మహారాష్ట్ర, గోండియా జిల్లా స్త్రీ కార్మికుల గౌరవార్థం ఈ కధనాన్ని అంతర్జాతీయ కార్మిక దినం , మే 1న మళ్ళీ ప్రచురిస్తున్నాం. ఈ కథనం మొదట ది హిందూ పత్రికలో జనవరి 27, 2007 న ప్రచురితమయింది. అప్పటికీ ఇప్పటికీ ఈ స్త్రీ కార్మికుల జీవితాల్లో ఏమార్పూ లేదు.

రేవంతబాయి కాంబళే తన ఆరేళ్ళ కొడుకుతో మాట్లాడి కొన్ని నెలలయింది- ఇద్దరూ తిరోరాలో ఒకే ఇంట్లో వుంటున్నాగానీ! బురీబాయి నాగపూరే సంగతి కూడా అంతే. కనీసం అప్పుడప్పుడూ వాళ్ళ పెద్దబ్బాయి ముఖమైనా ఆమెకు కనిపిస్తుంది- అదీ ఆవిడ ఇంటికి వెళ్లేసరికి అతను మేల్కొని ఉంటే! రోజుకి 30 రూపాయల కూలీ కోసం వారానికి 1000 మైళ్ళకు పైగా ప్రయాణిస్తూ, రోజులో నాలుగంటే నాలుగే గంటలు ఇంట్లో వుండే ఆ ప్రాంతపు వందలాది మహిళల్లో వీళ్ళు కూడా ఒకరు.

ఈ మహిళలతో పాటు వాళ్ళ ఇళ్ళదగ్గర నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ చేరుకునేసరికి మాకు ఉదయం 6 గంటలయింది. వారిలో ఎక్కువమంది అంతకు రెండుగంటల ముందే నిద్ర లేచారు. "నేను వంట చేసేశాను. బట్టలుతకడం, ఇల్లు తుడవడం కూడా అయిపొయింది." ఉత్సాహంగా అన్నారు బురీబాయి. "పనంతా అయిపొయింది. ఇక మనం మాట్లాడుకోవచ్చు". మేం ఆవిడ ఇంటికి వెళ్ళిన సమయానికి ఆ ఇంట్లో అప్పటికింకా ఎవ్వరూ నిద్ర లేవలేదు. "పాపం వాళ్ళు అలసిపోయారు," అన్నారావిడ. మరి బురీబాయి అలసిపోలేదా? "నిజమే! కానీ ఏంచేస్తాం? మరోదారి లేదు".

ఇలా వేరే మార్గం లేని మహిళలు ఆ స్టేషన్ దగ్గర చాలామందే వున్నారు. వాళ్లందరిలోనూ వున్న ఒక అసాధారణ విషయం: వాళ్ళు పనికోసం పల్లెల నుంచి పట్నాలకు వలసవచ్చినవాళ్ళు కాదు; పట్నం నుంచి పల్లెలకు పని కోసం వెతుకుతూ తిరిగే కార్మికులు (footloose workers). ఈ వెతుకులాట వాళ్ళని తిరోడా లాంటి చిన్న తాలూకా ముఖ్య పట్టణాల నుంచి వ్యవసాయ కూలీలుగా కష్టపడడానికి ప్రతిరోజూ గ్రామాలకు తీసుకువెళుతోంది- ఇంటికి దూరంగా రోజులో దాదాపు 20 గంటల పాటు. "బీడీ పరిశ్రమ వెళ్ళిపోయాక," తిరోడాలో వారాంతపు సెలవులు లేవు, అసలు పనే లేదని గోండియాలో కిసాన్ సభ జిల్లా కార్యదర్శి మహేంద్ర వాల్దె అంటారు. "ఇక్కడ వాళ్లకు పని దొరకడం అసాధ్యం" అంటారాయన.

On the platform and in the train are more women like Buribai Nagpure (left) and Shakuntalabai Agashe (right), weary-eyed, hungry, half-asleep
PHOTO • P. Sainath
On the platform and in the train are more women like Buribai Nagpure (left) and Shakuntalabai Agashe (right), weary-eyed, hungry, half-asleep
PHOTO • P. Sainath

ప్లాట్‌ఫారమ్మీదా, రైల్లోనూ బురీబాయి నాగ్‌పురే (ఎడమ), శకుంతలాబాయి ఆగాశే (కుడి) వంటి అలసిపోయిన కళ్ళు, ఆకలి, సగం నిద్రలో ఉన్న అనేకమంది స్త్రీలు ఉన్నారు

ఎక్కువ మంది మహిళల ఇళ్ళు స్టేషన్‌కి ఐదు కిలోమీటర్ల దూరాన్ని మించే వున్నాయి. "కాబట్టి మేం ఉదయం 4 గంటలకే నిద్ర లేవాల్సివుంటుంది" అన్నారు 40ల మలివయసులో ఉన్న బురీబాయి. "పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తిచేసుకొని నడిచి స్టేషన్‌కి వచ్చేసరికి 7 గంటలవుతుంది. అప్పుడొచ్చిన రైలు ఎక్కి మిగిలిన మహిళలతో కలసి గ్రామీణ నాగపూర్ ప్రాంతంలోని సాల్వాకు వెళ్తాం. 76 కిలోమీటర్ల ఆ ప్రయాణానికి 2 గంటలు పడుతుంది. ప్లాట్‌ఫారం మీద ఎక్కువమంది మహిళలే వున్నారు- ఆకలితో, అలసటతో, నిద్ర నిండిన కళ్ళతో! ఎక్కువమంది జనంతో క్రిక్కిరిసి ఉన్న రైలుపెట్టెలో కిందనే కూర్చున్నారు. పెట్టె గోడలకు చేరబడి వాళ్ళ స్టేషన్ వచ్చేవరకు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాగపూర్ జిల్లా, మౌదా తాలూకా, సాల్వా గ్రామం 105 ఇళ్ళు, 500 మంది కంటే తక్కువ జనాభా వుండే ఒక గ్రామం.

"మేం రాత్రి పదకొండింటికి తిరిగి ఇల్లు చేరతాం," 20లలో వయసుండే రేవంతబాయి అంది. "నిద్రపొయ్యేసరికి అర్ధరాత్రవుతుంది.మళ్ళీ ఉదయం 4 గంటలకు మరుసటిరోజు మొదలవుతుంది. నా ఆరేళ్ళ కొడుకుని మేల్కొని ఉండగా చూసి చాలా రోజులయ్యింది." మళ్ళీ, "కొందరు మరీ చిన్నపిల్లలు వాళ్ల తల్లుల్ని చూసినప్పుడు గుర్తుపట్టలేకపోవచ్చు కూడా." నవ్వుతూ అందామె. చదివించే స్థోమత లేకనో, చదువు సరిగ్గా రాకనో వాళ్ళ పిల్లలందరూ సగంలో బడి మానేసినవాళ్ళే. "వాళ్ల ఆలనాపాలనా చూసుకోవడానికిగానీ, సహాయం చెయ్యడానికి గానీ ఇళ్ళదగ్గర ఎవరూ వుండరు." అని బురీబాయి అన్నారు. పిల్లల్లో కొంతమంది వాళ్ళకు దొరికిన పనేదో చేసుకుంటుంటారు.

"సహజంగానే ఈ పిల్లలు చదువులో వెనకబడి వుంటారు" అన్నారు తిరోడాలో టీచర్‌గా పనిచేస్తోన్న లతా పాపన్‌కర్. "చదువులో వెనకబడ్డందుకు వాళ్లని ఎవరుమాత్రం ఎలా నిందించగలరు?" మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ పిల్లలు చదువులో వెనకబడ్టం వాళ్ళు చదివే పాఠశాలలపై ప్రభావం చూపుతుంది. ఆ పాఠశాలలు నిధులను కోల్పోవచ్చు కూడా. ఆ పిల్లలకు సహాయం చేస్తోన్న ఉపాధ్యాయులను సరైన ఫలితాలు రాలేదన్న కారణంతో దండిస్తోంది. పిల్లలు చదువుకు మరింత దూరమయ్యే పద్దతి అవలంబిస్తోంది.

అదురుతున్న రైలుపెట్టె నేలపై కూర్చునివున్న సుమారు 50 ఏళ్ల వయసుండే శకుంతలబాయి ఆగాశే, తాను ఈ పనిని 15 ఏళ్లుగా చేస్తున్నట్టు చెప్పారు. కేవలం వర్షాకాలంలో, పండగ రోజుల్లో మాత్రమే విరామం. "కొన్ని రకాలపనులకి రోజుకి 50 రూపాయలిస్తారు. కానీ అవి చాలా అరుదు. ఎక్కువసార్లు 25-30 రూపాయలు మాత్రమే దొరుకుతాయి" అన్నారామె. పట్నాలలో ఆమాత్రం పనులు కూడా లేవని ఆ మహిళలన్నారు.

Revantabai Kamble (in red, left), Shakuntalabai and Buribai (right) spend just four hours a day at home and travel over 1,000 kms each week to earn a few rupees
PHOTO • P. Sainath
Revantabai Kamble (in red, left), Shakuntalabai and Buribai (right) spend just four hours a day at home and travel over 1,000 kms each week to earn a few rupees
PHOTO • P. Sainath

రేవంతబాయి కాంబళే (ఎడమవైపు, ఎరుపు చీరలో), శకుంతలాబాయి, బురీబాయి (కుడివైపు)లు కేవలం నాలుగు గంటలు మాత్రమే ఇంట్లో ఉంటారు. కొద్ది డబ్బు సంపాదన కోసం వీరు వారానికి 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు

పట్టణాలలోని డబ్బులు నగరాలకు ఎగిరిపోయాయి. పరిశ్రమలు మూతబడ్డాయి. చిన్న పట్టణాలు నాశనానికి దగ్గర్లో వున్నాయి. ఇప్పుడిక్కడున్న మహిళల్లో దాదాపు అందరూ గతంలో బీడీ పరిశ్రమలో ఉపాధి పొందినవారే. "పరిశ్రమ వెళ్ళిపోయాక మా పని అయిపోయింది," అన్నారు బురీబాయి. "బీడీ పరిశ్రమ ఒక సంచార పరిశ్రమ. చవకగా దొరికే శ్రమ కోసం అది సంచరిస్తూనే ఉంటుంది," అని ఈ రంగంలో పనిచేసిన మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌కు చెందిన కె. నాగరాజ్ అన్నారు. "అది తన స్థావరాన్ని చాలా త్వరగా మార్చుకుంటుంది. మానవ జీవితాలపై ఈ మార్పులు వినాశకరంగా మారతాయి. గత 15 ఏళ్లుగా ఇది ఎక్కువయ్యింది." అన్నారాయన. "బీడీ పరిశ్రమలో ఎక్కువభాగం" గోండియా నుంచి ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు వెళ్లిపోయాయని కిసాన్ సభకు చెందిన ప్రదీప్ పాపన్‌కర్ అన్నారు.

"ఈ రైలు ప్రయాణానికి మేం టికెట్ కొనం" అన్నారు ఆ మహిళలు. "రెండు వైపులా  ప్రయాణానికి టికెట్‌కయ్యే ఖర్చు మేం సంపాదించే 30 రూపాయిలకంటే ఎక్కువ. మా పద్దతి చాలా సింపుల్. దొరికితే, తనిఖీచేసే అధికారికి 5 రూపాయలు లంచం ఇస్తాం." ఇక్కడ టికెట్‌పై రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటీకరించారు. "మేం సరైన టికెట్ కొనలేమని వాళ్లకు తెలుసు కనుకే మా దగ్గరకే వస్తారు దోచుకోడానికి."

"మా పెద్దబ్బాయి అప్పుడప్పుడూ వాడి సైకిల్ మీద నన్ను స్టేషన్ దగ్గర దింపుతాడు," అన్నారు బురీబాయి. "తరవాత వాడు అక్కడే వుండి ఏదయినా పని దొరికితే చేస్తాడు, కూలీ ఎంతయినా. మా అమ్మాయి ఇంటిదగ్గర వంట చేస్తుంది. మా రెండో అబ్బాయి అన్నకు భోజనం తీసుకువెళ్తాడు." క్లుప్తంగా చెప్పాలంటే, "ఒకరికి వచ్చే వేతనం కోసం ముగ్గురు పనిచేస్తున్నారు." అన్నారామె. కానీ ఆమె భర్తతో కలిపి కుటుంబ సభ్యులు ఐదుగురూ పనిచేసినా చాలాసార్లు రోజుకు 100 రూపాయలు కూడా సంపాదించలేరు. ఒక్కోసారి వాళ్ళల్లో ఇద్దరికే పని దొరుకుతుంది. ఆ కుటుంబానికి బిపిఎల్ రేషన్ కార్డు లేదు.

ఆ దారి పొడుగునా వచ్చే స్టేషన్లలో, తక్కువ కూలీకి వచ్చే పనివాళ్ళను తీసుకువెళ్ళేందుకు మేస్త్రీలు వేచి వున్నారు.

9 గంటల ప్రాంతంలో సాల్వా చేరుకున్న తర్వాత గ్రామంలోకి ఒక కిలోమీటర్ దూరం నడక. భూయజమాని ప్రభాకర్ వంజారె ఇంటిదగ్గర కొద్దిసేపు ఆగి మళ్ళీ పొలంలోకి మూడు కిలోమీటర్లు నడక. తల మీద పెద్ద నీళ్ల బిందెతో బురీబాయి ఆ మూడుకిలోమీటర్లు నడిచారు. అంత బరువు మోస్తూ కూడా ఆవిడ మమ్మల్నందరినీ దాటేసి ముందుకు వెళ్ళిపోయారు.

Shakuntalabai and Buribai: their families are asleep when the women get home, and asleep when they leave in the mornings
PHOTO • P. Sainath
Shakuntalabai and Buribai: their families are asleep when the women get home, and asleep when they leave in the mornings
PHOTO • P. Sainath

శకుంతలాబాయి, బురీబాయి: ఈ మహిళలు పనినుండి తమ ఇళ్ళకు తిరిగి చేరుకునే సమయానికీ, మళ్ళీ పొద్దున్నే పనికోసం ఇంట్లోంచి బయలుదేరే సమయానికీ కూడా వారి కుటుంబాలు నిద్రలో ఉంటాయి

అతి తక్కువ కూలీకే వాళ్ళు పనిచేసే పొలం యజమాని పరిస్థితి కూడా కష్టంగానే వుంది. వ్యవసాయ సంక్షోభం వంజారేని తీవ్రంగా దెబ్బతీసింది. అతని సొంతానికి 3 ఎకరాల భూమి వుంది. మరో 10 ఎకరాలను కౌలుకి తీసుకున్నాడు. "పంటకు సరైన ధరలేదు. మాకు మిగిలేది దాదాపు ఏమీలేదు." అని అతను వాపోయారు. గ్రామంలో వుండే కూలీలు చేసేదేం లేక వేరేచోటకి వలస వెళ్లారు. అందుకే ఇక్కడి పనులు చేసేందుకు ఈ మహిళలు రావాలివచ్చింది.

ఈ ప్రాంతం, మహారాష్ట్రలో పత్తి పండించి కష్టాల్లో వున్న ప్రాంతానికి దూరంగా ఉన్న తూర్పు విదర్భ ప్రాంతం. వంజారె వరి, మిరప, ఇంకా ఇతర పంటలను పండిస్తారు. ప్రస్తుతం కలుపు తీయడానికి ఈ మహిళా కూలీలు అవసరం. వాళ్ళు సాయంత్రం 5:30 గంటల దాకా పనిచేస్తారు. తిరిగి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి వారికి ఇంకో గంట పడుతుంది.

"కానీ రైలు రాత్రి 8 గంటలకు వస్తుంది," అన్నారు బురీబాయి. "మేము తిరోడా చేరుకునే సరికి రాత్రి 10 గంటలవుతుంది." వాళ్ళు ఇల్లు చేరేసరికి ఇంట్లో అందరూ నిద్రపోతూవుంటారు. మళ్ళీ పొద్దున్నే బయలుదేరేటప్పటికి ఇంకా నిద్ర లేచివుండరు. "ఇక కుటుంబ జీవితం ఏముంటుంది?" అడిగింది రేవంతబాయి.

రాత్రి ఇంటికి చేరేసరికి వాళ్ళు ఆ రోజు మొత్తమ్మీద 170 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసివుంటారు. రోజుకి 30 రూపాయలు సంపాదించడం కోసం వాళ్ళు ఆ ప్రయాణాన్ని వారంలో ప్రతిరోజూ చేస్తారు. "మేం ఇల్లు చేరేసరికి రాత్రి 11 అవుతుంది. అప్పుడింక తినడం, పడుకోవడం." నాలుగు గంటల తర్వాత, వాళ్ళకు ఇదే దినచర్య తిరిగి మొదలవుతుంది.

అనువాదం: వి. రాహుల్జీ

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

Other stories by Rahulji Vittapu