"నేను బడిలో నేర్చుకున్నదంతా మా ఇంట్లోని వాస్తవికతకు వ్యతిరేకంగానే ఉంది."
పర్వతాల రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని రాజపుత్ సామాజికవర్గానికి చెందిన ఒక బడికి వెళ్ళే బాలిక, ప్రియ. ఆమె బహిష్టు అయినపుడు తప్పక పాటించాల్సినవిగా స్పష్టంగా ఆమెపై రుద్దిన కఠిన సూత్రాలను గురించి ప్రియ మాట్లాడుతోంది. "ఇది దాదాపు రెండు వేరువేరు ప్రపంచాల్లో నివసించడంలాంటిది. ఇంటిదగ్గర నేను అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటూ అన్నిరకాల ఆచారాలనూ, ఆంక్షలనూ పాటించేలా చేస్తారు. బడిలోనేమో మహిళలు పురుషులతో సమానం అని బోధిస్తారు." అని ప్రియ చెప్పింది.
పదకొండవ తరగతి విద్యార్థిని అయిన ప్రియ చదివే పాఠశాల నానక్‌మత్తా పట్టణంలో ఉంది. ఇక్కడినుంచి గ్రామంలో ఉండే ఆమె ఇల్లు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజూ ఆమె సైకిల్ తొక్కుతూ బడికి వెళ్ళివస్తుంటుంది. మంచి విద్యార్థిని అయిన ప్రియ, మొదట్లో ఈ విషయాల గురించి తనకు తాను అవగాహన ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. “నేను పుస్తకాలు చదివి ఇది చేస్తాను, అది చేస్తాను, ప్రపంచాన్ని మారుస్తాను అనుకునేదాన్ని. కానీ ఈ ఆచారాలకు అర్థం లేదని నేను నా కుటుంబాన్ని ఒప్పించలేకపోయాను. నేను వారితో పగలూ రాత్రీ కలిసే జీవిస్తాను, కానీ ఈ ఆంక్షలకు అర్థం లేదని నేను వారికి అర్థం చేయించలేకపోతున్నాను.” అని ఆమె చెప్పింది.
ఈ నియమాలు, నిబంధనల పట్ల ఆమెకు మొదట్లో ఉన్న చిరాకూ, అసౌకర్యం ఏమాత్రం తగ్గలేదు కానీ ఇప్పుడామె తన తల్లిదండ్రుల ఆలోచనతో పాటు సర్దుకుపోతోంది.
ప్రియ, ఆమె కుటుంబం తరాయీ (లోతట్టు) ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇది రాష్ట్రంలో అత్యధిక దిగుబడినిచ్చే వ్యవసాయ ప్రాంతం (సెన్సస్ 2011). ఈ ప్రాంతంలో మూడు పంటలు పండుతాయి - ఖరీఫ్ , రబీ , జాయద్ . ఇక్కడున్న జనాభాలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. పశువులను- ఎక్కువగా ఆవులనూ గేదెలనూ పెంచుతారు.
పక్కనే ఉన్న మరో రాజపుత్‌ల ఇంటిలో ఉండే విధా, బహిష్టులో ఉన్నప్పుడు తన జీవన ఏర్పాట్లను గురించి వివరిస్తోంది: “రాబోయే ఆరు రోజులు నేను నా గదికే పరిమితమై ఉంటాను. నన్ను చుట్టుపక్కల ఎక్కడకూ తిరగొద్దని (ఆమె తల్లి, నాన్నమ్మ) చెప్పారు. నాకు కావాల్సినవన్నీ మా అమ్మ తెచ్చిపెడుతుంది.”
గదిలో రెండు పడకలు, ఒక డ్రెస్సింగ్ టేబుల్, అలమరా ఉన్నాయి. 15 ఏళ్ల విధా బహిష్టు అయినపుడు తాను మామూలుగా ఎప్పుడూ పడుకునే చెక్క మంచం మీద పడుకోదు. పక్కనే ఒక సన్న దుప్పటి వేసివుండే మంచం మీద పడుకుంటుంది. దానివలన తనకు వెన్నునొప్పి వస్తోందని ఆమె చెప్పింది. అయినా ఆమె 'తన కుటుంబ మనశ్శాంతి' కోసం దానిపైనే పడుకుంటుంది.
ఆ తప్పించుకోలేని నిర్బంధ ఏకాంత సమయంలో, విధాకు బడికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే బడినుంచి తిరిగివచ్చేటపుడు, నానక్‌మత్త సమీపంలోని నగాలా గ్రామంలోని తన ఇంట్లోని ఈ గదిలోకే ఆమె నేరుగా రావాల్సివుంటుంది. తల్లి ఫోను, కొన్ని పుస్తకాలు మాత్రమే ఈ 11వ తరగతి చదివే విద్యార్థినికి కాలక్షేపంగా సహాయపడతాయి.
ఒక స్త్రీ కుటుంబంలోని ఇతరుల నుండి విడిగా కూర్చోవడం మొదలెట్టి, తన వస్తువులను ఒక వైపున ఉంచుకోవడం ప్రారంభించిందంటే, అది ఆమె బహిష్టులో ఉందని అందరికీ అందే సంకేతం. ఎవరు బహిష్టులో ఉన్నారు, ఎవరు లేరన్నది అందరికీ తెలిసిపోతుందని విధా ఆగ్రహం వ్యక్తం చేసింది. “అందరూ దాని గురించి తెలుసుకుంటారు, చర్చిస్తారు. ఆమెకు (బహిష్టులో ఉన్న వ్యక్తికి) జంతువులను, పండ్ల చెట్లను తాకడానికి గానీ, ఆహారం వండి వడ్డించడానికి గానీ, తాను నివసించే సితార్‌గంజ్ బ్లాక్‌లోని ఆలయం నుండి వచ్చే ప్రసాదాలను స్వీకరించడానికి గానీ అనుమతి ఉండదు.” అని విధా చెప్పింది
మహిళలు 'అపవిత్రం', 'అశుభం' అనే ఈ దృక్పథం, 1,000 మంది పురుషులకు 920 మంది స్త్రీలుగా ఉన్న ఉధమ్ సింగ్ నగర్ జనాభా నిష్పత్తిలో ప్రతిఫలిస్తోంది. ఈ నిష్పత్తి రాష్ట్ర సగటు 963 కంటే కూడా తక్కువగా ఉంది. అలాగే, అక్షరాస్యత రేటు పురుషులలో చెప్పుకోదగ్గంత ఎక్కువగా - 82 శాతం - ఉంది. మహిళల్లో ఇది 65 శాతం మాత్రమే (సెన్సస్ 2011).
మహిళలు 'అపవిత్రం', 'అశుభం' అనే ఈ దృక్పథం, 1,000 మంది పురుషులకు 920 మంది స్త్రీలుగా ఉన్న ఉధమ్ సింగ్ నగర్ జనాభా నిష్పత్తిలో ప్రతిఫలిస్తోంది. ఇది రాష్ట్ర సగటు 963 కంటే కూడా తక్కువగా ఉంది
విధా మంచం క్రింద ఒక థాలీ (పళ్ళెం), ఒక గిన్నె, ఒక స్టీల్ లోటా, ఒక చెంచా ఉంటాయి. ఈ సమయంలో ఆమె తినడానికి తప్పనిసరిగా వీటినే ఉపయోగించాలి. నాల్గవ రోజు ఆమె ఈ పాత్రలను కడిగి ఎండలో ఆరబెట్టడం కోసం త్వరగా త్వరగా నిద్రలేస్తుంది. “అప్పుడు మా అమ్మ ఆ గిన్నెలపై గోమూత్రా (ఆవు మూత్రం)న్ని చల్లి, వాటిని మళ్లీ కడిగి వంటగదిలో ఉంచుతుంది. మిగిలిన రెండు రోజుల కోసం నాకు వేరే పాత్రలు ఇస్తుంది,” తాను అనుసరించాల్సిన విస్తృత విధానాలను వివరిస్తూ అంది విధా.
ఇంటి బయట తిరగడం, 'ఆ రోజుల్లో ధరించడానికి మా అమ్మ నాకిచ్చిన దుస్తులు కాకుండా' వేరేవి ధరించడం ‘నిషిద్ధం' అని ఆమె చెప్పింది. ఆమె ఆ రోజుల్లో ధరించే రెండు జతల బట్టలను ఉతికి, ఇంటి వెనుక భాగంలో ఆరబెట్టాలి. వాటిని ఇతర దుస్తులతో కలపకూడదు.
విధా తండ్రి సైన్యంలో ఉన్నారు. 13 మంది సభ్యులున్న ఆ ఇంటిని నడిపించేది ఆమె తల్లే. ఇంత పెద్ద కుటుంబంలో విడిగా ఉండటం ఆమెకు ఇబ్బందికరంగా ఉంది, ప్రత్యేకించి తన సోదరులకు దాని గురించి చెప్పడం గురించి: “ఇది ఒక అనారోగ్యం అనీ, దీని కోసం అమ్మాయిలు ఇతరుల నుండి విడిగా జీవించవలసి ఉంటుందనీ నా కుటుంబ సభ్యులు నా సోదరులతో చెప్పారు. ఎవరైనా నన్ను తెలియక తాకితే, వారు కూడా 'అపవిత్రులు'గా పరిగణించబడతారు. గోమూత్రా న్ని వారిపై చల్లిన తర్వాత మాత్రమే వారు 'శుభ్రం' అవుతారు". ఆ ఆరు రోజులలో, విధాకు సంబంధించిన ప్రతిదానిపై గోమూత్రా న్ని చల్లుతారు. వారి కుటుంబంలో నాలుగు ఆవులు ఉండటం వలన, వారికి కావలసినప్పుడల్లా వాటి మూత్రం అందుబాటులో ఉంటుంది.
సమాజం స్వల్పంగానే అయినా, కొన్ని పద్ధతులను సడలించింది. 2022లో విధాకు పడుకోవడానికి ప్రత్యేక మంచం దొరికింది కానీ అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల బీనా, తాను వయసులో ఉండగా బహిష్టు అయినప్పుడు పశువుల పాకలో ఎలా ఉండాల్సి వచ్చిందో జ్ఞాపకం చేసుకున్నారు. "మేం కూర్చోవడానికి నేలపై పైన్ చెట్ల ఆకులను వేసేవాళ్ళం" అని ఆమె గుర్తుచేసుకున్నారు
మరొక వృద్ధ మహిళ, ”నాకు ఎండు రోటీల తో పాటు ఫీఖీ (చక్కెర లేని) చాయ్ ఇచ్చేవారు. లేదంటే జంతువులకు పెట్టే ముతక ధాన్యంతో చేసిన రోటీలు ఇచ్చేవారు. కొన్నిసార్లు వాళ్ళు మా గురించి మరచిపోయేవాళ్ళు, మేం ఆకలితో ఉండేవాళ్ళం." అంటూ తన రోజులను గుర్తుచేసుకున్నారు.
చాలామంది స్త్రీ, పురుషులు ఈ పద్ధతులన్నీ మత గ్రంథాలలో నిర్దేశించి ఉన్నాయనీ, వాటిని ప్రశ్నించలేమనీ నమ్ముతారు. కొంతమంది మహిళలు తమకు ఎంత ఇబ్బందిగా ఉన్నా, తామలా విడిగా ఉండకపోతే దేవతలు అసంతృప్తి చెందుతారని నమ్ముతున్నామని కూడా చెప్పారు.
గ్రామానికి చెందిన యువకుడు వినయ్, తాను బహిష్టులో ఉన్న స్త్రీలను కలుసుకోవడం కానీ, ఎదురుపడటం కానీ చాలా అరుదుగా జరిగేదని అంగీకరించాడు. తాను పెరిగి పెద్దవుతున్న వయసులో, ' మమ్మీ అఛూత్ హో గయీహై (అమ్మ ఇప్పుడు అంటరానిదయింది)' అనే మాటల్ని వినివున్నాడు.
ఇరవై తొమ్మిదేళ్ళ ఈ యువకుడు తన భార్యతో కలిసి నానక్‌మత్త పట్టణంలోని ఒక అద్దె గదిలో నివసిస్తున్నాడు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాకు చెందిన అతను, దశాబ్దం క్రితం ఒక ప్రైవేట్ పాఠశాలలో బోధించడం ప్రారంభించినప్పటి నుంచీ ఇక్కడే నివసిస్తున్నాడు. “ఇది సహజమైన ప్రక్రియ అని మాకు ఎప్పుడూ చెప్పలేదు. చిన్నతనం నుండే మనం ఈ ఆంక్షలను పాటించడం మానేసివుంటే, మగవాళ్ళు ఏ అమ్మాయి లేదా, స్త్రీ బహిష్టుగా ఉన్నప్పుడు వారిని ఇంత చిన్నచూపు చూసేవారు కాదు.” అని ఆయన అన్నాడు.
శానిటరీ ప్యాడ్‌లను కొనుగోలు చేయడం, వాడినవాటిని పారవేయడం అనేది ఒక సవాలు. గ్రామాల్లో ఉండే ఒకే ఒక దుకాణంలో అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతే కాకుండా తనలాంటి యువతులు దుకాణదారుని వీటి గురించి అడిగినప్పుడు తమవైపు వింతగా చూస్తున్నారని ఛావి చెప్పింది. ఇంటికి వెళుతున్నప్పుడు, వారు తాము కొనుగోలు చేసిన వాటిని ఎగబడి చూసే కళ్ళ నుండి దాచవలసి వస్తుంది. చివరగా, వాడిన ప్యాడ్‌లను పారేయడానికి 500 మీటర్ల దూరంలో ఉన్న కాలువకు నడచిపోవాలి, దాన్ని కాలువలోకి విసిరే ముందు చుట్టుపక్కల ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకొని, త్వరత్వరగా పారేయాలి.
బిడ్డకు జన్మనివ్వడం మరింత ఒంటరితనాన్ని ఆహ్వానిస్తుంది
'అపవిత్రం' అనే ఆలోచన అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన వారికి కూడా వ్యాపిస్తుంది. లతకు యుక్తవయస్సు పిల్లలు ఉన్నారు. ఆమె తన కాలం నాటి విషయాలను చాలా బాగా గుర్తుంచుకున్నారు: “(బహిష్టులో ఉన్న బాలికలకు ఉన్నట్లుగా) 4 నుండి 6 రోజులకు బదులుగా, కొత్తగా తల్లులైన మహిళలను 11 రోజుల పాటు మిగిలిన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచుతారు. కొన్నిసార్లు ఇది 15 రోజులు, అంటే పుట్టిన బిడ్డకు పేరుపెట్టే కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఉండవచ్చు." లత 15 ఏళ్ల అమ్మాయికీ, 12 ఏళ్ల అబ్బాయికీ తల్లి. కొత్తగా తల్లి అయినవారు పడుకునే మంచాన్ని గుర్తించడానికి ఆవు పేడతో గీతలు గీసేవారని లత చెప్పారు.
ఖటీమా బ్లాక్‌లోని ఝాంకత్ గ్రామంలో ఉన్నపుడు, లత తన భర్తతో పాటు పెద్ద కుటుంబంతో నివసిస్తున్నందున ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేవారు. ఆమె, ఆమె భర్త వేరు వెళ్లినప్పుడు మాత్రమే ఆమె కొద్దికాలం వీటిని పాటించడం ఆపినది. "గత కొన్ని సంవత్సరాలుగా మేం మళ్లీ ఈ సంప్రదాయాలను విశ్వసించడం ప్రారంభించాం" అని పాలిటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్న లత చెప్పారు. “బహిష్టులో ఉన్న స్త్రీ అనారోగ్యం పాలైతే, దేవతలు సంతోషంగా లేరని అంటారు. (కుటుంబంలోనూ, గ్రామంలోనూ) వచ్చే అన్ని సమస్యలకూ ఈ ఆచరణలను పాటించకపోవడమే కారణమని చెప్పవచ్చు," అని ఆమె తనను తాను సమర్థించుకునే ప్రయత్నంలో వివరించారు.
అప్పుడే పుట్టిన బిడ్డ ఉన్న కుటుంబం చేతి నుండి గ్లాసు నీళ్ళు కూడా ఊరిలో ఎవరూ తీసుకోరు. పుట్టింది మగబిడ్డైనా, ఆడబిడ్డైనా మొత్తం కుటుంబాన్ని 'అపవిత్రమైనది'గానే పరిగణిస్తారు. ఎవరైనా బాలెంతరాలినో, పుట్టిన శిశువునో తాకితే, వారిపై గోమూత్రా న్ని చల్లి శుద్ధి చేస్తారు. సాధారణంగా పదకొండవ రోజున ఆ స్త్రీకీ శిశువుకూ స్నానం చేయించి, గోమూత్రం తో కడుగుతారు. ఆ తర్వాత బిడ్డకు పేరుపెట్టే కార్యక్రమం జరుగుతుంది.
లత వదినగారైన సవిత(31)కు 17 సంవత్సరాల వయస్సులో వివాహం అయింది. ఆమె కూడా ఈ ఆచారాలను అనుసరించవలసి వచ్చింది. పెళ్లయిన మొదటి సంవత్సరంలో, లోదుస్తులు ధరించకూడదనే ఆచారాన్ని ఖచ్చితంగా పాటించాల్సి రావటం వలన - కేవలం శరీరాన్ని కప్పుకున్న చీరతోనే - భోజనం చేయాల్సి వచ్చేదని ఆమె గుర్తుచేసుకున్నారు. "నా మొదటి బిడ్డ పుట్టిన తర్వాత నేను దాన్ని పాటించడం ఆపేశాను." అని ఆమె చెప్పారు. కానీ, ఆ తర్వాత నుంచి బహిష్టు అయినప్పుడు తాను నేలపై పడుకుంటున్నట్టు ఆమె అంగీకరించారు.
ఇటువంటి పద్ధతులు అనుసరిస్తున్న ఇళ్లల్లో పెరుగుతున్నందున, ఆ ఇళ్లలోని అబ్బాయిలకు ఏమి ఆలోచించాలో ఖచ్చితంగా తెలియటంలేదు. నిఖిల్, బర్కిదందీ గ్రామంలో 10వ తరగతి చదువుతున్న బాలుడు. తాను గత సంవత్సరం ఋతుస్రావం గురించి చదివాననీ, అయితే అది తనకు పూర్తిగా అర్థం కాలేదనీ నిఖిల్ చెప్పాడు. "ఆడవాళ్లను అలా వేరుగా ఉంచాలనే ఆలోచన అసమంజసమని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను". అయితే ఈ విషయం గురించి ఇంట్లో మాట్లాడితే, కుటుంబంలోని పెద్దలు తనను తిడతారని నిఖిల్ అన్నాడు.
ఇదే భయం దివ్యాంశ్‌కు కూడా ఉంది. సన్‌ఖారి గ్రామానికి చెందిన ఈ 12 ఏళ్ల పాఠశాల విద్యార్థి, తన తల్లి నెలలో ఐదు రోజులు వేరుగా కూర్చోవడాన్ని చూస్తున్నాడు. కానీ అలా ఎందుకో అతనికి అర్థంకాలేదు. “ఇది నాకు చాలా మామూలైపోయింది. స్త్రీలకూ, బాలికలందరికీ కూడా ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడది సరైనదని నాకు అనిపించడం లేదు. నేను పెద్దయ్యాక ఆ ఆచారానికి అనుగుణంగా వెళ్తానా లేదా, దానిని ఆపగలనా?” అని అతను ఆలోచిస్తున్నాడు.
ఆ గ్రామంలోని ఒక పెద్దాయనకు అలాంటి సంఘర్షణేమీ లేదు, “ఉత్తరాంచల్ (ఉత్తరాఖండ్ పాత పేరు) దేవతల నివాసం. కాబట్టి (ఈ) ఆచారాలు పాటించడం ఇక్కడ చాలా ముఖ్యం.” అని నరేందర్ అన్నాడు.
తమ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలకు రజస్వలలు కాకముందే, 9-10 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసేవారని ఆయన చెప్పాడు. "ఆమెకు రుతుక్రమం ప్రారంభమైతే, మనం కన్యాదానం ఎలా చేస్తాం?" అని అతను భర్తకు అమ్మాయిని 'బహుమతి' చేసే ఒక వైవాహిక ఆచారం గురించి మాట్లాడుతూ చెప్పాడు. "ఇప్పుడు ప్రభుత్వం వివాహ వయస్సును 21కి మార్చింది. అప్పటి నుండి ప్రభుత్వానికీ, మాకూ వేర్వేరు నిబంధనలు అమలులో ఉన్నాయి."
ఈ కథనం హిందీ భాషలో నివేదించబడినది . ఇందులోని వ్యక్తుల పేర్లను భద్రతా కారణాల రీత్యా మార్చడమయింది
ఈ కథనాన్ని నివేదించడంలో సహాయపడిన రోహన్ చోప్రాకు PARI ఎడ్యుకేషన్ టీమ్ కృతజ్ఞతలు తెలియజేస్తోంది .
గ్రామీణ భారతదేశంలో, కౌమారదశలో ఉన్న బాలికలు , యువతులు మొదలైన అట్టడుగు సమూహాల జీవన పరిస్థితులను, అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని , పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ లు ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్టును చేపట్టాయి .
ఈ కథనాన్ని తిరిగి ప్రచురించాలనుకుంటున్నారా? దయచేసి zahra@ruralindiaonline.org కు రాయండి. namita@ruralindiaonline.org కు కాపీ పెట్టండి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి