సానియా ములాణీకి మొట్టమొదటి వర్షాల జల్లు అనగానే తాను పుట్టినపుడు పదిమందీ చెప్పిన జోస్యం చటుక్కున గుర్తుకొస్తుంది.
2005 జూలై నెలలో పుట్టింది సానియా. ఆమె పుట్టడానికి వారం ముందే వరద బీభత్సం ఆ ప్రాంతాన్ని ముంచెత్తి, వెయ్యి ప్రాణాలను బలిగొనింది. రెండు కోట్ల మంది మహరాష్ట్రవాసుల జీవితాలను అతలాకుతలం చేసింది. "ఈ పిల్ల వరదల్లో పుట్టింది. జీవితమంతా వరదలు చూస్తూనే గడుపుతుంది" అన్నారు చుట్టుపక్కలవాళ్ళు.
జూలై 2022 మొదటివారంలో వర్షాలు కుండపోతగా ముంచెత్తుతున్నపుడు పదిహేడేళ్ళ సానియా ఆ మాటలు మళ్ళీ గుర్తుచేసుకొంది. " పాణీ వాఢత్ చాల్‌లై (నీటి మట్టం పెరుగుతోంది) అన్నమాట వినిపించగానే మరోసారి వరద అన్న భయం నాలో కలుగుతుంది," అంటుందామె. సానియాది కొల్హాపూర్ జిల్లాలోని హాత్‌కణంగలే తాలూకా కు చెందిన భేండ్‌వడే గ్రామం. 2019 నుంచి ఆ గ్రామమూ, ఆ గ్రామపు 4,686 మంది గ్రామస్థులూ రెండుసార్లు వరద తాకిడికి గురయ్యారు.
"2019 వరదల్లో మా ఇంటి పరిసరాల్లో ఇరవైనాలుగ్గంటల్లో వరదనీరు ఏడడుగులు పెరిగింది," గుర్తుచేసుకుంది సానియా. ఆ నీరు వాళ్ళ ఇంట్లోకి చొరబడబోతోంది అన్న క్షణంలో ములాణీ కుటుంబం ఎలాగోలా తప్పించుకోగలిగింది. కానీ ఆ అనుభవం సానియా మీద విపరీతమైన ప్రభావం చూపించింది.
జూలై 2021లో ఆ గ్రామం మళ్ళీ వరద తాకిడికి గురయింది. ఈసారి వాళ్ళంతా ముందస్తుగానే గ్రామ శివార్లలోని వరద బాధితుల శిబిరం చేరుకోగలిగారు. అక్కడ మూడు వారాలు గడిపారు. గ్రామాధికారులు 'ఇప్పుడంతా సర్దుకొంది, ఇక మీరు తిరిగిరావచ్చు ' అని ప్రకటించినపుడే ఇంటికి చేరుకొన్నారు.
టేక్వాండో క్రీడలో సానియా నిష్ణాతురాలు. అందులో బ్లాక్ బెల్ట్ సాధించాలన్న సానియా ఆశలకూ ప్రయత్నాలకూ 2019 నాటి వరదలు గండికొట్టాయి. ఆ అనుభవాల తర్వాత ఆమెలో అలసట, అలజడి, ఆందోళన, ఊరికే చిరాకుపడిపోవడం- ఇవన్నీ గూడుకట్టుకున్నాయి. గత మూడేళ్ళుగా ఆమెను పీడిస్తున్నాయి. "టేక్వాండో శిక్షణ మీద దృష్టి నిలపలేకపోతున్నాను. ఇపుడు నా శిక్షణ అంతా వర్షాల మీద ఆధారపడి ఉంటోంది," అంటుందామె.
ఆ రుగ్మతా లక్షణాలు పొడసూపినపుడు క్రమక్రమంగా అవే సర్దుకొంటాయని సానియా భావించింది. సర్దుకోకపోవడంతో ఒక ప్రైవేటు డాక్టరు దగ్గరకు వెళ్ళింది. ఆగస్టు 2019 నుంచి ఇప్పటిదాకా కనీసం ఇరవైసార్లు ఆ డాక్టరు దగ్గరకు వెళ్ళింది. ఏమీ గుణం కనిపించలేదు. అలసట, ఒళ్ళునొప్పులు, తలదిమ్ము, తరచూ వచ్చే జ్వరాలు, దేనిమీదా దృష్టి నిలపలేకపోవడం, మానసిక ఉద్వేగం, ఒత్తిడి- ఇవన్నీ ఆమెలో తిష్టవేసి కూర్చున్నాయి.
"ఇప్పుడు డాక్టరు దగ్గరకు వెళ్ళడమంటేనే అదో పీడకలలా వేధిస్తోంది," అంటుంది సానియా."వెళ్ళిన ప్రతిసారీ కనీసం వందరూపాయలు ఫీజు; దానితోపాటు మందుల ఖర్చు, అనేకానేక వైద్య పరీక్షలు, మళ్ళీ అవి తీసుకొని డాక్టరు దగ్గరకు వెళ్లడం... ఎపుడైనా నరాల్లోకి మందు ఎక్కించాల్సివస్తే మళ్ళీ దానికో ఐదొందలు" వాపోతుంది సానియా.
డాక్టర్లను సంప్రదించడం ఏమాత్రం ఫలితం ఇవ్వనపుడు, గప్ప్ ట్రైనింగ్ కరైచా (గప్‌చుప్‌గా శిక్షణకు వెళ్ళిపో) అని ఆమె స్నేహితుల్లో ఒకరు ఆమెకు ఒక పరిష్కారాన్ని సూచించారు. అదీ చేసినా ఫలితం లేకపోయింది. మళ్ళీ డాక్టరు దగ్గరకు వెళ్ళి తన దిగజారిపోతోన్న ఆరోగ్యం గురించి గోడు వెళ్ళబోసుకుంది. వత్తిడీ ఉద్వేగాలకు గురికావద్దన్నది డాక్టరు సలహా. ఆచరణలో దుస్సాధ్యమైన సలహా అది. దానికి తోడు మళ్ళీ వచ్చే వర్షాకాలం ఎలా ఉండబోతోందో, ఈసారి తమ కుటుంబం ఎన్ని ఇక్కట్లకు గురికాబోతోందో అన్న చింత ఉండనే ఉంది.
సానియా తండ్రి జావెద్‌కు ఒక ఎకరం పొలం ఉంది. 2019, 2021 వరదల్లో లక్ష కిలోల చెరకు పంట నష్టమయిందాయనకు. కురుస్తోన్న భారీ వర్షాలూ, ఎగబడుతోన్న సమీపంలోని వారణా నదీ 2022లో కూడా దాదాపు పంట అంతటినీ కబళించాయి
2019 వరదల తర్వాత మనం నాటిన విత్తనాలు పంటను అందిస్తాయన్న నమ్మకం పోయింది. ఒకోసారి ఇక్కడి రైతులం ఒకటికి రెండుసార్లు నాట్లు వేస్తున్నాం," అని చెప్పుకొచ్చారు జావెద్. అంటే రెండింతలు ఖర్చు, ఒకోసారి ఫలితం గుండుసున్నా! వ్యవసాయమన్నది ఏమాత్రం గిట్టుబాటు కాని వ్యవహారమయిపోయిందక్కడ.
ఈ పరిస్థితుల్లో విపరీతమైన వడ్డీరేట్లతో వడ్డీవ్యాపారస్థుల దగ్గర అప్పులు చెయ్యడం అక్కడివాళ్ళకు అనివార్యమయిపోతోంది. మళ్ళా అది ఇంకో అందోళన. “నెలసరి వాయిదాల చెల్లింపు గడువు దగ్గరపడేసరికల్లా ఎంతోమంది ఆ వత్తిడి భరించలేక ఆసుపత్రులకు పరిగెత్తడం మనం గమనించవచ్చు" అంటుంది సానియా.
పెగుతున్న అప్పులు, ముంచుకొచ్చే వరదలు సానియాను అనునిత్యం వేధించే విషయాలు.
"ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఏ మనిషీ సరిగా పనిచెయ్యలేడు, అనుకొన్నది సాధించలేదు. అవి సాధించాలనే కోరిక లేక కాదు, అందుకు సహకరించే మానసిక స్థితి ఉండకపోవడం వల్ల" అంటారు కొల్హాపూరుకు చెందిన మానసిక శాస్త్రవేత్త శాల్మలీ రణమాళే కాకడే. "దానితో నిస్సహాయత, నిర్వేదం, అనేకానేక విచార భావాలు వాళ్ళను ముంచెత్తుతాయి. దానివల్ల వారి మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుంది. వత్తిడీ ఆందోళనల విషపరిష్వంగంలో చిక్కుకుపోతారు" అంటారాయన.
ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్‌గవర్నమెంటల్ పేనల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపిసిసి), ప్రజల మానసిక ఆరోగ్యాన్ని వాతావరణ మార్పు తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మొట్టమొదటిసారిగా ఎత్తిచూపింది. పొంచి ఉన్న గ్లోబల్ వార్మింగ్ ఉపద్రవం వల్ల పిల్లల్లోనూ, కౌమారవయస్కుల్లోనూ, పెద్దవయసువాళ్ళలోనూ, అప్పటికే ఇతరేతర రుగ్మతలు ఉన్నవారిలోనూ వత్తిడి, ఉద్వేగం పెచ్చరిల్లే ప్రమాదం ఉంది " అని ఐపిసిసి అధ్యయనం స్పష్టంగా తేల్చిచెప్పింది
*****
పద్దెనిమిదేళ్ళ ఐశ్వర్యా బిరాజ్‌దార్ 2021 నాటి వరదల్లో తన కలలన్నీ తుడిచిపెట్టుకుపోవడాన్ని కళ్ళారా చూసింది.
పరుగుపందెంలోనూ, టేక్వాండోలోనూ ప్రవీణురాలైన ఈ భేండ్‌వడే నివాసి, వరదనీరు తీసిన తర్వాత పదిహేనురోజుల పాటు సుమారు వంద గంటలు శ్రమించి తమ ఇంటిని శుభ్రం చేసింది. "ఎంత చేసినా దుర్వాసన పోలేదు. గోడలు చూస్తే అవి ఏ క్షణానైనా పడిపోతాయేమో అనిపిస్తోంది" అంటుందామె.
పరిస్థితులు సద్దుమణిగి మళ్ళీ జీవితచక్రం సవ్యంగా తిరగడానికి 45 రోజులు పట్టింది. “ట్రైనింగ్‌కు ఒక్కరోజు వెళ్ళకపోయినా ఆ లోటు తెలిసిపోతుంది,” అంటుందామె. 45 రోజుల ట్రైనింగ్ పోయిందీ అంటే ఆ నష్టం పూడ్చుకోడానికి విపరీతంగా శ్రమించాలి. "“(కానీ) ఇంతకుముందు తినేదాంట్లో సగం ఆహారాన్ని మాత్రమే తింటూ, అదే సమయంలో రెట్టింపు శిక్షణ పొందవలసి ఉన్నందున నా సత్తువ బాగా పడిపోయింది. అది శిక్షణకు తీవ్రమైన అవరోధం. వత్తిడి పెరగడానికి సులభమార్గం" అంటుందామె.
వరదనీరు తీసిన తర్వాత కూడా మూడు నెలలపాటు సానియా ఐశ్వర్యల తలిదండ్రులకు పనిదొరకడం కష్టమయింది. వరద దెబ్బ నుంచి కోలుకుని మళ్ళా తన కాళ్ళ మీద తాను నిలబడటానికి వాళ్ళ గ్రామానికి అంత సమయం పట్టింది. సానియా తండ్రి వ్యవసాయంతో పాటు తాపీ పని కూడా చేసి మరికాస్త సంపాదిస్తూ ఉండేవారు. వరదల పుణ్యమా అని నిర్మాణపు పనులన్నీ ఆగిపోయాయి. అంచేత ఆ ఆధారమూ కరవయింది. పొలాల్లో ఇంకా వరద నీరు పూర్తిగా తియ్యలేదు. అంచేత కౌలుదారీ రైతులూ రోజువారీ కూలీలూ అయిన ఐశ్వర్త్య తల్లిదండ్రులు కూడా పని కోసం కటకటలాడారు.
తీర్చాల్సిన అప్పులు, పెరిగిపోతోన్న వాటిమీద వడ్డీలు- వీటి పుణ్యమా అని సానియాలాంటివాళ్ళంతా తమతమ కుటుంబాల మీద భారం కాస్తైనా తగ్గిద్దామని తిండిని సగానికి సగం తగ్గించారు. దాంతో శిక్షణ తీసుకోడానికి అవసరమయిన శారీరక శక్తి లోపించసాగింది. "ఎంతో కష్టమైన ఈ శిక్షణ తీసుకొనే శక్తి నా శరీరానికి బొత్తిగా లేకుండాపోయింది," వివరించింది సానియా.
ఈ యువ క్రీడాకారిణులు, ఇల్లు నడపటంలో తమ తల్లిదండ్రులకు సహాయంగా ఉండటం కోసం ఎన్ని రోజులు ఖాళీ కడుపుతో నిద్రించారో వారికే లెక్క తెలియదు. ఆ లేమి సహజంగానే వారి శిక్షణపైనా, పనితీరుపైనా ప్రభావం వేసింది. "నా శరీరం ఇకముందు కఠినమైన వ్యాయామాలను చేయలేదు" అంటుంది సానియా.
మానసిక వత్తిడి పొడచూపినపుడు సానియా, ఐశ్వర్య దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తామే కాకుండా ఇంకా ఎంతోమంది సహక్రీడాకారులు కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నారని గ్రహించాక వారికి సమస్య తీవ్రత బోధపడింది. "మాలాగా వరదల బాధలు ఎదుర్కొన్న క్రీడాకారులంతా ఒకే రకపు వ్యాధి లక్షణాల గురించి మాట్లాడుకోవడం గమనించాను.” అంది ఐశ్వర్య. “అది నాకు ఆందోళన కలిగించింది. మానసిక మాంద్యం నన్ను అలముకొంటోందని నాకు ఎన్నోసార్లు అనిపించసాగింది," అంటుంది సానియా.
2020 నుంచీ జూన్ నెలలో వర్షాలు మొదలవగానే గ్రామాలవాళ్ళంతా వరద భయంతో రోజులు గడపడం గమనించాం," అంటారు హాత్‌కణంగల్ తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రసాద్ దాతార్. "వరదల నుంచి తప్పించుకొనే మార్గమే లేదన్న ఎరుక వాళ్ళ భయాన్ని రోజురోజుకూ పెంచుతూ పోవడం, అది వారిని మానసిక రోగులుగా మార్చడం మేం గమనించాం" అంటారాయన.
2021 దాకా శిరోల్ తాలూకా లోని 54 గ్రామాల్లో పదేళ్ళపాటు ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమాలు నిర్వహించిన డాక్టర్ ప్రసాద్, "వరదల తర్వాత ఎన్నో కేసుల్లో మానసిక వత్తిడి ఏ ప్రమాణాలకు చేరిందంటే చివరికి వాళ్ళంతా రక్తపోటు(బి.పి.) పీడితులో, మానసిక రోగులో అయ్యారు" అంటారు.
కొల్హాపూర్ జిల్లాలో 2015-2020 మధ్య కాలంలో వయోజన మహిళల్లో (15-49 ఏళ్లు) రక్తపోటు కేసుల్లో పెరుగుదల 72 శాతంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో 2018 వరదల వల్ల ప్రభావితమైన 171 మందిని అంచనా వేసిన ఒక అధ్యయనం లో 66.7 శాతం మంది నైరాశ్యం, శారీరక అనారోగ్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, నిద్ర సమస్యలు, ఆందోళనలతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు..
తమిళనాడులోని చెన్నై, కడలూరులలో 2015, డిసెంబర్‌లో వచ్చిన వరదల కారణంగా ప్రభావితమైన వారిలో 45.29 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని మరొక అధ్యయన పత్రం ద్వారా తెలిసింది; సర్వే చేసిన 223 మందిలో 101 మంది వ్యక్తులు డిప్రెషన్‌కు లోనయ్యారు
భేండ్‌వడేలో 30 మంది విద్యార్థులకు టేక్వాండోలో శిక్షణ ఇస్తున్న విశాల్ చవాన్, యువ క్రీడాకారుల మానసిక ఆరోగ్యంపై ఇలాంటి ప్రభావాలను గమనించినట్లు ధృవీకరించారు. "ఈ పరిస్థితుల కారణంగా 2019 నుండి చాలామంది విద్యార్థులు క్రీడలను విడిచిపెట్టారు." అతని వద్ద శిక్షణ పొందుతున్న ఐశ్వర్య వ్యాయామ క్రీడలు (అథ్లెటిక్స్), రణవిద్యల(మార్షల్ ఆర్ట్స్)లో తన కెరీర్‌ను కొనసాగించాలనే ఆలోచనలో ఉంది
2019లో వచ్చిన వరదలకు ముందు, ఐశ్వర్య తన కుటుంబంతో కలిసి నాలుగు ఎకరాల్లో చెరకు సాగు చేసింది. "24 గంటల్లో, ఉసాచ్యా మూళ్యా (చెరకు మూలాల)లోకి వరద నీరు చేరింది, మొత్తం పంట నాశనమైపోయింది" అని ఆమె చెప్పింది.
ఆమె తల్లిదండ్రులు కౌలు రైతులు. వారు పండించిన పంటలో 75 శాతం పంటను భూ యజమానికి ఇవ్వాలి. “2019, 2021 వరదలలో ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదు; ఏదైనా పరిహారం వచ్చినా అది భూ యజమానికి చేరేది" అని ఆమె తండ్రి రావుసాహెబ్ (47) చెప్పారు.
కేవలం 2019 వరదల్లోనే రూ. 7.2 లక్షల విలువైన 240,000 కిలోల చెరకు నాశనమైపోవడంతో రావుసాహెబ్, అతని భార్య శారద (40) వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేయవలసి వచ్చింది. ఐశ్వర్య కుటుంబానికి చెందిన పశువులకు రోజుకు రెండుసార్లు పాలు పితికే పనిని తరచుగా చేస్తుంటుంది. "వరదల తర్వాత కనీసం నాలుగు నెలల వరకు మాకు పని ఉండదు," అని శారద చెప్పారు. "పొలాలు త్వరగా ఎండిపోకపోవడమే దీనికి కారణం. నేల తన పోషక నాణ్యతను తిరిగి పొందటానికి కూడా సమయం పడుతుంది."
ఇదేవిధంగా 2021లో వచ్చిన వరదలలో రావుసాహెబ్ రూ. 42,000 విలువైన 600 కిలోల సోయా బీన్ పంటను నష్టపోయారు. ఇలాంటి నష్టాలను చూస్తూవస్తున్న ఐశ్వర్యకు క్రీడలను తన వృత్తిగా ఎంచుకోవడం గురించి తనకే స్పష్టత లేకుండాపోయింది. "నేనిప్పుడు పోలీసు ఉద్యోగం కోసం అప్లై చేయాలని ఆలోచిస్తున్నాను," అని ఆమె చెప్పింది. "క్రీడల మీద ఆధారపడటం చాలా కష్టం; ప్రత్యేకించి ఇటువంటి మారుతున్న వాతావరణ పరిస్థితులలో."
"నా శిక్షణ నేరుగా వ్యవసాయంతో ముడిపడి ఉంది," అని ఆమె చెప్పింది. వ్యవసాయంతోనే ఆమె కుటుంబ జీవనోపాధి, మనుగడ నడుస్తుంది కాబట్టి, ఏదైనా తప్పు జరిగితే అది నేరుగా కుటుంబ పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. వాతావరణ మార్పుల నుండి పెరిగిన ముప్పు వలన క్రీడలను వృత్తిగా స్వీకరించడం గురించి ఐశ్వర్యకు కలుగుతున్న భయాన్ని అర్థంచేసుకోవచ్చు
కొల్హాపూర్‌లోని ఆజరా తాలూకా, పేఠేవాడీకి చెందిన క్రీడా శిక్షకుడు పాండురంగ్ తెర్సే మాట్లాడుతూ, “ఏదైనా (వాతావరణ) విపత్తు వస్తే మహిళా అథ్లెట్లే ఎక్కువగా ప్రభావితమవుతారు. చాలామందికి కుటుంబాల నుంచి ఎటువంటి మద్దతు ఉండదు. ఈ అమ్మాయిలు ఎప్పుడైనా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడం మానేస్తే, 'ఆటలు మానేసి డబ్బు సంపాదించండి' అని కుటుంబ సభ్యులు వారికి చెబుతుంటారు. ఇలా చెప్పడం వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది" అన్నారు.
ఈ యువక్రీడాకారులకు సహాయం చేయడానికి ఏం చేయవచ్చని అడిగినప్పుడు, మనస్తత్వవేత్త కాకడే ఇలా అంటారు: “మా చికిత్సలో భాగంగా మొదటి దశలో చేసే కౌన్సెలింగ్‌లో మేం చేసేది - కేవలం వారు చెప్పేది వినడం, వారి భావనల గురించి మాట్లాడనివ్వడం. తమ సంక్లిష్టమైన భావోద్వేగాలను పంచుకోవడానికి ఒక వేదిక ఉన్నప్పుడు, అది వారికి కొంచెం ఎక్కువ భరోసానిస్తుంది. ఒక సమూహం మీ వెనుక దన్నుగా ఉందన్న అనుభూతి గాయం మానేలా చేయడంలో చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ వాస్తవమేమిటంటే భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు మానసిక వ్యాధికి చికిత్స తీసుకోరు. తక్కువ వనరులతో కూడిన ఆరోగ్య సంరక్షణా మౌలిక సదుపాయాలకు తోడు, చికిత్స కోసం అయ్యే అధిక ఖర్చుల కారణంగా లక్షలాది మంది భారతీయులు మానసిక ఆరోగ్య సంరక్షణను పొందడం కష్టంగా మారిం ది.
*****
2019లో వచ్చిన వరదల తర్వాత ఎక్కువ దూరాల పందేలలో పరుగు తీసే (long-distance runner) సోనాలి కాంబళే కలలు కూలిపోయాయి. సోనాలి తల్లిదండ్రులిద్దరూ భూమిలేని వ్యవసాయ కూలీలు. వరదల తర్వాత విస్తరించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు వారికి సోనాలి సహాయం అవసరం
"మేం ముగ్గురం పనిచేస్తున్నప్పటికీ, ఏ మూలకూ సరిపోవడం లేదు," అని ఆమె తండ్రి రాజేంద్ర చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పొలాలు ముంపునకు గురై, చాలా కాలంపాటు వాటిలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. దీని వలన పని దినాల సంఖ్య వేగంగా క్షీణిస్తుంది, తద్వారా వ్యవసాయ పనులపై ఆధారపడిన కుటుంబాల ఆదాయం తగ్గిపోతుంది
కాంబళే కుటుంబం నివసించే శిరోళ్ తాలూకా లోని ఘాల్వాడ్ గ్రామంలో దాదాపు ఏడు గంటలు పనిచేస్తే మహిళలకు రూ. 200, పురుషులకు రూ. 250 వస్తాయి. "క్రీడా సామగ్రిని కొనడాన్ని, శిక్షణ కోసం చెల్లించడాన్ని అటుంచితే, మహా అయితే ఈ సంపాదన కుటుంబాన్ని నడిపించడానికి సరిపోతుంది" అని 21 ఏళ్ల సోనాలి చెప్పింది
2021లో వచ్చిన వరదలు కాంబళేల కష్టాలను మరింత పెంచి, సోనాలిని తీవ్రమైన మానసిక ఆందోళనలోకి నెట్టింది. "2021లో మా ఇల్లు కేవలం 24 గంటల్లోనే మునిగిపోయింది," అని ఆమె గుర్తుచేసుకుంది. "మేం ఎలాగో ఆ ఏడాది వరద నీటి నుంచి తప్పించుకోగలిగాం. కానీ నీటి మట్టం పెరుగుతుండటం చూసినప్పుడల్లా, మళ్ళీ వరద వస్తుందేమో అనే భయంతో నా శరీరం నొప్పెట్టడం మొదలవుతుంది."
జూలై 2022లో భారీ వర్షాలు కురవడం ప్రారంభించినప్పుడు, కృష్ణా నదికి వరదలు వస్తాయని గ్రామస్థులు భయపడ్డారని సోనాలి తల్లి శుభాంగి చెప్పారు. సోనాలి తన రోజువారీ 150-నిమిషాల శిక్షణను దాటవేసి, వరద రాక కోసం సిద్ధపడటం మొదలుపెట్టింది. ఆమె ఎంత తీవ్రమైన ఒత్తిడిని అనుభవించిందంటే, ఆమెను వైద్యుని దగ్గరకు తీసుకుపోవాల్సివచ్చింది
"నీటి మట్టం పెరగడం ప్రారంభించినప్పుడు, చాలామంది ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో చిక్కుకుంటారు," అంటారు డాక్టర్ ప్రసాద్. "పరిస్థితిని అంచనా వేసి, నిర్ణయాన్ని తీసుకోవడం వారికి చేతకాకపోవటం వారిలో ఒత్తిడికి దారితీస్తుంది."
వరద నీరు తగ్గుముఖం పట్టిన వెంటనే సోనాలి తెరపిగా ఊపిరి తీసుకుంటుంది కానీ, "శిక్షణ సక్రమంగా తీసుకోకపోవడమంటే నేను పోటీపడలేనని అర్థం. ఈ భావన నన్ను ఎల్లప్పుడూ ఒత్తిడికి గురిచేస్తుంటుంది" అంటుందామె
వరదలు యువ క్రీడాకారులను ఆందోళనకు గురిచేస్తున్నాయని కొల్హాపూర్ జిల్లాలోని పలు గ్రామాలలో పనిచేస్తున్న ASHA (ఆశా)లు కూడా అంటున్నారు. "వారు నిస్సహాయంగా, నిరాశగా ఉంటున్నారు. మారుతోన్న వర్షాకాల పరిస్థితులతో వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది” అని ఘాల్వాడ్‌కు చెందిన ఆశా, కల్పనా కమలాకర్ చెప్పారు.
ఐశ్వర్య, సానియా, సోనాలీలు వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు కావడంతో, వారి అదృష్టాలకు - లేదా దురదృష్టాలకు - వర్షాలతో దగ్గర సంబంధం వుంటుంది. 2022 వేసవిలో ఈ కుటుంబాలు చెరకు పంటను సాగుచేశాయి.
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. "రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ మా పంట చక్కగా పండింది," అంది ఐశ్వర్య. కానీ జూలైలో మొదలైన అకాల వర్షాలు పంటలను మొత్తంగా నాశనం చేసేశాయి. కుటుంబాలు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయాయి. (ఇది కూడా చదవండి: విషాదాన్ని వర్షిస్తోన్న వానలు )
1953 నుంచి 2020 మధ్యకాలంలో వచ్చిన వరదలు 2,200 మిలియన్ల భారతీయులను - అమెరికా జనాభాకు దాదాపు 6.5 రెట్లు - ప్రభావితం చేశాయి. దీనివలన వచ్చిన నష్టం రూ. 437,150 కోట్లు. గత రెండు దశాబ్దాలలో (2000-2019), భారతదేశం ప్రతి సంవత్సరం సగటున 17 వరద సంఘటనలను చవిచూసింది, చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యంత వరద ప్రభావిత దేశంగా నిలిచింది.
ఒక దశాబ్దానికి పైగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా కొల్హాపూర్ జిల్లాలో, వర్షపాతం రానురానూ అస్థిరంగా ఉంటోంది. ఈ ఏడాది ఒక్క అక్టోబర్ నెలలోనే రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 7.5 లక్షల హెక్టార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నాయి. ఇందులో వ్యవసాయ పంటలు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, 2022 అక్టోబర్ 28 వరకు మహారాష్ట్రలో 1,288 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సగటు వర్షపాతంలో 120.5 శాతం. ఇందులో ఒక్క జూన్, అక్టోబర్ నెలల మధ్యనే 1,068 మి.మీ. వర్షం కురిసింది
"రుతుపవనాల సమయంలో, మనం చాలా తక్కువ వర్షాలతో కూడిన పొడి కాలాలను చూస్తున్నాం" అని పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త, ఐపిసిసి నివేదికకు సహకరించిన రాక్సీ కోల్ చెప్పారు. "అందువల్ల వర్షం పడినప్పుడు, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ తేమ నిల్వ అవుతుంటుంది." ఇది తరచుగా మేఘాలు కమ్ముకొని వర్షాలు పడి, ఆకస్మిక వరదలకు దారితీస్తుందని ఆయన వివరించారు. "మనం ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నందున, వాతావరణ సంఘటనలు చాలా తీవ్రంగా ఉంటాయి. వీటన్నింటి పర్యవసానాలను ముందుగా భరించాల్సింది మనమే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి, త్వరగా చర్యలు తీసుకోవాలి."
ఏదేమైనప్పటికీ, పరిష్కరించాల్సిన పెద్ద అంతరం ఉంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అనారోగ్యాలతో వాతావరణ మార్పులను అనుసంధానించడానికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ గణాంకాలు అందుబాటులో లేవు. ఫలితంగా, వాతావరణ సంక్షోభం వల్ల ప్రభావితమైన అసంఖ్యాక ప్రజల వాస్తవ పరిస్థితులు ప్రభుత్వ విధానాలలో ప్రతిబింబించవు. ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడంలో అవి విఫలమవుతాయి కూడా.
"మంచి క్రీడాకారిణిని కావడం నా కల," అంటుంది సోనాలి. "కానీ నువ్వు పేదరాలివైనప్పుడు, నీకుండే అవకాశాలు పరిమితంగా ఉంటాయి. నీ జీవితం నీకు ఎంపిక చేసుకునే అవకాశాన్నివ్వదు." వాతావరణ సంక్షోభంలో ప్రపంచం కూరుకుపోతున్నప్పుడు, వర్షపాత నమూనాలు మారిపోతూ ఉంటాయి. తద్వారా సానియా, ఐశ్వర్య, సోనాలీలకు అందుబాటులో ఉండే ఎంపికలు మరింత కఠినమవుతాయి.
"నేను వరదల కాలంలో పుట్టాను. అలాగని నా జీవితమంతా వరదలలోనే గడపాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు." అంటుంది సానియా
ఇంటర్‌న్యూస్ ఎర్త్ జర్నలిజం నెట్‌వర్క్ మద్దతుతో వస్తోన్న సిరీస్‌లో భాగంగా, స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ పొందిన రిపోర్టర్ ఈ కథనాన్ని రాశారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి