“నాకు వీలయితే ఆసుపత్రికి అసలు వెళ్ళేదాన్నే కాదు.” ఆమె ఖచ్చితంగా చెప్పింది. “మమ్మల్ని అక్కడ జంతువుల్లా చూస్తారు. అక్కడ డాక్టర్లు వారంతట వారు వచ్చి మమ్మల్ని చూడరు, పైగా అక్కడ నర్సులు, ‘వీళ్లెలా బతుకుతారో, ఇంత కంపుకొట్టే మనుషులు ఎక్కడ నుండి వస్తారు?’, అంటారు”, అన్నది సుదామ. సుదామ వారణాసి జిల్లాలోని అన్నియ గ్రామానికి చెందిన ఆదివాసి. ఆమె తన మొదటి ఐదుగురు బిడ్డలను ఆసుపత్రిలో కాక ఇంట్లోనే ఎందుకు ప్రసవించిందో చెబుతోంది.
సుదామకు గత 19 ఏళ్లలో తొమ్మిది మంది పిల్లలు కలిగారు. 49 ఏళ్ళు చేరినా ఆమె ఋతు చక్రం ఇంకా ఆగలేదు.
ఆమె ఠాకూర్లు, బ్రాహ్మలు, గుప్తాలు వంటి పెద్ద కులాలు ఉండే బరాగావ్ బ్లాక్ లో, ఒక మూలనున్న ముసహర్ బస్తి లో 57 కుటుంబాల మధ్య నివసిస్తుంది. ఆ బస్తి లో ఇంకొన్ని ముస్లింల ఇళ్లు, కొన్నిచమార్, ధర్కార్, పాసి వంటి షెడ్యూళ్ల కులాలకు చెందిన వారి ఇళ్లు కూడా ఉన్నాయి. ఆ బస్తి వీరి వర్గాన్ని గురించి సాధారణంగా ఉన్న వివక్ష పూరిత అపోహలను నిజం చేసేటట్లే ఉంటుంది - సరిగ్గా బట్టలు వేసుకోకుకండా, దుమ్ము పట్టిన పిల్లలతో, వారి బక్కచిక్కిన మొహాలకి అంటుకున్న ఆహరం చుట్టూ చేరిన ఈగలతో, అసలు పరిశుభ్రత లేకుండా ఉంటుంది. కానీ దగ్గరగా చూస్తే ఇంకో విషయం కూడా తెలుస్తుంది.
ఉత్తరప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న ఈ ముసాహారులు ఎలుకలు పట్టగల నైపుణ్యం ఉన్నవారు. ఈ ఎలుకలను వదిలేస్తే ప్లేగ్ వ్యాధి ప్రబలుతుంది. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, వారి వృత్తి పై చిన్న చూపు పెరిగి, వారిని ఎలుకలు తినేవారిగా చూడడం మొదలు పెట్టారు. ఆ విధంగానే వారికి ముసాహారులు(ఎలుకలోళ్లు) అన్న పేరు వచ్చింది. ఈ వర్గాన్ని అందరూ వెలివేస్తారు, అవమానిస్తారు. మిగిలిన సామాజిక వర్గాలు, ప్రభుత్వాలు వీరిని నిర్లక్ష్యం చేస్తాయి. వీరు విపరీతమైన లేమితో బతుకుతుంటారు. పక్కనే ఉన్న బీహార్ రాష్ట్రంలో వీరిని మహాదళితులుగా వర్గీకరించారు- మహాదళితులు, షెడూల్డ్ కులాలలోనే అందరికన్నా ఎక్కువగా వివక్షను ఎదుర్కొనే పేదవారు.
అన్నియ గ్రామంలో పోషకాలేమి ఉన్నబస్తీ మధ్యలో- బహుశా దీనిని మురికివాడ అంటే సరిపోతుందేమో- ఒక మట్టి పూరి గుడిసె ముందు ఒక చార్పాయ్ మీద సుదామ కుర్చుని ఉంది. “మా వర్గం వారు మా గుడిసెలలో మంచాల మీద కూర్చోడం నిషేధించబడిన రోజులను కూడా మేము చూశాము”, అన్నది ఆమె, ఆమె కూర్చున్న ప్రదేశాన్ని చూపిస్తూ. “అవి పై కులాల కోసం మాత్రమే ఉన్నవి. ఒకవేళ ఠాకూర్లు గ్రామమంతా తిరుగుతున్నప్పుడు మేము ఇలా మంచాల మీద కూర్చుని కనిపిస్తే ఏమేమి అనేవారో చెప్పలేము.” వారు అనుభవించే భరించలేని హింసను ఉద్దేశిస్తూ అన్నదామె.
ఈ రోజుల్లో మనుషులు కులం గురించి పెద్దగా పట్టించుకోరని చెప్పినా, వారి జీవితాల పై, కులవ్యవస్థ దాని పట్టు ఇంకా విడవలేదని చెబుతుంది సుదామ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఇంట్లో మంచాలున్నాయి, మగవారు వాటి మీద కూర్చుంటారు కూడా. ఆడవారికి మాత్రం ఆ సౌకర్యం లేదు. “ఆడవారు పెద్దలు(అత్తింటివైపు వారు) ఉన్నప్పుడు కూర్చోకూడదు. ఒకసారి నేను మంచం పై కూర్చున్నానని మా అత్తగారు అందరి మధ్యలో నా పై అరిచింది.”
సుదామ ముగ్గురు పిల్లలు మంచం చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నారు, నాలుగో బిడ్డను ఆమె తన ఒళ్ళో వేసుకుని కూర్చుంది. ఆమెకు ఎంత మంది పిల్లలున్నారని నేను అడిగినప్పుడు ఆమె గందరగోళపడింది. ముందు ఏడుగురు అని చెప్పింది, ఆ తరవాత పెళ్ళై అత్తింటికి వెళ్ళిపోయిన ఆమె కూతురు అంచల్ ని గుర్తుకుతెచ్చుకుంది, ఆ తరవాత ఆమె పోయిన ఏడాది చనిపోయిన ఇంకొక బిడ్డని గుర్తుకు తెచ్చుకుంది. ఆ తరవాత ఆమె తన చేతివేళ్ల పై లెక్కపెట్టి ఏడుగురు ఆమెతోనే ఉన్నారు అని చెప్పింది. “19 ఏళ్ళ రామ బాలక్, 17 ఏళ్ళ సాధన, 13 ఏళ్ళ బికాస్, 9 ఏళ్ళ శివ బాలక్, 3 ఏళ్ళ అర్పిత, 4 ఏళ్ళ ఆదిత్య, ఏడాదిన్నర అనుజ్”
‘ అరే జావో, ఔర్ జాకే చాచి లోగోన్ కో బులా లావో (ఒరేయ్ వెళ్లి పిన్నులను పిలుచుకురా),” చెయ్యుపి ఆమె తన కూతురిని చుట్టూ పక్కల ఆడవారిని మా వద్దకు తీసుకురమ్మని పంపింది. “పెళ్లయ్యే సమయానికి నాకు 20 ఏళ్ళు ఉంటాయి. కానీ నాకు ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టేదాకా, నాకు కండోమ్ల గురించి, ఆపరేషన్ల(కుటుంబ నియంత్రణ) గురించి అసలు తెలీదు. చివరికి నాకు వాటి గురించి తెలిసింది, కాని అవి వాడే ధైర్యం ఎన్నటికీ కూడగట్టుకోలేక పోయాను. ఆపరేషన్ చేయించుకుంటే నొప్పి వస్తుందేమో అనే భయం కూడా ఉండేది.” ఈ పద్ధతులు చేయించుకోవాలంటే ఆమె బరాగావ్ బ్లాక్లో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న PHC కి వెళ్ళవలసి వచ్చేది. స్థానికి PHC ఈ సౌకర్యాలు లేవు.
సుధామ ఇల్లు నడుపుతుంది. ఆమె భర్త 57 ఏళ్ళ రాంబహదూర్, వరి పొలాల్లో పనిచేస్తాడు. “ఇది నాట్లేసే కాలం”, అన్నదామె. పంట అందాక, చాలామందిలానే అతను కూడా దగ్గరలోని నగరాలకు వెళ్ళి నిర్మాణ కట్టడాలతో కూలీగా పనిచేస్తాడు.
ముసాహారుల వర్గంలో చాలా మంది భూమిలేని కూలీలు, మిగిలిన వారు అథియా , చౌతియా (వేరే వారి పొలం లో పనిచేసి వచ్చిన దిగుబడిని సగం, మూడోవంతు లేక నాలుగో వంతు అందుకుంటారు) పై భూమిని సాగు చేస్తారు. సుదామ భర్త కూడా తిసారియా పైన అంటే మూడోవంతు లెక్కన పంటను అందుకుని దానిని అమ్మి, ఇంట్లోకి కావలసినవి కొంటాడు.
ఈ రోజు సుదామ మధ్యాహ్న భోజనానికి అన్నం వండింది. ఆ గుడిసెలో ఒక మట్టి పొయ్యి మీద ఒక అన్నం చట్టి ఉంది. వారి కుటుంబంలో భోజనం అంటే అందులో అన్నం, కొద్దిగా ఉప్పు లేదా నూనె ఉంటుంది. కొన్నిమంచి రోజులలో వారు పప్పు, కూరగాయలు, కోడికూరా తింటారు. రోటి వారానికోసారి చేస్తారు.
“మేము అన్నాన్ని మామిడి పచ్చడి తో తింటాము,” అన్నది ఆమె కూతురు సాధన, తన తోబుట్టువులకు స్టీల్ కంచాల్లో అన్నం వడ్డిస్తూ. అందరిలోకి చిన్నవాడైన అనుజ్, సాధన కంచంలోంచే తింటాడు, రామ్ బాలక్, బికాస్ ఒకే కంచంలో తింటారు.
ఇరుగుపొరుగు నుండి కొంతమంది మహిళలు మాతో చేరారు, వారిలో 32 ఏళ్ల సంధ్య, ఈ బస్తీలో ఐదు సంవత్సరాలుగా మానవ హక్కుల సంఘం సభ్యురాలిగా పనిచేస్తున్నారు. సంధ్య రక్తహీనత యొక్క విస్తృత సమస్య గురించి మాట్లాడటం ప్రారంభించింది. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ( NFHS-4 ) ఉత్తరప్రదేశ్‌లో 52 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొన్నప్పటికీ, అన్నియలో, వారిలో 100 శాతం మంది మితమైన లేదా తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె చెప్పింది.
“ఈమధ్యే మేము ఈ గ్రామం లో నివసించే ఆడవారి పోషన్ -మ్యాపింగ్ [ఒక పోషణ అంచనా] చేశాము,” అన్నది సంధ్య. దీనివలన తెలిసినదేంటంటే ఇందులో ఒకరికి కూడా హిమోగ్లోబిన్ 10 గ్రాములు/డి ఎల్ పైన లేదు. ప్రతి ఒక్కరు రక్త హీనతతో బాధపడుతున్నారు. ఇది కాక ఈ ఆడవారిలో ల్యుకోరియా, కాల్షియమ్ తక్కువ స్థాయిలో ఉండడం కూడా సాధారణం.”
ఈ ఆరోగ్య సమస్యలు, హీనతలు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పై వారికున్న నమ్మకలేమిని చెబుతుంది. అక్కడ వారు అవమానింపబడడమే కాక, వారికి సరైన చికిత్స కూడా దొరకదు. “కాబట్టి ఎమర్జెన్సీ ఉంటే తప్ప, ఆడవారు అక్కడ ఆసుపత్రికి వెళ్లరు. “నా మొదటి ఐదు ప్రసవాలు ఇంట్లోనే జరిగాయి. ఆ తరవాత ఆశా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడం మొదలుపెట్టింది,” అన్నది సుధామ, క్లినిక్ల పై తనకి ఉన్న భయాన్ని గురించి చెబుతూ.
“డాక్టర్లు మమ్మల్ని తక్కువగా చూస్తారు. కాని అది మాకేం కొత్త కాదు, మా ఇంట్లోనే ఈ ఇబ్బంది మొదలవుతుంది,” అన్నది 47 ఏళ్ళ దుర్గమాటి ఆదివాసి, ఈమె సుదామ పక్కింట్లో నివసిస్తుంది. “ సర్కారు (ప్రభుత్వం), డాక్టర్లు, మగవారు అందరూ ఒకటే. మగవారికి శారీరక సుఖంలో మునిగి తేలడం తెలుసుకానీ ఆ తరవాత జరిగే వాటితో వారికి సంబంధం ఉండదు. కుటుంబం అంతా తినడానికి సరిపడా సంపాదిస్తే వారి బాధ్యత తీరిపోతుంది అనుకుంటారు. మిగిలినది అంతా ఆడవారి మీద పడుతుంది”, గొంతులో కోపం ధ్వనిస్తుండగా అన్నది దుర్గమాటి.
ఈ ఆరోగ్య సమస్యలు, హీనతలు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పై వారికున్న నమ్మక లేమిని చెబుతుంది. అక్కడ వారు అవమానింపబడడమే కాక, వారికి సరైన చికిత్స కూడా దొరకదు. “కాబట్టి ఎమర్జెన్సీ ఉంటే తప్ప, అక్కడ ఆడవారు ఆసుపత్రికి వెళ్లరు
“హర్ బిర్దార్ మే మహిళా హి ఆపరేషన్ కరాతి హై (ప్రతి ఇంట్లోనూ ఆడవారే ఆపరేషన్ చేయించుకుంటారు),” అన్నది 45 ఏళ్ళ మనోరమ సింగ్, ఈమె అన్నియలో సప్లిమెంట్లను సరఫరా చేస్తుంది. “గ్రామం మొత్తం తిరిగి చూడండి. ఒక్క మగవాడు కూడా వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకుని ఉండడు. ఆడవారు మాత్రమే ఎంతమంది పిల్లలను కనాలో, ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలో ఆ దేవుడికే తెలియాలి”. అన్నది. 2019-21 NFHS-5 ప్రకారం వారణాసిలో 0.1 శాతం మంది పురుషులు మాత్రమే స్టెరిలైజ్ చేయించుకున్నారు - అయితే మహిళలలో స్టెరిలైసెషన్ మాత్రం 23.9 శాతం ఉంది.
NFHS-4 కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది: "ఉత్తరప్రదేశ్‌లోని 15-49 సంవత్సరాల వయస్సు గల పురుషులలో దాదాపు ఐదింట రెండు వంతులు (38 శాతం) గర్భనిరోధకం మహిళల విషయమైపోయిందని అంగీకరిస్తున్నారు, ఈ విషయం గురించి పురుషుడు ఆందోళన పడవలసిన అవసరమే లేదు."
సంధ్య తన గ్రామంలోను ఇటువంటి విషయమే గమనిస్తుంది. “మేము వారికి (మగవారికి) కుటుంబ నియంత్రణ ప్రాధాన్యం గురించి చెబుతున్నాం, కండోమ్లు కూడా పంచుతున్నాం. వారి భార్యలు అడిగినా మగవారు కండోమ్లు వాడడానికి ఇష్టపడరు. భర్త వద్దనుకుంటే తప్ప ఇంట్లో ఆడవారు గర్భం దాల్చడం ఆపలేరు.”
ఉత్తరప్రదేశ్‌లోని 15-49 ఏళ్ల మధ్య ఉన్న వివాహిత స్త్రీలలో గర్భనిరోధక వ్యాప్తి రేటు, లేదా CPR, NFHS-4లో 46 శాతంగా ఉంది. NFHS-3 లో 44 శాతంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మహిళలు, వారికి అప్పటికే కొడుకు కలిగి ఉంటే, గర్భనిరోధక మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వే చెబుతోంది,. "వీరెవ్వరూ కుటుంబ నియంత్రణ గురించి పట్టించుకోరు, ముఖ్యంగా పురుషులు," మనోరమతో పాటుగా ఉన్న మరొక ఆశా కార్యకర్త మనోరమ కూడా సమీపంలోని మరొక కుగ్రామంలో పనిచేస్తున్నారు. “ఇక్కడి కుటుంబాలలో సగటు పిల్లల సంఖ్య ఆరు. చాలా వరకు వయస్సు కారణంగా పిల్లలు పుట్టడం ఆగిపోతుంది. పురుషులను అడిగితే, వారు నస్బంది [వేసెక్టమీ] వలన కలిగే నొప్పిని, సమస్యలను భరించలేమని చెప్పారు.
“అతను సంపాదించి ఇంటిని చూసుకోవాలి. ఇక అతను ఆపరేషన్ కూడా చేయించుకోవాలని ఎలా అనుకుంటాను? అసలు అటువంటి ఆలోచనే రాదు.” అన్నది సుధామ.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే zahra@ruralindiaonline.orgకి ఈమెయిల్ చేసి అందులో namita@ruralindiaonline.orgకి కాపీ చేయండి.
జిగ్యసా మిశ్రా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
జిగ్యాసా మిశ్రా వేసిన ప్రధాన దృష్టాంతం పాతచిత్ర చిత్రలేఖన సంప్రదాయం నుండి ప్రేరణ పొందింది.
అనువాదం: అపర్ణ తోట