“ చాలూ, చాలూ (వస్తోంది, వస్తోంది), పుట్టబోయే బిడ్డ జనన కాలువ (యోని) వైపుకు వెళ్ళడానికి నేను సహాయం చేస్తున్నాను.”
ఒక దాయి గా (మంత్రసాని), పసి పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన రోజులను గుర్తుచేసుకున్నప్పుడు, గుణామాయ్ మనోహర్ కాంబ్లే కళ్ళు మెరిశాయి. ఎనభై ఆరు సంవత్సరాలు అలా గడిచిపోయాయి. మరోసారి ఒక అప్రమత్తమైన, శ్రద్ధగల మంత్రసానిగా ఆమె కనబడ్డారు. జనన కాలువ నుండి శిశువు బైటికొచ్చే ప్రక్రియను వివరిస్తూ, ఆమె ఇలా అన్నారు, “ హాతాత్ కాకణఁ ఘాలతో నా, అగదీ తసఁ! (మనం గాజులు ఎలా వేసుకుంటామో, అలాగే!)." ఆమె సంజ్ఞలు చేస్తున్నప్పుడు, తన మణికట్టు మీద ఎర్రటి మట్టి గాజులు తళుక్కుమన్నాయి.
మహిళలకు ప్రసవంలో సహాయం చేయడం ప్రారంభించిన గత ఏడు దశాబ్దాలలో, వాగ్దరీ గ్రామంలో నివాసముండే దళిత మహిళ గుణామాయ్, ఉస్మానాబాద్ జిల్లాలో వందలాది మంది పిల్లలను వారి తల్లుల కడుపు నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. “ఇది తన చేతుల మాయాజాల”మని ఆ అనుభవజ్ఞురాలు తెలిపారు. ఆమె నాలుగేళ్ల క్రితం, తన 82వ ఏట, చివరిసారిగా ఒక బిడ్డకు జీవం పోశారు. “నేను ఎప్పుడూ విఫలం కాలేదు. దేవుడు నాతో ఉన్నాడు,” ఆవిడ గర్వపడ్డారు.
సోలాపూర్ సివిల్ హాస్పిటల్‌లో జరిగిన ఒక సంఘటనను గుణామాయ్ కూతురు వందన గుర్తుచేసుకున్నారు. సిజేరియన్ చేయాల్సిన అవసరం లేకుండా, ముగ్గురు పిల్లలను ఎలా బైటికి తీస్తానో చూడమని వైద్యులతో తన తల్లి అన్న సంఘటన అది. “మీరు మా కన్నా ఎక్కువ నేర్పు కలిగినవారు ఆజీ (అమ్మమ్మ)’ అన్నారు వాళ్ళు.” వారి ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని గుర్తు చేసుకుంటూ గుణామాయ్ ముసిముసి నవ్వులు నవ్వారు.
సుఖ ప్రసవం చేసి బిడ్డకు జీవం పోయడంలో మాత్రమే ఆమె నైపుణ్యం లేదు. మహారాష్ట్రలోని సోలాపూర్, కొల్హాపూర్, పుణే వంటి ప్రాంతాల నుండి ఆమెకుపిలుపులు వచ్చేవి. “పిల్లల కళ్ళు, చెవులు లేదా ముక్కులో కొన్నిసార్లు ఇరుక్కుపోయే వస్తువులను తొలగించడంలో మా అమ్మమ్మ సిద్ధహస్తురాలు. విత్తనమైనా, పూస అయినా ఇరుక్కుపోతే, దానిని తీయడానికి జనం తమ బిడ్డలను మా అమ్మమ్మ వద్దకు తీసుకువస్తారు,” కొన్ని నెలల క్రితం వాళ్ళని కలిసినప్పుడు, గుణామాయ్ మనవరాలు శ్రీదేవి PARI తో గర్వంగా అన్నారు. కడుపు నొప్పులు, కామెర్లు, జలుబు, దగ్గు, జ్వరం లాంటి వాటికి మూలికా వైద్యం అందించడం కూడా ఒక దాయి గా తన పనిలో భాగంగా ఆవిడ భావించారు.
గుణామాయ్ దాయి లాంటి వాళ్ళు సంప్రదాయక కాన్పు సమయంలో సహాయకులుగా (Traditional Birth Attendants - TBAs), అంటే మంత్రసానులుగా, పనిచేస్తారు. వారికి ఎలాంటి ఆధునిక శిక్షణ లేదా ధృవీకరణ ఉండదు. కానీ తరతరాలుగా, దళిత కుటుంబాలకు చెందిన మహిళలే గ్రామాలు, పట్టణాల్లో నివసించే తక్కువ ఆదాయ సమూహానికి చెందిన గర్భిణులకు ప్రసవంలో ఎక్కువగా సహాయం చేశారు. “ శాబూత్ బాళాతీన్ హోతీస్ (మీరు ఇది చేయగలరు. అంతా సరిగానే జరుగుతుంది),” అంటూ వారికి భరోసా ఇచ్చేవారు.
కానీ గత మూడు-నాలుగు దశాబ్దాలలో, సంస్థాగత జననాలకు రాజ్యం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల దాయిలు కనుమరుగయ్యారు. 1992-93లో చేపట్టిన మొదటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-1) ప్రకారం, మహారాష్ట్రలో సగం కంటే తక్కువ జననాలు ఆరోగ్య సదుపాయాలలోనే జరిగాయి. మూడు దశాబ్దాల తర్వాత, అంటే 2019-21లో, ఈ సంఖ్య 95 శాతానికి చేరింది (NFHS-5).
నైపుణ్యం, అనుభవం ఉన్నగుణామాయ్ లాంటి దాయిలు కవలలకు జన్మనివ్వడంలో సహాయం చేయగలరు; అలాగే, ఎదురుకాళ్ళతో పుట్టడం (breech baby) లేదా మరణించిన శిశువు (stillbirth) పుట్టడం లాంటివి వివారించగలరు. కానీ ప్రస్తుతం, గర్భవతులను ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళమని సూచించడం లేదా ఆరోగ్య సదుపాయానికి ఆమెను తీసుకెళ్ళడానికి మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు. ఇలా సూచించిన ప్రతి కేసుకు, దాయి కి రూ.80 వస్తాయి.
బిడ్డ పుట్టడంలో ఆమె పాత్ర తగ్గినప్పటికీ, “గ్రామంలో ప్రజలు నన్ను ఇష్టపడతారు. నాకు టీ లేదా భాకర్ (రోటీ) ఇస్తారు. కానీ పెళ్ళికి మాత్రం మమ్మల్ని పిలవరు. కార్యక్రమం పూర్తయిన తర్వాత మాకు ఆహారం ఇస్తారు," అన్నారు గుణామాయ్. తన పనికి గుర్తింపు దొరికినప్పటికీ, తన లాంటి దళితులు ఇప్పటికీ కుల వివక్షను ఎదుర్కొంటున్నారని గుణామాయ్ అనుభవాలు నిరూపిస్తున్నాయి.
*****
దళిత వర్గానికి చెందిన ఒక మాంగ్ కుటుంబంలో జన్మించారు గుణామాయ్. ఆమె తండ్రి చదువుకున్నారు. తోబుట్టువులు పాఠశాలకు వెళ్ళారు. కానీ ఆమెకు ఏడేళ్ళ వయసులో వివాహం జరిగింది. ఋతుస్రావం ప్రారంభమైన తర్వాత మెట్టినింటికి కాపురానికి పంపించారు. “అప్పుడు నా వయస్సు కేవలం 10-12 ఏళ్ళు. జగా (గౌను) వేసుకునేదాన్ని. నేను వాగ్దరీకి వచ్చిన సంవత్సరంలోనే నల్‌దుర్గ్ కోటను జయించారు,” 1948లో హైదరాబాద్ నిజాం పాలనలో ఉన్న కోటను భారత సైన్యం స్వాధీనం చేసుకున్నప్పటి సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు.
ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్ తాలూకా లో, 265 ఇళ్ళున్న (2011 గణన ప్రకారం) ఒక చిన్న గ్రామమే వాగ్దరీ. గ్రామ శివార్లలో ఉన్న దళిత వస్తీ (బస్తీ)లో, ఒంటి గదిలో గుణామాయ్ నివసించేవారు. దళితుల కోసం ప్రవేశపెట్టిన రమాయీ ఆవాస్ యోజన అనే రాష్ట్ర గృహనిర్మాణ పథకం కింద, 2019లో ఆ ఒంటిగదికి మరో రెండు గదులు వచ్చి చేరాయి.
చిన్న వయసులో నవవధువుగా వాగ్దరీ గ్రామానికి వచ్చిన గుణామాయ్, తన అత్తమామలతో కలిసి మట్టి గోడలున్న ఇంటిలో నివసించారు. ఆ కుటుంబానికి భూమి లేదు. తన భర్త మనోహర్ కాంబ్లే గ్రామానికి, దాని అధినేతకు సేవ చేస్తుండేవారు. ఆ పనికిగాను, బలుతెదారీ (వస్తు మార్పిడి) విధానం కింద ఆ కుటుంబానికి ఏడాదికోసారి వ్యవసాయ ఉత్పత్తుల రూపంలో చెల్లింపులు జరిగేవి.
కానీ కుటుంబ పోషణకు అది సరిపోయేది కాదు. దాంతో మేకలను, కొన్నిగేదెలను పెంచారు గుణామాయ్; ఆ పాల నుండి వచ్చిన ఘీ (నెయ్యి)ని కూడా అమ్మారు. 1972లో వచ్చిన కరువు తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ పనులకు వెళ్తూనే, ప్రసవాలు చేసేవారు.
“పురుడు పోయడం చాలా క్లిష్టమైన పని. ఒకరి కాలికి గుచ్చుకున్న ముల్లు తీయడమే కష్టమనిపిస్తుంది. అలాంటిది ఇక్కడ, ఒక స్త్రీ గర్భం నుండి శిశువును బైటికి తీయాలి!” ఆమె చేసే పనిలో అంత కష్టం ఉన్నప్పటికీ, “ప్రజలు తమ ఇష్టానుసారం చెల్లించేవారు. కొందరు పిడికెడు ధాన్యం ఇచ్చారు; కొందరు పది రూపాయలు ఇచ్చారు. దూరపు ఊర్లనుంచి వచ్చేవారు ఓ వంద రూపాయలు ఇచ్చారేమో!”
పురుడు పోశాక, రాత్రంతా అక్కడే ఉండి, పొద్దున్నే ఆ బాలింతకు, బిడ్డకు స్నానం చేయించి, ఆ తర్వాత తన ఇంటికి బయలుదేరేవారు. “నేను ఎవరి ఇంట్లోనూ టీ తాగలేదు, ఏమీ తినలేదు. వాళ్ళిచ్చే పిడికెడు ధాన్యాన్ని నా చీర కొంగులో మూట కట్టుకొని ఇంటికి వెళ్ళేదాన్ని,” గుణామాయ్ గుర్తుచేసుకున్నారు.
ఎనిమిదేళ్ళ క్రితం, ఒక న్యాయవాది కుటుంబం తనకు పది రూపాయలు ఇచ్చిందని గుణామాయ్ గుర్తు చేసుకున్నారు. ఆమె రాత్రంతా కూర్చొని, ఆ ఇంటి కోడలి ప్రసవంలో సహాయం చేశారు. “ఉదయం ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. నేను నా ఇంటికి తిరిగివెళ్ళడానికి బయలుదేరినప్పుడు, ఆ బిడ్డతల్లి అత్తగారు నాకు పది రూపాయలు ఇచ్చారు. నేను వేసుకున్న గాజుల ధర రూ.200; ఈ పది రూపాయలతో ఎవరైనా బిచ్చగాడికి ఒక బిస్కెట్ల ప్యాకెట్ కొనివ్వమని చెప్పి ఆ డబ్బులు ఆవిడకి తిరిగిచ్చేశాను.”
గుర్తింపు లేకపోవడం, అతితక్కువ వేతనాలు ఉండడం వల్ల గుణామాయ్ పెద్ద కూతురు వందన దాయి అవ్వదలచుకోలేదు. “ఎవరూ డబ్బులు ఇవ్వరు; జనాలే కాదు, ప్రభుత్వం కూడా. విలువ లేనప్పుడు నేనెందుకు శ్రమించాలి? నేను నలుగురు పిల్లలను పోషించాలి కాబట్టి మంత్రసాని పని మానేసి కూలి పనికి వెళ్ళాను,” ప్రస్తుతం పుణేలో నివసిస్తున్న వందన చెప్పారు. ఆమె గుణామాయ్ దగ్గర దాయిగా శిక్షణ పొందారు. కానీ ఇప్పుడు, బాలింతలు, నవజాత శిశువులకు స్నానం చేయడంలో మాత్రమే సహాయం చేస్తున్నారు.
వందనకు, ఆమె ముగ్గురు చెల్లెళ్ళకు కలిపి మొత్తం 14 మంది పిల్లలు ఉన్నారు. ఒకరు తప్పితే, అందరూ గుణామాయ్ పురుడు పోస్తేనే జన్మించారు.గుణామాయ్ మూడో కూతురికి ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. “నా అల్లుడు స్కూల్ టీచర్‌గా పనిచేసేవాడు (ఇప్పుడు రిటైర్ అయ్యాడు). అతనికి (ఇంటి దగ్గర ప్రసవం, నా నైపుణ్యాలపై) విశ్వాసం లేదు,” అని ఆమె వివరించారు.
గత రెండు-మూడు దశాబ్దాలలో, ఎక్కువమంది మహిళలు సిజేరియన్ ప్రక్రియను ఎంచుకోవడం లేదా అలా ఎంచుకునేందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్న తీరు గుణామాయ్‌ని విస్మయానికి గురి చేసింది. మహారాష్ట్రలో ఇలాంటి ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది. NFHS-5 ప్రకారం, 2019-2021లో, 25 శాతం మంది గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది – ప్రసవానికి చేరిన మహిళల్లో 39 శాతం మందికి శస్త్రచికిత్స జరిగింది.
“చూడండి, గర్భం దాల్చడం, ప్రసవం అనేవి సహజ ప్రక్రియలు,” గుణామాయ్ తెలిపారు. కత్తిరించడం, కుట్టడం వంటివి అనవసరమైన విధానాలని ఆమె బలంగా నమ్ముతారు. “ముందు కోసి, తర్వాత కుట్లు వేస్తారు. ఇంత చేస్తే ఆ మహిళ లేచి కూర్చోగలదని మీరు అనుకుంటున్నారా? ప్రసవ సమయంలో స్త్రీ అవయవాలు చాలా సున్నితంగా, నాజూగ్గా ఉంటాయి.” మంత్రసానులలో ఉండే ఒక అభిప్రాయాన్ని ఆవిడ కూడా మళ్ళీ చెప్పారు: “ వార్ (గర్భస్థ మావి - placenta) బైటికి వచ్చే వరకూ బొడ్డు తాడును కత్తిరించకూడదు. ఎందుకంటే (మీరు అలా చేస్తే) ఆ మావి కాలేయానికి అంటుకుంటుంది.”
ఒక తల్లిగా, తన స్వానుభవాల నుండే ప్రసవం గురించి అన్ని విషయాలు నేర్చుకున్నానని ఆవిడ PARIతో అన్నారు. “నేను నా పిల్లల్ని కన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను. గర్భాశయ సంకోచాలు కలిగే సమయంలో, ఆమె (తల్లి) కడుపును గట్టిగా రుద్దుతూ, బిడ్డను బయటకు నెట్టండి.” ఆమె తన ప్రసవ వేదనలను గుర్తుచేసుకున్నారు: “నేను ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. మా అమ్మను కూడా బయటే ఉండమన్నాను. ప్రసవం అయ్యాకే పిలుస్తానన్నాను.”
గర్భంలోనే మరణించిన శిశువులను ప్రసవించడంలో గుణామాయ్ నైపుణ్యం ఎంతగానో పనికొచ్చింది. ప్రసవ వేదనలో ఉన్న ఒక యువతి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ, “బిడ్డ కడుపులోనే చనిపోయాడని గ్రహించాను. ఆ బిడ్డను బయటకు తీయడానికి తల్లికి సిజేరియన్ కోసం సోలాపూర్ తీసుకెళ్ళాలని సమీప ఆస్పత్రిలోని వైద్యుడు తెలిపారు. ఆ ఖర్చులు భరించే స్థితిలో వాళ్ళు లేరని నాకు తెలుసు. నాకు కొంత సమయం ఇవ్వమని అడిగి, ఆమె కడుపును రుద్దుతూ, నొక్కుతూ, ఆ బిడ్డని నేను బయటకు తీశాను,” గుణామాయ్ వివరించారు. “గర్భాశయ సంకోచాలు లేకపోతే పురుడు పోయడం చాలా కష్టం,” వందన తెలిపారు.
“గర్భసంచి కిందకి జారిన స్త్రీలకు నేను సహాయం చేసేదాన్ని; అది కూడా ప్రసవం తర్వాత అలా జరిగినప్పుడే. ఆ తర్వాత వాళ్ళు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి,” అన్నారు గుణామాయ్. ఏ విషయంలో ఎప్పుడు వెనక్కి తగ్గాలో, వైద్య నిపుణులను ఎప్పుడు సంప్రదించాలో ఆవిడకి తెలుసు.
దాయిల కు శిక్షణనివ్వడానికి 1977లో దేశవ్యాప్త శిక్షణా కార్యక్రమం ప్రారంభించబడింది. అదే సమయంలో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా తమ ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా దాయిల కు శిక్షణనివ్వడం ప్రారంభించాయి.
“నేను శిక్షణ కోసం సోలాపూర్ వెళ్ళాను కానీ ఎప్పుడనేది ఖచ్చింతంగా నాకు గుర్తు లేదు,” తన ఇంటి బయట ఉన్న చింత చెట్టు కింద కూర్చోవడానికి నెమ్మదిగా అడుగులు వేస్తూ చెప్పారు గుణామాయ్. “వారు మాకు శుభ్రత గురించి నేర్పించారు - శుభ్రమైన చేతులు, శుభ్రమైన బ్లేడ్, బొడ్డు తాడును కత్తిరించడానికి శుభ్రమైన ధాగా (దారం - thread). నేను ప్రతి ప్రసవానికీ కొత్త కిట్‌ని ఉపయోగించాను. కానీ వారు చెప్పినవన్నీ మేము పాటించలేదు,” అని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే వీటన్నింటినీ మించిన జ్ఞానం, నైపుణ్యం, అనుభవం ఆమె సొంతం.
2018లో, మూర్ఛ వచ్చి పడిపోయిన తర్వాత, గుణామాయ్ తన కూతుళ్ళతో కలిసి జీవించడం ప్రారంభించారు – తుల్జాపూర్ బ్లాక్‌లోని కసయీలో లేదా పుణే నగరంలో. కానీ ఆమె వాగ్దరీలోని తన ఇంటిలో ఉండడానికే ఇష్టపడేవారు. “ఇందిరాగాంధీ దేశ పగ్గాలు చేపట్టిన విధంగానే, నేను ప్రసవం చేసే పనిని చేపట్టాను!”
పోస్ట్ స్క్రిప్ట్: గత కొన్ని నెలలుగా గుణామాయ్ కాంబ్లే ఆరోగ్యం బాగోలేదు. ఈ ప్రత్యేక కథనం ప్రచురణ కోసం సిద్ధమవుతున్న సమయంలోనే ఆవిడ నవంబర్ 11, 2022న మరణించారు.
2010లో, తథాపి-WHO India ప్రచురణ అయిన “As We See Itలో ఈ కథనపు మునుపటి పాఠాంతరం ప్రచురితమైంది.
అనువాదం: వై క్రిష్ణ జ్యోతి