ఇందులో ఇద్దరున్నారు, అని రోపి ప్రైవేట్ మెటర్నిటీ క్లినిక్ లో డాక్టర్ కి చాలా విశ్వాసంగా చెప్పింది. ఆమె వద్ద అల్ట్రా సౌండ్ రిపోర్ట్ కూడా లేదు.
రోపి మన్ను బేటే రెండేళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని చాలా ఆనందంగా, కాస్త గొప్పగా చెప్పింది. “కాన్ మే వో లాగాయా(చెవుల్లో అవి పెట్టుకుంది)”, డాక్టర్ స్టెతస్కోప్ ఎలా వాడిందో అనుకరించి చూపిస్తూ చెప్పింది. నీరసంగా ఉన్న ఆ గర్భవతి మధ్యస్తంగా ఉన్న పొట్టను చూసి, చివరగా కాదని చెప్పింది ఆ డాక్టరు.
“ మేడం, దో హోతా, దో (రెండు మేడం, రెండు ఉన్నాయి),” ఆమె వెనక్కి వెళ్లి ఆ క్లినిక్ లోని ప్రసూతి గదిలో స్టూల్ మీద కూర్చోబోతూ మళ్లీ అన్నది. ఈశాన్య మహారాష్ట్రలోని మెల్‌ఘాట్ అడవుల అంచున ఉన్నవారి గ్రామమైన జైతదేహికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరాట్వాడా పట్టణంలో70 పైబడిన రోపి, ప్రసూతి నొప్పులు అనుభవిస్తూ తల్లి కాబోతున్న ఆ యువతి పక్కనే ఉంది
సాయంత్రానికి ఒక బాబు పుట్టాడు, ఇంకొన్ని సెకండ్ల తరవాత రెండవ శిశువు తల బయటకు వచ్చింది. ఈసారి ఒక పాప, బాబుకి కవల చెల్లెలు.
రోపి గట్టిగా నవ్వి, ఆ వరండాకి ఒక చివర ఉన్న పరుపు లేని చెక్క మంచం మీద కూర్చుంది. నేలంతా ఆవు పేడతో అలికి, సంప్రదాయపు మట్టి గోడలున్న ఇంటిలో, ఆమె ఉంది. లోపల, చెక్క బద్దల కప్పు ఉన్న మిగిలిన మూడు గదులు ఖాళీగా ఉన్నాయి. ఆమె కొడుకులు వారికున్న 2 ఎకరాల నేలను సాగుచేయడానికి వెళ్లారు.
ఆమె కొరుకు భాషలో ఒక తిట్టుని తిట్టింది- గాడిద గుప్తావయవాలు దాన్ని అచ్చమైన అర్ధం. ఆ తిట్టుని మళ్ళీ తిట్టి మళ్ళీ నవ్వింది. ఆమె మొఖం పై ముడతలు మరింత లోతుకు సాగినాయి. “నేను ఆమెకి అదే చెప్పాను”, ఆ సిటీ డాక్టర్ ని జ్ఞాపకం చేసుకుని లోపల తిట్టుకుంది.
ఆ విశ్వాసం ఆమెకు దశాబ్దాల అనుభవంతో వచ్చింది. కొరుకు వర్గానికి చెందిన రోపి, జైతదేహిలో చివరగా మిగిలిన ఒకే ఒక్క దాయి . ఆమె కనీసం 500-600 శిశువులకు కాన్పు చేశానని చెబుతుంది. ఆమె లెక్క పెట్టుకోలేదు. దాయి గా పనిచేసిన ఇన్ని దశాబ్దాలలో ఒక్కసారి కూడా మరణించిన శిశువును కాన్పు చేయలేదని ఆమె గర్వంగా చెబుతుంది. “ సబ్ చోక (అందరూ బావున్నారు)”. దాయిలు సాంప్రదాయక కాన్పు అటెండెంట్లు (Traditional Birth Attendants - TBAs). వీరు మంత్రసానులుగా పనిచేస్తారు. కాని వీరికి ఆధునిక శిక్షణ కానీ సర్టిఫికేషన్ గాని లేదు.
మెల్ఘాట్ అడవిలో ఉండే కొరుకు అటవిజాతివారికి, మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో, అమరావతి జిల్లాలో ధరణి, చికాల్దారా గ్రామాలలో, రోపి వంటి మహిళలు ఇంట్లో కాన్పులు చేసే సాంప్రదాయక పని కన్నా ఎక్కువ పనే చేస్తారు. అనుభవం ఉన్న మంత్రసానులుగా వారు ఆ మారోమూల అడివిలో కుగ్రామాలలో తక్షణ వైద్య సదుపాయం లేని ప్రదేశాలలో నివసిస్తున్న గర్భవతులకు సేవలను అందిస్తారు.
మెల్ఘాట్ లోని చాలా గ్రామాలలో ఒకరిద్దరు దాయి లున్నారు, కానీ వారిప్పుడు పెద్దవారైపోయారు అన్నది రోపి. ఆ తరవాత తరం TBAలు ఇంకా రాలేదు. జైతదేహిలో ఉన్న మరోక దాయి కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది. తన కూతురికో కోడలికో తన నైపుణ్యాన్ని నేర్పి ఉండవలసింది కానీ రోపి కుటుంబంలో ఆమె తరవాత మరో దాయి ఇప్పటిదాకా రాలేదు.
రోపి స్వంత పిల్లలు, రోపి తల్లి, మరో దాయి సహాయంతో ఇంట్లోనే పుట్టారు. ఆమెకు నలుగురు కొడుకులు, అందులో ఒకరు పదేళ్ల క్రితం జబ్బు చేసి చనిపోయారు. ఆమెకు ఇద్దరు కూతుర్లున్నారు, వారు జైతదేహిలోనే పెళ్ళిచేసుకుని అదే గ్రామంలో ఉంటున్నారు. ఆమెకు బోల్డంత మంది మనవలు, మునిమనవలున్నారు.(ఆమె కూతుర్లు ఈ పని చేయడానికి ఇష్టపడలేదు, ఒక కూతురు మాత్రం కొంత పని నేర్చుకుంది అని రోపి చెప్పింది)
“నా కోడలు చాలా భయపడుతుంది. ఆమె గదిలో ఇంకో ఆడామె ప్రసవిస్తుంటే అక్కడ ఉండనే ఉండదు. నేను పనిచేస్తుంటే వచ్చి చూడడు, కుట్లు వేయడానికి దారం ఇవ్వదు, బట్ట అందించి ఇవ్వదు. ఐసా కాప్నే లగ్తా హై( ఆమె ఇలా వణికిపోతోంది)”. ఆ యువతి రక్తం చూసి భయపడడాన్ని అనుకరిస్తూ అన్నది.
పాత తరం ఆడవారు వారి శారీరక చర్యలను గురించి భయపడేవారు కాదు అని రూపీ గుర్తుకు తెచ్చుకుంది. “మాకు మరో దారి లేదు. మేము ధైర్యంగా ఉండవలసి వచ్చేది. ప్రతి చిన్న విషయానికి పరిగెత్తేందుకు మాకు డాక్టర్లు, నర్సులు ఉండేవారు కాదు.”
ఆమె అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ దాయి లే, ఆమె కాన్పులు చేయడానికే తన అమ్మమ్మతో పాటు సహాయంగా వెళ్ళింది. కానీ రోపి వాళ్ళ అమ్మ మాత్రం బడికి వెళ్ళని తన కూతురుని ఎప్పుడూ కాన్పులు చేసే సమయాలలో తనతో తీసుకు వెళ్ళేది కాదు. “ బకెయ్ హెజెదో (ఇక్కడే ఉండు)”, అమ్మే కొరుకు భాషలో తన కూతురిని మందలించేది. “కానీ మా అమ్మమ్మ మాత్రం నన్ను తనతో పాటు తీసుకువెళ్లేది, నాకు 12, 13 ఏళ్ళు మాత్రమే ఉండేవి.” కాబట్టి ఆమెకు 16 ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్ళైనా, రోపి తన అమ్మమ్మ కి సహాయకురాలిగా చిన్నప్పటి నుండే పని చేయడం మొదలుపెట్టింది.
*****
ఒక ప్రధాన జీవవైవిధ్య రిపోజిటరీ అయిన మెల్‌ఘాట్‌లోని కొండలు, అడవులు 1,500 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉన్న మెల్‌ఘాట్ టైగర్ రిజర్వ్‌కు నిలయం. పొడి, ఆకురాల్చే సమశీతోష్ణ అడవిలో, కోర్కు మరియు గోండ్ స్థానిక సమాజాలకు నిలయంగా ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఈ ఆదివాసీ నివాసాలలో చాలా వరకు టైగర్ రిజర్వ్ లోపల, దాని బఫర్ ప్రాంతంలో, ఇంకా అడవి అంచులలో ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా రైతులు, పశుపోషకులు. వీరు వెదురు, ఇంకా మూలికలు వంటి అటవీ ఉత్పత్తులపై కూడా ఆధారపడతారు.
కోర్ ఫారెస్ట్ ఏరియాలోని 150 కుటుంబాల కుగ్రామమైన బోర్త్యాఖేడా, చిఖల్దారా తాలూకా పట్టణానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ, 70 సంవత్సరాల వయసున్న చర్కు బాబులాల్ కస్డేకర్, దాదాపు, "నాకు గుర్తున్నంత కాలం"గా పనిచేస్తున్న ఒక దాయి . నేటికీ మెల్‌ఘాట్‌లోని మారుమూల గ్రామాలలో, ప్రతి 10 మంది గర్భిణీ స్త్రీలలో, దాదాపు ఐదుగురు కుటుంబాలు ఒక బిడ్డను ఇంట్లోనే ప్రసవించడాన్ని ఇష్టపడతాయని, అయినప్పటికీ దశాబ్దాలుగా వైద్య సదుపాయాలు కొద్దిగా మెరుగుపడ్డాయని ఆమె చెప్పింది. (2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, NFHS-4 , గ్రామీణ ప్రాంతాల్లో 91 శాతానికి పైగా జననాలు సంస్థాగత ప్రసవాలు అని పేర్కొంది, ఈ సంఖ్య మెల్‌ఘాట్‌లోని మారుమూల గ్రామాల నిర్దిష్ట వాస్తవాలను ప్రతిబింబించకపోవచ్చు).
ఏప్రిల్ 2021లో, బోర్త్యాఖేడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఉప-కేంద్రాన్ని పొందింది, ఇది ఒకే అంతస్థున్న భవనం, నేను వెళ్ళినప్ప్పుడు ఇది కట్టిన రెండు నెలల తర్వాత కూడా పైపుల ద్వారా నీరు అందడం లేదు. ఇక్కడ పిలిస్తే పలికే సహాయక నర్సు-మిడ్‌వైఫ్ (ANM) ఉన్నారు, ఈమె 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఆమె ఆ ఉపకేంద్రపు మొదటి అంతస్తులో నివసించవలసి ఉంది, కానీ బోర్త్యాఖేడా ANM, శాంత విహికే దుర్వే, స్థానికురాలు, గ్రామంలోని వ్యక్తినే వివాహం చేసుకున్నారు.
సబ్‌సెంటర్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేయడానికి ఒక వైద్యుని కోసం ఒక పోస్ట్ ఉంది, కానీ పైప్ ద్వార నీటి సరఫరా లేకపోవడం వల్ల ఆ పోస్ట్‌లో నియమించబడిన ఎవరికైనా ఇక్కడ పనిచేయడం ప్రతిబంధకంగా ఉంటుందని గ్రామస్తులు నాకు చెప్పారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెమడోహ్ గ్రామంలోని పిహెచ్‌సిలో శిక్షణ పొందుతున్న కొత్తగా పట్టభద్రుడైన ఒక వైద్యుడు త్వరలో చేరతారేమో అని భావించారు (గత సంవత్సరం నేను సందర్శించిన సమయంలో).
అయితే చాలా మంది గర్భిణులు సబ్ సెంటర్‌ను సందర్శించడం ఇష్టపడట్లేదని ఏఎన్‌ఎం చెప్పారు. "వారి ప్రసవాన్ని పర్యవేక్షిస్తున్న ఒక మహిళ పట్ల వారికున్న విశ్వాసం వలెనే ఇలా జరుగుతుంది," అని శాంత చెప్పింది. ఆమెకు 30 ఏళ్ళు దాటి ఉంటాయి. ప్రక్కనే ఉన్న మోర్షి బ్లాక్‌లోని సబ్-సెంటర్‌లో ఒక దశాబ్ద అనుభవం తర్వాత ఇక్కడ పోస్ట్ చేయబడింది.
సెమడోలోని పిహెచ్‌సిలో ప్రసవాలు జరిగినప్పుడు కూడా తన వెంట రావాలని ఆమె చర్కును అడుగుతుంది. ప్రసవ సమయంలో కుటుంబ సభ్యులు దాయీ ల సలహాను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు, అని శాంత చెప్పింది. బోర్త్యఖేడాలో ఇప్పుడు యువ దాయీ లు లేరని, చర్కు సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారు ఎవరూ లేరనే వాస్తవాన్ని తెలిపింది. గ్రామంలోని రెండవ దాయి వృద్ధాప్యం కారణంగా దాదాపుగా పనిచేయడం మానేసింది పైగా కొన్నాళ్ల క్రితం ప్రభుత్వం యునిసెఫ్‌తో కలిసి నిర్వహించిన చిన్న శిక్షణా కోర్సును కూడా ఆమె చేయలేదు.
రోజంతా సాగే ఈ కోర్సులో పాల్గొన్న చర్కు ఇలా అంటాడు, “మాకు అన్నీ తెలుసని అనుకుంటాం, కానీ సబ్బును ఉపయోగించడం ఎంత అవసరం, చేతులు కడుక్కోవడం, కొత్త బ్లేడ్‌ని ఉపయోగించడం వంటి మరికొన్ని ముఖ్యమైన విషయాలను వారు మాకు నేర్పించారు."
ఆ సందర్భాలలో ఆమె ప్రసవ సమయంలో పిహెచ్‌సికి లేదా ఎప్పుడైనా అరుదుగా ప్రైవేట్ క్లినిక్‌కి వెళ్లినప్పుడు, ప్రసవాన్ని (ఆడ) నర్సు నిర్వహిస్తుంది. నర్సు తాను ప్రసవాన్ని నిర్వహించలేనని చెప్పే వరకు మగ వైద్యుడు కాన్పు చేయడానికి ఒప్పుకోరని చెరకు చెప్పింది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడిని పిలిపిస్తారు.
ఈ సందర్శనల కోసం చర్కుకు ఎలాంటి చెల్లింపును అందించలేదు. అయినా ఆమె ఇంకా ఎందుకు వెళుతుంది? “ చలో బోలా తో జాతి [వారు నన్ను అడిగితే నేను వెళ్తాను]. నేను అక్కడ ఉండడం, ఆ తల్లికి ధైర్యాన్నిస్తే నేనెందుకు వెళ్లను?”
సంవత్సరాల క్రితం, చర్కు చెప్పింది, ఆమెకు ధాన్యం, రెండు లేదా మూడు కొలతల బియ్యం లేదా గోధుమలు - ఒక పాయ్ , పెద్ద టంబ్లర్‌ను పోలి ఉండే సాంప్రదాయ ఇత్తడి పాత్రలో ఇచ్చేవారు. మరికొన్నిసార్లు కొంత నగదు కూడా ఇచ్చేవారు.
దశాబ్దాలుగా దాయీ లుగా పనిచేస్తున్నా వారి ఆదాయాలు పెద్దగా మెరుగుపడలేదు. జూన్ 2021లో నేను ఆమెను కలవడానికి ఒక వారం ముందు చర్కు వెళ్లిన కాన్పులో, ఆమెకు రూ. 500, నాలుగు కిలోల గోధుమలు ఇచ్చారు. ఇది శీఘ్ర ప్రసవం, ప్రసవ నొప్పులు ప్రారంభమైన వెంటనే శిశువు పుట్టేసింది. "కానీ ఇది ఎక్కువ సేపు పట్టినా, నాకు అదే డబ్బు ఇస్తారు," అని ఆమె చెప్పింది.
చర్కు భర్త ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు; ప్రస్తుత్తం ఆమె కూతురు, అల్లుడు ఇప్పుడు సాగుచేసుకుంటున్న ఎకరం పొలంలో ఇదివరకు అతను సాగుచేసేవాడు. తన పని నుండి స్థిరమైన ఆదాయం ఎప్పుడూ లేదు, అని చర్కు చెప్పింది. ఇటీవలి సంవత్సరాలలో కొన్ని నెలలు ఆమెకు రూ. 4,000 వచ్చాయి, కొన్ని నెలలు రూ. 1,000 కూడా రాలేదు.
గత మూడు దశాబ్దాలుగా బోర్త్యాఖేడాలో జన్మించిన శిశువుల్లో కనీసం సగం మంది పుట్టిన సమయంలో చర్కు అక్కడే ఉన్నదని ఇక్కడి మహిళలు అంచనా వేస్తున్నారు. తన సొంత మనవళ్లను, మనవరాళ్లను కూడా చర్కునే ప్రసవించింది.
ఆమె ప్రసవించిన కొన్ని నవజాత శిశువులు కొన్ని రోజుల తరువాత మరణించారు, అని ఆమె గుర్తుచేసుకుంది. "పుట్టుక సమయంలో కాదు, కొన్ని రోజుల తరువాత." ఈ మరణాలకు కారణం ఆమెకు తెలియదు. ఎవరికీ తెలియదు.
ఇప్పుడు, ఆమె కంటి చూపు మందగించడంతో, PHC లేదా కొత్త సబ్‌సెంటర్‌కు వెళ్లమని ఆమె వద్దకు వచ్చిన వారికి ఆమె తరచుగా చెబుతోంది.
*****
తన వయస్సు ఎంత ఉందో సరిగ్గా తెలియని రోపికి, ఇటీవలే, తన కాళ్లకు ఇబ్బంది వచ్చింది. ఆమె చీలమండల చుట్టూ వాపు ఉంది, ఆమె మోకాలు విపరీతంగా బాధిస్తోంది. ఆమె దాని గురించి నగర వైద్యుడిని ఇంతవరకు కలవలేదు. స్థానిక వైద్ (ప్రత్యామ్నాయ వైద్యం చేసే వ్యక్తి) సూచించిన నూనెను రుద్దడం వల్ల ఏ లాభం లేకపోయింది.
తన పాత పరిచయస్తులను కలుసుకోవడం, తన కుమార్తెలను కలవడం వంటి పనులు చేస్తూ, ఆమె ఊరిల్లో తిరుగుతూనే ఉన్నప్పటికీ, ప్రసవాల కోసం తన వద్దకు వచ్చే చాలా కుటుంబాలను నిరాకరిస్తూ వచ్చింది, ఆమె బయటకు వెళ్లి ఎక్కువసేపు ప్రసవాన్ని నిర్వహించగలదో లేదో తెలీదు, ఆమె చూపు సరిపోతుందో లేదో తెలియదు. “[పరాట్వాడా పట్టణంలోని] సిటీ క్లినిక్‌కి ఫోన్ చేయమని నేను వారికి చెప్తాను, అంబులెన్స్ వచ్చే వరకు నేను వారితో పాటు వేచి ఉంటాను. వాహనం వెంటనే గ్రామానికి తిరిగి వస్తుందంటే కొన్నిసార్లు నేను కూడా వెంట వెళ్తాను, ”అని రోపి చెప్పారు.
పని చేస్తూ ఉండే సంవత్సరాల్లో, త్వరగా, ప్రశాంతంగా పరిస్థితులకు ప్రతిస్పందించే దాయి గా ఆమె జైతదేహిలో పేరు పొందింది. "ఇంతకుముందు, వారు నన్ను పిలవడానికి వచ్చినప్పుడు, నేను మొదట నాకు అవసరమైన అన్ని వస్తువులను వారికి చెబుతాను - బ్లేడ్, దాగా [దారం, కుట్లు వేయడానికి], సూయి [సూది]." చాలా మంది దాయిలు పెరినియల్ పొరను కుట్టడంలో ప్రవీణులు, అది పెద్ద విషయం కాదంటూ ఆమె భుజాలు ఎగరేసింది. .
అప్పుడు, ప్రసవం ఇప్పుడే ప్రారంభమైందా, ముందుకు సాగిందా అనే విషయాన్ని అర్థం చేసుకుని, తన పనులను ముగించి, కాబోయే తల్లి ఇంటి వైపు వేగంగా నడుస్తుంది.
రోపి ఎల్లప్పుడూ ప్రార్థనతో ప్రారంభించి, చేతులు కడుక్కుని, ఆ తరవాత ప్రసవంలో ఉన్న స్త్రీ యోనిలోని వ్యాకోచాన్ని పరిశీలిస్తుంది.
“కాబోయే తల్లికి తల్లి(పుట్టబోయే శిశువు అమ్మమ్మ) ఏమీ చేయదు, కానీ ఆమె ఎప్పుడూ తన కూతురి పక్కనే ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. తల్లి విన్నపాలు, నొప్పితో తన కుమార్తె ఏడుపులకు సరిపోతాయి. ‘ ఓ మాయీ, జల్దీ కర్ దో మాయీ ’ , అని తల్లులు [‘అమ్మా, తన బాధను త్వరగా ముగించు అమ్మా’] బతిమాలతారు. అది ఏదో నా చేతిలో ఉన్నట్లే!" అంటుంది రోపి.
కొన్నిసార్లు ప్రసవ నొప్పులు గంటల తరబడి కొనసాగుతాయి. అప్పుడు రోపి త్వరగా ఇంటికి వచ్చి తాను ఇంత తినడానికి లేక తన భర్త లేదా కొడుకుకు భోజనం వడ్డించడానికి ఇంటికి తిరిగి వచ్చేది. “ఆ సందర్భాలలో, తల్లులు బిగ్గరగా ఏడుస్తారు, బిడ్డ పుట్టే వరకు నన్ను విడిచిపెట్టవద్దని అడుగుతారు. కానీ కొన్నిసార్లు ఈ బాధ రాత్రంతా లేదా రోజంతా కొనసాగుతుంది. ఆ పరిస్థితుల్లో అందరూ భయపడతారు, కానీ నేను భయపడను.”
ఆమె గర్భిణీ స్త్రీ పొట్టను రుద్దడానికి కొద్దిగా నూనె (వంటగదిలో లభించే ఏదైనా నూనె) ఇవ్వమని అడుగుతుంది. రోపి అలా కడుపుని వేళ్ళతో పరీక్షించి లోపలి శిశువు సరైన ప్రదేశంలో ఉన్నదా లేదా అడ్డం తిరిగి ఉన్నాదా అని అంచనా వేయవచ్చని, ఒకవేళ సరైన దిశలో లేకపోతే గట్టిగా మసాజ్ చేయడం ద్వారా పిండం యొక్క తలను సరిగ్గా కోణించగలనని చెప్పింది. బిడ్డ కాళ్లతో జన్మించిన సందర్భాలను ఆమె చూసింది, అయితే ఈ జననాలతో తనకు పెద్దగా ఇబ్బంది ఏమీ రాలేదని పేర్కొంది.
ఇతర సాంప్రదాయ నమ్మకాలు కదల్చడం చాలా కష్టం. తొమ్మిదవ నెల పూర్తయిన తర్వాత ప్రసవ నొప్పులు ప్రారంభం కాకపోతే, భూమ్‌కాల్ ఆశీర్వదించిన కొన్ని చుక్కల నీటిని తాగమని తాను సిఫార్సు చేస్తానని చర్కు చెప్పింది
డెలివరీ పూర్తయిన తర్వాత దాయి సాధారణంగా ప్రసవ ప్రాంతాన్ని శుభ్రపరుస్తుంది, అని రోపి చెప్పింది. “ఇంతకుముందు మేము పిల్లవాడికి వెంటనే స్నానం చేయించేవాళ్ళం. ఇప్పుడు అలా చేయడం మానేశాము,” ఆమె చెప్పింది. శిశువుకు స్నానం చేయించి, ఆ తర్వాత మాత్రమే మొదటి తల్లిపాలు కోసం తల్లికి అప్పగించడం ఆచారం.
చర్కు ఏకీభవించింది. “ఇంతకుముందు, మేము వెచ్చని నీటిని ఉపయోగించేవాళ్ళము. పుట్టిన వెంటనే శిశువుకు స్నానం చేయించే వాళ్ళము. కొన్నిసార్లు శిశువుకు కొన్ని రోజుల తర్వాత మాత్రమే తల్లి పాలు ఇవ్వబడతాయి.” కొన్ని కుటుంబాలు శిశువుకు మొదటి రోజు బెల్లం-నీరు లేదా తేనె-నీరు మాత్రమే ఇచ్చేవారు.
ప్రధానంగా స్థానిక ANMల సలహాలు, సంస్థాగత ప్రసవాన్ని ప్రోత్సహించే ప్రచారాలు, మెల్‌ఘాట్ శిశు మరణాల సమస్యపై రాష్ట్ర-స్థాయి శ్రద్ధ కారణంగా నవజాత శిశువుకు స్నానం చేసే పద్ధతి ఇప్పుడు చాలా అరుదుగా అనుసరిస్తున్నారు. (వివిధ అధ్యయనాలు, నివేదికలు - ఈ ప్రాంతంలోని అధిక శిశు మరణాల రేటు, తీవ్రమైన పోషకాహార లోపం గురించి మాట్లాడాయి). ఇప్పుడు ప్రసవానంతర ఆచారాలు, దేవతలకు చేసే అర్పణలకన్నా శిశువు ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, అని బోర్త్యాఖేడా ANM శాంత చెప్పారు. పైగా ప్రభుత్వం-UNICEF శిక్షణ కూడా ఇంటివద్ద జరిగే ప్రసవాల భద్రతను నిర్ధారించుకోవడానికి సహాయపడింది.
ఇప్పుడు, తల్లి కొన్ని నిమిషాల విశ్రాంతి తీసుకున్న తర్వాత శిశువు కదలడం ప్రారంభించినప్పుడు, పడుకున్న లేదా కూర్చున్న సమయంలో, సురక్షితమైన స్థితిలో తల్లిపాలు ఎలా ఇవ్వాలో దాయి ఆమెకు చూపుతుంది. ఆ తరవాత శిశువుకు అరగంటలో తల్లి పాలు అందుతాయి, అని చర్కు చెప్పింది.
ఇతర సాంప్రదాయ నమ్మకాలు కదల్చడం చాలా కష్టం. తొమ్మిదవ నెల పూర్తయిన తర్వాత ప్రసవ నొప్పులు ప్రారంభం కాకపోతే, భూమ్‌కాల్ (సాంప్రదాయ ఆధ్యాత్మిక వైద్యుడు) ఆశీర్వదించిన కొన్ని చుక్కల నీటిని తాగమని తాను సిఫార్సు చేస్తానని చర్కు చెప్పింది.
గర్భిణికి కొడుకు పుట్టాడా లేక కూతురు పుడుతుందా అని అంచనా వేయడం తనకు ఇష్టమని రోపి చెప్పింది. మగ పిండాలు ఉన్నప్పుడు పొత్తికడుపుకు పొడుచుకు వస్తుందని, "ఆడ పిండాలు బొడ్డు పక్కల చుట్టూ వ్యాపిస్తాయని." చెప్పింది కానీ ఆమె ఇటువంటి మాటలను నవ్వుతో తేల్చేస్తుంది. ఇది కాస్త ఊహ అని, శిశువు పుట్టే వరకు దాని లింగాన్ని తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశించలేదు, అని ఆమె చెబుతుంది .
బోర్త్యాఖేడాలో, గ్రామస్థులు సాంప్రదాయక దాయి లు సమాజ ఆరోగ్యంలో సహాయక పాత్ర పోషిస్తారు, గర్భిణీ స్త్రీలకు చివరి-మైలురాయి వరకు వీరు రాష్ట్ర సహాయాన్ని మెరుగుపరుస్తాయి (సాధారణ తనిఖీలు, ఐరన్-ఫోలిక్ యాసిడ్ మరియు కాల్షియం సప్లిమెంట్ల సరఫరాతో సహా), ప్రసవం, సకాలంలో ఆసుపత్రి ప్రణాళికలలో కూడా సహాయపడతారు అని స్పష్టంగా చెప్పారు.
పరాట్వాడ పట్టణంలోని ప్రైవేట్ ప్రాక్టీషనర్లకు చాలా దగ్గరగా ఉన్న జైతాదేహిలోని గ్రామస్తులు రోపి తర్వాత తమకు వేరొక దాయి లేదని ఆందోళన పడుతున్నారు. ఇంతలో, పిల్లల ప్రసవం గురించి ప్రభుత్వంతో తనకు చెప్పవలసిన కొన్ని విషయాలు ఉన్నాయని రోపి చెప్పింది. “కొంతమంది మహిళలు చాలా సన్నగా ఉంటారు, తొమ్మిది నెలల పాటు ప్రతిరోజూ వాంతులు చేసుకుంటారు. వారు మాంసం తినడానికి నిరాకరిస్తారు, వారు కొన్ని రకాల ఆహారాన్ని ఇష్టపడరు. గర్భిణీ స్త్రీలు అన్నీ తినాలి. ఏదీ నిషేధించబడలేదు. వైద్యులు గర్భిణీ స్త్రీలకు వీటిపై కూడా సలహా ఇవ్వాలి.” అని ఆమె చెప్పింది.
ఆమె సమాజంలో, కోర్కు కుటుంబంలో ఒక బిడ్డ జన్మించిన తర్వాత ఐదవ-రోజు వేడుకలకు దాయి ని ఆహ్వానిస్తారు. అదే రోజు ఆమె వేతనం పొందుతుంది, ఇది శిశువు ప్రారంభ అనిశ్చిత వ్యవధి నుండి బయటపడిందని సూచిస్తుంది. "కొందరు ప్రమాదాల వల్ల మరణిస్తారు, కొందరు అనారోగ్యం కారణంగా, కొందరు పుట్టుకతోనే మరణిస్తారు" అని రోపి తాత్వికంగా చెప్పింది. “అందరూ ఏదో ఒకరోజు చనిపోతారు. కానీ ప్రసవంలో జీవితాన్ని నిలుపుకోవడం, తల్లీబిడ్డల గొప్ప విజయం.” అంటుంది.
శిశువుల మనుగడ కోసం ఆమె అందుకున్న కృతజ్ఞత ఒక దాయి గా తన అతిపెద్ద ఆనందాలలో ఒకటి, రోపి చెప్పింది, ఇప్పుడు అంత చురుకుగా లేనందున ఆమె ఈ ఆనందాన్ని ఎక్కువగా పొందలేకపోతుంది. ఆమె తన సహాయం కోరడానికి వచ్చిన చాలా మంది వ్యక్తులను పంపేస్తుంది: " జావో బాబా, అబ్ మేరే సే హోతా నహీ ," ఆమె వారికి చెబుతుంది. "నేను ఇకపై చేయలేను."
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే zahra@ruralindiaonline.orgకి ఈమెయిల్ చేసి అందులో namita@ruralindiaonline.orgకి కాపీ చేయండి.
అనువాదం: అపర్ణ తోట