ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
కష్టాలకు చిరునామా...
ఆమె వంట పని అప్పటికే పూర్తయింది. తమిళనాడుకు చెందిన ఈ మహిళ కుటుంబం బతుకుదెరువు కోసం తాటి బెల్లం (మొలాసిస్) తయారు చేసి అమ్ముతుంది. ఒక పెద్ద పాత్రలో ఉన్న ఆ పదార్థాన్నే ఆమె ఇక్కడ కలియబెడుతోంది. ఆమె నించి ఒక చిన్న పొరపాటు జరిగినా వాళ్ల కుటుంబానికి కొద్ది రోజుల పాటు ఆదాయం లేకుండా పోతుంది.
ఈ పనికి ఈమెకు చాలా సమయమే పడుతుంది. వంటపనికి మరి కొంత సమయం. ఈ పనులన్నీ ఒకదాని తర్వాత మరొకటి చేసేటప్పుడు ఈమె కొన్ని గంటల పాటు పొగను, వాసనల్నీ పీల్చుకోవాల్సి వస్తుంది. ఒక మహిళగా ఆమెకు కేటాయించిన ఇతర పనులకు ఇది అదనం అన్నమాట. ఈ పనుల్ని ఈమె పైన చాలా చిన్న వయసులోనే మోపారు కాబట్టి, లక్షలాది మంది ఇతర మహిళల్లాగే, ఈమె కూడా చిన్నప్పుడే బడి మానేయాల్సి వచ్చింది.
ఇంటితో ముడిపడి ఉండే పనులు చాలా ఉంటాయి. తలపైన గంపతో (కింద మధ్యలో) కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన ఈ యువతి ఇంకా వంటపని మొదలుపెట్టలేదు. పొలాల్లో కొన్ని గంటల పాటు తిరిగి అందుకు అవసరమైన వంటచెరకును సేకరించడంతో పాటు ఇతర పనులు పూర్తి చేసుకుంది. ఊళ్లో పొరుగింటి వాళ్లు అప్పటికే వంటపని మొదలుపెట్టారు. కాకపోతే, ఇంకాస్త పెద్దగా ఉండే స్థలంలో.
పొరుగింటామె కొంత వరకు అదృష్టవంతురాలే అని చెప్పాలి. చాలామంది మహిళలు గాలి ఆడని, ఇరుకైన స్థలాల్లో వంట చేస్తుంటారు. కిటికీలు ఉండవు. దాంతో మండుతున్న వంటచెరుకు నుంచి వెలువడే దట్టమైన పొగ వలన, ఫ్యాక్టరీల కాలుష్యంలో పని చేసే కార్మికులకంటే కూడా వీరికి ఎక్కువ ముప్పే చేస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌కు చెందిన ఈ మహిళ (పైన ఎడమ) దంపుడు పని చేస్తోంది. ఈ పనిలో మనకు కనిపిస్తున్నదానికంటే ఎక్కువ కష్టం, ఇబ్బందీ ఉంటాయి. ఆహారాన్ని సిద్ధం చేయడం కోసం ఈమె రోజూ కష్టపడి చేసే పనుల్లో ఇదొకటి. ఆహారాన్ని తయారుచేసే పని ప్రధానంగా మహిళలదే. ఇవన్నీ కాకుండా పిల్లల పెంపకంతోపాటు, పశువుల్ని కాయడం కూడా వీరి బాధ్యతే.
ఇంకా బట్టలు ఉతకడం, విసరడం, కూరగాయలు కోయడం, గిన్నెలు తోమడం, కుటుంబంలోని వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు సమయాల్లో భోజనం పెట్టడం లాంటివి కూడా మహిళల పనుల్లో భాగంగానే ఉంటాయి. జబ్బుపడ్డ కుటుంబ సభ్యుల బాగోగులు చూడడం కూడా ఎల్లప్పుడూ మహిళల బాధ్యతే. ఈ పనులన్నింటినీ ‘మహిళల పనులు’గానే చూస్తారు. దీనికి ఎలాంటి వేతనం ఉండదు. ఈ కోణంలో చూస్తే, గ్రామీణ ప్రాంత మహిళలది కూడా పట్టణ మహిళలకన్నా భిన్నమైన పరిస్థితేమీ కాదు. కానీ నీటి కోసం, వంటచెరకు కోసం చాలా దూరం వెళ్లాల్సి రావడం, అదనంగా పొలాల్లో చేయాల్సిన పనులు, గ్రామీణ మహిళలపై మరింత భారం మోపుతాయి.
ఝార్ఖండ్‌లోని పలామూలో గెట్టీ దుంపలు ఉడకబెడుతున్న ఆదివాసీ (పై మూడు చిత్రాల్లో కుడివైపు చివరన) పరిస్థితి కూడా దాదాపు ఇదే. కరవు కాలంలో వీటిని తవ్వుకొని రావడం సులువైన పనేం కాదు. దాదాపు ఉదయం పూటంతా ఈమె అడవిలో ఇదే పని చేస్తూ ఉండిపోయింది. అప్పటికే నీళ్లు తేవడం కోసం ఈమె చాలానే సమయాన్ని వెచ్చించింది. బహుశా మరోసారి కూడా నీళ్లకు వెళ్లాల్సి రావచ్చు. ఈ పనులన్నీ చేయడం కోసం ఈమె తమ గ్రామం చుట్టూ విస్తరించిన బాలూమఠ్ అడవి గుండా అనేక బాటలు దాటుకుంటూ వెళ్లాలి. వన్యమృగాల ముప్పు ఎప్పుడూ ఉండనే ఉంటుంది.
అందరికన్నా చివరగా తినేది , అందరికన్నా తక్కువ తినేది మహిళలే. వీరు చాలా తక్కువ విశ్రాంతి తీసుకుంటారు. శక్తినంతా హరించివేసే రోజువారీ పనుల వల్ల వీళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి