ఇప్పుడైతే గణేశ్, అరుణ్ ముకణేలు తమ బడిలో వరుసగా 9వ, 7వ తరగతులు చదువుతూ ఉండాలి. అయితే వాళ్ళిద్దరూ ప్రస్తుతం  ఠానే జిల్లా, ముంబై శివార్లలో ఉందే కొళోశీ అనే తమ కుగ్రామంలోని ఇంటి వద్దనే సమయాన్నంతా గడిపేస్తున్నారు. అందుబాటులో ఉన్న తుక్కునంతా ఉపయోగించి వాళ్ళిప్పుడు కార్లను, ఇతర వస్తువులను తయారుచేస్తున్నారు. లేదంటే ఇటుక బట్టీలో పనిచేస్తున్న తమ తల్లిదండ్రుల వద్ద కూర్చుని కాలంగడిపేస్తుంటారు.

“వాళ్ళికపై పుస్తకాలతో చదువుకోరు. ఈ చిన్నవాడు (అరుణ్) తుక్కుతోనూ, చెక్కముక్కలతోనూ బొమ్మలు చేయడంలో బిజీగా ఉన్నాడు. వాడి రోజంతా ఆటల్లోనే గడిచిపోతుంది" అని వాళ్ళ తల్లి నీరా ముకణే చెప్పింది. “నాకు బళ్ళో విసుగుపుడుతుందని ఎన్నిసార్లు చెప్పాను?” అంటూ అరుణ్ తల్లి మాటలకు చిన్నగా అడ్డుతగిలాడు. వారి మధ్య మాటామాటా పెరగటంతో అరుణ్, ఆ చుట్టుపక్కల దొరికిన వ్యర్థ పదార్థాలతో ఈమధ్యనే తాను తయారుచేసుకున్న కారుతో ఆడుకోవడానికి ఇంట్లోంచి బయటపడ్డాడు.

ఇరవయ్యారేళ్ళ నీరా 7వ తరగతి వరకు చదువుకుంది. కానీ ఆమె భర్త విష్ణు(35) రెండవ తరగతి తర్వాత బడి వదిలేశారు. తమ పిల్లలకు క్రమబద్ధమైన విద్యను అందించాలనీ, తద్వారా వారికి తమ తల్లిదండ్రుల్లాగా దగ్గరలో వుండే నీటి గుంటల్లో చేపలు పట్టడం లేదా ఇటుక బట్టీలలో పనిచేయడం వంటి పనులు చేసే అగత్యం పట్టకూడదనీ ముకణేలు గట్టిగా కోరుకున్నారు. అనేక ఆదివాసీ కుటుంబాలు ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు శహాపూర్-కల్యాణ్ ప్రాంతానికి వలస వెళ్తుంటాయి.

“నేను పెద్దగా చదువుకోలేకపోయాను. కానీ నా పిల్లలను బాగా చదివించాలని కోరుకుంటున్నాను" అని కాత్కరీ సామాజికవర్గానికి చెందిన విష్ణు ముకణే అన్నారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి విపత్కర పరిస్థితులలో ఉన్న సమూహం (పివిటిజి) గా జాబితా చేసివున్న కాత్కరీ ఆదివాసీ వర్గం, అటువంటి పరిస్థితులలో ఉన్న మూడు ఆదివాసీ సమూహాలలో ఒకటి. రాష్ట్రంలోని కాత్కరీ వర్గంలో అక్షరాస్యత రేటు 41 శాతంగా ఉందని ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2013లో వెలువరించిన ఒక నివేదిక లో పేర్కొంది.

నాలుగు సంవత్సరాల క్రితం, తగినంత మంది విద్యార్థులు లేనందున స్థానిక ప్రభుత్వ పాఠశాల మూసివేస్తుండటంతో విష్ణు, అతని భార్య తమ పిల్లలను మఢ్ గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక ఆశ్రమ పాఠశాలలో (స్థానికంగా మఢ్ ఆశ్రమ శాల అని పిలుస్తారు) చేర్చారు. ఇది ఠాణే జిల్లాలోని మురబాడ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1-12వ తరగతి వరకు ఉన్న ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే 379 మంది విద్యార్థులలో 125 మంది వీరి కొడుకుల మాదిరిగానే రెసిడెన్షియల్ విద్యార్థులు. "వారికి బడిలో తినడానికీ, చదువుకోవడానికీ వీలున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు వాటిని పోగొట్టుకున్నాం" అన్నారు విష్ణు.

PHOTO • Mamta Pared
PHOTO • Mamta Pared

ఎడమ: స్వయంగా తయారుచేసుకున్న కొయ్య సైకిల్‌తో ఆడుకుంటోన్న అరుణ్ ముకణే. కుడి: తమ ఇంటి బయట ముకణే కుటుంబం: విష్ణు , గనేశ్ , నీరా , అరుణ్

లాక్‌డౌన్ విధించిన తర్వాత బడులు మూతపడిపోవడంతో, మఢ్ ఆశ్రమ శాలలో చదువుతోన్న కొళోశీ గ్రామ విద్యార్థులంతా తమ తల్లిదండ్రుల వద్దకు తిరిగివచ్చారు.

విష్ణు పిల్లలు కూడా ఇంటికి తిరిగివచ్చారు. "వాళ్ళు ఇంటికి తిరిగివచ్చినందుకు మొదట్లో మేం చాలా సంతోషించాం," మరింత పని కోసం వెతకవలసిన అవసరం వచ్చినప్పటికీ, విష్ణు సంతోషంగా చెప్పారు. దగ్గరలో ఉన్న చిన్న చెక్‌డ్యామ్‌లో రెండు మూడు కిలోల చేపలను పట్టుకుని మురబాడ్‌లో అమ్మి కుటుంబాన్ని పోషించేవారు విష్ణు. ఇప్పుడు కొడుకులిద్దరూ కూడా ఇంట్లోనే ఉండడం వలన చేపలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోయేదికాదు. దాంతో అతను తన ఆదాయాన్ని పెంచుకోవడానికి సమీపంలోని ఇటుక బట్టీలో పని చేపట్టారు. ప్రతి వెయ్యి ఇటుకలకు రూ. 600 అతనికి చెల్లిస్తారు, కానీ ఆ సంఖ్య ఎప్పుడూ అతనికి దూరంగానే ఉండేది. ఎక్కువ గంటలు పనిచేసినప్పటికీ అతను రోజుకు దాదాపు 700-750 ఇటుకలను మాత్రమే తయారుచేయగలిగేవారు.

రెండు సంవత్సరాల తరువాత, బడిని తిరిగి తెరిచారు. మఢ్ ఆశ్రమ శాలలో తరగతులు మొదలయ్యాయి కానీ వారి తల్లిదండ్రులు ఎంతగా బతిమాలినప్పటికీ గణేశ్, అరుణ్ ముకణేలు తమ తమ తరగతి గదులకు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. రెండు సంవత్సరాల ఖాళీని పూరించడం చాలా కష్టమనీ, తాను బడిలో చివరిగా ఏం చేశాడో కూడా తనకు గుర్తు లేదనీ అరుణ్ అన్నాడు. అయితే వాళ్ళ నాన్న తన ప్రయత్నాన్ని వదలలేదు. పెద్ద కొడుకు గణేశ్ కోసం పాఠ్యపుస్తకాలు తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. గణేశ్ తిరిగి బడిలో చేరాలి.

నాలుగవ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల కృష్ణ భగవాన్ జాదవ్‌కు, అతని స్నేహితుడైన 3వ తరగతి విద్యార్థి కాలూరామ్ చంద్రకాంత్ పవార్‌కు ఆశ్రమ శాలలో తిరిగి చేరాలనే కోరిక ఉంది: "మాకు చదవడం, రాయడం అంటే ఇష్టం!" కృష్ణ, కాలూరామ్‌లు ఏక కంఠంతో చెప్పారు. కానీ బడులు మూసేసిన ఈ రెండు సంవత్సరాలకు ముందు కూడా వారు క్రమబద్ధమైన బడి చదువులో చాలా కొద్ది సంవత్సరాలు మాత్రమే గడిపారు కాబట్టి, వారికి చదువును కొనసాగించే నైపుణ్యం లేదు. దాంతో మళ్లీ మొదటినుంచీ చదువుకుంటూ రావాల్సిన అవసరం పడింది.

ఈ ఇద్దరు పిల్లలు తమ బడి మూతపడినప్పటి నుండి ఆ ప్రాంతంలోని వాగులు, నదుల ఒడ్డు నుండి ఇసుక తీసే పని చేయడానికి వారి కుటుంబాలతో పాటు ప్రయాణిస్తున్నారు. పిల్లలు కూడా ఇంట్లో ఉండటంతో, తినే నోళ్లు ఎక్కువై వారి కుటుంబాలపై మరింత సంపాదించాల్సిన అవసరం, ఒత్తిడి పెరిగిపోయాయి.

PHOTO • Mamta Pared
PHOTO • Mamta Pared

ఎడమ: ఠాణే జిల్లా , మఢ్ గ్రామంలోని ప్రభుత్వ సెకండరీ ఆశ్రమ్ పాఠశాల. కుడి: ఊరివెంట పారుతున్న కాలువలో ఆడుకుంటున్న కృష్ణా జాదవ్(ఎడమ) , కాలూరామ్ పవార్

*****

దేశవ్యాప్తంగా, 5వ తరగతి తర్వాత బడి మానేస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన పిల్లల రేటు 35 శాతం; ఇది 8వ తరగతి దాటేసరికి 55 శాతానికి చేరుకుంది. కొళోశీ జనాభాలో ప్రధానమైనవారు ఆదివాసులు. ఈ కుగ్రామం లేదా వాడి లో దాదాపు 16 కాత్కరీ ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. మురబాడ్ బ్లాక్‌లో మా ఠాకూర్ ఆదివాసులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు; ఆశ్రమ శాలలో ఈ రెండు సముదాయాలకు చెందిన పిల్లలు చదువుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ల సమయంలో ఆన్‌లైన్ తరగతులకు అవకాశం ఉందని భావించిన ఇతర పాఠశాలల మాదిరిగా కాకుండా, మార్చి 2020లో, ఆదివాసీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మఢ్ ఆశ్రమ శాల మూతపడింది.

“అందరు విద్యార్థులకు లేదా వారి కుటుంబాలకు స్మార్ట్‌ఫోన్‌లు లేనందున ఆన్‌లైన్ పాఠశాల విద్యను అమలు చేయడం అసాధ్యం. ఫోన్‌ సౌకర్యం ఉన్న పిల్లలు కూడా మేం పిలిచినప్పుడు పనులు చేసుకునే తమ తల్లిదండ్రులతో పాటే ఉంటారు,” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉపాధ్యాయుడు చెప్పారు. చాలా ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ అండుబాటులో లేకపోవడం వలన తాము విద్యార్థులను చేరుకోలేకపోయామని మరికొందరు తెలిపారు.

అంటే, వారు ప్రయత్నించలేదని కాదు. 2021 చివరిలోనూ, 2022 మొదట్లోనూ కొన్ని పాఠశాలలు సాధారణ తరగతులను తిరిగి ప్రారంభించాయి. కానీ విష్ణు కొడుకులు గణేశ్, అరుణ్, అలాగే కృష్ణ, కాలూరామ్ వంటి చాలామంది పిల్లలు తరగతి గది పనితోనూ చదువుకు సంబంధించిన విషయాలతోనూ సంబంధం కోల్పోయారు; తిరిగి బడికి రావడానికి ఇష్టపడటంలేదు.

"తిరిగి పాఠశాలకు వెళ్ళేలా మేం ఒప్పించిన కొద్దిమంది పిల్లలు కూడా చదవడం మర్చిపోయారు," అని ఒక ఉపాధ్యాయుడు PARIతో చెప్పారు. అలాంటి విద్యార్థులను ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి, వారికి చదవడం నేర్పడం కోసం ఉపాధ్యాయులు తరగతులు ప్రారంభించారు. పిల్లలు నెమ్మదిగా తిరిగి చడవడాన్ని నేర్చుకుంటోన్న సమయంలో, ఫిబ్రవరి 2021లో, మహారాష్ట్రలో రెండవ విడత లాక్‌డౌన్‌ విధించారు. దానితో అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న పిల్లలు మరోసారి తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయారు.

*****

PHOTO • Mamta Pared

కాలూరామ్ , కృష్ణలతో లీలా జాదవ్. మధ్యాహ్న భోజనంగా కేవలం ఉత్త అన్నాన్ని మాత్రమే తింటోన్న పిల్లలు

“(నా సంపాదనతో) మేం తినాలా లేక పిల్లలకు మొబైల్ ఫోన్లు కొనివ్వాలా? నా భర్త ఏడాది కాలంగా అనారోగ్యంతో మంచాన పడివున్నాడు," అని కృష్ణ తల్లి లీలా జాదవ్ తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, "నా పెద్దకొడుకు పనికోసం కళ్యాణ్‌లోని ఇటుక బట్టీకి వెళ్ళాడు." అన్నారు. తన చిన్న కుమారుని పాఠశాల పనుల కోసం ప్రత్యేకించి మొబైల్‌ను కొనుగోలుచేయడానికి ఆమె డబ్బు ఖర్చు చేయబోదనడంలో సందేహమేం లేదు.

కృష్ణ, కాలూరామ్‌లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు - ఒక పళ్ళెంలో కేవలం అన్నాన్ని - కూరగాయలు కానీ కలుపుకోవడానికి మరేమీ లేకుండా - తింటున్నారు.  లీల అన్నం వండిన పాత్ర పై ఉన్న మూతని తీసి, తనకోసం, తన కుటుంబ సభ్యుల కోసం వండిన అన్నం ఎంతుందో చూపించారు.

దేవ్‌ఘర్‌లోని ఇతరుల మాదిరిగానే లీల కూడా జీవనోపాధి కోసం నీటి ప్రవాహాల ఒడ్డు నుండి ఇసుకను తవ్వితీస్తారు. ఒక పూర్తి ట్రక్కు ఇసుకకు రూ. 3,000 వస్తాయి. ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు వారంపాటు పని చేస్తే, ఒక్క ట్రక్కు నిండా ఇసుకను నింపగలరు. వచ్చిన డబ్బును కూలీలందరూ పంచుకుంటారు.

“మేం మళ్లీ ఎప్పుడు చదువుకోవడం మొదలుపెడతాం?” కాలురామ్ తింటూనే, ఎవరినీ ఉద్దేశించకుండా అడిగాడు. ఈ ప్రశ్నకు అతనికే కాదు లీలకు కూడా సమాధానం కావాలి. ఎందుకంటే బడి ప్రారంభమైతే చదువుకే కాదు తిండికి కూడా భరోసా ఉన్నట్టే కదా!

*****

మఢ్ ఆశ్రమ శాలను చివరకు ఫిబ్రవరి 2022లో తిరిగి తెరిచారు. కొంతమంది పిల్లలు తిరిగి బడికి వచ్చారు కానీ మాధ్యమిక, ప్రాథమిక పాఠశాల (1-8వ తరగతి) పిల్లలు 15 మంది బడికి తిరిగి రాలేదు. "వారిని తిరిగి బడికి రప్పించడానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం. కానీ ఈ పిల్లలంతా ఠాణే, కళ్యాణ్, శహాపూర్‌లలో పనిచేస్తున్న వారి కుటుంబాలతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ల జాడ కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది." అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉపాధ్యాయుడు అన్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Mamta Pared

Mamta Pared (1998-2022) was a journalist and a 2018 PARI intern. She had a Master’s degree in Journalism and Mass Communication from Abasaheb Garware College, Pune. She reported on Adivasi lives, particularly of her Warli community, their livelihoods and struggles.

Other stories by Mamta Pared
Editor : Smruti Koppikar

Smruti Koppikar is an independent journalist and columnist, and a media educator.

Other stories by Smruti Koppikar
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli