ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.
కామంగ్ జిల్లాలోని లగమ్ గ్రామానికి చెందిన సంచార పశువుల కాపరి అయిన పంపా సుర్ంగ్, 35, అన్నాడు, “జొమోలు ఇప్పుడు మాలో బాగా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి".
జొమో? అవి ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్ లో 9,000 అడుగులు మధ్య అంతకంటే ఎక్కువ ఎత్తులపై అవి ఎలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి ?
జోమో అనేది యాక్ మరియు కోట్ యొక్క మిశ్రమజాతి పశువులు. ఇది ఒక రకమైన ఎత్తైన ప్రదేశం పశువు. జో అని పిలువబడే మగ పశువుకు సంతానం కలగదు కాబట్టి పశువుల కాపరులు ఆడ, డిజోమో ను పెంచటానికి ఇష్టం పడతారు. ఇది కొత్త జాతి కానప్పటికీ, తూర్పు హిమాలయాలలో మారుతున్న వాతావరణానికి అనుగుణంగా-బ్రోక్పా అనే పాక్షిక సంచార గ్రామీణ సమూహం, ఇటీవలి కాలంలో ఈ జంతువులను తమ మందలతో కలిపి పెంచుతన్నారు.
నలభైయైదేళ్ల పంపా పశువుల మందలో యాక్ మరియు జొమోస్ రెండూ ఉన్నాయి. "ఈ యాక్-పశువుల సంకర జాతి మరింత వేడి తట్టుకోగలిగుతాయి, అలానే తక్కువ ఎత్తులలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలలో కూడా బాగా మనగలుగుతాయి " అని ఆయన చెప్పారు.
ఈ ఎత్తైన పచ్చిక భూముల మేత మైదాన్ లలో, వేడి లేదా 'వార్మింగ్' రెండూ సాపేక్షికంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ సంవత్సరమొత్తం కాలంలో 32 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్న రోజులు ఉండవు. కానీ మైనస్ -35 డిగ్రీలను తేలికగా తటుకోగల యాక్, 12 లేదా 13 డిగ్రీలు మించిన ఉష్ణోగ్రతలో ఇబ్బందిపడుతుంది. నిజానికి, ఈ మార్పులు సంభవంచినప్పుడు మొత్తం ఒక్క యాక్ మాత్రమే కాదు, పూర్తి పర్యావరణ వ్యవస్థకే ఊహించని ఇబ్బంది కలుగుతుంది - ఇటీవలి సంవత్సరాలలో ఈ మార్పులు కనిపించాయి.
మోన్ప తెగలోని అక్కడి సంచార పశువుల కాపరులైన బ్రోక్పాలు (2011 అరుణాచల్ లో సెసెక్స్‌కు అనుగుణంగా సుమారు 60,000 మంది), శతాబ్దలుగా యాక్ ల పెంపకం చేస్తున్నారు మరియు వాటికి అవసరమయిన మేత కొరకు యాక్ లను మైదానానికి తీసుకువెళతారు .
కఠినమైన శీతాకాలంలో, వారు దిగువ ప్రాంతాలలో నివసిస్తే, వేసవిలో వారు అధిక ఎత్తుకు వలసపోతారు - కాబట్టి వీరు 9,000 మరియు 15,000 అడుగుల మధ్య తిరుగుతూ ఉంటారు.
కానీ లడఖ్‌లోని చాంగ్ తాంగ్ ప్రాంతంలోని చాంగ్ పా మాదిరిగా, బ్రోక్పా కూడా ఎప్పటికప్పుడు అస్థిరమైన వాతావరణం వల్ల తీవ్రంగా దెబ్బతింది. శతాబ్దాలుగా, వారి జీవనాధారం, వారి సమాజాలు, యాక్, పశువులు, మేకలు, గొర్రెలను పెంచడమూ మేపడమూ మీద ఆధారపడి ఉన్నాయి. వీటిలో, వారు యాక్ మీద ఎక్కువగా ఆధారపడతారు - ఆర్థిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలలో కూడా. ఆ బంధం ఇప్పుడు తీవ్రంగా దెబ్బతింది.
"వేడి కారణంగా ఫిబ్రవరి చివరి నాటికి యక్ అలసిపోయినట్లు అనిపిస్తుంది" అని చందర్ గ్రామంలోని పశువుల కాపరి అయిన లెకిసుజుక్ నాకు చెప్పారు. నేను మేలో వెస్ట్ కామెంగ్‌లోని డిరాంగ్ బ్లాక్‌ని సందర్శించినప్పుడు ఆమె కుటుంబంతో కలిసి ఉన్నాను. "గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలం ఎక్కువైంది, ఉష్ణోగ్రత పెరిగింది. యాక్ బలహీనపడింది, ”అని 50 ఏళ్ళ వయసుకు దగ్గరగా ఉన్న లేకి కూడా చెప్పింది.
ఉష్ణోగ్రతలతో పాటు, చైనా, భూటాన్ మరియు మయన్మార్‌ల టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ పర్వతాలలో గత రెండు దశాబ్దాలలో మొత్తం వాతావరణ నమూనా మరింత అనూహ్యంగా మారింది.
"ప్రతిదీ ఆలస్యం అయింది," అని పెమా వాంగే చెప్పారు. "వేసవి రాక ఆలస్యమైంది. హిమపాతం రావడం ఆలస్యమైంది. కాలానుగుణ వలసలు ఆలస్యం అవుతున్నాయి. బ్రోక్పాలు అధిక ఎత్తులకు మేత కోసం వెళ్తున్నారు కానీ అదంతా మంచుతో కప్పబడి ఉంది. అంటే దీనినిబట్టి మంచు కరగడం కూడా ఆలస్యం అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు.” పెమా, తన 30 ఏళ్ళ చివరలో, బ్రోక్పా కాదు, కానీ ఇతను థెంబాంగ్ గ్రామానికి, మోంపా తెగకు చెందినవాడు, వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ కోసం పనిచేస్తున్నాడు.
ఈసారి, నేను అతనితో ఫోన్‌లో మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను సాధారణంగా ప్రయాణించే చాలా ప్రాంతాలు భారీ వర్షాల తర్వాత అందుబాటులో ఉండవు. కానీ నేను ఈ సంవత్సరం మేలో అక్కడ ఉన్నాను, పశ్చిమ కామెంగ్ జిల్లాలోని దట్టమైన అడవులను చూస్తూ చందర్ గ్రామానికి చెందిన బ్రోక్పా యాక్ పశువుల కాపరి నాగులిత్సోపాతో ఒక కొండపై నిలబడి ఉన్నాను. అతని వర్గం వారు ఇక్కడ, ఇంకా తవాంగ్ జిల్లాలో ఎక్కువగా ఉంటారు.
"ఇక్కడ నుండి మాగోవెళ్లాలంటే చాలా దూరం. మేము మా వేసవి మేత మైదానానికి వెళ్తున్నాం," అని 40 ఏళ్లు దాటిన నాగులి అన్నారు. "మేము అక్కడికి చేరుకోవడానికి 3-4 రాత్రులు అడవుల గుండా నడవాలి. గతంలో [10-15 సంవత్సరాల క్రితం], మే లేదా జూన్ నాటికి మేము [పైకి వలస కోసం] బయలుదేరేవెళ్లాం. కానీ ఇప్పుడు మేము ముందుగానే, ఫిబ్రవరి లేదా మార్చి నాటికి వెళ్ళిపోయి, 2-3 నెలలు ఆగిన తర్వాత తిరిగి వస్తున్నాం.”
ఈ భాగాలలో పెరిగే వెదురు యొక్క నాణ్యతను సేకరించేందుకు నాగలి చేసే సుదీర్ఘ ప్రయాణాలలో ఒకసారి నేను కూడా అతనితో పాటు దట్టమైన అడవుల్లోకి వెళ్లాను. “యాక్ ల చికిత్సకు మనం ఉపయోగించే మూలికలు - అవి ఇక పెరిగేలా కనిపించడం లేదు. మేము యాక్ లకు వచ్చే అనారోగ్యాలను ఎలా ఎదుర్కొంటాము? "
అరుణాచల్ రాష్ట్రంలో సాధారణంగా వర్షపాతం అధికం. ఇక్కడ సంవత్సరానికి సగటున 3,000 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడుతుంది. కానీ గత దశాబ్దంలో అనేక సార్లు, నాలుగు సంవత్సరాలలో కనీసం ఒకసారి 25 నుండి 30 శాతం మధ్య వర్షపాతం లోటును ఎదుర్కొంది, అని మెటీరియోలోజికల్ డిపార్ట్మెంట్ డేటా సూచిస్తుంది. కానీ ఈ సంవత్సరం జూలైలో, రాష్ట్రంలో కుండపోత వర్షాల వలన కొన్ని రహదారులు కొట్టుకుపోవడం లేదా మునిగిపోవడం జరిగింది.
ఈ ఒడిదుడుకుల మధ్య, పర్వతాలలో స్థిరంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
2014 లో, విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం యొక్క అధ్యయనం, తూర్పు టిబెటన్ పీఠభూమిలో ఉష్ణోగ్రతలలో మార్పులను నమోదు చేసింది (ఇది అరుణాచల్ లో ఉన్న పెద్ద భౌగోళిక ప్రదేశం). రోజువారీ తక్కువ ఉష్ణోగ్రతలు "గత 24 సంవత్సరాలలో బాగా పెరిగాయి" (1984 మరియు 2008 మధ్య). 100 సంవత్సరాలలో రోజువారీ అధిక ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరిగాయి.
"మేము అస్థిరమైన వాతావరణం యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము," అని 30 ఏళ్ల ప్రారంభంలో, మరొక పశువుల కాపరి సెరింగ్ డండప్ చెప్పారు. "మేము మా వలస సమయాన్ని రెండు లేదా మూడు నెలలు పొడిగించాము. మేము పచ్చికను మరింత శాస్త్రీయంగా ఉపయోగిస్తున్నాము [యాదృచ్ఛిక మేత కంటే ఎక్కువ నమూనా ద్వారా]. "
అతనిలాగే, బ్రోక్పాలో ఎక్కువమందికి వాతావరణ మార్పుల గురించి తెలుసు. ఇది ఎందుకు జరుగుతుందో వారు ఎక్కువగా మాట్లాడరు, కానీ అది చేస్తున్న నష్టాన్ని అవగాహన చేసుకున్నారు. కానీ ఇక్కడొక ప్రోత్సాహకరమైన విషయం ఉంది: వారు ఈ ఇబ్బందిని ఎదుర్కోడానికి వివిధ వ్యూహాలను కనుగొంటున్నారు, అని అనేకమంది పరిశోధకులు అంటున్నారు. ఈ కమ్యూనిటీని సర్వే చేసిన ఒక సమూహం 2014 లో ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ లో దీనిని సూచించింది. వారి పరిశోధనలో పశ్చిమ కమెంగ్‌లోని 78.3 శాతం, బ్రోక్పాస్ మరియు తవాంగ్‌లో 85 శాతం - అంటే అరుణాచల్‌లోని ఈ సంచార సమాజంలో 81.6 శాతం మందికి - "మారుతున్న వాతావరణ పరిస్థితుల గురించి తెలుసు". మరియు వీటిలో 75 శాతానికి పైగా "వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కనీసం ఒక అనుసరణ వ్యూహాన్ని అవలంబించినట్లు పేర్కొన్నారు."
పరిశోధకులు ఇతర వ్యూహాలను కూడా గమనించారు-‘మంద-వైవిధ్యీకరణ’, అధిక ఎత్తులకు వలసలు, వలసల క్యాలెండర్‌లో మార్పులు. "వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాలను" ఎదుర్కొనేందుకు వారి పరిశోధన పత్రం, "10 కోపింగ్ మెకానిజమ్స్" గురించి మాట్లాడుతుంది. ఇతర వ్యూహాలలో పచ్చికభూమి ఉపయోగంలో మార్పులు, అధోకరణం చెందిన ఎత్తైన మేత మైదానాల పునరుజ్జీవనం, సవరించిన పశువుల పెంపకం పద్ధతులు మరియు పశువుల హైబ్రిడైజేషన్ ఉన్నాయి. అలాగే, గడ్డి తక్కువగా ఉన్నా ఇతర వస్తువులతో మేతని భర్తీ చేయడం, కొత్త పశువుల ఆరోగ్య సంరక్షణ పద్ధతులను అవలంబించడం మాత్రమే కాక రహదారి నిర్మాణ కార్మికులుగా పని చేయడం, చిన్న వ్యాపారాలు మరియు పండ్ల సేకరణ వంటి అదనపు ఆదాయ పద్ధతులు కూడా ప్రయత్నిస్తున్నారు.
వీటిలో ఏవైనా లేదా అన్నీ పనిచేస్తాయో లేదో తెలుసుకోవడానికి మార్గం లేదు. అంతేగాక ఈ ప్రక్రియలు పెద్దవైనా నిరుత్సాహపడకూడదు. కానీ వారు ఏదో చేస్తున్నారు - చేయక తప్పదు. యాక్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వల్ల సగటు కుటుంబం దాని వార్షిక ఆదాయంలో 20-30 శాతం కోల్పోయిందని పశువుల కాపరులు నాకు చెప్పారు. పాల దిగుబడి తగ్గడం అంటే ఇంట్లో నెయ్యి, చుర్పి (పులియబెట్టిన యాక్ పాల జున్ను) తగ్గుదల అని కూడా అర్థం. డజోమో దృఢంగా ఉండవచ్చు కానీ యాక్ పాలు మరియు జున్ను తో పోలిస్తే ఎక్కువ నాణ్యత ఉన్నట్టుగా అనిపించదు. మతపరంగా యాక్ కున్న ప్రాముఖ్యత వీటికి లేదు.
"యాక్ మందలు తగ్గిపోతున్నప్పుడు లేదా అధోకరణం అనుభవిస్తున్నందున, బ్రోక్పా ఆదాయం కూడా క్షీణిస్తోంది" అని పెమా వాంగే ఆ మే పర్యటనలో చెప్పారు. "ఇప్పుడు [వాణిజ్యపరంగా ప్రాసెస్ చేయబడిన] ప్యాకేజ్డ్ చీజ్ స్థానిక మార్కెట్లో సులభంగా లభిస్తుంది. కాబట్టి చుర్పి అమ్మకాలు పడిపోతున్నాయి. బ్రోక్పా రెండు విధాలుగా దెబ్బతింది. "
ఆ సమయంలో నేను ఇంటికి వెళ్లే ముందు, నేను 11 ఏళ్ల నోర్బు తుప్టెన్‌ని కలిశాను. అతను తన మందతో కలిసి బ్రోక్పా వలస మార్గంలో తుమ్రి యొక్క వివిక్త కుగ్రామంలో ఉన్నాడు. "నా తాతల కాలం ఉత్తమమైనది," అని అతను నమ్మకంగా చెప్పాడు. అతని మాటలు వారి పెద్దల ప్రసంగాన్ని ప్రతిబింబించాయి: “ఎక్కువ పచ్చిక మరియు తక్కువ మంది మనుషులు. మాకు సరిహద్దు ఆంక్షలు లేదా వాతావరణ ఇబ్బందులు లేవని పెద్దలు అంటున్నారు. కానీ అప్పటి సంతోషకరమైన రోజులు ఇప్పుడు పాత జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలాయి. "
UNDP- మద్దతుతో ప్రారంభమైన కార్యక్రమంలో భాగంగా, వాతావరణ మార్పుపై PARI యొక్క దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్, సహజ వ్యవస్థలో సాధారణ ప్రజల అభిప్రాయాలు, ప్రత్యక్ష అనుభవాల ద్వారా కథనాలు సేకరిస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే zahra@ruralindiaonline.org కు మెయిల్ చేసి namita@ruralindiaonline.org కు కాపీ పెట్టండి.
అనువాదం: కృష్ణ ప్రియ చోరగుడి