“పద్నాలుగు, పదహారు, పద్దెనిమిది...” అఠ్ఠ్యా వీపుకు తగిలించిన కావడి సంచిలో తాను పెడుతున్న పచ్చి ఇటుకలను లెక్కించడం ఆపేసి, ఇక బయలుదేరమన్నట్టు ఆ గాడిదతో ఇలా అన్నారు ఖండూ మానే: “ చలా ( పద )... ఫ్ర్‌ర్ ... ఫ్ర్‌ర్ ... ” ఆ వెంటనే అఠ్ఠ్యాతో పాటు మరో రెండు బరువులెక్కించిన గాడిదలు దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్న బట్టీ (ఆవం) వైపు నడక ప్రారంభించాయి; ఇటుకలను ఆవంలో కాల్చేందుకు అక్కడ దింపుతారు.

“ఇంకో గంట కష్టపడితే మేం విశ్రాంతి తీసుకోవచ్చు,” అన్నారు ఖండూ. కానీ, అప్పటికి సమయం ఉదయం తొమ్మిదే అయ్యింది! మా అయోమయం ముఖాలను చూసి అతనిలా వివరించారు: “మధ్యరాత్రి ఒంటిగంటకు చీకటితోనే పని మొదలుపెట్టాం. మా బదిలీ ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. రాత్ భర్ హే అసంచ్ చాలూ అహే (రాత్రంతా మేం ఈ పనే చేస్తున్నాం).”

ఖండూకి చెందిన గాడిదల గుంపులోని నాలుగు గాడిదలు ఖాళీ సంచులతో ఆవం నుండి తిరిగి వచ్చాయి; అతను మళ్ళీ లెక్క మొదలుపెట్టారు: “పద్నాలుగు, పదహారు, పద్దెనిమిది...”

ఉన్నట్టుండి, “ రుకో (ఆగు). ..” అంటూ ఒక గాడిదని ఉద్దేశించి హిందీలో అరిచారు మానే. “ఇక్కడి మా గాడిదలు మరాఠీని అర్థంచేసుకుంటాయి కానీ, ఇది రాజస్థాన్‌కు చెందినది. దీనికి హిందీలో సూచనలివ్వాలి,” మనసుతీరా నవ్వుతూ చెప్పారాయన. అలాగే సరదాగా మాకొక డెమో కూడా ఇచ్చారు: “ రుకో ”. గాడిద ఆగింది; “ చలో ”. గాడిద కదిలింది!

తన నాలుగు కాళ్ళ స్నేహితులంటే ఖండూకి ఉన్న గర్వం స్పష్టంగా తెలిసిపోతోంది. “లింబూ, పంధర్యాలు మేతకు బయలుదేరాయి; అలాగే నాకిష్టమైన బుల్లెట్ కూడా. అది పొడుగ్గా, సొగసుగా ఉంటుంది. మహా చురుకైనది కూడా!”

PHOTO • Ritayan Mukherjee

సాంగ్లీ నగర శివార్లలోని సాంగ్లీవాడీ జోతిబా మందిర్ సమీపంలో ఉన్న ఇటుక బట్టీ దగ్గర అఠ్ఠ్యా వీపుపై ఇటుకలను పేరుస్తున్న ఖండూ మానే

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: జోతిబా మందిర్ సమీపంలోని బట్టీ దగ్గర, ఇటుకల తయారీలో ఉపయోగించే ఎండు చెఱకు పిప్పిని ఎత్తుతున్న విలాస్ కుడచి, రవి కుడచి. కర్ణాటకలోని బెలగాం జిల్లా, అథణి తాలూకా నుండి వీళ్ళు వలస వచ్చారు; కుడి: ఒకసారి బరువు దింపిన తర్వాత మరిన్ని ఇటుకల కోసం తిరిగి వస్తున్న గాడిదలు

మహారాష్ట్రలోని సాంగ్లీ నగర శివార్లలో ఉన్న సాంగ్లీవాడీ సమీపంలోని ఇటుక బట్టీ దగ్గర మేమతన్ని కలిశాం. జోతిబా మందిర్ చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఇటుక బట్టీలతో నిండిపోయి ఉంది – దాదాపు 25 వరకూ ఉన్న బట్టీలు మా లెక్కకు వచ్చాయి.

ఇటుకల తయారీలో ఉపయోగించే ఎండిన చెఱకు పిప్పి వెదజల్లే సువాసన, బట్టీ నుండి వచ్చే పొగ కలిసిపోయి ఆ ఉదయపు గాలిని నింపేశాయి. ప్రతి బట్టీ దగ్గర పురుషులు, స్త్రీలు, పిల్లలు, గాడిదలు రాత్రీ పగలూ అని లేకుండా రోజంతా పని చేయడాన్ని మేం గమనించాం. కొందరు మట్టిని కలుపుతుంటే, మరికొందరు ఇటుకలను అచ్చు పోస్తున్నారు; కొందరు వాటిని మోసుకుపోతుంటే, ఇంకొందరు వాటిని దింపి, వరుసలుగా పేరుస్తున్నారు.

గాడిదలు వస్తూ పోతూ ఉన్నాయి. జతలు జతలుగా, రెండు... నాలుగు... ఆరు…

“మేం తరతరాలుగా గాడిదలను పెంచుతున్నాం. నా తాతలు పెంచారు, నా తల్లిదండ్రులు పెంచారు, ఇప్పుడు నేను పెంచుతున్నాను,” అని ఖండూ తెలిపారు. సోలాపూర్ జిల్లా పంఢర్‌పూర్ బ్లాక్ లోని వేలాపూర్ గ్రామానికి చెందిన ఖండూ కుటుంబం, ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లో (నవంబర్-డిసెంబర్ నుండి ఏప్రిల్-మే వరకు), 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీకి వాళ్ళ గాడిదలతో సహా వలస వచ్చి, ఇటుకలు తయారు చేస్తుంటారు.

ఖండూ భార్య మాధురి బట్టీ దగ్గర గాడిదలు మోసుకొచ్చిన పచ్చి ఇటుకలను దించడం, వరుసలుగా పేర్చడం లాంటి పనులలో మునిగిపోయి కనిపించారు. వీరి కూతుళ్ళు కళ్యాణి, శ్రద్ధ, శ్రావణి (9-13 ఏళ్ళ వయసులో ఉన్నారు) గాడిదలతోపాటే నడుస్తూ, వాటిని గమ్యస్థానానికి చేరుస్తున్నారు. వారి నాలుగైదేళ్ళ వయసున్న తమ్ముడు బిస్కెట్లు తింటూ, టీ తాగుతూ తండ్రికి దగ్గరగా కూర్చొనివున్నాడు.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: మాధురి మానే తన వైపు విసిరిన ఇటుకలను అవలీలగా పట్టుకొని వరుసలుగా పేరుస్తున్న కార్మికుడు; కుడి: మాధురి, ఆమె పిల్లలు ఇటుక బట్టీ దగ్గరలోనే ఉన్న ఒక ఇరుకైన ఇంట్లో నివసిస్తున్నారు. వదులుగా పేర్చిన ఇటుక లు, ఆస్బెస్టాస్ షీట్లతో వేసిన పైకప్పు ఉన్న తాత్కాలిక నిర్మాణం ఇది. మరుగుదొడ్డి లేదు, పగటిపూట కరెంటు ఉండదు

“సాంగ్లీలోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రావణి, శ్రద్ధ చదువుతున్నారు. కానీ, మాకు సహాయంగా ఉంటారని బడినుంచి తీసుకొచ్చేశాం,” ఒకేసారి రెండేసి ఇటుకలను సహ కార్మికుడికి అందిస్తున్న మాధురి చెప్పారు. “ఇక్కడ మాకు సహాయంగా ఉండేందుకని ఒక జంటను (భార్యాభర్తలు) నియమించుకున్నాం. కానీ, రూ.80,000 అడ్వాన్స్ తీసుకుని వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు రెండు నెలల్లో ఈ పనంతా మేమే పూర్తి చేయాలి,” మాకు అసలు విషయం చెప్పి మళ్ళీ పనిలో పడ్డారావిడ.

మాధురి అందిస్తోన్న ఒక్కో ఇటుక కనీసం రెండు కిలోల బరువుంటుంది. ఎత్తుగా పేర్చివున్న ఇటుకల వరుసలపై నిలబడి ఉన్న మరొక కార్మికుడి వైపు ఆమె వాటిని విసురుతున్నారు..

“పది, పన్నెండు, పద్నాలుగు...” అని లెక్కిస్తూ, కొద్దిగా వంగి వేగంగా పట్టుకొంటూ, బట్టీ లో కాల్చడానికి పేర్చిన ఇటుకల వరుసలో వాటిని పెడుతున్నాడతను.

*****

ఇలా ప్రతిరోజూ, అర్ధరాత్రి మొదలుకొని ఉదయం 10 గంటల వరకు ఖండూ, మాధురి, వారి పిల్లలంతా కలిసి దాదాపు 15,000 ఇటుకలను బట్టీ వద్దకు తీసుకువచ్చి, వరుసలుగా పేరుస్తారు. వీటిని 13 గాడిదల సహాయంతో అక్కడకు చేరుస్తారు. ఒక్క రోజులో, ఒక్కో గాడిద దాదాపు 2,300 కిలోల బరువును మోస్తుంది. తమని కాచే కాపరితో కలిసి, ఇవి మొత్తం 12 కిలోమీటర్ల దూరం వరకు నడుస్తాయి.

బట్టీ వరకు తీసుకెళ్ళే ప్రతి 1,000 ఇటుకలకుగాను ఖండూ కుటుంబానికి రూ.200 వస్తాయి. ఆరు నెలలు పని చేసేందుకు ఇటుక బట్టీ యజమాని వాళ్ళకి బయానాగా చెల్లించిన డబ్బులో దీనిని సర్దుబాటు చేస్తారు. గత సీజన్‌లో, ఖండూ-మాధురీలు గాడిదకు రూ.20,000 చొప్పున రూ.2.6 లక్షలు బయానాగా తీసుకున్నారు.

PHOTO • Ritayan Mukherjee

గాడిదలు రవాణా చేసిన ఇటుకలను దించి, వాటిని వరసలో పేర్చేందుకు కార్మికులకు అందిస్తున్న మాధురి, ఆమె భర్త ఖండూ (పసుపు రంగు టి-చొక్కా వేసుకున్నవారు)

“మేం సాధారణంగా ఒక్కో గాడిదకు రూ.20,000 చొప్పున లెక్క వేసుకుంటాం,” అని ఇరవయ్యోవడిలో ఉన్న వికాస్ కుంభార్ ధృవీకరించారు. సాంగ్లీకి 75 కిలోమీటర్ల దూరంలో, కొల్హాపూర్ జిల్లాలోని భాంబ్‌వడేలో అతనికి రెండు ఇటుక బట్టీలు ఉన్నాయి. “(గాడిద కాపరులకు) అన్ని చెల్లింపులు ముందుగానే జరిగిపోతాయి.” ఎన్ని ఎక్కువ గాడిదలు ఉంటే, అంత పెద్ద మొత్తం బయానాగా ఇవ్వాలి.

ఇచ్చిన బయానా, ఇతర ఖర్చులు పోను ఆరు నెలల్లో ఎన్ని ఇటుకలు తయారు చేశారన్న దానినిబట్టి మిగిలిన డబ్బును వాళ్ళకి చివర్లో ఇస్తారు. “వాళ్ళ చేసే ఉత్పత్తి, కిరాణా సామాగ్రి కోసం వారంవారీగా చేసే చెల్లింపులు (ఒక్కో కుటుంబానికి రూ.200-250 చొప్పున), ఇతర ఖర్చులను బట్టి మేం డబ్బు సర్దుబాటు చేస్తాం,” అని వికాస్ వివరించారు. ఇచ్చిన బయానాకు తగ్గట్టు ఆ సీజన్‌లో గాడిద కాపరులు పని చేయలేకపోతే, తర్వాతి సీజన్లో వాళ్ళు ఆ అప్పును తీర్చాల్సివుంటుంది. ఖండూ-మాధురి లాంటి కొందరు, ఆ బయానాలో కొంత భాగాన్ని పనిలో తమకు సహాయం చేసే వారికోసం కేటాయిస్తారు.

*****

“సాంగ్లీ జిల్లాలోని పలూస్-మ్హైసాల్ గ్రామాల మధ్య, కృష్ణానదీ తీరాన, దాదాపు 450 ఇటుక బట్టీలు ఉన్నాయి,” అని ఆ ప్రాంతంలోని ఒక జంతు సంరక్షణ సంస్థ అయిన యానిమల్ రాహత్‌కు చెందిన ఒక కార్యకర్త చెప్పారు. దాదాపు 80-85 కిలోమీటర్ల పొడవున్న ఈ నదీతీరం నడిమధ్యన సాంగ్లీవాడీ ఉంది. “ఇక్కడి బట్టీలలో 4,000 కంటే ఎక్కువే గాడిదలు పని చేస్తున్నాయి,” అని అతని సహోద్యోగి తెలిపారు. వాళ్ళిద్దరూ ఎప్పటిలాగే గాడిదల యోగక్షేమాలను పరిశీలించేందుకు వచ్చారు. వారి సంస్థ అంబులెన్స్ సేవను, అత్యవసర వైద్య సేవలను కూడా అందిస్తోంది.

ప్రతిరోజూ పని ముగిశాక, జోతిబా మందిర్ దగ్గరున్న నది వైపు గుంపులు గుంపులుగా గాడిదలు పరిగెత్తడాన్ని మనం చూడొచ్చు. మోటర్ సైకిళ్లు, సైకిళ్లను నడిపే యువ కాపరులు వాటిని మేతకు తీసుకెళ్తారు. ఈ ప్రాంతంలో పోగుపడివుండే వ్యర్థాలపై గాడిదలు తమ లద్దెలను విసర్జిస్తాయి. సాయంత్రం వేళ కాపరులు వాటిని తిరిగి ఇంటికి తోలుకెళ్తారు. ఖండూ-మాధురి లాగే ఇతర గాడిద కాపరులు కూడా తమ గాడిదలకు దాణా పెడతామని చెబుతున్నారు గానీ, ఎక్కడా దాని జాడ మాత్రం కనిపించదు.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: మోటర్ సైకిల్ నడుపుతూ తన గాడిదల గుంపును మేతకు తీసుకెళ్తున్న ఒక కాపరి; కుడి: గాడిద కాపరులకు పశువైద్య సహాయాన్ని అందించే ఒక ఎన్‌జిఒకు చెందిన కార్యకర్త, జగూ మానేకు చెందిన గాడిదకు ఇంజెక్షన్ చేస్తున్నారు

“మా పశువులకు గడ్డి, కడ్బా (ఎండిన జొన్నచొప్ప) కోసం మేము ప్రతి సంవత్సరం రెండు గుంఠల (దాదాపు 0.05 ఎకరాలు) వ్యవసాయ భూమిని అద్దెకు తీసుకుంటాం,” అని 45 ఏళ్ళ జనాబాయి మానే చెప్పారు. అద్దె (ఆరు నెలలకు) రూ.2,000 ఉంటుంది. “ఇక్కడే ఒకటి గమనించండి; మా జీవితం వాటిపైనే ఆధారపడి ఉంది. వాటికి తిండి దొరకనప్పుడు మేమెలా బాగా తినగలం?”

తగరపు పైకప్పుతో ఉన్న ఇంట్లో కూర్చొని, మాతో మాట్లాడుతూనే ఆమె తన మధ్యాహ్న భోజనాన్ని ముగించారు. ఆ ఇంటి గోడలను ఒకదానిపై ఒకటి వదులుగా పేర్చిన ఇటుకలతో కట్టారు; మట్టి నేలను తాజా ఆవు పేడతో అలికారు. ఆమె మమ్మల్ని ఒక ప్లాస్టిక్ చాపపై కూర్చోమని కోరారు. “మేం (సతారా జిల్లా) ఫల్టణ్ వాసులం. మా గాడిదలకు అక్కడ పనేమీ ఉండదు. అందుకే, గత 10-12 సంవత్సరాలుగా ఇక్కడ సాంగ్లీలోనే పని చేసుకుంటున్నాం. జిథే త్యాంనా కామ్, తిథే ఆమ్హి (వాటికి ఎక్కడ పని దొరికితే మేం అక్కడికే వెళ్తాం),” అన్నారు జనాబాయి. కాలాన్ని బట్టి వలసవచ్చే ఖండూ కుటుంబంలా కాకుండా, ఏడుగురు సభ్యులున్న జనాబాయి కుటుంబం సంవత్సరం పొడువునా సాంగ్లీలోనే నివసిస్తుంది.

ఇటీవలే, జనాబాయి కుటుంబం సాంగ్లీ నగర శివార్లలో 2.5 గుంఠల భూమిని (సుమారు 0.6 ఎకరాలు) కొనుగోలు చేసింది. “పదేపదే వచ్చే వరదలు నా గాడిదలకు ప్రాణాంతకంగా ఉంటాయి. అందుకే కొండ పక్కనే ఉన్న భూమిని కొన్నాం. కిందిభాగంలో గాడిదలు ఉండేలా, మొదటి అంతస్తులో మేం ఉండేలా ఇల్లు కట్టుకుంటాం," మనవడు వచ్చి ఆమె ఒళ్ళో కూర్చుంటుండగా, సంతోషంతో ఉప్పొంగిపోతూ చెప్పారావిడ. జనాబాయి మేకలను కూడా పెంచుతున్నారు; మేత కోసం అవి అరవడం మాకు వినిపించింది. “నా చెల్లెలు నాకొక ఆడమేకను బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు నా దగ్గర 10 మేకలు ఉన్నాయి.” జనాబాయి సంతృప్తి నిండిన గొతుతో చెప్పారు.

“ఇప్పుడు గాడిదలను పెంచడం చాలా కష్టంగా మారిపోతోంది. ఒకప్పుడు మా దగ్గర 40 గాడిదలు ఉండేవి. గుజరాత్ నుండి తెచ్చుకున్న గాడిద గుండెపోటుతో చనిపోయింది. మేము దాన్ని కాపాడుకోలేకపోయాం.” అన్నారు జనాబాయి. ప్రస్తుతం వాళ్ళ దగ్గర 28 గాడిదలున్నాయి. ప్రతి ఆరు నెలలకొకసారి, లేదా రెండుసార్లు సాంగ్లీ నుండి ఒక పశువైద్యుడు వారి పశువులను చూసేందుకు వస్తారు. కానీ, గత మూడు నెలల్లోనే, జనాబాయి కుటుంబం నాలుగు గాడిదలను కోల్పోయింది. మేయడానికి వెళ్ళినపుడు ఏదో విషపదార్థాన్ని తిని మూడు, ప్రమాదంలో ఒకటి మరణించాయి. “నా తల్లిదండ్రుల తరం వాళ్ళకి మూలికల మందులు తెలుసు కానీ, మాకు తెలీదు. ఇప్పుడు మేం దుకాణానికి వెళ్ళి సీసాలలో అమ్మే మందులను కొంటున్నాం,” అని ఆమె బాధపడ్డారు.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: సాంగ్లీలో జనాబాయి మానే కుటుంబం దగ్గర 28 గాడిదలున్నాయి. ‘ఇప్పుడు గాడిదలను పెంచడం చాలా కష్టమవుతోంది’; కుడి: ప్రతిరోజూ పని మొదలెట్టే ముందు, ఆమె కొడుకు సోమనాథ్ మానే గాడిదల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తారు

*****

మహారాష్ట్రలోని కైకాడి, బేల్దార్, కుంభార్, వడార్‌తో సహా అనేక జాతులు గాడిదలను పెంచుతాయి. బ్రిటిష్ పాలకులు 'నేరస్తులు'గా ప్రకటించిన సంచార జాతులలో కైకాడి జాతి కూడా ఒకటి. ఖండూ, మాధురి, జనాబాయిలు ఈ జాతికి చెందినవారే. 1952లో, వలసవాద నేరస్త జాతుల చట్టం రద్దు అయిన తర్వాత, ఈ జాతులు 'నేరస్తుల జాబితా' నుండి విముక్తిచెందారు. కానీ, ఇప్పటికీ ఈ జాతులు ఆ కళంకాన్ని మోస్తూ, సమాజంలో అనుమానపు చూపులనూ అవమానాలనూ ఎదుర్కొంటున్నాయి. సంప్రదాయకంగా కైకాడిలు బుట్టలు, చీపుర్లు తయారుచేస్తారు. ఇప్పుడు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఈ జాతి విముక్త జాతి (డీనోటిఫైడ్ ట్రైబ్) జాబితాలో ఉంది. విదర్భలోని ఎనిమిది జిల్లాలలో మాత్రం కైకాడి జాతి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరించబడి ఉంది.

పశుసంపదగా గాడిదలను పెంచుకునే చాలామంది కైకాడిలు పూణే జిల్లాలోని జెజురిలో గానీ, అహ్మద్‌నగర్ జిల్లాలోని మఢి వద్దగానీ గాడిదలను కొంటారు. కొందరు గుజరాత్, రాజస్థాన్‌లోని గాడిదలను అమ్మే బజారులను కూడా సందర్శిస్తారు. “రెండు గాడిదల ధర రూ.60,000 నుండి 1,20,000 వరకూ పలుకుతుంది. దంతాలు లేని గాడిద ధర ఎక్కువుంటుంది,” అని జనాబాయి వివరించారు. గాడిద వయసును దాని దంతాలను బట్టి అంచనా వేస్తారు. పుట్టిన కొన్ని వారాల్లోనే గాడిదకి దంతాలు వస్తాయి. కానీ అవి నెమ్మదిగా ఊడిపోయి, దానికి ఐదేళ్ళ వయసు వచ్చేటప్పటికి శాశ్వత దంతాలు వస్తాయి.

అయితే, గత దశాబ్ద కాలంగా భారతదేశంలో గాడిదల జనాభా బాగా తగ్గుముఖం పడుతుండటం చాలా ఆదుర్దా కలిగిస్తోంది  2012-2019 మధ్య కాలంలో, వాటి సంఖ్య 61.2 శాతం పడిపోయింది. 2012లో జరిగిన పశుగణనలో వాటి సంఖ్య 3.2 లక్షలుగా నమోదు కాగా, 2019లో అది 1.2 లక్షలకు పడిపోయింది. దేశంలో అత్యధిక గాడిదల జనాభా ఉన్న రెండో రాష్ట్రంగా పేరుగాంచిన మహారాష్ట్రలో – 2019 పశుగణన లెక్కల ప్రకారం 17,572 – వాటి జనాభా అదే సమయంలో 40 శాతానికి తగ్గింది.

ఇంత వేగంగా గాడిదల జనాభా తగ్గిపోవడం, లాభాపేక్ష లేని జంతు సంక్షేమ సంస్థ అయిన బ్రూక్ ఇండియాను, ఒక పరిశోధనాత్మక అధ్యయనాన్ని చేపట్టేలా చేసింది. ఈ అధ్యయనాన్ని చేసిన జర్నలిస్ట్ శరత్ కె వర్మ ఇచ్చిన నివేదిక ఇందుకు అనేక కారణాలను గుర్తించింది – గాడిదల వినియోగం తగ్గిపోవడం, సంచార జాతులు వాటిని పెంచడం మానేయడం, పెరిగిన యంత్రాల వాడకం, పశువుల మేత భూముల విస్తీర్ణం తగ్గిపోవడం, చట్టవిరుద్ధంగా వాటిని చంపేయడం, గాడిదలను దొంగిలించటం.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: తన గాడిదను ముద్దుచేస్తున్న ఒక కాపరి; కుడి: మిరాజ్ పట్టణం, లక్ష్మీ మందిర్ ప్రాంతంలోని బట్టీ వద్ద ఇటుకలను దించుతున్న కార్మికుడు

“దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతంలో, గాడిద మాంసానికి మంచి డిమాండ్ ఉంది,” అని సాంగ్లీకి చెందిన బ్రూక్ ఇండియా ప్రోగ్రామ్ సమన్వయకర్త డాక్టర్ సుజిత్ పవార్ చెప్పారు. ఆంధ్రాలోని పలు జిల్లాల్లో, మాంసం కోసం గాడిదలను అక్రమంగా చంపేస్తున్నారని వర్మ అధ్యయనం పేర్కొంది. చౌకగా ఉండటమే కాకుండా, గాడిద మాంసం ఔషధ విలువలను కలిగి ఉంటుందని, పురుషులలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుందని చాలామంది నమ్ముతారు.

అలాగే, గాడిద చర్మం అప్పుడప్పుడూ చైనాకు దొంగతనంగా రవాణా అవుతోందని పవార్ తెలిపారు. 'ఎజియావో' అని పిలిచే ఒక సంప్రదాయ చైనా ఔషధం తయారీలో ముడి పదార్ధంగా వాడడం వలన, దీనికి చాలా డిమాండ్ ఉంది. గాడిదలను చంపడం, దొంగతనం చేయడం మధ్య ఉన్న సంబంధాన్ని బ్రూక్ ఇండియా నివేదిక వివరించింది. చైనాలో ఉన్న డిమాండ్ వల్ల ఊపందుకున్న ఈ గాడిద చర్మం వ్యాపారం, భారతదేశంలో ఈ పశువుల జాతి అంతరించిపోయేందుకు కారణమవుతోందని ఆ నివేదిక నిర్ధారించింది.

*****

దొంగతనం వలన బాబాసాహెబ్ బబన్ మానే(45) తన 10 గాడిదలను ఆరేళ్ళ క్రితం పోగొట్టుకున్నారు. “అప్పటి నుండి, నేను ఇటుకలను పేర్చుతున్నాను కానీ, (మునుపటి కంటే) తక్కువ సంపాదిస్తున్నాను.” ప్రతి 1,000 ఇటుకలకుగాను గాడిద కాపరులు రూ. 200 సంపాదిస్తే, ఇటుక పేర్చేవారు కేవలం రూ. 180 సంపాదిస్తారు (ఈ అదనపు రూ. 20 గాడిదలకు మేతను కొనడానికి కాపరులకు ఇస్తారని మాధురి మాతో చెప్పారు). సాంగ్లీవాడీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిరాజ్ పట్టణంలో, లక్ష్మీ మందిర్ సమీపంలోని బట్టీలో, మేం బాబాసాహెబ్‌ని కలిశాం. “ఒకసారి ఒక వ్యాపారి మ్హైసాల్ ఫాటా లో 20 గాడిదలను పోగొట్టుకున్నాడు,” అంటూ ఈ బట్టీ నుండి 10 కిలోమీటర్ల దూరంలో జరిగిన మరొక దొంగతనం గురించి అతను గుర్తుచేసుకున్నారు. “జంతువులకు మత్తుమందు ఇచ్చి, తమ వాహనాల్లో తీసుకెళ్తారనుకుంటా దొంగలు!” రెండేళ్ళ క్రితం, మేతకు వెళ్ళినప్పుడు, జనాబాయికు చెందిన ఏడు గాడిదలను కూడా దొంగలు ఎత్తుకుపోయారు.

మహారాష్ట్రలోని సాంగ్లీ, సోలాపూర్, బీడ్ తదితర జిల్లాల్లో గాడిదల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి . దాంతో, వాటిపై ఆధారపడి బతికే బాబాసాహెబ్, జనాబాయి లాంటి కాపరులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. “దొంగలు నా మంద నుండి ఐదు గాడిదలను ఎత్తుకుపోయారు. అంటే దాదాపు రూ.2 లక్షల నష్టం. ఈ నష్టాన్ని నేను ఎలా పూడ్చుకోవాలి?” అంటూ మిరాజ్‌లోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న జగూ మానే ప్రశ్నించారు.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: మిరాజ్‌లోని బట్టీలో పేర్చివున్న ఇటుకలపై విరామం తీసుకుంటున్న బాబు విఠల్ జాదవ్ (పసుపు చొక్కా); కుడి: గడ్డిని, ఎండు చొప్పనూ మేస్తున్న తన గాడిదలకు కాపలా కాస్తున్న కైకాడి సామాజికవర్గానికి చెందిన 13 ఏళ్ళ బాలుడు, రమేశ్ మానే

అయితే, కొంతమంది గాడిదల యజమానులు తమ గాడిదలను కనీసం కాపలా కూడా పెట్టకుండా రోజంతా బయటే వదిలేసి, అలసత్వంతో ఉంటారని పవార్ అన్నారు. “వాటికి ఏ రక్షణా ఉండదు. పనికి కావలసి వచ్చినప్పుడు మాత్రమే గాడిదలను తీసుకుపోతారు. ఈలోగా ఏదైనా జరిగితే, (గాడిదలను) చూసుకోవడానికి ఎవరూ ఉండరు!” అన్నారు పవార్.

మేం బాబాసాహెబ్‌తో మాట్లాడుతున్నప్పుడు, బాబు విఠల్ జాదవ్ ఇటుకలు దించడానికి తన నాలుగు గాడిదలను తీసుకొస్తూ కనబడ్డారు. కైకాడి సామాజికవర్గానికి చెందిన 60 ఏళ్ళ బాబు, గత పాతికేళ్ళుగా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. సోలాపూర్ జిల్లా మొహోల్ బ్లాక్‌లోని పాట్‌కుల్‌కు చెందిన అతను, సంవత్సరంలో ఆరు నెలల పాటు మిరాజ్‌కు వలస వస్తారు. అతను అలసిపోయినట్టున్నారు; కూర్చున్నారు. అప్పుడు సమయం ఉదయం 9 గంటలవుతోంది. బాబాసాహెబ్‌తోనూ, మరో ఇద్దరు మహిళా కార్మికులతోనూ పరాచికాలు ఆడుతూ, బాబు ఆ రోజుకింక విశ్రాంతి తీసుకుంటుండగా, అతని భార్య పనిలో నిమగ్నమయ్యారు. వారికి ఆరు గాడిదలు ఉన్నాయి. అవి బక్కగా, చాకిరీతో అలసిపోయినట్టుగా కనిపించాయి. వాటిలో రెండు గాడిదల కాళ్ళకు గాయాలున్నాయి. వారి పని ముగియడానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది.

నెలలో అమావాస్య నాడు ఒక్కరోజు మాత్రమే సెలవు కావడంతో అందరూ అలసి సొలసి ఉంటారు. “మేం విరామం తీసుకుంటే, కాల్చడానికి ఇటుకలను ఎవరు మోసుకొస్తారు?” జోతిబా మందిరానికి తిరిగి వచ్చిన మాధురి ప్రశ్నించారు. “ఎండిన ఇటుకలను తీసుకెళ్ళకపోతే, కొత్తగా తయారైనవాటిని పెట్టడానికి చోటుండదు. కనుక మేం విరామం తీసుకోలేం. ఆరు నెలల వరకు అమావాస్య ఒక్కటే మాకు సెలవు దినం.” అమావాస్య నాటి చంద్రుని దశను అశుభంగా భావిస్తారు కాబట్టి ఆ రోజు బట్టీలను మూసివేస్తారు. కార్మికులకూ, గాడిదలకూ కూడా ఈ సీజన్ మొత్తంలో అమావాస్య కాకుండా, మూడు హిందువుల పండగలకి సెలవులు దొరుకుతాయి. అవి: శివరాత్రి, శిమ్గా (వేరే ప్రాంతాల్లో హోళీగా జరుపుకుంటారు), గుఢీ పడ్‌వా (సంప్రదాయ కొత్త సంవత్సరం).

మధ్యాహ్నం అయేసరికి చాలామంది కార్మికులు బట్టీకి దగ్గర్లోనే వాళ్ళు తాత్కాలికంగా కట్టుకున్న ఇళ్ళకు తిరిగి వచ్చారు. శ్రావణి, శ్రద్ధ దగ్గర్లోని కుళాయి వద్ద బట్టలు ఉతకడానికి వెళ్ళారు. ఖండూ మానే గాడిదలను మేతకు తీసుకెళ్ళారు. మాధురి ఇప్పుడు తన కుటుంబం కోసం వంట చేస్తారు. ఆ తర్వాత అంత తీవ్రమైన వేడిలో, ఒక కునుకు తీసే ప్రయత్నం చేస్తారు. ఈ రోజుకి బట్టీని మూసివేశారు. “ఇప్పుడు మా దగ్గర డబ్బు (ఆదాయం) బాగానే ఉంది; తినడానికి కూడా సరిపడా తిండి ఉంది. కానీ మీకు తెలుసా, మాకు నిద్రే లేదు!” అన్నారు మాధురి.

ఋతాయన్ ముఖర్జీ దేశమంతటా పర్యటిస్తూ పశుపోషకులు, సంచార జాతులు వంటి సామాజికవర్గాల గురించి నివేదికలిస్తుంటారు. ఇందు కోసం అతను సెంటర్ ఫర్ పాస్టోరలిజం నుండి స్వతంత్ర ట్రావెల్ గ్రాంటును పొందారు. ఈ నివేదికలోని విషయాలపై పాస్టోరలిజం సెంటర్‌కు ఎటువంటి సంపాదకీయ నియంత్రణా లేదు.

అనువాదం: వై. క్రిష్ణజ్యోతి

Photographs : Ritayan Mukherjee

Ritayan Mukherjee is a Kolkata-based photographer and a PARI Senior Fellow. He is working on a long-term project that documents the lives of pastoral and nomadic communities in India.

Other stories by Ritayan Mukherjee
Text : Medha Kale
mimedha@gmail.com

Medha Kale is based in Pune and has worked in the field of women and health. She is the Translations Editor, Marathi, at the People’s Archive of Rural India.

Other stories by Medha Kale
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi