నుస్రత్ బేనో ఇరవైఏళ్ళ లోపు ఆడవారిని, పిల్లలను కనవద్దని ఒప్పించింది. ఆమె ఈ మహిళల అత్తామామలతో, గర్భనిరోధకం వాడేందుకు అనుమతినివ్వమని దెబ్బలాడింది. ఆమె మహిళలను కానుపుల కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది. కానీ బీహార్ లో అరారియా జిల్లాలో రాంపూర్ గ్రామంలోని ఈ ముప్ఫయ్యిదేళ్ల ఆశ, తన పనులన్నింటిలోనూ మగవారికి వేసెక్టమి చేయించడమే అతి కష్టమైన పని అని చెప్పింది.
“పోయిన ఏడాది, ఒక్క మాగాయన మాత్రమే ఒప్పుకున్నాడు.” ఫోర్బ్స్ గంజ్ బ్లాక్ లోని ఆమె గ్రామంలో 3,400 మంది జనాభా ఉన్నారు. “అతను వేసెక్టమి చేయించుకున్నాక, అతని భార్య నన్ను చెప్పు తీసుకుని కొట్టడానికి వచ్చింది,” నవ్వుతూ అన్నది ఈ నలుగురు పిల్లల తల్లి.
రాంపూర్ లోని ఈ మొండి వైఖరి బీహార్‌లోని మిగిలిన గ్రామాలలో కూడా కనిపిస్తుంది. “వారిని మిగిలిన మగవారందరూ వెక్కిరిస్తారు, అని వారి భయం.” గత సంవత్సరం, బీహార్ ప్రభుత్వం ప్రతి నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే, రాబోయే వేసెక్టమీ వారం కోసం, మరో రౌండ్ ప్రచారాన్ని ప్రారంభించబోయే ముందు, వినయ్ కుమార్ నాకు చెప్పారు. "వారు తాము బలహీనంగా మారతామని, సెక్స్ చేయలేమని ఊహించుకుంటారు."
38 ఏళ్ల కుమార్, జెహనాబాద్‌లోని మఖ్దుంపూర్ బ్లాక్‌లోని దాదాపు 3,400 జనాభా ఉన్న బిర్రా గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వికాస్ మిత్రగా గత సంవత్సరంగా పనిచేస్తున్నాడు. అతని విధులలో వివిధ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం, అమలు చేయడం వంటివి ఉన్నాయి. పురుషులను వేసెక్టమీ చేయించుకోవడానికి ఒప్పించే అతికష్టమైన పని కూడా అతని విధుల జాబితాలో ఉంది. ఈ శస్త్ర చికిత్సలో మగవారి వాస్ డిఫెరెన్స్ (వీర్యాన్ని మోసే ట్యూబ్‌లు)ని కట్టివేయడం లేదా మూసిచేయడం జరుగుతుంది.
బీహార్‌లో, ఇప్పటికే అతితక్కువగా ఉన్న పురుషుల స్టెరిలైజేషన్లు, NFHS-3 (2005-06) నుండి NFHS-4 (2015-16)కి, 0.6 శాతం నుండి 0 శాతానికి పడిపోయాయి. బీహార్‌లో స్త్రీల స్టెరిలైజేషన్ శాతం కూడా - ప్రస్తుతం 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల వివాహిత మహిళల్లో 23.8 శాతం నుండి 20.7 శాతం వరకు పడిపోయింది - అయితే ఇది వేసెక్టమీల కంటే చాలా ఎక్కువగానే ఉంది.
బీహార్ సంఖ్యలు దేశవ్యాప్త డేటా ధోరణులను ప్రతిబింబిస్తాయి: భారతదేశం అంతటా, NFHS-4 ప్రకారం ప్రస్తుతం వివాహిత మహిళల్లో 36 శాతం (15-49 ఏళ్ల వయస్సులో) స్టెరిలైజేషన్ చేయించుకున్నట్లు నమోదు అయింది, అయితే ఈ మహిళల్లో 0.3 శాతం మాత్రమే తమ పురుషులకు స్టెరిలైజేషన్‌ను జరిగిందని చెప్పారు.
దేశంలో కండోమ్ వాడకం కూడా చాలా తక్కువగా ఉంది - ప్రస్తుతం 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల వివాహిత మహిళల్లో 5.6 శాతం మంది మాత్రమే గర్భనిరోధక చర్యగా కండోమ్‌లను వాడతామని చెప్పారు.
ఈ అసమతుల్యతను పరిష్కరించడానికి, 2018 నుండి, వికాస్ మిత్రలను ('వీరిని ప్రోగ్రెస్ అసోసియేట్స్' లేదా 'డెవలప్మెంట్ ఫ్రెండ్స్' అంటారు, 12వ తరగతి ఉత్తీర్ణమవడమే ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత) బీహార్‌లో ప్రవేశపెట్టారు – రాష్ట్రవ్యాప్తంగా 9,149 మంది దాకా వికాస్ మిత్రలు ఉన్నారు. ఈ మొత్తంలో 123 మంది జెహానాబాద్ జిల్లాలో, 227మంది అరారియా జిల్లాలో, గర్భనిరోధకంలో పురుషుల ప్రమేయాన్ని వేసెక్టమీలద్వారా పెంచడంలో సహాయపడటానికి నియమించబడ్డారని, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డేటా పేర్కొంది.
ఇది కాక మరుగుదొడ్లు నిర్మించడం, రుణాలు ధృవీకరించి, విడుదలైన రుణాలను పంపిణీ చేయడం, నీటి సౌకర్యం కల్పించడం వంటి అదనపు పనులు కూడా వికాస మిత్రగా పనిచేస్తున్న వినయ్ కుమార్ విధులలో భాగం. తరచుగా వచ్చే కరువులను వరదలను భరించే ఈ రాష్ట్రంలో, కరువు సహాయం కోసం రీయింబర్స్మెంట్లను కూడా నిర్ధారించడమేగాక, వరద సహాయానికి అర్హులైన వ్యక్తుల పేర్లను కూడా వీరు ధృవీకరించాలి.
రాష్ట్రంలోని మహాదళిత్ లేదా అత్యంత వెనుకబడిన 21 షెడ్యూల్డ్ కులాల వర్గాలపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో, వికాస్ మిత్రలను నియమించి, వీరికి బీహార్ మహాదళిత్ వికాస్ మిషన్ ద్వారా నెలకు 10,000 రూపాయిలు జీతంగా ఇస్తున్నారు. వీరు జిల్లా ప్రభుత్వ పరిధిలోకి వస్తారు, బ్లాక్ సంక్షేమ అధికారి క్రింద పనిచేస్తారు. పురుషులను వేసెక్టమీ చేయించుకోవడానికి ఒప్పించి నమోదు చేయించినందుకు, ఒక వికాస్ మిత్ర 400 రూపాయిలను అదనంగా సంపాదిస్తారు.
నేను వినయ్ కుమార్ ని కలిసినప్పుడు, అతను ‘బీహార్ వార్షిక పురుష స్టెరిలైజేషన్ వారం’ పనులలో హడావిడిగా ఉన్నాడు. ఈ సందర్భంలో, కుటుంబ నియంత్రణలో ‘పురుషుల పాత్ర’ అనే పద ప్రయోగం గట్టిగా వినపడుతోంది. భారతదేశంలో కుటుంబ నియంత్రణ పై అధిక దృష్టి సారించే రాష్ట్రాలలో బీహార్ ఒకటి - దీని మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) 15-49 వయస్సు-సమూహానికి 3.41. ఇది భారతదేశంలోనే అత్యధికం (అరారియా జిల్లా మొత్తం సంతానోత్పత్తి రేటు 3.93, ఇది రాష్ట్రంలోని TFR కన్నా ఎక్కువ). ఇక జాతీయ జాతీయ సగటు TFR 2.18 (NFHS-4).
వికాస్ మిత్రలు (ఇతర ప్రజారోగ్య రంగ కార్మికులలో) కుటుంబ నియంత్రణలో, 'పురుషుల పాత్ర’ కొరకు ప్రయత్నించక మునుపే - 1981 నుండి, కేంద్ర ప్రభుత్వం స్టెరిలైజేషన్‌కు నగదు ప్రోత్సాహకాలను జత చేసింది. ఇప్పుడు, వేసెక్టమీ చేయించుకునే పురుషులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయిలు ఇస్తుంది.
ఇంత చేసినా, లింగ-సమాన గర్భనిరోధక(అన్ని పద్ధతులలో) పురోగతి నెమ్మదిగానే ఉంది. భారతదేశం అంతటా, స్త్రీలు మాత్రమే ఈ బాధ్యతలో ఎక్కువ భాగం మోస్తున్నారు. సాధారణంగా పిల్లల మధ్య అంతరం ఉండేలా జాగ్రత్త పడడం, అవాంఛిత గర్భాలను నివారించడం మహిళల చేతులలోనే ఉందని భావిస్తున్నారు. భారతదేశంలో, ప్రస్తుతం వివాహిత స్త్రీలలో 48 శాతం మంది (15 నుండి 49 సంవత్సరాల వయస్సు) స్టెరిలైజేషన్, గర్భాశయంలోని పరికరాలు (IUDలు), మాత్రలు, ఇంజెక్షన్లు ('ఆధునిక గర్భనిరోధక పద్ధతులు' కింద NFHS-4లో సమూహం చేయబడినవి) వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటిలో, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గర్భనిరోధక పద్దతిగా ట్యూబల్ లిగేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు, IUDలు వంటి రివర్సిబుల్ పద్ధతుల కన్నా, శాశ్వత పద్ధతి అయిన స్త్రీపురుషుల స్టెరిలైజేషన్ పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నందుకు భారతదేశం విస్తృతంగా విమర్శలకు గురైంది. "స్త్రీల స్టెరిలైజేషన్ భారతదేశంలో ప్రముఖంగా ఉంది, ఇది [కుటుంబ నియంత్రణ లక్ష్యాలకు] సులభమైన సత్వరమార్గం, ఎందుకంటే మహిళలకు నిర్ణయాధికారం చాలా తక్కువగా ఉంటుంది," అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లోని సీనియర్ ఫెలో, హెల్త్ ఇనిషియేటివ్ హెడ్ ఊమెన్ సి. కురియన్ అన్నారు.
రాష్ట్ర కుటుంబ నియంత్రణ యంత్రాంగం, స్త్రీలకు వారి పునరుత్పత్తి హక్కులు, గర్భనిరోధక హక్కు, చట్టబద్ధమైన అబార్షన్ కు అవకాశం, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణను పొందడం వంటి వాటిపై అవగాహన కలిగించడానికి, అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాలలో చాలా వరకు నుస్రత్ బన్నో వంటి ఆశావర్కర్లకు, ఫాలో-అప్, పునరుత్పత్తి ఆరోగ్య సలహాలు అందించే ఫ్రంట్‌లైన్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల కు మళ్లించబడ్డాయి. ఆశాలకు కూడా ఆడవారిని కుటుంబనియంత్రణ ఆపరేషన్ కు నమోదు చేసినందుకు 500 రూపాయిల ప్రోత్సాహకం లభిస్తుంది. ఇదిగాక, ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు 3,000 రూపాయిలు చెల్లిస్తారు.
అయినప్పటికీ, పురుషులు స్టెరిలైజేషన్ ప్రక్రియ నుండి కోలుకోవడానికి దాదాపు ఒక వారం పడుతుంది, అదే విషయంలో మహిళలు పూర్తిగా కోలుకోవడానికి కొన్నిసార్లు రెండు నుండి మూడు నెలల సమయం పడుతుంది. ప్రక్రియ తర్వాత, పురుషులు వెంటనే డిశ్చార్జ్ చేయబడతారు, మహిళలు మాత్రం కనీసం ఒక రాత్రి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఉండవలసి ఉంటుంది.
కాని, చాలా మంది మహిళలు స్టెరిలైజ్ చేయించుకోకపోతే, వారు ఎక్కువ మంది పిల్లలను కనవలసి వస్తుంది అని భయపడుతున్నారు. తరచుగా, వినయ్ కుమార్ భార్య చేసినట్లు, వారు తమ భర్తకు లేదా అత్తమామలకు చెప్పకుండా ఈ విధానాన్ని ఎంచుకుంటారు.
అతను సలహా ఇచ్చే పురుషుల మాదిరిగానే, కుమార్ కు కూడా వేసెక్టమీ గురించి భయాలు, అపోహలు ఉన్నాయి - ఈ ప్రక్రియ తర్వాత అతను 'చాలా బలహీన పడతాడేమోనని' భయపడ్డానని చెప్పాడు. "ఎవరితో మాట్లాడాలో నాకు తెలియదు," అని అతను చెప్పాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత - అతని భార్య అతనిని సంప్రదించకుండానే ట్యూబల్ లిగేషన్ చేయించుకుంది.
కుమార్, ఇతర వికాస్ మిత్రలు సాధారణంగా వారి స్వంత కమ్యూనిటీలైన దళితులు, మహాదళిత్లతో పనిచేస్తూ, అవసరమైతే కొన్నిసార్లు వేసెక్టమీల కోసం తమ సేవల పరిధిని ఉన్నత-కులాల పురుషుల వరకు విస్తరింపజేస్తారు. అయితే, దేని ఇబ్బందులు దానికున్నాయి.
మఖ్దుంపూర్‌లోని కలనౌర్ గ్రామంలో వికాస్ మిత్ర అయిన 42 ఏళ్ల అజిత్ కుమార్ మాంఝీ, "మాకు అర్థం కానీ ప్రక్రియ గురించి అగ్రకులాల పురుషులు మమ్మల్ని ప్రశ్నిస్తారని మేము భయపడుతున్నాము, కాబట్టి మేము మా వర్గపు ప్రజలతో మాత్రమే మాట్లాడతాము.” అని జెహనాబాద్ జిల్లాలో కళనూర్ గ్రామానికి చెందిన 42 ఏళ్ల మాంఝీ చెప్పారు. ఈయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
కొన్నిసార్లు, ఇది కొంతవరకు వేరే విషయాల మీద ప్రభావం చూపుతుంది. 2018లో మాంఝీ ఇద్దరు వ్యక్తులను జాబితాలో చేర్చారు. “నేను ఒకతనితో మాట్లాడితే, అందరూ అతనిని చూసి నవ్వుతారని, ఒంటరిగా వెళ్లనని చెప్పాడు. కాబట్టి నేను అతని పొరుగువారిని కూడా ఒప్పించాను. అలా చేస్తే, అందరూ ధైర్యంగా వచ్చారు.”
కానీ వారు వేసెక్టమీ చేయించుకుని 13 నెలలు గడిచినా, వారికి ప్రోత్సాహకమైన 3,000 రూపాయిలు ఇప్పటికి అందుకోలేదు. ఇది తరచుగా జరుగుతుంది, దీనివలన ప్రజలను ఒప్పించడం ఇంకా కష్టమవుతుంది, అని మాంఝీ చెప్పారు. డబ్బు బ్యాంకు ఖాతాలకు వస్తుంది, కానీ గ్రామాల్లోని పురుషులెవరికి ఖాతాలు లేవు. దీనివలన వికాస్ మిత్ర సుదీర్ఘ విధుల జాబితాలో ఇంకో పని పెరుగుతుంది. "ఎవరికైనా బ్యాంక్ ఖాతా లేకపోతే, నేను వారి కోసం ఖాతా తెరుస్తాను" అని వినయ్ కుమార్ చెప్పారు. నేను మాట్లాడిన వికాస్ మిత్రలు ఒక్కక్కరు, ముగ్గురు నలుగురి కంటే ఎక్కువమందిని మగవారిని వేసెక్టమికి ఒప్పించలేకపోయారు.
స్టెరిలైజ్ చేయించుకోమని ఒక వ్యక్తిని ఒప్పిస్తున్నప్పుడు, అదే సమయంలో అతని భార్యతో కూడా మాట్లాడతారు. మాలతీ కుమార్, మఖ్దుంపూర్ బ్లాక్‌లోని కొహరా గ్రామంలో వికాస్ మిత్రగా పనిచేస్తుంది, కానీ పురుషులతో మాట్లాడటానికి ఆమె భర్త నందకిషోర్ మాంఝీపై ఆధారపడుతుంది. “మేము ఒక జట్టుగా పని చేస్తాము. నేను మహిళలతో మాట్లాడతాను, అతను వారి భర్తలతో మాట్లాడతాడు, ” అని ఆమె చెప్పింది.
"మీకు ఇంకా ఎక్కువమంది పిల్లలు పుడితే, మీరు ఇప్పటికే పుట్టిన పిల్లలను ఎలా చూసుకుంటారు అని నేను వారిని అడుగుతాను," అని నందకిషోర్ మంఝి చెప్పారు. కాని, ఎక్కువమంది అతని సలహాను వినిపించుకోరు.
ఆశాలు కూడా తమ భర్తలను సహాయం చేయమని అడుగుతారు. “మహిళలుగా, స్టెరిలైజేషన్ గురించి పురుషులతో మాట్లాడకూడదు. వాళ్లు, ‘మీరు మాకెందుకు ఇలా చెప్తున్నారు? నా భార్యతో మాట్లాడండి.’ అంటారు. అందుకే పురుషులను ఒప్పించమని నేను నా భర్తకు చెప్తున్నాను,” అని నుస్రత్ బన్నో చెప్పారు.
మహిళల వైపు నుండి చూస్తే, కుటుంబ నియంత్రణలో 'పురుషుల పాత్ర’ అనేది స్టెరిలైజేషన్ కోసం పురుషుల జాబితా తయారు చేయడంతో ఆగిపోదు. ఇక్కడ చాలా సంభాషించవలసి వస్తుంది. వారి భార్య ఎంత మంది పిల్లలను కావాలనుకుంటుంది, వారు ఎలాంటి గర్భనిరోధకాన్ని ఎంచుకోవాలి- ఇటువంటి విషయాలలో వారి భార్యకు సమానమైన అభిప్రాయం ఉందని వారికి చెప్పగలగాలి. "దీనికి సమయం కావాలి, ప్రతి పద్ధతిలో ఉండే లాభనష్టాలను ఇద్దరూ ఒప్పుకోగలగాలి," అని అరారియా జిల్లాలోని రాంపూర్ గ్రామంలోని 41 ఏళ్ల ఆశా కార్యకర్త, ముగ్గురు పిల్లల తల్లి అయిన నిఖత్ నాజ్ చెప్పారు.
సామాజికంగా, వేసెక్టమీ వల్ల తమ వివాహంపై ఎటువంటి ప్రభావం ఉంటుందో కూడా ఆలోచించాలని మహిళలు అంటున్నారు. ఆ వ్యక్తి భార్య తనను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, “ఈ ప్రక్రియ తన భర్తను నపుంసకుడిగా మారుస్తుందని, గ్రామంలో అందరూ ఎగతాళి చేస్తారని ఆమె కూడా భయపడింది. దీని వలన అతను ఆమెను హింసిస్తాడేమో అని కూడా భయపడింది”, అన్నది నుస్రత్.
ఇక, “మహిళలు తమ ప్రాణాల గురించి భయపడతారు, కానీ పురుషులు మాత్రం తమను చూసి అందరూ నవ్వుతారని భయపడతారా?", అని ఆమె అడుగుతుంది.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? ఐయితే zahra@ruralindiaonline.orgకి ఈమెయిల్ చేసి అందులో namita@ruralindiaonline.orgకి కాపీ చేయండి.
అనువాదం: అపర్ణ తోట