"ఇప్పుడు నాన్నగారు నా పక్కన ఉంటే ఎంతో బాగుండేది," అని ప్రియాంక మొండల్ అన్నారు, తన తండ్రి జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధపడుతూ. ఆమె ఎరుపు బంగారం రంగులు కలిసి ఉన్న దుస్తుల్లో తన ఒడిలో పూలతో ఆమె పింక్ మరియు నీలం రంగుల పల్లకీలో కూర్చుని ఉన్నారు. ఆ పల్లకీలో రజత్ జుబిలీ గ్రామంలోని తన భర్త ఇంటికి వెళ్తారు.
పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పర్గనాస్ జిల్లాలోని ఈ గ్రామానికి చెందిన ప్రియాంక (23) హిరణ్మయ్ మొండల్ (27) ను 7 డిసెంబర్ 2020 నాడు పెళ్లి చేసుకోనున్నారు. హిరణ్మయ్ వారి పక్క ఇంట్లో ఉండే వారు, కోల్‌కతాలోని ఒక రిటెయిల్ బట్టల దుకాణంలో ఫ్లోర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవారు. ప్రేమలో ఉన్న ఈ జంట 2019లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
"అయితే, 2019 జులై 29న చిరుతపులి దాడిలో ప్రియాంక తండ్రి అర్జున్ మొండల్ (45) మృతి చెందడంతో, సుందర్‌బన్‌లలోని లాహిరిపూర్ గ్రామ పంచాయితీలో జరగాల్సిన వారి వివాహం వాయిదా పడింది. మత్స్యకారుడైన అర్జున్, సుందర్‌బన్ టైగర్ రిజర్వ్‌లోని పిర్‌ఖలీ గాజీ అరణ్య ప్రాంతంలో పీతలను సేకరించేందుకు ఎప్పటి లాగానే వెళ్లారు. అయితే, అతని శరీర అవశేషాలు కూడా దొరకలేదు.
"పీతలను సేకరించేందుకు అడవుల్లోకి అర్జున్ వెళ్లిన ప్రతి సారి, అతను సురక్షితంగా తిరిగి వస్తారో లేదో అని అతని కుటుంబ సభ్యులు కలత చెందేవారు. 2019 జులైలో తాను చివరిసారి బయలుదేరి వెళ్లినప్పుడు తన కూతురి వివాహం గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నారు.
“ప్రియాంక వివాహం కోసం మాకు డబ్బు అవసరం ఉండింది. అందువల్ల తప్పనిసరై తను అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది, అయితే ఏదో చెడు జరగబోతోందని తనకు అనిపించింది,” అని ఆయన భార్య పుష్ప చెప్పారు."

ప్రియాంక మొండల్ వివాహ కార్యక్రమం ముందు, స్వర్గస్థులైన తన తండ్రి ఫోటోకు పూలమాల వేస్తున్నారు
అర్జున్ ఆకస్మికంగా మరణించడంతో, ఇంటి పనులు చూసుకోవడం, అలాగే కూతురు ప్రియాంక, కుమారుడు రాహుల్‌ల బాధ్యత ఆమె ఒంటరి భుజాల మీద పడింది. “ప్రియాంకకు పెళ్లి చేయాలని తన తండ్రి కలలు కనేవారు. ఎలాగైనా అది నెరవేర్చాలని నేను నిశ్చయించుకున్నాను. ఎన్నాళ్లని తనను వేచి ఉండమని అడుగుతాను?” అని ఆమె అడిగారు. పెళ్లికి దాదాపు రూ. ఒక లక్షా డెబ్భై వేల దాకా ఖర్చయింది. దాదాపు నలభై ఏళ్ల వయసున్న పుష్పకు అది మితిమీరిన భారంగా మారింది.
అర్జున్ ఆకస్మిక మరణం, కుటుంబ ఆర్థిక భారంతో పాటు తన పిల్లలకు తానే ఏకైక దిక్కుగా మారడం వల్ల పుష్ప ఆరోగ్యం బాగా దెబ్బ తినింది. విపరీతంగా ఒత్తిడికి, డిప్రెషన్‌కు గురవ్వసాగారు. 2020 మే 20న వచ్చిన ఆంఫన్ తుఫాను వల్ల పరిస్థితి మరింత క్షీణించింది. దాంతో పాటు కొవిడ్-19 మహమ్మారి వల్ల ఆమెలో ఆందోళన మరింతగా పెరిగింది. ఆమె బీపీ హెచ్చుతగ్గులకు గురై, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల అనీమియాకు గురయ్యారు. “లాక్‌డౌన్ సమయంలో పలు రోజుల పాటు మేము సరిగ్గా భోజనం కూడా చేయలేదు,” అని పుష్ప చెప్పారు.
తన తండ్రి చనిపోయిన తర్వాత కేవలం 20 ఏళ్ల వయసున్న రాహుల్‌పై కూడా అదనపు ఆదాయం సంపాదించాలనే ఒత్తిడి పెరిగింది. దాంతో పొలాల్లో, భవన నిర్మాణాలలో దిన కూలీగా పని చేయడం మొదలు పెట్టారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల మరింత కష్టపడి పని చేయసాగారు. లాక్‌డౌన్ వల్ల తన ఉపాధి దెబ్బతినక ముందు వేర్వేరు పనుల్లో చేరి రూ. 8 వేల వరకు కూడబెట్టి, ఈ వివాహంపై ఖర్చు చేశారు.
రెండు చిన్న గదులు, ఒక వంట గది మాత్రమే ఉన్న తమ ఇంటిని పుష్ప ఒక స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద 34% వార్షిక వడ్డీకి రూ. 50 వేల కోసం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరు నెలలోపు ఆ అప్పులో సగం మొత్తాన్ని కట్టగలిగితే, దాన్ని పూర్తిగా తీర్చేందుకు మరో ఆరు నెలల సమయం గడువు దొరికే అవకాశం దొరుకుతుంది. “మేము అప్పు తీర్చలేకపోతే, ఈ ఇల్లు మాకు దక్కకుండా పోతుందనే భయంతో ఉన్నాం. మేము రోడ్డున పడాల్సి వస్తుంది,” అని పుష్ప చెప్పారు.
అయితే కొద్దో గొప్పో మంచి జరిగిందని, దాని పట్ల సంతోషంగా ఉన్నానని కూడా ఆమె చెప్పారు. “హిరణ్మయి [ఆమె అల్లుడు] మంచి మనిషి,” అని ఆమె చెప్పారు. “లాక్‌డౌన్ సమయంలో మాకెంతో మేలు చేశాడు. మా ఇంటికి వచ్చే వాడు, షాపింగ్ చేయడం, ఇంటి పనుల్లో సాయం చేయడం చేసేవాడు. అప్పటికి వీళ్లిద్దరికీ పెళ్లి కూడా కాలేదు. అతని కుటుంబం కట్నం కూడా అడగలేదు.”

బెంగాలీ పెళ్లికూతుళ్లు వేసుకునే పోలా అనే పగడపు గాజులను స్థానిక ఆభరణాల షాపు వద్ద పుష్ప మొండల్ కొనుగోలు చేస్తున్నారు. 'ఇది స్వయంగా నేనే చేయాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు', అని ఆమె చెప్పారు
పెళ్లి రోజున ఆకుపచ్చ, ఎరుపు, బంగారం రంగులు కలిసిన చీరతో పాటు మ్యాచ్ అయ్యే బంగారు ఆభరణాలను ప్రియాంక ధరించి, పెళ్లి కూతురి మేకప్ వేయించుకున్నారు. తన పెళ్లి కోసం ఇంటిని తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆమెకు తెలియదు.
మొండల్ వారి ఇంట్లో 350 మంది అతిథులు పెళ్లికి విచ్చేశారు. మెరిసే పసుపు రంగు లైట్ల వెలుగుతో పాటు అక్కడికి వచ్చిన అతిథులతో ఇల్లు కళకళలాడింది. వారిలో మత్స్యకారులు, తేనె సేకరణ కార్మికులు, టీచర్లు, బోట్ తయారీదారులు, జానపద సంగీతకారులు, డ్యాన్స్ ఆర్టిస్టులు ఉన్నారు. వారందరికీ అర్జున్ తెలుసు, సుందర్‌బన్‌లోని ప్రజల కష్టాల గురించి, వారి జీవితాల గురించి, అలాగే క్షేమ సమాచారం గురించి అతను ఎంతో శ్రద్ధ వహించే వ్యక్తి అని వాళ్లు భావిస్తారు.
పెళ్లి వేడుకలో పాల్గొనడానికి వచ్చిన మహిళలలో చాలా మంది వంట వండటంలోనూ, ఇతర ఏర్పాట్లలోనూ సాయం అందిస్తున్నారు. పుష్ప అధిక సంతోషానికి, అలాగే పెళ్లి ఒత్తిడికి లోనై పలు మార్లు మూర్చపోయారు, అయితే హిరణ్మయి మరియు ప్రియాంక చివరికి పెళ్లి చేసుకోవడం ఆమెకు సాంత్వన చేకూర్చింది.
పెళ్లి కార్యక్రమాలు ముగిసిన తర్వాత, పుష్ప తనకు అప్పు ఇచ్చిన వాళ్లతో వ్యవహరించాల్సి ఉంటుంది. తక్షణమే డెకొరేటర్లకు, ఎలెక్ట్రీషియన్లకు రూ. 40 వేలు చెల్లించాలి. “డబ్బు అడుగుతూ ఎవరైనా ఎదురొస్తే మా అమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది” అని రాహుల్ చెప్పారు. “నేను మరింత కష్టపడి డబ్బు సంపాదిస్తాను.”
అర్జున్ మృతి తర్వాత నష్ట పరిహారం కోసం పెట్టుకున్న దరఖాస్తు విషయంలో ప్రభుత్వ యంత్రాంగంతో పుష్ప పోరాడాల్సి ఉంది. పులి దాడి వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు దాదాపు 4-5 లక్షల నష్టపరిహారాన్ని పొందే అర్హత ఉంటుంది . ఈ మొత్తాన్ని పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ, మత్స్య పరిశ్రమల శాఖ మరియు రాష్ట్ర గ్రూప్ వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కలిసి చేకూరుస్తాయి.

అర్జున్ మృతి తర్వాత తాను దాఖలు చేసిన నష్ట పరిహార వ్యాజ్యానికి సంబంధించి తర్వాతి హియరింగ్ కోసం హాజరు కావాలని పుష్పను కోరుతూ స్థానిక జిల్లా న్యాయ సేవల అధికారిక సంస్థ నుండి వచ్చిన ఉత్తరం
అయితే, ఈ ప్రక్రియలో ఎదురయ్యే చట్టపరమైన ఖర్చులతో పాటు నియమ నిబంధనల చిక్కుముడులకు భయపడి ఎందరో కుటుంబాలు వీటికి దరఖాస్తు చేయరు. 2016లో దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుల ద్వారా 2017లో చేసిన PARI పరిశోధనలో గత ఆరేళ్లలో కేవలం ఐదు మంది మహిళలు మాత్రమే నష్ట పరిహారం కోసం క్లెయిమ్‌లను దాఖలు చేశారని తెలిసివచ్చింది. వారిలో కేవలం ముగ్గురికి మాత్రమే, అది కూడా పాక్షిక మొత్తాన్ని మాత్రమే మంజూరు అయ్యింది.
సుందర్‌బన్ రిజర్వు ఫారెస్ట్‌లో పీతలను సేకరించడానికి, అర్జున్ పలు మార్లు వెళ్లారు, ప్రతి సారి దట్టమైన అడవి లోపలికి వెళ్లి 2-3 రోజుల పాటు సేకరించేవారు. తన సేకరణ వల్ల - దాని పరిమాణాన్ని బట్టి - దానిని గ్రామంలోని ఒక మధ్యవర్తికి అమ్మడం ద్వారా రూ 15 వేల నుండి 30 వేల వరకు సంపాదించేవారు.
సుందర్‌బన్ అడవిలో క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్‌గా, అంటే అతిక్రమణకు తావులేని అంతర్భాగంగా 1,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ప్రాంతంతో పాటు, దాదాపు 885 చదరపు కిలోమీటర్ల బఫర్ ప్రాంతం ఉంది. ఈ బఫర్ ప్రాంతాలలో అటవీ శాఖ జారీ చేసే పర్మిట్ మరియు బోట్ లైసెన్స్ ఉంటే చేపలు మరియు పీతలు పట్టడం, తేనె మరియు వంటచెరుకు సేకరించడం వంటి ఉపాధినిచ్చే చర్యలకు అనుమతి ఉంది. అయితే, పరిమితం చేయబడ్డ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తే భారీగా జరిమానా విధించబడుతుంది. ఈ పరిమితులను ఎవరైనా అతిక్రమిస్తే, ఒకవేళ పులి దాడి జరిగి మృతి చెందితే, దానిపై పరిహారాన్ని కోరే హక్కును ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులు కోల్పోవాల్సి ఉంటుంది.
సుందర్‌బన్ గ్రామీణ అభివృద్ధి సంఘానికి సెక్రెటరీగా ఉన్న అర్జున్ మొండల్‌కు ఈ ప్రమాదాల గురించి బాగా తెలుసు. ఈ ప్రాంతంలో పులి దాడుల వల్ల తమ భర్తలను కోల్పోయిన విధవలకు పరిహారం అందేలా పోరాడటంలో అతను కీలక పాత్ర పోషించారు. గత మూడు దశాబ్దాలలో కనీసం 3 వేల మంది వ్యక్తులు, దాదాపు ఒక సంవత్సరానికి 100 మంది ఇలా మృత్యువాత పడ్డారు (స్థానికులు, ప్రభుత్వేతర సంస్థలు, ఇతరులు కలిసి వేసిన అంచనాల ప్రకారం).
రిజర్వ్ ఫారెస్ట్‌లో పరిమితులు విధించబడ్డ అంతర్గత ప్రాంతంలో చేపలు పడుతూ ఉన్నప్పుడు అర్జున్ మృతి చెందారు కాబట్టి పుష్పకు పరిహారం అందే అవకాశం తక్కువగా ఉంది. ఈ క్లెయిమ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఒక న్యాయవాదిని నియమించుకోవడంతో పాటు, కోల్‌కతాకు తరచుగా ప్రయాణించడం, సంబంధిత పత్రాలను సిద్ధం చేయడం - వీటన్నిటినీ చేయడానికి కావాల్సిన శక్తి, ఆరోగ్యం, డబ్బు - ఇవేవీ పుష్ప వద్ద లేవు, ప్రత్యేకించి పెళ్లి కోసం చేసిన అప్పుల తర్వాత.
ఈ అప్పులను తీర్చడం ఎలానో రాహుల్‌కు తెలియడం లేదు. “ఇంట్లోని సామాను అమ్మాల్సి వస్తుందనుకుంటా,” అని అతను చెప్పారు. అంతకంటే అధ్వాన్నంగా, తన తండ్రి లాగే తను కూడా ఉపాధి కోసం అడవుల్లోకి వెళ్లాల్సిన గతి పడుతుందేమోనని అతని తల్లి ఆందోళన చెందుతున్నారు.

20 ఏళ్ల వయసున్న రాహుల్ మొండల్ తన తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతతో సతమతమవుతున్నారు. 'ఇప్పుడు కష్టాల్లో ఉన్నాము, అయితే ఏదో ఒక రోజు మా పరిస్థితి మెరుగవుతుందనే ఆశతో ఉన్నాం'

ప్రియాంక పెళ్లి కోసమని కొన్న ఒక అల్మారాను రాహుల్ (కుడి) మరియు మిథున్ అనే ఒక బంధువు కలిసి ఇద్దరు స్థానికుల సాయంతో దించుతున్నారు. దగ్గర్లోని పట్టణమైన గొసాబా నుండి రాజత్ జుబిలీ గ్రామానికి చేరుకోవడానికి ఒక కార్గో బోటుకు 5 గంటలు పడుతుంది

పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యే ముందు ఇంటి అలంకరణను ప్రియాంక పరిశీలిస్తున్నారు

తన కూతురి పెళ్లి రోజున ఆమెను ఆశీర్వదించడానికి పుష్ప ఆశీర్బాద్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు

పెళ్లిరోజున పొద్దున పెళ్లికూతురుకు పసుపు పెట్టి చేయించే గాయె హోలుద్ అనే సాంప్రదాయ స్నానంలో భాగంగా బంధువులు ప్రియాంకపై నీరు పోస్తున్నారు

పెళ్లికి ముందు చేసే కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రియాంక మరియు ఆమె బంధువులు

హిరణ్మయ్ (మధ్యన), అంధుడైన అతని మేనల్లుడు జంపా (కుడి వైపున) మరియు ఇతరులు వివాహ వేదికకు బయలుదేరి వెళ్తున్నారు

జానపద కళాకారుడు నిత్యానంద సర్కార్ (ఎడమ నుండి రెండవ వ్యక్తి) మరియు అతని బ్యాండ్ గ్రూప్ కలిసి హిరణ్మయ్ పెళ్లి ఊరేగింపులో వాయిద్యాలు వాయిస్తున్నారు

అర్జున్ మొండల్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆహారాన్ని అర్పిస్తూ బోరుమని విలపిస్తోన్న అతని బంధువులు

పుష్ప తీవ్రమైన డిప్రెషన్‌తో పాటు ఒత్తిడితో బాధపడుతున్నారు. పెళ్లి కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు పలు మార్లు మూర్చపోయారు

బంధువులు ప్రియాంకను ఒక చెక్క పలకపై ఎత్తుకుని మండపం వద్దకు తీసుకెళ్తున్నారు. పెళ్లికొడుకును చూసే ముందు ఆమె కళ్లను తమలపాకులతో కప్పి ఉంచుకుంది

పెళ్లి కూతురైన ప్రియాంక, పెళ్లి కొడుకుతో ముఖాముఖి అయిన మొదటి క్షణం - దీనిని శుభో దృష్టి అంటారు

హిరణ్మయి, ప్రియాంకల పెళ్లి పూర్తవడంతో సంబరాలలో భాగంగా చమ్కీలు చల్లుతున్నారు

ప్రియాంక బంధువులలో ఒక ముసలావిడ హిరణ్మయితో చమత్కారంగా మాట్లాడుతున్నారు. వృద్ధ మహిళలు పెళ్లికొడుకును సరదాగా ఆటపట్టించడం ఇక్కడి ఆనవాయితీ

పుష్ప, నూతన వధువైన తన కూతురిని ఆశీర్వదిస్తున్నారు

నిత్యానంద సర్కార్ తన వాయిద్యాలతో పెళ్లికి విచ్చేసిన అతిథులకు వినోదాన్ని పంచుతున్నారు. ఆయన ఒక రైతు మాత్రమే కాదు, ఝుమూర్ పాటలు, మా బొన్ బిబీ నాటకాలతో పాటు పాలా గాన్ వంటి వివిధ జానపద కళారూపాలను ప్రదర్శించగల నేర్పరి

ఆ రాత్రిని తన ఇంట్లో గడిపిన తర్వాత, హిరణ్మయి ఇంటికి వెళ్లేందుకు ప్రియాంక సిద్ధమౌతున్నారు

తన కూతురు వెళ్లిపోవడం గుర్తొచ్చి పుష్ప కన్నీళ్లు కారుస్తున్నారు. 'ఇన్నేళ్లు తను నాకు తోడుగా ఉండి బలాన్నిచ్చేది. ఇప్పుడు తను శాశ్వతంగా వెళ్లిపోతే , తను లేకుండా నేనెలా బతకాలి?' అని ఆవిడ ఏడ్చారు

తన అక్క, బావ బయలుదేరడానికి సిద్ధమవడంతో వాళ్లను హత్తుకుని కన్నీళ్లు కారుస్తోన్న రాహుల్ మొండల్

తనను కొత్త ఇంటికి తీసుకెళ్లే పల్లకీలో కంట కన్నీరుతో కూర్చుని ఉన్న ప్రియాంక
ఈ వార్తా కథనాన్ని ఊర్వశి సర్కార్ రాశారు. ఇందులో ఆమె PARI కోసం చేసిన రిపోర్టింగ్‌తో పాటు రితాయన్ ముఖర్జీ గారి రిపోర్టింగ్ చేర్చబడి ఉంది.
అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి