"దాదాపు ముప్పయ్యేళ్ళ క్రితం స్పీతీలో మంచు విపరీతంగా పడేది. అక్కడంతా పచ్చగా ఉండి, గడ్డి కూడా చాలా బాగుండేది," అన్నారు హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్-స్పీతీ జిల్లాకు చెందిన పశువుల కాపరీ, రైతు కూడా అయిన ఛేరింగ్ అంగ్‌దుయి.
43 ఏళ్ల ఛేరింగ్ సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న లాంగ్జాలో నివసిస్తున్నారు. ఆయనతో పాటు మరో 158 మంది కూడా అక్కడ నివసిస్తున్నారు ( 2011 జనాభా లెక్కలు ). వారిలో ఎక్కువమంది రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన భోట్ సముదాయానికి చెందినవారు. గ్రామంలో నివసించేవారు ఎక్కువగా వ్యవసాయం, పశువుల పెంపకం, పర్యాటకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు
జూలై 2021 చివరలో మేం ఛేరింగ్‌నీ మరికొంతమంది పశువుల కాపరులనూ తమ పశువులను, గొర్రెలను, మేకలను మేపుతుండగా లాంగ్జాలో కలిశాం. తమ పశువులకు గడ్డి కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని అప్పుడు వారు మాట్లాడారు.
"ఇప్పుడిక్కడ కొండల్లో మంచు తక్కువగా పడుతోంది. అలాగే వర్షం కూడా ఎక్కువగా పడటంలేదు. దాంతో గడ్డి కూడా మంచిగా పెరగదు," అంటారు ఛేరింగ్. "అందుకనే మేం మా జీవాలను మేత కోసం మరింత ఎత్తుకు తీసుకుపోతాం.”
స్పీతీ హిమాచల్ ప్రదేశ్‌కు ఈశాన్య భాగంలో ఉంది. అనేక నదులు ప్రవహించే ఈ ప్రాంతం, ఎత్తైన లోయలతో నిండివుంది. ఇక్క డి చల్లని ఎడారి లాంటి వాతావరణం, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి పర్యాటకులను - ప్రత్యేకించి మండు వేసవి నెలలలో - విశేషంగా ఆకర్షిస్తుంటుంది. తేటగా ఉండే రాత్రి ఆకాశంలో కనిపించే పాలపుంత నక్షత్రమండలాన్ని కూడా పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు.
యాదృచ్ఛికంగా కురుస్తున్న హిమపాతం ఛేరింగ్, అతని తోటి పశువుల కాపరుల దైనందిన జీవితాలనూ, వారి జీవనోపాధినీ ఎలా ప్రభావితం చేస్తోందో ఈ చిత్రంలో చెప్పిన పశువుల కాపరుల కథ చూపిస్తోంది.
“రాబోతున్న సంవత్సరాల్లో ఏదో జరుగబోతుందనీ, ఇక్కడ ఉన్న భేద్‌బక్రియా (గొర్రెలు, మేకలు) అంతరించిపోతాయనీ మేం (గ్రామస్థులు) ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మా జీవాలకు తినేందుకు ఎక్కువ గడ్డి లేదు. మేం దాన్నెక్కడి నుండి తీసుకురాగలం?” ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుండగా అడిగారాయన.

లాంగ్జా గ్రామం హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ - స్పీతీ జిల్లాలో సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉంది . ఈ గ్రామంలో సుమారు 32 కుటుంబాలున్నాయి . ఇక్కడున్నవారిలో 91 శాతం మంది ప్రజలు రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న భోట్ సముదాయానికి చెందినవారు

పర్వతాలలో మేపడం కోసం ఛేరింగ్ , ఆయన తోటి పశువుల కాపరులతో పంపించడానికి ఒకచోటికి చేర్చిన గ్రామంలోని మొత్తం పశువులు

ఛేరింగ్ కుమార్తె టాంజిన్ లక్కీ కూడా కొన్నిసార్లు పశువులతో కలిసి ప్రయాణం చేస్తుంది . ' నీరు లేకపోవడం వల్ల భూమి ఎండిపోయి కాలక్రమేణా నెర్రెలువిచ్చుతుంది' అని ఛేరింగ్ చెప్పారు

పచ్చికబయళ్ళను వెతుక్కుంటూ ఎత్తైన ప్రదేశాలకు వెళ్తోన్న గ్రామానికి చెందిన గొర్రెలు , మేకలు , పశువులు , గాడిదలు

అన్ని జంతువులను మేత కోసం ఎత్తైన ప్రాంతంలోని పచ్చిక బయళ్లకు తీసుకువెళ్లడానికి అవి గుమిగూడే వరకు వేచి చూస్తోన్న ఛేరింగ్ అంగ్ దుయి , ఇతర పశువుల కాపరులు

హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన కొండల్లో గడ్డి మేస్తున్న లాంగ్జా గ్రామానికి చెందిన పశువులు

గడ్డి మేశాక సాయంత్రం గ్రామానికి తిరిగి వస్తున్న పశువులు

ఛేరింగ్ ఆంగ్ దుయి ఒక రైతు . ఆయనకు రెండు ఆవులు , ఒక గాడిద ఉన్నాయి . గ్లోబల్ వార్మింగ్ కారణంగా స్పీతీలో పశువులు అంతరించిపోతాయని ఆయన ఆందోళన చెందుతున్నారు

తేటగా
ఉన్న
రాత్రి
ఆకాశంలో
తళుకులీనుతోన్న
పాలపుంత
నక్షత్ర
మండలం
అనువాదం: సుధామయి సత్తెనపల్లి