చంపత్ నారాయణ్ జంగలే చనిపోయిన ప్రదేశం రాళ్ళతో నిండివున్న ఒక ప్రత్తి పొలంలో ఉంది.
మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండే ఈ ప్రాంతాలను హల్కీ జమీన్ లేదా నిస్సార భూమి అంటారు. ఆంధ్ వంశానికి చెందిన ఎత్తుపల్లాలతో నిండివున్న ఈ భూమికి పచ్చని కొండలు అందమైన నేపథ్యాన్ని అందిస్తాయి. ఇది గ్రామానికి దూరంగా ఉండే వ్యవసాయ భూమి.
వేటకు వచ్చే అడవి పందుల నుండి తన పొలాన్ని రక్షించుకోవడానికి చంపత్ తన పొలంలో రేయింబవళ్ళు కాపలా కాసేవారు. చర్రున కాల్చే ఎండనుండీ, కురిసే వానలనుండీ రక్షణ కోసం చంపత్ గడ్డితో కట్టుకున్న గుడిసె- ఇప్పటికీ కనుచూపు మేర బండరాళ్లతో నిండి కనిపిస్తోన్న ఆ ప్రదేశంలో నిలిచివుంది. పొలాన్ని కాపలా కాస్తూ అతనెప్పుడూ అక్కడే ఉండేవాడని అతని పొరుగువారు గుర్తు చేసుకున్నారు.
అంధ్ తెగకు చెందిన ఈ ఆదివాసీ రైతు చంపత్ (సుమారు 45 సంవత్సరాలు), ఆ గుడిసె నుండే తన పొలం మొత్తాన్ని చూసుకుంటూ ఉండేవారు. అంతులేని నష్టం, కాయలు కాయకుండా దెబ్బతిన్న మొక్కలు, మోకాళ్ల ఎత్తున పెరిగిన కంది మొక్కలు ఆయనకు కనిపించేవి.
రెండు నెలల్లో మొదలయ్యే కోతల కాలంనాటికి ఈ పొలాలు ఏమీ పండవని ఆయనకు సహజంగానే తెలిసి ఉండాలి. ఆయనకు తీర్చాల్సిన అప్పులున్నాయి, కుటుంబ రోజువారీ ఖర్చులు చూసుకోవాల్సిన అవసరమూ ఉంది. కానీ డబ్బు మాత్రం లేదు.
ఆగస్టు 29, 2022 మధ్యాహ్నం వేళ అతని భార్య ధ్రుపద తమ పిల్లలతో కలిసి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసేందుకు 50 కి.మీ దూరంలో ఉన్న గ్రామానికి వెళుతుండగా, చంపత్ అంతకు ముందురోజే అప్పుచేసి కొనుగోలు చేసిన మోనోసిల్ అనే ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందును తాగారు.
అప్పుడతను నేలమీద పడకముందే వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఖాళీ డబ్బాను బలంగా ఊపుతూ, ఎదురు పొలంలో పనిచేస్తున్న తన బంధువును గట్టిగా అరిచి పిలిచారు. అయితే, చంపత్ తక్షణమే మరణించారు.
"నేను చేస్తున్న పనిని వదిలేసి అతని వద్దకు పరుగెత్తాను" అని ఈ సంఘటన జరిగినప్పుడు, ప్రక్కనే ఉన్న మరో పంటపండని రాతిభూమిలో పనిచేస్తున్న చంపత్ బంధువు రామ్‌దాస్ జంగలే (70) గుర్తు చేసుకున్నారు. బంధువులు, గ్రామస్థులు ఎలాగో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి, అతన్ని గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అతను 'చనిపోయాడు' అని అక్కడ ప్రకటించారు.
*****
మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతం, యవత్మాల్‌లోని ఉమర్‌ఖేడ్ తహసీల్‌లో ఉన్న మారుమూల గ్రామమైన నింగనుర్‌లో ఎక్కువగా చిన్న లేదా సన్నకారు అంధ్ ఆదివాసీ రైతులు నివసిస్తున్నారు. ఇక్కడి భూమి సారం లేనిది. చంపత్ జీవించిందీ, మరణించిందీ కూడా ఇక్కడే.
విదర్భ ప్రాంతంలో గత జూలై, ఆగస్టు రెండు నెలల మధ్యకాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఏర్పడిన వినాశకరమైన కరవు పరిస్థితులు రైతుల ఆత్మహత్యల పరంపరకు దారితీశాయి.
"దాదాపు మూడు వారాల పాటు, మేం సూర్యుడిని చూడలేదు," అని రామ్‌దాస్ చెప్పారు. ముందు కురిసిన భారీ వర్షాలకు నాట్లు నాశనమయ్యాయి. ఆ వర్షాన్ని తట్టుకుని బతికిన ఆ కాసిని మొక్కలు కూడా ఆ తర్వాత వచ్చిన పొడి ఎండలకు ఎండిపోయాయి. "మేం ఎరువులు వేయాలనుకున్న సమయంలో వర్షాలు ఆగలేదు. వానలు అవసరమైన ఈ సమయంలో వర్షం పడదు".
వ్యవసాయంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, పర్యావరణ సమస్యల కారణంగా అత్యధిక సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంతో పశ్చిమ విదర్భలోని పత్తి పండించే ప్రాంతం రెండు దశాబ్దాలకు పైగా వార్తల్లో ఉంది.
జిల్లాలవారీ వర్షపాతంపై ఐఎమ్ డి అందిస్తోన్న డేటా ప్రకారం విదర్భ, మరఠ్వాడాలలోని మొత్తం 19 జిల్లాలలో, ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో, సగటున 30 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయింది. ఇందులో అత్యధిక వర్షపాతం జూలైలో నమోదైంది. రుతుపవనాలు తగ్గుముఖం పట్టడానికి ఇంకా దాదాపు ఒక నెల సమయం ఉండగానే, జూన్ నుంచి సెప్టెంబర్ 10, 2022 మధ్య ఈ ప్రాంతంలో ఇప్పటికే 1100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది (గత సంవత్సరాల్లో ఇదే కాలంలో నమోదైన సగటు 800 మిమీ వర్షపాతంతో పోలిస్తే). ఈ ఏడాది అనూహ్యంగా అసాధారణంగా వర్షాలు పడే సంవత్సరంగా మారుతోంది.
కానీ ఆ సంఖ్య వైవిధ్యాలనూ హెచ్చుతగ్గులనూ వెల్లడించలేదు. జూన్ నెలంతా దాదాపు పొడిగా ఉంది. జూలై నెల ప్రారంభంలో వర్షాలు కురిసి, కొద్ది రోజుల్లోనే ఆ లోటును పూడ్చుకుంది. జులై మధ్య నాటికి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. జూలై నెల మొదటి 15 రోజులలో మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలలో చాలా చోట్ల భారీ వర్షాలు (24 గంటల్లో 65 మి.మీ. కంటే ఎక్కువ) కురిసినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) నివేదించింది.
చివరకు ఆగస్టు ప్రారంభంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. యవత్మాల్‌తో సహా అనేక జిల్లాలలో సెప్టెంబరు ప్రారంభం వరకు సుదీర్ఘమైన పొడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురిశాయి.
భారీ నుండి అతిభారీ వర్షపాతం, వెనువెంటనే సుదీర్ఘకాలం సాగే పొడి వాతావరణం- ఈ ప్రాంతంలో ఒక నమూనాగా మారుతున్నాయని నింగనుర్ రైతులు వాపోతున్నారు. ఏ పంటలు పండించాలి, ఎటువంటి పద్ధతులను అనుసరించాలి, భూమిలో నీటిని, తేమను ఎలా నిర్వహించాలి అనేవి నిర్ణయించడం వారికి కష్టంగా మారింది. ఫలితంగా కలిగిన తీవ్రమైన బాధ చంపత్‌ను తన ప్రాణాలు తీసుకునేలా చేసింది.
ఇటీవలి కాలంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వ్యవసాయంలోని కష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న వసంతరావ్ నాయక్ షెత్కారీ స్వావలంబన్ మిషన్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న కిశోర్ తివారీ చెప్పారు. ఆగస్ట్ 25 నుండి సెప్టెంబర్ 10 మధ్య, కేవలం పక్షం రోజుల్లోనే విదర్భ ప్రాంతంలో దాదాపు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. జనవరి 2022 నుంచి ఇప్పటి వరకు 1,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అధిక వర్షాలు, ఆర్థిక సంక్షోభాలే కారణమని ఆయన నిందించారు.
ఇలా జీవితాలను ముగించిన వారిలో యవత్మాల్‌లోని ఒక గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు ఒక్క నెల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
“ఎంతటి సహాయమైనా నిజంగా వారికెటువంటి సహాయం చేయలేదు; ఈ సంవత్సరం జరిగిన వినాశనం చాలా దారుణంగా ఉంది,” అని తివారీ చెప్పారు.
*****
వారి పొలాలు ముంపునకు గురయ్యాయి, పంటలు నాశనమయ్యాయి. ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో చిన్నకారు రైతులు ముందుముందు రాబోయే సంక్షోభానికి సంకేతాలను అనుభవిస్తున్నారు.
విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర అంతటా దాదాపు రెండు మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి ఈ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు, వెనువెంటనే నెలకొన్న పొడివాతావరణం (తడి కరవు) వల్ల నాశనమైందని మహారాష్ట్ర వ్యవసాయ కమీషనర్ కార్యాలయం అంచనా వేసింది. మండల వ్యాప్తంగా ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. సోయాబీన్, పత్తి, కందులు వంటి ప్రతి ప్రధాన పంట నష్టపోయింది. ఖరీఫ్ ప్రధానంగా సాగయ్యే పొడి భూముల్లో ఈ ఏడాది కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
నాందేడ్‌లోని అర్ధ్‌పూర్ తహసీల్‌లో ఉన్న శెల్‌గాఁవ్ వంటి నదుల, వాగుల ఒడ్డున ఉన్న గ్రామాలు ఆకస్మిక వరదల భారాన్ని ఎదుర్కొన్నాయి. "మేం ఒక వారం పాటు బయటి ప్రపంచానికి దూరమయ్యాం," అని శెల్‌గాఁవ్ సర్పంచ్ పంజాబ్ రాజెగోరె చెప్పారు. "ఊరి పక్కగా ప్రవహించే ఉమా నది ఉగ్రరూపం దాల్చడంతో మా ఇళ్లు, పొలాలు నీట మునిగాయి." ఉమా నది గ్రామం నుండి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న అసనా నదిలో కలుస్తుంది, ఆ తర్వాత ఈ రెండు నదులు నాందేడ్ దగ్గర గోదావరిలో కలుస్తాయి. భారీ వర్షాల సమయంలో ఈ నదులన్నీ పొంగిపొర్లుతుంటాయి.
"జూలై నెలంతా మాకు అతి భారీ వర్షాలు పడటంతో, పొలాల్లో పని చేయడం కష్టంగా మారింది," అని ఆయన చెప్పారు. కోతకు గురైన నేలలు, దెబ్బతిన్న పంటలు ఈ పరిస్థితికి గుర్తుగా మిగిలి ఉన్నాయి. కొంత మంది రైతులు అక్టోబర్ నెలలో ముందస్తు రబీ పంటకు సిద్ధం అయేందుకు, దెబ్బతినగా మిగిలిన పంటలను కూడా తీసేస్తున్నారు.
జూలై నెలలో యశోదా నదికి వచ్చిన వరదలు గ్రామాన్ని ముంచెత్తాయి. దీనికి వారం రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు తోడై, వార్ధా జిల్లాలోని చంద్కి లోని దాదాపు 1,200 హెక్టార్ల వ్యవసాయ భూమి నీటిలో మునిగిపోయింది. వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)ను రప్పించాల్సి వచ్చింది.
“నా ఇంటితో సహా పదమూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి,” అని 50 ఏళ్ల దీపక్ వార్ఫడే చెప్పారు. వరదల కారణంగా సొంత ఇల్లు నేలమట్టం కావడంతో ఈయన అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. “మా సమస్యల్లా, ఇప్పుడు చేయడానికి వ్యవసాయ పనులు లేవు; నేను పని లేకుండా ఉండటం ఇదే మొదటిసారి." అన్నారాయన.
"ఒక్క నెల వ్యవధిలో మేం ఏడు వరదలను ఎదుర్కొన్నాం" అని దీపక్ చెప్పారు. “ఏడవసారి వచ్చిన వరద చావుదెబ్బ లాంటిది; ఎన్ఆర్‌డిఎఫ్ బృందాలు సకాలంలో చేరుకోవడం మా అదృష్టం, లేకపోతే నేనిక్కడ ఉండేవాడిని కాను".
ఖరీఫ్ పంట నాశనమవటంతో, ఇప్పుడేం చేయాలి? అనే ప్రశ్న చంద్కి గ్రామస్థులను సతమతంచేస్తోంది.
గిడసబారిపోయిన పత్తి మొక్కలు, పంట నేలమట్టమైన పొలాలు విధ్వంసచిత్రాన్ని చిత్రించే చోట, బాబారావు పాటిల్ (64) పొలంలో మిగిలివున్న పంటను రక్షించుకునేందుకు తాను చేయగలిగిన ప్రయత్నమంతా చేస్తున్నారు.
"ఈ ఏడాది నాకేమైనా దక్కుతుందో లేదో తెలియదు. ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఈ మొక్కలలో కొన్నింటినైనా బతికించే ప్రయత్నం చేస్తున్నా." అని ఆయన చెప్పారు. ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రంగా ఉందనీ, అది కూడా ఇప్పుడే ప్రారంభమైందనీ ఆయన అన్నారు.
మహారాష్ట్రలో మైళ్ళకు మైళ్ళు వ్యాపించివున్న పొలాలు బాబారావు పొలం ఉన్న పరిస్థితికి అద్దంపడుతున్నాయి. ఎక్కడా ఆరోగ్యంగా నిలదొక్కుకున్న పంటల జాడ లేదు.
"రాబోయే 16 నెలల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుంది" అని మాజీ ప్రపంచ బ్యాంకు సలహాదారు, వార్ధాలోని ప్రాంతీయ అభివృద్ధి నిపుణుడు శ్రీకాంత్ బర్హాటే చెప్పారు. "ఆ సమయానికి తర్వాతి పంట కోతకు సిద్ధంగా ఉంటుంది". అయితే రైతులు ఈ 16 నెలలు ఎలా బతుకుతారు అనేది ప్రశ్న.
చంద్కికి సమీపంలోనే ఉండే బర్హాటే సొంత గ్రామమైన రోహన్‌ఖేడ్‌లో భారీ నష్టం జరిగింది. "రెండు విషయాలు జరుగుతున్నాయి: ప్రజలు ఇంటి అవసరాల కోసం బంగారం లేదా ఇతర ఆస్తులను తాకట్టు పెడుతున్నారు, లేదా వడ్డీకి డబ్బు అప్పు తీసుకుంటున్నారు. యువకులు పని కోసం వెతుక్కుంటూ వలసవెళ్ళటం గురించి ఆలోచిస్తున్నారు." అని శ్రీకాంత్ అన్నారు.
సహజంగానే, సంవత్సరం ముగిసే సమయానికి రైతులు పంట రుణాలను తీర్చటంలో విఫలమైన లెక్కలేనన్ని సందర్భాలను బ్యాంకులు చూస్తాయని ఆయన చెప్పారు.
ఒక్క చంద్కి గ్రామంలోనే పత్తి పంట నష్టం దాదాపు రూ.20 కోట్లకు చేరువలో ఉంది. అంటే అనుకూల పరిస్థితులు ఉన్నట్లయితే, ఈ ఏడాది ఈ ఒక్క గ్రామం పత్తి నుండి ఇంత ఆదాయాన్ని పొందివుండేదని. ఈ ప్రాంతంలో ఎకరాకు పత్తి సగటు ఉత్పాదకత ఆధారంగా ఈ అంచనా వేయబడింది.
"మేం పంటలను పోగొట్టుకోవడమే కాదు, ఇప్పుడు విత్తనాలకు, ఇతర పొలం పనులకు ఖర్చుచేసిన డబ్బును కూడా తిరిగి పొందలేం" అని నామ్‌దేవ్ భోయర్ (47) అన్నారు.
"అదీగాక, ఇది ఒకనాటి నష్టం కాదు. భూమి కోతపడటం అనేది ఒకదీర్ఘకాలిక (పర్యావరణ) సమస్య." అని ఆయన హెచ్చరికగా అన్నారు.
మహారాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు జూలై నుండి ఆగస్టు వరకు కురుస్తున్న వర్షాలకు విలవిలలాడుతుండగా, మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి శివసేనలో తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో, రాష్ట్రంలో ఎటువంటి క్రియాశీలక ప్రభుత్వం ఉనికిలో లేదు.
సెప్టెంబరు ప్రారంభంలో, కొత్తగా ఏర్పడిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 3500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అయితే ఇది నష్టపోయిన పంటలకూ, జీవితాలకూ కలిగిన నిజమైన నష్టాన్ని పూడ్చలేనంత పాక్షిక సహాయం. అంతేకాక, సర్వేల ద్వారా లబ్ధిదారులను గుర్తించిన తర్వాత గానీ ప్రజలు తమ బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకోవడానికి లేదు. అందుకు కనీసం ఒక సంవత్సరం పట్టవచ్చు. అయితే, ప్రజలకు కావలసింది ఈ రోజు, ఇప్పటికిప్పుడు లభించే సహాయం.
*****
"మా పొలాన్ని చూశావా?" బలహీనంగానూ, నిరాశగానూ కనిపిస్తోన్న ధ్రుపద - మరణించిన చంపత్ భార్య - అడుగుతోంది. ఆమె చుట్టూ ముగ్గురు చిన్నపిల్లలున్నారు- పూనమ్ (8), పూజ (6), కృష్ణ (3). "అలాంటి భూమిలో నువ్వేం పండిస్తావ్?" తమ కుటుంబ అవసరాలను గడుపుకోవటం కోసం వ్యవసాయ కూలీలుగా చంపత్, ధ్రుపదలు ఒకరికి ఇద్దరై సంపాదించుకునేవారు.
గత సంవత్సరం ఈ జంట తమ పెద్ద కుమార్తె తాజులీకి వివాహం చేశారు. ఆమెకు 16 సంవత్సరాలు అంటారు కానీ, చూసేందుకు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నట్టు కనిపించడం లేదు. ఆమెకు మూడు నెలల వయసున్న పాప ఉంది. కూతురి పెళ్ళి సందర్భంగా చేసినన అప్పులు తీర్చేందుకు చంపత్, ధ్రుపద దంపతులు గతేడాది తమ పొలాన్ని తక్కువ కౌలుకు బంధువుకు అప్పగించి, చెరకు కోసే పనికోసం కొల్హాపుర్ వెళ్లారు.
జంగలే కుటుంబం కరెంటు కూడా లేని ఒక గుడిసెలో నివసిస్తున్నారు. ప్రస్తుతం, ఆ కుటుంబానికి తినడానికి ఏమీ లేదు. వారి పొరుగువారు - ఈ కుటుంబం లాగే పేదవారూ, వర్షం మూలంగా సర్వనాశనమయినవారూ అయినప్పటికీ, వీరికి సహాయం చేస్తున్నారు.
"మా పేదలను ఎలా మోసం చేయాలో ఈ దేశానికి బాగా తెలుసు" అని చంపత్ ఆత్మహత్యపై మొదటగా నివేదించిన స్థానిక జర్నలిస్టు-స్ట్రింగర్, రైతు కూడా అయిన మొయినుద్దీన్ సౌదాగర్ అన్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ధ్రుపదకు 2000 రూపాయల స్వల్ప సహాయాన్ని అందించడం గురించి ఆయన ఒక ఘాటైన కథనం రాస్తూ, అది ధ్రుపదకు జరిగిన ‘ఘనమైన’ అవమానంగా పేర్కొన్నారు.
మొయినుద్దీన్ ఇలా అంటారు, "మొదట మనం వారికి ఎవరూ సాగు చేయడానికి ఇష్టపడని నిస్సారమైన, రాళ్ళు నిండిన బంజరు భూమిని ఇస్తాం. ఆపైన వారికి సహాయం చేయడానికి నిరాకరిస్తాం." చంపత్ తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన భూమి రెండవ తరగతికి చెందిన భూమి. ఇది భూ సీలింగ్ చట్టం ప్రకారం భూ పంపిణీ కార్యక్రమంలో లభించిన భూమి అని ఆయన అన్నారు.
"దశాబ్దాలుగా, ఈ పురుషులు, మహిళలు తమ చెమటనూ రక్తాన్నీ ఈ భూమిని సారవంతమైనదిగా మార్చడానికీ, తమ కోసం ఏదైనా పండించుకోవడానికీ వెచ్చించారు," అని మొయినుద్దీన్ అన్నారు. నింగనుర్ గ్రామం ఈ ప్రాంతంలోని అత్యంత పేద గ్రామాలలో ఒకటి. ఇది ఎక్కువగా అంధ్, గోండు ఆదివాసీ కుటుంబాలు నివసించే గ్రామమని ఆయన చెప్పారు.
చాలామంది అంధ్ రైతులు చాలా పేదవారు. వారు ఈ సంవత్సరం చూసినటువంటి లాంటి వాతావరణ మార్పులను తట్టుకోలేరని మొయినుద్దీన్ చెప్పారు. అంధ్‌లు ఆకలితోపాటు కష్టాలకూ, దుర్భరమైన శ్రమకూ పర్యాయపదం అని ఆయన అన్నారు.
చంపత్‌కు మరణించే నాటికి అధికారికంగానూ, అనధికారికంగా కూడా అప్పులున్నాయి. దాదాపు రూ. 4 లక్షలు. చాలా ఒప్పించిన తర్వాతనే ధ్రుపద ఈ సంగతిని వెల్లడించారు. “పెళ్లి కోసం గతేడాది అప్పులు తీసుకున్నాం; ఈ సంవత్సరం పొలం కోసం, మా రోజువారీ అవసరాల కోసం మా బంధువుల నుండి అప్పు తీసుకున్నాం,” అని ఆమె చెప్పారు. "మేం మా రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నాం."
తన కుటుంబ భవిష్యత్తు అనిశ్చితంగా ఉండటం, వారి ఎద్దులలో ఒకటి ఇటీవల అనారోగ్యం బారిన పడటంతో ఆమె ఆందోళన చెందుతున్నారు. "అతని యజమాని లోకాన్ని విడిచిపెట్టి పోయినప్పటి నుండి నా ఎద్దు కూడా తినడం మానేసింది."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి