కొంతకాలం క్రితం, మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా, హాత్‌కణంగలే తాలూకా లోని ఖోచి అనే గ్రామానికి చెందిన రైతులు ఒక ఎకరం పొలంలో అత్యధికంగా చెరకును ఎవరు పండిస్తారనే దానిపై ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఈ ఆచారం దాదాపు ఆరు దశాబ్దాల నాటిదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికీ మంచి ప్రతిఫలాన్ని అందించే ఆరోగ్యకరమైన పోటీ. కొంతమంది రైతులైతే ఎకరాకు 80,000-100,000 కిలోల వరకు పండించారు. ఇది సాధారణంగా పండించే పంట కంటే దాదాపు 1.5 రెట్లు ఎక్కువ.
ఆగస్ట్ 2019లో వచ్చిన వరదల కారణంగా గ్రామంలోని అనేక ప్రాంతాలు దాదాపు 10 రోజుల పాటు నీటిలో మునిగిపోయి, పండిన చెరకు పంటలో ఎక్కువ భాగం దెబ్బతినడంతో ఆ ఆచారం అనుకోకుండా అర్ధాంతరంగా ముగిసిపోయింది. రెండు సంవత్సరాల తరువాత, జూలై 2021లో భారీ వర్షాలూ వరదలూ మరోసారి ఖోచి గ్రామాన్ని చొట్టుముట్టి చెరకు, సోయాబీన్ పంటలకు భారీగా నష్టం కలిగించాయి.
“ఇప్పుడు రైతులు పోటీపడటంలేదు; అందుకు బదులుగా వారు, తమ చెరకు పంటలో కనీసం సగమైనా మిగలాలని ప్రార్థిస్తున్నారు" ఖోచి గ్రామ నివాసి, కౌలు రైతు కూడా అయిన గీతా పాటిల్ (42) అన్నారు. ఒకప్పుడు చెరకు ఉత్పత్తిని పెంచడానికి అన్ని రకాల మెళకువలు నేర్చుకున్నానని నమ్మిన గీత, ఈ రెండు వరదల్లో 8 లక్షల కిలోలకు పైగా చెరకు పంటను కోల్పోయారు. "ఎక్కడో ఏదో తప్పు జరిగింది," అంటారామె. ఆమె వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోలేదు.
"(2019లో వచ్చిన వరదల నుండి) వర్షపాతం నమూనా పూర్తిగా మారిపోయింది" అన్నారామె. 2019 వరకు ఆమె పనులు ఒక నియమిత పద్ధతిలో ఉండేవి. చెరకు పంట కోత అయిన తర్వాత, సాధారణంగా అక్టోబరు-నవంబర్ నెలలలో, ఆమె వేరే రకాల పంటలను పండించేవారు: సోయాబీన్, భుయీమూ గ్ (వేరుశెనగ), వివిధ రకాల ధాన్యాలైన హలు (హైబ్రిడ్ జొన్న) లేదా బజ్రా (సజ్జలు) వంటి భూపోషకాలను నిలిచివుండేలా చేసే పంటలు. ఆమె జీవితానికీ పనికీ ఒక స్థిరమైన, సుపరిచితమైన లయ ఉండేది. ఇప్పుడిక అది లేదు.
“ఈ సంవత్సరం (2022) రుతుపవనాలు ఒక నెల ఆలస్యంగా వచ్చాయి. కానీ వానలు మొదలయ్యాక పొలాలన్నీ ఒక్క నెలలోనే ముంపునకు గురయ్యాయి." ఆగస్ట్‌లో కురిసిన భారీ వర్షాలకు దాదాపు మొత్తం పొలాలన్నీ రెండు వారాల పాటు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. అప్పుడప్పుడే చెరకు సాగు మొదలుపెట్టిన రైతులు, ఈ అదనపు నీటి వల్ల మొక్కలు గిడసబారిపోవటంతో అపారంగా నష్టపోయామని చెప్పారు. నీటిమట్టం మరింత పెరిగితే ప్రజలు ఇళ్లను ఖాళీ చేసిపోవాలని పంచాయతీ హెచ్చరికలు కూడా జారీచేసింది.
అదృష్టవశాత్తూ, గీత ఒక ఎకరంలో సాగు చేసిన వరిపంట వరద ముంపు నుండి తప్పించుకుంది. అక్టోబర్‌లో మంచి పంట పండి, కొంత ఆదాయం వస్తుందని ఆమె ఆశించారు కానీ, అక్టోబర్‌లో అనూహ్యంగా మళ్ళీ వర్షాలు కురిశాయి (ఈ ప్రాంతంలోని ప్రజలు దీనిని ' ఢగ్‌ఫుటి ' లేదా క్లౌడ్‌బరస్ట్‌గా అభివర్ణించారు). టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, కొల్హాపూర్ జిల్లాలోని 78 గ్రామాలలో దాదాపు వెయ్యి హెక్టార్ల వ్యవసాయ భూమి ఈ వర్షాలకు నాశనమయింది.
"మేం దాదాపు సగం బియ్యం నష్టపోయాం. భారీ వర్షాన్ని తట్టుకున్న చెరకు కూడా తక్కువ దిగుబడినే ఇస్తుంది," అన్నారు గీత. ఆమె కష్టాలు అంతటితో ఆగలేదు. "కౌలు రైతులుగా మేం ఉత్పత్తిలో 80 శాతాన్ని భూమి యజమానికి ఇవ్వాలి" అని ఆమె ఎత్తిచూపారు.
గీత, ఆమె కుటుంబం కలిసి మొత్తం నాలుగెకరాల పొలంలో చెరకు సాగు చేస్తున్నారు. మామూలు పరిస్థితుల్లో, చెరకు ఉత్పత్తి కనీసం 320 టన్నులు ఉంటుంది. ఇందులో వారు కేవలం 64 టన్నులు మాత్రమే ఉంచుకోగలరు. మిగిలిన పంట భూమి యజమానికి వెళ్ళిపోతుంది. 64 టన్నులు అంటే దాదాపు రూ. 179,200. కుటుంబంలోని కనీసం నలుగురు సభ్యులు 15 నెలల పాటు కష్టపడితే వారికి దక్కేదిఅంతమాత్రమే. కానీ, కేవలం ఉత్పత్తి ఖర్చు మాత్రమే భరించే భూ యజమానికి ఏకంగా రూ. 716,800 వెళ్తాయి.
2019, 2021లో వచ్చిన వరదల్లో మొత్తం చెరకు పంటను నష్టపోవటంతో గీత కుటుంబానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. చెరకు సాగు చేసినప్పటికీ, చివరకు కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేకపోయారు.
చెరకుపై వచ్చిన నష్టాలకు తోడు, ఆగస్టు 2019లో వచ్చిన వరదలలో వారి ఇల్లు పాక్షికంగా కూలిపోవడంతో వారు మరింత భారీ దెబ్బకు గురయ్యారు. "ఇంటిని మరమ్మత్తు చేయడానికి మాకు దాదాపు 25,000 రూపాయలు ఖర్చయింది," అని గీత భర్త తానాజీ అంటున్నారు. ప్రభుత్వం "కేవలం 6,000 రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చింది." వరదల తర్వాత తానాజీకి రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది
2021లో వచ్చిన వరదలకు మళ్లీ వారి ఇల్లు దెబ్బతినడంతో, ఎనిమిది రోజుల పాటు వేరే గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. ఈసారి ఆ ఇంటిని బాగుచేసుకునే స్తోమత కూడా ఆ కుటుంబానికి లేదు. “ఈనాటికి కూడా గోడలను ముట్టుకుంటే, అవి తేమగా తగులుతాయి” అని గీత చెప్పారు.
తగిలిన దెబ్బ ఇప్పటిక్కూడా తాజాగానే ఉంది. "వర్షం వచ్చి పైకప్పు నుంచి నీరు కురిసినప్పుడల్లా, ప్రతి వాన చుక్క నాకు వరదను గుర్తు చేస్తుంది" అని గీత చెప్పారు. "అక్టోబర్ (2022) రెండవ వారంలో భారీ వర్షాలు పడినప్పుడు, ఒక వారం పాటు నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను."
2021లో వచ్చిన వరదల్లో ఈ కుటుంబం రూ.160,000 ఖరీదు చేసే రెండు మెహసాణా గేదెలను కూడా కోల్పోయింది. "అవి పోవడంతో పాలు అమ్మడం ద్వారా వచ్చే మా రోజువారీ ఆదాయం కూడా పోయింది," అని ఆమె చెప్పారు. ఇప్పుడా కుటుంబం మరో కొత్త గేదెను రూ. 80,000కు కొన్నారు. "చేయడానికి పొలాల్లో తగినంత పని లభించనప్పుడు (వరదలు, నీట మునిగిన పొలాలలోకి వెళ్ళలేకపోవటం కారణంగా) పశువుల పాలు మాత్రమే ఆదాయ వనరుగా మిగులుతాయి," అని స్తోమత లేకపోయినా ఒక గేదెను కొనుగోలు చేయడానికి గల కారణాన్ని ఆమె వివరించారు. ఇంటి అవసరాలు తీర్చుకోవడం కోసం ఆమె వ్యవసాయ కూలీగా కూడా పనిచేస్తుంటారు కానీ చేయడానికి పెద్దగా పనులేమీ ఉండటంలేదు.
గీత, తానాజీలు స్వయం సహాయక సంఘాల వద్ద, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులతో సహా వివిధ మార్గాలలో దాదాపు 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. తమ పంటలు మరోసారి వరద ముప్పును ఎదుర్కొంటున్నందున, వారిప్పుడు సకాలంలో అప్పులు చెల్లించలేమేమోనని భయపడుతున్నారు, ఆ అప్పులపై వడ్డీల భారం కూడా మరింత పెరుగుతూ ఉంది.
వర్షపాతం, పంట, ఆదాయం - ఇవేవీ నిలకడగా లేకపోవడం గీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
"జూలై 2021లో వచ్చిన వరదల తర్వాత నాకు కండరాల బలహీనత, కీళ్ళు పట్టుకుపోవడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటివి మొదలయ్యాయి," అని ఆమె చెప్పారు. కాలక్రమేణా అవే తగ్గిపోతాయని ఆశించిన ఆమె నాలుగు నెలల పాటు ఆ లక్షణాలను పట్టించుకోలేదు.
"ఒకరోజు, అది మరీ భరించరానిదిగా ఉండటంతో నేను వైద్యుడిని సంప్రదించాల్సివచ్చింది," అని ఆమె అన్నారు. గీతకు హైపర్ థైరాయిడిజం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమెకు ఉన్న మానసిక ఒత్తిడి ఆమె పరిస్థితిని మరింత వేగంగా దిగజార్చుతుందని డాక్టర్ చెప్పారు. ఏడాది కాలంగా గీత తన మందులపై నెలకు రూ. 1,500 వెచ్చిస్తున్నారు. ఈ చికిత్స మరో 15 నెలల పాటు కొనసాగవచ్చునని తెలుస్తోంది.
కొల్హాపూర్‌లోని వరద ప్రభావిత చిఖలీ గ్రామంలో సాముదాయిక ఆరోగ్య పరిరక్షణా అధికారి డాక్టర్ మాధురీ పన్హాళ్కర్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో వరదల వల్ల కలుగుతున్న దుఃఖం గురించీ, పెరిగిపోతున్న ఆర్థిక, మానసిక ఒత్తిడులను తట్టుకోలేకపోవటం గురించీ మాట్లాడే ప్రజల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. కరవీర్ తాలూకా లోని ఈ గ్రామం, నీటి మట్టం పెరిగినప్పుడల్లా మునిగిపోయే మొదటి గ్రామాలలో ఒకటి.
రాష్ట్రంలో 2019లో వరదలు వచ్చిన నాలుగు నెలల తర్వాత కేరళలోని ఐదు వరద ప్రభావిత జిల్లాల్లోని 374 కుటుంబాల పెద్దలతో ఒక పరిశోధనను చేపట్టారు. వీరిలో ఒక్క వరదను ఎదుర్కొన్నవారి కంటే రెండు వరదలను ఎదుర్కొన్నవారు చాలా ఎక్కువ స్థాయి నిస్సహాయతను ప్రదర్శించటం కనిపించింది. (గతంలో ఇదే విధమైన సంక్షోభాన్ని అనుభవించి ఉన్నందున, ప్రతికూల పరిస్థితిని మొండిగా స్వీకరించే పరిస్థితి)
"ప్రకృతి వైపరీత్యాల బాధితులలో ప్రతికూల మానసిక పరిణామాలను నివారించేందుకు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి" అని ఆ పరిశోధక పత్రం ముగింపు మాటలు పలికింది.
కొల్హాపూర్ గ్రామాలలో - వాస్తవానికి గ్రామీణ భారతదేశంలో నివసించే 833 మిలియన్ల (జనాభా గణన 2011 ప్రకారం) మంది - మానసిక ఆరోగ్య సంరక్షణను పొందడమనేది అంత సులభమేమీ కాదు. “మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను మేం జిల్లా ఆసుపత్రికి పంపించాల్సివుంటుంది. అయితే, అందరికీ అంత దూరం ప్రయాణించే స్తోమత ఉండదు” అని డాక్టర్ పన్హాళ్కర్ చెప్పారు.
గ్రామీణ భారతదేశంలో కేవలం 764 జిల్లా ఆసుపత్రులు, 1,224 ఉప-జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి (గ్రామీణ ఆరోగ్య గణాంకాలు, 2020-21). ఇక్కడ మానసిక వైద్యులు, క్లినికల్ సైకాలజిస్టులు పనిచేస్తున్నారు. "మాకు ఉప కేంద్రాలలో కాకపోయినా కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనైనా మానసిక ఆరోగ్య సంరక్షణా నిపుణులు అవసరం," అని డాక్టర్ పన్హాళ్కర్ అంటారు. 2017లో ప్రచురితమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రతి లక్ష మంది వ్యక్తులకు ఒకరి కంటే తక్కువ (0.07) మంది మానసిక వైద్యులున్నారు.
*****
శివబాయి కాంబ్లే (62) అర్జున్‌వాడ్‌లో తన హాస్య చతురతకు పేరుమోశారు. కొల్హాపూర్‌లోని ఈ గ్రామంలో పనిచేసే గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) శుభాంగి కాంబ్లే మాట్లాడుతూ, “ఆమె మాత్రమే జీ హసత్ ఖేళత్ కామ్ కర్తే (ఎల్లప్పుడూ ముఖంపై చిరునవ్వుతో పని చేసే) వ్యవసాయ కూలీ" అన్నారు.
అయినప్పటికీ, 2019 వరదలు వచ్చిన మూడు నెలల్లోనే శివబాయికి రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది. "ప్రత్యేకించి ఆమె ఎప్పుడూ ఒత్తిడికి గురికాని వ్యక్తిగా అందరికీ తెలుసు కాబట్టి, గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు," అని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే భాగ్యశాలికి రక్తపోటు రావడానికి దారితీసిన పరిస్థితి ఏమిటనేది తెలుసుకునే బాధ్యతను తీసుకున్న శుభాంగి అన్నారు. ఆ విధంగా 2020 ప్రారంభం నుంచి శుభాంగి, శివబాయితో విపులమైన సంభాషణలను ప్రారంభించారు.
“మొదట్లో ఆమె తన సమస్యలను పంచుకునేవారు కాదు; ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు,” అని శుభాంగి గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ, శివబాయి ఆరోగ్యం క్షీణించడం, కళ్లు తిరగడం, జ్వరం రావడం- ఇదంతా ఆమె పరిస్థితి బాగాలేదని సూచించింది. నెలల తరబడి ఆమెతో మాట్లాడిన తర్వాత, శివబాయి పరిస్థితికి పదే పదే వస్తున్న వరదలే కారణమని ఈ ఆశా కనుగొన్నారు.
2019లో వచ్చిన వరదలు శివబాయి కచ్చా ఇంటిని ధ్వంసం చేశాయి. ఆమె ఇల్లు పాక్షికంగా ఇటుకలతోనూ, ఎక్కువగా ఎండిన చెరకు ఆకులు, జొవర్ (జొన్న) దంట్లు, గడ్డితో నిర్మించినది. ఆ తర్వాత ఆమె కుటుంబం ఒక తగరపు గుడిసెను నిర్మించడానికి దాదాపు రూ. 100,000 ఖర్చుపెట్టారు. ఈ తగరపు గుడిసె మరొక వరదను తట్టుకుని నిలబడుతుందని వారు ఆశించారు.
విషయాలను మరింత దిగజార్చడానికన్నట్టు, పని దొరికే రోజుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వల్ల కుటుంబ ఆదాయం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. సెప్టెంబరు మధ్య నుండి దాదాపు 2022 అక్టోబర్ చివరి వరకు పొలాలు నీటమునిగి, అడుగుపెట్టడానికి వీలు లేకుండాపోవటంతో శివబాయికి పని దొరకలేదు; అంతేకాకుండా, పంటలు దెబ్బతిన్నందున, రైతులు కూలీలను పనిలోకి తీసుకోలేని పరిస్థితిలో పడ్డారు.
"చివరిగా, దీపావళికి ముందు (అక్టోబర్ చివరి వారం) మూడు రోజులపాటు పొలంపని చేశాను కాని, తిరిగి వర్షాలు మొదలవడంతో ఆ పని కూడా పోయింది" అని ఆమె చెప్పారు.
ఆమె ఆదాయం తగ్గిపోతుండటంతో, శివబాయి తన చికిత్సను కొనసాగించలేకపోయారు. "నా దగ్గర తగినంత డబ్బు లేకపోవడంతో చాలాసార్లు మందులు వాడటం మానేయాల్సివచ్చింది" అని ఆమె అన్నారు.
అర్జున్‌వాడ్ సాముదాయక ఆరోగ్యాధికారి (సిఎచ్ఒ) డాక్టర్ ఏంజెలీనా బేకర్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలలో అధిక రక్తపోటు, మధుమేహం వంటి నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సిడిలు)తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందనీ, ఒక్క 2022లోనే అర్జున్‌వాడ్ గ్రామ ప్రజలైన 5,641 (జనగణన 2011 ప్రకారం) మందిలో 225 కంటే ఎక్కువ మధుమేహం, రక్తపోటు కేసులు నమోదయ్యాయనీ అన్నారు.
"అసలు సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది, కానీ చాలామంది పరీక్ష చేయించుకోవడానికి ముందుకు రారు" అని ఆమె చెప్పారు. తరచుగా వరదలు రావడం, పడిపోతున్న ఆదాయాలు, పోషకాహార లోపం వల్ల కలిగే ఒత్తిడి వల్ల ఎన్‌సిడిలు పెరిగిపోతున్నాయని ఆమె ఆరోపించారు. (ఇది కూడా చదవండి: అనూహ్యమైన వాతావరణ మార్పుల వలన మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్న కొల్హాపూర్ ఆశాల విషాద గాథ )
“వరద ప్రభావిత ప్రాంతాలలోని పెద్ద వయసు గ్రామస్తులు అనేకమందికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి; ఇటువంటి కేసులు వేగంగా పెరుగుతున్నాయి,” అని డాక్టర్ బేకర్ చెప్పారు. నిద్రలేమి కేసులు కూడా పెరుగుతున్నాయని ఆమె అన్నారు.
అర్జున్‌వాడ్‌కు చెందిన జర్నలిస్ట్, పిఎచ్‌డి స్కాలర్ చైతన్య కాంబ్లే మాట్లాడుతూ, “తప్పుగా రూపొందించిన విధానాల వల్ల వరదల వలన జరిగిన నష్టంలో అధిక భారాన్ని వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు మోస్తున్నారు. ఒక కౌలు రైతు తాను పండించిన పంటలో 75-80 శాతం పంటను భూమి యజమానికి చెల్లిస్తాడు. వరదల్లో పంటంతా తుడిచిపెట్టుకుపోయినప్పుడు, నష్టపరిహారం మాత్రం యజమానికి అందుతుంది!" అన్నారు. ఈయన తల్లిదండ్రులు కౌలు రైతులుగానూ, వ్యవసాయ కూలీలుగానూ పనిచేస్తున్నారు.
అర్జున్‌వాడ్‌లోని దాదాపు రైతులందరూ వరదల్లో తమ పంటలను నష్టపోయారు. “మరో మంచి పంట చేతికి వచ్చే వరకు (వరదల్లో) పంటను కోల్పోయిన దుఃఖం తొలగిపోదు. కానీ వరదలు మా పంటలను నాశనంచేస్తూనే ఉన్నాయి” అని చైతన్య చెప్పారు. "అప్పులను తిరిగి చెల్లించలేమోననే ఆందోళన వల్ల ఈ ఒత్తిడి మరింత పెరుగుతుంది."
మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 2022 జూలై, అక్టోబర్ నెలల మధ్య ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రంలోని 24.68 లక్షల హెక్టార్ల భూమిని ప్రభావితం చేశాయి. కేవలం అక్టోబర్ నెలలోనే 22 జిల్లాల్లోని 7.5 లక్షల హెక్టార్ల భూమి ప్రభావితమైంది. అక్టోబర్ 28, 2022 వరకు రాష్ట్రంలో 1,288 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సగటు వర్షపాతంలో 120.5 శాతం. జూన్ నుండి అక్టోబర్ మధ్య 1,068 మి.మీ. వర్షం కురిసింది. (ఇది కూడా చదవండి: విషాదాన్ని వర్షిస్తోన్న వానలు )
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ నివేదికకు సహకరించిన ప్రొఫెసర్ సుబిమల్ ఘోష్ ఇలా అన్నారు, “వాతావరణ శాస్త్రవేత్తలమైన మేం ఖచ్చితమైన వాతావరణ సూచనలను మెరుగుపరచడం గురించి మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఈ సూచనలను మంచి నిర్ణయాలు తీసుకునేవైపుగా మలచాలని మేం అనుకోం" అని ఆయన చెప్పారు. ఈయన బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
భారత వాతావరణ శాఖ ముందస్తు వాతావరణ హెచ్చరికలను ఖచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని బాగా మెరుగుపరచుకుంది, "కానీ రైతులు దీనిని ఉపయోగించరు. ఎందుకంటే వారు దాని ఆధారంగా నిర్ణయాలు (పంటలను కాపాడగలిగేలా) తీసుకోలేరు," అంటారాయన.
రైతుల సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, వాతావరణ హెచ్చుతగ్గులను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక భాగస్వామ్య విధానం ఉండాలని ప్రొ. ఘోష్ భావిస్తున్నారు. "కేవలం (వరద) మ్యాప్‌ను రూపొందించడం వల్ల సమస్య పరిష్కారం కాదు," అని ఆయన చెప్పారు.
“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం మన దేశానికి చాలా ముఖ్యం. ఎందుకంటే, మనం వాతావరణ మార్పుల ప్రభావాలను చూస్తున్నాం కాని, జనాభాలో ఎక్కువ మందికి ఈ మార్పులను తట్టుకోగల సామర్థ్యం లేదు,” అని ఆయన చెప్పారు. "మనం ఈ తట్టుకోగల సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి."
*****
అర్జున్‌వాడ్‌లో నివాసముండే వ్యవసాయ కూలీ, భారతి కాంబ్లే (45) తన బరువు దాదాపు సగానికి పడిపోయినప్పుడు, అది ప్రమాదానికి సంకేతమని గ్రహించారు. వైద్యుడిని సంప్రదించమని ఆశాగా పనిచేస్తున్న శుభాంగి ఆమెకు సలహా ఇచ్చారు. భారతికి హైపర్ థైరాయిడిజం ఉన్నట్లు మార్చి 2020లో నిర్ధారణ అయింది.
గీత, శివబాయి వంటివారిలాగానే తాను కూడా వరదల కారణంగా ఏర్పడిన ఒత్తిడి లక్షణాలను మొదట్లో పట్టించుకోలేదని భారతి అంగీకరించారు. “2019, 2021లలో వచ్చిన వరదలలో మేం సర్వస్వం కోల్పోయాం. నేను (సమీప గ్రామంలోని వరద సహాయక శిబిరం నుండి) తిరిగి వచ్చేసరికి, నాకు ఒక్క గింజ కూడా కనిపించలేదు. మొత్తం అన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి” అని ఆమె చెప్పారు.
2019 వరదల తర్వాత ఆమె తన ఇంటిని తిరిగి కట్టుకోవడం కోసం స్వయం సహాయక సంఘాల నుంచీ, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుండి 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పును సకాలంలో చెల్లించడానికి, దానిపైన చక్రవడ్డీ పడకుండా చూసుకునేందుకూ రెట్టింపు పనిచేయాలని ఆమె ఆలోచన. అయితే, 2022 మార్చి-ఏప్రిల్‌లలో శిరోల్ తాలూకాలోని గ్రామాలలో వీచిన వడగాడ్పులు ఆమెను పెద్ద ఎదురుదెబ్బ తీశాయి.
"కఠినమైన ఎండ నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నా దగ్గర ఒక నూలు తువ్వాలు మాత్రమే ఉండింది" అని ఆమె చెప్పారు. అది ఏ రకంగానూ రక్షణనిచ్చేది కాకపోవడంతో, ఆమెకు వెంటనే మైకం కమ్మటం మొదలయేది. ఆమెకు విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోవడంతో, తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పిని తగ్గించే మందులు వేసుకొని, పొలం పనిని కొనసాగించేవారు.
వర్షాకాలం వచ్చిందంటే సమృద్ధిగా పంటలు పండుతాయి కాబట్టి పుష్కలంగా పని దొరుకుతుందని ఆమె ఆశపడ్డారు. "అయితే, నాకు మూడు నెలల్లో (జూలై 2022 నుండి మొదలుకొని) 30 రోజుల పని కూడా దొరకలేదు" అన్నారామె.
అనూహ్యంగా కురిసిన వర్షాలు పంటలను నాశనం చేయడంతో, కొల్హాపూర్‌లోని వరద ప్రభావిత గ్రామాలలోని చాలామంది రైతులు ఖర్చు తగ్గించుకునే పనులు ప్రారంభించారు. "కలుపు తీయడానికి కూలీలను పిలవటం మానేసిన రైతులు, కలుపు సంహారక మందులను ఉపయోగించడం మొదలుపెట్టారు" అని చైతన్య చెప్పారు. “అయితే కూలీ పనికి దాదాపు రూ. 1,500 ఇవ్వాల్సివస్తే, కలుపు మందుల ఖరీదు రూ. 500 లోపే అవుతుంది."
ఇది అనేక వినాశకరమైన పరిణామాలకు దారితీసింది. వ్యక్తిగత స్థాయిలో ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారతి వంటివారికి ఇది చేయడానికి పనిలేకుండా పోవడమే. ఆర్థిక అస్థిరత వల్ల కలిగిన అదనపు మానసిక ఒత్తిడి ఆమె హైపర్ థైరాయిడిజంను మరింత ఎక్కువయ్యేలా చేసింది.
భూమి కూడా నష్టపోతుంది. 2021లో తాలూకాలోని 9,402 హెక్టార్ల (23,232 ఎకరాలు) భూమి చవిటినేలగా మారిపోయినట్లు శిరోల్ వ్యవసాయ అధికారి స్వప్నిత పడళ్కర్ చెప్పారు. ఎలాంటి అదుపూ లేకుండా రసాయనిక ఎరువులను, పురుగుమందులను వాడటం, సరియైన నీటిపారుదల పద్ధతులు ఉపయోగించకపోవటం, ఎప్పుడూ ఒకే పంట వేయటం వంటివి ఇందుకు కొన్ని కారణాలని ఆమె వివరించారు.
2019లో వరదలు వచ్చినప్పటి నుండి, కొల్హాపూర్‌లోని శిరోల్, హాత్‌కణంగలే తాలూకా లోని చాలామంది రైతులు "వరద రాకముందే పంట చేతికి రావటం కోసం" రసాయన ఎరువుల వాడకాన్ని విపరీతంగా పెంచారని చైతన్య చెప్పారు.
డాక్టర్ బేకర్ చెప్పినదాని ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో అర్జున్‌వాడ్ గ్రామానికి చెందిన మట్టిలో ఆర్సెనిక్ స్థాయి గణనీయంగా పెరిగింది. "దీనికి ప్రధాన కారణం రసాయన ఎరువుల, విషపూరితమైన పురుగుమందుల వినియోగం పెరిగిపోవడం" అని ఆమె అన్నారు.
నేలలే విషపూరితంగా మారిపోతే, ప్రజలు ప్రభావితం కావడానికి ఎంత సమయం పడుతుంది? “ఫలితంగా(విషపూరితమైన నేలల వలన) - చివరి దశలో ఉన్నవారిని మినహాయించి - ఒక్క అర్జున్‌వాడ్‌లోనే 17 మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు,” అని ఆమె చెప్పారు. వీరిలో రొమ్ము, రక్త, గర్భాశయ, జీర్ణాశయ క్యాన్సర్ ఉన్న రోగులు కూడా ఉన్నారు. "ఒకవైపు దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతుండగా, చాలామంది వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ వైద్యుని వద్దకు వెళ్లడంలేదు" అని ఆమె పేర్కొన్నారు.
దాదాపు 50 ఏళ్ళ వయసున్న ఖోచికి చెందిన వ్యవసాయ కూలీ సునీతా పాటిల్ కండరాల నొప్పి, మోకాళ్ల నొప్పులు, అలసట, తల తిరగడం వంటి లక్షణాలను 2019 నుండి ఎదుర్కొంటున్నారు. "ఎందుకిలా అవుతోందో నాకు అర్థం కావడంలేదు," అన్నారామె. కానీ తన మానసిక ఒత్తిడి స్థాయి వర్షంతో ముడిపడి ఉన్నదని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. "భారీగా వర్షం పడిన తర్వాత, నాకు నిద్రపట్టడం కష్టంగా ఉంటుంది" అని ఆమె చెప్పారు. మరో వరద భయం ఆమెను భయపెట్టి, నిద్రపోనివ్వడంలేదు.
అధికమైన వైద్య ఖర్చులకు భయపడిన సునీత, ఇంకా అనేక ఇతర వరద బాధిత మహిళా వ్యవసాయ కూలీలు బాధని నివారించే, నొప్పిని తగ్గించే మందులపై ఆధారపడుతున్నారు. "మేమేం చేయగలం? వైద్యుడి వద్దకు వెళ్లడానికి శక్తిలేదు. కాబట్టి, చాలా తక్కువ ఖర్చుతో - దాదాపు 10 రూపాయలు - వచ్చే నొప్పి నివారణ మందులపై ఆధారపడతాం,” అని ఆమె చెప్పారు.
నొప్పిని తగ్గించే బిళ్ళలు వారి నొప్పిని తాత్కాలికంగా తగ్గిస్తున్నా, గీత, శివబాయి, భారతి, సునీత, ఇంకా వేలాదిమంది ప్రజలు నిత్యం వేధించే అనిశ్చితి, భయంతో జీవనం సాగిస్తున్నారు.
"మేమింకా మునిగిపోలేదు, కానీ ప్రతిరోజూ వరదల భయంలో మునిగిపోతున్నాము" అని గీత చెప్పారు.
ఇంటర్‌న్యూస్ ఎర్త్ జర్నలిజం నెట్‌వర్క్ మద్దతుతో వస్తోన్న సిరీస్‌లో భాగంగా, స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ పొందిన రిపోర్టర్ ఈ కథనాన్ని రాశారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి