భువనేశ్వర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకకు హాజరై ఆ తర్వాత రాజ్ భవన్‌లో తేనీటి విందులో పాల్గొనాల్సిందిగా ఒడిషా రాష్ట్ర గవర్నర్, వారి సతీమణి కలిసి లక్ష్మీ ఇందిర పాండాను ఆహ్వానించినా, ఆమె తిరస్కరించారు. ఆ ఆహ్వానంలో లక్ష్మీ పాండా కారు కోసం ఒక ప్రత్యేకమైన 'పార్కింగ్ పాస్'ను కూడా చేర్చారు. కానీ లక్ష్మి గారు ఆ ఆహ్వానానికి జవాబు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత వారు ఆహ్వానించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకకు కూడా హాజరు కాలేదు.

లక్ష్మీ పాండా వద్ద కారు లేదు  ఆమె కొరాపుట్ జిల్లా, జెయ్‌పోర్ పట్టణంలోని ఒక చిన్న గదిలో నివసిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా తాను నివసించిన మురికివాడతో పోలిస్తే ఇది మెరుగైనదే. గత సంవత్సరం, తన స్థానిక శ్రేయోభిలాషులు ఆమెకు రైలు టిక్కెట్‌ను కొనివ్వడంతో స్వతంత్ర దినోత్సవ వేడుకకు వెళ్లగలిగారు. అయితే ఈ ఏడాది వెళ్లడానికి ఆమెకు స్తోమత లేదు. ఆ ఆహ్వాన పత్రికను, పార్కింగ్ పాస్‌ను మాకు చూపుతూ ఆమె నవ్వసాగారు. తాను కారుకు అతి సమీపంలో వచ్చింది: “చనిపోయిన నా భర్త నాలుగు దశాబ్దాల క్రితం ఒక డ్రైవరుగా పనిచేసినప్పుడు” అని ఆవిడ వివరించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ(INA)కి చెందిన ఈ సైనికురాలు, తుపాకీ చేతబట్టి ఉన్న తన ఫోటోను గర్వంతో భద్రపరుచుకున్నారు

Laxmi Panda outside her home
PHOTO • P. Sainath

ఈ స్వాతంత్ర సమరయోధురాలిని విస్మరించడం వల్ల ఆమె ఇప్పుడు ఒడిషాలోని కొరాపుట్‌లో ఈ మురికివాడలో నివసించాల్సి వస్తోంది

దేశ స్వతంత్రం కోసం పోరాడిన అనేక గ్రామీణ భారతీయులలో లక్ష్మి కూడా ఒకరు. వీళ్లలో చాలా మంది రాజకీయ నాయకులు, మంత్రులు లేదా గవర్నర్లుగా కాలేకపోయిన సాధారణ ప్రజలు. స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి, చివరికి స్వతంత్రం వచ్చాక తిరిగి యథావిధిగా తమ జీవితాలను గడిపిన ప్రజలు వీరు. దేశం 60వ స్వత్రంత్ర దినోత్సవాన్ని జరుపుకునే సమయానికి ఆ తరానికి చెందిన వారిలో చాలా మంది మరణించారు. మిగిలిన ఆ కొందరి వయసు కూడా ఎనభైలలో లేదా తొంభైలలో ఉండి, అనారోగ్యంతోనో లేదా పేదరికంతోనో బాధలు పడుతున్నారు. (ఈ తరం వారిలో లక్ష్మి మాత్రమే ప్రత్యేకమైన వారు. INAలోకి తన టీనేజ్ వయస్సులో చేరారు కాబట్టి, ఆవిడ వయస్సు ఇప్పుడిప్పుడే 80కి దగ్గరపడుతోంది.) స్వాతంత్ర సమర యోధుల సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తోంది.

ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మీ పాండా గారిని ఒక స్వతంత్ర సమరయోధురాలిగా గుర్తించింది, అయితే అందు వల్ల ఆమెకు అందే నెలవారీ పెన్షన్ కేవలం రూ. 700 మాత్రమే. ఈ మొత్తాన్ని గత సంవత్సరం రూ. 300 పెంచారు. అయినప్పటికీ, చాలా ఏళ్ల పాటు, ఆమెకు అందాల్సిన డబ్బును ఎక్కడికి పంపాలో ఎవరికీ తెలియలేదు. అయితే, స్వతంత్ర పోరాట సమయంలో ప్రముఖులైన ఎందరో INA సభ్యులు ఆమె స్వీయ చరిత్రను నిర్ధారించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆమెకు స్వతంత్ర సమరయోధురాలిగా గుర్తింపును ఇవ్వలేదు. “ఢిల్లీ వాళ్లు నేను జైలుకు వెళ్లలేదు అనే సాకు చెబుతున్నారు,” అని ఆమె చెప్పసాగారు. “అది నిజమే, నేను వెళ్లలేదు. అంత దాకా వస్తే, INAకు చెందిన చాలా మంది ఫైటర్లు జైలుకు వెళ్లనే లేదు. దానర్థం మేము స్వతంత్రం కోసం పోరాడలేదనా? పెన్షన్ పొందడం కోసం నేను నిజాన్నెందుకు కప్పిపుచ్చాలి?”

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో అత్యంత పిన్న వయస్కులైన సభ్యులలో లక్ష్మి ఒకరు. బహుశా, అప్పట్లో బర్మాలోని INA క్యాంప్‌లో చేరిన ఒకే ఒక్క ఒడియా మహిళ. ఇప్పటికీ జీవించి ఉన్నది మాత్రం ఆవిడ ఒక్కరే. అప్పట్లో ఆమె కన్నా ఎంతో ప్రాచుర్యం పొందిన లక్ష్మీ సెహగల్‌కు, తనకు ఒకే పేరు ఉండటం వల్ల గందరగోళం ఏర్పడకుండా ఉండటానికి, నేతాజీనే స్వయంగా తనకు 'ఇందిర' అనే కొత్త పేరు పెట్టారు అని ఆమె చెప్పారు. “‘ఈ క్యాంప్‌లో మాత్రం నీ పేరు ఇందిర' అని ఆయన నాతో అన్నారు. అప్పట్లో అదంతా అర్థం చేసుకోలేనంత చిన్న వయసు నాది. కానీ అప్పటి నుండి నా పేరు 'ఇందిర' అయ్యింది.”

Laxmi Panda

నాకు మల్లే INAలో చాలా మంది జైలుకు వెళ్లలేదు. దానర్థం మేము స్వేచ్చ కోసం పోరాడలేదనా?'

లక్ష్మి గారి తల్లిదండ్రులు బర్మాలో రైల్వే శాఖలో పని చేస్తుండగా బ్రిటీష్ వారి బాంబు దాడిలో మృతి చెందారు. ఆ తర్వాత “బ్రిటీష్ వారితో పోరాడాలనే తపన నాలో మొదలైంది. INAలో ఒడియాకు చెందిన నా సీనియర్లు నాకు పని చెప్పడానికి సంకోచించేవారు. నేను చాలా చిన్నదానిని అనేవాళ్లు. ఏ పనైనా సరే చేస్తాను అని నేను వాళ్లను బతిమాలేదానిని. నా అన్నయ్య నకుల్ రథ్ కూడా INA సభ్యుడే, కానీ యుద్ధంలో కనుమరుగైపోయాడు. ఎన్నో ఏళ్ల తర్వాత, తను జనబాహుళ్యంలోకి వచ్చి భారత సైన్యంలో చేరాడని, కాశ్మీరులో ఉన్నాడని నాకెవరో చెప్పారు. కానీ తనను వెతకడం ఎలా? ఏదైతేనేం, అదంతా అర్ధ శతాబ్దం ముందటి సంగతి.

ఆ క్యాంపులో లెఫ్టినెంట్ జానకి గారిని నేను కలిశాను. అంతే కాక, లక్ష్మీ సెహగల్, గౌరి వంటి ఇతర ప్రముఖ INA ఫైటర్లను కూడా చూశాను.,” అని ఆవిడ చెప్పారు. “యుద్ధపు తర్వాతి భాగంలో మేము సింగపూర్‌కు వెళ్లాం,” అని ఆమె గుర్తు తెచ్చుకున్నారు. “బహదూర్ గ్రూప్‌తో వెళ్లాం అనుకుంటా.” అక్కడ INAకు గల తమిళ సానుభూతిపరులతో బస చేసి, వారి వద్ద కొన్ని తమిళ పదాలను కూడా నేర్చుకున్నారు.

తాను నేర్చుకున్నది నిరూపించేందుకు తన పేరులోని 'ఇందిర' అనే పదాన్ని తమిళంలో రాసి చూపించారు. INA గీతాన్ని గర్వంతో పాడారు: “కదం కదం బఢాయే జా, ఖుషీ కే గీత్ గాయే జా. యే జిందగీ హై కౌమ్ కీ, తూ కౌమ్ పే లుటాయే జా [ఒక్కో అడుగేస్తూ ముందుకు సాగుదాం. సంతోషాల పాటలను పాడుదాం. ఈ ప్రాణం సమాజం కోసమే, సమాజం కోసమే ప్రాణత్యాగం చేద్దాం]."

తుపాకీ చేతబట్టి INA యూనిఫామ్‌లో ఉన్న తన ఫోటో గురించి చెబుతూ, అది "యుద్ధం తర్వాత మేమంతా ఒక చోట చేరి వేర్వేరు మార్గాల్లో వెళ్లాలని అనుకుంటుండగా తీసిన ఫోటో. ఆ తర్వాత కొంత కాలానికే, "బెర్‌హాంపూర్‌లో కాగేశ్వర్ పాండాను 1951లో నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు ఒడియా INA సభ్యులు చాలా మంది మా పెళ్లికి వచ్చారు."

తన INA కామ్రేడ్‌ల జ్ఞాపకాలను ఆమె మర్చిపోలేదు. "నాకు వాళ్లు గుర్తొస్తూ ఉంటారు. నాకు పెద్దగా పరిచయం లేని వాళ్లను కూడా మళ్లీ కలిసే అవకాశం వస్తే బాగుంటుంది. ఒకసారి కటక్‌లో లక్ష్మీ సెహగల్ ప్రసంగిస్తున్నారని తెలియవచ్చింది, కానీ అక్కడికి ప్రయాణించి వెళ్లే స్తోమత నాకు లేదు. కనీసం ఒక్కసారైనా ఆమెను చూసి ఉంటే బాగుండేది. కాన్‌పూర్‌కు వెళ్లేందుకు ఒకే ఒక్క అవకాశం వచ్చింది - కానీ అప్పుడు నన్ను అనారోగ్యం ఆపేసింది. ఇప్పుడు, అలాంటి అవకాశం మళ్లీ వస్తుందా?

1950ల దశకంలో, ఆమె భర్త డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందారు. ఆ తర్వాత “హీరాకుడ్‌లో కొన్నేళ్లు పని చేసుకుంటూ బతికాం. అప్పట్లో నేను సంతోషంగా ఉండే దానిని, బతుకు తెరువు కోసం కూలి పని చేయాల్సి వచ్చేది కాదు. కానీ 1976లో నా భర్త మరణించడంతో నా కష్టాలు మొదలయ్యాయి.”

లక్ష్మి గారు ఒక దుకాణంలో హెల్పర్‌గా, కార్మికురాలిగా, ఇళ్లలో పని మనిషిగా పలు రకాల ఉద్యోగాలు చేశారు. అన్నీ అరకొర జీతాలకే. ఆమె కుమారుడు మద్యానికి బానిసగా మారాడు. అతనికి ఎందరో సంతానమున్నా, అందరూ దుర్బల పరిస్థితుల్లో ఉన్నారు.

Laxmi Panda showing her old photos
PHOTO • P. Sainath

INA యూనిఫామ్ వేసుకుని తుపాకీ చేత పట్టి ఉన్న తన ఫోటోను లక్ష్మీ పాండా చూపిస్తున్నారు

“ఇంత వరకు నేనేదీ కోరలేదు,” అని ఆవిడ చెప్పారు. “నా దేశం కోసం పోరాడాను, రివార్డ్ కోసం కాదు. నా కుటుంబ సభ్యుల కోసం కూడా ఏమీ కోరలేదు. కానీ ఇప్పుడు, నా జీవితపు ఆఖరి దశలోనైనా నా పోరాటానికి గుర్తింపు వస్తుందనే ఆశతో ఉన్నాను.”

అనారోగ్యానికి పేదరికం తోడవడంతో కొన్నేళ్ల క్రితం ఆమె స్థితి దయనీయంగా మారింది. అప్పుడే, జెయ్‌పోర్‌కు చెందిన పరేశ్ రథ్ అనే ఒక యువ విలేకరి ఆమె గురించి ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు. అంతే కాక, తన సొంత ఖర్చుతో ఆమెను మురికివాడ నుండి సింగిల్ రూమ్ ఇంటికి షిఫ్ట్ చేసి, వైద్య ఖర్చులను కూడా భరించారు. ఇటీవలే పాండా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. తన కుమారుడి అలవాట్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి అతని ఇంట్లోనే బస చేస్తున్నారు. రథ్ ప్రచురించిన వార్త తర్వాత మరిన్ని వార్తా కథనాలు ఆమె గురించి వచ్చాయి. ఒకసారి ఒక జాతీయ పత్రిక కవర్ పేజీపై కూడా ఆమె వార్తను ప్రచురించారు.

“మేము మొదటి వార్తా కథనాన్ని ప్రచురించినప్పుడు, ఆమెకు కొంత సాయం అందింది,” అని రథ్ చెప్పారు. “అప్పటి కొరాపుత్ కలెక్టర్ అయిన ఉషా పధీ ఆమెపై సానుభూతి కనబర్చి, వైద్య సహాయంగా రెడ్ క్రాస్ ఫండ్ నుండి రూ. 10 వేలను మంజూరు చేశారు. దాంతో పాటు కొంత ప్రభుత్వ భూమిని కూడా కేటాయిస్తామని మాటిచ్చారు. కానీ పధీ గారు ట్రాన్స్‌ఫర్ అయ్యి జిల్లాను వీడి వెళ్లిపోయారు. బెంగాల్ నుండి కొందరు ప్రజలు కూడా ఆమెకు విరాళాలను పంపారు.” అయితే, కొంత కాలం తర్వాత అవి కూడా అడుగంటి పోయి ఆమె పరిస్థితి యథాతథం అయ్యింది. “అయినా కూడా, ఇక్కడ విషయం కేవలం డబ్బు మాత్రమే కాదు,” అని రథ్ వివరించారు. “ఆమెకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసినా, ఈ వయసులో ఇంకెన్నేళ్లు దానిని ఆమె ఉపయోగించుకోగలదు? నిజానికి ఆ పెన్షన్ అనేది ఆమెకు అందాల్సిన గుర్తింపు, గౌరవం అని ఆవిడ భావిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రమూ స్పందించలేదు.”

విసిగి వేసారేంతగా ఎన్నో సార్లు ప్రయత్నించిన మీదట, గత సంవత్సరం చివర్లో లక్ష్మి గారికి ఈ జిల్లాలో పాంజియాగూడ గ్రామంలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఆ భూమిపై ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఉన్నారు. ప్రస్తుతానికి, ఆమె పాత గదికి పక్కన ఉన్న గదిని మెరుగుపరిచేందుకు రథ్ నగదు సాయం చేశారు, త్వరలోనే ఆమెను ఆ గదిలోకి షిఫ్ట్ చేద్దామని ఆశిస్తున్నారు.

ఇప్పుడు స్థానికంగా ఆమెకు కాస్త పేరు వచ్చింది. ఆమెకు సాయం చేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. “రేపు, ఇక్కడి దీప్తి స్కూల్‌లో జాతీయ జెండాను ఎగరవేయబోతున్నాను. వాళ్లే నన్ను పిలిచి అడిగారు” అని ఆమె గర్వంతో చెప్పారు, అయితే “ఫంక్షన్‌కు వేసుకు వెళ్లడానికి ఒక మంచి చీర” లేదని ఆందోళన చెందుతున్నారు.

మరో వైపు, ఈ INA వృద్ధ సైనికురాలు తన తర్వాతి పోరాటాన్ని ప్లాన్ చేస్తున్నారు. “'చలో ఢిల్లీ’ అని నేతాజీ నినాదాన్ని ఇచ్చారు. ఆగస్ట్ 15 తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నన్ను స్వాతంత్ర సమరయోధురాలిగా గుర్తించకపోతే అదే చేస్తాను. పార్లమెంట్ ముందు ధర్నా చేస్తాను,” అని ఆ వృద్ధ మహిళ చెప్పారు. “చలో ఢిల్లీ, అదే చేస్తాను.”

ఆమె అలానే నడుస్తూ ఉంటుంది, ఆరు దశాబ్దాలు ఆలస్యమైనా సరే ఆమె మనసులో ఆశ చావలేదు. ఆమె పాడే పాట లాగా, “ఒక్కో అడుగేస్తూ ముందుకు సాగుదాం …”

ఫోటోలు: పి. సాయినాథ్

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at raghunathtelugu@protonmail.com

Other stories by Sri Raghunath Joshi