చాలా మొక్కలు ముందే పూవులు పూయడం మొదలు పెట్టాయి, కానీ పరాగ సంపర్కం చేసే కీటకాలు మాత్రం అంత త్వరగా రావడం లేదు. దీని అర్థం కీటకాలకు అవసరమైన ఆహరం అవసరమైన సమయాలలో లభించడం లేదు. ఇవన్నీ వాతావరణ మార్పులతో అనుసంధానించి చూడవచ్చు.”
డా రత్నం చెప్పినట్లుగా మనకు, ఆహార భద్రతకు ప్రత్యక్ష సంబంధం ఉంది. మనుషులకు బొచ్చు ఉన్న జంతువులపై ప్రేమ పుట్టినట్లుగా, కీటకాలపై ప్రేమ పుట్టదు.
*****
“నా జామ చెట్టు మీదే కాదు, ఉసిరి, మహువా చెట్టు మీద కూడా చాలా తక్కువ పళ్ళున్నాయి. ఆచార్ (లేదా చిరాన్జీ ) చెట్టు చాలా ఏళ్లుగా కాయలు కాయలేదు,” అని హోషంగాబాద్ జిల్లాలో కతియదాన కుగ్రామానికి చెందిన 52 ఏళ్ళ రంజిత్ సింగ్ మార్షికోలే చెప్పారు. ఈ గోండు ఆదివాసి రైతు పిపరియా తెహసిల్ లో మత్కులి గ్రామంలో వారి కుటుంబానికి ఉన్న 9 ఎకరాల భూమిలో గోధుమ, శనగలను సాగుచేస్తాడు.
“తేనెటీగలు తక్కువైతే, పూవులు, పండ్లు కూడా తక్కువైపోతాయి”, అన్నాడు రంజిత్ సింగ్.
మన ఆహార భద్రత- చీమలు, తేనెటీగలు, ఈగలు, కందిరీగలు, మాత్‌లు, సీతాకోకచిలుకలు, రెక్కల పురుగులు - ఇలా పరాగసంపర్కంలో సహాయపడే ఇతర స్థానిక కీటకాల రెక్కలు, పాదాలు, పిన్సర్‌లు, యాంటెన్నాలపైనే ఆధారపడి ఉంటుంది. FAO బులెటిన్ మనకు చెబుతున్నట్లుగా, ప్రపంచవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ జాతుల అడవి తేనెటీగలు ఉన్నాయి, ఇంకా అనేక ఇతర జాతులు - పక్షులు, గబ్బిలాలు, ఇతర జంతువులు - పరాగసంపర్కానికి దోహదం చేస్తాయి. అన్ని ఆహార పంటలలో 75 శాతం, అన్ని అడవి మొక్కలలో 90 శాతం పరాగసంపర్కం పై ఆధారపడి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దీని ద్వారా ప్రభావితమైన పంటల వార్షిక విలువ $235 నుండి $577 బిలియన్ల మధ్య ఉంటుంది.
మన ఆహార భద్రత- చీమలు, తేనెటీగలు, ఈగలు, కందిరీగలు, మాత్‌లు, సీతాకోకచిలుకలు, రెక్కల పురుగులు- ఇలా పరాగసంపర్కంలో సహాయపడే ఇతర స్థానిక కీటకాల రెక్కలు, పాదాలు, పిన్సర్‌లు, యాంటెన్నాలపైనే ఆధారపడి ఉంటుంది
కీటకాలు ఆహారపరంగా సంపర్క ప్రక్రియలో గొప్ప పాత్రను పోషించడమే గాక, అడవులను కూడా కాపాడుతాయి. అవి చెక్కని, చనిపోయిన జీవులను జీర్ణించుకోవడమే కాక, నేలమీది మట్టిని తోడడం, విత్తనాలను ఒక చోట నుండి మరొక చోటకు రవాణా చేయడం వంటి పనులు కూడా చేస్తాయి. భారతదేశంలో అడవుల పక్కగా బ్రతికే 1,70,000 గ్రామాలలో ఆదివాసీలు ఇంకా ఇతరులెందరో, వంట చెరకును, చెక్క కాని(Non Timber) అడవి ఉత్పత్తిని సేకరించి వాడుకోవడమో, లేక అమ్మడమో చేస్తారు. అంతేగాక, దేశంలో 536 మిలియన్ల పాడి పశువుల్ని మేపడానికి అడవులే చాలా వరకు ఆధారం.
“అడవి చనిపోతోంది,” అని విజయ్ సింగ్ అన్నాడు. అతను ఒక చెట్టు నీడలో కూర్చుని ఉన్నాడు. అతని గేదెలు అక్కడే మేస్తున్నాయి. ఈ 70 ఏళ్ళ గోండు రైతుకు ఇక్కడ పిపరియా తెహసిల్ లోని సింగనమా గ్రామంలో 30 ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు అందులో శనగలు, గోధుమ సాగుచేసేవాడు. కొన్నేళ్లుగా అతను తన భూమిని సాగుచేయకుండా వదిలి వేశాడు. “వర్షం వచ్చిందంటే చాలా గట్టిగా పడి వెంటనే ఆగిపోతుంది లేదా భూమిని అసలు తడపదు.” అతను కీటకాలు పడే బాధను కూడా గుర్తించాడు. “నీళ్లు లేవు, చీమలు గూళ్ళు ఎలా పెట్టుకుంటాయి?”
పిపరియా తెహసిల్ లో పచ్చమడి కాంటోన్మెంట్ ప్రదేశంలో, 45 ఏళ్ళ నందులాల్ ధుర్బే మాకు ఒక బామి (చీమ, చెదల పుట్టలు) చూపించాడు. భూమి ఉపరితలం కాస్త పైకి లేచి వృత్తాకారంలో ఉన్న బామి తయారుకావాలంటే మెత్తని మట్టి, చల్లని తేమ ఉండాలి. కానీ మనకు ధారాపాతంగా వర్షం రావట్లేదు, పైగా ఇక్కడ వేడిగా ఉంటోంది, అందుకని ఇవి చాలావరకు కనిపించడం లేదు.
“ఈ రోజుల్లో అకాల వర్షల వలన, చలి వలన పూవులు వాడిపోయి చనిపోతున్నాయి. ఈ వర్షాలు లేదా చలి కూడా అయితే ఎక్కువ లేక పొతే అసలు లేకపోవడం జరుగుతుంది. అందుకని పండ్ల చెట్లు తక్కువ ఫలాలను ఇస్తున్నాయి, కీటకాలకు తక్కువ ఆహారం లభిస్తుంది.” అన్నారు ధృబే. ఈయన గోండ్ ఆదివాసీ. తోటమాలి అయిన ఈయనకి తన ప్రాంతంలోని జీవావరణ శాస్త్రం పై మంచి అవగాహన ఉంది.
సాత్పురా పరిధిలో 1,100 మీటర్ల ఎత్తు పైన ఉన్న పచ్చమడి, యునెస్కో బియోస్పియర్ నేషనల్ పార్కులు, టైగర్ శాంక్చుయరీలు ఉన్న ప్రదేశం. ప్రతి ఏడాది, ఈ మధ్యభారత కొండ ప్రాంతానికి, మైదానాల పై ఉన్నవారు అక్కడి వేడిని తట్టుకోలేక, గుంపులుగా వస్తారు. ధుర్బేయ్, విజయ్ సింగ్ మాత్రమే ఇక్కడ పెరుగుతున్న వేడిని గమనిస్తారు. వీరి అభిప్రాయాన్ని ధృవీకరించే సంగతులు కూడా ఉన్నాయి.
న్యూయార్క్ టైమ్స్ యొక్క గ్లోబల్ వార్మింగ్ పై ఇంటరాక్టివ్ పోర్టల్ నుండి వచ్చిన డేటా ప్రకారం, 1960లో, పిపారియాలో సంవత్సరంలో ఉష్ణోగ్రతలు 157 రోజులకు 32 డిగ్రీల సెల్సియస్‌ను తాకడమో లేక దాటడమో జరిగింది. కానీ నేటికీ, సంవత్సరంలో 201 రోజులు అంతకన్నా ఎక్కువ వేడిగా ఉంది.
రైతులు ఇంకా శాస్త్రవేత్తలు గమనించిన మార్పులు జాతులు నష్టపోవడానికి లేక అంతరించిపోవడానికి దారితీస్తున్నాయి. ఒక FAO నివేదిక హెచ్చరించినట్లుగా: "ప్రస్తుతం మానవ ప్రభావాల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా జాతుల అంతరించిపోయే అవకాశాలు, సాధారణం కంటే 100 నుండి 1,000 రెట్లు ఎక్కువగా ఉన్నాయి."
*****
“ఈ రోజు నా వద్ద అమ్మటానికి చీమలు లేవు,” అని ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో చోటిదొంగర్ వారపు సంతలో ఉన్న మునిబాయి కాచులాన్ అన్నది. ఈమె ఒక గోండు ఆదివాసి,. ఆమె 50లలో ఉంది. మున్ని చిన్నప్పటి నుంచి, బస్తర్ అడవులలో గడ్డిని, చీమలని పోగుచేసి సంతలో అమ్మేది. ఆమె భర్త చనిపోయాడు, నలుగురు కూతుర్లు ఉన్నారు. ఆమె రైతు కూడా. వారి కుటుంబం, 9 కిలోమీటర్ల దూరంలో, రోహ్తాడ్ గ్రామంలో తమకు ఉన్న రెండు ఎకరాల భూమిలో సాగుచేసి వారి ఆహారాన్ని పండించుకుంటున్నారు.
ఆమె ఆ బజారులో 50-60 రూపాయిలు సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ డబ్బు ఆమె తన మిగిలిన అవసరాలకు వాడుకుంటుంది. ఆమె చీపురు కట్టలకు కావలసిన గడ్డిని, చీమలను, కొన్నిసార్లు కొద్ది కిలోల బియ్యాన్ని అమ్ముతుంది. ఈ చిన్న మోతాదులోని చీమలకు ఆమెకు 20 రూపాయిలు గనక వస్తే అది మంచి గిరాకీ అని నమ్ముతుంది. కానీ ఈ రోజు ఆమె వద్ద చీమలు లేవు, ఒక్క చిన్న గడ్డి మోపు మాత్రమే ఉంది.
“మేము హలైంగి (ఎర్ర చీమలు)లను తింటాము,” అన్నది మున్ని. “ఒకానొక సమయంలో మేము ఆడవాళ్ళమే వీటిని అడవిలో తేలికగా సేకరించగలిగేవారము. కానీ ఇప్పుడు ఈ చీమలు చాలా కొద్దిగా, అవి కూడా పొడుగాటి చెట్ల పైన ఉంటున్నాయి. వాటిని సేకరించడం కష్టమవుతోంది. మగవారు ఆ చీమలను పట్టుకోవడానికి వెళ్లి, దెబ్బలు తగిలించుకుంటారని భయం వేస్తుంది.”
భారత దేశంలోని కీటకాలకు అంతం వచ్చేసింది. “కీటకాలు పునాది జాతి. అవి మాయమైపోతే, ఈ వ్యవస్థ కూలిపోతుంది,” అన్నాడు డా. సంజయ్ సానే. ఈయన NCBSలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అతను వైల్డ్ లైఫ్ ఫీల్డ్ స్టేషన్లలో, రెండు హాక్ మాత్ గమనింపు పరిశోధనలు చేస్తున్నాడు. ఒకటి మధ్యప్రదేశ్ లోని పచ్చమడి అడవిలో, ఇంకోటి కర్ణాటకలోని అగుంబేలో. “వృక్ష సంపదలో మార్పులు, వ్యవసాయ పద్ధతులు, ఉష్ణోగ్రతలు ఇవన్నీ కీటక జాతిలో తగ్గింపుని చూపిస్తున్నాయి. ఇవన్నీ అంతరించి పోతున్నాయి.”
“కీటకాలు ఉష్ణోగ్రతలో కొద్ది మార్పులను మాత్రమే తట్టుకోగలవు”, అన్నాడు దయా కైలాష్ చంద్ర, డైరెక్టర్, జూలోజికల్ సర్వే అఫ్ ఇండియా. “పర్యావరణ వ్యవస్థను శాశ్వతంగా అసమతుల్యం చేయడానికి వాతావరణ ఉష్ణోగ్రతలో 0.5 డిగ్రీ సెల్సియస్ ల తేడా చాలు. గత మూడు దశాబ్దాలలో, ఈ కీటక శాస్త్రవేత్త బీటిల్స్‌లో 70 శాతం క్షీణతను నమోదు చేశారు, సీతాకోకచిలుకలు, తూనీగలతో పాటు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్ట్ లో ఇవి 'బెదిరింపులు'గా గుర్తించబడ్డాయి. "మన నేల ఇంకా నీటిలోకి ప్రవేశించిన పురుగుమందుల విస్తృత వినియోగం స్థానిక కీటకాలు, జల కీటకాలు, ప్రత్యేక జాతులను నాశనం చేసింది, ఇది మన కీటకాల జీవనవైవిధ్యాన్ని నాశనం చేసింది" అని డాక్టర్ చంద్ర చెప్పారు.
"పాత తెగుళ్లు మాయమయ్యాయి, మేము కొత్త వాటిని చూస్తున్నాము," అని మావాసీ కమ్యూనిటీకి చెందిన ఆదివాసీ రైతు లోటన్ రాజ్‌భోపా, 35, MP యొక్క తామియా తహసీల్‌లోని ఘటియా కుగ్రామంలో మాకు చెప్పారు. “ఇవి పెద్ద సంఖ్యలో వస్తాయి, మొత్తం పంటను నాశనం చేస్తాయి. మేము వారికి ఒక పేరు కూడా పెట్టాము - ' భిన్ భిని ' [అనేక]," అతను చిలిపిగా నవ్వాడు. "ఈ కొత్తవి మహా చెడ్డవి, పురుగుమందు వేస్తే అవి ఇంకా పెరిగిపోతాయి."
ఉత్తరాఖండ్‌లోని భీమ్‌తాల్‌లోని సీతాకోకచిలుక పరిశోధనా కేంద్ర వ్యవస్థాపకుడు, 55 ఏళ్ళ పీటర్ స్మెటాసెక్, చాలా కాలంగా, గ్లోబల్ వార్మింగ్ వలన హిమాలయాల శ్రేణిలోని పశ్చిమ భాగంలో తేమ, ఉష్ణోగ్రత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి పొడిగా, చల్లగా ఉండే శీతాకాలాలు ఇప్పుడు వెచ్చగా, తేమగా ఉన్నాయి. కాబట్టి వెచ్చదనం, తేమ కూడిన తూర్పు హిమాలయ వాతావరణంలో ఉండే సీతాకోక చిలుకల జాతులు, పశ్చిమ హిమాలయ సీతాకోకచిలుకల రాజ్యంలో మనుగడకు అనుమతి పొందుతాయి.
భారతదేశం భూమిపై 2.4 శాతంతో జీవవైవిధ్యానికి ప్రధాన కేంద్రంగా ఉన్నాగాని, ఉన్న జాతులలో 7 నుండి 8 శాతం వరకు అక్కడే ఉన్నాయి. డిసెంబర్ 2019 నాటికి, భారతదేశంలో క్రిమి జాతుల సంఖ్య 65,466 అని ZSI యొక్క డాక్టర్ చంద్ర చెప్పారు. అయితే, “ఇది సాంప్రదాయిక అంచనా. సంభావ్య సంఖ్య కనీసం 4 నుండి 5 రెట్లు ఎక్కువ. కానీ చాలా జాతులు నమోదు చేయబడక ముందే అంతరించిపోతాయి.”
*****
"వాతావరణ మార్పులతో కూడిన అటవీ నిర్మూలన, అడవులు చెదిరిపోవడం, చెదిరిన ఛిన్నాభిన్నమవుతున్న ఆవాసాలకు దారితీస్తోంది" అని భారతదేశపు 'యాంట్ మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన పంజాబీ విశ్వవిద్యాలయం, పాటియాలాలో పరిణామ జీవశాస్త్రవేత్త డాక్టర్ హిమేందర్ భారతి చెప్పారు. "ఇతర సకశేరుకాలతో(Vertebrates) పోలిస్తే చీమలు ఒత్తిడికి చాలా సూక్ష్మ స్థాయిలో ప్రతిస్పందిస్తాయి. ఇవి ప్రకృతి ఎలా చెదిరిపోయిందో, జాతుల వైవిధ్యమెలా ఉందో అంచనా వేయడానికి బాగా ఉపయోగించబడతాయి."
విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రం మరియు పర్యావరణ శాస్త్రాల విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ భారతి భారతదేశంలోని 828 చీమల జాతులు, ఉపజాతుల మొదటి చెక్‌లిస్ట్ ను సంకలనం చేసిన ఘనత పొందారు. "ఆక్రమణ జాతులు"త్వరగా కొత్త స్థానానికి అనుకూలంగా మారిపోతాయి, స్థానిక జాతులను స్థానభ్రంశం చేస్తాయి. కాబట్టి అవి ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుంటాయి.” అని ఆయన హెచ్చరించారు.
పార్వతి బాయికి దుష్టులే గెలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె 50 ఏళ్ల వయసులో ఉన్న ఒక మావాసీ గిరిజనురాలు. హోషంగాబాద్ జిల్లాలోని పగారా అనే తన గ్రామంలో నివసిస్తున్న ఈమె ఇలా చెప్పింది, “మాకు ఇప్పుడు ఈ ‘ఫుండి కీడ’ [చాలా సన్నగా, చిన్నగా ఉండే తెగుళ్లు] వస్తున్నాయి. గత సంవత్సరం ఇవి నా ఎకరంలోని చాలా వరి పంటను తిన్నాయి. ఆ కాలంలో ఆమెకు దాదాపు 9,000 రూపాయల నష్టం వాటిల్లిందని ఆమె అంచనా వేసింది.
పార్వతీ బాయికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో, దక్షిణాన నీలగిరి పర్వత శ్రేణిలో, వృక్షశాస్త్రజ్ఞురాలు, నీలగిరిలోని కీస్టోన్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్. అనితా వర్గీస్ ఇలా చెప్పారు: "మార్పులను ముందుగా స్థానిక సమాజాలే గమనిస్తాయి. కేరళలోని తేనె వేటగాళ్ళు, అపిస్ సెరానా తేనెటీగలు నేల కంటే ఎక్కువ చెట్ల కుహరం గూళ్ళకు మారినట్లు గమనించారు. ఎలుగుబంట్ల దాడి పెరగడం, నేల పై ఉష్ణోగ్రత పెరగడం కూడా దీనికి కారణమని వారు పేర్కొన్నారు. సాంప్రదాయ జ్ఞానం ఉన్న సంఘాలు, శాస్త్రవేత్తలు పరస్పరం మాట్లాడుకునే ఒక మార్గాన్ని ఏర్పరచాలి.”
అలాగే నీలిగిరిలో, కట్టునాయకన్ ఆదివాసీ వర్గానికి చెందిన 62 ఏళ్ల కంచి కోయిల్ తన చిన్ననాటి రాత్రులను వెలిగించిన మిణుగురుల( కోలియోప్టెరా ) గురించి ఆనందంగా మాట్లాడింది. “ మిన్మిని పూచి (మిణుగురులు) చెట్టు మీద రథం లాగా ఉండేవి. నా చిన్నతనంలో, అవి పెద్ద సంఖ్యలో వచ్చేవి, వాటితో చెట్లు చాలా అందంగా కనిపించేవి. కానీ అవి ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. ”
తిరిగి వస్తే, ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలోని జబర్రా అడవిలో, గోండ్ రైతు, 50 ఏళ్ల విశాల్ రామ్ మార్ఖం, అడవుల మరణాన్ని గురించి ఇలా చెప్పాడు: “భూమి, అడవి ఇప్పుడు మనిషి పరమైపోయాయి. మనం మంటలను వెలిగిస్తాము, పొలాల్లో, నీటిలో DAP [డైమోనియం ఫాస్ఫేట్] చల్లుతాము. నేను ప్రతి సంవత్సరం నా పశువులమందలో 7 నుండి 10 పెద్ద జంతువులను, విషపూరితమైన నీటి వలన పొగొట్టుకుంటున్నాను. చేపలు, పక్షులే జీవించలేకపోతున్నాయి, ఇక చిన్న కీటకాలు ఎంత?
ముఖచిత్రం: యశ్వంత్ హెచ్.ఎం.
రచయితా ఈ కథనాన్ని నివేదించడంలో తమ అమూల్యమైన సహాయం, మద్దతు ఇచ్చిన రిపోర్టర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, రాజేంద్ర కుమార్ మహావీర్, అనుప్ ప్రకాష్, డా. సవితా చిబ్, భరత్ మేరుగుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎంత ఉదారతతో ఆమె ఆలోచనలను పంచుకున్న ఫోరెన్సిక్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ మీనాక్షి భారతికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే zahra@ruralindiaonline.org కి ఈమెయిల్ చేసి అందులో namita@ruralindiaonline.org కి కాపీ చేయండి.
అనువాదం: అపర్ణ తోట