“నేను ఎలాగో సంవత్సరానికి ఒకసారి అలాంటి ఒక రోజు ఉండేలా చూసుకుంటాను”
స్వప్నాలి దత్తాత్రేయ జాదవ్ ఇక్కడ డిసెంబర్ 31, 2022 నాటి సంఘటనలను గురించి ప్రస్తావిస్తున్నారు. మరాఠీ చిత్రం వేద్ ఇప్పుడే విడుదలైంది. కొన్ని తెలిసిన ముఖాలు నటించిన రొమాంటిక్ చిత్రం అది. అయితే అది జాతీయ దృష్టిని చేరుకోలేదు. కానీ ఇళ్ళల్లో పనులు చేసే స్వప్నాలికి ఇది తన సెలవు రోజున చూసేందుకు ఎంపిక చేసుకున్న చిత్రం - సంవత్సరం మొత్తంలో చూసే రెండు సినిమాలలో ఇది ఒకటి మాత్రమే
"అది కొత్త సంవత్సరం, అందుకే. గోరేగాఁవ్‌లోగానీ మరెక్కడైనాగానీ మేం బయట భోజనం కూడా చేస్తాం," తాను బయటకు వెళ్ళి గడిపిన సమయాన్ని గురించి ప్రేమగా గుర్తుచేసుకుంది, 23 ఏళ్ళ ఆ అమ్మాయి.
సంవత్సరంలో మిగిలిన కాలమంతా స్వప్నాలికి రోజువారీ కష్టమైన పనితోనే సరిపోతుంది. ముంబైలోని ఆరు ఇళ్లలో పాత్రలు శుభ్రం చేయడం, బట్టలుతకడం, ఇతర ఇంటి పనులలో ఎక్కువ గంటలు గడిచిపోతాయి స్వప్నాలికి. కానీ ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళే ఆ 10 నుండి 15 నిమిషాల విరామంలో, ఆమె తన ఫోన్‌లో మరాఠీ పాటలు కూడా వింటుంది. "నేను వీటిని వింటూ కొంత సమయం గడపగలను," ఆ క్షణాలు తనకు ఇచ్చే ఆనందాన్ని తల్చుకుని నవ్వుతూ చెప్పిందామె
నీలమ్ దేవి సూచించినట్లుగా ఫోన్ అందుబాటులో ఉండటం వల్ల కొంత వెసులుబాటు లభిస్తుంది. 25 ఏళ్ళ ఈ యువతి, “వీలున్నప్పుడల్లా మొబైల్ (ఫోన్)లో భోజ్‌పురి, హిందీ సినిమాలను చూడటమంటే నాకు చాలా ఇష్టం,” అంటోంది. వలస వచ్చిన వ్యవసాయ కూలీ అయిన ఈమె బిహార్‌లోని మొహమ్మద్‌పూర్ బల్లియా గ్రామంనుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొకామా తాల్‌లో - పంట కోతల కాలమంతా- పని చేయడానికి వచ్చింది
ఆమె 15 మంది మహిళా కూలీలతో ఇక్కడికి వచ్చింది, వారు పొలాల నుండి కాయధాన్యాల పంటను కోసి, కట్టలుగా కట్టి, వాటిని నిల్వ చేసే ప్రాంతానికి తీసుకువెళ్తారు. వారు కోసి, కట్టలు కట్టి తీసుకువెళ్ళే ప్రతి 12 కట్టలకు ఒక కట్ట వస్తు రూపంలో సంపాదిస్తారు. పప్పులు వారి ఆహారంలో అత్యధిక ధర కలిగిన వస్తువులని సుహాగిని సోరెన్ చెప్పింది. "మేం దీనిని సంవత్సరం పొడవునా తినవచ్చు, మా దగ్గరి బంధువులకు కూడా పంపిణీ చేయవచ్చు." తమకు ఒక నెల వేతనంగా క్వింటాల్ పప్పులు లభిస్తాయని ఆమె చెప్పారు.
వారి భర్తలు ఉద్యోగాల కోసం మరింత దూరాలు వలసపోతారు, వారి పిల్లలు ఇంటి దగ్గర ఇతరుల సంరక్షణలో పెరుగుతారు; చాలా చిన్నపిల్లలు మాత్రం వారితో పాటు వస్తారు.
ఆమె గరుకుగా ఉన్న ఎండు వరి గడ్డిని తాడుగా పేనుతూ మాట్లాడుతోంది: తానిక్కడ ఇంటికి దూరంగా ఉండటంతో తన మొబైల్‌లో సినిమాలు చూడడం లేదని, ఎందుకంటే "మొబైల్‌ని చార్జ్ చేయడానికి ఇక్కడ విద్యుత్ లేదు" అని PARIకి చెప్పింది. నీలమ్‌కి సొంత ఫోన్ ఉంది. ఇది కొంత అరుదైన విషయమే. గ్రామీణ భారతదేశంలో 61 శాతం మంది పురుషులతో పోలిస్తే 31 శాతం మంది మహిళలకు మాత్రమే మొబైల్ ఫోన్‌లు ఉన్నాయని ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రచురించిన డిజిటల్ డివైడ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2022 పేర్కొంది.
అయితే నీలమ్ దీనికొక మార్గాన్ని కనుక్కొంది: ట్రాక్టర్లన్నిటినీ కూలీలు తాత్కాలిక నివాసాలుగా ఏర్పాటుచేసుకున్న గుడిసెలకు దగ్గరగా ఆరుబయట నిలిపి ఉంచుతుండటంతో, "ముఖ్యమైన కాల్స్ మాట్లాడుకోవడానికి మేం మా ఫోనులను ట్రాక్టర్లో చార్జ్ చేసుకొని ఆపైన ఫోన్‌ను దూరంగా ఉంచుతాం. సరైన విద్యుత్ సౌకర్యం ఉంటే మేం ఖచ్చితంగా సినిమాలు చూసేవాళ్లం,” అని ఆమె చెప్పింది
ఇక్కడ మొకామా తాల్‌లోని మహిళలు ఉదయం 6 గంటల నుండి పనిలో ఉన్నారు. చివరకు మధ్యాహ్నం సమయంలో ఎండవేడిమి పెరిగిపోవడంతో తమ పనిని ఆపేశారు. అది వారి ఇంటి వాడకం కోసం గొట్టపు బావి నుండి నీరు తెచ్చుకునే సమయం. ఆ తర్వాత, అనిత చెప్పినట్లుగా, "ప్రతి వ్యక్తి తన కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి."
ఝార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లా, నారాయణ్‌పుర్ గ్రామానికి చెందిన ఈ సంతాల్ ఆదివాసి, "నేను మధ్యాహ్నం నిద్రపోతాను. ఎందుకంటే వాతావరణం వేడిగా ఉంటుంది, ఆ వేడిలో మేం పని చేయలేం." అన్నది. ఈ రోజువారీ వ్యవసాయ కూలీ, మొకామా తాల్‌లో కాయధాన్యాలు, ఇతర పంటల కోతల కోసం ఝార్ఖండ్ నుండి బిహార్‌కు మార్చి నెలలో వలస వచ్చింది.
పొద్దు వాలిపోతున్న సమయంలో, సగం కోత కోసివున్న ఆ పొలంలో ఒక డజను మంది మహిళలు అలసిపోయిన తమ కాళ్ళను ముందుకు బారచాపి కూర్చొని ఉన్నారు.
అలిసిపోయివున్నా, ఆ మహిళా వ్యవసాయ కూలీల చేతులు ఖాళీగా ఏం లేవు. వారు పప్పులను వేరు చేయడం, వాటిని శుభ్రపరచడం లేదా, మరుసటి రోజున కట్టలు కట్టి తీసుకువెళ్ళడం కోసం వరి గడ్డితో తాళ్లను తయారుచేసే పనిలో మునిగివున్నారు. సమీపంలోనే వారు నివాసముండే ఇళ్ళున్నాయి. వాటి పైకప్పు పాలిథిన్ షీట్లతో కప్పివున్నాయి. ఆ గుడిసెలకు కాయ ధాన్యాల ఎండిన గడ్డితో మూడు అడుగుల ఎత్తున కట్టిన గోడలు ఉన్నాయి. సాయంత్రం భోజనాన్ని సిద్ధం చేయడం కోసం కాసేపట్లోనే వారి మట్టి చుల్హాలు (పొయ్యిలు) వెలుగుతాయి. అప్పుటి వారి ముచ్చట్లు మరుసటి రోజున కొనసాగుతాయి.
2019 నుండి ఎన్ఎస్ఒ (NSO) డేటా ప్రకారం, భారతదేశంలోని స్త్రీలు ప్రతిరోజూ సగటున 280 నిమిషాల సమయాన్ని ఎటువంటి చెల్లింపులు ఉండని ఇంటి సేవలపైనా, కుటుంబ సభ్యుల సంరక్షణ సేవలపైనా వెచ్చిస్తారు. అదే మగవారు వెచ్చించేది కేవలం 36 నిమిషాలు మాత్రమే.
*****
సంతాల్ ఆదివాసీ అమ్మాయిలైన ఆరతి సోరెన్, మంగళి ముర్ము కలిసి ఒక హద్దంటూ లేని సమయాన్ని ఆస్వాదించడానికి చాలా ఆశగా ఎదురుచూస్తుంటారు. పశ్చిమ బెంగాల్‌లోని పరుల్‌దంగా గ్రామానికి చెందిన ఈ పదిహేనేళ్ళ వయస్సున్న దాయాదులు(వీరిద్దరి తల్లులు అక్కాచెల్లెళ్ళు), భూమిలేని వ్యవసాయ కూలీల పిల్లలు. “నాకు ఇక్కడికి వచ్చి పక్షులను చూడటమంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు మేం పండ్లను తెంచుకుని తింటుంటాం,” అని ఆరతి చెప్పింది. వారిద్దరూ ఒక చెట్టు కింద కూర్చుని, సమీపంలోనే గడ్డి మేస్తోన్న తమ పశువులను కాస్తున్నారు.
“ఈ సమయంలో (పంట కోతల సమయం), పశువులు దుబ్బులను మేస్తాయి కాబట్టి మేం చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. చెట్టు కిందనో లేదా ఏదైనా నీడలోనో కూర్చోవడానికి మాకు సమయం దొరుకుతుంది,” అని ఆరతి చెప్పింది.
వారి తల్లులిద్దరూ అదే బీర్‌భూమ్ జిల్లాలో తమ గ్రామానికి పొరుగునే ఉన్న గ్రామంలోని బంధువు వద్దకు వెళ్లిన ఒక ఆదివారం నాడు, PARI ఈ పిల్లలను కలిసింది. “మామూలుగా మా అమ్మే పశువులను మేతకు తీసుకెళ్తుంది. కానీ ఆదివారాల్లో మాత్రం నేను తీసుకెళ్తాను. ఇక్కడికి వచ్చి మంగళితో కొంత సమయం గడపడమంటే నాకు చాలా ఇష్టం,” అంది ఆరతి తన దాయాదిని చూసి నవ్వుతూ, “ఆమె నా స్నేహితురాలు కూడా” ఆరతి చెప్పింది.
మంగళికి పశువులను మేపడానికి తీసుకెళ్ళడమనేది రోజువారీ పని. 5వ తరగతి వరకు చదివిన ఆమెను ఇంకా చదివించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో చదువు మానేయాల్సి వచ్చింది. "అప్పుడు లాక్‌డౌన్ వచ్చింది, నన్ను తిరిగి బడికి పంపడం వారికి కష్టమైంది," అని ఇంట్లో వంట పనులు కూడా చేసే మంగళి చెప్పింది. ఈ ఎండిపోయిన పీఠభూమి ప్రాంతంలో పశువుల పెంపకం మాత్రమే స్థిరమైన ఆదాయాన్నిస్తుంది కాబట్టి పశువులను మేపడంలో ఆమె పాత్ర కీలకమైనది.
గ్రామీణ భారతదేశంలో 61 శాతం మంది పురుషులతో పోలిస్తే 31 శాతం మంది మహిళలకు మాత్రమే మొబైల్ ఫోన్‌లు ఉన్నాయని ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రచురించిన డిజిటల్ డివైడ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2022 పేర్కొంది
“మా తల్లిదండ్రుల దగ్గర ఫీచర్ ఫోన్లు ఉన్నాయి. మేం కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ విషయాల గురించి (సొంత ఫోన్ ఉండటం) గురించి మాట్లాడుకుంటాం,” అని ఆరతి చెప్పింది. భారతదేశంలోని మొబైల్ చందాదారులలో దాదాపు 40 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు లేవని డిజిటల్ డివైడ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2022 పేర్కొంది. అందువల్ల ఈ పిల్లల అనుభవం అసాధారణమేమీ కాదు.
ఖాళీగా ఉండి కబుర్లు చెప్పుకునే సమయాలలో మొబైల్ ఫోన్ గురించి చాలా సంభాషణలలో వినిపిస్తుంది; కొన్నిసార్లు పనిలో ఉన్న సమయాల్లో కూడా. “మేం కూరగాయలను అమ్మడానికి పట్టణాలకు వెళ్ళినపుడు, వాటిని కొనమంటూ వీధుల్లో పిలుస్తూ తిరుగుతుంటాం కదా, ఆ సమయంలో వారు (పట్టణ మహిళలు) తమ ఫోన్‌లలో మునిగిపోయి కనీసం మాకు జవాబు చెప్పాలని కూడా అనుకోరు. ఇది చాలా బాధగా ఉంటుంది, నాకు కోపం కూడా వస్తుంది.” వ్యవసాయ కూలీ సునీతా పటేల్ కోపంగా అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గాఁవ్ జిల్లా, రాకా గ్రామంలోని ఒక వరి పొలంలో సునీత మధ్యాహ్న భోజనం తర్వాత తోటి మహిళా కూలీలతో కలిసి విశ్రాంతి తీసుకుంటోంది. వారిలో కొంతమంది కూర్చుని ఉన్నారు, మరికొందరు చిన్న కునుకు తీయడానికి కళ్ళు మూసుకున్నారు.
"మేం ఏడాది పొడవునా పొలంపని చేస్తాం. మాకు తీరిక అనేది దొరకదు," అని దుగ్డీ బాయి నేతామ్ అది చాలా మామూలు విషయమన్నట్టు చెప్పారు. వయసుమళ్ళిన ఆదివాసీ అయిన ఈమెకు వితంతు పింఛను వస్తుంది, కానీ ఇప్పటికీ రోజువారీ కూలీ పనులు చేయాల్సిన అవసరం ఉందామెకు. “ఇప్పుడు మేం వరి పొలంలో కలుపు మొక్కలను తొలగించే పనిలో మునిగి ఉన్నాం; మేం సంవత్సరం పొడవునా పని చేస్తూనేవుంటాం."
ఇంకా ఏవో గుర్తుచేసుకుంటూనే ఉన్న సునీత ఆమెతో ఏకీభవిస్తూ, “మాకు తీరిక దొరకడం లేదు! విశ్రాంతి అనేది పట్టణ స్త్రీల విలాసం." అన్నది. మంచి తిండి దొరకడమే మాకు విశ్రాంతి దొరికినట్టు లెక్క. "నా మనసు మంచి తిండి పదార్థాల చుట్టూ తిరుగుతుంటుంది. కానీ డబ్బు లేకపోవడం వల్ల అది ఎప్పటికీ సాధ్యం కాదు."
*****
యల్లుబాయి నందివాలే విరామం తీసుకుంటూ జైనాపూర్ గ్రామ సమీపంలోని కొల్హాపూర్-సాంగ్లీ హైవేపై నడుస్తోన్న ట్రాఫిక్‌ను చూస్తున్నారు. ఆమె దువ్వెనలు, జుట్టుకు పెట్టుకునే ఉపకరణాలు, ఆభరణాలు, అల్యూమినియం పాత్రలు వంటి వస్తువులను ఒక వెదురు బుట్టలోనూ, టార్పాలిన్ సంచిలోనూ తీసుకువెళ్ళి అమ్ముతూంటారు. వాటి బరువు సుమారు 6-7 కిలోలు ఉంటుంది.
వచ్చే ఏడాదికి ఆమెకు 70 ఏళ్లు నిండుతాయి. మహారాష్ట్రలోని ఈ కొల్హాపూర్ జిల్లాలో తాను నిలబడినా, నడుస్తున్నా మోకాళ్లు నొప్పులుపుడుతుంటాయని ఆమె చెప్పారు. అయితే ఆమె ఈ రెండు పనులూ చేయాలి, లేదా రోజువారీ ఆదాయాన్ని వదులుకోవాలి. “వంద రూపాయలు కూడా దొరకడం కష్టం; కొన్ని రోజులైతే అసలు ఏమీ రావు,” తన చేతులతో నొప్పిగా ఉన్న మోకాళ్ళను నొక్కుకుంటూ చెప్పారామె.
డెబ్బయ్యోవడిలో ఉన్న ఈ వృద్ధురాలు తన భర్త యల్లప్పతో కలిసి శిరోల్ తాలూకాలోని దనోలి గ్రామంలో నివసిస్తున్నారు. సొంత భూమి లేని వీరు సంచార నందివాలే సముదాయానికి చెందినవారు
"ఏదైనా ఆసక్తి, వినోదం, విశ్రాంతి... ఇవన్నీ (ఒకరికి) పెళ్లికి ముందు ఉండేవి," ఆమె తన యవ్వనంలోని సంతోషకరమైన సంగతులను గుర్తుచేసుకుని నవ్వుతూ చెప్పారు. “నేనెప్పుడూ ఇంట్లో ఉండేదాన్ని కాదు... పొలాల్లో... నదులవెంటా తిరిగేదాన్ని. పెళ్ళయ్యాక అదేమీ ఉండదు. వంటగది, పిల్లలు మాత్రమే.
దేశవ్యాప్తంగా, గ్రామీణప్రాంత మహిళలు తమ రోజులో దాదాపు 20 శాతం జీతం లేని ఇంటి పని, కుటుంబ సంరక్షణ కార్యకలాపాలలో గడుపుతున్నారని ఈ అంశంపై తొలిసారిగా జరిగిన ఒక సర్వే పేర్కొంది. ఈ నివేదికను టైమ్ యూజ్ ఇన్ ఇండియా -2019 పేరుతో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసింది.
గ్రామీణ భారతదేశంలోని చాలామంది మహిళలు కార్మికులుగా, తల్లులుగా, భార్యలుగా, కూతుళ్ళుగా, కోడళ్ళుగా తమ పాత్రలు నిర్వహిస్తూనే తమకున్న ఖాళీ సమయాన్ని - ఊరగాయలు పట్టడం, అప్పడాలు చేయటం, కుట్టడం వంటి ఇంటి పనులకు ఖర్చు చేస్తారు. “ఏదైనా చేతి కుట్టుపని చేయటం మాకు విశ్రాంతినిస్తుంది. మేం కొన్ని పాత చీరలను ఎంచుకుని, వాటిని కత్తిరించి కుట్టి, కుటుంబం కోసం కఠారి (మెత్తని బొంత) తయారుచేయడానికి మా సమయాన్ని ఉపయోగిస్తాం,” అని ఉత్తరప్రదేశ్‌లోని బైఠక్వా అనే కుగ్రామంలో నివసించే ఊర్మిళాదేవి చెప్పారు.
ఇతర మహిళలతో కలిసి వేసవిలో రోజువారీ ఈత కోసం గేదెలను తీసుకెళ్లడం, ఈ 50 ఏళ్ల అంగన్‌వాడీ వర్కర్‌కి జీవితంలోని ఆనందాలలో ఒకటి. "మా పిల్లలు బేలన్ నది నీటిలో ఆడుకోవడం, దూకడం వంటివి చేస్తున్నపుడు మాకు వార్తలను తెలుసుకోవడానికి సమయం లభిస్తుంది," అని ఆమె చెప్పారు. వేసవికాలంలో ఈ నది చిన్న ప్రవాహంగా ఉంటుందేతప్ప నదిగా కాదు కాబట్టి పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారని చెప్పారామె.
కోరోన్ జిల్లాలోని దేవ్‌ఘాట్ గ్రామంలో అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న ఊర్మిళ, గత వారం రోజులుగా కొత్తగా తల్లులైన యువతుల, వారి పిల్లల సంరక్షణలో నిమగ్నమై ఉన్నారు. ఇంకా వ్యాధి నిరోధక టీకాలు, ఇతర ప్రసవానికి ముందు, ప్రసవానంతర పరీక్షల సుదీర్ఘ జాబితాను నమోదు చేస్తున్నారు.
నలుగురు పెద్ద పిల్లలకు తల్లి, మూడేళ్ల కుంజ్ కుమార్‌కు నానమ్మ అయిన ఆమె 2000-2005 వరకు దేవ్‌ఘాట్ గ్రామ ప్రధాన్‌గా ఎన్నికయ్యారు. దళితులు ఎక్కువగా ఉండే ఈ కుగ్రామంలో చదువుకున్న కొద్దిమంది మహిళల్లో ఆమె కూడా ఉన్నారు. “నేను మామూలుగా చదువు మానేసి పెళ్లి చేసుకునే అమ్మాయిలను గుర్తు పెట్టుకుంటాను. కానీ వారు వినరు, వారి కుటుంబాలూ వినవు,” నిస్సహాయంగా భుజాలు ఎగరేస్తూ చెప్పారామె.
పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు వంటి సందర్భాలలో మహిళలకు తమకంటూ సొంతమని చెప్పుకోవడానికి కొంత సమయం ఉంటుంది. అప్పుడు "మేమంతా కలిసి పాడతాం, కలిసి నవ్వుతాం" అన్నారు ఊర్మిళ. పాటలు వైవాహిక కుటుంబ సంబంధాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి, చెడ్డవిగా కూడా ఉంటాయని ఆమె నవ్వుతూ చెప్పారు.
నిజానికి, పెళ్ళిళ్ళ సమయంలోనే కాదు, పండగలకు కూడా మహిళలకు, ముఖ్యంగా యువతులకు కొంత ఖాళీ సమయం దొరుకుతుంది.
జనవరిలో బీర్‌భూమ్‌లోని సంతాల్ ఆదివాసీలు జరుపుకునే బందన పండుగను తాము ఎక్కువగా ఇష్టపడతామని ఆరతి, మంగళి PARIకి చెప్పారు. “మేం మంచి దుస్తులు ధరించి, నృత్యం చేస్తాం, పాడతాం. మా అమ్మవాళ్ళు ఇంట్లోనే ఉండడం వలన మాకు ఎక్కువ పని ఉండదు, స్నేహితులతో కలిసి ఉండేందుకు సమయం దొరుకుతుంది. మమ్మల్ని ఎవరూ తిట్టరు, మాకు నచ్చినట్టే ఉంటాం," అని ఆరతి చెబుతోంది. ఈ పండుగ సమయంలో పశువులను పూజించడం వల్ల వాటిని వీరి తండ్రులు సంరక్షిస్తారు. "నాకేం పని ఉండదు," అని మంగళి నవ్వుతూ చెప్పింది.
తీర్థయాత్రలు కూడా విశ్రాంతి కిందకే వస్తున్నాయి. ధమ్‌తరీ నివాసి, 49 ఏళ్ల చిత్రరేఖ తన ఖాళీ సమయంలో తీర్థయాత్ర చేయాలని జాబితా రాసుకున్నారు: “నేను నా కుటుంబంతో పాటు రెండుమూడు రోజులపాటు సెహోర్ జిల్లాలోని (మధ్యప్రదేశ్‌లోని) శివాలయానికి వెళ్లాలనుకుంటున్నాను. ఏదో ఒక రోజున, సెలవు తీసుకొని వెళ్తాను."
ఛత్తీస్‌గఢ్ రాజధానిలో నాలుగు ఇళ్ళల్లో పనిచేసే ఈమె, ఆ ఇళ్ళల్లో పనిచేయడానికి వెళ్ళడానికి ముందు తన ఇంటి పనులు చేసుకోవడం కోసం ఉదయం 6 గంటలకల్లా నిద్ర లేస్తారు. తర్వాత పనికి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగి వస్తారు. ఇంటిపనులు చేసి ఆమె నెలకు సంపాదించే రూ. 7,500 ఆమె, ఆమె ఇద్దరు పిల్లలు, అత్తగారితో సహా ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి చాలా కీలకం.
*****
ఇళ్ళల్లో పనిచేసే స్వప్నాలికి (వేతనం ఇస్తూ) పని లేని రోజు చాలా అరుదు. “నాకు నెలకు రెండు సెలవులు మాత్రమే వస్తాయి; ప్రతి ఒక్కరికీ (ఆమె యజమానులు) వారి వారాంతాల్లో సెలవు ఉండడం వలన నేను శని, ఆదివారాల్లో కూడా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో నాకు విరామం లభించే ప్రశ్నే లేదు,” అని ఆమె వివరిస్తుంది. తన సొంతానికి కొంత సమయం ఉండాలనే అవసరాన్ని కూడా ఆమె లెక్కలోకి తీసుకోదు.
“నా భర్తకు ఆదివారం పని చేయవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు అతను నన్ను వెళ్ళి అర్థరాత్రి సినిమా చూడమని చెప్తాడు, కానీ నాకు ధైర్యం ఉండదు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నేను పనిలో ఉండాలి,” అని ఆమె జతచేశారు.
మహిళలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి వివిధ రకాల పనులు చేసే ఇళ్లలో, వారికి ఆనందం కలిగించే పనే వారికి విశ్రాంతిగా మారవచ్చు. “నేను ఇంటికి వెళ్ళాక ఇంటి పని పూర్తి చేస్తాను - వంట చేయడం, శుభ్రం చేయడం, పిల్లలకు ఆహారం ఇవ్వడం. ఆ తర్వాత నేను రవికె ముక్కలు, చున్నీలపై కాంతా ఎంబ్రాయిడరీ చేయడానికి కూర్చుంటాను,” అని రుమా లోహర్ (పేరు మార్చాం) చెప్పింది.
పశ్చిమ బెంగాల్, బీర్‌భూమ్ జిల్లాలోని ఆదిత్యపూర్ గ్రామానికి చెందిన ఈ 28 ఏళ్ళ యువతి మరో నలుగురు మహిళలతో కలిసి తమ పశువులు మేస్తున్న పచ్చికబయలు దగ్గర కూర్చునివుంది. 28 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఆ స్త్రీలందరూ భూమి లేనివారు, ఇతరుల పొలాల్లో పనులు చేసుకునేవారు. వారు పశ్చిమ బెంగాల్‌లో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేసివున్న లోహర్ సముదాయానికి చెందినవారు.
"మేం ఉదయాన్నే ఇంటి పనులన్నీ ముగించుకొని, మా ఆవులను మేకలను మేతకు తీసుకువస్తాం" అని ఆమె చెప్పింది.
"మాకోసం సొంత సమయాన్ని ఎలా కేటాయించుకోవాలో మాకు తెలుసు. కానీ అదెలాగో బయటకు చెప్పం," అంటుందామె.
"మీకు సమయం దొరికినపుడు ఏం చేస్తుంటారు?" మేం అడుగుతాం.
“ఎక్కువగా ఏమీ లేదు. ఒక చిన్న కునుకు తీయటమో, లేదంటే నాకు నచ్చిన మహిళలతో మాట్లాడటమో నాకిష్టం,” అని రూమా ఆ బృందంలోని ఇతర మహిళల వైపు అర్థవంతంగా చూస్తూ చెప్పింది. వారంతా పగలబడి నవ్వారు.
"మేం పని చేస్తామని ఎవరూ అనుకోరు! మాకు (మహిళలు) కేవలం సమయాన్ని ఎలా వృథా చేయాలో మాత్రమే తెలుసునని అందరూ అంటుంటారు."
రియా బెహల్ , సన్వితి అయ్యర్ , జాషువా బోధినేత్ర , విశాఖ జార్జ్ ల సంపాదకీయ సహకారంతో ; బినయ్ ఫెర్ భరూచా ఫొటో ఎడిటింగ్ సహకారంతో ; మహారాష్ట్ర నుంచి దేవేశ్ , జ్యోతి శినోలి ; ఛత్తీస్ గఢ్ నుంచి పురుసోత్తం ఠాకూర్ ; బిహార్ నుంచి ఉమేశ్ కుమార్ రే ; పశ్చిమ బెంగాల్ నుంచి స్మితా ఖటోర్ ; ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రీతి డేవిడ్ లు ఈ కథనాన్ని అందించారు .
ముఖ చిత్రం: స్మితా ఖటోర్
అనువాదం: సుధామయి సత్తెనపల్లి