ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
తలపై ‘మల’ భారం !
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన ఈ వృద్ధురాలు తన ఇంటినీ, పరిసరాలను ఏ మాత్రం మురికీ లేకుండా శుభ్రంగా ఉంచుకుంటారు. అది ఇంటి పని – అలాగే ‘మహిళల పని’ కూడా. ఇంట్లోనైనా, బహిరంగ స్థలాల్లోనైనా ‘శుభ్రం చేసే’ పారిశుధ్య పనులు ఎక్కువగా మహిళలే చేస్తుంటారు. కానీ ఈ పని ద్వారా వారికి లభించే ఆదాయంకన్నా ఈసడింపులే ఎక్కువ. రాజస్థాన్‌కు చెందిన ఈ మహిళ లాంటి వారికైతే ఇది మరింత దారుణం. ఆమె ఒక దళితమహిళ. ఇళ్లల్లో ఉండే మరుగుదొడ్లను చేత్తో శుభ్రం చేసే ‘పాకీ’ పని చేసే మనిషి. రాజస్థాన్‌లోని సీకర్‌లో ప్రతి రోజూ దాదాపు 25 ఇళ్లలో ఆమె ఈ పని చేస్తుంటారు.
ఇందుకు ప్రతిఫలంగా ప్రతి ఇంటి నుంచీ ఆమెకు ఒక రోటీ ఇస్తారు. వాళ్లు దయగలవారైతే నెలకోసారి కొన్ని రూపాయలు కూడా ఇస్తుంటారు. బహుశా ఇంటికో 10 రూపాయలు. అధికార వర్గాలు ఆమెను ‘భంగీ’ అని పిలుస్తారు. ఆమె మాత్రం తనను తాను ‘మెహతర్’ అని చెప్పుకుంటుంది. ఇలాంటి పనులు చేసే చాలా కులాల వాళ్లు ఇటీవల తమను తాము ‘బాల్మీకులు’గా చెప్పుకోవడం బాగా పెరిగింది.
ఆమె తన తలపైన తట్టలో మోసుకెళ్తున్నది మానవ మలం. సభ్య సమాజం దాన్ని ‘నైట్ సాయిల్’ అని పిలుస్తుంది. దేశంలో ఏ మాత్రం రక్షణ లేకుండా, దుర్భరమైన దోపిడీకి గురయ్యే వారిలో ఆమె కూడా ఒకరు. ఒక్క రాజస్థాన్‌లోని సీకర్‌లోనే చూసుకున్నా ఆమె లాంటి వాళ్లు కొన్ని వందల మంది ఉంటారు.
భారతదేశంలో ఎంత మంది చేతులతో మలాన్ని శుభ్రంచేసేవారున్నారు? నిజానికి ఇది ఎవ్వరికీ తెలియదు. 1971లో జరిగిన జనాభా లెక్కల నాటి వరకూ దాన్నో ప్రత్యేకమైన వృత్తిగానే గుర్తించలేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే అసలు మలాన్ని చేత్తో ఎత్తిపోసే వాళ్లు లేనే లేరని అంటున్నాయి. అయినప్పటికీ, అందుబాటులో ఉన్న అరకొర డేటా ప్రకారం చూసినా, దాదాపు 10 లక్షల మంది దళితులు చేతులతో మలాన్ని శుభ్రంచేసేవారుగా బతుకులీడుస్తున్నారు. అసలు సంఖ్య ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. ఈ పనులు చేసే వాళ్లలో కూడా అత్యధికులు మహిళలే.
వాళ్లు చేసే పని కులవ్యవస్థలోని ఆచారాల “కాలుష్యానికి” సంబంధించిన అత్యంత ఘోరమైన శిక్షలను ఎదుర్కొంటుంది. వారు ఉండే చోట్లలో అంటరానితనం వారిని దారుణంగా, పకడ్బందీగా వెంటాడుతుంది. వాళ్ల కాలనీలు పూర్తిగా వేరుగా ఉంటాయి. చాలా వరకు అవి నగరాలకు, పట్టణాలకూ మధ్యలో ఉంటాయి. లేదా ప్రణాళికేదీ లేకుండా ‘పట్టణాలు’గా పెరిగిపోయిన ఊళ్లలో ఉంటాయి. అయితే వీరి కాలనీలు కొన్ని మెట్రోల్లో కూడా ఉంటున్నాయి.
1993లో కేంద్ర ప్రభుత్వం చేతులతో మలాన్ని శుభ్రంచేసేవారి నియామకాన్ని, డ్రై లాట్రిన్ల నిర్మాణాన్ని నిషేధిస్తూ ఓ చట్టం చేసింది. ఈ చట్టం మాన్యుయల్ స్కావెంజింగ్‌ను నిషేధించింది. అయితే, చాలా రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో అసలు ఆ పద్ధతే లేదని బుకాయించాయి లేదా ఈ విషయం పై మౌనం వహించాయి. వారి పునరావాసం కోసం నిధులు కూడా కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వినియోగించుకునే వీలు కల్పించారు. కానీ ఆ పని అమల్లోనే లేదని బుకాయించినప్పుడు ఇక దాన్ని నిర్మూలించే ప్రసక్తి ఎక్కడిది? కొన్ని రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని కేబినెట్ స్థాయిలో సైతం వ్యతిరేకించారు.
మునిసిపాలిటీల్లో మహిళా ‘ సఫాయి కర్మచారీలకు ’ (పారిశుధ్య కార్మికులకు) చాలా తక్కువ వేతనం చెల్లిస్తారు. దాంతో వాళ్లు పూట గడుపుకునేందుకు సఫాయి పనికి తోడుగా ‘నైట్ సాయిల్’ను ఎత్తిపోసే పనిని కూడా చేస్తున్నారు. చాలా సార్లు వాళ్లకు మునిసిపాలిటీలు నెలల తరబడి జీతాలు చెల్లించవు. 1996లో హరియాణా సఫాయి కర్మచారీలు వేతనాల్లో ఆలస్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దానికి స్పందనగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవల చట్టం (ఎస్మా) కింద దాదాపు 700 మంది మహిళలను 70 రోజుల వరకూ జైల్లో పెట్టింది. సమ్మె చేపట్టిన కార్మికులు డిమాండ్ ఒక్కటే: మా జీతాలు మాకు సకాలంలో చెల్లించండి అని.
ఈ పనికి సామాజిక ఆమోదం చాలానే ఉంది. కాబట్టి దీన్ని నిర్మూలించడానికి సామాజిక సంస్కరణ అవసరం. కేరళలో 1950, 1960లలో ఎలాంటి చట్టం లేకుండానే ‘నైట్ సాయిల్’ పనిని నిర్మూలించారు. అందుకే, ఎప్పుడైనా సరే ప్రజా కార్యాచరణే కీలకమైంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి