ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడం
తమిళనాడులోని పుదుక్కోట్టైలో ‘సైక్లింగ్ ట్రెయినింగ్ క్యాంప్’ జరుగుతోంది. సైక్లింగ్ నేర్చుకోవడం కోసం ఆమె తనకున్న చీరల్లో అన్నింటికన్నా మంచిది కట్టుకొని వచ్చింది. మంచిపని చేస్తున్నందుకు ఆమె చాలా ఉల్లాసంగా ఉంది. ఈ జిల్లాలో ఒకప్పుడు క్వారీల్లో వెట్టిచాకిరీ చేసిన దాదాపు 4 వేల మంది పేద మహిళలు ప్రస్తుతం ఆ క్వారీల నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ముందుకు వచ్చారు. వాళ్ల సంఘటిత పోరాటం, రాజకీయ చైతన్యంతో కూడిన అక్షరాస్యతా ఉద్యమం, పుదుక్కోట్టైని ఒక మెరుగైన ప్రదేశంగా మార్చింది.
వనరుల యాజమాన్యం, నియంత్రణ అనేవి ఎప్పుడూ కీలకమైనవిగానే ఉంటాయి. కోట్లాది మంది గ్రామీణ మహిళల జీవితాలు బాగుపడాలంటే, ఈ హక్కులు కూడా మెరుగవ్వాలి.
మధ్యప్రదేశ్, ఝాబువా జిల్లాకు చెందిన ఈ బృందంలో కనిపిస్తున్నవారంతా పంచాయతీ సభ్యులు. అయితే ఈ పంచాయితీలో సభ్యులందరూ మహిళలే. స్థానిక పాలనను చేతుల్లోకి తీసుకోవడం ద్వారా వీరి హాదా, ఆత్మగౌరవం మరింత పెరిగాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ వీరి సొంత గ్రామాల్లో వీళ్ల ప్రభావం మాత్రం అంతంత మాత్రమే. వారి యాజమాన్యంలో, నియంత్రణలో ఉండేవి చాలా తక్కువ. ఉదాహరణకు, భూమిపై వారికి హక్కులు లేవు. చట్టం గుర్తించినా సరే, అత్యధిక రంగాల్లో వారి హక్కులకు అసలు ఎలాంటి గుర్తింపూ లేదు. ఒక దళిత మహిళా సర్పంచ్‌కు, స్వయంగా వాళ్ల భూస్వామే ఉపసర్పంచ్‌గా ఉంటే ఏమవుతుం ది? ఆమె సీనియారిటీని ఒప్పుకొని అతడు ఆమె మాట వింటాడా? లేదా కూలీలపై పెత్తనం చేసే భూస్వామి లాగానే అతడు వ్యవహరిస్తాడా? లేదా మహిళపై పెత్తనం చేసే పురుషుడిలా వ్యవహరిస్తాడా?
మహిళా సర్పంచ్‌ల పైన, పంచాయతీ సభ్యులపైన లెక్కలేనన్ని అమానుషాలు జరిగాయి. వివస్త్రల్ని చేసి కొట్టడం, అత్యాచారాలు, అపహరణలు, తప్పుడు కేసుల్లో ఇరికించడం... ఇలా ఎన్నెన్నో. అయినప్పటికీ పంచాయతీల్లో మహిళలు అద్భుతమైన విజయాలు సాధించారు. మరి ఇక భూస్వామ్యవిధానం రద్దయిపోతే వారింకా ఏమేం సాధించగలరో ?
పుదుక్కోట్టైలో చదువుకున్న వర్గం ఎన్నో మార్పుల క్రమంలో ముందుకు వచ్చింది. కొన్ని విప్లవాత్మక పరిణామాల వలన, ఒకప్పుడు తాము వెట్టిచాకిరీ చేసిన క్వారీల్లోనే వారు యజమానులుగా మారారు. వారి నియంత్రణ పై దాడి జరిగినప్పటికీ, వారు తమ హక్కుల కోసం పోరాడడాన్ని నేర్చుకున్నారు.
కోట్లాది ఇతర గ్రామీణ పేదల్లాగే, మహిళలకు కూడా భూసంస్కరణలు అవసరం. అందులో భాగంగా, వారు తమ భూమిపై, నీటిపై, అడవిపై హక్కులను గుర్తించి, అమలు చేయాలని కోరుకుంటున్నారు. పునఃపంపిణీ జరిగిన ఏ భూమిపైనైనా ఉమ్మడి భూయాజమాన్య పత్రాలు (పట్టాలు) కావాలని వారు కోరుకుంటున్నారు. అన్ని రకాల భూములపైన సమాన హక్కులు కావాలంటున్నారు. గ్రామ ఉమ్మడి భూములపై పేదలకు హక్కులు ఉండాలని, ఉమ్మడి భూముల అమ్మకాన్ని ఆపెయ్యాలని కోరుకుంటున్నారు.
ఈ హక్కులు చట్టాల్లో భాగంగా లేవు కాబట్టి కొత్త చట్టాలు తీసుకురావడం అవసరం. అలానే చట్టాలు ఉన్న చోట్ల వాటి అమలుపరచడం చాలా ముఖ్యం. వనరుల పునఃపంపిణీ వంటి విప్లవాత్మక సంస్కరణలతో పాటు చాలా వాటిని పునర్నిర్వచించాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకు ‘నైపుణ్యం కల’, ‘నైపుణ్యం లేని’, ‘భారీ’, ‘తేలిక’ వంటి పదాలను పునర్నివచించాలి. కనీస వేతనాలను నిర్ణయించే కమిటీల్లో మహిళా వ్యవసాయ కూలీలు కూడా సభ్యులుగా ఉండాలి.
ఇవి జరగాలంటే కావలసినదిప్రజా ఉద్యమాలు. సంఘటిత ప్రజా కార్యాచరణ. రాజకీయ ప్రక్రియలో జోక్యం. మెరుగైన జీవితం కోసం నిరుపేద భారత ప్రజలు చేపట్టే పోరాటాల్లో గ్రామీణ మహిళల సమస్యలను కూడా ఓ ముఖ్యమైన భాగంగా గుర్తించాలి.
ప్రజల హక్కులను పటిష్టం చేయడానికి ‘మంచి చేసే’ అభివృద్ధి అనేది ప్రత్యామ్నాయం కాదు. ఇతర నిరుపేదలందరి లాగే, గ్రామీణ మహిళలకు కూడా ఎవరి దానధర్మాలూ అక్కర్లేదు. వాళ్ల హక్కులను అమలు చేయాలి, అంతే. ఇప్పుడు వారిలో కోట్లాది మంది పోరాడుతున్నది దాని కోసమే.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి